శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

ఎంత దూరం? ఇంకెంత దూరం?

Posted by V Srinivasa Chakravarthy Thursday, November 29, 2012 4 comments


అధ్యాయం 25

ఎంత దూరం? ఇంకెంత దూరం?

మర్నాడు తెల్లారే లేచి పరుగు పెట్టాల్సిన పని లేదని తెలియడం వల్ల కాస్త ఆలస్యంగా లేచాను. మనిషికి తెలిసిన అత్యంత లోతైన ప్రాంతంలో ఉన్నా ఈ పరిసరాలలో ఏదో కొత్త అందం కనిపిస్తోంది. పైగా ఈ గుహాంతర వాసానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను. ఇక సూర్య, చంద్ర, తారల గురించి చెట్లు చేమల గురించి, ఇళ్ళ గురించి ఊళ్ల గురించి ఆలోచించడం మానేశాను. భూమి ఉపరితలం మీద జీవించే మానవమాత్రుల తాపత్రయాలేవీ ఇప్పుడు నా మనసుని తాకడం లేదు.

మేం వున్న సొరంగం ఓ విశాలమైన చీకటి మందిరం. దాని గ్రానైట్ నేల మీద మా అంతర్వాహిని ప్రవహిస్తోంది. దాని జన్య స్థానం నుండి బాగా దూరానికి వచ్చేయడంతో నీరు వేడి తగ్గి కేవలం గోరువెచ్చగా ఉండడంతో ఆ నీళ్ళు కడుపారా తాగాం.

పొద్దున్న టిఫిన్ చేశాక ప్రొఫెసరు కొన్ని గంటలు కేటాయించి ఏవో లెక్కలు చేసుకోవడానికి కూర్చున్నాడు.

“మనం ఎక్కడున్నామో కచ్చితంగా నిర్ధారించడానికి లెక్కలు వేస్తాను. ఇంటికి తిరిగి వచ్చాక మన మొత్తం యాత్రా మార్గాన్ని చిత్రిస్తూ ఓ మ్యాపు గియ్యాలని వుంది. ఆ మ్యాప్య్ గోళం మీద కాదు గోళం యొక్క పరిచ్ఛేదం మీద చిత్రించబడుతుంది. అందులో మన యాత్రా మార్గం అంతా ప్రదర్శించబడుతుంది” అన్నాడు మామయ్య.

“అవునా మావయ్యా?  కాని అలా చేయడానికి మీ పరిశీలనలు తగినంత నిర్దుష్టంగా ఉన్నాయని నమ్మకం ఏంటి?” అడిగాను.

“నాకా విషయంలో పూర్తి నమ్మకం వుంది. ప్రతీ చోట కోణాలని, వాలు ని కొలుస్తూ వచ్చాను. దోషం వచ్చే ప్రసక్తే లేదు. ప్రస్తుతం ఎక్కడున్నామబ్బా? దిక్సూచిని పైకి తీసి ఎటు చూపిస్తోందో ఓ సారి రాసుకో.”

“దక్షిణ తూర్పు దిశకి, తూర్పుకి మధ్య.”

ప్రొఫెసరు హడావుడిగా ఏవో లెక్కలు వేసి “బయల్దేరిన చోటి నుండి ఎనభై ఐదు కోసుల దూరం వచ్చాం” అన్నాడు.

“అంటే అట్లాంటిక్ సముద్రం కింద వున్నాం అన్నమాట.”

“నిస్సందేహంగా.”

“బహుశ ఈ క్షణం పైన సముద్రపు ఉపరితం మీద ఏ తుఫానో సముద్ర జలాలని అతలాకుతలం చేస్తూ ఉందేమో?”

“కావచ్చు.”

“తిమింగలాలు తమ తోకల కొరడాలతో సముద్రపు నేల మీద చెళ్లు మనిపిస్తున్నాయేమో?”

“కావచ్చు గాని ఏక్సెల్. ఆ సంఘటనలేవీ మనం అసలు పట్టించుకోనక్కర్లేదు. మనం మళ్ళీ మన  లెక్కలు ఓ సారి పరిశీలిద్దాం. ఇక్కడ మనం స్నెఫెల్ పర్వతానికి దక్షిణ-తూర్పు దిశలో ఎనభై ఐదు కోసుల దూరంలో వున్నాం. అంటే పదహారు కోసుల లోతులో వున్నామని నా అంచనా.”

“పదహారు కోసులా?” అరిచినంత పని చేశాను.

“సందేహమే లేదు.”

“అంటే విజ్ఞాన శాస్త్రం ప్రకారం భూమి పైపొర అయిన క్రస్ట్ యొక్క సరిహద్దులు ఇక్కడితో ఆగిపోతాయనుకుంటా?”

“కాదనలేను.”

“మరి భూమి లోతుకి పోతున్న కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కనుక, ఉష్ణోగ్రత 2732 F  ఉండాలే?”

“సరిగ్గా చెప్పావు అల్లుడూ?”

“ఆ వేడికి ఈ కఠిన శిల అంతా కరిగి ప్రవహిస్తూ ఉండాలే?”

“మరి అలా జరగడం లేదు కనుక ఈ వాస్తవాలు కొన్ని సిద్ధాంతాలని మట్టి కరిపిస్తున్నాయన్నమాట.”

“నాకు నమ్మశక్యం కావడం లేదు.”

“ఇంతకీ థర్మామీటరు ఎవంటోంది?”

“82 F అని చూపిస్తోంది.”

“అంటే పండితులు పప్పులో కాలేశారన్న మాట. వారి సిద్ధాంతాలకి వాస్తవానికి మధ్య 2705 F వారడి వుంది. లోతుకి ఉష్ణోగ్రతకి మధ్య రేఖీయమైన సంబంధం వుందన్న భావన సరైనది కాదు. హంఫ్రీ డేవీ చెప్పిందే నిజం. ఆయన మార్గంలో నేను నడవం కూడా సరైనదే. అంతేనంటావా?”

“ఏవనాలో పాలుపోవడం లేదు.”

నిజానికి ఆ క్షణం ఎన్నో మాటలు అనాలని అనిపించింది. నోటి దాకా వచ్చాయి గాని నోరు పెగలలేదు. డేవీ సిద్ధాంతాన్ని నేను అంతగా నమ్మను. కేంద్రంలో అపారమైన ఉష్ణం ఉందన్న సిద్దాంతమే నాకు సబబు అనిపిస్తుంది.

కాని ఇప్పుడు కొత్త వాదనల గురించి ఆలోచించకుండా మా ప్రస్తుత పరిస్థితిని ఓ సారి పునరావలోకనం చేసుకుంటూ అన్నాను.

“మీ లెక్కలన్నీ నిజమని అనుకుంటే వాటి ఆధారంగా ఓ కచ్చితమైన నిర్ణయానికి రావచ్చని అనిపిస్తోంది.”

“అదేంటో చెప్పు.”

“ఐస్లాండ్ లాటిట్యూడ్ వద్ద, అంటే సరిగ్గా మనం వున్న చోట, భూమి యొక్క వ్యాసార్థం 1583 కోసులు. అంటే ఉజ్జాయింపుగా 1600 కోసులని, లేదా 4800 మైళ్ళని అనుకుందాం. 1600 కోసుల లోతులో ప్రస్తుతానికి పదహారు కోసుల లోతుకి వచ్చాం.”

“అంతే కదా మరి.”

“అంత లోతుకి రావడానికి నేలకి సమాంతరంగా 85 కోసులు ప్రయాణించాల్సి వచ్చింది.”

“కచ్చితంగా అంతే.”

“అందుకు ఇరవై రోజులు పట్టింది.”

“అవును.”

“పదహారు కోసులు అంటే భూమి వ్యాసార్థంలో నూరో వంతు. ఈ లెక్కన భూమి కేంద్రం చేరడానికి రెండు వేల రోజులు, అంటే ఐదున్నర ఏళ్లు పడుతుంది.”

(ఇంకా వుంది)


రచన - రసజ్ఞ

మెండెల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలని సంభావ్యత (Probability) ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంభావ్యత అంటే అందరికీ తెలిసే ఉంటుంది, అయినా మరొక్కసారి చెప్పుకుందాం. ఒక ఘటన (event) జరగడాన్ని, లేదా జరగకపోవడాన్ని సంభావ్యత అంటారు. మరో విధంగా చెప్పాలంటే వాస్తవంలో జరిగిన ఘటనలకి, జరిగే అవకాశం వున్న మొత్తం ఘటనలకి మధ్య గల నిష్పత్తిని సంభావ్యత అంటారు.



ఉదాహరణకి ఒక నాణేన్నే తెసుకుంటే దానికి బొమ్మ, బొరుసు ఉంటాయి. ఇప్పుడు ఒక నాణెము పదిసార్లు ఎగరేసినప్పుడు వాస్తవానికి బొమ్మ పడే అవకాశం, బోరుసుపడే అవకాశం సరిసమానంగా ఉండాలి. అంటే బొమ్మ అయిదు సార్లు, బొరుసు అయిదు సార్లు పడాలి. కానీ, ఇదే మనం ఒక ప్రయోగ రూపంలో చేసి చూస్తే అలా పడదు. దానినే వ్యత్యాసం (Variation) అంటారు.

రెండు ఘటనలకి వాటి వాటి సంభావ్యతలు ఉన్నప్పుడు, ఆ రెండు ఘటనలు ఒకే సారి జరిగితే ఏం అవుతుందో తెలిపే ఓ సూత్రం వుంది. ఆ సూత్రం పేరు ‘సంభావ్యతా సంకలన సూత్రం’ (Sum rule of Probability). ఈ సూత్రంలో పరిగణించబడ్డ రెండు ఘటనలు ఒకటి జరిగితే రెండవది జరగలేని విధంగా ఉన్నాయని అని అనుకోవడం జరుగుతుంది. అలాంటి ఘటనలని పరస్పర వర్జిత ఘటనలు (Mutually exclusive events) అంటారు. ఉదాహరణకి ఒక నాణేన్ని ఎగరేసినప్పుడు బొమ్మ పడితే బొరుసు పడదు, బొరుసు పడితే బొమ్మ పడదు. అంటే బొమ్మ బొరుసులు ‘పరస్పర వర్జిత ఘటనలు’ అన్నమాట.

పరస్పర వర్జిత సంభావ్యతని లెక్కించడం చాలా సులభం. ఘటన 1 జరిగే సంభావ్యత p1 అనుకుంటే, ఘటన 2 జరిగే సంభావ్యత p2 అనుకుంటే, రెండు ఘటనలలోను ఏదో ఒకటి జరిగే సంభావ్యత p1 + p2. ఇదే ‘సంభావ్యతా సంకలన సూత్రం’. నాణెం విషయంలో దీన్ని నిర్ధారించడం చాలా సులభం.



నాణెం వేసినప్పుడు బొమ్మ పడే సంభావ్యత ½, అలాగే బొరుసు పడే సంభావ్యత కూడా ½. కనుక ‘సంభావ్యతా సంకలన సూత్రం’ బట్టి రెండిట్లో ఏదో ఒకటి పడే సంభావ్యత ½ + ½ = 1 అవుతుంది. అంటే నాణేన్ని ఎగరేస్తే బొమ్మ, బొరుసులలో ఏదో ఒకటి తప్పకుండా (సంభావ్యత 1 తో) పడుతుంది అన్న ప్రాథమిక విషయం మనకి తెలుస్తోంది.





ఇదే నియమాన్ని మెండెల్ ప్రయోగాలకి అన్వయిద్దాం. మొక్క ఎత్తు అనే లక్షణాన్ని ఒక నాణెం అనుకుందాం. నాణానికి బొమ్మ, బొరుసు ఉన్నట్టే మొక్క ఎత్తు పొడవు (T), పొట్టి (t) అని రెండు రకాలుగా ఉంటుంది. వీటినే యుగ్మ వికల్పాలు (alleles) అన్నాడు మెండెల్. ఇప్పుడు రెండు వైపులా కేవలం బొమ్మ (TT) లేదా బొరుసు (tt) మాత్రమే ఉండేలా నాణాలను తయారుచేశాడు అనుకుందాం. వాటిని సమయుగ్మజాలు (homozygous) అనీ, ఇటువంటి వాటిని శుద్ధ వంశ క్రమాలు (pure lines) అనీ అన్నాడు. అలానే, బొమ్మ, బొరుసు (Tt) రెండూ కలిసున్న నాణాన్ని విషమయుగ్మజం (heterozygous) అని పేరు పెట్టాడు. కేవలం బొమ్మ ఉన్న నాణాలకి (TT) ఎరుపు రంగు, కేవలం బొరుసు ఉన్న నాణాలకి (tt) తెలుపు రంగు వేశాడు అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపినప్పుడు (కలపడం అంటే రెంటినీ ఒకదానితో ఒకటి అతికించాం అనుకోండి) ఎరుపు, తెలుపు కలిసిన, బొమ్మ, బొరుసు రెండూ ఉండే నాణెం రావాలి కదా! కానీ కేవలం ఎరుపు రంగు కనిపించే నాణాలే వచ్చాయి. ఎందుకో తెలియదు, వేసిన తెలుపు రంగు ఏమయిపోయిందో తెలియదు. అన్నీ ఎరుపు రంగు నాణాలు ఉన్నాయి కనుక మనం చెప్పుకున్న దాని ప్రకారం రంగు తీసేసి చూస్తే TT ఉండాలి. కానీ Tt కనిపిస్తోంది. బొమ్మ, బొరుసు కనిపిస్తున్నాయి కానీ రంగు మాత్రం ఎరుపే కనిపిస్తోంది. ఇలా కంటికి కనిపించేదానినే దృశ్యరూపం (phenotype) అన్నాడు. వాస్తవానికి, బొమ్మ, బొరుసు అతుక్కుని Tt ఉన్నాయి కానీ బయటకి కనిపించటం లేదు. దీనిని జన్యురూపం (genotype) అన్నాడు.చూడడానికి మాత్రం ఎరుపు రంగే కనిపిస్తోంది అంటే ఎరుపు రంగు తెలుపు రంగుని కప్పేస్తోంది లేదా అణచి వేస్తోంది. ఇలా ఒకటి ఇంకోదానిని కప్పేసినప్పుడు, మనకి కనిపించే దానిని బహిర్గత లక్షణం (dominant character) అనీ, కప్పబడి ఉన్న దానిని అంతర్గత లక్షణం (recessive character) అనీ అన్నాడు. తన మొదటి సిద్ధాంతంలో మెండెల్ చెప్పినది ఇదే. పొడవు మొక్కలకీ, పొట్టి మొక్కలకీ సంపర్కం జరుపగా వచ్చిన జన్యుతరమయిన F1లో అన్నీ పొడవు మొక్కలే కనిపించాయి. దానినే బహిర్గతత్వ సిద్ధాంతము అన్నాడు.

Product rule of Probability ప్రకారం, రెండు స్వతంత్ర్య ఘటనల యొక్క సంభావ్యత ఆ రెండు ఘటనల సంభావ్యతల లబ్ధానికి సమానం. అంటే, రెండు నాణాలను ఒకేసారి ఎగుర వేశాం అనుకుందాం. రెండూ కూడా బొమ్మ పడే సంభావ్యతను చెప్పాలి. దీనికోసం మొదటి నాణానికి బొమ్మపడే సంభావ్యత (1/2)ను రెండవ నాణానికి బొమ్మపడే సంభావ్యత (1/2)తో గుణిస్తే వచ్చేదే (1/4) బొమ్మ పడే సంభావ్యత.



జన్యువుల విషయానికి వస్తే, F1 లో మన దగ్గర బొమ్మ(T అనుకుందాం), బొరుసు (t అనుకుందాం) కలిసిన నాణాలు (విషమయుగ్మజాలు,Tt) ఉన్నాయి. ఇటువంటి రెండు నాణాలను ఒకేసారి ఎగురవేసినప్పుడు

రెండు నాణాలూ బొమ్మలు (TT) పడే సంభావ్యత = 1/2 x 1/2 = 1/4

మొదటి నాణెం బొమ్మ (T), రెండవ నాణెం బొరుసు (t) పడే సంభావ్యత = 1/2 x 1/2 = 1/4

మొదటి నాణెం బొరుసు (t), రెండవ నాణెం బొమ్మ (T) పడే సంభావ్యత = 1/2 x 1/2 = 1/4

రెండు నాణాలూ బొరుసులు (tt) పడే సంభావ్యత = 1/2 x 1/2 = 1/4



మెండెల్ చూసిన నిష్పత్తి కూడా ఇదే. రెండు బొమ్మలు (TT) : ఒక బొమ్మ, ఒక బొరుసు / ఒక బొరుసు, ఒక బొమ్మ (Tt) : రెండు బొరుసులు (tt) = 1:2:1 అని మొక్కల ద్వారా నిరూపించాడు. ఒక మొక్కలో TT ఉందా లేక Tt ఉందా లేక tt ఉందా అనేది పైకి కనిపించదు కనుక దీనినే జన్యురూపం (genotype) అనీ, ఈ 1:2:1 నిష్పత్తిని జన్యురూప నిష్పత్తి (genotypic ratio) అనీ అన్నాడు. ఇలా జరగడానికి కారణం, సంయోగ బీజాలలోకి వెళ్ళేటప్పుడు ఇవి T, t క్రింద విడిపోవటం అని చెప్పడమే జన్యు పృథక్కరణం.



వాస్తవానికి పొడవు, పొట్టి కలిపేస్తే మధ్యస్థం రావాలి. కానీ ఇక్కడ అలా రావటం లేదు. ముందుగా చెప్పుకున్నట్టు బహిర్గతత్వ సిద్ధాంతం ప్రకారం, T అనేది ఉంటే t ని ఎప్పుడూ కప్పి ఉంచుతుంది. T ఎప్పుడూ బహిర్గతం కనుక వచ్చిన మూడు రకాల మిశ్రమాల్లో (TT, Tt, tt)



TT లేదా Tt వచ్చే సంభావ్యత = 1/4 + 1/2 = 3/4 అవుతుంది. ఎందుకంటే TT వచ్చినప్పుడు Tt రాలేదు కనుక ఇక్కడ సంకలన సిద్ధాంతం ప్రకారం కలిపామనమాట!

tt వచ్చే సంభావ్యత = 1/2 x 1/2 = 1/4 అవుతుంది. ఇక్కడ tt మాత్రమే లెక్క కట్టి, Tt చూడకపోవడానికి కారణం t ఎప్పుడు T తో కలిసినా అది వ్యక్తమవ్వలేదు. కనుక 3:1 దృశ్యరూప నిష్పత్తి (phenotypic ratio) అవుతుంది. మెండెల్ మొక్కలలో చేసిన ప్రయోగాలలో చూపించినది కూడా ఇదే!





(ఇంకా వుంది)


కౌ పాక్స్ సోకిన వ్యక్తికి స్మాల్ పాక్స్ నుండి కూడా రోగనిరోధకత కలుగుతుందని గ్లౌసెస్టర్ లో ఓ నమ్మకం చలామణిలో ఉండేది. దానికి అంతోఇంతో ఆధారాలు కూడా లేకపోలేదు. గొల్లస్త్రీలకి గోవులతో సాన్నిహిత్యం వల్ల సులభంగా కౌపాక్స్ సోకుతుంది. కాని వారికి స్మాల్ పాక్స్ సోకినా వారికి అందరిలాగా ముఖం మీద స్ఫోటకపు మచ్చలు రావు.



అదే ఊళ్లో ఉండే ఎడ్వర్డ్ జెన్నర్ (1749 – 1823) అనే ఓ వైద్యుడికి ఆ నమ్మకం ఆసక్తి కలిగించింది. అదేంటో పరీక్షించి తేల్చుకోవాలని అనుకున్నాడు. (కాస్త నాసిరకం వైద్యుడు అయితే ఆ నమ్మకాన్ని “పూర్వీకుల వరప్రసాదం” అని గుడ్డిగా స్వీకరించి ఆచరించేవాడు!) 1796 లో వివాదాస్పదమైన పరీక్షకి పూనుకున్నాడు. కౌ పాక్స్ సోకిన సేరా నెల్మ్స్ ఓ గొల్లవనిత చేతి మీద లేచిన పుండు నుండి కాస్త ద్రవాన్ని తీసుకుని, ఆ ద్రవాన్ని స్మాల్ పాక్స్ సోకిన జేమ్స్ ఫిప్స్ అనే ఓ ఎనిమిదేళ్ల పిల్లవాడి లోకి ఎక్కించాడు. ఈ పిల్లవాడు జెన్నర్ తోటమాలి కొడుకు. రెండు నెలల తరువాత మరింత కీలకమైన పరీక్ష తలపెట్టాడు జెన్నర్. చిన్నారి జేమ్స్ లోకి ఏకంగా స్మాల్ పాక్స్ రోగాన్ని కలిగించే ద్రవాన్ని ఎక్కించాడు. కాని ఆ పిల్లవాడికి స్మాల్ పాక్స్ సోకలేదు. అంటే అతడిలో స్మాల్ పాక్స్ కి వ్యతిరేకంగా రోగనిరోధకత ఏర్పడింది అన్నమాట.



జెన్నర్ ప్రయోగాల వల్ల రోగం మీద పోరాటంలో ఓ కొత్త అస్త్రం కనిపెట్టబడింది.



అంతవరకు బాక్టీరియా మొదలైన క్రిముల వల్ల సోకిన రోగాల విషయంలో నేరుగా క్రిములని సంహరించే మందులని వాడే పద్ధతి వినియోగించబడుతూ వచ్చింది. కాని ఈ కొత్త రోగాల విషయంలో అలా ప్రత్యేక క్రిమిసంహారక పద్ధతులు వాడబడలేదు. ఒక రోగాన్ని పరిహరించడానికి ఆ రోగాన్ని పోలిన, మరింత బలహీనమైన రోగానికి కారణమైన “క్రిమి”ని (ఆ “క్రిమి” బాక్టీరియా కన్నా చాలా భిన్నమైన వైరస్ అనే కొత్తరకం “క్రిమి” అని అప్పుడు తెలీదు) రోగి లోకి ఎక్కించి, ఆ బలవత్తరమైన రోగానికి ప్రతికూలంగా రోగనిరోధకత (immunity) కలుగజేయడమే ఈ కొత్త పద్ధతి. బాక్టీరియల్ వ్యాధులతో పోల్చితే వైరల్ వ్యాధుల చికిత్సలో మౌలికంగా భిన్నమైన పద్ధతి వాడడం గమనార్హం. దానికి కారణం రోగలక్షణాలు కలిగించే తీరులో బాక్టీరియాకి, వైరస్ కి మధ్య ఉండే తేడాయే. అయితే ఆ తేడా గురించి ఆ రోజుల్లో తెలుసుకునే అవకాశమే లేదు. ఎందుకు పని చేస్తుందని ప్రశ్నించకుండా, ఏదో పని చేస్తోంది కదా అని ఈ కొత్త పద్ధతిని వినియోగిస్తూ పోయారు.



ఫిప్స్ విషయంలో తను సాధించిన విజయం గురించి వివరంగా రాసి ఆ పేపర్ ని రాయల్ సొసయిటీకి పంపాడు జెన్నర్. ఆ పత్రిక జెన్నర్ పేపర్ ని మరిన్ని ఆధారాలు కావాలంటూ తిప్పి కొట్టింది. జెన్నర్ మరింత మంది రోగుల మీద తన కొత్త పద్ధతి ప్రయోగించాలని చూశాడు. జేమ్స్ ఫిప్స్ విషయంలో రోగం పూర్తిగా నయమైనా ఆ చికిత్సని స్వీకరించడానికి జనం సులభంగా ఒప్పుకోలేదు. స్మాల్ పాక్స్ ని వదిలించుకోబోయి కౌపాక్స్ ని తెచ్చుకుంటే ఆవుల లాగానే తోకలు, కొమ్ములు మొలుస్తాయేమో నని భయపడ్డవారు కూడా ఉన్నారు (చిత్రం).


 జెన్నర్ ఎలాగో తిప్పలు పడి మరో 23 మంది రోగుల మీద తన మందు ఎక్కించి స్మాల్ పాక్స్ ని నయం చేశాడు. ఈ సారి మరిన్ని ఆధారాలతో రాసిన వ్యాసాన్ని రాయల్ సొసయిటీ స్వీకరించి ప్రచురించింది.





జెన్నర్ శ్రీకారం చుట్టిన ఈ పద్ధతికి vaccination అని పేరు. (vaccinia అంటే లాటిన్ లో కౌ పాక్స్ అని అర్థం). వాక్సినేషన్ పద్ధతి యూరప్లో కార్చిచ్చులా వ్యాపించింది. కొంత మంది పురోగాములు ఈ వాక్సినేషన్ ప్రక్రియని ఓ ఉద్యమంలా తీసుకుని లక్షలాది ప్రజలకి జెన్నర్ కనిపెట్టిన స్మాల్ పాక్స్ వాక్సీన్ ని ఇప్పించారు. అలాంటి వారిలో ప్రముఖుడు డాక్టర్ ఫ్రాన్సిస్కో జేవియర్ ద బాల్మిస్. ఈ బాల్మిస్, అతడి సహచరులు మూడేళ్ళ పాటు ప్రపంచం అంతా కలయదిరిగి యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఫిలిపీన్స్, చైనా మొదలుగా ఎన్నో ప్రాంతాలు తిరిగి లక్షలాది ప్రజలకి వాక్సీన్ ఇప్పించారు. ఆ అనుపమాన వైద్య యాత్ర గురించి రాస్తూ “చరిత్ర పుటల్లో ఇంతకన్నా సమున్నతమైన, సువిస్తారమైన ప్రజాసేవా ఉద్యమం ఉంటుందని అనుకోను” అంటాడు జెన్నర్.



జెన్నర్ ప్రయాస వల్ల స్మాల్ పాక్స్ జయించబడింది. 1979 లో WHO స్మాల్ పాక్స్ పూర్తిగా నిర్మూలింపబడ్డ వ్యాధులలో ఒకటని ప్రకటించింది.

జెన్నర్ తరువాత ఇంచుమించు ఓ శతాబ్ద కాలం తరువాత మరిన్ని వైరల్ వ్యాధుల మీద ధ్వజం ఎత్తిన మరో మహామహుడు ఉన్నాడు…

(ఇంక వుంది)



http://en.wikipedia.org/wiki/Edward_Jenner   http://en.wikipedia.org/wiki/Balmis_Expedition

మెండెల్ ప్రయోగాలు

Posted by V Srinivasa Chakravarthy Sunday, November 18, 2012 3 comments




మెండెల్ మొట్టమొదటగా 34 రకాల బఠానీలను ఎన్నుకుని ఆయన మఠంలోని తోటలో 2 సంవత్సరాలు (ఇవి ఏక వార్షికాలు అని చెప్పుకున్నాం కనుక రెండు తరాలు) పెంచి, వానిలో 22 రకాలను ఎన్నుకున్నారు. ఎన్నుకొన్న రకాలలో కృత్రిమ పరాగ సంపర్కము (artificial pollination) జరపటం ద్వారా శుద్ధ వంశ క్రమాలను (pure lines*) తయారుచేశారు. వీటి నుండి ఏడు లక్షణాలను ఎన్నుకొన్నారు. ఆ ఏడు లక్షణాలకు 7 జతల యుగ్మ వికల్పాలు (Alleles*) ఉన్నాయి. అవి:



లక్షణము                                           యుగ్మవికల్పము

మొక్క ఎత్తు                                       పొడవు (6-7 అడుగులు), పొట్టి (1 అడుగు)

పువ్వుల స్థానము                               గ్రీవస్థము (axial), శిఖరస్థము (terminal)

కాయల రంగు (pod color)                   పసుపు, ఆకుపచ్చ

కాయల ఆకారం                                  ఉబ్బినది (swollen/full), నొక్కులు కలది (constricted)

గింజల రంగు                                       బూడిద (grey), తెలుపు

గింజల ఆకారం                                    గుండ్రము (round), ముడతలు పడిన (wrinkled)

బీజదళాల రంగు (color of cotyledons)         పసుపు, ఆకుపచ్చ



ఈ ఏడు లక్షణాలలో రెండు రకాల సంకరణాలను జరిపి మూడు నియమాలను ప్రతిపాదించాడు.



ఏక సంకర సంకరణం (Monohybrid cross):

వ్యతిరేక స్వభావము కల లక్షణాలను ఎన్నుకొని జరుపు సంకరణాన్ని ఏక సంకర సంకరణం అనీ, దీని వలన వచ్చే నిష్పత్తిని ఏక సంకర నిష్పత్తి (Monohybrid ratio) అనీ అంటారు. ఇందులో ప్రతీ ప్రయోగంలోనూ P (Parental generation) అనేది జనక తరము, F1 (first filial generation), F2 (second filial generation), F3 (third filial generation), మొ., జన్యు తరమునూ సూచిస్తాయి. జనకుల ఎంపిక ఆధారముగా ఈ ఏక సంకర సంకరణాలను రెండు రకాలుగా చెప్పవచ్చు

1. సాధారణ సంకరణము (Normal cross): మొక్క ఎత్తు అనే లక్షణమును ఉదాహరణగా తీసుకుంటే, పొడవు మొక్కను తల్లి మొక్కగా, పొట్టి మొక్కను తండ్రి మొక్కగా తీసుకుంటే దానిని సాధారణ సంకరణము అంటారు.

2. వ్యుత్క్రమణ సంకరణము (Reciprocal cross): మొక్క ఎత్తు అనే లక్షణమును ఉదాహరణగా తీసుకుంటే, పొట్టి మొక్కను తల్లి మొక్కగా, పొడవు మొక్కను తండ్రి మొక్కగా తీసుకుంటే దానిని వ్యుత్క్రమణ సంకరణము అంటారు.

ఈ ఏక సంకర సంకరణం ఆధారంగా రెండు సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి.



1. బహిర్గతత్వ సిద్ధాంతము (Law of Dominance):

ఈ సిద్ధాంతాన్ని F1 ఫలితాల ఆధారంగా ప్రతిపాదించారు. తల్లి/తండ్రి (శుద్ధ వంశ క్రమాలను తీసుకున్నప్పుడు) మొక్కలలో ఏ లక్షణమయితే F1లో అన్ని మొక్కలలోనూ కనిపిస్తుందో దానిని బహిర్గత లక్షణమనీ (Dominant character), దాగి ఉన్న రెండవ లక్షణాన్ని అంతర్గత లక్షణమనీ (Recessive character) చెప్పటం జరిగింది. మెండెల్ దీనినే మూలకం (factor) గానూ, ఆ మూలకం సంయోగ బీజాల ద్వారా తరువాతి తరానికి సంక్రమిస్తుందనీ గ్రహించాడు. మెండెల్ కనుగొన్న ఈ మూలకాన్నే Bateson కారకమనీ, Wilhelm Ludvig Johannsen జన్యువనీ పేర్లు పెట్టారు. నూతన దృక్పధం ప్రకారం బహిర్గత లక్షణాన్ని capital letter తోనూ, అంతర్గత లక్షణాన్ని small letterతోనూ సూచిస్తారు. ఉదాహరణకి మొక్క ఎత్తు తీసుకుంటే T (బహిర్గత లక్షణం), t (అంతర్గత లక్షణం) అని సూచిస్తారు. అలాగే ఈయన వీటన్నిటినీ పన్నెట్ గళ్ళ పట్టిక (punnett square board)లో పెట్టడం వలన సులువుగా వివరించటం జరిగింది.



2. జన్యు పృథక్కరణ సిద్ధాంతము (Law of segregation):

F1/F2 లలో ఆత్మ ఫలదీకరణ (self fertilization) జరిగినపుడు వచ్చే మొక్కలని F2/F3 తరాలుగా పరిగణిస్తారు. F1లో సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు రెండు జన్యువులూ విడిపోయి ఒక్కొక్క జన్యువు మాత్రమే ఒక్కో సంయోగ బీజంలోనికి వెళ్ళి తరువాత తరం ఏర్పడేటప్పుడు మళ్ళీ రెండు (స్త్రీ, పురుష) సంయోగ బీజాల కలయిక వలన రెండు జన్యువులు వస్తాయి అని చెప్పారు. అంటే తల్లిలో సగం, తండ్రిలో సగం కలిసి తరువాతి తరానికి ఒక జతగా చేరతాయనమాట. దీనినే జన్యు పృథక్కరణ లేదా అలీన సిద్ధాంతము అంటారు. ఈ సిద్ధాంతము ఆధారంగా దృశ్యరూప నిష్పత్తి (Phenotype ratio; F2 తరం ఆధారంగా), జన్యురూప నిష్పత్తి (Genotype ratio; F3 తరం ఆధారంగా) చెప్పారు.




---
*Annuals - జీవిత చక్రాన్ని ఒక సంవత్సరంలో పూర్తి చేసుకునే మొక్కలని ఏకవార్షికాలు (annuals) అంటారు.

*Apomixis - సాధారణ క్షయకరణ విభజన (Reduction division or meiosis) మరియు సంయుక్త సంయోగము (Syngamy) జరగకుండా ఫలవంతమయిన పిండము అభివృద్ది చెందితే దానినే అసంయోగము (apomixis) అంటారు.ఈ ప్రక్రియలో ఏర్పడిన విత్తనాలను అసంయోగ జనన విత్తనాలు (apomictic seeds) అంటారు.

*Haploid - సంయోగ బీజములలో ఉండే క్రోమోజోముల సంఖ్యను ఏకస్థితికము (haploid) అంటారు. సంయోగ బీజాలు క్షయకరణ విభజన తరువాత ఏర్పడతాయి కనుక ఉండవలసిన వానిలో సగమే ఉంటాయి (జతలు ఉండవు).

* Purelines - తరతరాలకు ఒకే లక్షణాన్ని అందించగలిగితే వాటిని శుద్ధ వంశ క్రమాలు (Purelines) అంటారు.

*Alleles - ఒకే లక్షణాన్ని నిర్దేశించే రెండు దృశ్యరూపాలు (పైకి కనిపించే దానినే దృశ్య రూపం అంటారు)



ప్రతీ పావుగంటకి ఓ సారి ఆగి విశ్రాంతి తీసుకుని ముందు సాగాల్సి వస్తోంది. ఓ బండ మీద కూర్చుని, ఏదో ఇంత తిని, పక్కనే ప్రవహించే స్రవంతి లోంచి గుక్కెడు నీరు తాగి మళ్లీ బయల్దేరాము.


ఈ ‘దోషం’ యొక్క వాలు మీదుగా మేం పేరు పెట్టిన హన్స్ బాక్ స్రవంతి ప్రవహిస్తోంది. కొంత భాగం పక్కలలోకి ప్రవహించడం వల్ల కొంత నీరు నష్టమవుతోంది. కాని తగినంత నీరు మాకా వస్తోంది, మా దప్పిక తీర్చుకోడానికి సరిపోతోంది. వాలు తక్కువైతే ప్రశాంతంగా ప్రవహిస్తోంది. వాలు పెరిగితే దూకుడు పెరిగి విజృంభిస్తోంది. అలాంటప్పుడు దాని ధోరణి చూస్తే అసహనంగా, ఉద్వేగంగా అనుక్షణం కంపించే మామయ్యే గుర్తొస్తాడు. ప్రశాంతంగా, సాఫీగా ప్రవహించే సమయంలో ఎప్పుడూ నిమ్మళంగా, నిబ్బరంగా ఉండే హన్సే గుర్తొస్తాడు.



జూలై 6,7 తారీఖులలో కూడా ఈ సర్పిలాకారపు సొరంగాలు ఉన్న బావిలో దిగుతూ పోయాము. ఆ రెండు రోజుల్లో రెండు కోసుల లోతుకి పోయి వుంటాము. అంటే మొత్తం సముద్ర మట్టానికి ఐదు కోసులు కిందకి పోయి వుంటాము. కాని 8 వ తారీఖున మాత్రం వాలు కాస్త తగ్గి దక్షిణ-తూర్పు దిశగా తిరిగింది. ఇప్పుడు వాలు నలభై ఐదు డిగ్రీలు ఉంటుందేమో.



ఇక అక్కణ్ణుంచి బాట చాలా సుగమం అయ్యింది. కాని అలా ఎంత దూరం ముందుకి పోతున్నా మార్పు లేని పరిసరాలు చూస్తే విసుగు పుడుతోంది.

బుధవారం అంటే 15 వ తేదీ కల్లా భూగర్భంలో ఏడు కోసుల లోతుకి చేరాము. స్నెఫెల్ పర్వతం నుండి యాభై కోసుల దూరానికి వచ్చాము. బాగా అలసటగా ఉన్నా మా ఆరోగ్యం మాత్రం చెక్కుచెదరలేదు. మా మందుల పెట్టె మూసింది మూసినట్టే వుంది.

మామయ్య గంట గంటకీ దిశ, సమయం, వాయు పీడనం, ఉష్ణోగ్రత మొదలైన వన్నీ క్రమం తప్పకుండా తన డైరీలో నమోదు చేసుకుంటున్నాడు. కనుక మేం ఎక్కడున్నదీ తెలుసుకోడం పెద్ద కష్టం కాలేదు. అందుకే నేలకి సమాంతరంగా యాభై కోసుల దూరం ప్రయాణించాం అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఐస్లాండ్ ని వదిలి వచ్చేశాం అన్నమాట. నా ముఖంలోని ఆశ్చర్యం చూసి “ఏవయ్యింది?” అనడిగాడు మామయ్య.



“మామయ్యా! నీ లెక్కలు సరైనవే అయితే ఇప్పుడు మనం ఐస్లాండ్ కింద లేము.”

“అలాగంటావా?” మామయ్య ఏమీ అరగనట్టు అన్నాడు.

“సందేహమే లేదు. కేప్ పోర్ట్ లాండ్ దాటిపోయాం. యాభై కోసులు అంటే నేల దాటి సముద్రం అడుక్కి వచ్చాం.”

“సముద్రం అడుక్కా, భలే!” అన్నాడు ఉత్సాహంగా చేతులు రుద్దుకుంటూ.

“అది సాధ్యమేనా మామయ్యా? మన నెత్తి మీద ఇప్పుడు సముద్రం ఉందంటావా?”

“ఎందుకు కాకూడదు ఏక్సెల్! అది సహజమేగా. నీకు గుర్తుందా? న్యూ కాసిల్ వద్ద బొగ్గు గనులు సముద్రం అడుక్కి కూడా విస్తరించి వుండవూ?”

ప్రొఫెసరు గారికి ఈ విషయం చాలా సామాన్యంగా అనిపించొచ్చు. కాని నాకు మాత్రం నెత్తిన ఓ మహా సముద్రం పరవళ్లు తొక్కుతోందన్న విషయం జీర్ణించుకోడానికి కష్టంగా వుంది. ఆలోచిస్తే కఠిన గ్రానైట్ పొర మధ్య కవచంలా ఉన్నంత వరకు ఆ పైన కొండలు, అడవులు ఉన్నాయా, విశాల అట్లాంటిక్ మహాసముద్రం వుందా అన్న విషయం అప్రస్తుతం అనిపించింది. మేం నడుస్తున్న సొరంగ మార్గం మాత్రం దక్షిణ-తూర్పు దిశలో ఇంకా ఇంకా లోతుగా చొచ్చుకు పోతోంది. మాకు తెలీకుండానే చాలా లోతుకి పోతున్నామని అర్థమయ్యింది.

నాలుగు రోజుల తరువాత అంటే జులై 18 నాటికి, ఓ విశాలమైన గుహ లాంటి చోటికి వచ్చాం. అప్పుడు మామయ్య హన్స్ కి ఆ వారం ఇవ్వాల్సిన జీతం ఇచ్చేశాడు. మర్నాడు ఆదివారం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయమయ్యింది.



ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం













మెండెల్ జీవిత కథ

Posted by V Srinivasa Chakravarthy Tuesday, November 13, 2012 2 comments

రచన - రసజ్ఞ


విజ్ఞానం సాగరంలా అనంతమయినది. అలాగే అనువంశికత, జన్యు వైవిధ్యాల విధానాలు కూడా అనంతం కనుక వాటి గురించి తెలుసుకోవడానికి, మనకి అర్థమవటానికి వీలుగా మూడు ప్రధాన శాఖలుగా, ఒక్కో శాఖనీ మరికొన్ని ఉపశాఖలుగా విభజించారు. దీని వలన అధ్యయనం సులువయ్యింది. ఒక్కోదాని గురించీ వివరంగా తెలుసుకుందాం.



1. సాంప్రదాయ జన్యుశాస్త్రం (Classical Genetics):-

ఇది మొట్టమొదటి శాఖ. జన్యువులు అదే విధంగా కానీ, చిన్న చిన్న మార్పులతో కానీ తరువాతి తరానికి వెళతాయి కనుక దీనిని బదిలీ జన్యుశాస్త్రం (Transitional Genetics) అని కూడా అంటారు. ఇందులో ముఖ్యంగా లక్షణాల అనువంశికత గురించి తెలుసుకుంటాము. ఈ సాంప్రదాయక జన్యుశాస్త్రాన్ని మళ్ళీ నాలుగు ఉపశాఖలుగా విభజించటం జరిగింది.



మెండేలియన్ జన్యుశాస్త్రం (Mendelian Genetics):

పరిమాణాత్మక లక్షణాలను గణిత శాస్త్ర పద్ధతుల ద్వారా వివరించిన ఘనత ఈ జన్యుశాస్త్రానికే దక్కింది. అనువంశికతను గూర్చి సశాస్త్రీయంగా పరిశోధనలు జరిపిన మొట్టమొదటి వ్యక్తి మెండెల్. ఈయన ప్రతిపాదించిన సూత్రాలు జన్యుశాస్త్ర పురోగతికి తోడ్పడినందువలన ఆయన తరువాతి శాస్త్రవేత్తలు ఆయనని జన్యుశాస్త్ర పితగా గౌరవించారు.ఇంతటి మహా మనిషి గురించి టూకీగా కొన్ని వివరాలను తెలుసుకుని తరువాత ఆయన పరిశోధనల గురించి తెలుసుకుందాం.



మెండెల్ పూర్తి పేరు Gregor Johann Mendel (July 20, 1822 – January 6, 1884). ఈయన ప్రాధమికంగా జీవ శాస్త్రజ్ఞుడు. ఈయన ఆస్ట్రియా లోని Brunn (ప్రస్తుతం ఇది Czechoslovakiaలో ఉంది)లో క్రైస్తవ పీఠంలో సాధువుగా చేరి 1847లో మత గురువుగా నియమింపబడ్డారు. Vienna విశ్వ విద్యాలయం (1852-1853)లో గణిత మరియు ప్రకృతి శాస్త్రాలను అభ్యసించి 1854లో ఉన్నత పాఠశాలలో అధ్యాపకుడిగా చేరారు. 1857లో విత్తనాలు అమ్మేవారి వద్ద చూసిన Pisum sativum (బఠానీ) గింజలు ఆయనని ఎక్కువగా ఆకర్షించాయి. అవి వివిధ రకాలుగా ఉండటం గమనించిన ఈయన వాటి మధ్యన ఉండే వ్యత్యాసాలను పరిశీలించటం మొదలుపెట్టారు. అధ్యాపక వృత్తిలో చేరిన ఈయనకు తగిన తీరిక దొరకడం వలన ఆయన అభ్యసించిన ప్రకృతి, గణిత శాస్త్రములను ఉపయోగించి ఎనిమిది సంవత్సరాల పాటు (1858-1864) సంకరణ ప్రయోగాలను జరిపారు.





మెండెల్ విజయానికి ఈ ప్రయోగాలే మూలం. వాటికి ముఖ్య కారణాలు మూడు.

1. మొక్క ఎంపిక:

ఆయన ఎంచుకున్న మొక్క బఠానీ మొక్క. మెండెల్ విజయం సాధించడానికి ఎంతో తోడ్పడినది ఇదే అని చెప్పవచ్చును. దీని వలన ఆయనకి కలిగిన ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

1. ఈ మొక్కలు ఏక వార్షికాలు (Annuals*) కనుక స్వల్ప కాలంలో ఎక్కువ తరాల మీద పరిశోధనలు చేసే అవకాశం ఉంది.

2. వీటికి Papilionaceous ఆకర్షక పత్రావళి (Papilionaceous corolla) ఉండటం వలన ఆవశ్యకాంగాలు (essential organs) అయిన కేసరావళి (Androecium) మరియు అండ కోశము (Gynoecium) ద్రోణీ పత్రాలలో (keel petals) ఇమిడి ఉంటాయి కనుక వీటిలో ఆత్మపరాగ సంపర్కము (self pollination), పర పరాగ సంపర్కము (cross pollination) రెండూ జరపటం తేలిక.

3. ఎక్కువగా ఫలవంతమయిన సంతానమే కలుగుతుంది.

4. పరిశోధనలకు ఈయన ఎంచుకున్న ఏడు లక్షణాలూ కూడా వేరు వేరు జతల క్రోమోజోముల మీద ఉండటం వలన సహలగ్నతకు ఆస్కారం లేకపోవటం ఈయనకి కలిసొచ్చింది.

5. భిన్న జతల లక్షణాలలో ఉన్న రెండు రకాలలో ఒకటి పూర్తిగా బహిర్గతంగానూ, రెండవది పూర్తిగా అంతర్గతంగానూ ఉన్నాయి. అనగా సంపూర్ణ బహిర్గతత్వాన్ని (Complete dominance) చూపించటం కూడా లాభదాయకమయ్యింది.

6. అన్నిటికంటే ముఖ్యమయినది ఈ బఠానీ గింజలకు సుప్తావస్థ (seed dormancy) లేకపోవటం. అంటే వెంటనే మొలకెత్తగలవు కనుక అనువంశికతను తక్కువ సమయంలో చదవటం వీలయ్యింది.

2. రూపకల్పన:

ఈయన ప్రయోగాన్ని రూపకల్పన చేసుకున్న విధానం చాలా ముఖ్యమయినది. ఈయన చదవాలనుకున్న ఏడు జతల లక్షణాలనూ ఒకేసారిగా కాకుండా మొదట ప్రతీ ప్రయోగంలోనూ ఒక జత అనువంశికత లక్షణాలను, తరువాత రెండేసి జతల లక్షణాలను ఎన్నుకొని ప్రయోగ ఫలితాలను ప్రకటించటం వలననే ఈయన పరిశోధనలకు (34 సంవత్సరాల తరువాత) ఎనలేని కీర్తి లభించింది అని చెప్పవచ్చు.



3. గణిత శాస్త్రం ప్రకారం లెక్కలు కట్టడం:

ఈయన నేర్చుకున్న గణిత శాస్త్ర సహాయంతో కట్టిన లెక్కలు కూడా ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలకి ఊపిరిని ఇచ్చాయి అనటంలో అతిశయోక్తి లేదు.





ఇలా ఎనిమిదేళ్ళ కృషి తరువాత 1865లో Brunn ప్రకృతి శాస్త్ర సంఘ సమావేశాలలో తన ఫలితాలను, వాటి ఆధారంగా తాను ప్రతిపాదించిన సిద్ధాంతాలను వ్యాసముగా వ్రాసి సమర్పించారు. ఆ వ్యాసాన్ని వారు ఆ సంఘ వార్షిక ప్రచురణలలో ప్రచురించారు. 1866లో ఈ ప్రచురణ వ్యాసాలను యూరోప్, అమెరికాలోని గ్రంధాలయాలకు పంపిణీ చేశారు. అయితే, ఆ కాలములో ఈయన పరిశోధనా వ్యాసాలను మిగతా శాస్త్రవేత్తలు ఆమోదించలేకపోయారు. దీనికి ముఖ్య కారణం మెండెల్ తన వ్యాసములో విచ్ఛిన్న వైవిధ్యాల (Discontinous Variation) గురించి ప్రస్తావించటమే. అప్పటికే ఎంతోమంది చేత ఆమోదింపబడిన డార్విన్ ప్రకృతివరణ సిద్ధాంతము (Darwin's theory of natural selection) లో జీవ పరిణామము అవిచ్ఛిన్న వైవిధ్యాల (Continous variation) వలన కలుగుతుందని చెప్పడం వలన మెండెల్ చెప్పినది ఎవ్వరికీ రుచించలేదు. అలా మెండెల్ సిద్ధాంతాలకి ప్రాముఖ్యత లభించలేదు.



అయితే ఇవే ఫలితాలు మరికొన్ని మొక్కలలో, జంతువులలో చూపించగలిగితే జనాదరణ పొందవచ్చును అన్న స్ఫూర్తితో Heiraceum అనే మొక్కను, తేనెటీగలను ప్రయోగ పదార్ధాలుగా ఎన్నుకోవటం అతని దురదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే బఠానీ మొక్కలను ఎన్నుకోవటం వలన కలిగిన ప్రయోజనాలు వీటి వలన కలుగకపోవడమే కాక వీటిల్లో భిన్న ధోరణులు ఉంటాయి. ఈయన ఎన్నుకున్న Heiraceum అనే మొక్క అసంయోగ జననము (facultative apomixis*) ద్వారా పుడుతుంది (మరి బఠానీ మొక్కలు పరాగ సంపర్కం వలన వచ్చేవి కదా!). అలానే తేనెటీగలలో మగ ఈగలు ఏక స్థితికాలు (haploid*). వీటిని ఎన్నుకోవటం వలననే బఠానీ మొక్కలలో చూపించిన అనువంశికతా సూత్రాలను వీటిలో చూపించలేకపోయాడు. దానితో ఆయన నిరుత్సాహంతో కృంగిపోయాడు. తన శాస్త్రీయ పరిశోధనలు నిర్లక్ష్యం కావటం, ఆర్ధిక పరిస్థితులు, అనారోగ్యం, మొదలయిన వాటి వలన శాస్త్రీయ విషయాలలో ఆసక్తి తగ్గి ప్రయోగాలను ఆపేశాడు. సరయిన ఆదరణ, ప్రోత్సాహం లభించి ఉంటే ఇంకెన్ని వెలికి తెచ్చేవాడో!! క్రమంగా ఆరోగ్యం క్షీణించి 1884లో కన్నుమూశాడు.



మెండెల్ తరువాత కాలంలో కనుగొనబడిన వివిధ జన్యుశాస్త్ర అంశాలను మెండెల్ పరిశోధనా ఫలితాలకు జత చేయటం వలన 1900లో మెండెల్ సూత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ తరువాత అవి ఎంతోమంది శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు మార్గదర్శకమయ్యి ఆయనని జన్యుశాస్త్ర పిత గా గౌరవించినా, ఇప్పటికీ ఆయన ప్రతిపాదించిన సూత్రాలే ప్రముఖ స్థానంలో ఉన్నా అయన మాత్రం తన శ్రమ, విజ్ఞానం అంతా వృధా, పరిశోధనలు ఎందుకూ పనికిరాలేదు అన్న నిరాశతో కన్నుమూయటం బాధాకరం.



---
*Apomixis - సాధారణ క్షయకరణ విభజన (Reduction division or meiosis) మరియు సంయుక్త సంయోగము (Syngamy) జరగకుండా ఫలవంతమయిన పిండము అభివృద్ది చెందితే దానినే అసంయోగము (apomixis) అంటారు.ఈ ప్రక్రియలో ఏర్పడిన విత్తనాలను అసంయోగ జనన విత్తనాలు (apomictic seeds) అంటారు.


*Haploid - సంయోగ బీజములలో ఉండే క్రోమోజోముల సంఖ్యను ఏకస్థితికము (haploid) అంటారు. సంయోగ బీజాలు క్షయకరణ విభజన తరువాత ఏర్పడతాయి కనుక ఉండవలసిన వానిలో సగమే ఉంటాయి (జతలు ఉండవు).


(ఇంకా వుంది)
(మెండెల్ ప్రయోగాల గురించి వచ్చే పోస్ట్ లో...)

వైరల్ వ్యాధులపై తొలి పోరాటాలు

Posted by V Srinivasa Chakravarthy Sunday, November 11, 2012 0 comments


అంటువ్యాధులు కొన్ని సందర్భాలలో విశృంఖలంగా వ్యాపించి అపారమైన ప్రాణనష్టానికి దారితీస్తాయని కిందటి సారి గమనించాం. ఇన్ఫ్లూయెన్జా లాగానే కోట్ల సంఖ్యలో ప్రాణ నష్టాన్ని కలుగజేసిన మరో వ్యాధి వుంది. పద్నాల్గవ శతాబ్దపు యూరప్ లో బ్యూబోనిక్ ప్లేగ్ అనే ఓ భయంకరమైన వ్యాధి విలయతాండవం చేసింది. అయితే ఈ వ్యాధికి కారణం వైరస్ కాదని ప్రస్తుతం మనకి తెలుసు. దానికి కారణం యెర్సీనియా పెస్టిస్ అనే బాక్టీరియా. చైనాలో మొదలైన ఈ వ్యాధి పాశ్చాత్యానికి వ్యాపించిందని అంటారు. ఒక్క చైనాలోనే 25 మిలియన్ల మందిని అంటే దేశ జనాభాలో 30% మందిని పొట్టన బెట్టుకుంది. అది సిల్కు దారి ద్వారా మధ్యధరా సముద్ర తీర ప్రాంతాన్ని చేరి, అక్కణ్ణుంచి మొత్తం యూరప్ అంతా వ్యాపించి యూరప్ జనాభాలో 30-60% మందిని తుదముట్టించింది. ఆ ఒక్క శతాబ్దంలో ఈ వ్యాధ వాత బడి 400 మిలియన్ ప్రజలకి పైగా ప్రాణాలు కోల్పాయారని అంచనా. అపర మృత్యు దేవతలా అంత మందిని పొట్టనబెట్టుకున్న ఆ వ్యాధికి black death అని పేరు.


అంటువ్యాధుల వ్యాప్తికి మురికి, అశుభ్రత ఎంతో దొహదం చేస్తాయి. ఆ రోజుల్లో యూరప్ లోఊళ్లు రోతపుట్టించే మురికి వాడలై ఉండేవి. మురుగు కాలవల సదుపాయం ఉండేది కాదు. ఇరుకైన వాడలలో మితిమీరిన జన సందోహం ఉండేది. (పరిశుభ్రతకి వ్యాధి నియంత్రణకి మధ్య సంబంధాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న పాశ్చాత్య దేశాలు ఆధునిక యుగంలో పరిశుభ్రతా ప్రమాణాలని గణనీయంగా పెంచుకున్నాయి. ఆ సత్పరిమాణం మన దేశంలో ఇంకా పూర్తిగా రాలేదనే చెప్పాలి. మన దేశంలో మురికి అంటే ఇప్పటికీ “మమకారం” హెచ్చు!)


(ఇంగ్లండ్ లో ఆనాటి మురికి వాడలు - వికీ)

అలాంటి పరిసరాలలో అంటువ్యాధులు సులభంగా పెచ్చరిల్లేవి. కొన్ని వ్యాధులు ఒకరి నుండి ఒకరికి సోకుతాయన్న అవగాన ఉండడం వల్ల, తమ పరిసరాలలో వ్యాధి గ్రస్థులు ఉన్నారని తెలియగనే వ్యాధి నుండి తప్పించుకోడానికి ఆ ప్రాంతాలని వదిలి దూరంగా పారిపోయేవారు. కాని ఆ ప్రయత్నంలో తెలియకుండానే వ్యాధి కారక క్రిములని మరింత వేగంగా విస్తపింపజేసి వ్యధిని మరింత సులభంగా వ్యాపింపజేసేవారు.

అయితే అంటువ్యాధుల వ్యాప్తిలో ఓ చిత్రమైన ధోరణిని ఆ రోజుల్లో కూడా ప్రజలు గమనించారు. వ్యాధి సోకిన అందరూ పోతారని నియమం ఏమీ లేదు. కొందరిలో వ్యాధి లక్షణాలు కొద్దిగా కనిపించి సద్దుమణుగుతాయి. కొందరు వ్యాధికి లొంగి ప్రాణాలు పోగొట్టుకుంటారు. కొన్ని వ్యాధుల విషయంలో అయితే వ్యాధి ఒకసారి సోకితే, ఆ వ్యాధి సోకిన వ్యక్తికి మళ్లీ రాకుండా ఒక విధమైన సహజ రక్షణ ఏర్పడుతుంది. Measles, mumps, small pox మొదలైన వ్యాధుల విషయంలో అదే జరుగుతుంది. ఈ మూడూ కూడా వైరల్ వ్యాధులే. వ్యాధి ఒకసారి కలిగాక మళ్లీ కలగకుండా శరీరంలో రక్షణ ఎలా ఏర్పడుతోంది? ఆ రక్షణ ఏదో ముందే కల్పించి ఒక్కసారి కూడా వ్యాధి సోకకుండా చెయ్యగలమా? ఈ ఆలోచనా ధోరణి ఆధారంగా జరిగిన ప్రయత్నాలు ఎలా వున్నాయో చూద్దాం.



పద్దెనిమిదవ శతాబ్దపు చివరి వరకు కూడా small pox ఓ భయంకరమైన వ్యాధిగా పేరుపొందింది. ఆ వ్యాధి అంటే భయపడడానికి కారణం ప్రాణభయం మాత్రమే కాదు. ఆ వ్యాధి మనిషి యొక్క రూపురేఖలని దారుణంగా వికారపరిచి, ప్రాణాన్ని మిగిల్చినా మానవత్వాన్ని కాజేస్తుంది. ఆ రోజుల్లో జనాభలో అధిక శాతం ప్రజల ముఖాల్లో small pox వ్యాధి సోకిన ఆనవాళ్లు కనిపించి వ్యాధి యొక్క దారుణ ప్రభావాన్ని నలుగురికీ గుర్తు చేస్తూ ఉండేవి.

(స్మాల్ పాక్స్ సోకిన పసి వాడు - వికీ)


పదిహేడవ శతాబ్దపు టర్కీ దేశంలో జనం small pox నుండి ఆత్మరక్షణ కోసం ఓ దారుణమైన పద్ధతిని అవలంబించారు. కాస్త తక్కువ స్థాయి తీవ్రతలో small pox గల రోగి నుండి వ్యాధిని ఉద్దేశపూర్వకంగా తమలోకి ఎక్కించుకునేవారు. రోగి ఒంటి మీద కురుపుల లోనుండి స్రవించే ద్రవాన్ని సేవించేవారు. అలాంటి ప్రక్రియ వల్ల కొందరిలో తక్కువ స్థాయి తీవ్రత గల వ్యాధి అవతలి వారికి సోకేది. ఏ వికార పరిణామం నుండి, సౌందర్య వినాశనం నుండి అయితే తప్పించుకోవాలని అనుకున్నారు ఆ దురదృష్టాన్ని వాళ్ళు పనిగట్టుకుని ఇంటికి ఆహ్వానించినట్టు అయ్యేది. దిక్కులేకుండా చచ్చే కన్నా ఈ కాస్త ఉపశమనం అయినా చాలునన్న ఆలోచనతో ఇలాంటి ప్రమాదకర చర్యలకి ఒడిగట్టేవాళ్ళు.

1718 లో లండన్ కి చెందిన మేరీ మాంటెగూ అనే ఓ సౌందర్యరాశి టర్కీ దేశంలో స్మాల్ పాక్స్ నియంత్రణ విషయంలో జరుగుతున్న తంతు గురించి విన్నది. ఆమె కుటుంబ సమేతంగా టర్కీకి వెళ్ళి ఇంటిల్లి పాదికీ స్మాల్ పాక్స్ “మందు” ఇప్పించింది. అదృష్టవశాత్తు ఏ హానీ కలగకుండా అందరు సురక్షితంగా ఇంగ్లండ్ కి తిరిగొచ్చారు. ఆ ‘మహత్యాన్ని’ జనం ఎందుచేతనో పెద్దగా పట్టించుకోలేదు. మేరీ మాంటెగ్యూ యొక్క వ్యక్తిత్వం మీద జనానికి ఉండే చిన్నచూపే ఆ నిర్లక్ష్యానికి కారణం కావచ్చు.



ఇలాంటి ప్రయత్నమే ఒకటి అమెరికాలో జరిగింది. బాస్టన్ నగరానికి చెందిన జాబ్డియెల్ బాయిస్టన్ అనే వైద్యుడు 241 మందికి స్మాల్ పాక్స్ ‘మందు’ ఇచ్చాడు. అందులో ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు. బతికి బట్టకట్టిన 235 మందిని పక్కనబెట్టి పోయిన ఆరు ప్రాణాలకి గాని ఆయన్ని నలుగురు ఆడిపోసుకున్నారు.

ఇలా ఉండగా ఇంగ్లండ్ లో గ్లౌసెస్టర్ షైర్ అనే చిన్న ఊళ్లో ఆ ఊరి జనం స్మాల్ పాక్స్ ని అరికట్టడానికి ఓ కొత్త పద్ధతిని ఊహించారు. ఎక్కువగా ఆవులకి, కొన్ని సార్లు మనుషులకి కూడా సోకే, cow pox అనే ఓ వ్యాధి గాని మనిషికి ఓ సారి సోకితే, దాని వల్ల ఆ మనిషికి కౌ పాక్స్ నుండే కాక స్మాల్ పాక్స్ నుండి కూడా రోగనిరోధకత ఏర్పడుతుందని ఊరి వారికి ఓ నమ్మకం. అదే నిజమైతే చాలా గొప్ప విశేషమే. ఎందుకంటే కౌ పాక్స్ వల్ల ఒంటి మీద పెద్దగా మచ్చలు రావు.

తక్కువ తీవ్రత గల కౌపాక్స్ మనిషికి సోకేలా చేస్తే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు అవుతుంది.

ఆ ఊరికి చెందిన ఓ వైద్యుడికి ఈ “మూఢనమ్మకం” చాలా ఆసక్తికరంగా అనిపించింది. అదే నిజమైతే స్మాల్ పాక్స్ కి ఓ చక్కని చికిత్స చేజిక్కినట్టే. ఆ మూఢనమ్మకం నిజమో కాదో తేల్చుకోవాలనుకున్నాడు ఆ వైద్యుడు.

(ఇంకా వుంది)

References:

Isaac Asimov, Guide to Science 2: Biological Sciences, Pelican Books. (Chapter on Micro-organisms), 1972.

http://en.wikipedia.org/wiki/Black_Death

http://en.wikipedia.org/wiki/Smallpox

ఫో! లోతుగా తవ్వుకుపో!

Posted by V Srinivasa Chakravarthy Friday, November 9, 2012 0 comments


అధ్యాయం 24


మర్నాడు ఉదయం లేచే సరికి మా అలసట అంతా ఎవరో చేత్తో తీసేసినట్టు ఎగిరిపోయింది. అసలు దాహమే వెయ్యడం లేదు. కారణం ఏమై వుంటుందా అని ఆలోచించాను. సమాధానంగా నా పాదాల వద్ద చిట్టేటి గలగలలు వినిపించాయి.



ముగ్గురం ఫలహారం చేశాం. కెలీబియేట్ నీటిని తనివితీరా తాగాం. ఏనుగంత బలం వచ్చినట్టు అనిపించింది. ఆత్మ విశ్వాసం రెండింతలయ్యింది. కొండంత సంకల్పబలం ఉన్న మావయ్య, వేసట మాటే తెలీని వేటగాడు హన్స్ తోడు ఉండగా, అడపాదపా మొరాయించినా జీవనోత్సాహంతో ఉర్రూతలూగే నాలాంటి అల్లుడు ఉండగా, జయమ్ము నిశ్చయమ్ము కాక మరేమవుతుంది? ఈ క్షణం ఎవరైనా నాతో తిరిగి వెనక్కి వెళ్లిపోదాం అని అంటే నిర్మొహమాటంగా ‘కుదరద’ని చెప్పేసేవాణ్ణే!

ఇక అక్కణ్ణుంచి కిందికి దిగి వెళ్ళడమే మా తక్షణ కర్తవ్యం.

“పదండి పోదాం!” నా మాటలు భూగర్భపు గొంతుకలో ప్రతిధ్వనించాయి.

గురువారం 8 గంటలకి మా యాత్ర మొదలయ్యింది. హొయలు తిరుగుతూ ముందుకి చొచ్చుకుపోతున్న శిలా సొరంగం ఓ జటిలమైన చిక్కుముడిలా వుంది. మొత్తం మీద అది ఆగ్నేయదిశలో విస్తరించినట్టు అనిపించింది. మామయ్య పదేపదే దిక్సూచిని చూసుకుంటూ దారి ఎటు పోతోందో కనిపెట్టుకుంటూ వున్నాడు.



మేం నడుస్తున్న బాటకి వాలు పెద్దగా లేదు. మా పాదాలని తాకుతూ ప్రవహించే నీటి గలగలలు నేపథ్యంలో శ్రావ్యంగా ప్రతిధ్వనిస్తున్నాయి.ఆ ధ్వని వింటుంటే ఓ జలకన్యక మాపై దయతో దారిచూపుతున్నట్టు, స్నేహంగా చేయి తట్టి ధైర్యం చెప్తున్నట్టు అనిపించింది. మామూలుగా అయితే ఈ జలకన్యలని, వనకన్యలని నమ్మేరకాన్ని కాను. కాని మా నిస్సహాయ స్థితి ఊహలకి రెక్కలు వచ్చేలా చేస్తోంది కాబోలు.





మామయ్య మాత్రం పరుగెత్తుతున్నట్టుగా నడుస్తున్నాడు. తన మనస్తత్వానికి సూటిగా కిందికి పోయే దారి అయితే చక్కగా సరిపోయి వుండేది. నెమ్మదిగా కిందికి దిగే ఈ వాలు దారి తనలో అసహనాన్ని రేకెత్తిస్తోంది. ఎలాగైతేనేం నెమ్మదిగా భూమి కేంద్రం దిశగానే ప్రయాణిస్తున్నాం అన్న ఆలోచనతో తృప్తి పడడం తప్ప చేసేదేమీ లేదు.

అక్కడక్కడా వాలు పెరిగి దారి కిందికి లోతుగా చొచ్చుకుపోతుంది. అలాంటి సందర్భాలలో మా జలకన్య గుసగుస కాస్తా ఘోషగా మారుతుంది. ఆమెని వెన్నంటి మేం కూడా మరింత వేగంగా కిందికి దిగసాగాం.

మొత్తం మీద ఆ రోజు మాత్రం ఎక్కువగా నేలబారుగా ప్రయాణించాం గాని పెద్దగా లోతుకి వెళ్లలేకపోయాం.

శుక్రవారం సాయంత్రానికి అంటే జులై 10 వ తేదీ కల్లా రెయిక్ జావిక్ నగరానికి ముప్పై కోసులు అగ్నేయ దిశలో వున్నామని, భూగర్భంలో రెండున్నర కోసుల లోతుకి చేరామని అంచనా వెయ్యగలిగాం.

ప్రస్తుతం కిందికి చూస్తే మా ఎదుట ఓ భయంకరమైన అగాధం కనిపిస్తోంది. ఆ చీకటి లోతులని చూసి మామయ్య ఒక్కడే ఉత్సాహంగా చప్పట్లు చరిచాడు.

“అబ్బ! ఈ దారి వెంబడి పోతే పెద్ద సమస్య లేకుండా చాలా లోతుకి చేరుకుంటాం,” అన్నాడు ఉత్సాహంగా. “గోడల నుండి పొడుచుకొస్తున్న రాళ్లు చక్కని మెట్లదారిలా ఏర్పడ్డాయి.”

సొరంగం నోటి వద్ద శిలలకి హన్స్ త్రాళ్ళు కట్టాడు. ఆ తాళ్లు పట్టుకుని అవరోహణ మొదలెట్టాం. ఈ నుయ్యి, లేదా అగాధం, కంకర శిలలో ఏర్పడ్డ ఓ చీలిక లాంటిది. భౌగోళిక శాస్త్రవేత్తలు దీన్నే ‘దోషం’ (fault) అంటారు. స్నెఫెల్ పర్వతం వెళ్లగక్కిన నిప్పు నదికి ఇది ఒకప్పుడు బాట అయ్యిందంటే ఆ ప్రవాహపు ఆనవాళ్లు ఇప్పుడు కనిపించకపోవడం ఆశ్చర్యంగా వుంది. ఏదో మానవ హస్తం తీర్చి దిద్దినట్టుగా మెలికలు తిరిగిన మెట్ల దారిలో క్రమంగా కిందికి సాగాము.

(ఇంకా వుంది)








వైరస్ వల్ల కలిగే వ్యాధులు అంటువ్యాధుల (infectious diseases) కోవలోకి వస్తాయి. అందుకే ఇవి సులభంగా వ్యాపించి కొన్ని సార్లు ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని ప్రాణనష్టానికి కారణం కాగలవు. అలా ప్రపంచ వ్యాప్తంగా వ్యాధి వ్యాపించే పరిణామాన్ని pandemic అంటారు. అయితే అంటువ్యాధులన్నీ వైరస్ ల వల్లనే కలగనక్కర్లేదు. బాక్టీరియా, వైరస్, ఫంగస్ (శిలీంధ్రం), ప్రోటోజువా, బహుళ కణ పరాన్నజీవులు (multicellular parasites) మొదలైన ఎన్నో హానికర జీవాల వల్ల అంటువ్యాధులు కలగొచ్చు. ఇవి కాకుండా ప్రయాన్ (prion) అనబడే దోషాలుగల ప్రోటీన్ సందోహాల వల్ల కూడా ఒక ప్రత్యేక కోవకి చెందిన అంటువ్యాధులు కలగొచ్చు.

మానవ చరిత్రలో పెద్ద మొత్తంలో ప్రాణనష్టం కలిగించిన రెండు ప్రాచీన మహమ్మారి వైరల్ వ్యాధులు – ఇన్ఫ్లూయిన్జా (influenza) మరియు మశూచి (smallpox). ఇక ఇటీవలి కాలంలో పాండిమిక్ స్థాయికి పెచ్చరిల్లిన రెండు వైరల్ వ్యాధులు – HIV (AIDS) మరియు H1N1 వ్యాధులు. ఈ వ్యాధుల స్వరూపం ఏమిటో, వాటి వల్ల కలిగే భీభత్సం ఎలాంటిదో తెలుసుకుందాం.



ఇన్ఫ్లూయిన్జా

వైరస్ ల వల్ల కలిగే అంటువ్యాధుల్లో ఇన్ఫ్లూయిన్జా (influenza) ముఖ్యమైనది. దీన్నే మరింత సంక్షిప్తంగా ఫ్లూ (flu) అంటారు. ఫ్లూ వైరస్ లు మనుషులకే కాక పందులకి, పక్షులకి, దోమలకి, సాల్మన్ చేపలకి, సముద్రపు పేలకి (sea lice) ఇలా ఎన్నో రకాల జీవజాతులకి సోకుతాయి. సాధారణంగా ప్రత్యేక వైరస్ లు కొన్ని ప్రత్యేక జీవజాతులనే అటకాయించగలవు. కాని వైరస్ లకి మారే గుణం వుంటుంది. ఆ మార్పు వైరస్ లలో ఉండే జన్యువులలో కలిగే ఉత్పరివర్తనల (mutations) మీద ఆధారపడుతుంది. (ఈ విషయాలని ముందు ముందు విపులంగా చర్చించుకుందాం.) ఈ ఉత్పరివర్తనవల్ల ఏర్పడ్డ వైరస్ రూపాంతరాలు మనుషులకి కూడా సోకే లక్షణాన్ని సంతరించుకున్నాయి. ఒక్క మనిషికి సోకిందంటే, ఇక మనిషి నుండి మనిషికి పాకుతూ క్రమంగా మానవ సమాజాలలో వ్యాపించగలదు.

వైరస్ లు జంతువుల నుండి మనుషులకి సోకడం అనేది మానవ చరిత్రలో ఇటీవలి కాలంలో జరిగిన ఓ పరిణామం అని చెప్పుకోవచ్చు. సుమారు 10,000 ఏళ్ళ క్రితం మనిషి సేద్యం గురించి తెలుసుకున్నాడు. పొలాలలో తనకి సహాయపడేందుకు గాను అడవి జంతువులని చేరదీసి పెంచుకోవడం మొదలెట్టాడు. ఆ విధంగా మనిషికి, జంతువుకి సాన్నిహిత్యం మొదలయ్యింది. ఆ విధంగా జంతువులకి మాత్రమే సోకే వైరస్ లు మానవ సమాజంలోకి ప్రవేశించడం మొదలెట్టాయి.

ఫ్లూ వల్ల బాధపడే మనిషికి తీవ్రంగా ‘పడిశం’ చేస్తుంది. ఆ స్థితిలో దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లోనున్న వైరస్ గాల్లోకి వెలువడి సులభంగా వ్యాపించగలదు. జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న చోట్ల మరింత సులభంగా వ్యాపించగలదు. అందుకే ఈ వ్యాప్తిని అదుపుచెయ్యడానికి, అరికట్టడానికి ముఖానికి గుడ్డ కట్టుకోవడం మొదలైన జాగ్రత్తలు తీసుకుంటారు. మనిషిలోని రోగనిరోధక మండలం (immune system) ఈ వైరస్ ని ఒకటి రెండు వారాలలో సులభంగా నియంత్రించగలదు. కాని వృద్ధులకి, పిల్లలకి దీని వల్ల ప్రమాదం కాస్త హెచ్చుగా ఉంటుంది. వేయి కొక్కరు ఈ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.



కాని అది నేటి మాట. పరిశుభ్రతా ప్రమాణాలు తగు స్థాయిలో ఉన్న చోట, వైరస్ వ్యాప్తిని అదుపుచెయ్యడానికి తగ్గ జాగ్రత్తలు తీసుకున్న పక్షంలో పరిస్థితి వేరు. కాని ఇవేమీ తెలీయని రోజుల్లో ఈ మహమ్మారి వ్యాధి కోట్ల ప్రాణాలని పొట్టనపెట్టుకుంది. 1918 – 1920 ప్రాంతాల్లో ఈ వైరస్ విచ్చలవిడిగా వ్యాపించడం వల్ల జరిగిన ప్రాణ నష్టం ఐదు నుండి పది కోట్ల వరకు ఉంటుందని అంచనా. దురదృష్ట వశాత్తు ఈ వైరస్ ఉపద్రవం సరిగ్గా మొదటి ప్రపంచ యుద్ధం ముగియగానే యూరప్ మీద విరుచుకుపడింది. ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు వొదిలిన సిపాయిల సంఖ్య కన్నా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇంచుమించు రెండు రెట్లు ఉంటుంది. యూ.ఎస్.ఏ. లో మొదలైన ఆ వైరస్ వ్యాధి వేగంగా యూరప్ కి, ఆసియాకి వ్యాపించింది. అక్కడితో ఆగక ఉత్తరాన ఉండే ఎస్కిమో జాతుల వరకు, పశ్చిమాన ఎక్కడో మారుమూల పసిఫిక్ మహాసముద్రం నడిమధ్యలోని దీవుల మీద జీవించే జాతుల వరకు కూడా ఆ వైరస్ విషప్రభావం విస్తరించింది. అలా ఆ వ్యాధి ప్రపంచం అంతా వ్యాపించినా దానికి కొన్ని కారణాల వల్ల ‘స్పానిష్ ఫ్లూ’ అని పేరొచ్చింది. స్పెయిన్ దేశంలో ఆ రోజుల్లో సెన్సార్ నిబంధనలు కాస్త బలహీనంగా ఉండేవి. కనుక వ్యాధి యొక్క వ్యాప్తికి సంబంధించిన వార్తలు ఆ దేశంలో సులభంగా పొక్కేవి. అది ఎంత వరకు వెళ్ళిందంటే ఆ వ్యాధి అసలు స్పెయిన్లోనే పుట్టిందని ప్రచారం కూడా జరిగింది.

జనాభా యొక్క అనియంత్రిత వృద్ధిని అరికట్టడంలో వ్యాధులకి గణనీయమైన పాత్ర పాత్ర ఉంటుందని ఏనాడో 1798 లో ఊహించాడు థామస్ మాల్థస్ అనే ఓ బ్రిటిష్ ఆర్థిక శాస్త్రవేత్త. మాల్థస్ కాలంలో మానవాళి యొక్క పురోగతి గురించి రెండు రకాల దృక్పథాలు చలామణిలో ఉండేవి. అజ్ఞానం, అనారోగ్యం, పేదరికం మొదలైన ప్రతిబంధకాలని తెంచుకుని మానవ సమాజం క్రమంగా, సమిష్టిగా ఎదుగుతుందని, భూమి స్వర్గతుల్యమవుతుందని నమ్మే దృక్పథం మొదటిది. పరిపూర్ణ సమసమాజం గురించి వాదించే విలియం గాడ్విన్ మొదలైన వారు ఈ రకమైన దృక్పథాన్ని స్వీకరించారు.

మాల్థస్ వాదం ఇందుకు విరుద్ధంగా ఉండేది. పరిమిత సహజ వనరులు, యుద్ధాలు, మహమ్మారి వ్యాధులు, ఇవన్నీ చాలనట్టు కేవలం మనుషులలో స్వతస్సిద్ధంగా ఉండే దౌష్ట్యం – ఇవన్నీ మానవ జనాభా యొక్క విశృంఖల వృద్ధిని అరికడతాయని మాల్థస్ వాదించేవాడు. మాల్థస్ ఊహించినట్టుగానే మానవ జనాభా వృద్ధిని నియంత్రించగల సత్తాగల వ్యాధుల్లో ఈ ఫ్లూ ఒకటని కచ్చితంగా చెప్పుకోవచ్చు.

ఫ్లూ లాగానే మరో ప్రాచీన వైరల్ వ్యాధి smallpox. Smallpox ని జయించే ప్రయత్నాలే వైరల్ వ్యాధుల మీద మొట్టమొదటి విజయాలకి చిహ్నాలు.

(ఇంకా వుంది)





References:

1. Christopher Lloyd, What evolved on earth… in brief, Bloomsbury, 2009.

2. http://en.wikipedia.org/wiki/Influenza

3. http://en.wikipedia.org/wiki/Infectious_disease





దాహం తీర్చిన పాతాళగంగ

Posted by V Srinivasa Chakravarthy Saturday, November 3, 2012 0 comments


నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.

హన్స్ నా వైపు ఓ సారి జాలిగా చూశాడు.

లేచి లాంతరు అందుకుని గోడని సమీపించాడు. చెవి గోడకి ఆన్చి లోపలి నుండి వస్తున్న శబ్దాల్ని కాసేపు శ్రద్ధగా విన్నాడు. పైకి కిందకి కదిలి శబ్దంలో మార్పులు గమనించాడు. నేలకి మూడు అడుగుల ఎత్తున ఒక చోట శబ్దం గరిష్ఠంగా ఉన్నట్టు తేల్చాడు.

ఆ వేటగాడి ఉద్దేశం ఏంటో అర్థమయ్యింది. నేను శభాష్ ని మెచ్చుకోబేటంతలోనే ఓ చిన్న గొడ్డలి తీసుకుని రాతి గోడ మీద బలంగా దెబ్బలు కొట్టసాగాడు హన్స్.

హన్స్ చేస్తున్న పని సర్వసామాన్యంగా అనిపించినా దాని వల్ల ప్రమాదం లేకపోలేదు. భూగర్భంలో ఇంత లోతులో గొడ్డలి దెబ్బల వల్ల రాళ్ళు పట్టుసడలి సొరంగం కుప్ప కూలిపోతే? లేదా గోడకి పెట్టిన కన్నం లోంచి నీటి వెల్లువ తన్నుకొచ్చి ఈ సొరంగ ప్రాంతాన్ని ముంచెత్తి మమ్మల్ని జలసమాధి చేసేస్తే? ఇవేవీ వట్టి ఊహాగానాలు కావు. కాని మీద పడే రాళ్లకి, ముంచెత్తే నీళ్లకి భయపడే స్థితిలో లేము. మా దాహార్తి ఎంత తీవ్రంగా ఉందంటే ఆ సమయంలో పోటెత్తిన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో దూకమన్నా దూకుతామేమో!



హన్స్ గోడలో రంధ్రం చేసే పద్ధతిని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాం. అదే పనిని నేనుగాని, మామయ్యగాని చేపట్టి ఉంటే, ఒకే పెద్ద సమ్మెట దెబ్బతో గోడని వేయి శకలాలు చేసే ప్రయత్నం చేసేవాళ్ళం. కాని హన్స్ సూక్ష్మమైన, ఒడుపైన ఉలి దెబ్బలతో గోడలో సన్నని ఆరు అంగుళాల రంధ్రాన్ని దొలుస్తూ ముందుకు పోతున్నాడు. మరి కాస్త గట్టిగా దెబ్బ వెయ్యమని మామయ్య తొందరపెడుతుంటే నేనే వారించాను. కాని మామయ్య ఇక ఉండబట్టలేక తను కూడా ఓ గొడ్డలి తీసుకుని రంగప్రవేశం చెయ్యబోతుంటే ముందు స్ స్ మన్న చప్పుడుతో మొదలై, గోడలోంచి తన్నుకొచ్చిన ఓ ప్రళయరౌద్ర జలప్రవాహం అవతలి గోడ మీద విలయతాండవం చెయ్యసాగింది.





http://pinkcookieswithsprinkles.blogspot.in/2010/09/perfect-day-with-mr-smith.html



నీటి ధాటికి హన్స్ గట్టిగా అరిచి అంత ఎత్తున ఎగిరి పడ్డాడు. ధారలో ఆత్రంగా చెయ్యి పెట్టిన నేను కూడా గొంతులోంచి వస్తున్న కేకని ఆపుకోలేకపోయాను.

“నీరు సలసల మరుగుతోంది!” అరిచాను. నీటి ఘోషకి సొరంగం మారుమ్రోగిపోతోంది.

“పోనీలే! కాసేపు చల్లారనీయి,” మామయ్య అరిచాడు.

సొరంగం వేగంగా ఆవిరితో నిండిపోతోంది. విస్తరిస్తున్న ఆవిరి వేగంగా సొరంగపు లోతులని తడుముతూ ముందుకి పోతోంది. ఆవిరిని కోల్పోయిన నీరు నెమ్మదిగా చల్లారింది.

కాసేపట్లో మేమంతా ఆ పాతాళంలో పుట్టిన అమృతాన్ని ఆత్రంగా దోసెళ్లతో జుర్రుకుని సేదతీర్చుకున్నాం.

దాహంతో లమటిస్తున్న శరీరంలోకి నీరు ప్రవహిస్తుంటే నరాలు జివ్వు మన్నాయి. ఇంతకీ ఈ నీరు ఎక్కణ్ణుంచి వస్తున్నట్టు? ఇప్పుడా ప్రశ్న అంత ముఖ్యంగా అనిపించలేదు. ఆగకుండా ఎంతో సేపు గటగటా తాగాను. ప్రాణం లేచొచ్చింది.



కాస్త ఓపిక వచ్చాక అన్నాను, “ఇది కలిబియేట్ వాహిని (chalybeate spring)!”

“అబ్బ! అయితే జీర్ణానికి చాలా మంచిది,” మామయ్య వివరించాడు. “ఇందులో బోలెడంత ఇనుము ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే ఓ ‘స్పా’లో స్నానం చేసినట్టే.”

“భలే రుచిగా ఉన్నాయి నీళ్లు.”

“ఎందుకు ఉండవూ? భూగర్భంలో ఆరు మైళ్ల లోతులో ఉన్నాయి మరి. కాస్త ఇంకు రుచి తగుల్తుంది కాని తాగడానికి మరీ అంత ఇబ్బందిగా ఏమీ ఉండదు. ఈ వాహినిని కనుక్కుని హన్స్ గొప్ప పుణ్యం కట్టుకున్నాడు. అందుకే దీనికి అతడి పేరు పెడదాం!”

“అవునవును,” నేను తలాడించాను.

ఆ క్షణమే ఆ వాహినికి ‘హన్స్ బాక్’ అని నామకరణం జరిగింది.

ఆ తంతుకి హన్స్ పెద్దగా సంబరపడినట్టు కనిపించలేదు. నాలుగు గుక్కెలు నీళ్లు తాగి మౌనంగా ఓ మూలకి వెళ్ళి నించున్నాడు.

“మనం ఈ నీళ్ళని వొదులుకోకూడదు,” రాబోయే కాలాన్ని ఊహించుకుంటూ అన్నాను.

“ఎందుకొచ్చిన శ్రమ? ఈ నీళ్లు ఎక్కడికీ పోవు,” అన్నాడు మామయ్య.

“అయినా సరే. ఈ నీళ్లతో మన సీసాలని, ఫ్లాస్క్ లని నింపుకుందాం.”

మామయ్య నేను అన్నదానికి ఒప్పుకున్నాడు. అలాగే నీళ్లు నింపుకున్నాం. కాని గొడలోంచి వస్తున్న ధారని ఆపడం మా వల్ల కాలేదు. విరిగిన గ్రానైట్ ముక్కలతో రంధ్రాన్ని పూడ్చడానికి మేం చేసే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నీటి వేడికి చేతులు కాలిపోతున్నాయి. పోటు మరీ ఎక్కువగా వుంది.

“ఈ ప్రవాహం బాగా ఎత్తు నుండి వస్తున్నట్టు వుంది,” అన్నాను.

“సందేహం లేదు. ఈ ప్రవాహం 32,000 అడుగుల ఎత్తు నుండి, అంటే భూమి ఉపరితలం నుండి, వస్తోంది అనుకుంటే, దీనికి వేయి వాతావరణాల పీడనం ఉందన్నమాట. కాని నాకో ఆలోచన వచ్చింది.”

ఏంటది అన్నట్టు చూశాను.

“అసలు ఇప్పుడు ఈ ప్రవాహాన్ని ఎందుకు ఆపుదాం అనుకుంటున్నాం?”

“ఎందుకంటే…” ఏదో చెప్దామనుకున్నా గాని నాకు పెద్దగా కారణం తట్టలేదు.

“దీన్ని ఇలాగే ప్రవహించనిస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని నుండి నీళ్లు పట్టుకోవచ్చు. పైగా ఆ ప్రవాహం మనకి దారి చూపిస్తుంది కూడా,” మామయ్య అన్నాడు.

“ఇదేదో బావుందే,” ఆలోచన నాకు నచ్చింది. “ఈ పాతాళగంగ దారి చూపిస్తుంటే ఇక మనకి తిరుగేముంది?”

“అబ్బో! అల్లూడికి మళ్లీ ఉత్సాహం వచ్చినట్టుందే!” నవ్వుతూ అన్నాడు మామయ్య.

“అవును మామయ్య. ఇప్పుడు కాస్త ఓపిక వచ్చింది.”

“అవును. కాని కాస్త విశ్రమించి మళ్లీ బయల్దేరుదాం.”

అది రాత్రి వేళ అని మా కాలమానిని చెప్తోంది.

కాసేపట్లోనే ముగ్గురం గాఢ నిద్రలోకి జారుకున్నాం.

- ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం -

















postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts