తారాంతర వాయు
ధూళి రాశులు ఘనీభవించగా సౌరమండలం ఏర్పడింది. అందులో అంతరిక్షంలోకి
విక్షేపం కాకుండా, సూర్యుడిలోకి పతనం
చెందకుండా మిగిలిన పదార్థంలో సింహభాగం జూపిటర్ లో భాగం అయ్యింది. జూపిటర్ గ్రహం
అది ప్రస్తుతం ఉన్న స్థితి కన్నా మరి కొన్ని డజన్ల రెట్లు భారమైనదే అయ్యుంటే, దాని కేంద్రంలోని
ద్రవ్యరాశి ఉష్ణకేంద్రక చర్యలు (thermonuclear reactions) బయల్దేరి, జూపిటర్ కూడా మరో సూర్యుడిలా తన సొంత కాంతితో ప్రకాశిస్తుంది. మన సౌరమండలంలోని అతి పెద్ద గ్రహం తార కాగోరి విఫలమయ్యింది. అయినా కూడా దాని అంతరంగపు ఉష్ణోగ్రతలు ఎంత విపరీతంగా ఉంటాయంటే, అది సూర్యుడి
నుండి తీసుకునే శక్తి కన్నా విడుదల చేసే శక్తి సుమారు రెండింతలు ఉంటుంది. వర్ణమాలలో పరారుణ
ప్రాంతాన్ని బట్టి చూస్తే, జూపిటర్ ని
ఒక తార అనుకుంటే సమంజసమేమో. దృశ్యకాంతి పరంగా
కూడా జూపిటర్ తార అయినట్లయితే, ప్రస్తుతం మనం జంటతారలు వెలిగే గ్రహవ్యవస్థలో జీవించి ఉండేవాళ్లం. అప్పుడు ఆకాశంలో ఇద్దరు సూర్యుళ్లు కొలువుంటారు. రాత్రులు అరుదుగా అరుదెంచుతాయి. మిల్కీవే గెలాక్సీ అంతటా అసంఖ్యాకమైన సౌరమండలాలు జంటతారల వ్యవస్థలే. అలాంటి వ్యవస్థల్లో
పరిస్థితులు ఎంతో సహజసుందరంగా ఉంటాయనిపిస్తుంది.
రెండు సూర్యుళ్లతో రగిలిపోయే ఒక బహుచక్కని జంటతారల వ్యవస్థ - ఊహాచిత్రం (https://medium.com/the-cosmic-companion/binary-stars-may-be-likely-to-harbor-life-after-all-d99d892d127b)
జూపిటర్ మేఘమండలం కన్నా కిందకి బాగా లోతుగా చొచ్చుకుపోతే, భూమి మీద ఎక్కడా లేనంత విపరీతమైన పీడనాలు అనుభవమవుతాయి. ఆ ఒత్తిడికి హైడ్రోజెన్ అణువుల లోంచి ఎలక్ట్రాన్లు పైకి ఎగదోయబడి, ఓ అద్భుతమైన పదార్థం ఏర్పడుతుంది – అది ద్రవ, లోహపు హైడ్రోజెన్ (liquid metallic hydrogen). ఆ భౌతిక స్థితిని భూమి మీద ఎప్పుడూ సాధించడానికి సాధ్యం కాలేదు. (లోహపు హైడ్రోజెన్ సామాన్య ఉష్ణోగ్రతల వద్ద కూడా అతివాహక లక్షణాలు ప్రదర్శిస్తుందని ఆశిస్తున్నారు. భూమి మీదే గాని దాన్ని ఉత్పన్నం చెయ్యగలిగితే ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవమే బయల్దేరుతుంది.) ఇక జూపిటర్ అంతరాళాల లోకి చొచ్చుకుపోతే, అక్కడ భూమి ఉపరితలం మీద ఉండే వాతావరణ పీడనం కన్నా మూడు మిలియన్ రెట్లు అధిక పీడనం ఉంటుంది. అక్కడ ఇక నల్లని, అల్లకల్లోలమైన లోహ హైడ్రోజెన్ సముద్రం తప్ప ఇక ఏమీ ఉండదు. కాని బృహస్పతి హృదయంలో ఇనుము, రాయి కలగలిసిన కఠిన కేంద్రం ఉండి ఉండొచ్చు. అది గురువు లోతుల్లో దాగిన, అలౌకిక ఒత్తిళ్లలో నలిగిపోతున్న, భూమిని పోలిన విచిత్ర ప్రపంచం.
జూపిటర్ లోని ద్రవ లోహపు అంతరాళంలో సుళ్లు తిరిగే విద్యుత్ ప్రవాహాలే, ఆ గ్రహానికి చెందిన బ్రహ్మాండమైన అయస్కాంత క్షేత్రానికి, అందులో చిక్కుపడిపోయిన ఎలక్ట్రాన్ల, ప్రోటాన్ల సందోహాలకి, మూలం కావచ్చు. గ్రహాలు అన్నిట్లోకి జూపిటర్ అయస్కాంత క్షేత్రం అత్యంత శక్తివంతమైనది. జూపిటర్ అయస్కాంత క్షేత్రంలో ఉండే ఆ విద్యుదావేశ రేణువులు, సూర్యుడి లోనుండి, సౌరపవనాల (solar winds) రూపంలో నలుదిశలా విరజిమ్మబడినవి. వాటిలో కొన్ని జూపిటర్ అయస్కాంత క్షేత్రానికి ఆకర్షింపబడి అందులో చిక్కుకుపోవడం గాని, లేదా మరింత తీవ్రమైన త్వరణాలకి లోను కావడం గాని జరుగుతుంది. అలాంటి రేణువులు అధిక సంఖ్యలో మేఘమండలానికి పైన చిక్కుపడి, ధృవం నుండి ధృవానికి గంతులు వేస్తూ ఉంటాయి. వాతావరణానికి ఎగువ ప్రాంతాలలో ఏదో అణువుతో అవి చర్య జరిపి, ఆ అణువులో కలిసిపోయినంత వరకు ఆ వికిరిణ వలయం (radiation
belt) లోనే బందీలై సంచరిస్తూ ఉంటాయి. జూపిటర్ చుట్టూ కక్ష్యలో తిరిగే అయో, కొన్ని దశలలో ఆ గ్రహానికి చాలా దగ్గరిగా జరిగి, ఈ విద్యుదావేశ ప్రాంతాల లోంచి తోసుకుపోతుంది. అది నడిచిన బాటలో తీక్షణమైన విద్యుదావేశ ఝరులు పుడతాయి. వాటిలోంచి మహోగ్రమైన రేడియో శక్తి పుంజాలు ఉత్పన్నమవుతాయి. (ఆ పుంజాలే అయో ఉపరితలం మీద జరిగే విస్ఫోటాలని కూడా ప్రభావితం చెయ్యొచ్చు.) అయో యొక్క స్థానాన్ని కచ్చితంగా నిర్ణయించగలిగితే, భూమి మీద వాతావరణాన్ని నిర్ణయించడం కన్నా, జూపిటర్ నుండి విడుదల అయ్యే రేడియో శక్తి పుంజాలని మరింత కచ్చితంగా నిర్ణయించొచ్చు.
జూపిటర్ నుండి రేడియో ఉద్గారాలు (emissions)
పుడతాయని 1950 లలో మొట్టమొదట తెలిసింది. రేడియో ఖగోళ శాస్త్రం (radio astronomy) అప్పుడే చిగుళ్లు తొడుగుతున్న రోజులవి. బెర్నార్డ్ బర్క్, కెనెత్ ఫ్రాన్క్లిన్ అనే ఇద్దరు యువ అమెరికన్ శాస్త్రవేత్తలు, అప్పుడే నిర్మితమై, అప్పటి ప్రమాణాల బట్టి చాలా సునిశితమైన ఓ రేడియో టెలిస్కోప్ తో ఆకాశాన్ని పరిశీలిస్తున్నారు. విశ్వనేపథ్యం నుండి పుట్టే రేడియో తరంగాల కోసం వాళ్లు తమ రేడియో టెలిస్కోప్ తో అన్వేషిస్తున్నారు అవి మన సౌరమండలానికి ఆవల నున్న రేడియో మూలాలు. అలా గాలిస్తుంటే వాళ్లకి ఒక చోట ఓ తీక్షణమైన, అంతముందు కనుక్కోబడని ఓ కొత్త రేడియో మూలం దొరికింది. ఆ తరంగాలు వస్తున్న దిశలో వాళ్లకి తెలిసినంత మేరకు ఏ ప్రఖ్యాత తార గాని, నెబ్యులా గాని, గెలాక్సీ గాని లేవు. అంతేకాక సుదూర తారల నేపథ్యం మీదుగా ఆ మూలం కదులుతోంది. అది సుదూర ఖగోళ వస్తువుల కన్నా మరింత వేగంగా కదులుతోంది. సుదూర విశ్వానికి సంబంధించిన ఖగోళపటాల్లో ఆ మూలానికి చెందిన ఆచూకీ దొరక్కపోగా, ఒక రోజు ఆ శాస్త్రవేత్తలు ఇద్దరూ వాళ్ల నక్షత్ర శాల బయటికి నడిచి అలవోకగా ఆకాశం కేసి చూశారు. రేడియో తరంగాలు వస్తున్న దిశలో ఏదైనా ప్రత్యేక వస్తువు ఉందా అని పరీక్షించారు. వాళ్లు చూస్తున్న దిశలో ఓ ప్రకాశవంతమైన వస్తువు కనిపించి ఆనందం కలిగించింది. అది జూపిటర్ అని గుర్తుపట్టడానికి వాళ్లకి ఎంతో సమయం పట్టలేదు. ఇలాంటి యాదృచ్ఛిక ఆవిష్కరణలు వైజ్ఞానిక చరిత్రలో ఎన్నో సందర్భాలలో జరుగుతూ ఉంటాయి.
(ఇంకా వుంది)
0 comments