నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.
హన్స్ నా వైపు ఓ సారి జాలిగా చూశాడు.
లేచి లాంతరు అందుకుని గోడని సమీపించాడు. చెవి గోడకి ఆన్చి లోపలి నుండి వస్తున్న శబ్దాల్ని కాసేపు శ్రద్ధగా విన్నాడు. పైకి కిందకి కదిలి శబ్దంలో మార్పులు గమనించాడు. నేలకి మూడు అడుగుల ఎత్తున ఒక చోట శబ్దం గరిష్ఠంగా ఉన్నట్టు తేల్చాడు.
ఆ వేటగాడి ఉద్దేశం ఏంటో అర్థమయ్యింది. నేను శభాష్ ని మెచ్చుకోబేటంతలోనే ఓ చిన్న గొడ్డలి తీసుకుని రాతి గోడ మీద బలంగా దెబ్బలు కొట్టసాగాడు హన్స్.
హన్స్ చేస్తున్న పని సర్వసామాన్యంగా అనిపించినా దాని వల్ల ప్రమాదం లేకపోలేదు. భూగర్భంలో ఇంత లోతులో గొడ్డలి దెబ్బల వల్ల రాళ్ళు పట్టుసడలి సొరంగం కుప్ప కూలిపోతే? లేదా గోడకి పెట్టిన కన్నం లోంచి నీటి వెల్లువ తన్నుకొచ్చి ఈ సొరంగ ప్రాంతాన్ని ముంచెత్తి మమ్మల్ని జలసమాధి చేసేస్తే? ఇవేవీ వట్టి ఊహాగానాలు కావు. కాని మీద పడే రాళ్లకి, ముంచెత్తే నీళ్లకి భయపడే స్థితిలో లేము. మా దాహార్తి ఎంత తీవ్రంగా ఉందంటే ఆ సమయంలో పోటెత్తిన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో దూకమన్నా దూకుతామేమో!
హన్స్ గోడలో రంధ్రం చేసే పద్ధతిని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాం. అదే పనిని నేనుగాని, మామయ్యగాని చేపట్టి ఉంటే, ఒకే పెద్ద సమ్మెట దెబ్బతో గోడని వేయి శకలాలు చేసే ప్రయత్నం చేసేవాళ్ళం. కాని హన్స్ సూక్ష్మమైన, ఒడుపైన ఉలి దెబ్బలతో గోడలో సన్నని ఆరు అంగుళాల రంధ్రాన్ని దొలుస్తూ ముందుకు పోతున్నాడు. మరి కాస్త గట్టిగా దెబ్బ వెయ్యమని మామయ్య తొందరపెడుతుంటే నేనే వారించాను. కాని మామయ్య ఇక ఉండబట్టలేక తను కూడా ఓ గొడ్డలి తీసుకుని రంగప్రవేశం చెయ్యబోతుంటే ముందు స్ స్ మన్న చప్పుడుతో మొదలై, గోడలోంచి తన్నుకొచ్చిన ఓ ప్రళయరౌద్ర జలప్రవాహం అవతలి గోడ మీద విలయతాండవం చెయ్యసాగింది.
http://pinkcookieswithsprinkles.blogspot.in/2010/09/perfect-day-with-mr-smith.html
నీటి ధాటికి హన్స్ గట్టిగా అరిచి అంత ఎత్తున ఎగిరి పడ్డాడు. ధారలో ఆత్రంగా చెయ్యి పెట్టిన నేను కూడా గొంతులోంచి వస్తున్న కేకని ఆపుకోలేకపోయాను.
“నీరు సలసల మరుగుతోంది!” అరిచాను. నీటి ఘోషకి సొరంగం మారుమ్రోగిపోతోంది.
“పోనీలే! కాసేపు చల్లారనీయి,” మామయ్య అరిచాడు.
సొరంగం వేగంగా ఆవిరితో నిండిపోతోంది. విస్తరిస్తున్న ఆవిరి వేగంగా సొరంగపు లోతులని తడుముతూ ముందుకి పోతోంది. ఆవిరిని కోల్పోయిన నీరు నెమ్మదిగా చల్లారింది.
కాసేపట్లో మేమంతా ఆ పాతాళంలో పుట్టిన అమృతాన్ని ఆత్రంగా దోసెళ్లతో జుర్రుకుని సేదతీర్చుకున్నాం.
దాహంతో లమటిస్తున్న శరీరంలోకి నీరు ప్రవహిస్తుంటే నరాలు జివ్వు మన్నాయి. ఇంతకీ ఈ నీరు ఎక్కణ్ణుంచి వస్తున్నట్టు? ఇప్పుడా ప్రశ్న అంత ముఖ్యంగా అనిపించలేదు. ఆగకుండా ఎంతో సేపు గటగటా తాగాను. ప్రాణం లేచొచ్చింది.
కాస్త ఓపిక వచ్చాక అన్నాను, “ఇది కలిబియేట్ వాహిని (chalybeate spring)!”
“అబ్బ! అయితే జీర్ణానికి చాలా మంచిది,” మామయ్య వివరించాడు. “ఇందులో బోలెడంత ఇనుము ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే ఓ ‘స్పా’లో స్నానం చేసినట్టే.”
“భలే రుచిగా ఉన్నాయి నీళ్లు.”
“ఎందుకు ఉండవూ? భూగర్భంలో ఆరు మైళ్ల లోతులో ఉన్నాయి మరి. కాస్త ఇంకు రుచి తగుల్తుంది కాని తాగడానికి మరీ అంత ఇబ్బందిగా ఏమీ ఉండదు. ఈ వాహినిని కనుక్కుని హన్స్ గొప్ప పుణ్యం కట్టుకున్నాడు. అందుకే దీనికి అతడి పేరు పెడదాం!”
“అవునవును,” నేను తలాడించాను.
ఆ క్షణమే ఆ వాహినికి ‘హన్స్ బాక్’ అని నామకరణం జరిగింది.
ఆ తంతుకి హన్స్ పెద్దగా సంబరపడినట్టు కనిపించలేదు. నాలుగు గుక్కెలు నీళ్లు తాగి మౌనంగా ఓ మూలకి వెళ్ళి నించున్నాడు.
“మనం ఈ నీళ్ళని వొదులుకోకూడదు,” రాబోయే కాలాన్ని ఊహించుకుంటూ అన్నాను.
“ఎందుకొచ్చిన శ్రమ? ఈ నీళ్లు ఎక్కడికీ పోవు,” అన్నాడు మామయ్య.
“అయినా సరే. ఈ నీళ్లతో మన సీసాలని, ఫ్లాస్క్ లని నింపుకుందాం.”
మామయ్య నేను అన్నదానికి ఒప్పుకున్నాడు. అలాగే నీళ్లు నింపుకున్నాం. కాని గొడలోంచి వస్తున్న ధారని ఆపడం మా వల్ల కాలేదు. విరిగిన గ్రానైట్ ముక్కలతో రంధ్రాన్ని పూడ్చడానికి మేం చేసే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నీటి వేడికి చేతులు కాలిపోతున్నాయి. పోటు మరీ ఎక్కువగా వుంది.
“ఈ ప్రవాహం బాగా ఎత్తు నుండి వస్తున్నట్టు వుంది,” అన్నాను.
“సందేహం లేదు. ఈ ప్రవాహం 32,000 అడుగుల ఎత్తు నుండి, అంటే భూమి ఉపరితలం నుండి, వస్తోంది అనుకుంటే, దీనికి వేయి వాతావరణాల పీడనం ఉందన్నమాట. కాని నాకో ఆలోచన వచ్చింది.”
ఏంటది అన్నట్టు చూశాను.
“అసలు ఇప్పుడు ఈ ప్రవాహాన్ని ఎందుకు ఆపుదాం అనుకుంటున్నాం?”
“ఎందుకంటే…” ఏదో చెప్దామనుకున్నా గాని నాకు పెద్దగా కారణం తట్టలేదు.
“దీన్ని ఇలాగే ప్రవహించనిస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని నుండి నీళ్లు పట్టుకోవచ్చు. పైగా ఆ ప్రవాహం మనకి దారి చూపిస్తుంది కూడా,” మామయ్య అన్నాడు.
“ఇదేదో బావుందే,” ఆలోచన నాకు నచ్చింది. “ఈ పాతాళగంగ దారి చూపిస్తుంటే ఇక మనకి తిరుగేముంది?”
“అబ్బో! అల్లూడికి మళ్లీ ఉత్సాహం వచ్చినట్టుందే!” నవ్వుతూ అన్నాడు మామయ్య.
“అవును మామయ్య. ఇప్పుడు కాస్త ఓపిక వచ్చింది.”
“అవును. కాని కాస్త విశ్రమించి మళ్లీ బయల్దేరుదాం.”
అది రాత్రి వేళ అని మా కాలమానిని చెప్తోంది.
కాసేపట్లోనే ముగ్గురం గాఢ నిద్రలోకి జారుకున్నాం.
- ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం -
0 comments