శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

పదాల అర్థం సందర్భాన్నే చెప్పనీ

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, January 29, 2014 0 comments

 
పిల్లలు సరదాగా ఓ కథో, పత్రికో చదువుకుంటున్నప్పుడు ఏదో తెలీని పదం వచ్చిందని అనుకోండి. వెంటనే చదవడం ఆపి ఆ మాట అర్థం కోసం వెదకరు. ఉత్సాహంగా ముందుకు సాగిపోతున్న కథని ఒక్కమాట కోసం ఆపడం వాళ్లకి ఇష్టం వుండదు. సందర్భాన్ని బట్టి మాట అర్థాన్ని ఊహించడానికి ప్రయత్నిస్తారు. “అప్పుడా రాజు తన తూణీరంలో నుండి ఓ బాణాన్ని బయటికి తీశాడు,” అన్న వాక్యంలో ‘తూణీరం’ అంటే కచ్చితంగా తెలీకపోయినా అదేదో బాణాలు పెట్టుకునే పెట్టె లంటిదో, సంచీ లాంటిదో అని సులభంగా ఊహించుకోవచ్చు. కొంచెం కష్టమైన పదమైతే నాలుగైదు సందర్భాల్లో పరిచయమైతే దాని మర్మం ఇట్టే తెలిసిపోతుంది.

బాగా చదివే వాళ్లు, మంచి శబ్ద జ్ఞానం గల వాళ్లు ఆ జ్ఞానాన్ని నిఘంటువులు బట్టీ వేసి సంపాదించరు. మామూలు పుస్తకాలు చదివి సంపాదిస్తారు. నా చిన్నప్పుడు బాగా చదివే రోజుల్లో కూడా ఎప్పుడూ నిఘంటువు ముట్టుకున్న పాపాన పోలేదు. అసలు నా వద్ద ఎప్పుడూ నిఘంటువు ఉండేది కాదు. నా జన్మలో పట్టున  50  పదాలు కూడా నిఘంటువులో చూసి వుండను.

ఈ నిఘంటువులు ఎలా రాస్తారో చాలా మందికి తెలీదు. ముందుగా నిఘంటువు ప్రచురించదలచుకున్న ప్రచురణ సంస్థ కొన్ని వందల మంది ‘సంపాదకుల’ని నియమిస్తుంది. వారికి తలా ఇన్ని పదాలిచ్చి సమకాలీన సాహిత్యంలో ఆ పదాలున్న వాక్యాలని సేకరించమంటుంది. ఒక్క పదానికి ఎన్ని వాక్యాలు వీలైతే అన్ని వాక్యాలు పట్టుకోవడం వీళ్ల పని. చలామణిలో వున్న దినపత్రికలు, వారపత్రికలు, నవళ్లు మొదలైన పుస్తకాలన్నీ గాలించి ఆ పదాలున్న వాక్యాలు వెతికి పట్టుకుంటారా సంపాదకులు. ఒక్కో పదాన్ని దాన్ని రాసిన రచయిత ఏ అర్థంలో ప్రయోగించాడో గమనించి, అలా నాలుగైదు సందర్భాలు పరిశీలించి, తద్వార మాటకి అర్థాన్ని నిర్వచిస్తారు. అంటే పదాల అర్థాన్ని గురించి మనుషుల అభిప్రాయాల సంకలనమే నిఘంటువు అన్నమాట.

నాకో కొత్త పదం ఎదురైనప్పుడు ఆ సందర్భంలో దాని అర్థాన్ని గ్రహించలేకపోయినంత మాత్రాన, నేను ఏమీ తెలుసుకోలేక పోయానని కాదు. ఆ సందర్భంలో ఆ పదం ఏదో లీలగా అర్థమవుతుంది. అదే పదం మరో సందర్భంలో ఎదురైనప్పుడు మరో విధంగా అర్థమవుతుంది. అలా ఓ పది పదిహేను సందర్భాల్లో ఆ పదం ఎదురైతే దాని స్వరూపమేమిటో స్పష్టంగా తెలిసిపోతుంది.

పిల్లలు (నిజానికి ఇది పెద్దలకి కూడా వర్తిస్తుంది) ఏదైనా చదువుతున్నప్పుడు ఆ చదివిందంతా పూర్తిగా అర్థం కావాలని నియమం ఏమీ లేదు. చదివింది నూటికి నూరు శాతం ఎవరికీ అర్థం కాదు. చదివిన దాంట్లో ఎంత అర్థమవుతుంది అనేది ఆ చదివేవాడి అనుభవం మీద ఆధారపడి వుంటుంది. పిల్లలకి వాళ్లు చదివేదేదో ఉత్సాహకరంగా ఉంటే చాలు. ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తే చాలు… మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సందర్భాన్ని బట్టి మాటల అర్థం గ్రహించడానికి పిల్లలు అలవాటు పడాలి. అసలు మంచి పాఠకుడి లక్షణం అదే. మాటల అర్థం పిల్లలకి చెబితే, నిఘంటువు చూసి నేర్చుకోమంటే ఆలోచించి మాటల అర్థాన్ని గ్రహించే అలవాటు కోల్పోతారు. మరి మనకి తెలియని దాన్ని ఆలోచించి, శోధించి తెలుసుకునే సామర్థ్యాన్నే మేధస్సు అంటారు!

(ఇంకా వుంది)

అచేతనలో పెల్లుబికే సృజన

Posted by శ్రీనివాస చక్రవర్తి Monday, January 27, 2014 0 commentsసచేతన విషయాలు అచేతనలోకి ప్రవేశించి మాయమైపోయినట్లే, అచేతన లోనుండి మునుపు ఎన్నడూ సచేతనం కాని కొత్త విషయాలు పైకొచ్చి సచేతన లోకి ప్రవేశించవచ్చు. కొన్ని సార్లు చిత్తం అంచున ఏదో సంగతి తారాడుతున్నట్టు అనిపిస్తుంది. మరి కాస్తలో ఏదొ విషయం స్ఫురిస్తుంది అన్న అనుభూతి కలుగుతుంది. ఇలాంటి అనుభవాల బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే అచేతన కేవలం గత స్మృతుల భాండాగారం మాత్రమే కాదు. నూతన ఆత్మగత పరిస్థితుల, భావనల బీజాలు అందులో సంపూర్ణంగా ఉంటాయి. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న నాడు నేను నా సొంత పంథాలో మనస్తత్వ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నిజంగానే ఎప్పుడో మర్చిపోయిన పాత జ్ఞాపకాలే కాక, పూర్తిగా కొత్తవి, సృజనాత్మకమైనవి అయిన భావాలు కూడా అచేతన లోంచి పెల్లుబుకగలవు. పంకిలంలో పుట్టి పైకి తేలిన పంకజంలా అవి ఆ చీకటి లోతుల్లో నుండి ఆవిర్భవిస్తాయి.

నిత్య జీవితంలో ఈ సత్యాన్ని ఎన్నో సార్లు గుర్తిస్తాము. ఏదో సంకటం ఎదురవుతుంది, ఏదో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అనుకోని రీతిలో వాటికి పరిష్కారాలు ఉత్పన్నమవుతాయి. ఎంతో మంది కళాకారులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తల జీవితాలలో ఎన్నో గొప్ప ఆలోచనలు, ప్రేరణలు అచేతన లోంచి పుట్టుకు రావడం మనం చూస్తాము. అచేతనలో దాగి వున్న భావబీజాలని, జ్ఞాన గనులని  ఆవిష్కరించి తత్వశాస్త్రంలో, సాహిత్యంలో, కళలో,  సంగీతంలో, విజ్ఞాన శాస్త్రంలో వాటిని అభివ్యక్తం చెయ్యగలిగే సామర్థ్యాన్నే మేధస్సు అంటాము.


ఇలాంటీ పరిణామానికి ఓ చక్కని నిదర్శనం మనకి విజ్ఞాన శాస్త్ర చరిత్రలో కనిపిస్తుంది. ఉదాహరణకి ఫ్రెంచ్ గణితవేత్త ప్వాంకరే మరియు రసాయనవేత్త కేకులే ల విషయంలో  ఎన్నో వైజ్ఞానిక ఆవిష్కరణలు హఠాత్తుగా “అంతఃప్రకాశనాల” రూపంలో వారి చిత్తంలో మెరిశాయని ఆ శాస్త్రవేత్తలే చెప్పుకున్నారు. ఫ్రెంచ్ తాత్వికుడు దే కార్త్ కి కూడా ఒక విధమైన “అధ్యాత్మిక” అనుభూతి కలిగిందని అంటారు. “సకల శాస్త్రాలని కలిపే క్రమం” మెరుపులా తన చిత్తంలో మెరిసిందట. బ్రిటిష్ రచయిత రాబర్ట్ లూయీ స్టీవెన్ సన్ ఎన్నో ఏళ్ళ పాటు మనిషిలోని ఈ “ద్వంద్వాత్మ యొక్క తత్వాన్ని ఎత్తి చూపే”  కథ కోసం గాలించగా, ఒక రాత్రి హఠాత్తుగా  కలలో డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్ కథ చిత్తంలో సాక్షాత్కరించిందట.

అలాంటి సమాచారం అచేతన లోంచి ఎలా ఆవిర్భవిస్తుందో, అది ఎలాంటి రూపాన్ని తీసుకుంటుందో అంతా తరువాత విపులంగా చర్చిస్తాను. అంతర్యం లోంచి కొత్త సమాచారం పుట్టగలదన్న విషయం మనకి కలలలో కనిపించే ప్రతీకలని పరిశీలిస్తున్నప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. కలలలో పైకి తేలే చిత్రాలు, భావాలు కేవలం జ్ఞాపకాలు కాలేవని నా వృత్తి అనుభవంలో నాకు ఎన్నో సార్లు అవతమయ్యింది. మన చేతన యొక్క ప్రాకారాలు ఎన్నడూ దాటని నిత్యనూతన భావాలెన్నో కలలలో తేటతెల్లమవుతాయి.

(ఇంకా వుంది)


విద్యుత్ కాంతులలో పాతాళ తోటల అందాలు

Posted by శ్రీనివాస చక్రవర్తి Saturday, January 25, 2014 5 commentsఅధ్యాయం  39

విద్యుత్ కాంతులలో  పాతాళ తోటల అందాలు

మరో అరగంట పాటు ఆ ఎముకల బాటలోనే నడుస్తూ పోయాం. ముందు ఏం వుందన్న ఉత్కంఠ మా అడుగులని నడిపిస్తోంది. ఈ గుహలో ఇంకా ఏం అద్భుతాలు ఉన్నాయో? ఏ వైజ్ఞానిక నిధులు దాగున్నాయో? ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్టుగా నా మనసు అప్రమత్తంగా వుంది.

ఆ ఎముకల గుట్టల వెనుక సముద్ర తీరం కనుమరుగయ్యింది. దారి తప్పిపోతామన్న భయం, భక్తి లేకుండా మా ప్రొఫెసరు మావయ్య దుడుకుగా ముందుకు దూసుకుపోవడమే కాకుండా, నన్ను కూడా వెనుకే బరబర లాక్కుపోతున్నాడు. అలా మౌనంగా ముందుకు సాగిపోతుంటే ఒక దశలో మాకు కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యాను. ఆ ప్రాంతం అంతా ఏదో చిత్రమైన విద్యుత్ కాంతి వ్యాపించి వుంది. అది ఏంటో ఎలా పుడుతోందో అర్థం కాలేదు గాని అది ప్రతీ వస్తువుని సమానంగా అన్ని పక్కల నుండి ప్రకాశితం చేస్తోంది. ఒక కేంద్ర బిందువు నుండి కాంతి జనిస్తున్నట్టు లేదు. గాలిలా అన్ని పక్కలా ఆవరించిన ఆ కాంతి వల్ల నీడలు పడడం లేదు. అది భూగర్భపు కుహరంలో ఉన్నట్టు లేదు. భూమధ్య రేఖ మీద మిట్టమధ్యాహ్నపు ఎండలో నించున్నట్టు వుంది. ఎక్కడా ఆవిర్లు కనిపించడం లేదు. చుట్టూ వున్న రాళ్లు, దూరానున్న కొండలు, చెట్ల గుబుళ్లు అన్నీ ఆ విచిత్ర విశ్వజనీన కాంతిలో మౌనంగా భాసిస్తున్నాయి. మేమంతా హొఫ్ మన్ నాటకంలో నీడలేని మనుషుల్లా వున్నాం.
(ETA  Hoffman  1814  లో రాసిన ఓ నాటకంలోని ఓ పాత్ర పేరు Peter Schlemihl. ఇతగాడు ధనాశ వల్ల తన నీడని సైతానుకి అమ్మేసుకుంటాడు. నీడ పడని ఆ వ్యక్తి సమాజంలో ఎదుర్కున్న ఇబ్బందుల వృత్తాంతమే నాటకం లోని కథ. – అనువాదకుడు.)

అలా ఓ మైలు దూరం నడిచాక ఓ విశాలమైన అడవి అంచుని చేరుకున్నాం. అయితే ఇది ఇందాక గ్రౌబెన్ రేవు వద్ద చూసిన శిలీంధ్రాల అడవి కాదు.

తృతీయ దశకి చెందిన వృక్ష సంపద ఇక్కడ పూర్ణ వైభవంతో మాకు దర్శనం ఇచ్చింది. పొడవాటి తాళ వృక్షాలు, చక్కని పాల్మసైట్ లు, ఫిర్, యూ, సైప్రెస్ చెట్లు, ఇవి కాక ప్రస్తుతం వినష్టమైపోయిన ఎన్నో వృక్ష జాతులు అక్కడ కనిపించాయి. ఈ చెట్ల మీద పొడవాటి అడవి తీగలు గజిబిజిగా అల్లుకుపోయాయి. “మెత్తని ముఖమల్ లాంటి పాకుడు మొక్కలు” అక్కడి నేలంతా అలముకుని వున్నాయి.
(“మెత్తని ముఖమల్ లాంటి పాకుడు మొక్కలు” అన్న చక్కని శబ్ద ప్రయోగం CP Brown English-తెలుగు నిఘంటువులో కనిపించింది! – అనువాదకుడు.)

చెట్ల కింద మౌనంగా ప్రవహించే సెలయేటి తళతళలకి కళ్లు జిగేలు మంటున్నాయి. ఆ సెలయేటి ఒడ్డున ఇంట్లో మనం అలంకారంగా పెంచుకునే ఫెర్న్ మొక్కల్లాంటి చక్కని ఫెర్న్ మొక్కలు అందంగా తీర్చిదిద్దినట్టు విస్తరించాయి. మరో అత్యద్భుతమైన విషయం ఏంటంటే ఈ చెట్లలో, తీగల్లో, పొదలలో ఎక్కడా రంగు అన్న అంశం కనిపించదు. మసి పూసిన వెండి రంగు, లేదా పాలిన ఆకులని పోలిన లేత గోధుమ రంగు – ఎటు చూసినా ఈ రంగుల మిశ్రమాలే కనిపిస్తున్నాయి. ఒక్క పచ్చని ఆకు కనిపిస్తే ఒట్టు! పువ్వులు కూడా వున్నాయి గాని అవేం పువ్వులు! వన్నె, వాసన లేని గోధుమ రంగు కాగితం పువ్వులు!

ఈ కారడవిలోకి ఇంకా ఇంకా లోతుగా చొచ్చుకుపోతున్నాడు మావయ్య. నేను వెనుకే మూగగా అనుసరిస్తున్నాను. అప్పుడో సందేహం కలిగింది. ఇంత వృక్షసంపద ఉన్న చోట మరి భీకరమైన జంతువులు కూడా ఉండాలి కదా? కొన్ని చోట్ల పెద్ద పెద్ద చెట్లు కింద పడి కుళ్లిన చోట్ల, కాయధాన్యపు మొక్కలు, ఏసరినే, రుబీషియే మొదలుకొని ఎన్నో తినదగ్గ పొదలు కనిపించాయి. ఇలాంటి మొక్కలు శాకాహారపు జంతువులకి ఎంతో ఇష్టం. భూమి  ఉపరితలం మీద సుదూర ప్రాంతాలలో పెరిగే చెట్లు ఇక్కడ పక్కపక్కనే పెరగడం ఆశ్చర్యం కలిగించింది. ఓక్ చెట్టు, తాటి చెట్టు ఇక్కడ ఇరుగు పొరుగు నేస్తాలు. అలాగే ఆస్ట్రేలియా కి చెందిన యూకలిప్టస్ ఇక్కడ నార్వేకి చెందిన పైన్ చెట్టు మీద ఒరిగిపోతోంది. ఉత్తరానికి చెందిన బిర్చ్ చెట్టు గుబుళ్ళు న్యూజీలాండ్ కి చెందిన కౌరీ చెట్ల గుబుళ్లతో దోబూచులాడుకుంటున్నాయి. వృక్షశాస్త్ర పండితులకి తలలు తిరిగేలా చెయ్యడం కోసమే తీర్చిదిద్దినట్టు వేడుకగా వుందా విపినం!

అంతలో నాకు కనిపించిన దృశ్యానికి స్థాణువై నిలుచుండిపోయాను. మావయ్యని కూడా జబ్బ పట్టి ఆపాను.

(ఇంకా వుంది)
నేను ఐదో క్లాసు టీచరుగా పని చేసే రోజుల్లో క్లాసులో పిల్లల మాటలు, చేష్టలు అన్నీ జాగ్రత్తగా పరిశీలించి వివరంగా రాసుకునేవాణ్ణి. అది పిల్లల కంటబడ్డా చదవలేనంత చిన్న దస్తూరీతో రాసుకునేవాణ్ణి. మెల్లగా నేను వాళ్ల గురించే రాస్తున్నానని అర్థమయ్యింది. “ఏం రాస్తున్నారు?” అని అడిగేవారు. క్రమంగా వాళ్ల పట్ల నా మనోభావం అర్థమై నా మీద విశ్వాసం ఏర్పడింది కాబోలు. నా రాతల్ని పట్టించుకోవడం మానేశారు. కాని నేను చేస్తున్నదేమిటో, వాళ్ల నుండి నేను ఏం తెలుసుకోగోరుతున్నానో స్పష్టంగా ముందే చెప్పేస్తే బావుంటుందని అనిపిస్తుంది. అలా చేస్తే వాళ్లు నా అధ్యయనాలలో ఇష్టపూర్వకంగా పాల్గొనేవారు అనిపిస్తుంది.

గ్లెండా బిసెక్స్ ప్రత్యేకించి రాయడం నేర్పించలేదు. కనీసం రాయమని ప్రోత్సహించనుకుడా లేదు. ఆమె రాస్తుంటే ఆమెలాగే రాయాలన్న తపనే ఆ పిల్లవాడికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అక్షరాలు వాటి ఉచ్ఛారణ మాత్రమే నేర్పించింది. ఆ అక్షరాలని తనకి తోచినట్టు కూర్చుకుని పదాలని నిర్మించుకుని ఆ పిల్లవాడే రాయడం మొదలెట్టాడు. మొదట్లో పదాల కూర్పులో ఎన్నో తప్పులు దొర్లేవి. అచ్చక్షరాలని వదిలేసేవాడు. అలవాటు మీద మెల్లగా తనే తప్పులు దిద్దుకుంటూ వచ్చాడు.

గ్లెండా బిసెక్స్ కొడుకు పాల్ ఇంతకీ రాయడం ఎందుకు నేర్చుకున్నాడు? ఎవరి సహాయం లేకున్నా రాత నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? వాళ్లమ్మని మెప్పించాలనా? క్లాసు పుస్తకాలు ముందే చదివేసి తోటి  విద్యార్థులని, టీచర్లని మెప్పించాలనా? ఇవేవీ కారణాలు కావు. అసలు కారణం ఏమిటో గ్లెండా బిసెక్స్ స్పష్టంగా చెప్తుంది. తన మనసులో మాటని వ్యక్తం చేసుకోడానికి రాయడం నేర్చుకున్నాడు. రాత అనే మాధ్యమంతో తోటి వారితో మాట్లాడడానికి నేర్చుకున్నాడు.

పాల్ చదువు ఎలా నేర్చుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నంలో గ్లెండా ఆ పిల్లవాణ్ణి ఎన్నో ప్రశ్నలు అడిగేది. పరీక్షల్లాంటివి ఎన్నో పెట్టేది. పరీక్షలు అంటే మామూలుగా స్కూళ్లలో పెట్టే పరీక్షల్లాంటివి కావు. స్కూళ్లలో పెట్టే పరీక్షలు పిల్లలకి ఎంత తెలుసో, ముఖ్యంగా ఎంత తెలీదో తెలుసుకోడానికి పెట్టేవి. కాని ఈ పరీక్షల ఉద్దేశం అది కాదు. కొడుకు ఏదో నేర్చుకుంటున్నాడు అని తెలుసు. అయితే ఏం నేర్చుకుంటున్నాడు? ఎలా నేర్చుకుంటున్నాడు? ఏ పద్ధతిలో నేర్చుకుంటున్నాడు? చదువు అనేది ఓ ప్రయాణం లాంటిది అనుకుంటే ఆ ప్రయాణంలో మజిలీలు ఏంటి? చదువు అనే ప్రక్రియలో మధ్యంతర దశలేంటి? ఇదీ ఆవిడ తెలుసుకోగోరేది. దీన్ని తెలిపేందుకే పరీక్షలు.

“పాల్ తనకై తానే లక్ష్యాలు నిర్మించుకుని వాటి కోసం కృషి చేసేవాడు. ఒక స్థాయిలో లక్ష్యాలు నెరవేరగానే పై స్థాయి లక్ష్యాలు తనే రూపొందించుకుని కృషి కొనసాగించేవాడు. ఇలా ఇంకా ఇంకా కష్టమైన లక్ష్యాల కోసం శ్రమించేవాడు. ఆ విధంగా అంతకంతకు జటిలమైన లక్ష్యాల కోసం శ్రమిస్తూ ఎంతో మంది పిల్లల లాగానే సహజంగా పురోగమిస్తూ వచ్చాడు.”

ఎదిగే పిల్లలు సరిగ్గా ఇలాగే ఎదుగుతారు. కాని అదంతా స్కూల్లో చేరిందాకానే. ఒకసారి స్కూల్లో చేరాక లక్ష్యాలని వాళ్లంతకు వాళ్లు నియమించుకోవడం అంటూ ఉండదు. స్కూలే వారి లక్ష్యాలని నిర్దేశిస్తుంది. ఏం నేర్చుకోవాలో, ఎలా నేర్చుకోవాలో, ఎంత లోపల నేర్చుకోవాలో – అన్నీ స్కూలే శాసిస్తుంది. స్కూలు నిర్దేశించే లక్ష్యాలు పిల్లలని బెదరగొడతాయి. ఫలానా పద్ధతి ఒప్పజెప్పకపోతే తిట్లే, ఫలానా పాఠం రాసుకు రాకపోతే తన్నులే – ఇదీ స్కూలు పద్ధతి. దాంతో స్వచ్ఛందంగా లక్ష్యాలు ఎంచుకునే అలవాటు, వాటి కోసం పాటుపడే అలవాటు చచ్చిపోతుంది. అందుకే కాబోలు చాలా మంది పిల్లలు స్కూల్లో చేరకముందే చదవడం, రాయడం నేర్చుకుంటారు.

“మీ పిల్లలకి ఇది నేర్పించండి,” “మీ పిల్లలకి అది నేర్పించండి” అని రాసే పుస్తకాలని నేను ఒప్పుకోను. అలాంటి పుస్తకాలు పిల్లల్లో తమంతకు తాము తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని, తమంతకు తాము తెలుసుకోగలమన్న నమ్మకాన్ని అణగదొక్కుతాయి. మరొకరు చెబితే తప్ప తెలుసుకోలేమన్న అభిప్రాయాన్ని కలుగజేస్తాయి.

“కెనెత్ గుడ్మన్, చార్లెస్ రీడ్, పియాజే… (వంటి  విద్యావేత్తలు నిరూపించినట్టు), పిల్లలు చేసే పొరబాట్లు కేవలం యాదృచ్ఛికమైనవి కావు. (తెలిసో తెలీకో) వాళ్లు అనుసరిస్తున్న విజ్ఞాన వ్యవస్థలకి అవి ప్రతిబింబాలు. విద్యార్థులు చేసే పొరబాట్లు వట్టి తప్పులు అని కొట్టిపారేయకుండా, అందులో చదువుకి అవసరమైన ఎంతో సమాచారం ఉందని గుర్తించగలిగితే, విద్యార్థులు కూడా అలాంటి నిర్మాణాత్మక దృక్పథాన్ని అలవరచుకుంటారు.”

Mind storms  అనే పుస్తకంలో సీమోర్ పాపర్ట్  ఈ విషయాన్నే బాగా స్పష్టపరిచాడు. కంప్యూటర్ వాడడం నేర్చుకుంటున్నప్పుడు ఎవరికైనా మొదట్లో  ఓ ప్రత్యేక ఇబ్బంది ఎదురవుతుంది. కంప్యూటర్ అవుట్ పుట్ ఒకలా ఉంటుందని ఆశిస్తే, వాస్తవంలో మరొకలా ఉంటుంది. విషయం తెలీక కంప్యూటర్ ని ఆడిపోసుకుంటారు. తప్పు కంప్యూటర్ లో లేదు. ప్రోగ్రాం లో వుంది. దాన్నే ‘బగ్’ అంటారు. దాన్ని సరిదిద్దితే అంతా సర్దుకుంటుంది. అలాగే పిల్లలు చేసే పొరబాట్ల వెనుక కూడా ఒక హేతువు ఉండొచ్చు. ఒక తప్పుడు నమ్మకమో, ఓ తప్పుడు భావమో ఉండొచ్చు. ఒక సందర్భంలో నేర్చుకున్న సత్యాన్ని, మరో సందర్భంలో తప్పుగా వర్తింపజేస్తూ ఉండచ్చు. లేకపోతే వాళ్లు నేర్చుకునే సమాచారంలోని అవకతవకలకి తికమకపడుతూ ఉండొచ్చు. ఆ తికమకని స్పష్టం చేస్తే, ఆ సందేహాన్ని తీరిస్తే, ‘ముద్దార నేర్పిస్తే,’ చదువు చెప్పే ప్రయత్నంలో పిల్లలతో పెద్దలు అనవసరంగా కుస్తీ పట్టనక్కర్లేదని నా అభిప్రాయం.

(ఇంకా వుంది)
చర్మంలోని మర్మం

Posted by శ్రీనివాస చక్రవర్తి Monday, January 20, 2014 3 comments


 
అబ్బ! ఈ చర్మం గురించి కూడా ఓ అధ్యాయం అవసరమా? అనుకుంటున్నారు కదూ?  గోనె సంచీలో కొబ్బరికాయలు మోసుకుపోయినట్టు, మీ దేహాంగాలని మోసే సంచీ చర్మం. పైగా దీనికి బోలెడు సేవలు చెయ్యాలి – సబ్బేసి రుద్దాలి, బ్లేడెట్టి గీయాలి, పామాలి, పిసకాలి, మర్దనా చెయ్యాలి…  వట్టి బట్ట అని ఇట్టే కొట్టిపారేయకండేం!  నాలో చాలా ఇసయం వుంది.
ముందే చెప్తున్నా. గోనె గుడ్డ, గోచీ గుడ్డ అని మరీ తీసిపారేయకండి.  మీకు విన్నారో లేదో. నేను రసాయనాలని ఉత్పత్తి చేస్తా! ఉదాహరణకి అతి ముఖ్యమైన విటమిన్ – విటమిన్ D – ఎవరు చేస్తారని అనుకున్నారు? (ఇచ్చట కాలరు ఎగురవేయబడినది.) రక్తపీడనాన్ని నియంత్రించడంలో మరి నా హస్తం ఎంతైనా వుంది. శరీరంలో ఎంత నీరు నిలువ ఉండాలో, ఎంత మేరకు చెమట ద్వార బయటీకి పోవాలో నిర్ణయించేది నేనే. అసలు మిమ్మల్ని ప్రపంచాన్ని వేరు చేసే గోడని – పోనీ తలుపుని, ఇంకా పోనీ కిటికీని – నేనే. వేడిమి, చలి, చక్కలిగిలి,  స్పర్శ, దురద ఇలాంటి అనుభూతులన్నీ నావల్లనే కలుగుతాయి. నా వల్లనే అంటే… మరీ నావల్ల కాదనుకోండి, నా వెనుక పని చేసే నాడీ మండలం వల్ల. ఒక రకంగా చూస్తే నేను వట్టి గోడని కానండోయ్. నేనో కోట బురుజుని. నానా రకాల శత్రు జీవాలు మీ లోపలికి ప్రవేశించి పాగా వెయ్యకుండా నేనో కాపు కాస్తానన్నమాట.

చర్మం అంటే చుట్టూ ఇలా మెత్తగా, నునుపుగా ఉండే పొర మాత్రమే అనుకుంటున్నారేమో. మీ గోళ్లు, జుట్టు,  మీ పాదాలలో గట్టిగా గిట్టలా ఉండే పొర – ఇవన్నీ నా రూపాంతరాలే. నాలో మూడు పొరలు ఉంటాయి – పై పొరేమోనొచ్చి ఎపీడెర్మిస్ (epidermis), మధ్య పొర డెర్మిస్ (dermis), ఇక అడుగున వున్నది సబ్ క్యుటేనియస్ పొర (subcutaneous tissue).

మీ శరీరం మీద ఎన్నో చోట్ల పైపొర అతి సన్నగా కాగితంలా ఉంటుంది. ఈ సారెప్పుడైనా మీ వేలు కాలినప్పుడు కావాలంటే మీరే చూసుకోండి. (అంటే కేవలం పరిశోధనా స్ఫూర్తి కోసం వేళ్లు కాల్చుకోమనడం లేదు సుమండీ!) బొబ్బ లెక్కాయని బొబ్బలెట్టడం ఆపి ఓ సారి వేలి కేసి చూసుకుంటే తెలుస్తుంది – బొబ్బ పైన ఉన్న వున్న సన్నని పొరే ఎపీడెర్మిస్సని! మీ మడమలో ఉండే దళసరి చర్మపు పొరని ఓ బ్లేడు పెట్టి సన్నగా గొరిగేసినా కూడా రక్తస్రావం జరగదు. ఎందుకంటే ఆ పొరలో రక్త ప్రసారం ఉండదు. గుర్రానికి నాడా వెయ్యడానికి మేకులేసి కోట్టినా రక్తం కారనిది మరి ఇందుకే. ఇక్కడ ఉండే కణాలకి కావలాసిన పోషణ రక్తం నుండి రాదు. పోషక పదార్థాలు లోపలి నుండి నేరుగా పైకి తన్నుకొస్తూ వ్యాప్తి (diffusion) అనే ప్రక్రియ ద్వారా ఈ దళసరి పొరని చేరుతాయి.

పాము తన పై చర్మాన్ని – దాన్నే పొలుసు అంటారు – హటాత్తుగా విదిలించి వొదిలించుకుంటుంది. మీరు కూడా మీ చర్మంతో ఇంచుమించు అలాంటిదే చేస్తుంటారు. అయితే  పాములాగా అంత నాటకీయంగా, దుడుకుగా కాకాపోయినా నెమ్మదిగా, క్రమంగా, అంచెలంచెలుగా చేస్తుంటారు. అనుదినం కొన్ని కోట్ల ఎపిడెర్మల్ కణాలు ఆ పొర యొక్క లోపలి భాగాల్లో పుట్టి, నెమ్మదిగా పైకి తన్నుకొస్తుంటాయి. ఈ పసి కణాలు మొదట్లో మెత్తమెత్తగా, ముద్దముద్దగా జెల్లీలాగా వున్నా, వయసు పైబడుతున్న కొద్ది గట్టిపడతాయి. అలాంటి గట్టి పొరనే కెరటిన్ (keratin) అంటారు. ఈ కెరటిన్ పొరలో ఉండే కణాలన్నీ చప్టాగా, చదునుగా, పెంకుల్లాగా, పర్రలాగా ఉంటాయి. వీటిలో ఇక ప్రాణం ఉండదు. (కరకైన బాహ్యప్రపంచపు తాకిళ్ళకి పాపం జీవ కణాలు ఎలా తట్టుకుంటాయేం?) ధోనీ సిక్సర్ కొట్టాడు కదాని సంబరం పట్టలేక చప్పట్లు కొట్టేసినప్పుడు, బౌండరీ దగ్గర కాచ్ ఇస్తే దుఃఖం ఆపుకోలేక గుండెలు బాదేసుకున్నప్పుడు, ఈ సారి ఎలాగైనా సెంచురీ కొడతాడని నేస్తాలతో సవాలు చేసి తొడలు చరిచేసుకున్నప్పుడు – మీ ఎపీడెర్మిస్ లోని కోటానుకోట్ల కణాలు జలజలా రాలిపోతుంటాయని మర్చిపోకండి. మైండిట్!

(పోతే పోయ్యాయి వెధవ కణాలు!  27  రోజులు తిరిగేలోపు మళ్లీ దాపురిస్తాయిగా? అని అడ్డుగా వాదిస్తే ఇక నేను చేసేదేం లేదు.)

(ఇంకా వుంది)postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email