శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

Contact – ఓ మరపురాని సైన్స్ ఫిక్షన్ సినిమా కథ

Posted by శ్రీనివాస చక్రవర్తి Thursday, May 29, 2014 0 comments

నాకు బాగా నచ్చిన, ఒక దశలో బాగా ప్రభావితం చేసిన సైన్స్ ఫిక్షన్ సినిమాలలో ‘కాంటాక్ట్’ ఒకటి.
రచయిత, శాస్త్రవేత్త కార్ల్ సాగన్ రాసిన ‘కాంటాక్ట్’ నవల ఆధారంగా తీసిన సినిమా ఇది.

ప్రఖ్యాత ‘కాస్మాస్’ అనే టీవీ సీరియల్ కి కర్తగా  కార్ల్ సాగన్  పేరు చాలా మంది వినే వుంటారు. ‘Broca’s brain,’ ‘Dragons of the Eden’ మొదలైన గొప్ప పాపులర్ సైన్స్ పుస్తకాల రచయితగా కూడా చాలా మందికి సాగన్ పరిచయస్థుడే.

సైన్స్ భావాలని సమాజానికి అందజేసి, ప్రజలలో శాస్త్రీయ దృక్పథం పెంచే దిశగా చేసిన కృషి వల్ల సాగన్ పేరు నలుగురికీ తెలిసిన మాట నిజమే అయినా, కేవలం సైన్స్ ప్రచారకుడిగా మాత్రమే కాక కార్ల్ సాగన్ ఒక శాస్త్రవేత్తగా కూడా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సంపాదించాడు.

ఒక దశలో కార్నెల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేసిన సాగన్, Search for Extraterrestrial intelligence (SETI)  అనే ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం వహించాడు. భూమి మీద కాకుండా విశ్వంలో ఇతర ప్రదేశాలలో ప్రజ్ఞగల జీవులు ఉంటారన్న నమ్మకం మీద ఆధారపడ్డ ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అలాంటి జీవుల ఉన్కిని కనిపెట్టడమే. విశ్వంలో విపరీతమైన దూరాల మీదుగా జీవులు ఒకరికొకరు సందేశాలు పంపుకోడానికి రేడియో సంకేతాలు అనువైన మాధ్యమాలు అని నమ్మినవారిలో సాగన్ ఒకడు. ఆ నమ్మకం ఆధారంగా విశ్వంలో పలు మూలాల నుండి వచ్చే రేడియా సంకేతాలని పట్టుకుని, అందులో ప్రజ్ఞని వెల్లడి చేసే అంశాలు ఏవైనా వున్నాయో లేదో తెలుసుకునే ఉద్దేశంతో విశ్లేషించే  ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. అయితే అలాంటి ప్రయత్నాల వల్ల కచ్చితమైన, ఫలితాలేవీ రాలేదు.

కాని అలాంటి ప్రయత్నమే ఫలిస్తే ఎలా వుంటుంది? అన్న అవకాశానికి మూర్తి రూపాన్నిస్తూ రాసిన నవల, తీసిన సినిమా కాంటాక్ట్.

కథానాయిక ప్రధాన పాత్రగా గల ఈ సినిమాలో ముఖ్య పాత్ర పేరు డాక్టర్ ఎలియనోర్ ఆరోవే (Dr. Eleanor Arroway). (క్లుప్తంగా ఎల్లీ అంటారు). మేటి హాలీవుడ్ తార జోడీ ఫోస్టర్ మరెవరూ ఈ పాత్ర పోషించలేరేమో నన్నంత గొప్పగా ఈ పాత్ర పోషించిందని నాకు అనిపించింది.

ఎల్లీ కి చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. తండ్రి మళ్లీ పెళ్ళి చేసుకోకుండా కూతురే సర్వస్వం అన్నట్టుగా కూతుర్ని పెంచుతాడు. ముఖ్యంగా చిన్నప్పట్నుంచి కూతురిలో శాస్త్రీయ దృక్పథాన్ని జాగ్రత్తగా పోషిస్తాడు. చిన్నప్పుడు సరదాగా HAM Radio club  లో చేరుతుంది ఎల్లీ. అలా రేడియో సంకేతల్తో తనకి తొలి పరిచయం ఏర్పడుతుంది. అలాగే దూరదర్శినిలో ఖగోళాన్ని పరిశిలించే అలవాటు కూడా తండ్రి నుండే అబ్బుతుంది.

“చీకటి ఆకాశంలో ఇంపుగా మెరుస్తుంటుందని ఆ గ్రహానికి సౌందర్య దేవత వీనస్ పేరు పెట్టారు. కాని ఆ గ్రహం సల్ఫురిక్ ఆసిడ్ వర్షాలతో, నిప్పులు చెరిగే ఉష్ణోగ్రతతో పరమ భయంకరంగా ఉంటుందని విన్న మరుక్షణం నేను ఖగోళ శాస్త్రం అంటే ప్రేమలో పడిపోయాను,” అని  పెద్దయ్యాక ఒక సన్నివేశంలో తనకి అప్పుడే పరిచయం అయిన పామర్ జాస్ తో చెప్తుంది ఎల్లీ.

తన చిన్నతనంలో జరిగిన ఓ సన్నివేశం, తన వ్యక్తిత్వంలో లోతుగా నాటుకున్న శాస్త్రీయ దృక్పథానికి అద్దం పడుతుంది. ఒక రోజు గుండెపోటుతో తన తండ్రి ఉన్నట్లుండి చనిపోతాడు. అర్చకుడు వచ్చి చివరి కర్మలన్నీ చేస్తాడు. తల్లి దండ్రులు లేకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఆ  పాపని చూసిన ఏమనాలో తెలీక ఓదార్పుగా   ఇలా అంటాడు – “భగవంతుడి లీలలు అన్నీ మనకి అర్థం కావు. కాని వాటిలో ఏదో మంచి వుందని అనుకుని ఊరుకోవాలంతే.”

అది విన్న ఆ పాపకి మండిపోతుంది. నిష్టూరంగా ఓ సారి అర్చకుడి కేసి చూసి, “నాన్నగారి (గుండెకి సంబంధించిన) మందులు కొన్ని కింద అంతస్థులో కూడా కొన్ని ఉండుంటే సకాలంలో వాటిని అందుకోగలిగి ఉండేదాన్ని,” అంటుంది... ఇంత మాత్రం దానికి దేవుడు, దెయ్యం అంటూ కంటికి కనిపించని విషయాల ప్రస్తావన అనవసరం అన్న ధోరణిలో!

పై చదువులు పూర్తి చేసిన ఎల్లీ  రేడియా ఖగోళ శాస్త్రవేత్త అవుతుంది. విశ్వం నుండి వచ్చే రేడియో సంకేతాలని విశ్లేషించడం ఈమె పని. కాల్టెక్ విశ్వవిద్యాలయం నుండి పీ.హెచ్.డి. పొందిన ఈమె పోర్టో రికోలోని ‘అరెసిబో  రేడియో దూరదర్శిని (Arecibo Radio Telescope) ని వాడుకుంటూ, SETI  ప్రాజెక్ట్ లో భాగంగా విశ్వసంకేతాల అధ్యయనం మొదలుపెడుతుంది.

ఎల్లీ అక్కడ పని చేసే రోజుల్లో ప్రొఫెసర్ డేవిడ్ డ్రమ్లిన్ ఆ పరిశోధనశాలని సందర్శిస్తాడు. ఇతగాడు అమెరికా అధ్యక్షుడికి ‘వైజ్ఞానిక సలహాదారు’గా ఉంటాడు. (ఇటీవల భారత రత్న అందుకున్న మన సి.ఎన్. ఆర్. రావు గారి తరహా అన్నమాట). ఈ డ్రమ్లిన్ కి SETI వంటి కార్యక్రమాల మీద పెద్దగా నమ్మకం లేదు. కనుక SETI  ప్రాజెక్ట్ కి మంజూరు అయిన సొమ్ముని రద్దు చేస్తాడు. “ఎందుకిలా చేశార?” అని ఆ పెద్దమనిషిని నిలదీస్తే, “చూడు ఎల్లీ! ఇలాంటి పనికిమాలిని ప్రాజెక్ట్ లు చెయ్యడం ఓ శాస్త్రవేత్తగా నీ భవిష్యత్తుకి మంచిది కాదు. నీ మంచికే చెప్తున్నాను,” అని ఏదో సర్ది చెప్పబోతాడు. “నా బతుకు, నా ఇష్టం. మధ్యన మీ కేంటి?” అని శివంగిలా విరుచుకుపడుతుంది. కాని నియంత లా పని చేసే డ్రమ్లిన్ తన నిర్ణయం మార్చుకోడు.

 మనసుకి నచ్చిన బాటలో జంకు గొంకు లేకుండా ముందుకి దూసుకుపోవడం తప్ప మరొకటి తెలీని ఎల్లీ, తన పరిశోధనకి కావలసిన ధన సహాయం కోసం ప్రైవేట్ సంస్థలని ఆశ్రయిస్తుంది.

(ఇంకా వుంది)విద్యుత్ ప్రేరణలకి మెదడు  ఎలా స్పందిస్తుంది అన్న విషయంలో విల్డర్ పెన్ ఫీల్డ్ చేసిన అధ్యయనాలలో ఓ ముఖ్యమైన సత్యం బయటపడింది. మెదడులో క్రియల విస్తరణ ఎలా ఉంటుందో తెలిపే అతి ముఖ్యమైన సత్యమది. మెదడులో ప్రత్యేక ప్రాంతాలు ప్రత్యేక శారీరక క్రియలని నిర్వర్తిస్తున్నాయని పెన్ ఫీల్డ్ గుర్తించాడు. 


ఉదాహరణకి ‘కదలిక’ అనే క్రియనే తీసుకుంటే శరీరంలో కుడి భాగాన్ని మెదడులో ఎడమ భాగం శాసిస్తుంది. అంతే కాక చేతి వేళ్లని ఒక ప్రాంతం శాసిస్తే, మోచేతిని మరో ప్రాంతం, అలాగే పాదాన్ని మరో ప్రాంతం ఇలా వివిధ ప్రాంతాలు శరీరంలో వివిధ భాగాలని కదిలిస్తాయి. శరీరంలో కదలిక పుట్టించే మెదడు భాగాలన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఒక కంప్యూటర్ కీబోర్డ్ మీద ఒక్కొక్క కీని నొక్కితే తదనుగుణమైన అక్షరం కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించినట్టు, మోటార్ కార్టెక్స్ లో ఒక్కొక్క ప్రాంతాన్ని విద్యుత్తుతో ప్రేరణ ఇస్తే, తదనుగుణమైన కదలిక శరీరంలో కనిపిస్తుంది. ఆ ప్రాంతాన్నే మోటార్ కార్టెక్స్ అంటారు. అంటే మొత్తం శరీరానికి ఒక ‘మ్యాపు’ లాంటిది ఈ మోటార్ కార్టెక్స్ లో ఇమిడి వుందన్నమాట. 


ఈ మ్యాపు యొక్క ఉజ్జాయింపు చిత్రాన్ని కింద చూడవచ్చు. వాస్తవంలో మోటార్ మ్యాపులు మరింత సంక్లిష్టంగా వుంటాయి. ఈ మ్యాపులో కొంత వైరూప్యంగా ఉన్నా, ఒక విధమైన మానవాకారం కనిపిస్తోంది. మెదడులో వుంటూ శరీరాన్ని అదిలిస్తున్న ఈ మానవాకార మ్యాపుకి homunculus  అని పేరు పెట్టారు.  Homunculus  అంటే బుల్లి మానవుడు అని అర్థం. అయితే శరీరం లోని వివిధ భాగాలకి, వాటిని అదిలించే ఈ మ్యాపు లోని తత్సంబంధమైన ప్రాంతాలకి మధ్య సమ నిష్పత్తి లేదని గుర్తించాలి. ఉదాహరణకి మెదడులో చేతిని, పెదాలని కదిలించే ప్రాంతాలు కాస్త విశాలంగా ఉంటాయి. కాని భుజాన్ని కదిలించే ప్రాంతం కాస్త చిన్నగా ఉంటుంది. ఈ తేడాల దృష్ట్యా, అరిటాకులంత అరచేతులతో, సన్నని చిన్న భుజాలతో,  శరీరాన్ని కదిలించే ఈ బుల్లిమానవుణ్ణి ఈ కింద కనిపించే చిత్రంలోని చిత్రమైన బొమ్మలతో వ్యక్తం చెయ్యడం పరిపాటి.


అలాగే మెదడు పక్క భాగాల్లో, టెంపొరల్ లోబ్ కి చెందిన కొన్ని ప్రాంతాలని ప్రేరేపించినప్పుడు ఆ వ్యక్తికి ఎప్పుడో విన్న శబ్దాలు, పాటలు వినిపించాయట. అయితే కొన్ని ప్రత్యేక బిందువుల వద్ద ప్రేరేపించినప్పుడు మాత్రమే శబ్దాలు వినిపించాయి. పెన్ ఫీల్డ్ మరియు అతడి సహచరుల బృందం ఆ బిందువులని అంకెలతో సూచించారు. ప్రత్యేక అంకెలు గల బిందువుల వద్ద ప్రేరేపించినప్పుడు ప్రత్యేక శబ్దాలు వినిపించాయి. సుమారు మూడు దశకాల కాలంలో, వెయ్యికి పైగా  ఇలాంటి శస్త్రచికిత్సలు చేసిన పెన్ ఫీల్డ్ బృందం, వాటిలో కొన్ని ఆసక్తికరమైన కేసులని విపులంగా గ్రంథస్థం చేసింది. 


ఉదాహరణకి బిందువు #23  ని ప్రేరేపించినప్పుడు ఒక వ్యక్తికి white Christmas  అనే పాట వినిపించింది. మరో పేషెంట్ కి ఎప్పుడు సీజర్ వచ్చినా ‘hush-a-bye, my baby’ అనే చర్చి పాట వినిపించేది. అదే వ్యక్తికి టెంపొరల్ లోబ్ లో ప్రేరేపిస్తే సంగీతం వినిపించింది. మెదడుని ప్రేరేపించినప్పుడు కొంత మంది ఏదో సంగీతం వినిపిస్తోంది అంటారు గాని, అదేంటో స్పష్టంగా చెప్పలేకపోతారు. ఉదాహరణకి అలాంటి ‘మెదడు సంగీతం’ విన్న ఒక స్త్రీ -  “అదేదో చిత్రంగా వుంది. జోలపాట కాబోలు… అప్పుడప్పుడు రేడియోలో వస్తుంటుంది… ఏదో పిల్లల ప్రోగ్రాంలో ఈ పాట వస్తుంది అనుకుంటా” అంది.  మరో పేషెంట్ విషయంలో ఆమె తల్లి, తండ్రి కలిసి ఏదో మాట్లాడుకుంటున్నట్టు, మాటల మధ్యలో ఏవో క్రిస్మస్ కారొల్స్ పాడుకుంటున్నట్టు అనిపించింది. మెదడు పొరల్లో గత స్మృతులు ఎలా దాగి వుంటాయో తెలిపే అద్భుత ప్రప్రథమ ప్రయోగాలివి.

ఆ విధంగా విల్డర్ పెన్ ఫీల్డ్ అధ్యయనాల వల్ల మెదడులో సమాచారం మ్యాపుల రూపంలో ఎలా ఏర్పాటై వుందో తెలిసింది. ఆ మ్యాపులలో ప్రత్యేక భాగాలు, శరీరంలో ప్రత్యేక భాగాలని శాసించినడం వల్ల పెన్ ఫీల్డ్ అధ్యయనాలు ప్రాంతీయతా వాదాన్నే సమర్ధిస్తున్నట్టు అనిపించింది.

తదనంతరం, మెదడులో భాష ఎలా ఉత్పన్నం అవుతుందో తెలిపుతూ ఫ్రెంచ్ నాడీ వైద్యుడు పాల్ బ్రోకా చేసిన అధ్యయనాలు కూడా ఈ ప్రాంతీయతా వాదాన్నే సమర్థిస్తున్నట్టు అనిపించింది.

(ఇంకా వుంది)
కూడికలు: బట్టీ పద్ధతి vs. అనుభవైక పద్ధతి

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, May 25, 2014 1 comments


నిజానికి ఇదంతా అనవసరం.
'2+3=5; 3+2=5; 5-2=2; 5-3=2,'  - ఇవన్నీ ఒక దాంతో ఒకటి సంబంధం లేని వేరు వేరు నిజాలు కావు. వాటన్నిటి వెనుకా వున్నది ఒకే నిజం. దాన్ని కూడా మంత్రంలా అర్థం తెలీకుండా జపించనక్కర్లేదు. వాటన్నిటికీ ఆధారంగా వున్నది ఒక ప్రకృతి ధర్మం. ఆ ధర్మాన్ని పిల్లలు వాళ్లంతకు వాళ్లే తెలుసుకోగలరు. చిన్న చిన్న దైనిక చర్యల్లో ఆ సత్యాన్ని పదే పదే పరీక్షించి నిర్ధారణ చేసుకోగలరు.
ఆ సత్యం ఇది.

***** < -- > *** **

ఎడమ పక్క కనిపించే చుక్కల్లాంటి ఓ వస్తు సముదాయం ఉన్నప్పుడు దాన్ని కుడి పక్క కనిపించే రెండు చుక్కల బృందాల్లా వేరు చేయవచ్చు. అలాగే కుడి పక్కన వున్న బృందాలని కలిపి ఎడమ పక్క వున్న బృందాన్ని కూర్చవచ్చు.

ఇది కేవలం గణితశాస్త్ర ధర్మం కాదు. ఇది ప్రకృతి ధర్మం. ఇది మనుషులు పుట్టి అంకగణితాన్ని కనిపెట్టాక పుట్టుకొచ్చిన సత్యం కాదు. మనిషి పుట్టక ముందు నుంచీ వున్న సత్యం. విశ్వంలో సర్వత్ర వర్తించే సత్యం. ప్రకృతిలో దీన్ని గుర్తించి ధృవీకరించడానికి అంకగణితం నేర్చుకోనక్కర్లేదు. గోళీలతో ఆడుకునే పిల్లవాడు, ఎముక ముక్కల్తో ఆడుకునే కుక్కపిల్ల తెలీకుండానే ‘కూడికలు’, ‘తీసివేతలు’ చేస్తారు. వారి అనుభవంలో ముందే భాగమైన దానికి శాస్త్రం కొన్ని పేర్లు పెడుతుంది, కొంత పరిభాషతో వ్యక్తం చేస్తుంది. మనుషులు ప్రకృతిలో ధర్మాలెన్నో గుర్తించి, వాటిని సమీకరించి, ఓ శాస్త్రానికి రూపకల్పన చేస్తారు.

ఓ చిన్ని కూడికల యంత్రం
కూడికలు తీసివేతలు నేర్చుకోడానికి పిల్లలకి కాల్కులేటరు ఇవ్వనక్కర్లేదు. ఓ చిన్న కూడికల యంత్రాన్ని మనం సులభంగా చేసుకోవచ్చు. సన్నగా, పొడవుగా దీర్ఘచతుర్భుజి ఆకారంలో వున్న రెండు తెల్లని అట్టలని తీసుకోండి. దాని మీద ఈ కింద చూపించినట్టు గుర్తులు గీసి, అంకెలు వేయండి.


ఇప్పుడు ఇలాంటి ‘స్కేళ్ల’ని తీసుకుని వాటితో కూడికలు చెయ్యొచ్చు. ఉదాహరణకి 4 + 3  కావాలనుకోండి. ఈ కింది బొమ్మలో చూపించినట్టు మొదటి స్కేల్లో నాలుగు అంకె పక్కన రెండవ స్కేలు యొక్క ఎడమ కొసని ఉంచాలి. ఇప్పుడు రెండవ స్కేల్లో 3  అంకె పక్కన మొదటి స్కేల్లో ఏ అంకె వస్తుందో చూడాలి. ఈ చిన్న పరికరంతో పిల్లలు చిన్న చిన్న కూడికలు చేసుకుని క్లాసులో టీచర్లు చెప్పింది సబబో కాదో వారికి వారే నిర్ధారించుకోగలరు.బట్టీ పద్ధతిలో తెలీని ఎన్నో విషయాలు ఈ సరళ గణన యంత్రం సహాయంతో తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఒక స్కేలు లో 4  వద్ద రెండవ స్కేలు యొక్క మూలాన్ని ఉంచాం. ఇప్పుడు స్కేళ్లని సూటిగా చూసి ఈ కింది విషయాలన్నీ చెప్పేయొచ్చు –
4+1 = 5
4+2 = 6
4+3 = 7
4+4 = 8

మొదలైనవి. నాలుగుకి కలిపే అంకెని ఒక్కటొక్కటిగా పెంచుతూ వస్తే మొత్తం కూడా ఒక్కటొక్కటిగా పెరుగుతూ వస్తుంది. మనకిది తెలుసు కాబట్టి చాలా సామాన్యమైన విషయంలా అనిపిస్తుంది కానీ “కూడికల గురించిన నిజాలు” బట్టీ పట్టిన చాలా మంది పిల్లలకి ఇది ఇంత సామాన్యంగా గుర్తించదు. 6+6 = 12  అవుతుందని చెప్పగలిగిన ఎంతో మంది పిల్లలు 6 + 7 ఏమవుతుందో చెప్పడానికి ఇబ్బంది పడతారు. చాలా మంది తప్పు చేస్తారు. ఇది స్వయంగా ఎన్నో సార్లు చూశాను.

కూడుతున్న రెండు అంకెల్లో ఒక అంకెకు ఒకటి కలిపితే, ఆ రెండు అంకెల మొత్తానికి కూడా ఒకటి కలిపినట్టవుతుంది అని కనుక్కున్నప్పుడు పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది. అంకె 1 కి  బదులు 2  కూడినా  అదే సూత్రం వర్తిస్తుంది. దీన్నే బీజగణితంలో ఈ సూత్రంతో వ్యక్తం చేస్తాం –
X + (Y + A) = (X+Y) + A

కాని ఈ సూత్రం గురించి చిన్న పిల్లలకి చెప్పడం అంత మంచిది కాదు. అయితే ఒకటి. ఈ సూత్రం అర్థాన్ని ఎనిమిదేళ్ళ పాటు శాస్త్రీయంగా లెక్కలు చేసిన తొమ్మిదో తరగతి పిల్లల కన్నా ఆరేళ్ల పిల్లలు తేలికగా గ్రహిస్తారని అనుకుంటాను.

(ఇంకా వుంది)ఆటవికుడు - ఆధునికుడు

Posted by శ్రీనివాస చక్రవర్తి Friday, May 23, 2014 1 comments

ఆఫ్రికా అడువుల్లో జీవించే ఓ అటవికుణ్ణే ఉదాహరణగా తీసుకుందాం. ఇతగాడు ఓ నిశాచర ప్రాణిని పగటి పూట తిరగడం చూస్తాడు. ఆ సందర్భంలో తను చూస్తున్నది ఓ జంతువు అనుకోడు. ఓ ఆటవిక వైద్యుడే ఆ రూపంలో వచ్చాడని తలపోస్తాడు. లేదా అదొక వృక్షాత్మ అనుకుంటాడు. లేదా తమ జాతికి చెందిన ఎవడో పూర్వీకుడు ఆ రూపంలో వచ్చాడని అనుకుంటాడు. ఆటవికుడి జీవితంలో చెట్టుకి ఎంతో ముఖ్యమైన పాత్ర వుంటుంది. దానినే తన ఆత్మగా భావిస్తాడు. దాని ద్వార తన వాక్కు వ్యక్తం అవుతుందని అనుకుంటాడు. ఆ చెట్టుతో తన జీవితం ముడిపడి వుందని నమ్ముతాడు. దక్షిణ అమెరికాకి చెందిన కొందరు ఇండియన్లు తాము ఎర్ర అరారా (Red Arara) చిలుకలమని నమ్ముతారు. అయితే వాళ్లకి రెక్కలు, ఈకలు, కూసు ముక్కులు లేవని వాళ్లకి తెలియకపోలేదు. బుద్ధి జన్యమైన ఆధునిక ప్రపంచంలో లాగా ఆ ఆటవికుల ప్రపంచంలో ఇది “నేను” అది “నేను కానిది” అనే కచ్చితమైన సరిహద్దులు ఉండవు మరి.

మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పే ఆత్మగతమైన తాదాత్మ్యం లేదా, చైత్యపరమైన భాగస్వామ్యం అనే మాటలకి మన ఆధునిక జీవితంలో అర్థం లేకుండా పోయింది. కాని ఈ రకమైన అచేతన అనుబంధాల సందోహమే ఆటవికుడి ప్రపంచానికి ఓ కొత్త వన్నె తెస్తుంది. ఆ లక్షణాన్ని మనం ఎంతగా కోల్పోయామంటే అది మనకి ఎక్కడైనా తారసపడ్డా దానిని గుర్తుపట్టలేము. మనలో ఎప్పుడూ అవి ఉపరితలానికి అడుగునే మసలుతూ వుంటాయి. ఎప్పుడైనా అవి ఆ సరిహద్దు దాటుకుని పైకి తేలితే ఏదో పొరపాటు జరిగిందని అనుకుంటాం, అవీ నిజమేనని, వాటికీ ఓ అర్థం, అస్తిత్వం ఉందని ఒప్పుకోం.

బాగా చదువుకున్న వాళ్లు, తెలివైన వాళ్లు ఎంతో మంది నన్ను సంప్రదిస్తూ వుంటారు. వారికి కలిగే ఏవో విచిత్రమైన కలలు, ఊహలు, ఆంతరిక దర్శనాలు వాళ్లని కలవరపెడుతున్నాయని చెప్తుంటారు. మనస్థితిమతం గల వారికి అలాంటి కలలు, ఆలోచనలు రావని, అలాంటి దృశ్యాలు చూసే వారికి తప్పకుండా మతి తప్పి ఉండాలని వాళ్లు బెంబేలు పడుతూ వుంటారు. ఇజికీల్ (Ezekiel)  కి కనిపించిన దృశ్యాలు కేవలం ఏదో మానసిక ఋగ్మతకి ఫలితాలని అన్నాడు అలాగే ఓ సారి నన్ను సందర్శించిన ఓ మతపండితుడు. అలాగే మోసెస్ మొదలైన ప్రవక్తలకి వినిపించిన  “వాణి” కేవలం ఓ విభ్రాంతి అంటాడు. అలాంటప్పుడు అలాంటి అనుభూతి తనకి “అప్రయత్నం”గా కలిగితే అదిరిపోడూ మరి! మనం నిర్మించుకున్ని ఈ తార్కిక, సహైతుక ప్రపంచానికి మనం ఎంతగా అలవాటు పడిపోయామంటే మన సామాన్య లౌకిక అవగాహనకి అందని దంతా అసంభవం అని కొట్టిపారేస్తాం. ఇలాంటి విపరీతమైన, విచిత్రమైన అనుభూతి కలిగిన ఆటవికుడు తన మనస్థిమితాన్ని సందేహించడు. ఆత్మలు, దేవతలు మొదలైన అంశాలతో ఆ వైపరీత్యాన్ని వివరించుకోడానికి ప్రయత్నిస్తాడు.

మన భావావేశాలు కూడా ఈ కోవకి చెందినవే. మన సువిస్తారమైన ఆధునిక నాగరికతలో వేళ్లూని వున్న విపత్తుల ముందు ఆటవికులు భయపడే ‘దెయ్యాలు,’ ‘భూతాలు’ మొదలైనవి ఏ మూలకీ రావు. ఆధునిక నాగరికుడి మనోభావాన్ని తలచుకుంటే ఓ సారి నన్ను సంప్రదించడానికి వచ్చిన ఓ psychotic  రోగి జ్ఞాపకం వస్తాడు. ఆ రోగి స్వయంగా ఓ డాక్టరు కూడా. ఓ సారి ఉదాయానే నన్ను చూడడానికి వచ్చిన అతగాణ్ణి ‘ఎలా వున్నారు?’ అని పలకరించాను. అతగాడు తన కొచ్చిన ఓ చిత్రమైన కల గురించి ఏకరువు పెట్టుకొచ్చాడు. ఆ కలలో అతడు మెర్క్యురిక్ క్లోరైడ్ అనే క్రిమి నాశనిని స్వర్గం అంతా చల్లి దాంతో స్వర్గాన్ని క్రిమిరహితంగా మార్చేస్తున్నాడట! అలా ఎంతో సేపు స్వర్గాన్ని పరిశుద్ధం చేశాక చూసుకుంటే స్వర్గంలో దేవుడు కనిపించకుండా పోయాడట! ఇది న్యూరోసిస్ యొక్క లక్షణం లాగా కనిపిస్తోంది. ఈ సందర్భంలో “దైవభీతి” కి బదులుగా ఏదో anxiety neurosis  కనిపిస్తోంది. భావావేశం ఒకటే. దాని లక్ష్యం మారిందంతే.(బ్రిటన్ కి చెందిన శిల్పి జేకబ్ ఎప్స్టయిన్ రూపొందించిన ఓ శిల్పం. ఆటవికుడు దెయ్యాలని, భూతాలని ఊహించుకుంటే ఆధునికుడు ఈ మరభూతాలని ఊహించుకుంటున్నాడు.)
(ఇంకా వుంది)

పాతాళ సొరంగం... ఆదిలోనే అవరోధం...

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, May 20, 2014 0 comments

“అవును ఏక్సెల్. నువ్వు చెప్పింది నిజం. అంతా మన మంచికే. మన అదృష్టం బాగుండి నేలకి సమాంతరంగా సాగే ఆ సముద్రాన్ని వొదిలిపెట్టాం. దాని కారణంగా మన గమ్యంతో సంబంధం లేకుండా ఇంతకాలం ఎటో ప్రయాణిస్తూ వచ్చాం. కాని ఇప్పట్నించి కిందకి, ఇంకా ఇంకా కిందకి, చొచ్చుకుపోతాం. నీకు తెలుసా? భూమి కేంద్రం నుండి ఇప్పుడు మనం కేవలం 1500  కోసుల దూరంలో వున్నాం.”

“అంతేనా?” అరిచాన్నేను. “అదసలు ఒక విషయమే కాదు.  పద అయితే బయల్దేరుదాం.”
మా మతిమాలిన మాటలు ఇలా సాగుతుండగా ఇంతలో వేటగాడు ఎదురు పడ్డాడు. ప్రయాణానికి సన్నాహాలు పూర్తయ్యాయి. మా సామగ్రి అంతా పడవ మీదకి ఎత్తించాం. తెర చాప ఎగిరింది. కేప్ సాక్నుస్సేం దిశగా పడవని నడిపాడు హన్స్.

లోతు లేని నీటి మీద ప్రయాణిస్తున్నప్పుడు గాలి ఎంత బలంగా వీస్తోంది అన్న విషయానికి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. కొన్ని ప్రదేశాల్లో ఇనుపు మొనలు అమర్చిన కట్టెలతో పడవని ముందుకు తోయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల నీట్లో మునిగిన రాళ్లని తప్పించుకుంటూ ముందుకి సాగాల్సి వచ్చింది. అలా ఓ మూడు గంటలు ప్రయాణించాక, మేం చేరుకోగోరిన  ప్రదేశాన్ని చేరుకున్నాం. నేను తీరం మీదకి దూకాను. మామయ్య, వేటగాడు కూడా వెంటే దిగారు. మా ముందున్న ప్రయాణాన్ని తలచుకుంటుంటే నా మనసంతా ఉద్వేగంతో నిండిపోతోంది. మా బుల్లి పడవకి తిలోదకాలు వొదిలే సమయం వచ్చింది. తెప్పని కాల్చేస్తే ఎలా ఉంటుందని మామయ్యని అడిగాను. కాని అందుకు మామయ్య ఒప్పుకోలేదు. తిరుగు ప్రయాణం ఎలా వుంటుందో తెలియదుగా మరి!
“పోనీ కాస్త తొందరగా కదులు.” నా తహతహని కప్పిపుచ్చుకోవడం కష్టంగా వుంది. “ఒక్క క్షణం కూడా వృధా చెయ్యడానికి లేదు.”

“సరే, సరే. కాని ముందు ఈ సొరంగం తీరు తెన్నులు ఒకసారి చూసుకోవాలి. మనకి నిచ్చెనలు అవసరం అవుతాయో లేదో చూసుకోవాలి.”

పడవని తీరం మీదే వొదిలేసి సొరంగం వైపు నడిచాం. మావయ్య రుమ్కోర్ఫ్ పరికరానికి (*) పని పెట్టాడు. గుహ ముఖం మా నుండి ఇరవై గజాల దూరంలో వుంది.
(*ఇది ఒక రకమైన ‘portable lamp.’)

గుహ ద్వారం ఇంచుమించు గుండ్రంగా వుంది. వ్యాసం ఐదు అడుగులు ఉండొచ్చు. కొండ లోతుల్లో సంభవించిన ఏదో విస్ఫోటం వల్ల ఈ సొరంగం ఏర్పడినట్టుంది. ఆ విస్ఫోటపు పదార్థం గుహ గోడల మీద పూతలా ఏర్పడింది. సొరంగం లోపలికి తీసుకుపోయే బాటలో పెద్దగా వాలు లేదు. కనుక సులభంగా లోపలికి ప్రవేశించాం. కాని నాలుగు అడుగులు వేశామో లేదో మా బాటకి ఓ పెద్ద బండ అడ్డుపడింది.
“దరిద్రపు బండ!” ఒళ్లుమండిపోయి తిట్టుకున్నాను.
దాని చుట్టు పక్కల ఎక్కడైనా దాన్ని దాటి పోడానికి ఏవైనా సందు వుందేమోనని చూశాను. కాని ఫలితం లేకపోయింది. దాటే మార్గం కనిపించలేదు.
నిస్పృహతో కింద చతికిలబడ్డాను. మావయ్య నిస్సహాయంగా ఎప్పట్లాగే గుహలో ముందుకి వెనక్కి నడిచేస్తున్నాడు.
“ఈ బండ మనకే దాపురించిందా? ఏం ఆ సాక్నుస్సేమ్ కి అడ్డుపడలేదా?” ఉక్రోషాన్ని అణుచుకుంటూ మావయ్యని అడిగాను.
“అవున్నిజమే. అతగాడికీ ఈ బండ అడ్డుపడి ఉండాలిగా?”

“లేదు”  ఆలోచనగా అన్నాను. సాక్నుస్సేం దారికి ఈ బండ అడ్డుపడలేదు. ఈ ప్రాంతాన్ని తరచు అతలాకుతలం చేసే ఏ అయస్కాంత తుఫాను ప్రభావం వల్లనో ఇది ఊడిపడి గుహ ద్వారాన్ని మూసేసింది. కావాలంటే చూడు. గుహ  లోపలి కంకర గోడలలో ఏర్పడ్డ చీలికలు, పగుళ్ళు కాస్త అర్వాచీన కాలానికి చెందినట్టు కనిపిస్తున్నాయి. ఎప్పుడో జరిగిన విస్ఫోటం వల్ల ఈ గుహ పైభాగంలోని రాళ్ళు విరిగి ఈ పెద్ద బండ కింద పడింది. సాక్నుస్సేమ్ కి తారసపడని ఈ అవరోధాన్ని తొలగించలేకపోతే ఇక మన యాత్ర ఇక్కడితో సమాప్తం అయినట్టే.”

(ఇంకా వుంది)


postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email