అధ్యాయం 24
మర్నాడు ఉదయం లేచే సరికి మా అలసట అంతా ఎవరో చేత్తో తీసేసినట్టు ఎగిరిపోయింది. అసలు దాహమే వెయ్యడం లేదు. కారణం ఏమై వుంటుందా అని ఆలోచించాను. సమాధానంగా నా పాదాల వద్ద చిట్టేటి గలగలలు వినిపించాయి.
ముగ్గురం ఫలహారం చేశాం. కెలీబియేట్ నీటిని తనివితీరా తాగాం. ఏనుగంత బలం వచ్చినట్టు అనిపించింది. ఆత్మ విశ్వాసం రెండింతలయ్యింది. కొండంత సంకల్పబలం ఉన్న మావయ్య, వేసట మాటే తెలీని వేటగాడు హన్స్ తోడు ఉండగా, అడపాదపా మొరాయించినా జీవనోత్సాహంతో ఉర్రూతలూగే నాలాంటి అల్లుడు ఉండగా, జయమ్ము నిశ్చయమ్ము కాక మరేమవుతుంది? ఈ క్షణం ఎవరైనా నాతో తిరిగి వెనక్కి వెళ్లిపోదాం అని అంటే నిర్మొహమాటంగా ‘కుదరద’ని చెప్పేసేవాణ్ణే!
ఇక అక్కణ్ణుంచి కిందికి దిగి వెళ్ళడమే మా తక్షణ కర్తవ్యం.
“పదండి పోదాం!” నా మాటలు భూగర్భపు గొంతుకలో ప్రతిధ్వనించాయి.
గురువారం 8 గంటలకి మా యాత్ర మొదలయ్యింది. హొయలు తిరుగుతూ ముందుకి చొచ్చుకుపోతున్న శిలా సొరంగం ఓ జటిలమైన చిక్కుముడిలా వుంది. మొత్తం మీద అది ఆగ్నేయదిశలో విస్తరించినట్టు అనిపించింది. మామయ్య పదేపదే దిక్సూచిని చూసుకుంటూ దారి ఎటు పోతోందో కనిపెట్టుకుంటూ వున్నాడు.
మేం నడుస్తున్న బాటకి వాలు పెద్దగా లేదు. మా పాదాలని తాకుతూ ప్రవహించే నీటి గలగలలు నేపథ్యంలో శ్రావ్యంగా ప్రతిధ్వనిస్తున్నాయి.ఆ ధ్వని వింటుంటే ఓ జలకన్యక మాపై దయతో దారిచూపుతున్నట్టు, స్నేహంగా చేయి తట్టి ధైర్యం చెప్తున్నట్టు అనిపించింది. మామూలుగా అయితే ఈ జలకన్యలని, వనకన్యలని నమ్మేరకాన్ని కాను. కాని మా నిస్సహాయ స్థితి ఊహలకి రెక్కలు వచ్చేలా చేస్తోంది కాబోలు.
మామయ్య మాత్రం పరుగెత్తుతున్నట్టుగా నడుస్తున్నాడు. తన మనస్తత్వానికి సూటిగా కిందికి పోయే దారి అయితే చక్కగా సరిపోయి వుండేది. నెమ్మదిగా కిందికి దిగే ఈ వాలు దారి తనలో అసహనాన్ని రేకెత్తిస్తోంది. ఎలాగైతేనేం నెమ్మదిగా భూమి కేంద్రం దిశగానే ప్రయాణిస్తున్నాం అన్న ఆలోచనతో తృప్తి పడడం తప్ప చేసేదేమీ లేదు.
అక్కడక్కడా వాలు పెరిగి దారి కిందికి లోతుగా చొచ్చుకుపోతుంది. అలాంటి సందర్భాలలో మా జలకన్య గుసగుస కాస్తా ఘోషగా మారుతుంది. ఆమెని వెన్నంటి మేం కూడా మరింత వేగంగా కిందికి దిగసాగాం.
మొత్తం మీద ఆ రోజు మాత్రం ఎక్కువగా నేలబారుగా ప్రయాణించాం గాని పెద్దగా లోతుకి వెళ్లలేకపోయాం.
శుక్రవారం సాయంత్రానికి అంటే జులై 10 వ తేదీ కల్లా రెయిక్ జావిక్ నగరానికి ముప్పై కోసులు అగ్నేయ దిశలో వున్నామని, భూగర్భంలో రెండున్నర కోసుల లోతుకి చేరామని అంచనా వెయ్యగలిగాం.
ప్రస్తుతం కిందికి చూస్తే మా ఎదుట ఓ భయంకరమైన అగాధం కనిపిస్తోంది. ఆ చీకటి లోతులని చూసి మామయ్య ఒక్కడే ఉత్సాహంగా చప్పట్లు చరిచాడు.
“అబ్బ! ఈ దారి వెంబడి పోతే పెద్ద సమస్య లేకుండా చాలా లోతుకి చేరుకుంటాం,” అన్నాడు ఉత్సాహంగా. “గోడల నుండి పొడుచుకొస్తున్న రాళ్లు చక్కని మెట్లదారిలా ఏర్పడ్డాయి.”
సొరంగం నోటి వద్ద శిలలకి హన్స్ త్రాళ్ళు కట్టాడు. ఆ తాళ్లు పట్టుకుని అవరోహణ మొదలెట్టాం. ఈ నుయ్యి, లేదా అగాధం, కంకర శిలలో ఏర్పడ్డ ఓ చీలిక లాంటిది. భౌగోళిక శాస్త్రవేత్తలు దీన్నే ‘దోషం’ (fault) అంటారు. స్నెఫెల్ పర్వతం వెళ్లగక్కిన నిప్పు నదికి ఇది ఒకప్పుడు బాట అయ్యిందంటే ఆ ప్రవాహపు ఆనవాళ్లు ఇప్పుడు కనిపించకపోవడం ఆశ్చర్యంగా వుంది. ఏదో మానవ హస్తం తీర్చి దిద్దినట్టుగా మెలికలు తిరిగిన మెట్ల దారిలో క్రమంగా కిందికి సాగాము.
(ఇంకా వుంది)
0 comments