శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

1729 = 10^3 + 9^3 = 12^3 + 1^3

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, July 19, 2015 3 commentsగుర్తు తెలియని అనారోగ్యం
అనారోగ్యానికి కారణం మొదట్లో గాస్ట్రిక్ అల్సర్ అనుకున్నారు వైద్యులు. ఒక దశలో అందుకు శస్త్ర చికిత్స కూడా అవసరం అనుకున్నారు.

అనారోగ్యానికి కారణం కాన్సర్ కావచ్చని మరో డాక్టర్ అభిప్రాయపడ్డాడు. ఇండియాలో ఉన్నప్పుడు ఒక సారి రామానుజన్ కి హైడ్రోసీల్ ఆపరేషను జరిగింది. ఆ ఆపరేషన్ జరిగినప్పుడు నిజానికి అందులో ఉన్న ట్యూమర్  తొలగించబడిందని, అందులో మిగిలిన కొన్ని కాన్సర్ కణాలు ఇప్పుడు శరీరంలో ఇతర అంగాలకి పాకాయి అన్నాడు. 

లెడ్ పాయిజనింగ్ కూడా ఒక కారణం అని సూచించబడింది. రామనుజన్ టిన్నులలో భద్రపరచబడ్డ కూరగాయలు తెప్పించుకుని తినేవాడు. ఆ కూరగాయలని ఆ టిన్నులలోనే ఉంచి నేరుగా పొయ్యి మీద పెట్టి ఉడికించేవాడు వంటవాడు. అలాంటి ప్రక్రియ వల్ల టిన్నులకి పైన సోల్డరింగ్ చెయ్యబడ్డ సీసం కరిగి కూరగాయలలోకి ప్రవేశించి ఉండొచ్చు.

ఇలా రామానుజన్ అనారోగ్యం విషయంలో ఎన్నో సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. చివరికి అతడి సమస్య టీ.బీ. అన్న ఉద్దేశంతో టీబీ కి సంబంధించిన చికిత్స చేశారు. రామానుజన్ కి టీబీ సోకడానికి కారణాలలో ఒకటి విటమిన్ డి లోపం అన్నారు. సూర్యరశ్మి సహాయంతో శరీరం విటమిన్ డి తయారు చేసుకుంటుంది. బాగా ఉత్తరంగా ఆర్కిటిక్ వృత్తానికి దగ్గరగా ఉండే కేంబ్రిడ్జ్ ప్రాంతంలో ఎక్కువ సమయం మబ్బేసి వుంటుంది. అది చాలనట్టు రామానుజన్ ఎక్కువగా బయటికి వెళ్లేవాడు కాడు. తన గదిలోనే ఉంటూ రాత్రిళ్ళు పని చేసుకుంటూ, పగలు నిద్రపోతూ రోజులు గడిపేవాడు. అలా సూర్యరశ్మి ఎక్కువగా సోకకుండా సాగిన జీవన విధానం కూడా టీబీ సోకడంలో దొహదం చేసి వుండొచ్చు.


1913  లో ఇంగ్లండ్ వచ్చిన రామానుజన్ మొదట్లో రెండేళ్లలో ఇండియాకి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడు. పారితోషకం మరో రెండేళ్ళకి పొడిగింపబడినందున మరింత కాలం ఇంగ్లండ్ లోనే ఉండిపోయాడు. ఈ మధ్యలో ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. జర్మన్ సబ్మరిన్ లు (యూ-బోట్ లు) సముద్రాలలో గస్తీ కాసి బ్రిటిష్ ఓడలని నడి సముద్రంలో ముంచేస్తున్నాయన్న భయం వల్ల రామానుజన్ ఇండియా యాత్రని వాయిదా వేశాడు. ఇంతలో 1917 లో అనారోగ్యం వచ్చి పడింది. 

రామానుజన్ కి టీబీ సోకిందని డాక్టర్లు నిర్ణయించిన మొదట్లో తనని మెండిప్ హిల్స్ సానటోరియం అనే ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుండి త్వరలోనే మాట్లాక్ హౌస్ సానటోరియం అనే చోట చేర్చారు. మాట్లాక్ హౌస్ లో తనకి ఇచ్చిన సౌకర్యాలు రామానుజన్ ని ససేమిరా నచ్చలేదు. గదిలో విపరీతంగా చలిగా ఉండేది. చలి కాచుకోడానికి గదిలో మంట పెట్టుకునే అవకాశం ఉండేది కాదు. ఉహుహూ అని వణుకుతూ ఓ మూల కూర్చునేవాడు. దీనికి కారణం ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యమో, నిర్దాక్షిణ్యమో కాదు. ఆ రోజుల్లో టీబీకి చికిత్సగా రోగిని తగినంత చలిలో ఉంచాలని ఓ నమ్మకం ఉండేది. దాని వల్ల రోగం నయమయ్యిందో, మరింత వికటించిందో తెలీని పరిస్థితి నెలకొంది.

తదనంతరం రామానుజన్ ని లండన్ నడిబొడ్డులో ఉన్న ఓ చిన్న ఆసుపత్రికి మర్చారు. ఫిట్జ్ రాయ్ హౌస్ అనే ఈ ఆసుపత్రిలో ఎంతో మంది నిపుణులు వచ్చి చూశారు. రామానుజన్ అనారోగ్యానికి కారణం ఏమిటో కచ్చితంగా తెలీకుండా వుంది. తీవ్రంగా జ్వరం వచ్చి తొందరగా తగ్గిపోయేది. పొట్టలో తీవ్రమైన నొప్పి పుట్టేది కాని దానికి కారణం ఏమిటో తెలిసేది కాదు.

ఇంచుమించు ఈ కాలంలోనే హార్డీ పడ్డ ప్రయాసల వల్ల  రామానుజన్ కి ‘ఫెలో ఆఫ్ రాయల్ సొసయిటీ’   గౌరవం దక్కింది. బ్రిటన్ లోనే కాక అంతర్జాతీయంగా కూడా అతి గొప్ప వైజ్ఞానిక సదస్సు అయిన ‘రాయల్ సొసయిటీ’లో సభ్యత్వం పొందడం నిజంగా గొప్ప విజయమే.

1918 లో యుద్ధం ముగిసింది. రామానుజన్ ఆరోగ్యంలో పెద్దగా మార్పులేదు.  యుద్ధం ముగిశాక రామానుజన్ ని ఫిట్జ్ రాయ్ హౌస్ నుండి కోలినెట్ హౌస్ అనే ఆసుపత్రికి తరలించారు. మాట్లాక్ హౌస్ లో ఉన్నప్పుడు ఎక్కువగా అతిథులు వచ్చేవారు కారు. కనుక ఒంటరితనాన్ని అనుభవించేవాడు. కాని కోలినెట్ హౌస్ లో పరిస్థితులు వేరు. హార్డీ తరచు వచ్చి చూసిపోతుండేవాడు.

ఒకసారి అలాగే హార్డీ లండన్ నుండి టాక్సీలో రామానుజన్ ని చూడడానికి వచ్చాడు. ఆ టాక్సీ నంబరు 1729  అని గమనించాడు హార్డీ. ఆసుపత్రిలో మంచం మీద నిస్తేజంగా పడి వున్న రామానుజన్ ని చూసి నీరుగారిపోయాడు. ఇక ఏం మాట్లాడాలో తెలీక వచ్చిన టాక్సీ నెంబరు చెప్పి, ఆ సంఖ్య అంత మంచి సంఖ్య లాగా అనిపించలేదన్నాడు. అదేదో దుశ్శకునం కాకూడడని ఆశిస్తున్నా నన్నాడు.

అందుకు రామానుజన్ నీరసంగా నవ్వి, “లేదు హార్డీ. అది చాలా ఆసక్తికరమైన సంఖ్య. రెండు ఘన సంఖ్యల కూడికగా రెండు విభిన్న రీతులుగా వ్యక్తం చెయ్యదగ్గ అతి చిన్న సంఖ్య అది,” అన్నాడు. హార్డీ నిశ్చేష్టుడయ్యాడు.
శరీరం తీవ్రమైన అస్వస్థతకి గురైనా రామానుజన్ బుద్ధి యొక్క పదునులో మాత్రం ఏ మార్పూ లేదు. 1729  అన్న సంఖ్య మాట వినిపించగానే, ఆ సంఖ్యా లోకపు సామ్రాట్టు మనసులో ఆ సంఖ్య పుట్టు పూర్వోత్తరాలన్ని మెదిలి వుంటాయి. ఈ విధంగా రెండు ఘన సంఖ్యల కూడికగా రెండు రకాలుగా వ్యకం చెయ్యొచ్చని వెంటనే గుర్తించాడు.
1729 = 103 + 93 = 123 + 13.

(ఇంకా వుంది)

రసాయన చరిత్రలో ఆంటీబయాటిక్ ల ఆవిర్భావం

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, July 15, 2015 0 comments
కాని రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో పెచ్చరిల్లిపోతున్న అంటువ్యాధులని అరికట్టే అవసరం ఏర్పడటంతో ఈ సమస్య మీద మళ్లీ కొత్తగా ధ్వజం ఎత్తారు. ఆస్‍ట్రియన్-ఇంగ్లీష్ పెథాలజిస్ట్ అయిన హవర్డ్ వాల్టర్ ఫ్లోరీ (1898-1968) మరియు జర్మన్-ఇంగ్లీష్ బయోకెమిస్ట్ అయిన ఎర్న్‍స్ట్ బోరిస్ చెయిన్ (1906-1979) ల నేతృత్వంలో జరిగిన పరిశోధనా ప్రయత్నంలో పెన్సిలిన్ ని శుద్ధి చేసి, దాని అణువిన్యాసాన్ని భేదించడం జరిగింది. అదే మొట్టమొదటి ఆంటీబయాటిక్ (anti-biotic) గా పరిణమించింది. (ఆంటీబయాటిక్ అంటే జీవ ప్రతికూల పదార్థం, అంటే క్రిమిజీవనానికి ప్రతికూలమైన పదార్థం అని అర్థం). పెన్సిలిన్ యొక్క వైద్య ప్రయోజనాల పట్ల అవగాహన వేగంగా వ్యాపించింది.   1945  కల్లా నెలకి అరటన్ను చొప్పున పెన్సిలిన్ ఉత్పత్తి ఉధృతంగా పుంజుకుంది.

1958  లో పెన్సిలిన్ తయారీ విషయంలో రసాయన శాస్త్రవేత్తలు కొత్త సంగతులు కనుక్కున్నారు. బూజుపట్టే ప్రక్రియని మధ్యలోనే నిలిపేసి, అలా ఏర్పడ్డ పెన్సిలిన్ అణువు యొక్క కేంద్రాంశాన్ని మాత్రమే తీసుకుని, ఆ కేంద్రాంశానికి సహజంగా జతకాని కొన్ని కర్బన రసాయన సముదాయాలని జత చేయాలి. అలా సంయోజించబడ్డ పెన్సిలిన్ రూపాంతరాలకి పెన్సిలిన్ కన్నా శక్తివంతమైన క్రిమిసంహారక లక్షణాలు ఉంటాయని తెలిసింది. 1940, 1950 లలో ఈ పద్ధతి ద్వార స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైకిలిన్ లు మొదలైన ఇతర ఆంటీబయాటిక్ లని రూపొందించడం జరిగింది.

సంక్లిష్టమైన కర్బన రసాయనాలని ఏదో విధంగా సంయోజిస్తే సరిపోదు. ఆ సంయోజక ప్రక్రియలో వివిధ దశలలో ఉత్పన్నమయ్యే సమ్మేళనాలని కచ్చితంగా విశ్లేషించి వాటి లక్షణాలని తెలుసుకోవాలి. వాటి అణువిన్యాసాన్ని నిర్ణయించాలి. కాని ఎన్నో సందర్భాలలో అలా ఉత్పన్నమైన పదార్థం ఎంత స్వల్ప మోతాదులో ఉండేదంటే దాన్ని కచ్చితంగా విశ్లేషించడం ఇంచుమించు అసంభవం అయిపోయేది.

ఇలా ఉండగా ఆస్ట్రియన్ రసాయన శాస్త్రవేత్త ఫ్రిట్జ్ ప్రెగెల్ (1869-1930) విశ్లేషణకి వాడే పరికరాలని విజయవంతంగా కుదించగలిగాడు. ఎంతో సునిశితమైన త్రాసు, అతి సూక్ష్మమైన గాజు ఉపకరణాలు మొదలైనవి రూపొందించాడు. ఇలాంటి ఉపకరణాల సహాయంతో 1913 కల్లా సూక్ష్మవిశ్లేషణ (microanalysis) అనే కొత్త సాంప్రదాయం బాగా కుదురుకుంది. గతంలో విశ్లేషించడానికి సాధ్యపడని చిన్న చిన్న మోతాదులని కూడా దీని సహాయంతో కచ్చితంగా విశ్లేషించడానికి వీలయ్యింది.

సాంప్రదాయక రసాయనిక విశ్లేషణా విధానాలలో భాగంగా ఒక చర్యలో వాడబడ్డ పదార్థం యొక్క ఘనపరిమాణాన్ని కొలవడం జరుగుతుంది. దీన్నే ఘనపరిమాణాత్మక విశ్లేషణ (volumetric analysis) అంటారు. లేదా ఆ చర్యలో పుట్టే ఉత్పత్తుల భారాన్ని కొలవడం జరుగుతుంది. దీన్నే భారమాన విశ్లేషణ (gravimetric analysis) అంటారు. ఇరవయ్యవ శతాబ్దం పురోగమిస్తుంటే రసాయన విశ్లేషణ కూడా కొత్త పుంతలు తొక్కింది. కాంతి శోషణ, విద్యుత్ వాహకత మొదలైన ఇతర లక్షణాల కొలమానం మొదలైన అధునాతన ప్రక్రియలు కూడా రసాయన విశ్లేషణలో భాగాలు అయ్యాయి.

(ఇంకా వుంది)

ప్రాజెక్ట్ స్కూల్ లైబ్రరీ

Posted by శ్రీనివాస చక్రవర్తి Saturday, July 4, 2015 16 commentsప్రియమైన బ్లాగర్లకి

గత ఏడాది చేపట్టిన ‘ప్రాజెక్ట్ స్కూల్ లైబ్రరీ’ ముగిసింది. ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాల్లో 330 తెలుగు మీడియం బడులకి ఉచితంగా ఈ కింది 6 పుస్తకాలు పంపడం జరిగింది.
1.     ఆల్బర్ట్ ఐన్‍స్టయిన్ – వైజ్ఞానిక విప్లవకారుడు
2.    ఐసాక్ న్యూటన్ – జీవితం, కృషి
3.    పాతాళానికి ప్రయాణం – జూల్స్ వెర్న్ రాసిన Journey to the Center of the Earth కి అనువాదం
4.    రసాయనిక శాస్త్ర చరిత్ర – 1వ భాగం. ఐసాక్ అసిమోవ్. (తెలుగు అనువాదం)
5.    రసాయనిక శాస్త్ర చరిత్ర – 2వ భాగం. “
6.    రసాయనిక శాస్త్ర చరిత్ర – 3వ భాగం. “
ఇందులో భాగంగా వ్యాస రచన పోటీ కూడా నిర్వహించబడింది. అందులో పాల్గొన్న విద్యార్థులకి ఉచితంగా వాళ్లు అడిగిన పుస్తకాల ప్రతులు పంపించడం జరిగింది.
ఈ ఏడాది కూడా ఇదే ప్రాజెక్ట్ మళ్లీ నిర్వహించబోతున్నాం. ఈ సారి మరి కొన్ని కొత్త, సైన్స్ పుస్తకాలు ప్రచురించి పంపడం జరుగుతుంది.
ఈ ప్రాజెక్ట్ లో ఎవరైనా స్కూలు టీచర్లు పాల్గొని, పుస్తకాలు పిల్లలకి అందే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. పుస్తకాలలోని అంశాలని టీచర్లు చదివి, పిల్లల చేత చదివించి, ఆ విషయాలు పిల్లలతో చర్చించే ప్రయత్నం చేస్తే బావుంటుంది. అలాంటి ఆసక్తి కల టీచర్లు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించవలసిందని మనవి.

-      శ్రీనివాస చక్రవర్తి

నిద్రాహారాలు తెలియని రామానుజన్ శ్రమ

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, July 1, 2015 0 commentsఅలాంటి పరిస్థితుల్లో రామానుజన్ కి హార్డీ అందించిన స్నేహం కొంత వరకు ఆ ఒంటరితనాన్ని భరించగలిగేలా చేసింది అనడంలో సందేహం లేదు. గణిత రంగంలో పరస్పర పూరకమైన శక్తులు గల వీరిద్దరూ కలిసి సాధించిన విజయాలు ఇద్దరికీ గణిత లోకంలో శాశ్వత యశస్సుని సంపాదించిపెట్టాయి.  ‘విభాగాల’ సిద్ధాంతం మీద వీరు చేసిన కృషి ఒక్కటి చాలు, గణితవేత్తలుగా వీరి జీవితాలని సార్థకం చెయ్యడానికి.
గణితవేత్తగా పాశ్చాత్య గణిత ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉన్నవాడు హార్డీ. పాశ్చాత్య గణిత సాంప్రదాయంలో మహోత్కృష్ట సారాన్ని పుణికి పుచ్చుకున్న వాడు. ఎక్కువగా లోజ్ఞానం మీద ఆధారపడి శరవేగంతో ముందుకు దూసుకుపోయే రామానుజన్ వడికి ఒక స్థిరత్వాన్ని, పొరబడని గమనాన్ని ఆపాదించింది హార్డీ స్వభావం. ఎప్పుడూ రామానుజన్ ని సమర్ధించేవాడు, ప్రోత్సహించేవాడు, ప్రశంసించేవాడు. మారని స్నేహాన్ని రామానుజన్ కి అందించి తన వారికి దూరంగా ఓ మహోన్నత లక్ష్యసాధన కోసం పని చేస్తున్న రామానుజన్ కి ఆ లక్ష్యసాధన మరింత సులభం అయ్యేలా  పరిస్థితులు కల్పించాడు. హార్డీ ప్రోత్సాహం ఒక విధంగా రామానుజన్ గణిత ప్రయాసలని పోషించే ఓ అక్షయమైన ఇంధనం అయ్యింది. సహృదయంతో అందించినా ఆ ప్రోత్సాహం, ప్రోద్బలం రామానుజన్ జీవితంలో కొన్ని విచిత్ర కారణాల వల్ల ఒక విధంగా చూస్తే దుష్పరిణాలుగా దాపురించాయి.
ఇండియాలో ఉన్న రోజుల్లోనే గణితమే లోకం అన్నట్టుగా కాలం గడుపుతూ వచ్చాడు రామానుజన్. కాలేజిలో రోజుల్లో లెక్కల్లో తప్ప ఇతర రంగాల్లో అభిరుచి లేదని తెలిసిపోయాక, పూర్తిగా గణితం మీదే తన సమయం అంతా వెచ్చించాడు. పోర్ట్ ట్రస్ట్ లో చేసిన ఉద్యోగం కూడా పొట్ట కూటి కోసం తప్ప ఉద్యోగం మీద మక్కువ చేత కాదు. స్కాలర్షిప్ వచ్చాక ఆ కాస్త ప్రయాస కూడా తప్పింది. ఇక పూర్తిగా గణితానికే  అంకితమైపోయాడు. గణితం ధ్యాసలో పడి ఇక ఆహారం, విరామం మొదలైనవన్నీ విస్మరించి గణితంలోనే మునిగితేలేవాడు.

ఇంగ్లండ్ వెళ్లాక తను వచ్చిందే గణితం కోసం కనుక ఈ ధోరణి మరింత తీవ్రమయ్యింది. ఆహారవ్యవహారాదుల వల్లనైతేనేమి, బ్రిటిష్ వారి ముభావ స్వభావం వల్లనైతే నేమి, తన ఒంటరితనాన్ని పూరించుకోడానికి గణితంలో తన పరిశ్రమని మరింత ఉధృతం చేశాడు. ఇలాంటి నేపథ్యంలో హార్డీతో స్నేహం, హార్డీ తనతో వ్యవహరించే తీరు యజ్ఞంలా సాగే ఆ గణితసాధనలో మరి కాస్త ఆజ్యం పోసిందే గాని, క్రమంగా తన చుట్టూ ఏర్పడుతున్న ఆ బంగారు పంజరం లోంచి తప్పించలేకపోయింది.

మహోత్కృష్టమైన ఆదర్శాల కోసం తప్ప నిమ్నజాతి లక్ష్యాల కోసం ప్రాకులాటని హార్డీ ఎప్పుడూ సమర్ధించేవాడు కాడు. చిన్న ఫలితాన్ని సాధించి దాన్ని గొప్పగా ప్రదర్శించుకోవాలని చూసే రకాలని నిర్దాక్షిణ్యంగా కడిగేసేవాడు. రాజీ పడని విద్యాప్రమాణాలు గల వాడు. ఆ  ప్రమాణాలని అన్యులకే కాక, తనకి కూడా కచ్చితంగా వర్తింపజేసుకుంటూ జీవించేవాడు. అందుకే తన చుట్టూ పని చేసే వారు తమ శాయశక్తులా ప్రయత్నించి అత్యుత్తమ ఫలితాలని సాధించడానికి ప్రయత్నిస్తారు. హార్డీ గురించి బాగా తెలిసిన జె.సి. బర్కిల్ అనే గణిత వేత్త హార్డీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది అంటాడు. తనతో మాట్లాడితే “మనం తక్కువ వాళ్ళం” అన్న భావన కలుగుతుంది అనేవాడు. ఒక సారి లూయి జె. మార్డెల్ అనే గణితవాత్త తను రాసిన ఓ వ్యాసాన్ని ఎన్నో పత్రికలు అన్యాయంగా తిప్పికొట్టాయని,  ఆ వ్యాసాన్ని ఓ సారి పరిశీలించి తన అభిప్రాయం చెప్పమని హార్డీకి పంపాడు. సానుభూతి చూపించి మెచ్చుకుంటాడని ఆశిస్తుంటే, ఆ వ్యాసానికి హార్డీ స్పందన పుండు మీద కారంలా అనిపించింది. “మీరు పంపిన వ్యాసం మీద మూడు గంటలు వెచ్చించాను… ఒక్క  పేజీలోనే ముప్పై తప్పులు కనిపించాయి…అవన్నీ ‘అల్పమైన’ విషయాలు అని మీరు పట్టించుకోకపోయి వుండొచ్చు…” హార్డీ  దృష్టిలో ఏదీ అల్పం కాదు. ఒక్క పొరబాటు కూడా దొర్లకుండా, మహోన్నత ప్రమాణాల అనుసారం చెయ్యని గణితం అసలు గణితమే కాదు.

అలా నిక్కచ్చిగా వ్యవహరించే తీరు వెనుక  అసూయ మాత్రం  లేదు.  హార్డీ స్వభావం గురించి మాట్లాడుతూ “కుటిలత్వం ఏ కోశానా లేని ఉదారస్వభావుడు, అసూయ అన్నది ఎరగని వాడు” అంటాడు బ్రిటిష్ రచయిత సి. పి. స్నో (C.P. Snow). కనుక హార్డీ అవతలి వారిలో తప్పులు ఎన్నితే దానికి కారణం కుటిలత్వమో, అసూయో కాదు. అవతలి వారికి నచ్చినా, నచ్చకున్నా గణిత రంగంలో హార్డీ  ప్రమాణాలు అలాంటివి.
అలాంటి ప్రమాణాలు గల స్నేహితుడు దొరకడం ఒక విధంగా రామానుజన్ అదృష్టం. ఒక విధంగా  ఆ ప్రమాణాలే రామానుజన్ మీద ఒత్తిడి పెంచి ఇంగ్లండ్ లో తన బ్రతుకును మరింత దుర్భరం చేశాయి.

ఒక సారి రామానుజన్ అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ సమయంలో హార్డీ తన స్నేహితుడికి రాసిన జాబు ఇలా వుంది – “…నువ్వు ఈ సమయంలో బయట ఉంటే ఎంతో బావుండేది. ప్రస్తుతం నా వద్ద కొన్ని అధ్బుతమైన (గణిత) సమస్యలు ఉన్నాయి. నువ్వు వచ్చాక వాటి మనిద్దరం వాటి మీద పనిచెయ్యొచ్చు. నా నీ ప్రస్తుత పరిస్థితుల్లో  అలాంటి కఠినమైన సమస్యల మీద పని చెయ్యగలవో లేదో మరి తెలీదు…” అని రాస్తూ ఆఖర్లో మాత్రం “ప్రస్తుతానికి మాత్రం నువ్వు డాక్టర్లు చెప్పినట్టు నడచుకోవడం తప్ప మరేమీ చెయ్యలేవనుకుంటాను. కాని ఈ (గణిత) విషయాల గురించి ఓ సారి ఆలోచించగలవేమో చూడు. ఇవి చాలా ఆసక్తికరమైన విషయాలు.”
స్నేహితుడు ఆసుపత్రిలో మంచం పట్టి ఉన్న పరిస్థితుల్లో కూడా హార్డీ అతణ్ణి ఊపిరి తీసుకోనివ్వడం లేదు.  రామానుజన్ స్పందన కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేది. ఆసుపత్రిలో తనకి ఇచ్చిన గదిలో మరీ చలిగా వుందని, బాత్ రూమ్ మాత్రం మరింత వెచ్చగా వుందంటూ రామానుజన్  హార్డీకి ఇలా జవాబు రాశాడు – “బాతు రూమ్ లు హాయిగా, వెచ్చగా ఉన్నాయి. రోజూ పెన్ను, కాగితం తీసుకుని వెళ్లి బాత్ రూమ్ లో ఓ గంట కూర్చుంటాను. త్వరలోనే రెండు, మూడు వ్యాసాలు పంపగలను. ఈ ఆలోచన అంతకు ముందు రాలేదు సుమా. వచ్చి వుంటే ఇప్పటికే ఎంతో రాసి వుండేవాణ్ణి…. ఒక్కటి మాత్రం నీకు నమ్మకంగా చెప్పగలను. నేను బాత్ రూమ్ కి వెళ్లేది స్నానం చెయ్యడానికి కాదు, లెక్కలు చెయ్యడానికి.”

అంత అనారోగ్యంలో కూడా తగినంత స్థాయిలో గణితం చెయ్యలేక పోతున్నందుకు స్నేహితుణ్ణి క్షమాపణ అడుగుతున్నట్టుగా వుంది  రామానుజన్ ఉత్తరం.
ఆ విధంగా నిద్రాహారాల గురించి పట్టించుకోని ఎడతెగని శ్రమ రామానుజన్ ఆరోగ్యాన్ని దెబ్బతీసింది.

(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email