శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

మరి కొందరు ప్రాచీన గ్రీకు మేధావులు

Posted by V Srinivasa Chakravarthy Thursday, November 7, 2019

ఎరటోస్తినిస్ లాగానే హిప్పార్కస్ అని మరో గొప్ప ఖగోళవేత్త ఉన్నాడు. ఇతడు కూడా ముఖ్యమైన తారారాశుల స్థాననిర్ణయం చేసి వాటి ప్రకాశాన్ని అంచనా వేశాడు. అలాగే జ్యామితిని (geometry)  అద్భుతంగా క్రమబద్ధీకరించిన యూక్లిడ్ ఉన్నాడు. జ్యామితి నేర్చుకోలేక తిప్పలు పడుతున్న రాజుతోజ్యామితి నేర్చుకోడానికి అనువైన రాచబాట ఏమీ లేదు రాజా!” అని ధైర్యంగా ప్రకటించిన ఘనుడు యూక్లిడ్. అదే విధంగా థ్రేస్ కి చెందిన డయనీసొస్ భాషా శబ్దాలని చక్కగా వర్గీకరించి, జ్యామితిలో యూక్లిడ్ చేసిన కృషి లాంటిదే భాషారంగంలో చేశాడు. మనిషిలో తెలివితేటలకి ఆధారమైన అవయవం గుండె కాదని, మెదడని నిర్ద్వంద్వంగా నిరూపించినవాడు హీరోఫైలస్. అలెగ్జాండ్రియాకి చెందిన హెరాన్ మరలు, ఆవిరియంత్రాలు తయారు చేసి, పరిజ్ఞానాన్ని ఆటోమాటా (Automata) అనే పుస్తకంలో ప్రకటించాడు. చరిత్రలో రోబోల మీద అదే మొట్టమొదటి పుస్తకం అంటారు

పెర్గా కి చెందిన అపొలోనియస్ అనే గణితవేత్త దీర్ఘవృత్తాలు, వృత్తాలు, పారాబొలాలు, హైపర్ బోలాలు వక్రాలన్నీ శంఖుపరిచ్ఛేదాలు అనే కుటుంబానికి చెందిన వక్రాలు అని నిరూపించాడు. వక్రాలే గ్రహాల, తోకచుక్కల, తారల గమనాలని వర్ణిస్తాయని ప్రస్తుతం మనకి తెలుసు. ఇక యంత్రశాస్త్రంలో ఆరితేరిన ఆర్కిమీడిస్; కళ, శాస్త్ర రంగాల అద్బుత సమన్వయమూర్తి లియొనార్డో డా వించీ; ప్రస్తుతం కుహనాశాస్త్రంగా పరిగణించబడే జ్యోతిష్య శాస్త్రానికి కావలసిన ఎంతో ఖగోళ సమాచారాన్ని పోగుచేసిన ఖగోళవేత్త, భౌగోళికుడు టోలెమీ: అతడి భూకేంద్ర సిద్ధాంతం 1,500 ఏళ్ల మాటు నిలిచింది అన్న విషయాన్ని గమనిస్తే, ప్రతిభావంతులు కూడా పొరబాట్లు చేయగలరని అర్థమవుతుంది. వీరందరితో పాటు గొప్ప ప్రతిభాశాలి అయిన ఒక స్త్రీ కూడా వుందిఆమె పేరు హైపాటియా. గణితవేత్త, ఖగోళవేత్త అయిన హైపాటియా అలెగ్జాండ్రియా గ్రంథాలయ వినాశనంతో పాటు తుదిశ్వాస విడిచింది. ఆమె కథకి మళ్లీ వద్దాం.


అలెగ్జాండర్ తరువాత వచ్చిన గ్రీకు రాజులు చదువుకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. కాలానికి చెందిన మహామేధావులంతా గ్రంథాలయంలో సమావేశమై కలిసి పని చేయడానికి కావలసిన  వాతావరణాన్ని గ్రంథాలయంలో కల్పించారు.  అందులో పది పెద్ద పెద్ద పరిశోధనా మందిరాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగానికి కేటాయించబడింది. ఇవి గాక ఎగసిపడే జలధారలు, నగిషీలు చెక్కిన స్తంభాల వరుసలు, ఉద్యానవనాలు, జంతుశాలలు, జీవపరిచ్ఛేదశాలలు, ఒక నక్షత్రశాల కూడా ఉన్నాయి. ఇవన్నీ కాక విశ్వరహస్యాల గురించి ప్రగాఢ చర్చలు పగలనక రాత్రనక సాగే పసందైన భోజనశాలలు కూడా లేకపోలేదు.

గ్రంథాలయానికి ప్రాణం అక్కడి పుస్తకాలలోనే వుంది. ప్రపంచంలోని అన్ని సంస్కృతులకి, భాషలకి చెందిన పుస్తకాలు అక్కడ సేకరించబడ్డాయి. కార్యదర్శులని పంపించి మొత్తం గ్రంథాలయాలనే కొనుగోలు చేసి అక్కడి పుస్తకాలని ఇక్కడికి చేరవేసుకునేవారు. అలెగ్జాండ్రియా రేవులో లంగరు వేసిన వాణిజ్య ఓడలని అధికార్లు సోదా చేసేది అక్రమ ఉత్పాదనల కోసం కాదుపుస్తకాల కోసం. సోదాలలో ఏవైనా విలువైన తాళపత్ర గ్రంథాలు దొరికితే, వాటిని అరువు తెచ్చుకుని, నకలు చేసుకుని సగౌరవంగా వాటి యజమానులకి అప్పజెప్పేవారు. కచ్చితంగా సంఖ్య చెప్పడం అంత సులభం కాదు గాని, మహాగ్రంథాలయంలో సుమారు ఐదు లక్షల తాళ పత్ర గ్రంథాల వ్రాతప్రతులు ఉండేవని అంటారు. మరి పుస్తకాలన్నీ ఏవైనట్టు? వాటిని సేకరించి సృష్టించిన మహోన్నత నాగరికత క్రమంగా   పతనమైపోయింది. అసలు గ్రంథాలయమే అనాగరికమైన విధ్వంసానికి గురయ్యింది.  అక్కడి గ్రంథ నిధులలో అత్యల్పమైన భాగం మాత్రమే మిగిలింది. మిగిలిన కాసిని పుస్తకాల బట్టి అక్కడ ఎలాంటి విజ్ఞాన భాండారాలు దాగి వున్నాయో అర్థమవుతుంది

ఉదాహరణకి అక్కడ సామోస్ కి చెందిన అరిస్టార్కస్ రాసిన ఒక పుస్తకం దొరికింది. అందులో రచయిత భూమి కూడా ఇతర గ్రహల లాగానే ఒక గ్రహమని, గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతాయని, తారలు మన నుండి చెప్పలేనంత దూరాలలో ఉన్నాయని అంటాడు. అతడి ఊహలు నిజాలే కాని, వాటిని మరో రెండు వేల సంవత్సరాల తరువాత మళ్లీ కొత్తగా ఆవిష్కరించారు. అరిస్టార్కస్ రచనల విషయంలో జరిగిన వినష్టాన్ని లక్షతో గుణిస్తే, మహోన్నత ప్రాచీన సంస్కృతులు సాధించిన విజయం, వాటి విధ్యంసం వల్ల మనకి కలిగిన నష్టం ఏపాటిదో అర్థమవుతుంది.

ప్రాచీనులకి తెలిసిన విజ్ఞానం కన్నా మనం ఎంతో దూరం వచ్చాము. కాని మన చారిత్రక  జ్ఞానంలో పూడ్చరాని ఖాళీలు ఉన్నాయి. అలెగ్జాండ్రియాకి చెందిన మహత్తర గ్రంథాలయంలో మనకి ప్రవేశమే ఉంటే, ఎలాంటి అద్భుత రహస్యాలు నేడు మన చేతికి చిక్కి ఉండేవో ఊహించుకోండి. అందులో మూడు సంపుటాలు గల ప్రపంచ చరిత్ర గ్రంథం ఉండేదట. అది కూడా మనకి మిగలలేదు. దాన్ని రాసిన వాడు బాబిలోనియాకి చెందిన బెరోసస్ అనే అర్చకుడు. అందులోని మొదటి పుస్తకంలో సృష్టి నుండీ ప్రళయం వరకు గల వివరాలు ఉన్నాయి. రెండు ఘట్టాలకి నడిమి కాలం విలువ 4,32,000 ఏళ్లు అని పుస్తకం పేర్కొంటుంది. పాత టెస్టమెంట్ లోని కాలమానానికి ఇది నూరు రెట్లు మరింత దీర్ఘమైనది. పుస్తకంలో ఎలాంటి వివరాలు ఉన్నాయో తెలుసుకోవాలని కుతూహలంగా వుంది.

విశ్వం ఎంతో పురాతనమైనదని మన ప్రాచీనులకి తెలుసు. దాని సుదూర గతంలోకి తొంగి చూడాలని ప్రయత్నించారు. మనం ఊహించగలిగే దాని కన్నా విశ్వం వయసు మరెంతో   ఎక్కువని మనకిప్పుడు తెలుసు. హద్దుల్లేని అంతరిక్షంలో మన స్థానాన్ని పరిశీలించినప్పుడు, పేరూ ఊరూ లేని గెలాక్సీలో, మారు మూల ప్రాంతంలో ఉండే, మామూలు తార చుట్టూ తిరిగే, చిన్న ధూళికణం మీద మనం జీవిస్తున్నాం అని అర్థమవుతుంది. అంతరిక్షపు బృహత్తులో మనం కేవలం ఒక బిందువు అనుకున్నప్పుడు, యుగయుగాల సుదీర్ఘకాలంలో మనం కథ కేవలం ఒక లిప్త మాత్రమే అనుకోవాలి. మన విశ్వం (అంటే దాని యొక్క ప్రస్తుత అవతారం) యొక్క ఆయుర్దాయం పదిహేను, ఇరవై బిలియన్ సంవత్సరాలు ఉంటుందని మనకిప్పుడు తెలుసు. మహావిస్ఫోటం (Big Bang)  అనబడే బ్రహ్మాండమైన విస్ఫోటాత్మక ఘటన జరిగిన కాలం నుండి ప్రస్తుత కాలానికి మధ్య ఉండే కాలవ్యవధి అన్నమాట. విశ్వం యొక్క ఆరంభంలో గెలాక్సీలు లేవు, తారలు, గ్రహాలు  లేవు, జీవరాసులు, నాగరికతలు లేవు. ఉన్నది కేవలం సమంగా ప్రజ్వరిల్లే ఒక అగ్నిగోళం మాత్రమే. అగ్నిగోళమే అంతరిక్షం మొత్తాన్ని నింపేస్తుంది. బిగ్ బాంగ్ నాటి కల్లోలం నుండి నేటి విశ్వంలోని క్రమం వరకు రావడానికి పదార్థము, శక్తి ఎలాంటి ప్రగాఢమైన  పరివర్తనలు చెందాయో మనం ఇప్పుడు గమనిస్తున్నాం. మరెక్కడైనా ప్రతిభ గల జీవులు ఉన్నట్లయితే తప్ప, ప్రస్తుతానికి మాత్రం సమస్త విశ్వంలోను అలాంటి పరివర్తనకి, పరిణామానికి పరాకాష్ట మనమే. ఏనాడో జరిగిన బిగ్ బాంగ్ కి వారసులం. విశ్వం లోనుండి అయితే మనం పుట్టుకొచ్చామో విశ్వాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుని, దాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ప్రయత్నానికి నడుము కట్టి వున్నవాళ్లం.



 (ఒకటవ అధ్యాయం సమాప్తం)









0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts