శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

హైడ్రోజెన్ – ఆక్సిజన్

Posted by శ్రీనివాస చక్రవర్తి Thursday, March 31, 2011 0 comments

ఫ్లాగిస్టాన్ సిద్ధాంతాన్ని నమ్మిన మరి ఇద్దరు రసాయన శాస్త్రవేత్తలు ఆ కాలంలో వాయువులకి సంబంధించిన మరింత ముందుకి తీసుకువెళ్లారు. వారిలో ఒకరు హెన్రీ కావెండిష్ (1731-1810). మనిషి మహా ప్రతిభావంతుడే గాని కాస్త తలతిక్క మనిషి. ఎన్నో రంగాలలో కృషి చేసినా తను కనుక్కున్న విషయాలని తనలోనే దాచుకునేవాడు. కనుక్కున్న ప్రతీ విషయాన్ని ప్రచురించేవాడు కాడు. అదృష్టవశాత్తు వాయువుల మీద తను సాధించిన ఫలితాలని మాత్రం ప్రచురించాడు.


ఆమ్లాలు కొన్ని లోహాలతో చర్య జరిపినప్పుడు పుట్టే ఒక ప్రత్యేకమైన వాయువు మీద కావెండిష్ ప్రత్యేకించి దృష్టి సారించాడు. గతంలో ఈ వాయువుని బాయిల్, హేల్స్ తదితరులు ఉత్పన్నం చేశారు. కాని 1766 లో కావెండిష్ మొట్టమొదటి సారిగా ఈ వాయువుని క్రమబద్ధంగా శోధించాడు. కనుక ఆ వాయువుని కనుక్కున్న ఘనత సామాన్యంగా ఈయనకే ఆపాదిస్తుంటారు. తదనంతరం ఆ వాయువుకి హైడ్రోజెన్ అని పేరు పెట్టారు.


ఒక నియత ఘనపరిమాణం గల వివిధ వాయువులని తీసుకుని, వాటి బరువులు కొలిచి, ఆ వాయువుల సాంద్రత కొలిచిన వారిలో ప్రథముడు కావెండిష్. హైడ్రోజెన్ చాలా తేలికైన వాయువు అని అతడు త్వరలోనే గుర్తించాడు. గాలి బరువులో దీని బరువు పదో వంతు మాత్రమేనని తెలుసుకున్నాడు. (మనకి తెలిసినంతవరకు ఇదే అన్నిటికన్నా తేలికైన వాయువు). దీనికి మరో అసాధారణమైన గుణం కూడా ఉంది. గాలికి గాని, కార్బన్ డయాక్సయిడ్ కి గాని లేని గుణం ఇది. హైడ్రోజెన్ సులభంగా భగ్గుమంటుంది. అంత తేలిగ్గా ఉంటూ, అంత సులభంగా నిప్పంటుకునే ఈ వాయువే అసలు ఫ్లాగిస్టాన్ అయ్యుండచ్చని కావెండిష్ సందేహించాడు.

ఇక ఆ రెండవ రసాయనికుడి పేరు జోసెఫ్ ప్రీస్లీ (1733-1804). ఇతడు యూనిటేరియానిజమ్ అనే ఓ క్రైస్తవ శాఖలో మతబోధకుడుగా పనిచేసేవాడు. రసాయన శాస్త్రం కేవలం ఇతడికో హాబీ మాత్రమే.


1760 లలో ఇతగాడు ఇంగ్లండ్ లో లీడ్స్ నగరంలో పాస్టర్ గా పని చేసేవాడు. అతడు పని చేసే చర్చి పక్కనే ఓ మద్యకర్మాగారం ఉండేది. మద్యాన్ని తయారుచేసేందుకు గాని గింజలని నానబెట్టి పులియబెట్టాలి. ఆ చర్యలో కార్బన్ డయాక్సయిడ్ ఉత్పన్నం అవుతుంది. అలా పెద్ద మొత్తాల్లో ఉత్పన్నం అయ్యే కార్బన్ డయాక్సయిడ్ ని ప్రీస్లీ తన ప్రయోగాలకి వాడుకునేవాడు. అలా ఉత్పన్నం అయ్యే కార్బన్ డయాక్సయిడ్ ని ప్రీస్లీ నీటి మీదుగా గ్రహించేవాడు. అలా నీటి మీదుగా గ్రహించబడ్డ కార్బన్ డయాక్సయిడ్ లో కొంత భాగం నీట్లో కరుగుతోందని గమనించాడు ప్రీస్లీ. ఆ నీటికి ఘాటైన, కటువైన రుచి ఉండడం గమనించాడు. ఆ నీటినే మనం “సోడా” అంటాము. ఆ పానీయానికి కొంచెం తీపి, కొన్ని కృత్రిమ రుచులు కలిపితే వచ్చేదే మనందరికీ తెలిసిన “సాఫ్ట్ డ్రింక్” . కనుక ఆధునిక సాఫ్ట్ డ్రింక్ పరిశ్రమకి జోసెఫ్ ప్రీస్లీ మూలకర్త అని భావించవచ్చు. (సశేషం…)

ఎగిరే విహంగాల విజ్ఞానం

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, March 29, 2011 0 comments

నిన్న ఆంధ్రభూమిలో ప్రచురించబడ్డ వ్యాసం

http://www.andhrabhoomi.net/intelligent/egere-vehangalu-201

జె.సి.బోస్ జీవితం – కొత్త పుస్తకం

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, March 27, 2011 0 comments
వివరాల కోసం:
Manchipustakam.in

ఇట్లు ప్రేమతో, మీ కంప్యూటర్

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, March 22, 2011 0 commentsనిన్న ఆంధ్రభూమిలో అచ్చయిన వ్యాసం -

http://www.andhrabhoomi.net/intelligent/computer-075

సృజనాత్మకత, అభినివేశం మొదలైన మానసిక లక్షణాల ప్రమేయం లేకుండా ఇచ్చిన ఆదేశాలని తుచ తప్పకుండా అనుసరిస్తూ, ఆ క్రియలని మానవసాధ్యం కానంత వేగంతో, స్థాయిలో అమలుచేస్తూ, వర్తమాన ప్రపంచంలో కంప్యూటర్ మనిషికి చేదోడువాదోడుగా ఉంటోంది. అయితే ఇచ్చిన పనినే కేవలం స్వామిభక్తితో చెయ్యకుండా, కంప్యూటర్ కి దానికంటూ ఒక బుద్ధి, వివేచన, మనసు ఉండి స్వతంత్రంగా వ్యవహరిస్తే ఏమవుతుంది? అన్న ప్రశ్న ఎంతో మందిని ఆలోచింపజేసింది. అలాంటి కంప్యూటర్లు కాల్పనిక వైజ్ఞానిక సాహిత్యంలో ఎన్నో చోట్ల కనిపిస్తాయి. స్టాన్లీ కుబ్రిక్ దర్శకత్వంలో సినిమాగా రూపుదిద్దుకున్న ఆర్థర్ క్లార్క్ నవల “2001: ఎ స్పేస్ ఒడిసీ’ అనే చిత్రంలో ఓ వ్యోమనౌకలో వ్యవహారాలని నిర్వహించే హాల్ 9000 అనే కంప్యూటర్ భావావేశాలని వ్యక్తం చెయ్యడం మొదలెడుతుంది. దాని సామర్థ్యాలని పొగిడినప్పుడు దాని “గొంతు” లో సంతోషం, గర్వం తొణికిసలాడతాయి. అవతలి వారి మాటతీరు బట్టి వారు కోపంగా ఉన్నారో, సంతోషంగా ఉన్నారో గుర్తుపట్ట గలుగుతుంది. అది చూసి బెంబేలెత్తిన సిబ్బంది దాన్ని డిస్కనెక్ట్ చెయ్యాలని ప్రయత్నిస్తారు. అది నచ్చని హాల్ ప్రణాళికాబద్ధంగా నౌక సిబ్బందిలో ఒక్కొక్కర్నీ వరుసగా “హత్య” చేస్తుంది.

తెలివితేటలు అంటే మరీ ఇలాంటి “చావు” తెలివితేటలు కాదు గాని, కాస్త మన మనసు తెలిసి, సమయస్ఫూర్తి కలిగి, “కార్యేషు దాసీ...” అన్నట్టు మరింత ’పర్సనల్’ గా కంప్యూటర్లు మసలుకోగలిగితే బావుంటుందన్న ఆలోచన కొంత కాలంగా కంప్యూటర్ నిర్మాతల మనసుల్లో మెదులుతోంది. ఆ ఊహే భావావేశపు కంప్యూటింగ్ (affective computing) అనే ఓ కొత్త పరిశోధనా రంగంగా వికాసం చెందుతోంది. ఎం.ఐ.టి. కి చెందిన రోసలిండ్ పికార్ద్ వంటి వారు ఈ రంగంలో పురోగాములు. అసలైనా కంప్యూటర్ కి భావావేశాలు ఎందుకు? కేవలం తార్కికంగా, సమాచారాన్ని విశ్లేషిస్తూ, ఒక విధమైన యాంత్రికమైన హేతుశక్తిని కబరిస్తే చాలదా? మామూలుగా వివేచనకి, భావావేశాలకి చుక్కెదురు అనుకుంటాం గాని నాడీ శాస్త్రానికి చెందిన నిపుణులు భావావేశానికి, వివేచనకి మధ్య ఓ కీలకమైన సంబంధం ఉంటుంది అంటున్నారు. కేవలం వివేచన మీద ఆధారపడితే జీవితంలో ఎన్నో సమస్యాత్మక సందర్భాలలో శతకోటి మార్గాంతరాలు కనిపించి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. తార్కికంగా ఆ మార్గాంతరాలు అన్నిటినీ ఒక్కొటొక్కటిగా విశ్లేషించి అత్యుత్తమ మార్గాన్ని ఎన్నుకోవాలని బయల్దేరితే పుణ్యకాలం తీరిపోతుంది. అలాంటప్పుడు హృదయం, భావావేశాలు ఒక దిశలో మొగ్గుచూపి, కార్యాచరణలో వేగంగా ముందుకి తోస్తాయి. అందుకే మనిషి మెదడులో భావావేశాలని అన్వయించి, నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే ప్రీఫ్రాంటల్ ప్రాంతం దెబ్బ తింటే, భావావేశాలు చప్పబడిపోవడంతో పాటు, వేగంగా నిర్ణయాలు తీసుకోలేని అశక్తత చోటు చేసుకుంటుంది. ఆ విధంగా హేతు శక్తి సమర్థవంతంగా పనిచెయ్యడానికి (తగు మోతాదులో) భవావేశాలు ఎంత అవసరమో మేటి నాడీ శాస్త్రవేత్త ఆంటోనియో డమాసియో తన రచనల్లో విపులీకరిస్తాడు.

భావావేశాలు కలిగి ఉండడం, వ్యక్తం చెయ్యడమే కాదు, అవతలి వారిలో భావావేశాలు గుర్తించగలగడం కూడా మానవ సంబంధాలకి గొప్ప బలాన్నిస్తుంది. మరి కంప్యూటర్ మనిషిలోని భావావేశాలని ఎలా గుర్తిస్తుంది? మనం ఎలా గుర్తిస్తామో, అదీ అంతే! మనిషి ముఖకవళికలని కెమేరాలో పట్టి బంధించి, ఆ చిత్రాల విశ్లేషణ బట్టి మనిషి యొక్క మానసిక స్థితి గురించి కంప్యూటర్ తెలుసుకోగలుగుతుంది. అలాగే స్వరం బట్టి కూడా ఎంతో తెలుస్తుంది. గాద్గదిక స్వరం, జీరవోయిన గొంతు – వీటి బట్టి అవతలివాడు బాధలో ఉన్నాడని తెలుసుకోవడం కష్టం కాదు. చేతి ముద్రలు, హావభావాలు, శరీరం యొక్క భంగిమ – వీటి బట్టి కూడా కంప్యూటర్ ఎంతో సమాచారం రాబట్టగలదు. ఇవి కాకుండా ఈ.సీ.జీ., శ్వాస లయ, చర్మం యొక్క నిరోధకత మొదలైవి కూడా భావావేశ నిర్ణయంలో వినియోగించబడతాయి. ఈ వివిధ సమాచార స్రవంతులని వేరువేరుగా కాకుండా, అన్నిటినీ మేళవించి మరింత కచ్చితంగా భావావేశాన్ని బేరీజు వేసుకోవడానికి వీలుంటుంది.

ఇలాంటి భావావేశపు కంప్యూటర్లు భవిష్యత్తులో మన జీవితంలో ఎలాంటి పాత్ర ధరిస్తాయో సులభంగా ఊహించుకోవచ్చు. ఓ రోజు రాత్రి ఆలస్యంగా ఇంటొకొచ్చిన ప్రసాద్ కి ఇలాంటి ఓ మనసున్న కంప్యూటర్ పెట్టిన ఉత్తరం: “మీరు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యుంటుంది. అమ్మగారు పిల్లలు పదింటికి పడుకున్నారు. మీ భోజనం ఫ్రిడ్జ్ లో ఉంది. మైక్రోవేవ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉదయానే ఐదింటికి కాల్ టాక్సీ చెప్పాను. ట్రిప్ ఐడి మోబైల్ లో ఉంటుంది చూసుకోండి. రేపు వర్షం పడొచ్చు. గొడుగు తీసుకెళ్ళండి. ఇవాళ పనెక్కువ కావడంతో అలిసిపోయి పదకొండు నలభై రెండు నిముషాలకి షట్ డౌన్ అవుతున్నాను. లేకపోతే మీరు వచ్చే వరకు మేలుకుని ఉండాలనే అనుకున్నాను. ఏమీ అనుకోరు కదూ... ప్రేమతో, ఇట్లు, మీ కంప్యూటర్.”

జపనీస్ జాతీ! నీకు జోహార్లు!

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, March 20, 2011 18 comments

ప్రస్తుతం జపాన్ దేశం పడుతున నరక యాతన చూస్తే బాధ కలుగుతుంది. అంత సున్నితమైన, అందమైన జాతికి ఇలాంటి అధోగతి పట్టడం అన్యాయం అనిపిస్తుంది.

గత రెండేళ్లలో రెండు సార్లు జపాన్ ని సందర్శించే అవకాశం కలిగింది. మొత్తం మూడు నెలల మకాం. ఇండియాలో ఎప్పుడూ మన బాహ్య వ్యవహారాలు, మన ప్రజా వ్యవస్థలు ఎందుకంత గందరగోళంగా ఉంటాయి? ఎందుకు అంత తరచు విఫలం అవుతూ ఉంటాయి? ఇంత జనాభా ఉంటే మరి ఇలాగే ఉంటుందేమో అని సరిపెట్టుకుంటూ ఉంటాను. కాని జపాన్ ని చూశాక ఆ అభిప్రాయం తప్పని అర్థమయ్యింది. అది కేవలం ఓ కుంటిసాకని తెలిసింది. జనాభా సాంద్రత చూస్తే జపాన్ లో చదరపు కి.మీ.కి 336, మన దేశంలో చదరపు కి.మీ. కి 324 (2001 నాటి సమాచారం). మనకి ఉన్నంత భూభాగం కాని, సహజ వనరులు కాని వారికి లేవు. మరి ఎందుకంత తేడా?

ఎప్పుడూ మారని మర్యాద, సంస్కారం, సున్నితమైన సనాగరికమైన ప్రవర్తన – ఇవి జపనీస్ లో సర్వత్ర కనిపించే లక్షణాలు. నేను ఉన్నంత కాలంలో ఎప్పుడూ ఇద్దరు ఒకరి మీద ఒకరు అరచుకోవడం గాని, కోపంగా మాట్లాడడం గాని, అసలు గట్టిగా మాట్లాడడం గాని చూడలేదు. సందు చివర గ్రోసరీ స్టోర్ వాడు కూడా అంగడి లోకి ఎవరైన అడుగుపెట్టడం చూడగానే తల ఊచి (జపనీస్ లో!) స్వాగతం చెప్తాడు. టాక్సీ వాడు మిగిలిన చిల్లర ఉంచుకోమంటే మర్యాదగా నవ్వి యెన్నులతో (ఒక యెన్ = సుమారు అర్థరూపాయి) పాటు తిరిగి ఇచ్చేస్తాడు.

అర్థ రాత్రి పూట పెద్దగా జన సంచారం లేని చోట్ల స్త్రీలు ఒంటరిగా నడిచి వెళ్లడం చూశాను. అభివృద్ధి చెందిన దేశాలలో అతితక్కువ ‘క్రైమ్ రేట్’ ఉన్న దేశం మరి. నేను వెళ్ళిన కొత్తల్లో మా ల్యాబ్ మేట్ ని అడిగాను – “రాత్రి పూట ఒంటరిగా తిరగడం క్షేమమేనా?” అని. ఆ ప్రశ్న అర్థం కానట్టు నాకేసి విస్తుపోయి చూశాడు.


జపనీస్ యొక్క నిర్వహణా కౌశల్యానికి వాళ్ల రైల్వేలు చక్కని నిదర్శనం. ముఖ్యంగా రష్ అవర్ లో మెట్రో స్టేషన్లు విపరీతంగా రద్దీగా ఉంటాయి. స్టేషన్లో రైలు ఆగక ముందే ప్లాట్ ఫామ్ మీద, కొన్ని నిర్దిష్ట స్థానాల వద్ద క్యూలు కడతారు. కంపార్ట్ మెంట్ తలుపు సరిగ్గా ఆ స్థానాల వద్దే ఆగుతాయి. తలుపులు తెరుచుకోగానే ముందు లోపల ఉన్న వారు బయటికి వస్తారు. అందరూ పూర్తిగా బయటికి వచ్చాకనే బయట ఉన్న వాళ్లు సాఫీగా లోపలికి ప్రవహిస్తారు. ఎప్పుడూ తోపుడు, తొక్కిసలాట వంటివి చూడలేదు. ఇలాంటి సందర్భాల్లో వాళ్లు సమిష్టిగా కదిలే తీరు చూస్తే ఫ్లూయిడ్ మెకానిక్స్ లో లామినర్ ఫ్లో గుర్తొస్తుంది.

ఇక రైళ్ళ సమయ పాలన సంగతి అందరికీ తెలిసిందే. 9:28 రైలు రావాలంటే, గడియారం 9:27 చూపించేసరికే ప్లాట్ ఫామ్ కి అల్లంత దూరంలో రైలు కనిపిస్తుంది. బాగా దూరాలు వెళ్లే రైళ్ల ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకే రూట్ లో ప్రయాణించే షింకాన్సెన్ (బులెట్ ట్రెయిన్) కూడా సుమారు అరగంటకి ఒకటి నడుస్తుంటుంది. చిన్న స్టేషన్లలో ఆగకుండా 300 kmph వేగంతో తెల్లని మెరుపుతీగలా దూసుకుపోయే నొజోమీ క్లాస్ షింకాన్సెన్ ధాటిని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ప్రభుత్వ రైల్వే సంస్థ అయిన జపాన్ రైల్వేస్ (జె.ఆర్.) కాకుండా లెక్కలేనన్ని ప్రయివేట్ లైన్లు పని చేస్తాయి. అంత చిన్న భూభాగం, అంత జన సాంద్రత గల దేశంలో అంత సంక్లిష్టమైన రైల్వే నెట్వర్క్ లేకపోతే జీవితం దుర్భరం కావచ్చు. అందుకే అంత మంది జీవితాలు సాఫీగా సాగేలా అత్యంత సంక్లిష్టమైన, అధునాతనమైన వ్యవస్థని నిర్మించి సమర్థవంతంగా నడుపుకుంటున్న ఆ జాతి మీద ప్రకృతి ఇలా దెబ్బ కొట్టడం అన్యాయం అనిపిస్తుంది.

అక్కడ సిక్యూరిటీ గార్డులు, హోటల్ వెయిటర్లు - ఇలా చిన్నచిన్న పనులలో ఎన్నోసార్లు ముసలివాళ్లు కనిపిస్తారు. నేను పని చేసిన సంస్థకి ఎంట్రన్స్ వద్ద ఒక సెక్యూరిటీ గార్డుగా ఓ పెద్దాయన నించుని కనిపించేవాడు. చేతిలో చిన్న దండంతో కాంపౌండ్ లోకి వచ్చేపోయే వాహనాలకి దారి చూపిస్తుంటాడు. (నిజానికి అక్కడ పెద్దగా రద్దీ ఉండదు. కాని అది అతడి కర్తవ్యం అని చేస్తాడు). ఆ దారిని నడిచివెళ్లే వాళ్లని మర్యాదగా పలకరిస్తాడు. ఎవరైనా కొత్త మొహం కనిపిస్తే మర్యాదగా చిరునవ్వుతో వారి ఐ.డి. కార్డ్ చూపించమంటాడు. వర్షం పడుతున్నా లోపల కేబిన్ లోకి వెళ్లి కూర్చోడు. రెయిన్ కోటూ, హాటు వేసుకుని బయటే నించుని తన పని యథావిధిగా చేసుకుపోతుంటాడు. పోనీ తను చేస్తున్న పని అంత కీలకమైన పని కూడా కాదు. మధ్యలో మానేసి ఓ గంట “టీ తాగడానికి” వెళ్ళిపోయినా కొంపలేం అంటుకుపోవు. కాని పని చిన్నదైనా, పెద్దదైనా కర్తవ్యం తుచ తప్పకుండా నిర్వర్తించాల్సిందే. అది జపనీస్ పద్ధతి.


ఆ దేశాన్ని చూడడానికి వెళ్లే సందర్శకులకి కలిగే ఒక ముఖ్యమైన ఇబ్బంది భాష. వ్యవహారాలన్నీ జపనీస్ లోనే జరుగుతాయి. ఇంగ్లీష్ తెలిసిన వాళ్లు అరుదుగా కనిపిస్తారు. కాని సందర్శకుల సంగతి పక్కన పెడితే మాతృభాషలోనే పనులన్నీ జరగడం వల్ల దేశానికి ఎంత మేలో అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. బయట సైన్ బోర్డులు అన్నీ జపనీస్ లోనే ఉంటాయి. మెడిసిన్ లో సూపర్ స్పెషాలిటీల స్థాయిలో కూడా బోధన జపనీస్ లోనే ఉంటుందంటే, ఆధునిక అవసరాల దృష్ట్యా ఆ భాష ఏ స్థాయి వరకు అభివృద్ధి చెందిందో ఊహించుకోవచ్చు. (నూరేళ్ల క్రితమే వాళ్ల పూర్వీకులు సైన్సు విలువ తెలిసి వైజ్ఞానిక పరిభాష అంతటినీ జపనీస్ లో తర్జుమా చేసుకున్నారని ఓ జపనీస్ మిత్రుడు చెప్పాడు.) అక్కడ కూడా ప్రతీ నూరు మైళ్ళకి మాండలికం మారిపోతుందట. కాని దేశం అంతా ఒక ప్రామాణిక జపనీస్ ని వినియోగిస్తుంది. వ్యవహారాలన్నీ ఏకైక భాష మీదుగా నడిచే దేశంలో అక్షరాస్యత 99% ఉందంటే మరి ఆశ్చర్యం లేదు.

వైజ్ఞానిక, పరిశోధనా రంగంలో కూడా వాళ్ల పని తీరు విశేషంగా ఉంటుంది అంటాడు నేను పని చేసిన సంస్థలోనే కొన్నేళ్ల పాటు పని చేస్తున్న ఓ ఇండియన్ మిత్రుడు. ఉద్యోగులు ఉదయానే తొమ్మిదికి వస్తారు, సాయంత్రం ఐదున్నర ఆరు కల్లా ఇంటికెళ్లిపోతారు. కాని చేసే పనిని మాత్రం ప్రణాళికాబద్ధంగా, కాలయాపన లేకుండా, సమిష్టిగా చేసుకుంటారు. ఏదో జీతాల కోసం అన్నట్టు కాక, సహజమైన ఆసక్తితో, స్ఫూర్తితో పరిశోధనా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతిభలో, తెలివితేటల్లో వారిలో నిమ్నోన్నతలు కనిపించొచ్చు. కాని పని పట్ల శ్రద్ధలో మాత్రం రవంత అయినా వెలితి ఉండదు. కనుక ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నేచర్, సైన్స్ మొదలైన ప్రఖ్యాత పత్రికలలో వారి ఫలితాలు తరచు అచ్చు అవుతుంటాయి. అలాంటి సంస్థలు జపాన్ లో ఎన్నో. కాని అలాంటి సంస్థ మన దేశంలో ఒక్కటి కూడా లేదు.

ఏ దేశంలో అయినా గొప్ప వ్యక్తిత్వం, సంస్కారం గల వ్యక్తులు ఎంతో మంది ఉంటారు. కాని ఇంచుమించు ఒక దేశప్రజ మొత్తం అలాంటి లక్షణాలని సమానంగా వ్యక్తం చెయ్యడం… అదసలు అసాధ్యం అనిపిస్తుంది. కాని జపనీస్ ని చూస్తే సాధ్యం అని ఒప్పుకోక తప్పదు. ముఖ్యంగా ప్రస్తుత దయనీయ పరిస్థితుల్లో వాళ్లు మసలు కుంటున్న తీరుని యావత్ ప్రపంచం టీవీలో చూసి ఆశ్చర్యపోతోంది. బారైన క్యూలలో ఆహారం కోసం, మంచి నీటి కోసం గంటల తరబడి ఓపిగ్గా నించుంటారు. (మన దేశంలో అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆహారం పంపకం అప్పుడు జరిగే తొక్కిసలాటలోనే జనం చచ్చిపోతారు.) క్యూలో మనిషికి మనిషికి మధ్య బోలెడంత ఎడం కనిపిస్తుంది. ఎవడో ధూర్తుడు దూరుతాడన్న సందేహం కూడా ఎవరికీ రాదు. నాలుగు లక్షల పైగా జనం సంక్షేమ శిబిరాలలో ఉంటున్నారు. మాసినబట్టలతో, చాలీచాలని ఆహారంతో స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అలా శిబిరాలలో గడపడం ఆత్మగౌరవానికి ఎంతో విలువిచ్చే ఆ సమాజానికి నిజంగా నరకయాతనే.

ఒక పక్క సాంప్రదాయనిబద్ధతని, మరో పక్క ఆధునికతని అద్భుతంగా మేళవించుకున్న సంస్కృతి జపనీస్ ది. ఇరవై ఒకటవ శతాబ్దపు సమాజాలు సాధించవలసిన అపురూపమైన సాంస్కృతిక సమ్మేళనానికి అద్దం పట్టే అరుదైన సమాజం అది. వారి ఈ యాతన త్వరలోనే అంతం కావాలని మనసారా కాంక్షిద్దాం. నిన్న మొన్నటి వరకు ఉన్న వైభవం, సుఖశాంతులు త్వరలోనే మళ్లీ రావాలని కోరుకుందాం.

నైట్రోజెన్ ని కనుక్కున్న రూథర్ ఫర్డ్

Posted by శ్రీనివాస చక్రవర్తి Friday, March 18, 2011 0 comments

కార్బన్ డయాక్సయిడ్ తో తన ప్రయోగాలు కొనసాగించాడు బ్లాక్. కొవ్వొత్తి కార్బన్ డయాక్సయిడ్ లో మండదని మొదట కనుక్కున్నాడు. మూసిన పాత్రలో మండే కొవ్వొత్తిని ఉంచితే అది కాసేపు అయ్యాక ఆరిపోతుంది. ఆ తరువాత పాత్రలో మిగిలిన గాలి జ్వలన క్రియని పోషించలేకపోతుంది. జ్వలనం వల్ల ఏర్పడ్డ కార్బన్ డయాక్సయిడే దానికి కారణం అన్నట్టు అనిపించింది. అయితే పాత్రలో మిగిలిన గాలి నుండి రసాయనాల సహాయంతో కార్బన్ డయాక్సయిడ్ ని తొలగించినా కూడా కొంత గాలి మిగిలిపోవడం కనిపించింది. కార్బన్ డయాక్సయిడ్ ని తొలగించినా మిగిలిన వాయువు కూడా జ్వలనాన్ని పోషించదని అర్థమయ్యింది.

ఈ కొత్త సమస్యని ఎలా ఛేదించాలో అర్థంగాని బ్లాక్ దాన్ని తన శిష్యుడైన స్కాటిష్ రసాయనికుడు డేనియల్ రూథర్ ఫర్డ్ కి (1742-1819) సమస్యని అప్పజెప్పాడు. మూసిన పాత్రలో ఉంచిన ఎలుక కాసేపయ్యాక ప్రాణాలు విడుస్తుందని గమనించాడు. ఎలుక మరణించిన పాత్రలో కొవ్వొత్తిని మండించి, దాన్ని వీలైనంత వరకు మండనిచ్చాడు. అలా మిగిలిన గాలిలో ఫాస్ఫరస్ ని కూడా సాధ్యమైనంతవరకు మండనిచ్చాడు. ఇంకా పాత్రలో మిగిలిన గాలిని కార్బన్ డయాక్సయిడ్ ని పీల్చుకునే ద్రావకం లోంచి పోనిచ్చాడు. ఇన్ని సంస్కారాలు చేశాక మిగిలిన గాలి కూడా జ్వలనక్రియని పోషించలేకపోయింది. అందులో కూడా ఎలుక బతకలేక పోయింది. కొవ్వొత్తి మండలేకపోయింది.

1772 లో రూథర్ ఫర్డ్ తన ప్రయోగ ఫలితాలని ప్రకటించాడు. రూథర్ ఫర్డ్ కూడా, బ్లాక్ లాగానే ఫ్లాగిస్టాన్ సిద్ధాంతాన్ని గుడ్డిగా నమ్మేవాడు. కనుక ఇద్దరూ ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి తమ ప్రయోగాలని వివరించడానికి ప్రయత్నించారు. ఎలుకలు ఊపిరి తీసుకుంటున్నప్పుడు, కొవ్వొత్తి వెలుగుతునప్పుడు, ఫాస్ఫరస్ మండుతున్నప్పుడు, ఏర్పడే కార్బన్ డయాక్సయిడ్ తో పాటు కొంత ఫ్లాగిస్టాన్ కూడా వెలువడుతుంది. తదనంతరం కార్బన్ డయాక్సయిడ్ తొలగించబడ్డా మిగిలిన గాలిలో ఎంతో ఫ్లాగిస్టాన్ ఉండిపోతుంది. నిజానికి అందులో ఎంత ఫ్లాగిస్టాన్ ఉంటుందంటే, అది మరింత ఫ్లాగిస్టాన్ ని స్వీకరించలేకపోతుంది. (అది ఫ్లాగిస్టాన్ తో సంతృప్తం (saturate) అయిపోతుంది). అందుకే అందులో ఒక దశ తరువాత వస్తువులు మండలేకపోతాయి.

అలా మిగిలిన గాలికి రూథర్ ఫర్డ్ “ఫ్లాగిస్టికీకృత గాలి” అని పేరు పెట్టాడు. ఆ గాలినే ప్రస్తుతం మనం నైట్రోజెన్ అంటాం. ఆ గాలిని కనుక్కున్న ఘనత రూథర్ ఫర్డ్ కిస్తున్నాం.

(సశేషం…)

ఐన్‌స్టీన్ మెదడు రహస్యం

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, March 16, 2011 0 comments

మొన్న సోమవారం ఆంధ్రభూమిలో అచ్చయిన వ్యాసం యొక్క లింక్


http://www.andhrabhoomi.net/intelligent/einstein-medadu-rahasyam-151

వ్యాసం

ఐన్స్టయిన్ మెదడు రహస్యం

“నా మనవడు కిందటి జన్మలో ఏ ఈనిస్టోనో అయ్యుంటాడు.” మోకాళ్ళ మీద లెక్కల పుస్తకం వేసుకుని బొమ్మలా కూర్చున్న ఐదేళ్ల బాబిగాణ్ణి చూసి మురిపెంగా అంది రాంబాయమ్మ. (“అందుకే కాబోలు ఎప్పుడూ పక్కింటి ’కాంతి’ తో ఆడుకుంటూ ఉంటాడు,” ఆ చదువు ఏపాటిదో తెలిసిన తండ్రి గోపాళం మనసులోనే అనుకున్నాడు.)

తెలివితేటలు అనగానే ఐన్స్టయినే (మార్చ్ 14, 1879-ఏప్రిల్ 18, 1955) గుర్తొస్తాడు. ఇరవయ్యవ శతాబ్దంలో వైజ్ఞానిక రంగంలో మానవత సాధించిన ప్రగతి మొత్తానికి ప్రతినిధిగా నిలవగల ఒక్క పేరును ఎన్నుకోవాల్సి వస్తే ఐన్స్టయినే ముందుంటాడేమో. ఒక్క మనిషిలో అంత ప్రతిభ, అన్ని తెలివితేటలు ఉండడం ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోగోరిన కొందరు శాస్త్రవేత్తలు ఏకంగా ఆయన మీదే పరిశోధనలు చేశారు. ఉండగా చెయ్యనివ్వడు కనుక, ఆయన పోయాక ఆయన మెదడు మీద నానా రకాల పరిశీలనలు జరిపారు... ఆయన ’మనసులోని మర్మం’ తెలుసుకుందామని.


ఐన్స్టయిన్ మరణానంతరం, ఆయన పరివారం అనుమతితో, థామస్ హార్వే అనే పెథాలజిస్టు, పోస్ట్ మార్టెమ్ చేసి శరీరం లోంచి మెదడుని తొలగించాడు. మెదడుకి రక్తసరఫరా చేసే కెరాటిడ్ ధమనుల లోంచి 10% ఫార్మలిన్ ద్రావకాన్ని పోనిచ్చి సుతిమెత్తగా ఉండే మెదడుకి కొంత దారుఢ్యం కలిగేలా చేశాడు. అప్పుడా మెదడుని నానా కోణాల నుండి ఫోటోలు తీసి, రమారమి 1cc ఘనపరిమాణపు ముక్కలుగా కోసి, సెల్లాయిడిన్ అనే మైనం లాంటి పదార్థంలో ఆ ముక్కలని భద్రపరిచాడు.

ఐన్స్టయిన్ మెదడు మీద జరిగిన పరిశోధనల సారాంశం గురించి చెప్పుకోవాలంటే, ముందు మెదడు లోని ముఖ్య ప్రాంతాల గురించి, కొన్ని ముఖ్యమైన కొండగుర్తుల గురించి చెప్పుకోవాలి. మెదడు కుడి ఎడమగా రెండు అర్థగోళాలుగా విభజించబడి ఉంటుంది. ఒక్కొక్క అర్థగోళం నాలుగు ముఖ్యమైన ప్రాంతాలుగా విభజించబడి ఉంటుంది. అవి – ఫ్రాంటల్, పెరైటల్, టెంపొరల్, ఆక్సిపిటల్ ప్రాంతాలు (చిత్రం). ఇప్పుడు అధ్యయనాల సంగతి చూద్దాం.


1999 లో కెనడాలో మక్ మాస్టర్ యూనివర్సిటీకి చెందిన సాంద్రా విటిల్సన్ యొక్క బృందం కొన్ని అధ్యయనాలు చేసింది. ఐన్స్టయిన్ మెదడు ఫోటోలని బాగా ఎగాదిగా చూసిన ఈ బృందం అతడి మెదడులోని పెరైటల్ ప్రాంతం సగటు మెదళ్లలో కన్నా 15% పెద్దదిగా ఉందని గమనించారు. ముఖ్యంగా ఎడమ అర్థగోళంలోని దిగువ పెరైటల్ ప్రాంతమే మనం చూసే, వినే, తాకే భాగోతం అంతటినీ పోగేసి, ఆ సమాచారాన్ని కాచి వడబోసి, అందులోంచి భాషా సంబంధమైన ఉన్నత భావనలని వెలికి తీస్తుంది. ఆ ప్రాంతం మరి ఐన్స్టయిన్ మెదడులో విస్తరించి ఉండడం విశేషమే. కాని భారీగా ఉంటుందనుకున్న ఆ మహామేధావి మెదడు కేవలం 1230 gms బరువుతో సగటు మెదడు కన్నా ఓ పిసరు తక్కువే ఉండడం పరిశోధనా బృందాన్ని కొంచెం నిరుత్సాహ పరిచింది.

తదనంతరం ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ లోని డీన్ ఫాక్ అనే ఆంత్రపాలజిస్ట్ బృందం చేసిన పరిశోధనల్లో కూడా ఐన్స్టయిన్ మెదడులో పెరైటల్ ప్రాంతం విస్తరించి ఉండడం నిర్ధారించబడింది. నామరూపాత్మకమైన జగతిలో నామం, అంటే భాష, కన్నా రూపాన్ని అర్థం చేసుకోవడంలో పెరైటల్ ప్రాంతం దిట్ట. భాషా శబ్దాలు, సమీకరణాలు కాకుండా, ఎక్కువగా ఆకృతులే ఐన్స్టయిన్ ఊహాశక్తికి ఇంధనంగా పనిచేసేవని అంటారు. కనుక ఈ పెరైటల్ ప్రాధాన్యత కాస్త అర్థవంతంగానే కనిపిస్తోంది.

యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కిలీ, కి చెందిన మారియేన్ డైమండ్ అనే ప్రొఫెసర్ బృందం చేసిన అధ్యయనాలలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఐన్స్టయిన్ మెదడులోని దిగువ పెరైటల్ ప్రాంతంలో గ్లయల్ కణాలు అనబడే కణాలు, సగటు మెదడులో కన్నా కాస్త ఎక్కువగా ఉన్నాయట. మెదడు క్రియలలో ముఖ్య పాత్రధారులైన న్యూరాన్ కణాలకి కేవలం ఆసరాగా ఈ గ్లయల్ కణాలు పనిచేస్తాయని ఎంతో కాలంగా అనుకునేవారు. ఇటీవల కాలంలో వీటిలోనూ విద్యుత్ చలనాలు ఉన్నాయని, వీటికీ న్యూరాన్ల రసాయనిక సందేశాలని అర్థం చేసుకునే సామర్థ్యం ఉందని, వీటికీ బాహ్యప్రేరణలకి స్పందించే గుణం ఉందని తెలిశాక వీటి తాహతు బాగా పెరిగింది.

మొత్తం మీద ఐన్స్టయిన్ మెదడుకి, మనబోటి వాళ్ల మెదళ్లకి మధ్య తేడాలయితే ఉన్నాయి గాని అవంత సంచలనాత్మకంగా లేకపోవడం మనకి స్ఫూర్తిదాయకంగా ఉండొచ్చు గాని, పరిశోధకులకి కాస్త నిరుత్సాహకరంగానే ఉంది. దానికి కారణం తెలివితేటల రహస్యాలు మృత మెదళ్ళలో కనిపించే అవకాశం తక్కువ. తెలివితేటలు అనేవి మెదడులోని “సాఫ్ట్ వేర్” (నాడీ కణాలలోని విద్యుత్ చలనాలు, నాడీ కణాల మధ్య కనెక్షన్ల విన్యాసాలు మొ||) కి సంబంధించినవి గాని, “హార్డ్ వేర్” (భారం, రూపం, బాహ్య విశేషాలు మొ||) కి సంబంధించినవి కాకపోవచ్చు. చేతిరేఖలు చూసి జాతకం చెప్పినట్టు, మెదడు ఉపరితల విశేషాలు చూసి మనిషి గుణగణాలు చెప్పడం కాస్త ప్రమాదకరమైన వ్యవహారం. ఆ విధంగా ఐన్స్టయిన్ మెదడు మీద పరిశోధనల వల్ల, తెలివితేటలకి సంబంధించిన మెదడు లక్షణాలు ఏవో పెద్దగా తెలియకపోయినా, ఏవి కావు అన్న విషయం మీద కొంత అవగాహన పెరిగింది. సంతోషం.

జోసెఫ్ బ్లాక్ పరిశీలనలు

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, March 13, 2011 0 comments

ఈ దిశలో మరో అడుగు ముందుకు వెళ్లినవాడు జోసెఫ్ బ్లాక్ (1728-99) అనే స్కాటిష్ రసాయనికుడు. 1754 లో అతడు వైద్యంలో పట్టం పుచ్చుకునేందుకు గాను ఒక థీసిస్ వ్రాశాడు. ఒక రసాయనిక సమస్యని ఆ థీసిస్ లో అంశంగా తీసుకున్నాడు. (ఖనిజవిజ్ఞానం, వైద్యం బాగా సన్నిహితంగా ఉండే రోజులవి). 1756 లో అతడు తన పరిశీలనలని ప్రచురించాడు. బ్లాక్ సున్నపురాయిని (limestone, calcium carbonate) తీసుకుని దాన్ని బాగా వేడి చేశాడు. దాంతో కార్బనేట్ విభేదన చెంది ఏదో వాయువును వెలువరించింది. సున్నం (calcium oxide) మాత్రం మిగిలింది. అలా వెలువడ్డ వాయువుని మళ్లీ కాల్షియమ్ ఆక్సయిడ్ తో కలిపితే మళ్లీ కాల్షియమ్ కార్బనేట్ తయారయ్యింది. ఆ వాయువే కార్బన్ డయాక్సయిడ్. ఫాన్ హెల్మాంట్ కనుక్కున్న “గ్యాస్ సిల్వెస్టర్” కూడా ఇదే. కాని ఆ సంగతి బ్లాక్ కి తెలీదు. అందుకే దాన్ని “fixed air” (పాతుకుపోయిన గాలి) అన్నాడు. వాయువు అయినా అది ఘనపదార్థంలో భాగమై “fix“ అవుతోంది (పాతుకుపోతోంది) కనుక దానికలా పేరు పెట్టాడు.

బ్లాక్ కనుక్కున్న విషయాలు చాలా ముఖ్యమైనవి అనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కట్టెని కాల్చినప్పుడు, ఖనిజాన్ని వేడిచేసినప్పుడు కూడా ఒకే వాయువు – కార్బన్ డయాక్సయిడ్ – పుడుతుందని నిరూపించాడు. ఆ విధంగా జీవ పదార్థానికి, జీవరహిత పదార్థానికి మధ్య సంబంధం ఉందని చూపించాడు. ఇది మొదటి విషయం.

అతడు నిరూపించిన మరో కొత్త విషయం ఉంది. మామూలుగా వాయువులు ఎప్పుడూ ఘనపదార్థాల నుండి, ద్రవాల నుండి వెలువరించబడడం వరకే అంత వరకు రసాయనికులకి తెలుసు. కాని వాయువులు ఘనపదార్థాలతో, ద్రవాలతో చర్య జరపగలవని బ్లాక్ నిరూపించాడు. ఈ దెబ్బతో వాయువుల పట్ల మన అవగాహనలో కొన్ని మబ్బులు విడిపోయాయి. వాయువులు అంటే ఏవో విచిత్రమైన, ప్రత్యేకమైన పదార్థాలు అన్న భావన తొలగిపోయింది. ఘనపదార్థాలకి, ద్రవాలకి, వాయువులకి మధ్య కొన్ని సామాన్య (రసాయనిక) లక్షణాలు ఉన్నాయని తెలిసింది.

బ్లాక్ మరో ఆసక్తికరమైన విషయం కూడా నిరూపించాడు. కాల్షియమ్ ఆక్సయిడ్ ని ఊరికే గాలిలో ఉంచితే చాలు అది కాల్షియమ్ కార్బనేట్ గా మారిపోతుందని గమనించాడు. దీంతో అతడు గాలిలోనే కొంత కార్బన్ డయాక్సయిడ్ ఉందన్న నిర్ణయానికి వచ్చాడు. ఈ దెబ్బతో గాలి మౌలిక పదార్థం కాదని తేటతెల్లమయ్యింది. గ్రీకుల నమ్మకాలు తప్పని తేలింది. మూలకం అన్న పదార్థానికి బాయిల్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం గాలి మూలకం కాదు. అందులో కనీసం రెండు పదార్థాలు కలిసి ఉన్నాయి. అవి – మామూలు గాలి, కర్బన్ డయాక్సయిడ్.

కాల్షియమ్ కార్బనేట్ ని వేడి చేసినప్పుడు జరిగిన రసాయనిక చర్య వల్ల దాని బరువు ఎంత తగ్గిందో కూడా బ్లాక్ కొలిచాడు. అలాగే ఒక మోతాదు ఆసిడ్ ని తటస్థీకరించడానికి (neutralise) ఎంత కాల్షియమ్ కార్బనేట్ కావాలో కూడా అతడు కొలిచాడు. ఆ విధంగా సంఖ్యాత్మక పద్ధతులని రసాయన శాస్త్రంలో పెద్ద ఎత్తున ప్రవేశపెట్టగలిగాడు బ్లాక్. ఈ పద్ధతుల వినియోగాన్ని తదనంతరం లెవోషియే అత్యున్నత స్థాయికి తీసుకుపోతాడు.

(సశేషం...)

దానికి లోపల వెలుపల ఒకటే... దేవుడిలా

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, March 9, 2011 1 commentsఇటీవల (మార్చ్ 7) ఆంధ్రభూమిలో అచ్చయిన మా వ్యాసానికి లింక్.


http://www.andhrabhoomi.net/intelligent/lopala-883


అచ్చయిన వ్యాసంలో కొన్ని దోషాలు ఉన్నాయి. కనుక ఆ దోషాలు లేకుండా వ్యాసాన్ని కింద ఇస్తున్నాం.)

ఒక పొడవాటి (ఉదాహరణకి 20 cm X 3 cm) కాగితం బద్దని తీసుకోండి. ఇప్పుడు దాని రెండు కొసల అంచులు ఒక దగ్గరికి తెచ్చి అంటిస్తూ, అంటించే ముందు ఒక కొసని ఒకసారి మెలిక తిప్పి అంటించాలి (క్రింద చిత్రం). ఎన్నో అధ్బుతమైన గణిత లక్షణాలు, విచిత్రమైన ప్రయోజనాలు ఉన్న ఈ ఆకృతి పేరు మోబియస్ బద్ద (Mobius strip). దీనికి లోపల, వెలుపల అని రెండు ముఖాలు ఉండవు. కావాలంటే ఆ బద్ద మీద ఎక్కడైనా మొదలుపెట్టి ఓ పెన్సిల్ తో బద్ద పొడవు వెంట తిన్నగా ఓ గీత గీస్తూ పోతే బద్ద మొత్తం ( “రెండు” పక్కలా) చుట్టి తిరిగి మొదటికి వస్తాం. అలా గీసిన గీత పొడవు కగితపు బద్ద పొడవుకి రెండింతలు ఉంటుంది.
దీన్ని కనిపెట్టిన వాడు ఆగస్ట్ ఫెర్డినాండ్ మోబియస్ (1790-1868) అనే ఓ గణితవేత్త. యూరప్ లోని సాక్సనీ ప్రాంతంలో ఓ చిన్న ఊళ్లో జన్మించాడు. అతడికేమో చిన్నప్పటి నుంచి గణితం, ఖగోళశాస్త్రం అంటే మహా ఇష్టం. కాని ఇంట్లో వాళ్లు ’లా’ చదవమని పోరు పెడితే (అప్పుడూ ఇదే గోలా?) విధిలేక ఓ ఏడాది పాటు లీప్సిగ్ విశ్వవిద్యాలయంలో ఎలాగోలా ’లా’ చదివాడు. ఇక ఆ తరువాత ఉండబట్టలేక ఇంట్లో వాళ్లకి సర్దిచెప్పి తన ఇష్టమైన గణిత విద్యలో చేరిపోయాడు. గణితలోకపు రారాజుగా చెప్పుకోబడే కార్ల్ ఫ్రెడెరిక్ గౌస్ వద్ద కొంత కాలం చదువుకున్నాడు. కాల్కులస్ లో, జ్యామితిలో, త్రికోణమితిలో, ఖగోళ విజ్ఞానంలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేశాడు. ఎన్ని కనుక్కున్నా అతడు రూపొందించిన ఆ చిన్నారి కాగితపు ఆకృతి వల్ల అతడి పేరు గణితలోకంలో చిరస్థాయిగా నిలిచిపోయింది.ఒకే ముఖం ఉండడమే కాకుండా మోబియస్ బద్దకి మరో విచిత్రమైన లక్షణం కూడా ఉంది. బద్ద యొక్క మధ్య బిందువుల వెంట బద్ద పొడవునా కత్తిరిస్తూ పోతే, బద్ద రెండుగా చీలిపోతుంది... అనుకుంటాం. కాని అది రెండింతలు పొడవున్న ఒకే బద్దగా మారిపోతుంది. మోబియస్ బద్దలో ఉండే ఒక మెలిక బదులు ఈ రెండింతలు పొడవున్న బద్దలో నాలుగు మెలికలు ఉంటాయి. ఇప్పుడు ఈ పొడవాటి బద్దని కూడా మధ్యగీత వెంట కత్తిరిస్తే ఈ సారి మాత్రం రెండు వేరు వేరు బద్దలుగా విడిపోతుంది. అయితే ఆ రెండు బద్దలు, గొలుసుకట్టులా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మోబియస్ బద్దని మధ్యగా కాకుండా, అంచు నుండి మూడోవంతు స్థానం వద్ద బయలుదేరి పొడవు వెంట కత్తిరిస్తూ పోతే మాత్రం రెండు బద్దలుగా విడిపోతుంది. వీటిలో ఒకటి మొదటి మోబియస్ బద్దతో సమానమైన పొడవే ఉంటుంది కాని వెడల్పు 1/3 వంతు ఉంటుంది. రెండవ బద్ద మొదటి మోబియస్ బద్దకి రెండింతలు పొడవు ఉంటుంది గాని వెడల్పు 1/3 వంతు ఉంటుంది. ఆ విధంగా కేవలం ఓ చిన్న కాగితపు బద్దని కత్తిరిస్తూ పోతుంటే, అది ఊహించరాని పరివర్తనలకి లోనవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే ఆకృతులకి సంబంధించిన గణిత విభాగమైన ’టోపాలజీ’లో (topology) ఈ మోబియస్ బద్దకి ఓ ముఖ్యమైన స్థానం ఉంది.అయితే కేవలం గణిత గారడీలతోనే సరిపెట్టుకోక కొందరు మోబియస్ బద్దకి కొన్ని చక్కని ప్రాపంచిక ప్రయోజనాలని కూడా ఊహించారు. ఓవెన్ హారిస్ అనే వ్యక్తి మోబియస్ బద్ద అనే భావన ఆధారంగా ఓ కొత్తరకం ’కన్వేయర్ బెల్టు’ ని (చిత్రం 2) రూపొందించి 1949 లో దాని మీద పేటెంటు తీసుకున్నాడు. బొగ్గు మొదలైన పదార్థాలని మోసుకుపోయే ఈ బెల్టులో, బెల్టుకి రెండు వైపులకి బొగ్గుతో సంపర్కం కలుగుతుంది. కనుక బెల్టు యొక్క ఆయుర్దాయం బాగా పెరుగుతుంది. మోబియస్ బద్ద ఆకారపు రైలు పట్టాల మీద రెండు పక్కలా పరిగెత్తే అధ్బుతమైన బొమ్మ రైళ్లు కూడా నిర్మించబడ్డాయి.అంతులేని పయనానికి, ఏకోన్ముఖమైన ఉపరితలానికి ప్రతీక అయిన ఈ మోబియస్ బద్ద కాల్పనిక విజ్ఞాన (science fiction) రచనల్లో కూడా చిత్రమైన పోకళ్లు పోయింది. ప్రఖ్యాత టీవీ సీరియల్ స్టార్ ట్రెక్ లో ఒక ఎపిసోడ్ లో యు.ఎస్.ఎస్. ఎంటర్ప్రయిజ్ వ్యోమనౌకకి కాప్టెన్ అయిన పికార్ద్ ఓ ఆరుగంటలు భవిష్యత్తు నుండి వెనక్కు తిరిగి వస్తాడు. మరో ఆరుగంటలు గడిచాక ’ఒక’ పికార్ద్ నౌకకి జరిగిన ప్రమాదంలో మరణిస్తే, మరో పికార్ద్ గతంలోకి ప్రయాణించి, అదే అనుభవాన్ని మళ్లీ మళ్లీ పొందుతుంటాడు!ఒక చిన్న అందమైన గణిత భావన అంత విస్తారమైన చింతనకి దారితీసింది కనుకనే దీని మీద వేదాంతం మాట్లాడినవాళ్లు కూడా ఉన్నారు. “మోబియస్ బద్దకి కూడా దేవుడి లాగానే లోపల, వెలుపల ఒక్కటే,” అంటాడు ఫ్రాంక్ ఫియోర్ అనే రచయిత.

వాయువులు

Posted by శ్రీనివాస చక్రవర్తి Monday, March 7, 2011 0 comments


అధ్యాయం 4
వాయువులు

కార్బన్ డయాక్సయిడ్ – నైట్రోజెన్

జ్వలన క్రియ జరిగేటప్పుడు పదార్థం యొక్క భారంలో కనిపించిన విడ్డూరమైన వ్యత్యాసాలకి కారణం ఆ ప్రక్రియలో పుట్టిన, లేక మాయమైన వాయువులేనని త్వరలోనే అర్థమయ్యింది. ఒక శతాబ్ద కాలం క్రితం, అంటే ఫాన్ హెల్మాంట్ తొలి ప్రయోగాలు చేసిన కాలం నుండి, వాయువులకి సంబంధించిన పరిజ్ఞానం నెమ్మదిగానే వృద్ధి చెందుతూ వచ్చింది. స్టాల్ కాలంలో కూడా వాయువులు ఉన్నాయని గుర్తించడం తప్ప, వాటిని ఎలా కొలవాలో, ఎలా పరిగణనలోకి తీసుకోవాలో ఎవరికీ తెలీదు. జ్వలన క్రియలో బరువులో వచ్చే మార్పులకి కారణాలు ఘన పదార్థాలలో, ద్రవాలలో మాత్రమే ఉంటాయని అనుకునేవారు నాటి పరిశోధకులు. కట్టె కన్నా బూడిద తేలిగ్గా ఉంటుంది. మరి ఆ మిగతా భారం ఎక్కడికి పోయింది? కట్టె లోంచి బయట పడ్డ ఆవిర్లు ఎక్కడికి పోయాయి? ఎవరికీ తెలీదు. తుప్పు పట్టిన లోహం శుద్ధ లోహం కన్నా బరువుగా ఉంటుంది. మరి ఈ అదనపు ద్రవ్యరాశి ఎక్కణ్ణుంచి వచ్చింది? అదీ ఎవరికీ తెలీదు.

ఈ సూక్ష్మాలన్నీ అర్థం చేసుకోవాలంటే ముందు రసాయనికులు వాయువులతో కొంత పరిచయం పెంచుకోవాలి. కంటికి కనిపించకుండా, చేతికి చిక్కకుండా, కవ్వించి ఏడిపించే ఈ విచిత్ర పదార్థాల గురించి కొంత ప్రాథమిక అవగాహన ముందు ఏర్పడాలి.

స్టెఫెన్ హేల్స్ (1677-1761) అనే ఓ ఇంగ్లీషు రసాయనికుడు సరైన దిశలో ఓ ముందడుగు వేశాడు. పద్దెనిమిదవ శతాబ్దపు తొలి దశల్లో ఇతడు నీటి మీదుగా వాయువులని పట్టి బంధించే పద్ధతి కనిపెట్టాడు. రసాయన చర్యలో పుట్టిన వాయువులని, ఒక నాళం ద్వారా ఓ నీటి తొట్టెలో ప్రవేశపెడితే, ఆ వాయువులు నీటి పై భాగంలో పోగవుతాయి. తొట్టెలోని నీట్లోంచి బుడగలుగా పైకి వెళ్లే వాయువులు పైనున్న నీటిని స్థానభ్రంశం (displace) చేసి కిందకి తోస్తాయి. ఆ విధంగా రసాయన చర్యలలో పుట్టే వాయువులని హేల్స్ ఓ జాడీలో పట్టి బంధించగలిగాడు.

అలా వాయువులని సేకరించాడే గాని వాటిని విశ్లేషించి వాటిలోని తేడాలని శోధించలేకపోయాడు హేల్స్. కాని వాటిని సేకరించే పద్ధతి కనిపెట్టడమే అతడు సాధించిన గొప్ప రసాయనిక విజయం.

(సశేషం...)

ఫ్లాగిస్టాన్ తో సమస్యలు

Posted by శ్రీనివాస చక్రవర్తి Thursday, March 3, 2011 0 comments

తుప్పుకి, జ్వలన క్రియకి మధ్య ఒక తేడా అయితే తప్పకుండా ఉంది. జ్వలనంలో ఉండే జ్వాల తుప్పులో లేదు. కాని దానికి కారణం జ్వలనం జరిగేటప్పుడు మండే పదార్థం లోంచి ఫ్లాగిస్టాన్ ఎంత వేగంగా బయటికి పోతుందంటే, ఆ ధాటికి దాని పరిసరాలు వేడెక్కగా, ఆ వేడిమే జ్వాలగా వ్యక్తం అవుతోంది, అని భావించాడు స్టాల్. కాని తుప్పు పట్టేటప్పుడు ఫ్లాగిస్టాన్ మెల్లమెల్లగా బయటపడుతుంది. అందుచేత మంట కనిపించదు. ఇదీ వాదన.

ఇలాంటి వాదనల పట్ల బోర్హావే విమర్శల మాట ఎలా ఉన్నా పద్దెనిమదవ శతాబ్దంలో ఫ్లాగిస్టాన్ సిద్ధాంతానికి బాగా ప్రాచుర్యం పెరిగింది. 1780 కల్లా ప్రపంచ వ్యాప్తంగా ఆ సిద్ధాంతాన్ని రసాయనికులు సమ్మతించారనే చెప్పాలి. ఎందుకంటే ఆ సిద్ధాంతం ఎన్నో విషయాలని ఎంతో ఇంపుగా వివరించగలిగింది.

అయితే ఫ్లాగిస్టాన్ సిద్ధాంతంతో ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆ సమస్యని స్టాల్ గాని, అతని అనుచరులు గాని పరిష్కరించలేక పోయారు. కలప, కాగితం, కొవ్వు మొదలైన జ్వలనీయ పదార్థాలలో చాలా మటుకు మండిన తరువాత ఇంచుమించి ఆనవాలు లేకుండా మాయమైపోతాయి. మండాక మిగిలిన మసి గాని, బూడిద గాని మూల పదార్థం కన్నా మరింత తేలిగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక విధంగా ఇది ఆశించిన పరిణామమే. ఎందుకంటే మూల పదార్థంలో ఉండే ఫ్లాగిస్టాన్ ఇప్పుడు ఆ మసిలోగాని, బూడిదలో గాని లేదు.

కాని లోహాలు తుప్పు పట్టినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. స్టాల్ సిద్ధాంతం ప్రకారం తుప్పు పట్టిన లోహం కూడా ఫ్లాగిస్టాన్ ని కోల్పోతోంది. కాని మరి తుప్పు పట్టిన లోహపు ముక్క, శుద్ధ రూపంలో ఉన్న లోహం కన్నా మరింత బరువుగా ఉంది. (1490 నాటికే రసవాదులకి ఈ విషయం తెలుసు). మరయితే ఫ్లాగిస్టాన్ యొక్క బరువు ఋణ రాశి అనుకోవాలా? అందుకే దాన్ని కోల్పోయిన వస్తువులు మరింత బరువెక్కాయని అనుకోవాలా? పద్దెనిమిదవ శతాబ్దపు రసాయనికులు కొందరు అలాగే భావించారు. కాని అప్పుడు రెండు రకాల ఫ్లాగిస్టాన్ లు ఉన్నాయని అనుకోవాల్సి ఉంటుంది. ఒక దానికి మామూలు (ధనాత్మక) భారం ఉంటే, రెండవ దానికి ఋణాత్మక భారం ఉంటుంది.

అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ సమస్య పెద్ద సమస్యలా అనిపించలేదు. ఇప్పుడు మనకి విషయాలని కచ్చితంగా కొలవడం అలవడింది. కనుక భారంలో అనుకోని పరిణామాలు వస్తే మనం ఇబ్బంది పడతాం. కాని పద్దెనిమిదవ శతాబ్దపు రసాయనికులకి రాశులని కచ్చితంగా కొలవడం ఎంత ముఖ్యమో ఇంకా అర్థం కాలేదు. కనుకనే భారంలో అలా అర్థం కాని మార్పులు వచ్చినా పట్టించుకోకుండా వదిలేశారు. ఫ్లాగిస్టాన్ సిద్ధాంతం బయటికి కనిపించే పై పై మార్పులని వివరించగలిగితే చాలు. భారంలో వచ్చే వ్యత్యాసాలని పట్టించుకోనక్కర్లేదు అని సరిపెట్టుకున్నారు.

(సశేషం...)

చెదలు నేర్చిన చదువులు

Posted by నాగప్రసాద్ Tuesday, March 1, 2011 0 comments

నిన్న సోమవారం నాడు ఆంధ్రభూమిలో ప్రచురితమైన వ్యాసం.ఇమేజ్‌పై నొక్కితే పెద్దగా కనిపిస్తుంది.Enhanced by Zemanta

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email