ఏ ప్రకృతి శక్తి ఇంత బృహత్తరమైన వృక్ష సంపదని సృష్టించి వుంటుందో అర్థంకావడం లేదు. భూమి ఇంకా రూపుదిద్దుకుంటున్న తొలి దశలలో, వేడిమి, తేమల సంయుక్త ప్రభావం వల్ల భూమి ఉపరితలం మీద వికాసం చెందుతున్న వృక్షప్రపంచం ఎలా ఉండేదో?
సాయంత్రం అయ్యింది. కాని నిన్నటి లాగానే గాలిలో ఎల్లెడలా ఉండే అవిస్పష్టమైన తేజం అలాగే వుంది. ఆ స్థిరమైన తేజం ఆధారంగా మా యాత్ర కొన సాగుతోంది.
భోజనం తరువాత తెరచాప స్తంభం పక్కనే చేరగిలబడి నెమ్మదిగా ఏవేవో పగటికలలు కంటూ నిద్రలోకి జారుకున్నాను.
గాలి బలంగా వీస్తుంటే మా తెప్ప వేగంగా అలల మీద ముందుకు దూసుకుపోతోంది. ఓడ సరంగు హన్స్ పడవ గమనాన్ని నియంత్రిస్తున్నాడు.
గ్రౌబెన్ రేవు ని విడిచిన దగ్గర్నుండి మా యాత్రకి సంబంధించిన యాత్రాపత్రికని సకాలంలో రాసే పనిని మామయ్య నాకు అప్పగించాడు. కనిపించిన ప్రతీ విశేషాన్ని అందులో నమోదు చెయ్యాలి. గాలి వీచే దిశ, పడవ వేగం, గతి – మొదలైన వన్నీ పొల్లు పోకుండా ఆ పత్రికలో రాయాలి.
ఆగస్టు 14, శుక్రవారం – గాలి స్థిరంగా వీస్తోంది. ఉత్తర-పశ్చిమ దిశలో. మా తెప్ప సరళ రేఖలో ముందుకి సాగిపోతోంది. గాలి వీచే దిశలో తీరం ముప్పై కోసుల దూరంలో వుంది. కనుచూపు మేరలో ఏమీ కనిపించడం లేదు. చుట్టూ కాంతి తీవ్రతలో ఏ మార్పూ లేదు. వాతావరణం అనుకూలంగానే వుంది. ఆకాశంలో మబ్బులు ఉన్నాయి. వాటి చుట్టూ ప్రకాశం అలముకుని వుంది. కరుగుతున్న వెండిలా మేఘావరణం మిలమిల లాడుతోంది. ఉష్ణోగ్రత 89 డిగ్రీల ఫారెన్హీట్.
మధ్యాహ్నం అయ్యింది. హన్స్ ఓ చిన్న గేలం లాంటిది తయారు చేశాడు. దాని చివర కాస్త మాంసం పెట్టి దాన్ని సముద్రం లోకి విసిరాడు. ఓ రెండు గంటల పాటు ఏమీ చిక్కలేదు. ఇంత విశాల జలాశయంలో జలచరాలే లేవా? అలా అనుకుంటుండగానే గేలానికి ఏదో తలిగినట్టయ్యింది. హన్స్ గేలం తగిలించిన తాడుని పైకి లాగాడు. గేలానికి ఓ జీవం చిక్కుకుని గిలగిలలాడుతోంది.
“స్టర్జన్ చేప, ఓ బుల్లి స్టర్జన్ చేప!” ఉత్సాహంగా అరిచాను.
ప్రొఫెసరు ఆ చేపని ఓ సారి పరిశీలనగా చూశాడు. నాతో విబేధిస్తున్నట్టుగా తల అడ్డుగా ఊపాడు.
ఈ చేప తల చదునుగా వుంది గాని ముందులో గుండ్రంగా వుంది. దాని శరీరం ముందు భాగంలో కూసైన కోణాల్లాంటి పొలుసులు ఉన్నాయి. ఇరు పక్కల రెండు పెద్ద వాజాలు (gills) ఉన్నాయి. పెద్దగా తోక లాంటిదేమీ లేదు. చూడబోతే ఇది స్టర్జన్ జాతి చేపే గాని వివరాలలో ఎన్నో తేడాలు కనిపిస్తున్నాయి. ఆ చేపని క్లుప్తంగా పరిశీలించిన మీదట మామయ్య తన అభిప్రాయాన్ని ఇలా చాటాడు.
“ఈ చేప ఓ వినష్ట జీవ జాతికి చెందిన చేప. డెవోనియన్ రూపవిన్యాసాలకి (Devonian formations) చెందిన శిలాజాలలో మాత్రమే దీని ఆనవాళ్లు కనిపిస్తాయి.”
“ఏంటి మామయ్యా నువ్వనేది? ఆదిమ యుగాలకి చెందిన జీవాన్ని ఇప్పుడు సజీవంగా చూస్తున్నామా?”
“ఔను. అంతే కాదు. ఈ చేపకి ప్రస్తుతం సజీవంగా ఉన్న జీవజాతులలో వేటితోనూ సంబంధం లేదు. ఇలాంటి సజీవ నమూనా చేతిలో పడడం ప్రకృతి శాస్త్రవేత్తలు మహా ప్రసాదంలా భావిస్తారు.”
“ఇంతకీ దీని జాతి పేరేంటి?”
“ఇది గానాయిడ్ ల (ganoids) కోవకి (order) చెందింది. సెఫలో స్పైడే (Cephalispidae) కుటుంబానికి (family) చెందింది. టెరిక్తిస్ (pterychthys) జీవజాతికి (species) చెందింది. మరో విశేషం ఏంటంటే భూగర్భజలాలకి చెందిన జీవరాశులకి చెందిన ఓ సామాన్య లక్షణం దీనికి కూడా వుంది. ఇది గుడ్డి చేప. అంతే కాదు. దీనికసలు కళ్లే లేవు.”
(ఇంకా వుంది)
0 comments