శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

రసాయన శాస్త్ర చరిత్రలో విద్యుత్ పర్వం

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, July 29, 2014 0 comments

ఉదాహరణకి ఒక భాగం హైడ్రోజెన్ ఎనిమిది భాగాల ఆక్సిజన్ తో కలిసినప్పుడు నీరు ఏర్పడుతుంది. ఒక నీటి అణువులో ఒక హైడ్రోజెన్ పరమాణువు, ఒక ఆక్సిజ్న పరమాణువు ఉంటాయని అనుకుంటే హైడ్రోజెన్ పరమాణువు కన్నా ఆక్సిజన్ పరమాణువు బరువు ఎనిమిది రెట్లు ఎక్కువ అని అర్థమవుతుంది. కనుక హైడ్రోజెన్ పరమాణువు బరువులు విలువ 1  అని ప్రమాణాత్మకంగా తీసుకున్నారు. హైడ్రోజెన్ పరమాణువు యొక్క బరువు 1  అయితే, ఆక్సిజన్ పరమాణువు బరువు 8 కావాలి. 

అలాగే 1 భాగం హైడ్రోజెన్ 5  భాగాల నైట్రోజెన్ తో కలిసి అమ్మోనియా ఏర్పడుతుంది. ఈ సందర్భంలో కూడా ఒక అమ్మోనియా అణువులో ఒక హైడ్రోజెన్ పరమాణువు, ఒక నైట్రోజెన్ పరమాణువు ఉన్నాయని అనుకుంటే నైట్రోజెన్ పరమాణువు యొక్క బరువు  5  అని అనుకోవాలి. 

ఈ పద్ధతిలో వాదిస్తూ డాల్టన్ మొట్టమొదటి పరమాణు భారాల పట్టికని ప్రకటించాడు. ఆ పట్టిక డాల్టన్ సాధించిన వైజ్ఞానిక విజయాలలో కెల్లా అత్యంత ముఖ్యమైనదే అయినా అందులో ఎన్నో దోషాలు ఉన్నాయని తరువాత తేలింది.
ఆ దోషాలకి ఒక మూల కారణం వుంది. రెండు పరమాణు జాతులు కలిసి ఒక అణువు ఏర్పడినప్పుడు సామాన్యంగా  ఒక్కొక్క జాతి నుండి ఒక్కొక్క పరమాణువు కలిసి ఆ అణువు ఏర్పడింది అని భావించడమే డాల్టన్ చేసిన తప్పు.  ఇక తప్పనిసరి అయితే తప్ప ఈ నమ్మకాన్ని వొలిదిపెట్టేవాడు కాడు.
తదనంతరం జరిగిన అధ్యయనాలలో ఒక్కొక్క పరమాణువు మాత్రమే కలిసి అణువులు ఏర్పడాలన్న నియమేమీ లేదని తేటతెల్లం అయ్యింది. నిజానికి నీరు విషయంలో ఆ నియమం ఉల్లంఘింపబడుతుంది అన్న విషయం డాల్టన్ తన పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించటానికి ముందే తెలిసింది.
ఈ సందర్భంలోనే విద్యుత్ రంగానికి, రసాయనిక రంగానికి మధ్య మొట్టమొదటి సారిగా సంబంధం ఏర్పడుతుంది.

ప్రాచీన గ్రీకుల కాలం నుండి కూడా విద్యుచ్ఛక్తిని గురించిన పరిజ్ఞానం వుంది. ఆంబర్ ని (amber) రుద్దినప్పుడు అది వస్తువులని ఆకర్షించే లక్షణాన్ని సంతరించుకుంటుందని వారికి తెలుసు.

ఎన్నో శతాబ్దాల తరువాత బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త విలియమ్ గిల్బర్ట్ (1540-1603) ఈ రంగంలో మరింత ముందుకు వెళ్లాడు. రుద్దితే ఆకర్షణ శక్తి పుట్టటం అనేది కేవలం ఆంబర్ కి మాత్రమే పరిమితం కాదని, మరెన్నో పద్దార్థాలు ఆ లక్షణాన్ని ప్రదర్శిస్తాయని అతడు గమనించాడు. 1600 ప్రాంతాల్లో అతడు ఈ రకమైన పదార్థాలన్నిటికి ఉమ్మడిగా ‘ఎలక్‍ట్రిక్స్’ అని పేరు పెట్టాడు. (ఆంబర్ కి గ్రీకు పదం ‘ఎలక్‍ట్రిక్’)
ఆ విధంగా రుద్దటం చేత గాని, మరే ఇతర ప్రక్రియ చేత గాని ఆకర్షణ శక్తిని సంతరించుకునే పదార్థాలలో ‘విద్యుదావేశం’  (electric charge) లేదా విద్యుత్తు (electricity) ఉంటుందన్న భావన పుట్టుకొచ్చింది.

 ఇలా వుండగా ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త చార్ల్ ఫ్రాన్సువా ద సిస్టర్నే దు ఫే (1698-1739) మరో ముఖ్యమైన సత్యాన్ని కనుక్కున్నాడు. 1733  లో ఇతగాడు రెండు రకాల విద్యుదావేశాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. మొదటి రకం విద్యుదావేశాన్ని గాజులో పుట్టించవచ్చు. దీనికి vitreous electricity అని పేరు పెట్టారు. రెండవ రకం విద్యుదావేశాన్ని ఆంబర్ లో పుట్టించవచ్చు. దీన్ని resinous electricity అన్నారు. ఒక రకం విద్యుదావేశం గల వస్తువు రెండవ రకం విద్యుదావేశం గల వస్తువుని ఆకర్షిస్తుంది. కాని ఒకే రకం విద్యుదావేశం గలవస్తువులు పరస్పరం వికర్షించుకుంటాయి.

మరి రెండు రకాల విద్యుదావేశాలు ఎందుకు ఉన్నాయి, వాటి మధ్య సంబంధం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తింది. అందుకు సమాధానంగా ఓ ముఖ్యమైన సూచన చేసినవాడు అమెరికన్ శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాన్క్‍లిన్ (1706-1790). బెంజమిన్ ఫ్రాన్క్‍లిన్ శాస్త్రవేత్త కావడమే కాక గొప్ప రాజకీయ నేత, దూత కూడా. ఇతడు ఒక దశలో అమెరికా అధ్యక్షుడు అవుతాడు. 1740  ప్రాంతాలలో విద్యుచ్ఛక్తికి సంబంధించి ఇతగాడు ఓ ఆసక్తికరమైన సూచన చేశాడు. ఒక విధమైన విద్యుత్ ద్రవం ఉంటుందని ఇతడు సూచించాడు. ఏదైనా పదార్థంలో మామూలుగా కన్నా ఎక్కువ మోతాదులో ఆ విద్యుత్ ద్రవం ఉన్నప్పుడు అందులో ఒక రకమైన విద్యుదావేశం ఉంటుంది. మామూలుగా కన్నా తక్కువ మోతాదులో విద్యుత్ ద్రవం ఉన్నప్పుడు అందులో రెండవ రకం విద్యుదావేశం ఉంటుంది. 
 (మెరుపులో ఉండేది విద్యుత్ శక్తేనని నిరూపించడానికి బెంజమిన్ ఫ్రాంక్లిన్ చేస్తున్న ప్రయోగం)

గాజులో మామూలుగా కన్నా  ఎక్కువ మోతాదులో విద్యుత్ ద్రవం ఉంటుందని ఫ్రాన్క్‍లిన్ భావించాడు. అందుచేత గాజులో ఉన్న దాన్ని ధనాత్మక విద్యుదావేశం (positive charge) అన్నాడు. అందుకు వ్యతిరేకంగా రెసిన్ (resin) లో వున్నది ఋణాత్మక విద్యుదావేశం (negative charge) అన్నాడు. ఫ్రాన్క్‍లిన్ పరిచయం చేసిన పరిభాష ఇప్పటికీ వుంది. ఆ కారణం చేతనే మనం విద్యుత్ ప్రవాహపు దిశని వాస్తవ దిశకి వ్యతిరేకంగా నిర్వచించడం జరిగింది.

(ఇంకా వుంది)

డాల్టన్ సిద్ధాంతం

Posted by శ్రీనివాస చక్రవర్తి Saturday, July 26, 2014 0 commentsఆ నిష్పత్తులని మార్చాలంటే y  యొక్క ఒక పరమాణువు x  యొక్క ఒక పరమాణువు కన్నా కాస్త పెద్ద అంశంతోనో, కాస్త చిన్న అంశంతోనో కలవాలి. కాని డెమాక్రిటస్ కాలం నాటి నుండి కూడా పరమాణువుని విభజించడానికి, హెచ్చించడానికి గాని వీలు కాదన్న నమ్మకం చలామణిలో వుంది. కనుక ఒక మూలకం యొక్క పరమాణువు యొక్క పరిమాణాన్ని పెంచడానికి గాని, తగ్గించడానికి గాని వీలు కాదు.
అందుచేత పదార్థం అంతా పరమాణు మయం అని అనుకుంటే ‘నియత నిష్పత్తుల నియమం’ దాని సహజ పర్యవసానం అవుతుంది. అంతేకాక, నియత నిష్పత్తుల నియమం అనేది ఒక వాస్తవం కనుక, దాని కారణంగా పరమాణు సిద్ధాంతం కూడా నిజమని నమ్మాల్సి వస్తుంది.
డాల్టన్ సిద్ధాంతం

జాన్ డాల్టన్ (1766-1844) అనే బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త ఆ కోణం నుండి ఆలోచిస్తూ వచ్చాడు. అతడి ఆలోచనలకి అతను చేసిన కొన్ని అధ్యయనాలు మద్దతు నిచ్చాయి. కొన్ని సందర్భాల్లో రెండు మూలకాలు పలు నిష్పత్తుల వద్ద కలవగలవని అతడు గుర్తించాడు. అంతేకాక ఒక్కొక్క నిష్పత్తి వద్ద ఒక ప్రత్యేక సమ్మేళనం పుడుతోందని గుర్తించాడు.

అందుకు ఉదాహరణగా కార్బన్, ఆక్సిజన్ లు కలిసిన సమ్మేళనాలు తీసుకుందాం. (భారాన్ని బట్టి) మూడు భాగాల కార్బన్ ఎనిమిది భాగాల ఆక్సిజన్ తో కలిసినప్పుడు కార్బన్ డయాక్సయిడ్ పుడుతుంది. కాని మూడు భాగాల కార్బన్ నాలుగు భాగాల ఆక్సిజన్ తో కలిసినప్పుడు కార్బన్ మోనాక్సయిడ్ పుడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక కచ్చితమైన కార్బన్ రాశితో కలిసే ఆక్సిజన్ మొత్తాన్ని పరిగణిస్తే, ఆ రెండు మొత్తాల భారం యొక్క నిష్పత్తిని సరళమైన పూర్ణ సంఖ్యల రూపంలో వ్యక్తం చెయ్యొచ్చని గుర్తించాడు డాల్టన్. కార్బన్ డయాక్సయిడ్ లో ఉండే ఎనిమిది భాగాల ఆక్సిజన్, కార్బన్ మోనాక్సయిడ్ లో ఉండే నాలుగు భాగాల ఆక్సిజన్ కి సరిగ్గా రెండు రెట్లు వుంది.
దీన్నే బహుళ నిష్పత్తుల నియమం (law of multiple proportions) అంటారు. ఎన్నో రసాయన చర్యలలో ఈ నియమం పని చేస్తుందని గుర్తించిన డాల్టన్ 1803  లో దీనికొన నియమంగా ప్రకటించాడు.
ఈ బహుళ నిష్పత్తుల నియమం కూడా కచ్చితంగా పరమాణు సిద్ధాంతంతో సరిపోతోంది. ఉదాహరణకి ఆక్సిజన్ పరమాణువులు కార్బన్ పరమాణువుల కన్నా 4/3 రెట్లు బరువు ఉన్నాయనుకుందాం. ఒక కార్బన్ పరమాణువు ఒక ఆక్సిజన్ పరమాణువుతో కలిసి ఒక కార్బన్ మోనాక్సయిడ్ ఏర్పడినప్పుడు ఆ సమ్మేళనంలో భారాన్ని బట్టి మూడు భాగాల కార్బన్ నాలుగు భాగాల ఆక్సిజన్ ఉండి తీరాలి.

అలాగే మరి ఒక కార్బ పరమాణువు రెండు ఆక్సిజన్ పరమాణువులతో కలిసి కార్బన్ డయాక్సయిడ్ ఏర్పడినప్పుడు అందులో మూడు భాగాల కార్బన్, ఎనిమిది భాగాల ఆక్సిజన్ ఉండాలి.

ఆ విధంగా సరళమైన నిష్పత్తులలో మూలకాలు కలుస్తాయని గుర్తించినప్పుడు, సంపూర్ణ పరమాణువుల కలయిక చేత అణువులు ఏర్పడుతాయని అర్థం చేసుకోవచ్చు. మరి పదార్థంలో సర్వత్ర వున్నది పరమాణువులే నని అనుకుంటే పదార్తానికి పదార్థానికి మధ్య తేడా అందులోని పరమాణువుల కూర్పులోనే వస్తోందని సులభంగా గ్రహించవచ్చు. అందుచేత బహుళ నిష్పత్తుల నియమం ఎలా వచ్చిందో తెలుస్తుంది.
నియత నిష్పత్తుల నియమాన్ని, బహుళ నిష్పత్తుల నియమాన్ని ఆధారంగా చేసుకుంటూ 1803 లో డాల్టన్ తన సొంత పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు, అందులో డెమాక్రిటస్ సిద్ధాంతాలని ప్రస్తావించాడు. పదార్థంలో అతి సూక్ష్మమైన, అవిభాజ్యమైన అంశాలకి డెమాక్రిటస్ వాడిన ‘atom’ అన్న పదాన్నే అతడు కూడా వాడాడు.
1808 లో అతడు ‘నూతన రసాయన తత్వం’ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. అందులో తన పరమాణు సిద్ధాంతాన్ని విపులంగా చర్చించాడు. అదే సంవత్సరం అతడి బహుళ నిష్పత్తుల సిద్ధాంతాన్ని మరో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త స్వతంత్రంగా పరీక్షించి నిర్ధారించాడు. ఆ రసాయన శాస్త్రవేత్త పేరు విలియమ్ హైడ్ వొలాస్టన్ (1766-1828). రసాయనిక సమాజాలలో మంచి పరపతి గల ఈ వొలాస్టన్ డాల్టన్ సిద్ధాంతానికి వత్తాలు పలికాడు. ఆ కారణం చేత డాల్టన్ సిద్ధాంతాలని త్వరలోనే రసాయనిక శాస్త్ర సమాజం సమ్మతించింది.
కాని పరమాణు సిద్దాంతాన్ని సమ్మతిస్తే ఒక విధంగా పరుసవేదులు నమ్మినట్టుగా నిమ్న జాతి పదార్థాలని ఉత్తమ జాతి పదార్థాలుగా రూపాంతరీకరించ వచ్చన్న భావనకి సమాధి కట్టినట్టే అయ్యింది. ప్రత్యేక లోహాలలో ప్రత్యేక జాతి పరమాణువులు ఉంటాయన్న భావనకి ఆధారాలు పెరుగుతూ వచ్చాయి. పరమాణువులు అవిభాజ్యాలు కనుక, మార్పుకి లొంగనివి కనుక ఎట్టి పరిస్థితుల్లోని సీసపు పరమాణువుని బంగారపు పరమాణువుగా మార్చే ప్రసక్తి రాదని అర్థమయ్యింది. అందుచేత సీసాన్ని బంగారంగా మార్చడం అసంభవం.
డాల్టన్ ప్రతిపాదించిన పరమాణువులు మరీ చిన్నవి గనుక వాటిని సూక్ష్మదర్శినిలో చూడడానికి వీలుపడదు. కనుక ప్రత్యక్షంగా చూసి వాటి ఉన్కిని నిర్ధారించడం అసంభం. కాని పరోక్షంగా చేసిన కొలతల సహాయంతో వాటి ఉన్కిని గుర్తించడమే కాక వాటి సాపేక్ష భారాలని కూడా తెలుసుకోడానికి వీలయ్యింది.
(ఇంకా వుంది)

రసాయన శాస్త్ర చరిత్ర... కొనసాగింపు

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, July 20, 2014 0 commentsఅసిమోవ్ రాసిన ‘రసాయన శాస్త్ర చరిత్ర’ కి అనువాదం ఇంతకు ముందు ఈ బ్లాగ్ లో సీరియల్ గా వేస్తూ మధ్యలో ఆపేయడం జరిగింది. దాని కొనసాగింపు మళ్లీ…

అధ్యాయం  5
పరమాణువులు

లెవోషియే విజయాల నుండి స్ఫూర్తి గొన్న కొందరు రసాయనిక శాస్త్రవేత్తలు కచ్చితమైన కొలత పద్ధతుల మీద దృష్టి సారించారు. రసాయన శాస్త్రంలో మరే ఇతర విభాగంలో నైనా కచ్చితమైన కొలత సహాయంతో మరింత లోతుగా శోధించడానికి వీలవుతుందేమో నని వెతకసాగారు. ఆమ్లాల (ఆసిడ్ల) అధ్యయనం అలాంటి శోధనకి వీలుగా కనిపించింది.

సహజంగా ఎన్నో సామాన్య లక్షణాలు గల పదార్థాల వర్గం ఆమ్లాలు (ఆసిడ్లు). అవన్నీ రసాయనికంగా చాలా సక్రియంగా వుంటాయి. జింక్, తగరం, ఇనుము మొదలైన లోహాలతో చర్య జరిపి హైడ్రోజెన్ పుట్టిస్తాయి. పుల్ల రుచి కలిగి వుంటాయి (బాగా పలచగా, బలహీనంగా ఉన్న స్థితిలో తప్ప ఆసిడ్లని రుచి చూడడం ప్రమాదం). కొన్ని రకాల రంగు పదార్థాల రంగులని ప్రత్యేక రీతుల్లో మార్చుతాయి. ఇలా ఎన్నో లక్షణాలు కలిగి ఉంటాయి.
ఆమ్లాలకి ప్రతికూలంగా పని చేసే పదార్థాల వర్గం ఒకటి వుంది. అదే క్షారం (base). (బాగా శక్తివంతమైన బేస్ లని ఆల్కలీలు అంటారు.) ఇవి కూడా రసాయనికంగా సక్రియంగా ఉంటాయి. రుచికి చేదుగా ఉంటాయి. రంగు పదార్థాల రంగులని ఆసిడ్లు మార్చే తీరుకి వ్యతిరేకమైన తీరులో బేస్ లు పని చేస్తాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆసిడ్ల ద్రావణాలని ఆల్కలీల ద్రావకాలు తటస్థీకరిస్తాయి. అంటే ఆసిడ్లని, బేస్ లని తగు నిష్పత్తిలో కలిపితే ఆ సమ్మేళనానికి ఇటు ఆసిడ్ లక్షణాలు గాని, అటు బేస్ లక్షణాలు గాని ఉండవు. ఆ మిశ్రమం ఒక లవణం (salt) యొక్క ద్రావణం అవుతుంది. ఆసిడ్లతోను, ఆల్కలీల తోను పోల్చితే దీనికి మరింత తక్కువ రసాయనిక ప్రాబల్యం ఉంటుంది. ఉదాహరణకి అత్యంత శక్తివంతమైన, తీవ్రమైన హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ద్రావణాన్ని తగు పాళ్లలో అంతే శక్తివంతమైన, తీవ్రమైన బేస్ అయిమైన సోడియమ్ హైడ్రాక్సయిడ్ తో కలిపితే సోడియమ్ క్లోరైడ్ ద్రావణం ఏర్పడుతుంది. అది మనకి సుపరిచితమైన ఉప్పునీరు అన్నమాట.

జర్మన్ రసాయన శాస్త్రవేత్త జెరీమియాస్ బెంజమిన్ రిక్టర్ (1762-1807) ఈ తటస్థీకరణ చర్యల మీదకి తన ధ్యాస మళ్ళించాడు. వివిధ ఆసిడ్లని ఎంత మోతాదుల్లో తీసుకుంటే కచ్చితమైన మోతాదులు గల వివిధ బేస్ లని తటస్థీకరించడానికి వీలవుతుందో కచ్చితంగా కొలిచాడు. ప్రత్యేకమైన, కచ్చితమైన మోతాదుల వద్దనే ప్రత్యేక ఆసిడ్లు, ప్రత్యేక బేస్ లు కలుస్తాయని, పరస్పర తటస్థీకరించుకుంటాయని ఆ కొలతల బట్టి తేలింది. పదార్థాల వినియోగంలో మన సామాన్య అనుభవానికి ఇది వ్యతిరేకంగా వుంది. పులుసులో ఎంత ఉప్పు వేయాలో తేల్చుకునే వంటవాడు కాస్త అటు ఇంటు అయినా ఫరవాలేదని గుర్తిస్తాడు. కాని ఆసిడ్ల, బేస్ ల మధ్య చర్యల విషయం అలా కాదు. తుల్య భారం (equivalent weight)  అనే  ఓ భావన ఏర్పడింది. దీన్ని బట్టి ఒక ప్రత్యేక భారం గల ఒక రసాయనం ఓ ప్రత్యేకమైన భారం వద్దనే మరో రసాయనంతో చర్య జరుపుతుంది. 1792  లో రిక్టర్ తన కృషి ఫలితాలని ప్రచురించాడు.

ఆ రోజుల్లో ఓ ముఖ్యమైన రసాయనిక సమస్య మీద ఇద్దరు ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్తల మధ్య హోరాహోరిగా పోరు సాగేది. ఈ రకమైన నిర్దిష్టత కేవలం ఆసిడ్ – బేస్ ల మధ్య మాత్రమే వుంటుందా, లేక అది అన్ని రసాయనిక చర్యలకి వర్తిస్తుందా అన్నది వారి వివాదం. ఇంకా కచ్చితంగా ఈ వివాదాన్ని నిర్వచించాలంటే ఒక ప్రత్యేకమైన సమ్మేళనం (compound) లో రెండు (లేక మూడో నాలుగో) మూలకాలు ఉన్నాయని అనుకుందాం. ఆ సమ్మేళనంలో ఆ మూలకాలు ఎప్పుడూ కచ్చితంగా ఒకే నిష్పత్తిలో ఉంటాయా? లేక ఆ సమ్మేళనాన్ని ఉత్పత్తి చేసే విధానం బట్టి ఆ నిష్పత్తి మారుతుందా? ఆ ఇద్దరు ఫ్రెంచ్ శాస్త్రవేత్తల్లో ఒకరి పేరు బెర్థొలే (Berthollet) . ఆధునిక రసాయనిక నామకరణ సాంప్రదాయాన్ని సంస్థాపించడంలో ఇతగాడు లెవోషియేతో పాటు కృషి చేశాడు. ఇతగాడు రెండవ సిద్ధాంతాన్ని నమ్మాడు. అంటే ఒక సమ్మేళనంలో   x, y  అని రెండు మూలకాలు ఉంటే అవి రెండూ ఎప్పుడూ ఒకే నిష్పత్తిలో ఉండవు. సమ్మేళనాన్ని తయారు చేసేటప్పుడు  x  ని కాస్త హెచ్చు మోతాదులో వినియోగిస్తే, చివర్లో సమ్మేళనంలో కూడా x  హెచ్చు మోతాదులో ఉంటుంది.

   బెర్థొలే కి విరుద్ధంగా వాదించే మరో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త ఉన్నాడు. అతడి పేరు జోసెఫ్ లూయీ ప్రూస్త్ (1754-1826). ఇతడి వైజ్ఞానిక కృషి అంతా స్పెయిన్ లో జరిగింది. అద్ది ఫ్రాన్స్ లో విప్లవ జ్వాలలు చెలరేగుతున్న కాలం. ఆ సంక్షోభానికి దూరంగా ప్రూస్త్ స్పెయిన్ దేశంలో ప్రశాంతంగా  పని చేసుకుంటున్నాడు. ఎంతో కట్టుదిట్టంగా, నిర్దుష్టంగా ప్రయోగాలు చేసిన ప్రూస్త్ 1799  లో ఓ ముఖ్యమైన రసాయనిక సత్యాన్ని వెల్లడి చేశాడు. కాపర్ కార్బనేట్ ని ప్రయోగశాలలో ఏ విధంగా సంయోజించినా, ఏ సహజ మూలాల నుండి దాన్ని వెలికి తీసినా, అందులో కాపర్, కార్బన్, ఆక్సిజన్ లు ఎప్పుడూ ఒకే కచ్చితమైన నిష్పత్తిలో ఉంటాయని నిరూపించాడు. ఆ సమ్మేళనంలో ఎప్పుడూ కాపర్, ఆక్సిజన్,  కార్బన్ లు 5.3:4:1  నిష్పత్తిలో ఉంటాయని కనుక్కున్నాడు.
మరెన్నో ఇతర సమ్మేళనాల విషయంలో కూడా ప్రూస్త్ కి ఇలాంటి ఫలితమే గోచరించింది. ఈ ఫలితాలని ఆధారంగా చేసుకున్న ప్రూస్త్ ఒక సార్వత్రికమైన నియమాన్ని ఈ విధంగా సూత్రీకరించాడు. ప్రతీ సమ్మేళనంలోను అందులో వుండే మూలకాలు ఎప్పుడూ కొన్ని కచ్చితమైన నిష్పత్తుల వద్దనే ఉంటాయి. ఇతర నిష్పత్తుల వద్ద ఉన్నట్లయితే అసలు ఆ సమ్మేళనమే ఏర్పడదు. దీన్నే నియత నిష్పత్తుల నియమం (Law of Definite Proportions) అంటారు. దీన్నే కొన్ని సార్లు ప్రూస్త్ నియమం అని కూడా అంటారు. (అక్కడితో ఆగక ప్రూస్త్ తన ప్రత్యర్థి అయిన బెర్థొలే ఎక్కడ పొరబడ్డాడో కూడా చూపించాడు. బెర్థొలే తను వాడిన రసాయనాలని తగినంతగా శుద్ధి చెయ్యలేదు. ఆ రసాయనాలలో కలిసిన కాలుష్యాల వల్ల ఒక్కొక్క సందర్భంలో అందులోని మూలకాల నిష్పత్తి ఒకొక్క విధంగా ఉన్నట్టు కనిపించింది.)
(ప్రూస్త్ నియమానికి నిశ్చయంగా కొన్ని మినహాయింపులు వున్నాయి. వాటిలోని మూలకాల నిష్పత్తిలో కొంత వెసులుబాటు ఉంటుంది. అయితే ఇవి ప్రత్యేక సమ్మేళనాలు మాత్రమే. 1800 కాలంలో మన రసాయనికులకి అందుబాటులో ఉండే రసాయనాలు ఈ కోవకి చెందినవి కావు. వాళ్లకి తెలిసిన రసాయనాలు మాత్రం కచ్చితంగా ప్రూస్త్ నియమాన్ని తృప్తిపరిచాయి.)


పందొమ్మిదవ శతాబ్దపు తొలి దశలలోనే ప్రూస్త్ చెప్పింది నిజమని ఋజువు అయ్యింది. ప్రూస్త్ సూత్రీకరించిన నియమాన్ని ఇతర రసాయన శాస్త్రవేత్తలు కూడా స్వతంత్రంగా ప్రయోగాలు చేసి రూఢి చేసుకున్నారు. ఈ నియమం రసాయన శాస్త్రంలో ఓ మూలస్తంభం అయ్యింది.

ప్రూస్త్ నియమం నిజమని తేలిన దగ్గర్నుండి అసలు ఆ నియమానికి ఆధారం ఏమిటి అన్న విషయంలో ఎన్నో లోతైన ప్రశ్నలు తలెత్తడం మొదలెట్టాయి. అసలు ఈ నియత నిష్పత్తుల నియమం ఎందుకు నిజం అవుతోంది? ఉదాహరణకి ఒక సమ్మేళనంలో రెండు మూలకాలు ఎప్పుడూ 4:1  నిష్పత్తిలో మాత్రమే ఎందుకు ఉండాలి? 4.1:1 నిష్పత్తిలో ఉండొచ్చుగా? లేకుంటే 3.9:1  నిష్పత్తిలో ఎందుకు ఉండదు? పదార్థం అవిచ్ఛిన్న రాశి అయితే ఈ మూలకాల నిష్పత్తిలో కాస్త వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది. నిష్పత్తి కాస్త అటు ఇటు గా వున్నా మూలకాలు కలిసి సమ్మేళనం ఏర్పడే అవకాశం వుంటుంది.

పోనీ పద్దార్థం నిజానికి అవిచ్ఛిన్న ఘన రాశి కాదేమో? దాన్ని విభజిస్తూ పోతే ఒక దశలో అంతకన్నా విభజించలేని అంశాలు మిగులుతాయేమో? అలాంటి అంశాలనే పరమాణువులు అని పిలిచేవారని అంతకు ముందు చెప్పుకున్నాం. 

X మూలకానికి చెందిన ఒక పరమాణువు  Y మూలకానికి చెందిన ఒక్క పరమాణువుతో మాత్రమే కలవగలదేమో? అలా పరమాణువులు కలియగా ఏర్పడ్డ సంయోగాలకే molecule  (అణువు)  అని పేరు పెట్టారు. (లాటిన్ లో ఆ పదానికి ‘చిన్న రాశి’ అని అర్థం.) X యొక్క ఒక్క పరమాణువు భారం  Y యొక్క పరమాణువు భారానికి నాలుగు రెట్లు ఉంటుందేమో? అప్పుడు అలాంటి పరమాణువులు కలియగా ఏర్పడ్డ సమ్మేళనాలలో  X, Y  ల భారాల నిష్పత్తి 4:1  అవుతుంది. (ఇంకా వుంది)

చర్మంలో మర్మం

Posted by శ్రీనివాస చక్రవర్తి Monday, July 14, 2014 0 commentsఇప్పుడు మీకు వయసు ఐపోతోంది అనుకోండి (మనిషి అన్నాక తప్పదు కదండీ మరి!). మీకు వయసు పెరుగుతున్న కొద్ది నేను పలచబడి పోతుంటాను. నా అడుగున వున్న సిరలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. కొవ్వు కరిగిపోవడంతో నాలో ముడుతలు కనిపిస్తాయి. యవ్వనపు నిగ్గు, నిగారింపు ఇప్పుడు ఉండదు. కళ్ల కింద చారలు కనిపిస్తాయి. దవడల కింద చర్మం వేలాడే పరిస్థితి ఏర్పడవచ్చు.

చర్మంతో వచ్చే  ఓ ముఖ్యమైన సమస్య కాన్సర్. సూర్యకిరణాలతో అధికంగా సంపర్కం కలిగినప్పుడు కాన్సర్ వచ్చే ప్రమాదం వుంటుంది. నుదురు, ముక్కు, చెవులు ఈ సమస్య తలెత్తే ముఖ్య స్థానాలు. అయితే ఎన్నో రకాల కాన్సర్ ని సకాలంలో గుర్తించగలిగితే నిశ్చయంగా నయం చెయ్యడానికి వీలవుతుంది. కాని ఏదేమైనా కాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి. కనుక చర్మం మీద ఎక్కడైనా అసహజంగా రక్త స్రావం జరుగుతూ, త్వరగా నయం కాకుండా ఉన్నట్టయితే అశ్రద్ధ చెయ్యకుండా డాక్టర్ కి చూపించుకోవాలి.

మరి ఈ విషయంలో నివారణ చర్యగా మీరు చెయ్యగలిగేది ఏమైనా వుందా? తప్పకుండా వుంది. ఎక్కువగా ఎండలో తిరగడం మానెయ్యడం!  ఆదివారం పగలంతా క్రికెట్ ఆడడం తప్పనిసరి అనుకుంటే కాప్ పెట్టుకోవడం. అలాగే చలికాలంలో ఎక్కువగా నీట్లో నానడం మంచిది కాదు. అందువల్ల చర్మంలో  తేమ తగ్గి పొడిపొడిగా అయిపోతుంది.

చివరిగా చెప్పేదేమంటే మీరు ఎంత శ్రద్ధ తీసుకున్నా, నాలుగు రోజుల కోసారి ఎంత నలుగు స్నానాలు చేసినా నాతో కాస్త ఇబ్బందేనండి! మీకు, ఈ బాహ్య ప్రపంచాన్ని వేరు చేసే గోడని కదా మరి? అందుచేత నాకు సంబంధించిన రోగాలు కోకొల్లలు. కచ్చితంగా చెప్పాలంటే 2000  పైగా! చర్మరోగాల్లో ముఖ్యమైనది సోరియాసిస్ (Psoriasis).  మామూలుగా 27  రోజులకి ఒకసారి ఎపీడెర్మిస్ కణాలు కొత్తవి పుడుతుంటాయి. కాని సోరియాసిస్ లో ఈ పుట్టుక ఐదు రోజులకి ఓ సారి జరుగుతుంది. కనుక చర్మం మీద ఎర్రగా మచ్చల్లా ఏర్పడతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. 


అలాంటిదే మరో చర్మ సమస్య షింగిల్స్. చికెన్ పాక్స్ వైరస్ వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు విపరీతమైన బాధ కలుగుతుంది. చర్మం అంతా కురుపుల్లా ఏర్పడతాయి. కురుపులు నయం అయినా కూడా బాధ కొంత కాలం ఉండొచ్చు.
ఇలాంటి పరిస్థితిల్లో తప్పకుండా డాక్టర్ ని సంప్రదించాలి. అదేం ఖర్మమో ఈ చర్మంతో అన్నీ సమస్యలే అనుకుంటున్నారేమో! పొరబాటు! సిపాయికి కవచం ఎంత ముఖ్యమో, శరీరానికి చర్మం అంత ముఖ్యం. చర్మంలోని మర్మం అంటే అదే.
అలాగే మరో సందర్భంలో ఓ ఫిలాసఫీ ప్రొఫెసరు నాతో కాన్సర్ పట్ల తనకి వుండే ఫోబియా గురించి చెప్పుకొచ్చాడు. అప్పటికే అతడు ఎన్నో ఎక్స్-రే లు తీయించుకున్నాడు. కాని ఎందులోను కాన్సర్ ఆనవాళ్లు కనిపించలేదు. అయినా కూడా తనకి ఏదో హానికరమైన ట్యూమర్ వుందని అతడు భయపడుతుంటాడు. “ఏమీ లేదని తెలుసు. కానీ ఏవైనా వుంటే?” అని అడుగుతాడు. ఈ ఆలోచన ఎక్కణ్ణుంచి వచ్చింది? ఇది సచేతనమైన యోచన లోనుండి పుట్టుకొచ్చిన భయం కాదు. ఆ సంశయం అతడి మానసాన్ని ఒక్కసారిగా క్రమ్ముకుంటుంది. దాని సమ్మోహక శక్తి మీద అతడి బొత్తిగా నిగ్రహం లేకుండా పోతోంది.

ఈ విధంగా తన సమస్యని ఒక నాగరికుడు అంత సులభంగా వెలిబుచ్చడు. ఓ అనాగరికుడు అయితే తన సమస్యలకి కారణం ఏదో దయ్యం తనని వేధించడమే నని మరింత సులభంగా ఒప్పుకుంటాడు. దెయ్యాలు అనేవి ఉంటాయని, వాటికి ఏదో దుష్టప్రభావం వుంటుందనే భావన ఓ అనాగరిక సంస్కృతిలో సమ్మతమే కావచ్చు. కాని ఒక ఆధునికుడికి తన సమస్యలు కేవలం మనోజన్యాలు అని ఒప్పుకోవడం మరింత కష్టం అవుతుంది. ఈ విధంగా చిత్తంలో లోతుగా నాటుకుపోయి, సులభంగా మార్చరాని, వొదిలించుకోలేని భావననే obsession అంటారు. ఇది చాలా ప్రాచీనమైన మానసిక పరిణామం. ఆనాడు, ఈనాడు అది ఒక్క రీతిలోనే వుంది. దానికి కారణం ఏమిటి అని అన్వయించే ప్రయత్నంలోనే అప్పటికి ఇప్పటికి తేడా వుంది.

ఆధునికులకి, అనాగరికులకి మధ్య ఈ రకంగా ఎన్నో పోలికలు గుర్తించవచ్చు. మానవ చిత్తంలో ప్రతీకలని పుట్టించే ప్రవృత్తిని అర్థం చేసుకోడానికి ఈ రకమైన తులనాత్మక పరిశీలన అవసరం. ఎందుకంటే ఎన్నో కలలలో మనకి ఎదురయ్యే ప్రతీకలకి ప్రాచీన భావనలతోను, గాధలతోను, ఆచారాలతోను సంబంధం వుంటుంది. ఈ స్వప్న చిత్రాలనే మన చిత్తంలో మిగిలిన “ప్రాచీన అవశేషాలు” అంటాడు ఫ్రాయిడ్. అతి సుదూరమైన గతానికి చెందినవై మనలో మిగిలిన చైతన్యాంశాలు అన్నమాట. అచేతనని కేవలం చేతన యొక్క పొడిగింపు గానో, లేక కాస్త దృశ్యాత్మకంగా చెప్పాలంటే సచేతన మానసంలో పుట్టే చెత్త అంతా తనలో పోగు చేసుకునే ఓ చెత్తడబ్బా లాగానో (ఫ్రాయిడ్ లాంటి) కొంతమంది నిపుణులు పరిగణిస్తూ వుంటారు.

ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశోధించిన మీదట అచేతనని ఈ విధంగా పరిగణించడం పొరబాటని అనిపించింది. అచేతన నుండి ఉద్భవించే ఈ రకమైన ప్రతీకలు, చిత్రాలు విశ్వజనీనాలు అని తెలిసింది. స్వాప్నికుడి చదువుకున్న వాడైనా, నిరక్షరాస్యుడైనా, తెలివైన వాడైనా వట్టి మొద్దు అయినా అచేతనా చిత్రాలు మాత్రం ఒక్కటేనని గుర్తించాను. ఆ చిత్రాలు కేవలం అర్థం లేని ‘అవశేషాలు’ కావు. ఇప్పటికీ వాటికి ఒక ప్రాముఖ్యత వుంది. డా॥ హెండెర్సన్ గారు చెప్పినట్టు వాటి చారిత్రాత్మక లక్షణం దృష్ట్యా వాటికి ఆ విధమైన ప్రాముఖ్యత అబ్బుతుంది. మన ఆలోచనలని మనం సచేతనంగా వ్యక్తం చేసే తీరుకి, లేక అచేతనంగా చిత్రాలతోను, పలు వన్నెలతోను వ్యక్తం చేసే తీరుకి మధ్య ఈ చిత్రాలు వంతెనలా పని చేస్తాయి. సచేతన ప్రపంచానికి అచేతన లోకానికి మధ్య ఈ “చారిత్రాత్మక” సంబంధాలు లంకెలు.

మన సచేతన మానసంలో జాగృత స్థితిలో పుట్టే ఆలోచనలకి,  స్వప్న స్థితిలో లభ్యమయ్యే ఈ చిత్ర సంపదకి మధ్య తేడా గురించి అంతకు ముందు చర్చించాను. ఆ తేడాకి మరో కారణం ఇప్పుడు మనకి కనిపిస్తోంది. మన నాగరిక జీవనంలో మనం వాడే ఎన్నో భావాలు శక్తివిహీనం అయిపోయాయి, పేలవంగా మారిపోయాయి. వాటికి మనం స్పందించడం మానేశాం. వాటిని మాటల్లో అలవాటుగా వాడుతాం. అవతలి వాళ్ళు వాటి గురించి ప్రస్తావించినప్పుడు పరిపాటిగా స్పందిస్తాం. కాని అవి మన చిత్తం మీద గాఢమైన ముద్ర వెయ్యవు. మన నడత మీద వాటికి పెద్దగా ప్రభావం వుండదు. మన మనోభావాలని, నడతని మార్చాలంటే మరింకేదో కావాలి. అదే ఈ “స్వప్న భాష.” కలల ప్రతీకలలో ఎంతో చైత్య శక్తి దాగి వుంటుందంటే వాటిని పట్టించుకోకుండా వుండలేం.

(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email