శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

మన సమాజంలో సత్యం కన్నా వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత

జ్ఞానం పట్ల, ఆ జ్ఞానాన్ని సాధించగోరే విద్యార్థి పట్ల మన విద్యావిధానంలో సాధారణంగా చలామణిలో ఉండే కొన్ని తప్పుడు భావాల గురించి క్రిందటి పోస్ట్ లో చూశాం.

అలాంటిదే మన సమాజంలో ఉన్న మరో తప్పుడు ఆచారం – సత్యం కన్నా వ్యక్తులకి ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం. మన సమాజంలో విజ్ఞానం లోతుగా వేళ్లూనకపోవడానికి ఇది మరో కారణం అని నా అభిప్రాయం.

ఒక చిన్న ఉదాహరణతో మొదలెడదాం.

హర్గోబింద్ ఖొరానా పేరు అందరం వినే వుంటాం. పంజాబ్ లోని రాయపూర్ లో జన్మించిన ఈయన తదనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. మాలిక్యులర్ బయాలజీలో ప్రత్యేకించి జెనెటిక్ కోడ్ గురించి, ఆ కోడ్ కి ప్రోటీన్ సంయోగానికి మధ్య సంబంధాన్ని గురించి ఈయన చేసిన పరిశోధనలకి గౌరవార్థం ఈయనకి 1968 లో నోబెల్ బహుమతి ఇవ్వబడింది.

దేశానికి అంత గొప్ప గౌరవం తెచ్చిపెట్టిన ఆ వ్యక్తిని మన దేశప్రజలు ఘనంగా సత్కరించారు. పంజాబ్ లో ఆయన పుట్టిన రాయ్పూర్ లో మొదలుకుని దేశంలో ఎన్నో చోట్ల ఆయనకి గొప్పగా సన్మానాలు జరిగాయి. ఆ సన్మానాలలో ఆయన్ని “ఇంద్రుడు చంద్రుడు’ అని రకరకాలుగా కీర్తించారు, ఆకాశానికెక్కించారు. కాని విచిత్రమేమిటంటే ప్రతీ చోట ఆయనకి నోబెల్ బహుమతి వచ్చిందని పేర్కొంటారే గాని, ఆయనకి ఆ బహుమతి ఎందుకు వచ్చింది, ఆ ఆవిష్కరణ ఎందుకు గొప్పది అన్న విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. అసలా ప్రస్తావన అప్రస్తుతం అన్నట్టుగా అంతా ప్రవర్తించారు. (ఈ సన్మానాలు ఎలా ఉంటాయో మనకి బాగా తెలుసు.) ఒక దశలో ఖొరానికి మండిపోయింది. “బహుమతి ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోకుండా, ఇలా కీర్తిస్తున్నారు, మీరేం మనుషులు?” అంటూ విరుచుకు పడ్డాడట.

ఒక శాస్త్రవేత్త గాని, ఒక సినీనటుడు గాని, ఒక విద్వాంసుడు... ఏ రంగంలో నైనా ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు ఆ విజయం వెనుక ఆ సత్యం ఉంటుంది. ఫలానా విషయాన్ని ఆవిష్కరించాడు కనుక ఖొరానా గొప్పవాడు. ఇన్ని రన్నులు తీశాడు కనుక ఓ క్రీడాకారుడు గొప్పవాడు. ఫలానా రాగంలో దక్షత చూపించాడు కనుక ఫలానా విద్వాంసుడు గొప్పవాడు... కాని మన దేశంలో వ్యక్తిపూజ కాస్త హెచ్చు (కాస్తేం ఖర్మ చాలానే హెచ్చు) కనుక వ్యక్తి గొప్పదనానికి కరణాలు మర్చిపోయి, భక్తి పారవశ్యంతో స్తోత్రం చేసేస్తూ ఉంటాం.

కాని ఎప్పుడూ వ్యక్తుల కన్నా సత్యానికి, జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చే వైజ్ఞానిక ధర్మానికి ఈ పద్ధతి పూర్తిగా విరుద్ధం. ఖొరానాలోని శాస్త్రవేత్త వైజ్ఞానిక లోకానికి చెందిన ఆ మౌలిక నియమం అలా ఉల్లంఘించబడుతుంటే సహించలేకపోయాడు. అలా మండిపడడం ఆ “భజన బృందానికి” పొగరుగా కనిపించవచ్చు. అది పొగరు కాదు. అది శాస్త్రవేత్త ధర్మం.

పోనీ ఖొరానా నిజంగా గొప్పవాడే కనుక కాస్త ఆదమరచి భజన చేసినా ఫరవాలేదు అనుకోవచ్చు. కాని కొన్ని సార్లు ఈ సన్మానాలు మరీ హాస్యాస్పదంగా ఉంటాయి.

ఉదాహరణ 2: ఆ మధ్య ఓ ప్రొఫెసర్ సన్మానంలో హాజరు అయ్యాను. వెళ్లక తప్పింది కాదు. ఆ కాలేజిలో నే ఆయన పని చేసి రిటయిరయ్యారట. ఆ కాలేజిలోనే పని చేస్తున్న ఆయన శిష్యబృందం అంతా కలిసి ఆయనకి సన్మానం చేస్తున్నారు. ఇక ఒకరి తరువాత ఒకరు మైకు దొరకపుచ్చుకుని మొదలెట్టారు. ఆయన్ని ఐన్స్టయిన్ తో పోల్చారు. (ఆయన పరిశోధనల గురించి ఆ కాలేజిలో తప్ప బయట పెద్దగా తెలీదన్న విషయం నాకు తెలుసు!) గాంధీతో పోల్చారు. ఆయన లాంటి వారి వల్లనే విజ్ఞానం తెగ పురోగమిస్తోంది అన్నారు. ’నేడు మనిషి చందమామ మీద పాదం మోపాడు, రేపు.. ఏం తెలుసు...విజ్ఞానం ఇలాగే పురోగమిస్తే సూర్యుడి మీద వాలుతాడేమో ఏం తెలుసు? ఏం తెలుసు?” (కాస్తంత రెటారిక్ అన్నమాట). ఆ మాట్లాడుతున్న వ్యక్తకి ఏమీ తెలీదని తెలుస్తూనే ఉంది.

ఒక మనిషిని మీద ఉన్న అభిమానాన్ని (అది నిజంగా అభిమానమో, కల్లబొల్లి కబుర్లో ఏం తెలుసు? ఏం తెలుసు?) వ్యక్తం చెయ్యాలంటే సత్యాన్ని అలా సజీవదహనం చెయ్యడం అవసరమా? ముక్తసరిగా ఆయన సాధించిన నాలుగు విషయాలు, అతిశయోక్తి లేకుండా పేర్కొని, కృతజ్ఞతలు చెప్పి కూర్చుంటే సరిపోదా?

సత్యాన్ని పక్కన పెట్టి వ్యక్తులని పూజించే సమాజంలో విజ్ఞానం వేళ్లూనదు. ఎందుకంటే విజ్ఞానానికి ఈ వ్యక్తిపూజకి చుక్కెదురు.

మరో చిన్న ఉదాహరణ.

జపాన్ లో రైల్వే స్టేషన్ల లో నేను గమనించిన ఒక సర్వసాధారణమైన విషయం. కాని చూసిన ప్రతీసారి నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అక్కడ రైల్వే ప్లాట్ఫామ్ లు సాధారణంగా బాగా కిక్కిరిసి ఉంటాయి. రైలు ఆగినప్పుడు తలుపులు కచ్చితంగా ఫ్లాట్ఫామ్ మీద గీసిన కొన్ని గీతల వద్ద ఆగుతాయి. కనుక బయట నించున్న వారికి ద్వారాలు ఎక్కడికి వస్తాయో ముందే తెలుసు. ముందే ఆ ద్వారం వద్ద క్యూలు కడతారు. రైలు ఆగగానే ద్వారానికి అటు ఇటుగా, రైలుకి లంబంగా కాకుండా కొంచెం వాలుగా, రెండు క్యూలుగా ఏర్పడతారు. రైల్లోని జనం వరుసగా బయటికి నడుస్తారు. అంత మంది జనం బయటికి నడవడానికి ఓ పది సెకనులు కూడా పట్టదు. వాళ్లు బయటికి రాగానే ఈ రెండు క్యూల వాళ్లు సాఫిగా లోపలికి ప్రవహిస్తారు. అందుకు మరో పది సెకనులు! ఈ వ్యవహారంలో ఎక్కడా తొక్కిసలాట, అరుచుకోవడం, ఘర్షణ వంటివి ఉండవు. (ఇక మన దేశంలో రైలు అరగంట ఆగే చోట కూడా మనుషులు ఎలా ఎక్కి దిగుతారో మనకి తెలుసు!)

దీనికి భిన్నంగా మన దేశంలో లిఫ్ట్ లు ఎలా ఎక్కుతారో ఈ మధ్యనే ఓ తోటి బ్లాగ్ మిత్రుడు వివరించాడు. (ఆయనకి ఇష్టం ఉంటుందో లేదో తెలీదు కనుక ఆయన పేరు చెప్పడం లేదు.) మామూలుగా లిఫ్ట్ ఆగినప్పుడు ముందు లోపల ఉన్నవాళ్లు బయటికి రావడం పద్ధతి. లేకపోతే బయట ఉన్నవాళ్లు లోపలికి పోడానికి స్థలం ఉండకపోవచ్చు. దీన్ని అర్థం చేసుకోవడానికి “శాస్త్రవిజ్ఞానం” అక్కర్లేదు! కాని వాళ్ల కంపెనీలో ఎం.డీ. ఆగి వున్నప్పుడు లిఫ్ట్ వస్తే, ఎం.డి ముందు లిఫ్ట్ లోకి దూసుకుపోతాడట! ఆ తరువాత లిఫ్ట్ లో ఉన్న వాళ్లు ఇబ్బంది పడుతూ బయటికి రావాలి! లిఫ్ట్ లో వేగంగా, సౌకర్యంగా లోపలికి, బయటికి ఎలా పోవాలో చెప్పే ప్రాథమిక వైజ్ఞానిక సత్యం కన్నా వ్యక్తులు, వాళ్ల అహంకారాలే ముఖ్యం అన్నమాట!

అంతే కాదు మన సమాజంలో వ్యక్తులు జ్ఞానం వాళ్ల సొత్తు అన్నట్టు ప్రవర్తిస్తారు. పైపెచ్చు పారంపర్యం (hierarchy) బాగా పాతుకు పోయిన సమాజం కనుక పైవాడు చెప్పింది వేదం అన్నట్టుగా ఉంటుంది. ఆ పరంపరలో వ్యక్తి ఎంత ఎత్తున ఉంటే ఆ మాటకి అంత విలువ. అందులో సత్యం ఉందాలేదా అన్న ప్రస్తావన పెద్దగా రాదు. తాత చెప్పింది వేదం, తండ్రి చెప్పింది గీత, నాకు తెలిసింది సుమతీశతకం!!!

ఇందుకు మరో ఉదాహరణ. నేను ఆంధ్రా యూనివర్సిటిలో ఒక ఏడాది ఇంజినీరింగ్ చేసి తరువాత కొన్ని కారణాల వల్ల మరో కాలేజికి మారిపోవడం జరిగింది. మొదటి సంవత్సరం ర్యాగింగ్ లో ఒక సీనియర్ (ఆట్టే సీనియరేం కాడు, రెండో సంవత్సరమే) పిలిచి కాస్తంత సాంకేతిక ర్యాగింగ్ కి దిగాడు. మా సంభాషణ -

సీనియర్: Root 2 కి factorial ఎంత?
(మాములుగా అయితే factorial పూర్ణసంఖ్యలకి మాత్రమే ఉంటుంది. )

జూనియర్ (అవసరమైనంత వినయంగా): మామూలుగా అయితే factorial పూర్ణసంఖ్యలకి మాత్రమే ఉంటుందండి. కాని factorial భావనని Euler అన్ని వాస్తవ సంఖ్యలకి (real numbers) విస్తరించి Gamma function ని కనిపెట్టాడండీ. దానిసహాయంతో squareroot(2) కి factorial ని లెక్కెట్టొచ్చండీ.
(ఆ వ్యక్తి స్పందన ఇప్పటికీ మర్చిపోలేను...)
సీనియర్: అబ్బా! అలంటిది అంటూ ఉంటే... సీనియర్లమి... మాకు తెలీదా?

నిజంగా సీనియర్ అయితే, మరి సీనియర్ కి ఉండాల్సిన మానసిక పరిపక్వత ఉన్నవాడే అయితే, జ్ఞానాన్ని, సత్యాన్ని గౌరవించే వాడే అయితే, నేను చెప్పినదాన్ని సవాలు చేసేవాడు, దాన్ని నిరూపించమని నిలదీసేవాడు. పోనీ తనే లైబ్ర్రరీకి వెళ్లి పుస్తకాలు తిరగేసి నేను చెప్పింది నిజమే కాదో సరిచూసుకునే వాడు. కాని అప్పుడుగాని, ఆ తరువాత గాని ఆ “సీనియర్” నాకు తెలిసి ఆ విషయాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చెయ్యలేదు. సత్యం కన్నా వ్యక్తి, అహంకారం ఎక్కువని తెలిపే మరో ఉదాహరణ ఇది.

ఇలా ఎన్నైనా ఉదాహరణలు చెప్తూ పోవచ్చు. సత్యాన్ని గౌరవించలేని సమాజంలో విజ్ఞానం వేళ్లూనదు అనడంలో సందేహం లేదు.

ఎందుకంటే విజ్ఞాన లోకం ఓ అపురూపమైన లోకం. అందులో వ్యక్తులకి, వ్యక్తిత్వాలకి స్థానం లేదు. అహంకారపు ఛాయ కూడా ఆ విరాజమాన వేదిక మీద పడలేదు. ఒకే ఒక వేల్పు – నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే వేల్పు – ఆ లోకం కేంద్రంలో మౌనంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వేల్పు పేరు సత్యం. ఆ వేల్పు నుండి రాలిన సుమాలు – సిద్ధాంతాలు, సూత్రాలు, ప్రయోగాల ఫలితాలు, నియమాలు, ప్రభావాలు,... ఆ సీమని అలంకరిస్తుంటాయి. ఆ లోకంలోకి ప్రవేశం కాదు కదా, కనీసం తొంగి చూడడానికైనా ఒక కనీస మానసిక లక్షణం ఉండాలి. ప్రతీ సన్నివేశంలో, ప్రతీ సంకటంలో, ప్రతీ సంఘటనలో వ్యక్తిని, అహంకారాన్ని పక్కన పెట్టి సత్యాన్ని ప్రతిష్ఠించే సంసిద్ధతే ఆ లక్షణం. ఆ లోకంలోకి అడుగిడడానికి ప్రవేశార్హత.

ఆ లక్షణం లోతుగా, బలంగా ఉన్న జాతిలో విజ్ఞానం బలపడుతుంది. అదే లక్షణం వల్ల ప్రజాస్వామ్యం కూడా వర్ధిల్లుతుంది. దేశాన్ని భూతల స్వర్గంగా మార్చడానికి ఆ ఒక్క లక్షణం చాలనిపిస్తుంది.


ఆ లక్షణం ఉన్నవాడే అసలు శాస్త్రవేత్త. అందుకు పట్టాలు, పీహెచ్ డీలు అక్కర్లేదు. అలాంటి పట్టాల్లేని అనుపమాన శాస్త్రవేత్తల గురించి మరో పోస్ట్ లో...

“జ్ఞానం అన్న పదం పట్ల మన అవగాహనలో ఒక మౌలిక దోషం ఉంది” అని కిందటి పోస్ట్ చివర్లో చెప్పుకున్నాం.

ఆ తప్పుడు అవగాహన మన విద్యావిధానాలలో ఎన్నో రకాలుగా ప్రతిబింబిస్తుంది. దాని పర్యవసానాలని మనం ఎన్నో రకాలుగా అనుభవిస్తున్నాం. శాస్త్రరంగంలో ముఖ్యంగా శాస్త్ర సృజనలో మనం వెనుకబడడానికి కూడా ఆ తప్పుడు అవగాహనే కారణం అని నా నమ్మకం.
మన దృష్టిలో జ్ఞానం అనేది పుస్తకాలలో, హార్డ్ డిస్కులలో, ట్యూషన్ మాస్టర్ల బుర్రల్లో, ఇంటర్నెట్లో ఇలా నానారకాల మాధ్యమాలలో విస్తరించి ఉన్న ఒక జడ రాశి. చదువు అనే ప్రక్రియలో ఆ రాశిని వీలైనంత మేరకు మన తలలోకి, లారీలోకి బస్తాలని ఎక్కించినట్టు, ఎక్కించుకోవడం జరుగుతుంది. ఎంత ఎక్కించుకుంటే అంత లాభం! భవిష్యత్తులో ఆ వ్యక్తి అంత ప్రయోజకుడు అవుతాడు.

ఇంటి చివరి బడి నుండి, ఐ.ఐ.టి.ల వరకు ఈ ధోరణే ఎన్నో రకాలుగా కనిపిస్తుంది. విజ్ఞానం వేగంగా పెరిగిపోతోంది కనుక రాష్ట్ర స్థాయి లో కూడా సైన్స్ సిలబస్ బాగా పెంచేస్తారు. ఇక పల్లెల్లో సరైన స్కూలు భవనం ఉంటే గొప్ప అనే పరిస్థితుల్లో పిల్లవాణ్ణి క్వాంటం మెకానిక్స్ చదవమంటే ఎక్కడికవుతుంది? తన పరిసరాలకి, జీవితానుభవానికి, ఆ పుస్తకాల్లోని చదువుకి ఎక్కడా సంబంధం కనిపించదు. అక్కడ హైదరాబాద్ లో కొందరు “నిపుణులు” కూడబలుక్కుని “పిల్లలకి ఇవన్నీ తెలిస్తే బావుంటుంది” అని నిర్ణయించేసి సిలబస్ రూపొందిస్తారు. ఆ నిపుణులు తప్ప విద్యావ్యవస్థలో తక్కిన వారంతా (టిచర్లు, పిల్లలు, ట్యూషన్ మాస్టర్లు, తల్లిదండ్రులు మొ||) ఆ సిలబస్ ని మింగలేక కక్కలేక తలమునకలవుతుంటారు!

కొన్ని ప్రఖ్యాత JEE కోచింగ్ సెంటర్లలో సబ్జెక్టుకి పది వేల లెక్కల చొప్పున (మొత్తం 30,000 లెక్కలన్నమాట!) చెయ్యిస్తారని ఆ సెంటర్లలో చదువుకున్న పిల్లలు చెప్తుంటారు. పదో క్లాసు లెక్కల ట్యూషన్లలో ’ముఖ్యమైన లెక్కలని’ ఇంపోజిషన్ రాయించడం నేను కళ్ళారా చూశాను. ఇలాంటి చదువుకి, కట్టెలుకొట్టడం, నీళ్లు తోడడం లాంటి పనులకి పెద్దగా తేడా ఉన్నట్టు కనిపించదు. చదువులో ఆనందించదగ్గ సారం, అంతర్యాన్ని పోషించదగ్గ రసం అంటూ ఏదైనా ఉంటే దాన్ని జాగ్రత్తగా వేరు చేసి, అవతల పారేసి, ఇక మిగిలిన పిప్పిని శ్రద్ధగా పిల్లలకి మేపుతారు – భవిష్యత్తులో పనికొస్తుందని!

(కొంచెం అసందర్భంగా అనిపించినా, ఈ సందర్బంలో గుర్తొస్తున్న ఒక సినిమా సన్నివేశాన్ని చెప్పకుండా ఉండలేకున్నాను. ’నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో ’వండర్ వర్ల్డ్’ కి వెళ్తున్న బ్రహ్మానందం తీసుకునే “ముందుజాగ్రత్త” లంత హాస్యాస్పదంగా ఉంటున్నాయి మన చదువులు.)

ఐ.ఐ.టి.లో కూడా నిజానికి పరిస్థితి అంత వేరుగా ఏమీ లేదు. మొదటి సంవత్సరం అన్ని బ్రాంచిల పిల్లలకి గ్రహగతులని గణితసమీకరణాలతో ఎలా సాధించాలో నేర్పిస్తారు. (దీనికి, ఒక సగటు ఇంజినీరు చేయబోయే పనికి, ఏంటి సంబంధం?) అలాగే మొదటి సంవత్సరంలో అన్ని బ్రాంచిల విద్యార్థులకి భౌతిక శాస్త్రంలో సాపేక్ష సిద్ధాంతాన్ని నేర్పిస్తారు. (ఇంజినీరుకి సాపేక్ష సిద్ధాంతంతో ఏం పని? అని అడిగాను ఒక సహోద్యోగిని. సాటిలైట్ కమ్యూనికేషన్లలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పనికొస్తుంది! అని వచ్చింది సమాధానం!) కాని ఐ.ఐ.టి.లో ఒక సద్విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలకి లభించే అపారమైన స్వేచ్ఛ. పిల్లలకి స్ఫూర్తి దాయకమైన ఎన్నో అనుభవాలని ఇక్కడ పొందే అవకాశాలు ఉంటాయి. ఆ స్వేచ్ఛలో, ఆ స్ఫూర్తిని ఆసరాగా చేసుకుని పిల్లలు వాళ్ళకేంకావాలో తెలుసుకునే అవకాశం ఉంటుంది.


ఈ ధోరణి వెనుక “జ్ఞానం ఒక జడ పదార్థం” అన్న భావన కనిపిస్తుంది. అంతే కాదు ఆ జ్ఞానాన్ని నేర్చుకునే వ్యక్తి కూడా ఓ జడ పాత్ర! ఆ జడ పదార్థాన్ని, ఈ జడ పాత్రలోకి కూరే కార్యక్రమాన్నే చదువు అంటారు!

కాని ఈ కూరుడు కార్యక్రమం నూటికి తొంభై సార్లు విఫలం అవుతుంది. కాని ఆ విషయాన్ని విద్యాప్రణాళిక యొక్క సూత్రధారులు ఒప్పుకోవడానికి ఇష్టపడరు.

1. ఈ కూరుడు పద్ధతి చదువు అంటే వెగటు పుట్టేలా చేస్తుంది. ఉద్యోగమనే బహుమతి పొందడానికి చదువు ఒక తప్పనిసరి శిక్ష అన్నట్టు ఉంటుంది.
2. విద్యార్థులు (మంచి గ్రేడ్లు ఉన్న వాళ్లు కూడా) ఒక సెమిస్టర్ లో చదివింది (సూక్ష్మాలు కాదు, మౌలిక విషయాలు కూడా) తదుపరి సెమిస్టర్ లోనే మర్చిపోవడం ఎన్నో సార్లు చూశాను. మరి కూరింది అంతా ఏమయ్యింది?
3. ప్రొఫెసర్లు సాపేక్షతా సిద్ధాంతం ఆదిగా ఇంజినీరింగ్ చదువుని బలోపేతం చెయ్యాలని ఏరికోరి ఎన్నో నేర్పిస్తే, ఆ ఇంజినీరు ఠక్కున ఎం.బీ.ఏ. కి మారిపోతాడు.కూరినదంతా గంగలో కలిసింది.
4. మరో విచిత్రమైన పరిణామం. నేను చూసిన ఇంజినీరింగ్ విద్యార్థులలో చాలా మంది (ఎన్నో కోర్సులు చేసి, మంచి గ్రేడ్లు సంపాదించిన వారు కూడా) చివరి సంవత్సరంలో బాహ్యప్రపంచాన్ని ఎదుర్కునే ఆత్మవిశ్వాసం లేదని వాపోతూ ఉంటారు. అంతే కాదు ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి వాళ్లకి ఒక విషయం బాగా తెలుస్తూ ఉంటుంది.

అంతవరకు వారు చూసినది ఓ పరిమితమైన, కృత్రిమ ప్రపంచం - కోర్సులు, టెక్స్ట్ బుక్కులు, మాస్టర్లు, పరీక్షలు.. ఇది వాస్తవంతోను, వాస్తవంలో ఎదురయ్యే సవాళ్లతోను పెద్దగా సంబంధం లేని ప్రపంచం. ఆ ప్రపంచం నుండి బయటపడి ఒక్కసారి వాస్తవాన్ని ఎదుర్కునే అవకాశం దగ్గర పడేసరికి, ఆ కృత్రిమ ప్రపంచానికి, యదార్థానికి మధ్య ఉండే అగాధమైన వారడిని గుర్తిస్తారు విద్యార్థులు. దాంతో భయం పట్టుకుంటుంది.
ఇలా ఎందుకు జరుగుతుంది? అన్ని విషయాలు వీళ్ల బుర్రల్లోకి కూరినా ఆత్మవిశ్వాసం లేకపోవడం ఏంటి?

కనుక మనకి మరో సారి కనిపించేది ఏంటంటే, జ్ఞానం అనేది ఓ జడపదార్థం కాదు. జ్ఞానం అంటే యదార్థంతో సమర్థవంతంగా తలపడగల సత్తా. అది ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం లేకపోవడం ఉండదు. భవిష్యత్తుని ఎదుర్కునే సన్నాహం అంటే నానా విషయాలని తలనిండా పట్టించుకోవడం కాదు; యదార్థంతో తలపడే సత్తాని పెంచుకోవడం. ఆ సత్తాని పెంచుకోవడమే విద్య యొక్క అసలు లక్ష్యం.

పుస్తకాల వల్ల, పరీక్షల వల్ల ఆ సత్తా పెరగక పోతే దాన్ని పెంచుకోవడానికి ఏంటి మార్గం? యదార్థంతో తలపడే సత్తా పెరగాలంటే, యదార్థంతో మళ్లీ మళ్లీ తలపడాలి. యదార్థాన్ని ప్రత్యక్షంగా చూడాలి, అనుభవించాలి. విద్యార్థి అలా యదార్థంతో, యదార్థ సమస్యలతో పోరాడుతున్నప్పుడు, ఆ పోరాటం మధ్యలో, ఆ సందర్భానికి తగిన విషయాలు (మాత్రమే!), సకాలంలో, అక్కడికక్కడ నేర్పించాలి. దీన్నే “just in time” learning అంటుంటారు. అందుకేనేమో గీతాపాఠం యుద్ధభూమిలో జరిగింది... క్లాస్ రూమ్ లో కాదు!

కనుక వీలైనన్ని విషయాలని వంటిబట్టించడం భవిష్యత్తుకి సరైన సన్నాహం కాలేదు. ఓ కొత్తసమస్య ఎదురైనప్పుడు దానికి కావలసిన జ్ఞానాన్ని తనకై తాను వెతికి, శోధించి, సాధించగల శక్తిని పెంచుకోవడమే సరైన సన్నాహం. (అంతకి మించి ఎవరూ ఏమీ చెయ్యలేరు కూడా). చదువు పూర్తయ్యాక విద్యార్థి తనతో బాహ్యప్రపంచంలోకి తీసుకుపోయేది తట్టెడు విషయాలు కాదు. శోధించి జ్ఞానాన్ని సాధించే సత్తా మాత్రమే బయటి ప్రపంచంలో తనకి బాసటగా నిలుస్తుంది.
(“చేపని అందించకు, చేపని ఎలా పట్టాలో నేర్పించు.” – జీసస్ క్రైస్ట్).
ఈ గ్రహింపు మన విద్యావ్యవస్థల్లో మెల్లమెల్లగా పెరుగుతోంది. అందుకే ప్రాజెక్ట్ ల ద్వారా నేర్చుకునే పద్ధతి పెరుగుతోంది. (కాని కొన్ని సంస్థల్లో దీన్ని కూడా ఒక కుటీరపరిశ్రమగా, కొన్ని సార్లు ఇంకా అధ్వానంగా ఓ స్మగ్లింగ్ రాకెట్ గా, మార్చుతున్నారు. అది వేరే విషయం.)

“పుస్తకాలు చదివి పరీక్షలు రాసే” పద్ధతి కన్నా “ప్రాజెక్ట్” పద్ధతి మరింత మెరుగైనదే అయినా మరో ముఖ్యమైన సత్యాన్ని విస్మరిస్తే ఈ ప్రాజెక్ట్ పద్ధతి కూడా విఫలం కాక తప్పదు.

ఎందుకంటే...

“జ్ఞానం జడ పదార్థం కానట్టే, విద్యార్థి కూడా జడ పాత్ర కాడు:”

కనుక ఆ పాత్రలో మనం ఏం కావలిస్తే అది (పుస్తకాల ద్వారా అయినా, ప్రాజెక్ట్ ల ద్వారా అయినా) పొయ్యడానికి వీలుపడదు. కొన్నిటిని ఆ పాత్ర ఆవురావురని జుర్రుతుంది. కొన్నిటిని విసిరికొడుతుంది. ఎందుకంటే అదో సజీవమైన, సచేతనమైన పాత్ర!. ఏది పడితే అది ఆ పాత్ర స్వీకరించదు.


ఉదాహరణ 1: నాకు ’లా’ కి సంబంధించిన సాహిత్యం ఎప్పటికీ అర్థం కాదేమో. మేం రాసిన సాంకేతిక విషయాన్ని లాయరు పేటెంట్ కింద తిరగ రాసి వినిపిస్తే ఏదో కొత్త భాష వింటున్నట్టుగా ఉంటుంది. గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. నా బోటి వాడు తలక్రిందులు తపస్సు చేసినా లాయరు కాలేడు.

ఉదాహరణ 2: ఐదేళ్ల పిల్లవాడికి ప్రేమకథలు చెప్తే అర్థం కాదు. తదనుగుణమైన అంశం వాడి అంతర్యంలో ఇంకా వికసించలేదు. కనుక దాని ఆనవాళ్లు బాహ్యప్రపంచంలో కనిపించినా వాటిని గుర్తించలేకపోతాడు, వాటికి స్పందించలేడు.


ఒక జ్ఞానం మనకి జీర్ణం కావాలంటే, దానికి సంబంధించిన శక్తి మనలో ఉండాలి. కనుక ఒకరకంగా జ్ఞానం అనేది మనలోనే ఉన్న ఒక తత్వం అన్నమాట. అయితే అది మామూలుగా ప్రచ్ఛన్నంగా ఉంటుంది కనుక దాన్ని గుర్తించం. మనలో ముందే ఉన్నదాన్నే బోలెడు బాహ్య యంత్రాంగపు (విద్యాసంస్థలు, టిచర్లు, ఫీజులు, పరీక్షలు, పోటీలు...) భారమైన ఆసరాని ఉపయోగించి ఏళ్ల తరబడి చదువుకుంటాం, తెలుసుకుంటాం.

’నిన్ను నీవు తెలుసుకో’ అని అధ్యాత్మికత చెప్తుంది. ఆత్మజ్ఞానమే అన్నిటికన్నా మహోన్నతమైన జ్ఞానం అంటుంది. ఆత్మజ్ఞానం అన్నిటికన్నా మహోన్నత జ్ఞానం కావడమే కాదు, అది తప్ప మరో జ్ఞానమే లేదని అనుకోవాల్సి ఉంటుంది! మన అంతర్యంలో ముందే ఉన్నది తప్ప మనకేదీ అర్థం కాదు కనుక, మన అంతర్యాన్ని తెలుసుకోవడమే చదువు. మన అంతర్యం ప్రపంచంలో ఉన్న కొన్ని ప్రేరణలకి సులభంగా స్పందిస్తుంది, ఆ ప్రేరణలని సులభంగా అర్థం చేసుకోగలుగుతుంది. ఆ ప్రేరణలతో, ఆ ప్రేరణలు ఉన్న రంగంతో, సులభంగా వ్యవహరించగలుగుతుంది. మన అంతర్యంలో ఏముందో తెలుసుకుంటే మన చదువు సార్థకం అయినట్టే.

అందుచేత చదువు అనేది ఒక జడ పదార్థానికి, జడ పాత్రకి సంబంధించిన విషయం కాదు. ఓ సజీవ, సంచలిత, నిత్యనూతన యదార్థానికి, అ యదార్థాన్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకుని, దానికి స్పందించగల, మనలోనే ఉన్న ఒక సత్తాకి సంబంధించిన విషయం.

విద్యార్థి అంతర్యంలో ఏముందో – అంటే అతడి స్వభావం – తెలీకుండా జరిపే చదువు సంపూర్ణం కాలేదు, సఫలం కాలేదు. ఎప్పుడూ సిలబస్ మీద, పుస్తకాల మీద, స్కూలు భవనాలు, పరీక్షలు, మొ|| బాహ్య విషయాల మీద ధ్యాస పెట్టే మన విద్యా విధాన సూత్రధారులకి విద్యార్థుల స్వభావం అనేది అప్రస్తుత విషయంలా అనిపిస్తుంది. ఆ విస్మృతి యొక్క విధ్వంసాత్మక ఫలితాలు మనమంతా అనుభవిస్తున్నాం.

వ్యక్తి యొక్క స్వభావం తన చదువుకే కాదు, ఆ తరువాత చేయబోయే వృత్తితో కూడా లోతుగా ముడివడి ఉంది.

ఉదాహరణ: నాకు తెలిసిన వ్యక్తి ఓ విద్యాసంస్థలో పని చేస్తూ, ఒక దశలో ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. పని చాలా సులభమే. జీతం కూడా బాగా ఉండేది. కంపెనీలో మంచి పేరు కూడా వచ్చింది. కాని మనసుకి నచ్చని పనిని రోజూ తిట్టుకుంటూ చేసేవాడు. కొన్నేళ్ల తరువాత ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. మళ్లీ విద్యారంగంలో, మరింత తక్కువ జీతంతో చేరాడు. ఆనందంగా ఉన్నాడు.

చదువు, వృత్తి స్వభావానికి అనుగుణంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది, ధన్యం అవుతుంది. అలంటి చదువు, వృత్తి మనిషికి మనుగడనే కాదు, ఆంతరికమైన పురోగతిని ఇస్తాయి. జీవన సాఫల్యాన్ని ఇస్తాయి.


సారాంశం:
1. జ్ఞానం జడ పదార్థం కాదు. విషయాలని అంతులేకుండా తలకెక్కించుకోవడం భవిష్యత్తుకి సన్నాహం కాలేదు.
2. జ్ఞానం అంటే యదార్థంతో సమర్థవంతంగా తలపడే సత్తా. శోధించి జ్ఞానాన్ని సాధించే సత్తా. దాన్ని పెంచుకోవడానికి యదార్థంతో తలపడాలి.
3. విద్యార్థి కూడా జడ పాత్ర కాడు. అందులో ఏది పడితే అది ప్రవేశపెట్టడానికి వీలుకాదు.
4. చదువుకోవడం అంటే మన అంతర్యంలో ఏముందో తెలుసుకోవడమే. మనలో లేనిది మనకి బయట కనిపించినా దాన్ని అర్థం చేసుకోలేం.
5. వ్యక్తి తనని తాను తెలుసుకునే ప్రయత్నం చదువులో ఓ ముఖ్యభాగం కావాలి.
6. చదువు, వృత్తి మన స్వభావాన్ని అనుసరించి ఉంటే జీవన సాఫల్యం కలుగుతుంది.

ఓ కొత్త సైన్స్ బ్లాగ్

Posted by V Srinivasa Chakravarthy Wednesday, January 27, 2010 0 comments

మా సంస్థలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ పిల్లలకి తప్పనిసరిగా National Service Scheme (NSS) అనే శిక్షణా కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా రకరకాల సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు. పల్లెటూరి బడులలో చదువు చెప్పడం, లేదా చెన్నైలోనే ప్రభుత్వ బడులలో చదువు చెప్పడం మొదలైనవి చేస్తుంటారు. అలాగే వృద్ధాశ్రమాలలో, ఆసుపత్రులలో వివిధ సేవా కార్యక్రమాలు నడుపుతుంటారు.
ఈ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ఒక కొత్త సైన్స్ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది. దాని లింక్:

www.kaleidoscopeindia.blogspot.com

భారతీయ భాషల్లో సైన్సు ప్రచారం చెయ్యాలనే ఉద్దేశంలో ఈ బ్లాగ్ లో వివిధ భారతీయ భాషల్లో సైన్సు వ్యాసాలు రాస్తారు. చాలా మటుకు విద్యార్థులు రాసినవే అయినా, ఫాకల్టీ వ్యాసాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో వ్యాసాల సంఖ్య పెరిగాక వాటిని శాస్త్రం ప్రకారం, అంశం ప్రకారం క్రోడీకరించి ఒక వెబ్సైట్ లో ప్రచురించాలని ఉద్దేశం.

శాస్త్ర విజ్ఞానం బ్లాగ్ లాగానే ఈ బ్లాగ్ ని కూడా ఆదరిస్తారని తలుస్తూ...

సృజనత్మకమైన స్వేచ్ఛ + క్రమబద్ధీకరణ = చదువుకి మరింత మెరుగైన ఫార్ములా

బ్లాగర్లకి గణతంత్ర దిన శుభాకాంక్షలు!
ఈ రెండవ ఉదాహరణ కూడా జాన్ హోల్ట్ రాసిన ’How children learn?’ అన్న పుస్తకం నుండి తీసుకున్నదే.
ఇందులో హోల్ట్ తన మిత్రులు కొందరు పిల్లలతో చేసిన కొన్ని ప్రయోగాల గురించి ఒక చోట ఇలా వర్ణిస్తాడు.

కొత్త కొత్త పద్ధతుల్లో ఆసక్తికరంగా పిల్లలకి చదువు చెప్పడంలో చిరకాల అనుభవం ఉన్న Bill Hull తదితరులు బాగా చిన్న పిల్లలకి రంగులు, పరిమాణాలు, ఆకృతులు మొదలైన భావనలు నేర్పడానికి పనికొచ్చేట్టుగా ’Attribute blocks’ లేదా ’A blocks’ అనే విద్యాసంబంధమైన సామగ్రి రూపొందించారు. ఆ సామగ్రిని పిల్లలకి పరిచయం చేసే రోజు వచ్చింది. ఎంతో కష్టపడి వాళ్ల అనుభవం, తెలివితేటలు అన్నీ రంగరించి చేసిన ఆ సరంజామాకి పిల్లలు ఎలా స్పందిస్తారో చూద్దామని ఆ విద్యావేత్తలు ఉత్కంఠగా ఉంది.

పిల్లలు రాగానే ఒక్కొక్కర్ని పిలిచి ఆ సామగ్రిని ఎలా వాడాలో, వాటితో రకరకాల ఆటలు, పజిల్స్ అన్నీ ఎలా చెయ్యాలో, వివరించారు. కాని వాళ్లు ఆశించినట్టుగా పిల్లలు వాటి మీద ఎగబడి ఆడలేదు. కొంచెం బలవంతం చేస్తే ఏదో విధిలేక ఆడారు గాని అందులో వాళ్లకి ఉత్సాహం ఉన్నట్టు కనిపించలేదు.

ఇలా లాభంలేదని ఆ గురువులు వాళ్ల పద్ధతిని మార్చుకున్నారు. (అదే మన గురువులైతే ఆ పిల్లల తలలు వాచేలా తిట్టి, అవసరమైతే రెండు పీకి ’ఆడించే’ వారేమో!) ఈ సారి పిల్లలు వచ్చినప్పుడు పూనుకుని వాళ్లకి ఆ బ్లాక్స్ ఎలా వాడాలో కూర్చోబెట్టి ’బోధించ’లేదు. పిల్లల్ని వాళ్లకి ఇష్టం వచ్చినట్టు వాటితో ఆడనిచ్చారు. అసలు నియమాలని పక్కన బెట్టి పిల్లలు ఆ బ్లాక్స్ తో వాళ్లే ఏవో కొత్త నియమాలు తయారుచేసుకుని కొత్త కొత్త రీతుల్లో ఆడుకోసాగారు. (వీళ్లంతా ఐదేళ్లు నిండని పసివాళ్లు!) వారి ఊహాలోకమంతా ఆ ఆటలోకి ప్రవేశించింది. ఒక వస్తువుని నాన్న అన్నారు, మరో వస్తువు అమ్మ అయ్యింది. అలాగే కుక్క, పిల్లి, కార్లు, కుటీరాలు... వాటితో రకరకాల నిర్మాణాలు చేసుకున్నారు. ఈ “ఆట” చాలా సేపు సాగింది.

మామూలుగా పెద్ద వాళ్లు ఈ వ్యవహారాన్ని చూస్తే ఈ ’అర్థం పర్థం లేని ఆట” ని ఆపి వాటిని సక్రమంగా ఎలా వాడాలో నేర్చుకోమని నిర్బంధం చేస్తారు. కాని బిల్ హల్ మొదలైన వాళ్లు పిల్లలు ఆడుతున్న ఈ కొత్త ఆటలో జోక్యం చేసుకోకుండా అలా వారిని ఆడినంత సేపు ఆడనిచ్చారు. పిల్లలని చాలా సేపు అలా వాళ్లకి నచ్చిన తీరులో ఆ బ్లాక్స్ తో ఆడనిచ్చాక, అప్పుడు మెల్లగా టీచర్లు రంగప్రవేశం చేసి, వాటితో మరింత సంక్లిష్టమైన, ఆసక్తికరమైన ఆటలు ఎలా ఆడాలో నేర్పించారు. ఈ సారి పిల్లలు ఉత్సాహంగా టీచర్లు చెప్పింది నేర్చుకోడానికి సిద్ధమయ్యారు. ఆ తరువాత ఆ బ్లాక్స్ ల వినియోగంలో వేగంగా పురోగమించారు.


ఇలా ఎన్నో ప్రయోగాలలో పిల్లల ప్రవర్తన చూసి విద్యావేత్తలు ఒక అవగాహనకి వచ్చారు:

పిల్లలు నేర్చుకునే క్రమంలో రెండు దశలు ఉంటాయి/ఉండాలి.

1. మొదటి దశలో పిల్లలు ప్రత్యేక ప్రణాళిక లేకుండా, మితిమీరిన నియమావళి లేకుండా, ఒక రంగానికి సంబంధించిన పరిసరాలలో స్వేచ్ఛగా వ్యవహరిస్తారు, పని చేసుకుంటారు, ఆడుకుంటారు. ఇలా స్వేచ్ఛగా వ్యవహరించడం వల్ల ఆ రంగంతో, ఆ రంగానికి సంబంధించిన సాధన సామగ్రితో పరిచయం ఏర్పడుతుంది, అవి అలవాటు అవుతాయి. వాటి పట్ల భయం పోతుంది. అన్నిటి కన్నా ముఖ్యంగా వాళ్లకి తోచుకున్నటు ఆడుకుంటారు కనుక, వారికి అందులో ఒక సహజమైన ఉత్సాహం ఉంటుంది.

2. రెండవ దశలో పెద్దలు/టీచర్లు రంగప్రవేశం చేసి మరింత క్రమబద్ధమైన బోధనని, శిక్షణని ప్రవేశపెట్టవచ్చు.

మన విద్యావిధానంలో పైన చెప్పబడ్డ ఒకటవ దశ ఇంచుమించు ఉండదనే చెప్పాలి. ఎప్పుడూ టైం టేబుల్ ప్రకారం పరిగెడుతున్న రైళ్లలా, ఎక్కడికి పోతున్నారో, ఎందుకు పోతున్నారో తెలీకుండా, తరగతి నుండి తరగతికి, సెమిస్టర్ నుండి సెమిస్టర్ కి, కాలేజి నుండి కాలేజికి, దేశం నుండి దేశానికి పరిగెడుతుంటారు. నచ్చిన చోట కొంచెం ఆగి, ఆ శాస్త్రంలోని సొగసుని ఆనందిద్దాం అంటే తీరిక ఉండదు. నచ్చని చోట ఆగకుండా సాగిపోదాం అంటే స్వేచ్ఛ ఉండదు. అందుకే మనసుకి పోషణ నివ్వాల్సిన చదువు తలనొప్పిగా దాపురిస్తుంది.

పిల్లలకి అందుబాటులో తగ్గ సాధన సామగ్రిని ఉంచి, వసతులు ఇచ్చి, అడిగినప్పుడు (కేవలం అడిగినప్పుడు మాత్రమే!!!) సరైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చి, తగినంత సమయాన్ని, బోలెడంత స్వేచ్చని ఇచ్చి, ముఖ్యంగా పొరబాట్లు చేసి నేర్చుకునే అవకాశాన్ని ఇస్తే ఎంత బ్రహ్మాండంగా పురోగమిస్తారో మరో చిన్న ఉదాహరణ:

ఇంజినీరింగ్ విద్యార్థుల్లో సృజనాత్మకత వ్యక్తం కావడానికి తగిన వసతి ఉండాలని మా సంస్థలో ఇటీవల Center for Innovation (CFI) అనే ఓ కేంద్రాన్ని ఆరంభించారు (http://cfi.iitm.ac.in/cfi/home). మా ఆలమ్నై ఇచ్చిన విరాళాల సహాయంతో ఈ కేంద్రాన్ని స్థాపించారు. ఇక్కడ క్లాసులు ఉండవు, గురువులు ఉండరు. అంతా విద్యార్థులే చూసుకుంటారు. వాళ్లే ప్రాజెక్ట్ లు ప్రతిపాదించుకుంటారు. ప్రాజెక్ట్ ఏ మాత్రం సమంజసంగా ఉన్నా దాన్ని ఆమోదించి ధనం మంజూరు చేస్తారు. ఈ వ్యవహారంలో ఫాకల్టీ పాత్ర పరిమితంగా ఉంటుంది. విద్యార్థులకి తమ ప్రయత్నంలో ఎక్కడైనా ఎవరైనా ప్రత్యేక నిపుణుడు సహాయం కావాలంటే, ఆ మనిషి దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతారు. అంతేగాని పిల్లల మీద అజమాయషీ చెయ్యడానికి ఎవరూ ఉండరు. అలాగే ఇక్కడ పిల్లలు చేసే పనులకి గ్రేడ్ లు, మార్కులు కూడ ఉండవు. మాములుగా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చెయ్యడానికి ముక్కి మూలిగే పిల్లలు ఇక్కడ రాత్రనక పగలనక కష్టపడడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మరి అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఊరికే ఆడుకుంటూ, డబ్బు వృధా చేస్తారని భయపడేవాళ్లు పొరబడ్డట్టే. ఇక్కడ పిల్లల కార్యక్రమాల్లో చక్కని సృజనాత్మక, అంకిత భావం కనిపిస్తుంది. రెక్కలు అల్లారుస్తూ ఎగిరే విమానాలు, GPS సహాయంతో ఎగిరే నమూనా విమానాలు, విమానము+హెలికాప్టర్ కలగలిపిన హైబ్రిడ్ విమానాలు, నేల మీద నీట్లోను ప్రయాణించే ఉభయచర వాహనాలు, దాననదే బాలన్స్ చేసుకునే సైకిలు... ప్రతీ సృష్టి లోనూ ఏదో కొత్తదనం. వట్టి కొత్తదనం మాత్రమే కాదు, వాళ్ల కార్యక్రమాల్లో (ఎంతోమంది పెద్దలలో కూడా కనిపించని) సామాజిక స్పృహ కనిపిస్తుంది. వీళ్ల సృజన ఎన్నో స్థానిక పరిశ్రమలని కూడా ఆకర్షిస్తోంది.

కనుక ఒక పక్క సృజనాత్మకమైన స్వేచ్ఛ, మరొక పక్క క్రమబద్ధీకరణ – ఈ రెండిట్నీరంగరిస్తూ విద్యాప్రణాళికలని రూపొందించాలి. యూ.జీ., పీ.జీ. స్థాయిలోనే కాక, కే.జీ. నుండి కూడా ఈ ఫార్ములా వాడడం ఆరంభించాలి. ఇలాంటి పద్ధతిలో ఎన్నో సాధకబాధకాలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి, పరిస్థితులని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకి సాగాలి.

స్వేచ్ఛని ప్రవేశపెడితే విద్యాజీవనం గందరగోళం అవ్వొచ్చని కొందరు అభ్యంతరపెట్టొచ్చు. స్వేచ్ఛ విలువ తెలిసిన వాళ్లు, స్వేచ్ఛని గౌరవించేవాళ్లు అలాంటి భయాలని అధిగమించగలరు.

మన విద్యావ్యవస్థల్లో మరో వెలితి:
“జ్ఞానం అన్న పదం పట్ల మన అవగాహనలో ఒక మౌలిక దోషం ఉంది”
దీని గురించి వచ్చే పోస్ట్ లో...

మన చదువులలో ఈ కింది లొసుగులు ఉన్నాయని కిందటి పోస్ట్ లో చూశాం:
1. జ్ఞాపక శక్తి పాత్ర విపరీతంగా ఉందని చూశాం.
2. అన్నీ కచ్చితంగా ప్రణాళికాబద్ధంగా నియంత్రించబడతాయి. విద్యార్థికి పెద్దగా స్వాతంత్ర్యం ఉండదు.


విద్యార్థికి స్వేచ్ఛనిస్తే ఏమవుతుంది? అదీ చిన్నప్పటి నుంచి ఇస్తే ఏమవుతుంది? (ఏం మునిగిపోతుంది?)

చిన్నపిల్లలకి స్వేచ్ఛా? అదీ చదువులోనా? నూటికి ఒక్కరు కూడా ఈ ఆలోచనని ఒప్పుకోరు. స్వేచ్ఛగా “విచ్చలవిడిగా” తిరిగే పిల్లలకి “క్రమశిక్షణ” పేరుతో కళ్లెం వేసి, వాళ్లకి “తప్పకుండా తెలియవలసిన నాలుగు ముక్కలు” నేర్పించడమే మరి మన ఉద్దేశంలో చదువంటే!

కాని జీవితంలో ఒక హితవైన స్వేచ్ఛ ఎంత అవసరమో, చదువులో కూడా స్వేచ్ఛ అంతే అవసరం, స్వేచ్ఛ రుచి తెలీనివాడికి జీవితాన్ని సార్థకం చేసుకోవడం రాదు. స్వేచ్ఛ లేని చోట సృజన ఉండదు.

దీనికి సంబంధించిన రెండు ఉదాహరణలు చెప్తాను.

1. మొదటి ఉదాహరణ ’Learning all the time’ (by John Holt) అనే పుస్తకం లో ఇచ్చినది. చదువు అంటే అభిమానం ఉన్నవారు (అంటే మనమంతా), ప్రస్తుత చదువుల మీద ’కసి’ ఉన్నవారు అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. ఇందులో ఒక చిన్న కథ.

కోపెన్హాగెన్ లో ’న్యూ లిటిల్ స్కూల్’ అనే ఒక బడి ఉంది. ఈ బడిలో చదువులు సాగే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ చదవడానికి ప్రత్యేక విద్యా కార్యక్రమాలేవీ ఉండవు. పాఠ్యప్రణాళిక వంటిదేమీ ఉండదు. తరగతులు ఉండవు. అధ్యయన బృందాలు ఉండవు. బోధన ఉండదు. పరీక్షలు ఉండవు. ఏమీ ఉండవు. మామూలుగా బయట ప్రపంచంలో పెద్దలు తాము స్వేచ్ఛని అనుభవిస్తూ పిల్లలకి ఆ స్వేచ్ఛని నిషేధిస్తూ ఉంటారు. కాని ఇక్కడ పెద్దల్లాగే పిల్లలు కూడా వాళ్లకి ఏది కావలిస్తే అది, ఎప్పుడు కావలిస్తే అప్పుడు, ఎంత కావలిస్తే అంత, ఎవరి వద్ద కావలిస్తే వాళ్ల వద్దకెళ్లి చదువుకుంటూ ఉంటారు. అక్కడ పిల్లలందరికీ తెలిసినది ఏంటంటే పిల్లలకి ఎప్పుడు బుద్ధి పుట్టినా వాళ్ల ప్రియతమ టీచరైన రాస్ముస్ హాన్సెన్ ని అడిగితే చదువు చెప్తాడు. ఇతడు ఆజానుబాహువు. కాని మృదుభాషి. పిల్ల్లలంటే ఇతడికి ప్రాణం.

ఓ పిల్లవాడికో, పాపకో ఉన్నట్లుండి ఏదో చదువుకోవాలి అనిపించింది అనుకుందాం. ఓ పుస్తకం పట్టుకుని ఆ పాప నేరుగా రాస్ముస్ దగ్గరికి వెళ్లి ’నాతో కలిసి చదువుతావా?’ అని అడుగుతుంది. ’ఓ యస్’ అంటాడు రాస్ముస్. అలా మొదలవుతుంది వాళ్ల చదువు. టీచర్ పక్కనే కూర్చుని చదువు మొదలెడుతుంది పాప. ఈ వ్యవహారంలో రాస్ముస్ పెద్దగా జోక్యం చేసుకున్నట్లు కనిపించడు. మధ్య మధ్యలో మృదువుగా ’వెరీ గుడ్, వెరీ గుడ్’ అంటుంటాడు. పాప బెదురుతోందని అనిపిస్తే తప్ప తప్పులు ఎత్తి చూపించడు. ఏదైనా పదం అడిగితే అది మాత్రం చెప్పి ఊరుకుంటాడు. ఈ తంతు ఓ ఇరవై నిముషాలు సాగుతుంది. పాప చదువుకోవడం ఆపేసి, పుస్తకం మూసేసి హాయిగా మరో పనిలో పడుతుంది.

పైన జరిగే వ్యవహారాన్ని ’బోధన’, ’శిక్షణ’ వంటి పదాలతో వర్ణించడం కొంచెం కష్టమే. పిల్లలకి చదవడం నేర్పడంలో మంచి శిక్షణ పొందినవాడు రాస్ముస్. కాని ఎన్నో ఏళ్ల అనుభవంలో రాస్ముస్ తాను నేర్చుకున్న శిక్షణా పద్ధతులన్నీ ఒక్కొక్కటిగా వదిలిపెట్టాడు. పిల్లలకి కాస్తంత మద్దతు, చేయూత నివ్వడానికి మించి మితిమీరిన ఉత్సాహంతో ఏం చేసినా అది అనుకున్న ఫలితాలనివ్వదన్న విషయం తన అనుభవంలో తెలుసుకున్నాడు రాస్ముస్.

ఇక్కడ విశేషం ఏంటంటే పైన చెప్పిన ’న్యూ లిటిల్ స్కూల్’ లో చదివిన పిల్లల్లో దాదాపు అందరూ జిమ్నేషియం ఉన్నత పాఠశాలకి వెళ్లారు. ఇక్కడ చదువు చాలా కఠినంగా ఉంటుంది. ఇలాంటి బడులలో కూడా ’న్యూ లిటిల్ స్కూల్’ పిల్లలు బాగా రాణించారు. అంటే ఎలా చదివినా, ఎంత చదివినా, ఎంత కాలం చదివినా, స్వతహాగా ముందుకొచ్చి చదివారు కాబట్టి వాళ్లందరూ తదనంతరం మంచి విద్యార్థులే అయ్యారు.

పైన చెప్పిన ఉదాహరణని మన ప్రస్తుత విద్యావ్యవస్థ దృష్ట్యా చూస్తే నమ్మశక్యం కానట్టు అనిపిస్తుంది. (పైన చెప్పిన తీరులో ఓ JEE కోచింగ్ సెంటర్ నడిపిస్తే ఎలా ఉంటుందో ఆలోచించడానికే తమాషాగా ఉంది!) ముఖ్యంగా చదువు అంటే ఎలా ఉండాలో మన సమాజంలో ఉండే నమ్మకాల దృష్ట్యా చూస్తే అసలు పైన జరిగేది అసంభవం అనిపిస్తుంది. ఎందుకంటే మన దృష్టిలో పిల్లలు ఖాళీ సీసాల లాంటి వారు. అందులో స్కూళ్లు చదువు/జ్ఞానం అనే ద్రవాన్ని నింపుతాయి. ఎంత నింపుతే ఆ పిల్లవాడు అంత ప్రయోజకుడు అవుతాడు. కాని ఇక్కడ “సీసా”లో నింపగోరిన “ద్రవం” అసలు ఆ “సీసా”లో ముందే గుప్తంగా ఉంటుందని, బయటి నుండి వచ్చే “ద్రవం” లోపల ఉండే “ద్రవం” బయటపడేలా చేస్తుందని, చివరికి “సీసా” ని నింపే ద్రవం దాని లోపలి నుండి వచ్చే “ద్రవమే” నని. చాలా మంది గుర్తించరు!

(బడిలో పిల్లలు ప్రశ్నిస్తూ కూర్చుంటే బండి ముందుకు నడవదు అని ఒకాయన వ్యాఖ్యానం రాశారు. పూర్తిగా పిల్లల ప్రశ్నల మీదే ఆధారపడుతూ, ఇక వేరే ఏ ప్రణాళిక, సిలబస్ లేకుండా నడిచిన ఓ అద్భుతమైన బడి (బండి!) గురించి అంతకుముందు ఒక పొస్ట్ వేయడం జరిగింది. వీలుంటే చూడండి.
http://scienceintelugu.blogspot.com/2009/06/1_17.html
http://scienceintelugu.blogspot.com/2009/06/2_18.html )


ఇక రెండవ ఉదాహరణ వచ్చే పోస్ట్ లో...

2. మన విద్యావిధానం ఎక్కువగా శోధన మీద కాక, స్మృతి మీద ఆధారపడి ఉంది.

ఎల్.కె.జి. నుంచి పీ.హెచ్.డి. వరకు మన దేశంలో చదువు అంటే గురువు చెప్పింది (లేదా గురువు చెప్పిన పుస్తకాలు చెప్పింది) గుర్తుపెట్టుకోవడం, దాన్ని భక్తిగా ఆచరించడం! ఎల్.కె.జి. లో ఎక్కాలతో మొదలవుతుంది. కొంచెం పెద్దయ్యాక పిరియాడిక్ టేబుళ్లు, భౌతిక, గణితశాస్త్రాల్లో ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటాము. (“ఒక చక్రీయచతుర్భుజం యొక్క భుజములు a, b, c, d అయినచో దాని వైశాల్యమును ఈ సూత్రముతో కనుగొనవచ్చును.”) ఇక ఇంజినీరింగ్ లో ఒకప్పుడు లాగర్థమ్ టేబుళ్లు, స్టీమ్ టేబుళ్లు కూడా గుర్తుపెట్టునేవారంటే నమ్మబుద్ధి కాదు, గాని ఆశ్చర్యం లేదు. ఇక జీవశాస్త్రంలో, వైద్యరంగంలో అధికశాతం జ్ఞాపకంతోనే పని.

జ్ఞాపక శక్తి అంటే మనకి అపారమైన గౌరవం. కనుకనే క్విజ్ లకి మన వ్యవస్థలో మంచి పలుకుబడి. సైన్సు లో కూడా క్విజ్ లు తెగ నడిపిస్తున్నారు. (సైన్స్ లో క్విజ్ ల ప్రయోజనం ఏంటో నాకు ఎప్పుడూ అర్థం కాదు!)
(“ఎక్స్-రేలని కనిపెట్టినది ఎవరు?” ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు అడిగేది ఎవరు?!!!)

అలాగే లక్షల మంది రాసే ఎంట్రన్స్ పరీక్షల్లో, దిద్దడం సులభం అని ’మల్టిపుల్ చాయిస్’ ప్రశ్నలు పాపులర్ అయ్యాయి. అక్కడా అదే పంథా...

ఉదాహరణకి,
జే.సీ. బోస్ కనిపెట్టిన పరికరం పేరేమి?
అ) రిస్కోగ్రాఫ్, ఆ) ఇస్కోగ్రాఫ్, ఇ) ఏస్కోగ్రాఫ్, ఈ) క్రెస్కోగ్రాఫ్
(ఈ ప్రశ్న వల్ల ఒరిగేది ఏమిటి? జేసీ బోస్ కనిపెట్టిన ఎన్నో పరికరాలలో ఇది ఒక్కటి మాత్రమే. కాని పాఠ్యపుస్తకం ఆ విషయాన్ని చెప్పదు. పేజీల పరిమితి వల్ల అవన్నీ చెప్పడానికి కుదరదు. ఇంకా ఊరికే పరికరం పేరు తెలిసి ఏం లాభం? దాన్ని ఎందుకు కనిపెట్టవలసి వచ్చింది? అది ఏం చేస్తుంది? దాని వల్ల విజ్ఞానం ఎలా పురోగమించిది? ఏ విషయాన్నీ లోతుగా శోధించకుండా, ఆ విషయాల పట్ల పిల్లల్లో స్ఫూర్తిని, ఉత్సాహాన్ని కలుగజేయకుండా, ఈ జీవం లేని సమాచారంతో పిల్లల బుర్రల్ని కూరడమే ప్రతీ చోటా మనకి కనిపిస్తోంది. మరి ఇలాంటి పరిణామాలని ఏ క్విజ్ లు, ఏ ఎంట్రన్స్ పరీక్షలు సరిదిద్దగలుగుతాయి?)

కనుక సారాంశం ఏంటంటే, మన సమాజంలో సైన్సు తెలియడం అంటే, వైజ్ఞానిక ఫలితాలు బోలెడు గుర్తుపెట్టుకుని ఉండడం. కాని విజ్ఞాన రంగంలో వైజ్ఞానిక ఫలితాలు అనేవి ఒక సుదీర్ఘ ప్రక్రియలో చివర్లో వచ్చేవి. కాని ఆ ఫలితాలకి అంత పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు. అవి కాలానుగతంగా మారిపోతూ ఉంటాయి. (ఒక దశాబ్దం ఆస్పిరిన్ మంచిది అంటారు, తదుపరి దశాబ్దం కాదంటారు.) కాని ఆ ఫలితాలని ఎలా తెలుసుకున్నారు? ఈ పద్ధతికే పూర్తి ప్రాధాన్యత. ఎందుకంటే ఫలితం మాత్రమే తెలిస్తే దాన్ని గుడ్డిగా నమ్మి గుర్తుపెట్టుకోవడం తప్ప మనం చేసేదేమీ ఉండదు. కాని పద్ధతి తెలిస్తే దాన్ని మనమూ ఆచరించి ఆ ఫలితం సరైనదో కాదో మనకై మనమే పరీక్షించుకోవచ్చు. ఇంతకీ ఏంటా పద్ధతి?

సత్యానికి ఏమిటి ప్రమాణం? ఏ గురువో, నిపుణుడో, మతాధికారో చెప్పాడు కనుక ఒక విషయం సత్యం కాదు. ఒక విషయాన్ని మనకై మనం, చేసి చూసి, తెలుసుకున్న రోజు ఆ సత్యం మనదవుతుంది. ప్రయోగం ద్వార ప్రకృతి చెప్పిన సాక్ష్యమే సత్యాన్ని నిర్ణయిస్తుంది. కనుక ప్రయోగం చేసి సత్యాపన చేసుకోవడాన్నే వైజ్ఞానిక పద్ధతి అంటారు.

ఈ పద్ధతి యొక్క ప్రాధాన్యతని బాగా పరిచయం చేశాడు గనుకనే గెలీలియోని ’ఆధునిక విజ్ఞానానికి పితామహుడు’ అంటారు. గెలీలియో కాలంలో చంద్రుడు నునుపుగా, పరిపూర్ణ గోళంలా ఉండేవాడని అనుకునేవారు. కాని టెలిస్కోప్ లో ప్రత్యక్షంగా చందమామని చూసిన గెలీలియో దాని మీద పెద్ద పెద్ద కొండలని, మిట్టలని, లోయలని చూశాడు. మతాధికారులు, తాత్వికులు నమ్మలేదు. అదెలా సాధ్యం అని వాదించారు. ’ఎలా సాధ్యమో దేవుడెరుగు! కావాలంటే మీ అంతకు మీరే చూడండి.’ అని చెప్పి చూశాడు గెలీలియో. టెలిస్కోప్ లో కనపించేదంతా దృశ్యభ్రాంతి (optical illusion) అని ముందు కొట్టిపారేశారు. చాలా కాలం సాగాయీ వివాదాలు. చివరికి రోమ్ కి చెందిన కొందరు జెసూట్ లు తామే స్వయంగా ఓ టెలిస్కోప్ ని నిర్మించుకుని, స్వయంగా చూసి, నిర్ధారణ చేసుకున్నారు.

కనుక సైన్సు అంటే గుర్తుపెట్టుకోవడం కాదు. స్వయంగా పరీక్షించి చూసి, ఆ అనుభవాన్ని రక్తంలో పట్టించుకోవడం. అలా పట్టించుకున్న రోజు ఆ జ్ఞానం మన సొంతం అవుతుంది. ఆ తరువాత ఇక నిపుణుడితో పని లేదు. పుస్తకాలని అవతల పారేయొచ్చు.

“అదేంటి అలా అంటావు? మన విద్యావిధానంలో కూడా లాబ్ లు, ప్రాక్టికల్స్ ఉంటాయి కదా? మరి అవన్నీ ప్రయోగాలే కదా?” అంటారేమో. నిజమే కాని ఆ ప్రయోగాలు కూడా అన్నీ ఎవరో డిజైన్ చేసినవే. దాన్ని గుడ్డిగా నేర్చుకుని ఆచరించడం తప్ప మనకి అందులో పెద్దగా వెసులుబాటు ఉండదు. (ఇంటర్మీడియెట్ చివరి ప్రాక్టికల్ పరీక్షల్లో ’titration,’ ‘salt evaulation’ అనే ప్రయోగాలకి సమాధానాలు, ప్యూన్ చేతిలో పది రూపాయలు పెడితే ఎలా వస్తాయో, అందరికీ తెలిసిన విషయమే!) ఇలాంటి పద్ధతిలో థియరీకీ, ప్రాక్టికల్స్ కి పెద్దగా తేడా లేదు.

కనుక మన విద్యావిధానంలో ప్రతీ అంశం – ఏం చదవాలో (థియరీ!), ఏం చెయ్యాలో (ప్రాక్టికల్!) – అన్నీ ఎవరో నిర్ణయిస్తారు. పిల్లలు వాళ్లంతకు వాళ్లు, వాళ్లకి బుద్ధి పుట్టినట్టు చెయ్యడానికి పెద్దగా ఏమీ ఉండదు. ప్రశ్నలు, సమాధానాలు రెండూ గురువే ఠక్కు ఠక్కున చెప్పేస్తూ ఉంటాడు. (ఆ గురువు కూడా తన గురువు ఠక్కు ఠక్కున చెప్పగా నేర్చుకున్న విషయాలే అవన్నీ!) మరి పిల్లల్లో పుట్టిన ప్రశ్నలని పట్టించుకునేదెవరు? ఆ ప్రశ్నలకి సమాధానాలు వెంటనే తెలీకపోయినా, అవసరమైతే వాటిని జీవితాంతం అన్వేషించుకోమని, ప్రేమగా ప్రోత్సహించేదెవరు? ప్రశ్న మనదైనప్పుడు దాని సమాధానం కోసం చేసే ప్రయత్నంలో మనకి ఆసక్తి ఉంటుంది. ప్రశ్న మరొకరిది అయినప్పుడు ఉత్సాహం చచ్చిపోతుంది.

కనుక మన విద్యావిధానంలో అన్నీ వెసులు బాటులేని ప్రణాళికతో కచ్చితంగా నియంత్రించబడుతుంది. మన చదువు ఓ పాతికేళ్లపాటు సాగే మార్చ్ పాస్ట్ లా ఉంటుంది!

చదువు అంటే మృగరాజు అడవిలో తిరుగులేని స్వేచ్ఛావిహారం చేస్తున్నట్టు ఉండాలి. నింగికి సరిహద్దులని తడిమే భేరుండపు గమనంలా ఉండాలి. అలుపు సొలుపూ లేని పసివాడి ఆటలా, అల్లరిలా ఉండాలి.

మరి మన చదువులు అలా ఉంటాయా? ఉండగలవా?

దీని గురించి మరో పోస్ట్ లో...

మన వైజ్ఞానిక వ్యవస్థల్లో వెలితి ఎక్కడుంది అన్న విషయాన్ని చర్చిస్తున్నాం. మొదటి మాటగా ’Saga of Indian Science’ అన్న పుస్తకం నుండి కొన్ని అంశాలు పేర్కొన్నాను. అసలు లోపం మన సంస్కృతిలోనే ఉందని నా నమ్మకం. ఆ విషయాన్ని పాయింట్లుగా విపులీకరిస్తూ వరుసగా కొన్ని పోస్ట్ లు రాసుకొద్దామని ప్రయత్నం.

1. ప్రశ్నించే పద్ధతికి మన సంస్కృతిలో పెద్దగా స్థానం లేదు

మనది ప్రాచీన సంస్కృతి అని మనం ఎంతో గర్విస్తాం. కాని ఎన్నో సార్లు చాంతాడంత గతం ఒక భారంలా కూడా పరిణమిస్తుంది. మన సంస్కృతిలో జీవితం విస్తృతంగా వ్యవస్థీకరించబడుతుంది. పుట్టినదగ్గర్నుండి, పుడకల దాకా ఎప్పుడు ఏం చెయ్యాలో అన్నీ ఎప్పటికప్పుడు ఎవరో నిర్ణయించేస్తూ ఉంటారు. ఏం చదవాలి, ఏం ఉద్యోగం చెయ్యాలి, ఎప్పుడు ఎవర్ని పెళ్ళాడాలి, ఎప్పుడు ఎంతమంది, ఎలాంటి (ఆడా? మగా?) పిల్లల్ని కనాలి, వాళ్లని ఎలా పెంచాలి?.... ఇక్కడ జీవితం మన ప్రమేయం లేకుండానే మంత్రం వేసినట్టు దానికదే జరిగిపోతుంటుంది! ఏం చెయ్యాలో తెలీక సందేహంలో పడితే స్వామీజీలు ఉంటారు, జ్యోతిష్యులు ఉంటారు, న్యూమరాలజిస్టులు ఉంటారు (“రాష్ట్రం పేరు కొద్దిగా మార్చితే సమస్యలు వాటికవే సర్దుకుంటాయి”), బామ్మలు ఉంటారు (“దిష్టి తీసేయండి, తగ్గిపోతుంది”) ... ప్రతీ ప్రశ్నకి సమాధానం/సలహా చెప్పడానికి ఎవరో ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రతీ దానికి ఏదో మార్గం ఉంటుంది.

ఇలా ఎందుకు చెయ్యాలి, ఈ పద్ధతి సరైనదా కాదా, అర్థవంతమా కాదా అన్న ప్రశ్న ఎవరికీ పట్టనట్టు ఉంటుంది. “పెద్దలు చెప్పారు, చెయ్యాలి:” ఈ గడ్డ మీద ఈ మాట విని విని విసిగిపోని వాడు ఉండడు. తాత చెప్పినట్టు, తండ్రి వింటాడు, తండ్రి చెప్పినట్టు కొడుకు వింటాడు... ప్రతీ తరం ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేకుండానే పుట్టి చచ్చిపోతూ ఉంటుంది. ఎవరికీ వాళ్ళంతకు వాళ్లు ఆలోచించాల్సిన అవసరం రాదు. ప్రశ్నించాల్సిన సందర్భమూ రాదు.

మన సంస్కృతిలో ఎటు చూసినా సమాధానలే కనిపిస్తాయి. ప్రశ్నలు ఎంత వెతికినా కనిపించవు. ప్రశ్నని పుట్టినవెంటనే ఎలా మట్టుపెట్టాలో మన సంస్కృతి ఉగ్గుపాలతో నేర్పుతుంది.

మరి ప్రశ్నలేకుండా, ప్రశ్నించే అలవాటు లేకుండా విజ్ఞానం అసంభవం. అసలు శాస్త్రవేత్తలు ఆరాధించే దేవత ’ప్రకృతి’ కాదు, ’విశ్వం’ కాదు, ’సత్యం’ కూడా కాదు. ఆ దేవత పేరు ’ప్రశ్న.’ ఆ ప్రశ్నని వెన్నంటడంలోని ఆనందం సమాధానం తెలిశాక ఉండదు. సమాధానం కనిపించగానే కార్పొరేట్ నేతలు పేటెంట్ల కోసం ఎగబడతారు; శాస్త్రవేత్త మరో ప్రశ్నని వెన్నంటుతూ ముందుకి సాగిపోతాడు.

“ఒక కాంతి తరంగం మీద స్వారీ చేస్తే అది కదులుతున్నట్టు కనిపిస్తుందా, లేక నిశ్చలంగా కనిపిస్తుందా?” అనే విచిత్రమైన ప్రశ్న ఐన్స్టయిన్ ని అంతటి వాణ్ణి చేసింది. “కేంద్రకం చుట్టూ గిర్రున తిరిగే ఎలక్ట్రాన్ కేంద్రకంలో ఎందుకు పడిపోదు?” అని బోర్ వేసిన ప్రశ్న ఆధునిక పరమాణు శాస్త్రంలో ఓ మైలు రాయి అయ్యింది. కొన్ని ప్రశ్నల వల్ల స్థూల ప్రయోజనాలు కూడా ఉండవు. కార్ల్ సాగన్ తన జీవితమంతా ’ఇతర ప్రపంచాలలో ప్రజ్ఞ గల జీవులు ఉన్నారా?” అన్న ప్రశ్న యొక్క శోధనకే అంకితం చేశాడు. దాని వల్ల స్థూలమైన ప్రయోజనాలు పెద్దగా ఒరగక పోయినా ఆయన రచనలు ఎంతో మంది శాస్త్రవేత్తలకే స్ఫూర్తినిచ్చాయి.


మనం ప్రశ్నించడానికి ఎందుకు ఇష్టపడం? ఎందుకంటే ప్రశ్నించడం అంటే తెలీదని ఒప్పుకోవడం, అజ్ఞానాన్ని ప్రకటించుకోవడం. మరి అజ్ఞానం భయపెడుతుంది, కలవరపెడుతుంది. అజ్ఞానం అంటే శూన్యం, న్యూనత. ఆ శూన్యాన్ని భరించలేక అందుబాటులో ఉన్న ఏదో చెత్తని తెచ్చి నింపుకుంటాం. ప్రశ్నించడం అంటే అవిధేయత, అగౌరవం, అస్థిరత, విప్లవం. పిల్లలు తల్లిదండ్రులని ప్రశ్నిస్తే అవిధేయత. శిష్యుడు గురువుని ప్రశ్నిస్తే అగౌరవం. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అస్థిరత, విప్లవం.

ప్రశ్నించే అలవాటు లేని సమాజంలో విజ్ఞానం వేళ్లూనదు. సైన్సు తెలియడం అంటే బోలెడు సమాధానాలు తెలియడం కాదు, ప్రశ్నించడం ఎలాగో తెలియడం. “ఇలా ఎందుకు ఉంది?” “ఇలా ఎందుకు చెయ్యాలి?” “మరోలా చేస్తే ఏమవుతుంది?” ప్రపంచంలో ప్రతీ అంగుళాన్నీ తూట్లు పొడిచేలా ప్రశ్నించాలి. రాత్రనక, పగలనక... నిద్రాహారాలు మాని ప్రశ్నించాలి. అదీ ప్రశ్నించడం అంటే!

ప్రశ్నించే కౌశలం విజ్ఞాన ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి మొదటి ప్రవేశార్హత.


ఇక రెండవ అంశం:

2. మన విద్యావిధానం ఎక్కువగా శోధన మీద కాక, స్మృతి మీద ఆధారపడి ఉంది.

దీని వివరణ వచ్చే పోస్ట్ లో...

బోస్ తరువాత ఆ శోధనా స్రవంతి ఎందుకు ఆగిపోయింది?

బోస్ తరువాత ఆ శోధనా స్రవంతి ఎందుకు ఆగిపోయింది అని ఎవరో అడిగారు. దానికి సూటిగా సమాధానం చెప్పే ముందు ఒక విషయం పేర్కొంటాను.

“The Saga of Indian Science” by Pushpa Bhargava and Chandana Chakrabarti
అన్న పుస్తకంలో రచయితలు భారతీయ వైజ్ఞానిక వ్యవస్థలో ఉన్న సమస్యల గురించి విస్తృతంగా చర్చిస్తారు. అందులోని నాలు ముఖ్యమైన అంశాలని మా సహోద్యోగి ఒకాయన ఈ మధ్యనే ఈమెయిల్ ద్వార మా సంస్థలో circulate చేశాడు. ఆ అంశాల సారాంశం ఇది:

1) ఇండియాలో [వైజ్ఞానిక రంగంలో] జరగాల్సి ఉండి, జరగకుండా మిగిలిపోయిన దాని బాధ్యత అధికశాతం శాస్త్రవేత్తల మీదే ఉంది. ప్రభుత్వం స్వయంగా నియమించిన శాస్త్రవేత్తలలో జవాబుదారీతనాన్ని ఆశించని కారణంగా, శాస్త్రరంగంలో అత్యంత ప్రతిభావంతులైన, సృజనాత్మకత గల వ్యక్తుల బాటలో అనవసరమైన అవరోధాలని కల్పించిన కారణంగా, కేవలం ఆజ్ఞాపన చేత సృజనని కల్పించలేమని దాన్ని పోషించి పెంచాలన్న ఎరుక లేకుండా ప్రవర్తిస్తున్నందున ప్రభుత్వం కూడా ఆ లోపంలో కొంత భాధ్యత పంచుకోవాలి.

2) మన దేశంలో వెలువడుతున్న పీ.హెచ్.డీ. థీసిస్ లలో నాణ్యత, నవ్యత కొరవడుతున్నాయి. గత నాలుగు శతాబ్దాలలో, మన దేశంలో ఏ వైజ్ఞానిక విభాగంలొనైనా, వెలువడ్డ పీహెచ్.డీ థీసిస్ లలో కేవలం 3-5% శాతం థీసిస్ లు మాత్రమే డాక్టరేట్ పట్టానికి అర్హత గలవి.

3) మన వైజ్ఞానిక సమాజంలో సహజ ప్రతిభ కొరవడుతోంది. కక్షలతో, అసూయలతో, ఆంతరిక కలహాల రాజకీయాల తెగులుతో మన వైజ్ఞానిక వ్యవస్థల సామర్థ్యం, ఉత్పాదకత కుంటువడుతోంది. వృత్తిపరంగా, ఆర్థికంగా, సామజికంగా శాస్త్రవేత్తలపై కచ్చితమైన జవాబుదారీ తనాన్ని విధించగల యంత్రాంగం లోపిస్తోంది. విలువైన, ఖరీదైన వైజ్ఞానిక సాధన సామగ్రిని కొనుగోలు చేసినా, వాటి వినియోగంలో, నిర్వహణలో తగినంత పొదుపు, శ్రద్ధ లేకపోవడం మన వైజ్ఞానిక వ్యవస్థలలో తరచు కనిపిస్తూ ఉంటుంది.

4) చాలా మంది శాస్త్రవేత్తలు మరొకరు తమ కన్నా ఉన్నత స్థితిలో ఉన్నారంటే, బాగా రాణిస్తున్నారంటే సహించలేరు. తమ మాటలకి గుడ్డిగా వత్తాసు పలుకుతూ, వంధిమాగధుల్లా చుట్టూ చేరిన వారికే వాళ్ల సహకార, సహాయాలు అందుతాయి. ఈ విధంగా మన వైజ్ఞానిక సంస్థలు ఎన్నో ’భజనమేళాల’తో నిండి ఉన్నాయి. వారితో తందానా అన్న వారికే ఆయా బృందాలలో సభ్యత్యం, దానితో పాటు వచ్చే లాభాలు ప్రాప్తిస్తాయి. అంతేగాని ఆ సభ్యత్వానికి, శాస్త్రవేత్తల సహజ ప్రతిభకి పెద్దగా సంబంధం లేదు.

కుండ బద్దలు కొట్టినట్టుగా మన వైజ్ఞనిక వ్యవస్థకి పట్టిన కొన్ని తెగుళ్ల గురించి రాశారు రచయితలు.

ఇవన్నీ అక్షరసత్యాలు అనను. అలాగని సత్యదూరం కూడా కావు. పైన చెప్పబడ్డ లోపాలు అంతో ఇంతో మన వైజ్ఞానిక వ్యవస్థల్లో చాలా వాటిల్లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే అన్ని వ్యవస్థలూ అలాగే ఉన్నాయని కాదు.

నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సైన్సెస్ (NCBS) లాంటి సంస్థల్లో, నవతరం యొక్క సభ్యత్వం నిండుగా ఉన్న సంస్థల్లో, వాతావరణం అధ్బుతంగా, ప్రగతిశీలంగా ఉంటుంది. అలాగే కచ్చితమైన లక్ష్యాలతో చిత్తశుద్ధితో పని చేసే ఇస్రో లాంటి వ్యవస్థలు అద్భుత ఫలితాలు సాధిస్తూ మన దేశానికి గర్వకారణం అవుతున్నాయి.

మరైతే అన్ని సంస్థలూ అలా ఎందుకు లేవు? అని అడిగితే పైన చెప్పిన కారణాలు కొంతవరకు వర్తిస్తాయి. కాని ఇంకా లోతుగా పోతే సమస్య, కేవలం ఒక వ్యవస్థాత్మక సమస్య కాదు, రాజకీయ, నిర్వహణాత్మక సమస్య అసలే కాదు. సమస్య అసలు మన సంస్కృతిలోనే ఉందని నా అభిప్రాయం.

కాని ఈ విషయాల గురించి బ్లాగులో స్వేచ్ఛగా చర్చించడానికి సందేహిస్తున్నాను. ఇలాంటి “ఈ - చర్చలు” మా సంస్థలో తరచు జరుగుతుంటాయి. సీనియర్, జూనియర్ అన్న భేదం లేకుండా అందరూ ఉత్సాహంగా, మన:పూర్వకంగా పాల్గొంటుంటారు. ఒక్కొక్కరి దృక్పథంలోను ఒక సత్యం ఉంటుంది. అందరి దృక్పథాలు విన్నప్పుడు సమస్య యొక్క సమగ్ర స్వరూపం అర్థమవుతుంది. ఒకరినొకరు విభేదించుకున్నప్పుడు కూడా ఆ విమర్శ సంస్కారవంతంగా, సమంజసంగా ఉంటుంది.

కాని బ్లాగు ప్రపంచంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉందని నాకు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మొదట్లోనే అర్థమయ్యింది. అవతలివాడు ఏం చెప్తున్నాడో కూడా వినకుండా అక్షేపణకి దిగిపోతారు. దానికి అసభ్యపదజాలం తోడవుతుంది. ఇక పదం పదానికి షిట్టుషిట్టని జపం చేసే “మలజపానందస్వాముల” సంగతి సరే సరి! చాలా మందికి అభిప్రాయం-వాస్తవం-సత్యం ఈ మూడింటికీ తేడా తెలీదు. మనసుకి నచ్చినదే నిజమని నమ్ముతారు. ఈ తేడా తెలీనప్పుడు చర్చ అసంభవం. ప్రమాదకరం కూడా.

కనుక ఈ విషయాన్ని ఇక్కడితో వొదిలిపెడుతున్నాను. తగిన వాతావరణం నెలకొందని నమ్మకం కుదిరిన రోజు, చర్చకి వేదిక సిద్ధమయ్యింది అనిపించిన రోజు, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం.


వామనుడు... విశ్వాన్ని మూడు అడుగులతో కొలిచాడు అంటుంది పురాణం.

శాస్త్రవేత్తలు కూడా విశ్వాన్ని మూడు అడుగులతో కొలుస్తున్నారు.

అదెలాగ అంటారా?

ఇక్కడ నొక్కి పూర్తి ప్రజెంటేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొండి.


బోస్ ఆఖరు రచనలు

Posted by V Srinivasa Chakravarthy 4 comments

1923 లో బోస్ మారోసారి యూరప్ ఖండాన్ని పర్యటించాడు. ఆ ఏటే బోస్ రాసిన 227-పేజీల “Physiology of the ascent of Sap” అన్న పుస్తకం వెలువడింది. ఫ్రాన్స్ లో సోర్బోన్ విశ్వవిద్యాలయంలో బోస్ ప్రసంగం విన్న ప్రఖ్యాత ఫ్రెంచ్ తాత్వికుడు హెన్రీ బెర్గ్సన్ ఇలా వ్యాఖ్యానించాడు: “బోస్ నిర్మించిన అద్భుత పరికరాల పుణ్యమా అని నోరు లేని ఆ మొక్కలకి స్వరం పెల్లుబికి అలేఖ్యమైన వాటి జీవితకథలని సవివరంగా చెప్పుకోగల సామర్థ్యం అలవడింది. అంత వరకు ప్రకృతి చాలా గుట్టుగా దాచుకున్న రహస్యాలు నేటితో రట్టయ్యాయి.” స్తుతిలో హాస్యాన్ని జోడిస్తూ ఫ్రెంచ్ పత్రిక ’ల మాటీన్’ ఇలా చమత్కరించింది: “ఈ సారి ఎప్పుడైనా ఒక పడచు మీదకి ఓ పూవు విసిరితే ఇద్దరిలో ఎక్కువ బాధపడేది ఎవరో తెలీని సంధిగ్ధ పరిస్థితి ఏర్పడింది!”

1927 లో బోస్ యూరప్ ని మరో సారి సందర్శించాడు. ఆ ఏడాది “Plant autographs and their revelations” అన్న రచన వెలువడింది. ఫ్రెంచ్ రచయిత రొమెయిన్ రోలాండ్ తన నవల ’జాన్ క్రిస్టోఫ్’ యొక్క సంతకం చేసిన ప్రతిని బోస్ కి అంకితం చేస్తూ, అందులో అంకిత ముద్రగా “నవ్య ప్రపంచపు ప్రకటనకర్తకు” అని రాశాడు. తరువాత పక్షుల భాషల మీద ఎంతో పరిశోధించిన యూరొపియన్ శాస్త్రవేత్త సీగ్ఫ్రెడ్ తో బోస్ ని పోల్చుతూ రోలాండ్ ఇలా అన్నాడు: “ప్రకృతిని అన్వయించడానికి బయలుదేరిన ఆ యూరొపియన్ శాస్త్రవేత్త మానసం లోంచి క్రమంగా సౌందర్య దృష్ణి అణగారిపోయింది. డార్విన్ కూడా అలాగే జీవశాస్త్రంలో తను చేసిన పరిశోధనల వల్ల తనలో కవితారసాస్వాదనా శాక్తి బాగా అడుగంటిపోయిందని వాపోయాడు. బోస్ విషయం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది.”

1928 లో బోస్ రాసిన చివరి పుస్తకం అయిన “Motor mechanisms of Plants” వెలువడింది. ఇటీవలి కాలంలో అత్యుత్తమ వృక్షశాస్త్రవేత్తలలో ఒకరిగా పేరు పొందిన, వియన్నాకి చెందిన, ప్రొఫెసర్ హన్స్ మోలిష్, ఆస్ట్రియా రాజధాని నగరంలో బోస్ ప్రసంగాన్ని విన్నాక, ఎలాగైనా ఇండియాకి వెళ్లి ఆ బెంగాలీ శాస్త్రవేత్తతో పని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అలాగే ఇండియాలో కొంత కాలం గడిపి తిరిగి యూరప్ కి వచ్చాక ప్రఖ్యాత నేచర్ పత్రికకి ఇలా రాశాడాయన: “వాయు స్థితిలో ఉన్న ఆహారాన్ని మొక్కలు జీర్ణించుకుంటుండగా ఆ ప్రక్రియని లిఖిత రూపంలో చూశాను. మొక్కల్లో విద్యుత్ సంబంధమైన్ ఉత్తేజం నిలువెల్లా వ్యపిస్తుంటే దాన్ని రెసొనంట్ రికార్డర్ నమోదు చెయ్యగా చూశాను. అసలివన్నీ పురాణకథల కన్నా నమ్మశక్యం కానంత అద్భుతంగా ఉన్నాయి.”

ఒక యాంత్రికమైన, పార్థివమైన, జడమైన విశ్వదర్శనపు సమ్మోహనంలో వైజ్ఞానిక సమాజం మొత్తం జోగుతున్న దశలో, అతిశయ ప్రత్యేకీకరణ అనే జాఢ్యం వల్ల శాస్త్ర నిపుణులు ఎవరికి వారు చిన్న చిన్న శాస్త్ర విభాగపు కలుగులలో బందీలుగా ఉన్న పరిస్థితిలో, ఓ మహత్తర జీవన స్పందనతో సమస్త ప్రకృతీ పరవశిస్తోందని, ప్రకృతిలో ప్రతీ అంశం మనకెన్నో కథలు చెప్పాలని తపిస్తోందని, వాటి భాషని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యడంలో మనదే ఆలస్యం అని బోస్ కృషి మనకి గుర్తుచేస్తోంది.

ప్రచండ హిరణ్మయ రేతస్సుతో, ఏడు వన్నెల తేరు నెక్కి, చీకటి శక్తుల మీద తన దైనిక జైత్రయాత్ర మీద బయల్దేరిన మార్తాండుడి వైభవాన్ని ప్రకటిస్తూ, చూరు మీద కాంస్య, రజత, సువర్ణ లోహాల మిశ్రమంతో చేసిన పోత చిత్రం మెరిసిపోతూ ఉంటే, తన సంస్థలో ఒక రోజు ప్రసంగిస్తూ, బోస్ తన వైజ్ఞానిక చింతనలోని సారాన్ని ఇలా వర్ణించాడు:

“పదార్థం మీద శక్తుల ప్రభావాన్ని శోధించే ప్రయత్నంలో సజీవ, జీవరహిత పదార్థాల మధ్య సరిహద్దులు చెరిగిపోవడం, వాటి మధ్య కొత్త సంబంధాలు పుట్టుకురావడం గమనించాను. కాంతులు చిందే సముద్రపు నడిమధ్యలో మనం గుడ్డి వాళ్లలా నిలిచి వున్నామని నా కృషి నాకు నేర్పిన మొదటి పాఠం. ఎలాగైతే భౌతిక కాంతి గురించిన శోధనలో దృశ్య కాంతి సీమ నుంచి మనం అదృశ్య కాంతి లోకంలోకి ప్రవేశిస్తామో, అలాగే సజీవ ప్రపంచంలో, వ్యక్తం నుండి అవ్యక్తంలోకి ప్రవేస్తున్నప్పుడు, జీవన్మరణ సమస్య యొక్క పరిష్కారానికి మరింత సన్నిహితంగా వస్తాము.

“మన జీవనానికి, వృక్ష లోకపు జీవనానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఇది కేవలం నిరాధారిత చర్చలకి సంబంధించిన విషయం కాదు. నిర్వివాదమైన ప్రయోగాత్మక విధానాలతో ఈ విషయాన్ని వాస్తవంలో ప్రస్ఫుటం చెయ్యాలి. అలా చెయ్యాలంటే సత్యదూరమైన, వాస్తవానికి వ్యతిరేకమైన మన పూర్వభావనలని ముందు త్యజించాలి. చివరి మాట మొక్కదే కావాలి. మొక్క యొక్క ఆమోదముద్ర లేనిదే ఎలాంటి ఆధారాలనైనా, భావనలనైనా తిరస్కరించే తెగువ ఉండాలి.”

(బోస్ మీద వ్యాస శీర్షిక సమాప్తం)
Reference:
Peter Tompkins and Christopher Bird, The Secret Life of Plants, Rupa and Co.

కువిమర్శ వైజ్ఞనిక ప్రగతికి అవరోధం

ఇదే సాధనసామగ్రిని ఉపయోగించి నానా రకాల మొక్కల్లోను, చెట్లలోను ప్రతిస్పందనలు ఉంటాయని నిరూపించాడు బోస్. “ఒక మహావృక్షం అయితే ప్రేరణకి నెమ్మదిగా, సావకాశంగా స్పందిస్తుంది. అదే చిన్న మొక్క అయితే లిప్తలో దాని ఉత్తేజానికి పరాకాష్టని చేరుకుంటుంది. వృక్షలోకం సమస్తంలోను ప్రతిస్పందన ఉన్నా అది వ్యక్తం అయ్యే తీరు అనంతమైన వైవిధ్యం ఉంటుందని నిరూపించాడు.

1919-1920 కాలంలో బోస్ మరో సారి లండన్ కి, యూరప్ కి ప్రయాణించాడు. ఈ సారి New Statesman అనే పత్రికలో ప్రొఫెసర్ జాన్ ఆర్థర్ థామ్సన్ అనే పేరుమోసిన శాస్త్రవేత్త బోస్ కృషి గురించి ఇలా రాశాడు. “మనం [పాశ్చాత్యులం] సాధించిన ఏకత్వం కన్నా ఘనమైన, విశాలమైన ఏకత్వాన్ని సాధించి, జీవపదార్థంలో పరిపాటిగా కనిపించే స్మృతి, ప్రతిస్పందన మొదలైన లక్షణాలని జీవరహిత పదార్థంలో కూడా ప్రదర్శించి, భౌతిక శాస్త్రం, జివక్రియా శాస్త్రం, మనస్తత్వ శాస్త్రాల వేరువేరు సాధనా మార్గాలు ఒక్కటి కాగలవని చూపించిన ఈ మహాశాస్త్రవేత్త ప్రతిభ ప్రత్యేకమైన భారతీయ చింతనకి, మేధస్సుకి ఓ తార్కాణం. ప్రయోగాత్మక విజ్ఞానానికి రారాజు అయిన ఈ మేధావి నేడు మన మధ్య ఉండడం మనకెంతో సంతోషదాయకం.”

మితిమీరిన స్తుతి అలవాటు లేని ’టైమ్స్’ పత్రిక కూడా బోస్ గొప్పదనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. “మనం ఇక్కడ ఇంగ్లండ్ లో ఏదో ఆదిమ, కిరాతక స్థితిలో మగ్గుతుంటే, అక్కడ ఆ తూర్పులోకపు వాసి సమస్త విశ్వాన్నీ ఓ సువిశాల సమన్వయ దృష్టిలో ఇముడ్చుకుని, నానా విధాలుగా అభివ్యక్తం అవుతున్న ఏకత్వాన్నే సర్వత్ర దర్శించగలిగాడు.”

అనతి కాలంలోనే బోస్ Fellow of Royal Society లో సభ్యుడిగా స్వీకరించబడ్డాడు. ఇదిలా ఉండగా బోస్ విరోధి అయిన ప్రొఫెసర్ వాలర్, బోస్ నిర్మించిన క్రెస్కోగ్రాఫ్ యొక్క ఫలితాలు అవిశ్వసనీయం అని బహిరంగ ప్రదర్శన కోరుతూ టైమ్స్ పత్రికకి జాబు రాశాడు. అతను కోరినట్టుగానే ఏప్రిల్ 23 న లండన్ విశ్వవిద్యాలయంలో బహిరంగ ప్రదర్శన జరిగింది. అది విజయవంతం అయ్యింది. ఆ విషయాన్ని సాధికారికంగా నిర్ధారిస్తూ లార్డ్ రాలీ తదితరులు టైమ్స్ పత్రికకి ఇలా రాశారు: “ఒక మిలియన్ నుండి పది మిలియన్ రెట్ల వరకు మొక్కల ఎదుగుదలకి సంబంధించిన చలనాలని సంవర్ధనం చేసిన ఈ పరికరం ఇచ్చిన ఫలితాలని మేము ఆమోదిస్తున్నాం.”

ఆ సంఘటనకి స్పందిస్తూ బోస్ మే 5 న టైమ్స్ పత్రికలో ఇలా రాశాడు:

“నిజాయితీ లేని విమర్శ వల్ల విజ్ఞానం యొక్క పురోగతి కుంటువడుతుంది. నేను అవలంబించిన శోధనా మార్గంలో కొన్ని అసాధారణమైన సమస్యలని ఎదుర్కోవలసి వచ్చింది. గత ఇరవై ఏళ్లలో పుట్టిన తప్పుడు అన్వయాల కారణంగా, అబద్ధపు వదంతుల కారణంగా ఈ సమస్యలు మరింతగా విషమించాయి. ఆ విధంగా నా బాటలో కావాలని ఏర్పాటు చెయ్యబడ్డ అవరోధాలని ఈ రోజు నుండి మర్చిపోయి నిశ్చింతగా ఉండొచ్చు. నా ప్రయోగాల ఫలితాలు అక్కడక్కడ కొందరు వ్యక్తులకి కోపం తెప్పించాయి అన్న విషయం ఒక పక్క కొంత బాధ కలిగించినా, ఈ రోజు ఈ దేశానికి చెందిన ప్రతిష్ఠాత్మక వైజ్ఞానిక సమాజం మొత్తం నాకు అందించిన ఘన స్వాగతం ఆ బాధని మరచిపోయేలా చేస్తోంది.”

(సశేషం...)

నోర్బర్ట్ వీనర్ ఓ పేరు మోసిన అమెరికన్ గణితవేత్త. చాలా కాలం ప్రఖ్యాత ఎం.ఐ.టి. లో పనిచేశాడు. సైబర్నెటిక్స్ అనే గణిత/ఇంజినీరింగ్ రంగానికి పునాదులు వేశాడు. ఈ సైబర్నెటిక్స్ యే తదనంతరం ఇంజినీరింగ్ విద్యార్థులు చదువుకునే ’కంట్రోల్ థియరీ’ గా పరిణమించింది.. (మేం బీ.టెక్ చదివే రోజుల్లో మాకు కంట్రోల్ థియరీ చెప్పిన ప్రొఫెసర్ ఒకాయన ఈ ’సైబర్నెటిక్స్’ అంతా “మన వేదాల్లోనే ఉంది” అని, దాన్ని మన ప్రాచీనులు ’శైవనాటిక స్వస్థ్య విద్యా’ అని సంస్కృతంలో పిలుచుకునే వారని అనేవారు. మొదట్లో జోక్ చేస్తున్నారేమో అనుకున్నాం. సరే అదో పెద్ద కథ.) అలాగే ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ చదువుకునే విద్యార్థులు వీనర్ ఫిల్టర్ గురించి చదువుకుంటారు. ఆ వీనరే ఈ వీనర్!

సరే ఈ వీనర్ మహా మతిమరుపు మనిషట. ఆయన కుటుంబం మొదట్లో కేంబ్రిడ్జ్ అనే ఊళ్లో ఉండేవారట. ఒక సమయంలో న్యూటన్ అనే ఊరికి మారాల్సి వచ్చింది. ఈ మనిషి ఎలాగూ ఇలాంటి వ్యవహారాల్లో ’వేస్ట్’ అని తెలిసిన భార్య, ఎప్పట్లాగే ఆయన్ని ఆఫీసుకు (ఎం.ఐ.టి కి) పంపి, ఇల్లు మారే వ్యవహారం అంతా తనే చూసుకోసాగింది. సాయంకాలం ఆఫీసు నుంచి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం కొత్త ఇంటికి రమ్మని మరి మరి గుర్తుచేస్తూ, కొత్తింటి చిరునామా ఒక కాగితం మీద రాసి భర్త కోటు జేబులో పెట్టింది.

రోజూలాగే మన ప్రొఫెసరు గారు డిపార్ట్ మెంట్ కి వెళ్లారు. అక్కడ ఉన్నట్లుండి ఏదో గొప్ప ఆలోచన వచ్చి, లెక్కలు చేయడానికి చిత్తు కాగితం కోసం జేబులో తడుముకున్నాడు. జేబులో ఉన్న కాగితం తీసి, దాని మీద ఎవేవో లెక్కలు వేసి, కాసేపయ్యాక లెక్క ఎటూ తేలకపోయేసరికి విసుగు పుట్టి ఆ కాగితాన్ని చిత్తు బుట్టలో పారేశాడట.

సాయంత్రం యథావిధిగా పాత ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు తాళం వేసి ఉంది. అప్పుడు భార్య మాటలు గుర్తుకొచ్చాయి. తడుముకుంటే కోటు జేబులో చిరునామా కాగితం లేదు. అంతలో ఆ దారే పోతున్న ఓ అమ్మాయిని ఆపి “చూడమ్మా! నేను నీకు తెలిసే ఉంటాను. నా పేరు నోర్బర్ట్ వీనర్. మా వాళ్లు ఇవాళే ఇల్లు మారారు. ఆ కొత్త ఇంటి చిరునామా సంగతి నీకేమైనా తెలుసా?” అని అడిగాడట.

“బాగా తెలుసు నాన్నా! నువ్విలా తప్పిపోతావని తెలిసే అమ్మ నన్ను పంపింది” అందట పాపం ఆ అమ్మాయి.

Reference:
K. Krishnamurthy, Spice in Science, Pustak Mahal.

జీవశాస్త్రంలో ఒక విచిత్ర లక్షణం ఉంది. దాన్ని లక్షణం అనే కన్నా జాఢ్యం అంటే సబబేమో. వృక్షలోకంలో కనిపించే ప్రతీ ప్రక్రియకి, అది అర్థం అయినా కాకపోయినా దానికో పేరు పెడతారు. కొన్ని సార్లు అలా తయారైన భార పదజాలం విషయాన్ని వివరించకపోగా, ఆ విషయం గురించిన అజ్ఞానాన్ని కప్పుపుచ్చుకోడానికా అన్నట్టు ఉంటుంది. (ఇలాటి మాటలకనికట్టు మనకి వైద్యపరిభాషలో కూడా కనిపిస్తుంది. రోగకారణం తెలీనప్పుడు “etiology idiopathic” అంటుంటారు. Etiology = రోగకారణం, idopathic = తెలీదు! ’ఈ రోగం ఏంటో మాకు బొత్తిగే తెలీదు సుమా!’ అని కాస్త ఘరానాగా చెప్పడం అన్నమాట!)

పరిసరాల బట్టి, మొక్కలోని అంగాన్ని బట్టి మొక్కల్లో వృద్ధి రకరకాలుగా ఉంటుంది. ఉదాహరణకి మొక్కల వేళ్లు ఎప్పుడూ కిందకి, భూమిలోపలికి పెరుగుతాయి. ఈ వృద్ధి రీతికి geotropism (ధరాగత వృద్ధి) అని పేరు. అలాగే మొక్కలోని కాండం భూమి నుండి పారిపోతున్నట్టుగా పైపైకి పోతుంది. ఈ వృద్ధి రీతికి negative geotropism (ఋణాత్మక ధరాగత వృద్ధి) అని పేరు. ఇక మొక్క కొమ్మలు ఈ రెండు దిశలలోను కాకుండా అడ్డుగా, నేలకి సమాంతరంగా విస్తరిస్తాయి. కనుక దీనికి diageotropism (ధరాసమాంతర వృద్ధి) అని పేరు. అలాగే కాంతి దిశగా ఎదిగే ఆకుల తీరుకి heliotropism (సూర్యగత వృద్ధి) అని, లేదా phototropism (కాంతి గత వృద్ధి) అని పేరు. ఈ అర్థం లేని పదజాలం ఇక్కడితో ఆగదు. పై నియమానికి వ్యతిరేకంగా కొన్ని సార్లు ఆకులు కాంతి నుండి దూరం అవుతున్నట్టుగా ఎదుగుతాయి. దానికి negative phototropism అని మరో భారమైన పేరు. నీటి కోసం వెతుక్కుంటూ పెరిగే వేళ్ల వృద్ధి hydrotropism (జలగత వృద్ధి), నీటి ప్రవాహం కోసం అన్వేషిస్తే అది rheotropism (ప్రవాహగత వృద్ధి)! స్పర్శకి వంగి మెలకలు తిరిగే లత తీరు పేరు thigmatropism (స్పర్శానుగత వృద్ధి).

వృక్షశాస్త్రంలో ఇలా ప్రతీ దానికి ఓ పేరు పెట్టి ఊరుకునే దురలవాటు గురించి సర్ పాట్రిక్ గెడెస్ ఇలా అంటారు: “ఆలోచనకి చేదోడువాదోడుగా ఉంటుందని పరిభాషని సృష్టించుకుంటాం కాని కొన్ని సార్లు ఆ పరిభాష వల్ల అర్థం అస్పష్టమై, అనర్థాలకి, అపోహలకి దారి తీస్తుంది. ఒక దశలో ఈ నిరర్థక పరిభాష పెచ్చరిల్లి ఒక వ్యాధిగా పరిణమిస్తుంది. విజ్ఞానంలో ప్రతీ విభాగానికి దాని ప్రత్యేక సాంకేతిక పరిభాష ఉంటుంది. ఆ పరిభాష కొన్ని సార్లు పెరిగి పెరిగి నిరర్థక శబ్ద పుష్టిగా పరిణమిస్తుంది. ఎన్నో వైజ్ఞానిక రంగాల్లో ఈ దుష్పరిమాణం కనిపించినా, వృక్షశాస్త్రంలో ఇది మరీ విపరీతంగా ఉంటుంది. ప్రతీ జీవజాతికి, వర్గానికి ఇవ్వబడ్డ వైజ్ఞానిక నామధేయాలని పక్కన పెడితే, ఓ పదిహేను, ఇరవై వేల పారిభాషిక పదాలతో వృక్ష శాస్త్ర పదకోశాలు కిటకిటలాడుతూ విద్యార్థుల గుండెల్ని దడదడలాడిస్తుంటాయి.”

హీలియోట్రాపిజమ్ లాంటి పెద్ద పెద్ద పదాల మెస్మరిసంకి లోనై విద్యార్థుల ఆలోచన చచ్చుబడిపోతుంది. ప్రశ్నించి శోధించే గుణం అణగారి పోతుంది. విజ్ఞానం పట్ల విద్యార్థులకి ఏ మాత్రం ఆసక్తి ఉన్నా ఈ భారీ పదజాలపు సమ్మోహనం వల్ల మొగ్గలోనే ఆ ఆసక్తి తుంచబడుతుంది అంటాడు బోస్.

జంతువుల్లో లాగే మొక్కల్లో కూడా ప్రేరణలకి ప్రతిస్పందించే గుణం ఉంటుందని చివరికి తోటి శాస్త్రవేత్తలు నెమ్మదిగా ఒప్పుకోవడం మొదలెట్టారు. కాని ఆ ప్రతిస్పందన చాలా బలహీనంగా మాత్రమే ఉంటుందని వాదించసాగారు. వారి అభిప్రాయం తప్పని బోస్ నిరూపించాడు.

ఒక అవరోధాన్ని తాకిన లత ఆ అవరోధం చుట్టూ పెనవేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాన్నే థిగ్మాట్రాపిజమ్ అంటారని ఇందాక చెప్పుకున్నాం. ఈ ప్రతిస్పందన అడుగున రెండు మౌలికమైన చర్యలు ఉన్నాయని నిరూపించాడు బోస్. ఒక ప్రత్యక్ష ప్రేరణ వల్ల లతలో సంకోచం జరిగితే, మరో ప్రరోక్ష ప్రేరణ వల్ల లతలో వ్యాకోచం జరుగుతుంది. ఒక పక్కకి వంగిన లతలో బయటికి పొంగిన, కుంభాకార (convex) భాగంలో ధనావేశ విద్యుత్తు ఉంటుంది. లోపలికి వంగి ఉన్న నతాకార (concave) భాగంలో ఋణావేశ విద్యుత్తు ఉంటుంది. మానవ శరీరంలో విద్యుత్తుకి అత్యంత సున్నితంగా స్పందించే అంగం నాలుక. నాలుక యొక్క సునిశితత్వాన్ని (sensitivity), లత యొక్క సునిశితత్వంతో పోల్చదలచుకున్నాడు బోస్. నాలుకలోను, Biophytum అనే మొక్కకి చెందిన రెమ్మలోను కరెంటు ప్రవహింపజేస్తూ, క్రమంగా కరెంటును పెంచసాగాడు. కరెంటు 1.5 మైక్రో ఆంపియర్లు చేరేసరికి రెమ్మలోని ఆకులలో కంపన మొదలయ్యింది. కాని మనిషి నాలుకలో మాత్రం ఏ చలనమూ లేదు. ఆ విధంగా మనిషి కన్నా మొక్కలే విద్యుత్తుకు మరింత సునిశితంగా ప్రతస్పందిస్తాయని నిరూపించాడు.

(సశేషం...)

పాశ్చాత్యుల స్తుతిని, సమ్మతిని పొంది ఇండియాకి తిరిగొచ్చిన బోస్ ని బెంగాలు పెద్ద ఎత్తున సత్కరించింది. బోస్ గౌరవార్థం బెంగాలు గవర్నరు ఓ పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశానికి కలకత్తా షెరీఫ్ అధ్యక్షుడుగా ఉన్నాడు. అతి నెమ్మదిగా సాగే మొక్కల ఎదుగుదలని కొలవడానికి తను చేస్తున్న ప్రయత్నాల గురించి బోస్ ఆ సందర్భంలో మాట్లాడాడు.

1917 లో బ్రిటిష్ ప్రభుత్వం బోస్ కి Knighthood ఇచ్చి సత్కరించింది. ఆ సందర్భంలో బోస్ కేవలం వైజ్ఞానిక సత్యాలని కనుక్కునే శాస్త్రవేత్త కాడని, వైజ్ఞానిక చరిత్రలో ఓ కొత్త శకాన్ని ఆరంభించడానికి వచ్చిన యుగపురుషుడని సభాధ్యక్షుడు మాట్లాడాడు. అనతి కాలంలోనే నవంబరు 13 వ తేదీన, బోస్ 59 వ పుట్టినరోజు నాడు బోస్ యొక్క స్వంత పరిశోధనాలయం (దీని పేరు Institute for Research) యొక్క ప్రారంభోత్సవం జరిగింది.

ఆ సందర్భంలో బోస్ మాట్లాడుతూ తన సంస్థలో జరిగే ఆవిష్కరణలు అన్నీ ప్రజల సొత్తని, వాటి మీద పేటెంట్లు తీసుకోబోయేది లేదని ప్రకటించాడు. వైర్లెస్ టెలిగ్రఫీని మార్కోనీ కన్నా ముందు కనుక్కున్నా దాని మీద రావలసిన పేటెంట్ ని తిరస్కరించాడు. అలాగే తన అవిష్కణల మీద పరిశ్రమల నుండి లబ్ది పొందే ఎన్నో అవకాశాల్ని త్రోసిపుచ్చాడు. “అమరత్వానికి బీజాలు ఆస్తిపాస్తులలో లేవు, ఆలోచనలలో ఉంటాయి; వస్తుసంపదలో కాదు, భావసంపదలో ఉంటాయి,” అంటూ జడపదార్థం కన్నా మనస్సు గొప్పదని చాటాడు. “జడవస్తువులని పెంచుకోవడం చేత కాకుండా, సముచిత భావనా సంపదని ధారాళంగా వ్యాపించజేయడం ద్వారా నిజమైన మానవతా సామ్రాజ్యాన్నిస్థాపించవచ్చు. జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవాలనే కోరికని త్యజించడం మన సంస్కృతి మనకి నేర్పే పాఠం.”

బోస్ సంస్థ స్థాపించబడ్డ ఏడాది తిరిగేలోగా బెంగాలు గవర్నరు అధ్వర్యంలో ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. ఎనిమిదేళ్ల శ్రమ తరువాత తను నిర్మించిన ఓ కొత్త పరికరం గురించి ఆ సభలో ప్రకటించాడు. మొక్కల ఎదుగుదలని కొలిచే ఈ పరికరం పేరు క్రెస్కోగ్రాఫ్. ఆ రోజుల్లో లభ్యమయ్యే అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శిని కన్నా శక్తివంతమైన ఈ పరికరం మొక్కల చలనాలని 10,000 రెట్లు సంవర్ధనం చేసి చూపిస్తుంది.

మొక్కలఎదుగుదల సమవేగంతో కాకుండా ఆగాగి జరుగుతుందన్న అపురూపమైన సత్యాన్ని మొట్టమొదటి సారిగా ఈ పరికరం వెల్లడి చేసింది. ఒక ఎత్తుకి ఎదిగి, ఆ ఎదిగిన ఎత్తులో నాలుగోవంతు తగ్గుతూ, అలా ఆగాగి, అలలు అలలుగా ఎదుగుతుంది. కొన్ని మొక్కల్లో తాకితే చాలు ఎదుగుదుదల ఆగిపోతుందని, మరి కొన్ని మొక్కల్లో మొరటుగా వ్యవహరిస్తే కూడా అదే జరుగుతుందని ఈ పరికరం వల్ల తెలిసింది.

వివిధ ప్రేరణలకి ప్రతిస్పందనగా మొక్కల్లో ఎదిగే వేగం పెరిగినా, తగ్గినా తక్షణమే తెలిసిపోయేట్టుగా మునుపటి పరికరాన్ని కొద్దిగా సవరించి “balanced crescograph” ని నిర్మించాడు. మొక్క ఎదుగుదల యొక్క సగటు వేగానికి సమానంగా ఈ పరికరంలో మొక్కని నెమ్మదిగా కిందకి దించడం జరుగుతుంది. కనుక వృద్ధి వేగంలో మార్పులు మాత్రమే ఈ పరికరంలో నమోదు అవుతాయి. ఈ పరికరం ఎంత సునిశితంగా ఉంటుందంటే దాంతో మొక్క వృద్ధి వేగంలో ఇంచుమించు 10^-9 inches/sec మార్పు కూడా కనిపెట్టొచ్చు.


ప్రఖ్యాత అమెరికన్ వైజ్ఞానిక పత్రిక Scientific American వ్యవసాయ రంగంలో బోస్ ఆవిష్కరణల ప్రభావం గురించి వర్ణిస్తూ ఇలా రాసింది: “బోస్ సృష్టించిన క్రెస్కోగ్రాఫ్ ముందు అల్లావుద్దీన్ అద్భుత దీపం వెలవెలబోతుంది. ఒక్క గంటలో మొక్కల మీద ఫెర్టిలైజర్ల యొక్క, విద్యుత్తు యొక్క, తదితర ఎన్నో ప్రేరణల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఈ పరికరం తేటతెల్లంగా ప్రదర్శిస్తుంది.”

(సశేషం...)

క్యారట్ లకీ అనుభూతులు ఉంటాయా?

Posted by V Srinivasa Chakravarthy Friday, January 15, 2010 1 comments

బోస్ సాధించిన విప్లవాత్మక ఫలితాలని తన తోటి వృక్ష శాస్త్రవేత్తలు సమ్మతించకపోవడానికి ఒక ముఖ్య కారణం తను నిర్మించిన నునిశిత పరికరాలని పోలిన పరికరాల నిర్మాణం వాళ్లకి సాధ్యపడకపోవడమే. అయినా ఇతర వృక్ష శాస్త్రవేత్తలని ఒప్పించడానికి, తన ప్రయోగాలలో వారికి నమ్మకం కుదిరేలా చెయ్యడానికి మొక్కలకి యాంత్రికంగా ప్రేరణలు ఇవ్వడానికి, వాటి చలనాలని రికార్డు చెయ్యడానికి మరింత అధునాతన పరికరాలని నిర్మించాలని నిశ్చయించాడు బోస్. వీటిలో క్షణంలో వెయ్యోవంతులో జరిగే మార్పులని కూడా రికార్డు చెయ్యడానికి వీలవుతుంది. దాంతో మొక్కల్లో అత్యంత వేగవంతమైన చలనాలని కూడా రికార్డు చెయ్యడానికి వీలయ్యింది.

ఈ కొత్త పరికరంతో వచ్చిన ఫలితాలతో చివరికి తోటి శాస్త్రవేత్తలకి నమ్మకం కుదిరింది. ఇంగ్లండ్ లో రాయల్ సొసయిటీకి చెందిన "ఫిలొసాఫికల్ ట్రాన్సాక్షన్స్" పత్రికలో ఆ ఫలితాలు అచ్చయ్యాయి. అదే ఏడాది బోస్ తన మూడవ పుస్తకాన్ని కూడా ప్రచురించాడు. దీని పేరు "Researches on irritability of Plants." 376 పేజీలున్న ఈ పుస్తకంలో 180 ప్రయోగాలు వర్ణించబడ్డాయి.

1914 బోస్ నాలుగో యాత్ర మీద యూరప్ కి బయలుదేరాడు. ఈ సారి తనతో పాటు కేవలం పరికరాలే కాక మిమోసా పుడికా, డెస్మోడియమ్ గైరాన్స్ మొక్కలు కూడా తీసుకెళ్లాడు. ప్రేక్షకుల ఎదుట ప్రత్యక్షంగా తన ప్రయోగాలని ప్రదర్శిస్తే నమ్మకం పెరుగుతుందని ఉద్దేశం. "రాయల్ ఇన్స్టి ట్యూషన్" లోను, "రాయల్ సొసయిటీ ఆఫ్ మెడిసిన్" లోను సాయంకాలం సమావేశాలలో ప్రసంగించాడు. కీటకాలు తినే మొక్కల మీద ఎంతో పరిశోధన చేసిన సర్ లాడర్ బ్రన్టన్ ఆ సమావేశాలలో హాజరు అయ్యడు. తను తన జీవితకాలంలో చూసిన జీవక్రియా ప్రయోగాలన్నీ బోస్ ప్రయోగాల ముందు వెలవెలబోతున్నాయంటూ సర్ బ్రన్టన్ బోస్ ని మెచ్చుకున్నాడు.

ప్రఖ్యాత ఇంగ్లిష్ రచయిత, శాకాహారి, జీవపరిచ్ఛేద వ్యతిరేకి అయిన జార్జ్ బెర్నార్డ్ షా కూడా బోస్ ప్రయోగశాలని సందర్శించాడు. బోస్ రూపొందించిన సునిశిత పరికరాలతో క్యాబేజి ఆకు ప్రకటిస్తున్న మరణ స్పందనలు చూసి దిగ్భ్రమ చెందాడా రచయిత. ఆ ఒక్క అనుభవంతో షా తన సమస్త రచనలని బోస్ కి అంకితం ఇస్తూ అంకిత ముద్ర కింద ఇలా రాశాడు: "అత్యథమ జీవశాస్త్రవేత్త అత్యుత్తమ జీవశాస్త్రవేత్తకి చేస్తున్న అంకితం."

గతంలో బోస్ రచనలు రాయల్ సొసయిటీ పత్రికలో అచ్చు కాకుండా వ్యతిరేకంగా వోటు వేసి అడ్డుపడ్డ ఒక జీవక్రియాశాస్త్రవేత్త తను చేసిన పనికి పశ్చాత్తాప పడి, బోస్ ని కలుసుకుని ఇలా అన్నాడు: "అసలు ఇలాంటివన్నీ సంభవం అని నమ్మకం కుదిరేది కాదు. మీ భారతీయులకి స్వతహాగా ఉండే ఊహాశక్తి ఈ సందర్భంలో వెర్రితలలు వేసిందని అనుకున్నాను. కాని మొదట్నుంచి మీరు చెప్పింది నిజమే నని ఇప్పుడు మన:పూర్వకంగా ఒప్పుకుంటున్నాను."

బోస్ పరిశోధనల గురించి మొదటి సారిగా బ్రిటిష్ దినపత్రిక "నేషన్" ప్రశంసాపూర్వకంగా ఇలా వర్ణించింది:
"మైదా వేల్ వద్ద ఒక గదిలో పాపం ఓ క్యారట్ ఓ బల్లకి కట్టిపడేసి ఉంది. లైసెన్స్ లేని ఓ పరిచ్ఛేదన యంత్రం దాని మీదకి విజృంభించడానికి సిద్ధంగా ఉంది. ఏదో తెల్లని ద్రవంతో నిండిన గాజు నాళాల ద్వారా వైర్లు పోతున్నాయి. ఆ నాళాలు రెండూ రెండు తెల్లని పాదాల్లా క్యారట్లో దిగబడి ఉన్నాయి. ఆ కాయని ఫోర్సెప్స్ తో గిచ్చినప్పుడు అందులో కలిగే బాధామయ స్పందన పరికరంలో తెలుస్తుంది. ఆ బాధకి క్యారట్ నిలువెల్లా వ్యాపించే విద్యుత్ కంపన ఓ సున్నితమైన మరని కదిలించగా, దాని వల్ల ఓ చిన్న అద్దం తిరుగుతుంది. అద్దం దిశ మారడం వల్ల దాని మీద పడ్డ కాంతి రేఖ ప్రతిబింబితమై గదిలో ఎక్కడో దూరంలో పడుతుంది. ఆ విధంగా క్యారట్ లో జరిగే అత్యంత సూక్ష్మమైన చలనాలు బ్రహ్మాండంగా సంవర్ధనమవుతున్నాయి. కుడి వైపున ఉన్న నాళం వద్ద గిచ్చితే, కాంతి బిందువు కుడి పక్కకి ఏడెనిమిది అడుగులు జరుగుతుంది. ఎడమ పక్క ఉన్న నాళం వద్ద గిచ్చితే బిందువు ఎడమ పక్కకి జరుగుతుంది. ఏ స్పందనా సాధ్యం కాదని అనిపించే క్యారట్ లాంటి కాయగూరలో కూడా ఆ విధంగా విజ్ఞాన శాస్త్రం అనుభూతులని తేటతెల్లం చెయ్యగలిగింది."

(సశేషం...)

అదే కాలంలో బోస్ రాసిన రెండో పుస్తకం పేరు ’తులనాత్మక విద్యుత్ జీవక్రియా శాస్త్రం’ (Comparative Electrophysiology). 321 ప్రయోగాలు వర్ణించబడ్డ ఈ పుస్తకం కూడా భారీ గ్రంథమే. ఈ ప్రయోగాలన్నీ కూడా సాంప్రదాయ బద్ధమైన బోధనలకి వ్యతిరేకంగా ఉన్నాయి. వృక్ష ధాతువుకి, జంతు ధాతువుకి మధ్య అందరికీ తెలిసిన తేడాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా, వాటి ప్రవర్తనలో, ప్రతిక్రియలలో ఏకత్వాన్ని, అవిచ్ఛిన్నతని ఎత్తి చూపాడు. మామూలుగా చలనం ఉండదని అనుకునే నాడులలో కూడా సూక్ష్మమైన చలనం ఉంటుందని నిరూపించాడు.

మొక్కల నుండి వెలికి తీయబడ్డ “నాడి”కి, మామూలు జంతు నాడికి, ప్రతిక్రియలలో తేడాయే లేదని బోస్ అన్నప్పుడు వైజ్ఞానిక ప్రపంచం ఉలిక్కి పడింది: “మొక్కల్లోను, జంతువుల్లోను ప్రతిస్పందనలలో సమానత్వం ఎంత సంపూర్ణంగా ఉందో చెప్పడానికి ఇదే చక్కని తార్కాణం. ఒక సందర్భంలో కనిపించే లక్షణాలని ఆధారంగా చేసుకుని రెండవ సందర్భంలో లక్షణాలని అర్థం చేసుకోవచ్చు. మొక్కలో మరింత సరళమైన పరిస్థితుల్లో కనిపించే ఒక క్రియని అర్థం చేసుకుంటే, జంతువులో, మరింత సంక్లిష్టమైన పరిస్థితుల్లో, కనిపించే అదే క్రియని మరింత సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ఈ పుస్తకాల ధాటికి ఉక్కిరిబిక్కిరైన ప్రఖ్యాత వైజ్ఞానిక పత్రిక నేచర్, మొదటి పుస్తకం గురించి ఇలా అంది: “పుస్తకం నిండా ఎన్నెన్నో ప్రయోగాలు, ఒక దాంతో ఒకటి చక్కగా పెనవేసుకుపోతూ, చాలా ఆసక్తికరంగా వర్ణించబడ్డాయి. కాని అవన్నీ మరీ నమ్మశక్యం కానట్టు ఉండడంతో దీన్ని మన:పూర్వకంగా సమర్ధించడానికి కష్టంగా ఉంది.” రెండో పుస్తకం గురించి కూడా ఆ పత్రిక వ్యాఖ్యానం ఇలాగే సంధిగ్ధంగా ఉంది. “మొక్కల జీవక్రియా శాస్త్రం గురించి తెలిసిన వారెవరైనా, ఆ రంగంలో సాంప్రదాయ బద్ధమైన భావాలతో పరిచయం ఉన్నవారు ఎవరైనా, ఈ పుస్తకం తిరగేస్తూ దిగ్భ్రాంతి చెందుతారు. అందులోని వర్ణన చాలా సాఫీగా, తార్కికంగా ముందుకు సాగుతుంది. కాని ఎక్కడా పూర్వ వైజ్ఞానిక సాహిత్యాన్ని పేర్కొనదు. అసలు దాని మీద ఆధారపడుతున్నట్టు కూడా అనిపించదు. కనుక పుస్తకంలో రచన అంతా పూర్వ వైజ్ఞానిక సాహిత్యంతో సంబంధం లేనట్టుగా సాగడమే కాకుండా, ఇతర శాస్త్రవేత్తల కృషిని గురించి ఎక్కడా పెద్దగా పేర్కొనదు.” పుస్తకంలో చెప్పబడ్డ విషయాలన పరీక్షిస్తూ ఇతర పరిశోధనలు జరిగినట్టు సమాచారం లేదు. విపరీతమైన ప్రత్యేకీకరణ అనే వ్యాధి చేత బాధపడే ఆ వ్యాఖ్యాతకి, ఆ పుస్తకం రాసింది ఓ అర్థశతాబ్దం ముందుగా పుట్టిన ఓ మహామేధావి అన్న స్పృహ కలుగనేలేదు.

ఈ ప్రత్యేకీకరణ జాఢ్యాన్ని వెక్కిరిస్తున్నట్టుగా ఒక చోట బోస్ తన చింతన లోని సారాన్ని ఇలా వివరిస్తాడు: “ప్రకృతి అనే విశాల సౌధంలో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ద్వారం ఉంది. భౌతిక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త, జీవశాస్త్రవేత్త... ఇలా ఒక్కొక్కరు వేరు వేరు ద్వారాల ద్వార, వారి స్వంత వైజ్ఞానిక విభాగాల ద్వార, ఆ సౌధంలోకి ప్రవేశిస్తారు. ప్రతి ఒక్కరు వారి ప్రత్యేక విభాగానికి, ఇతర విభాగాలతో ఏ సంబంధమూ లేదని అనుకుంటారు. ఖనిజ, వృక్ష, సచేతన ప్రపంచాలు అంటూ మనం చేసే విభజనలు ఆ విధంగానే మొదలయ్యాయి. ఇలాంటి తాత్వికమైన దృక్పథాన్ని అందరూ సమర్ధించక పోవచ్చు. కాని అన్ని శోధనలకి పరమ లక్ష్యం జ్ఞానాన్ని సమగ్ర రూపంలో తెలుసుకోవడమే నన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.”

(సశేషం...)

మొక్కల్లో మరణ స్పందనలు

Posted by V Srinivasa Chakravarthy Sunday, January 10, 2010 1 comments

ఆ విధంగా ఎన్నో మొక్కల్లో విద్యుత్ ప్రవాహం యాంత్రిక చలనాలని కలుగజేస్తుందని నిరూపించాడు బోస్. మరి జంతు కండరాలలో కూడా జరిగేది సరిగ్గా ఇదే కదా? నాడి లోంచి ప్రవహించే విద్యుత్తు కండరం మీద పని చేసి, అది సంకోచించేట్టు చేస్తుంది. వేడి/చల్లదనం, మత్తు పదార్థం, బలహీనమైన విద్యుత్ ప్రవాహం – ఈ ప్రేరక శక్తులన్నీ ఇటు జంతు వ్యవస్థల్లోను, అటు మొక్కల్లోను కూడా ఒకే విధమైన ప్రతిస్పందనలు కలుగజేస్తాయని తదనంతరం నిరూపించాడు.

జంతువుల్లో ఉన్నట్టుగానే మిమోసా మొక్కలో ఒక రకమైన ’ప్రతిక్రియా చాపం’ (reflex arc) ఉంటుందని చూపించాడు బోస్. మన చేయి ఒక వేడి వస్తువును తాకగానే అదేంటో తెలీకుండానే అప్రయత్నంగానే చేతిని వెనక్కు తీసేసుకుంటాం. అలాంటప్పుడు వేడి వస్తువు నుండి వచ్చిన సంవేదనలు (sensations) నాడుల ద్వారా వెన్నుపాముని చేరుకుని, అక్కడే కొన్ని నాడీకణాల ద్వార ప్రసారం అయ్యి, తిరిగి వెన్నుపాములో అదే భాగం నుండి వచ్చే సంకేతాలు నాడుల ద్వారా ముందుకు ప్రవహించి, కండరాన్ని అదిలించి, చేతిని కదిలిస్తాయి. ఇలా వేగంగా, అప్రయత్నంగా చేసే చర్యలనే ’అసంకల్పిత ప్రతిక్రియలు (reflexes)’ అంటారు. ప్రత్యేకించి వెన్నుపాము లాంటి అవయవం లేకపోయినా మొక్కలో కూడా ఇలాంటి ప్రతిక్రియ ఉండడం చాలా ఆశ్చర్యకరం.

అలాగే డెస్మోడియం గైరాన్స్, లేదా టెలిగ్రాఫ్ మొక్కలో మరో విశేషమైన ప్రవర్తనని గమనించాడు. చిన్న కాడతో పాటు ఆ మొక్క నుండి ఒక ఆకుని తెంపి, ఆ ఆకు కాడని వంచిన, నీరు నిండిన పరీక్షానాళంలో ముంచితే కాసేపయ్యాక ఆ ఆకు, తెంపిన గాయం నుండి తేరుకుని, దానంతకు అదే నెమ్మదిగా, లయబద్ధంగా స్పందించడం మొదలెట్టింది. కొమ్మ నుండి వేరుపడ్డ ఆకు దానంతకు అది స్పందించడం ఓ చూడచక్కని దృశ్యం! దీన్ని చూస్తే రింగర్స్ ద్రావకంలో పదిలం చెయ్యబడ్డ జంతు గుండె కొట్టుకోవడం గుర్తొస్తుంది. అలాగే గుండెలో రక్త పీడనం బాగా తగ్గినప్పుడు ఎలాగైతే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందో, మళ్లీ రక్తపీడనం తిరిగి పెంచినప్పుడు ఎలాగైతే గుండె తిరిగి కొట్టుకోవడం మొదలెడుతుందో, డెస్మోడియం ఆకులో కూడా పసరు యొక్క పీడనాన్ని తగ్గిస్తే ఆకు స్పందించడం ఆగిపోయి, తిరిగి పసరు పీడనం పెంచాక స్పందన తిరిగి పుంజుకుంది.

ఒకరోజు బోస్ ఉష్ణోగ్రతని మార్చుతూ మొక్కలో అత్యధిక చలనాన్ని తెప్పించే పరిస్థితుల కోసం అన్వేషిస్తున్నాడు. ఒక దశలో చలనం పూర్తిగా ఆగిపోయింది. ఆగిపోయే ముందు ఆ మొక్కలో ఒక్కసారిగా కంపన బయలుదేరింది... చివరి శ్వస విడుస్తున్న జంతువులోలా... కచ్చితంగా ఏ ఉష్ణోగ్రత వద్ద మరణం సంభవిస్తుందో తెలుసుకోడానికి ’మరణమానిని’ (morometer) అనే ఓ పరికరాన్ని తయారుచేశాడు, ఎన్నో రకాల మొక్కల్లో ఆ కీలక ఉష్ణోగ్రత 60 డిగ్రీలు కావడం విశేషం. కాని ఎన్నో ప్రత్యేక మొక్కల్లో మాత్రం ఆ ఉష్ణోగ్రత విలువ మొక్క వయసు మీద, మొక్కకి అంతకు ముందు ఇవ్వబడ్డ ప్రేరణల చరిత్ర మీద ఆధారపడింది. మితిమీరిన అలసట చేత, విషప్రభావం చేత మొక్క యొక్క నిరోధకతని కృత్రిమంగా తగ్గిస్తే, మొక్క చనిపోయే ఉష్ణోగ్రత కొన్ని సార్లు 23 C కి పడిపోయింది. చనిపోయే ముందు మొక్క భారీ ఎత్తున విద్యుత్ శక్తిని వెలువరిస్తుంది. ఐదొందల పచ్చ బఠాణీల నుండి ఐదొందల వోల్ట్ ల విద్యుత్తును పుట్టించొచ్చు కనుక, వాటితో, వాటిని వండబోయిన వంటవాడినే వండేయొచ్చు, నని బోస్ చమత్కారం ఆడతాడు ఒకచోట!

మొక్కల ఎదుగుదలకి కార్బన్ డయాక్సయిడ్ మంచిది అని మామూలుగా అనుకుంటాం. కాని అది కూడా మరీ మితిమీరితే మొక్క కూడా జంతువులు, మనుషులలాగే ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుందని గుర్తించాడు బోస్. అలాంటి పరిస్థితుల్లో మనుషులకి చేసినట్టుగానే పుష్కలంగా ఆక్సిజన్ ని పట్టించి మొక్కని ఆ స్థితి నుండి బయటి తీసుకురావచ్చు. మొక్కలలో కూడా విస్కీ, జిన్ పట్టిస్తే వాటికీ “స్పృహ కోల్పోవడం”, “తిరిగి స్పృహ రావడం,” స్పృహ వచ్చాక కూడా చాలా సేపు మత్తు వదలకపోవడం (hangover) మొదలైన లక్షణాలన్నీ గమనించాడు. ఇలాంటి వందలాది ప్రయోగాలని క్రోడీకరిస్తూ 1906 – 1907 కాలంలో రెండు అద్భుత గ్రంథాలని ప్రచురించాడు.వాటిలో ఒకటైన Plant response as a means of physiological investigation (మొక్కల ప్రతిస్పందనల ఆధారంగా జీవక్రియలలోకి శోధన) అన్న 781 పేజీల పుస్తకంలో 315 ప్రయోగాలు వర్ణించబడ్డాయి. ఆ ప్రయోగాలలో జీవక్రియలకి సంబంధించి ఆ రోజుల్లో చలామణిలో ఉన్న ఒక మౌలిక భావన తప్పని ఋజువు అయ్యింది. ఆ విషయం గురించి బోస్ స్వయంగా ఇలా అంటాడు: “ఎలాగైతే ట్రిగ్గరు నొక్కినప్పుడు తుపాకి లోంచి తూటా బయటికి దూసుకొస్తుందో, ఇంధనం భగ్గు మన్నప్పుడు అంతర్ జ్వలన యంత్రంలో చలనం వస్తుందో, అదే విధంగా [జీవపదార్థంలోజరిగే] ప్రతిస్పందన ఎప్పుడూ విస్ఫోటాత్మకంగా జరిగే రసాయన చర్య వల్ల జరుగుతుందని, అది ముగియగానే శక్తి అంతా తప్పనిసరిగా హరించుకుపోతుందని అనుకోవడం పరిపాటి.” కాని బోస్ ప్రయోగాలలో మొక్కలలో చలనాలకి, కాండంలో పసరు పైకి ఎగయడానికి, మొక్కల ఎదుగుదలకి కావలసిన శక్తి అంతా మొక్కలు తమ పరిసరాల నుండి తిసుకుంటాయని తేలింది. అలా గ్రహించిన శక్తిని మొక్కలు తమలో నిలువ ఉంచుకుని భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంటాయి.

ఇలాంటి విప్లవాత్మక భావాలతో భౌతిక శాస్త్రవేత్తల మన్ననలని పొందినా వృక్షశాస్త్రవేత్తలతో మాత్రం కోరి శత్రుత్వం కొని తెచ్చుకున్నాడు. బొటానికల్ గెజిట్ అనే పత్రిక ఒక పక్క బోస్ కృషిని మెచ్చుకుంటూనే, మరో పక్క “రచయిత తను వ్యవహరిస్తున్న రంగంలో పెద్దగా ప్రవేశం లేకపోవడం చేత ఎన్నో చోట్ల పొరబాట్లు చేశాడు,” అని విమర్శించింది.

(సశేషం...)

మొక్కల్లో యాంత్రిక చలనాలు

Posted by V Srinivasa Chakravarthy Saturday, January 9, 2010 1 comments
మొక్కల్లో యాంత్రిక చలనాలు

తన పేపర్ల ప్రచురణలో రాయల్ సొసయిటీ వైఖరి చూసి విసిగిపోయాడు బోస్. ఆ నాటి నుండి తన ఆవిష్కరణల గురించి ప్రపంచానికి తెలుపడానికి పత్రికల మీద ఆధారపడకూడదని నిశ్చయించుకున్నాడు . ఆ విషయం గురించే, “పుస్తకాలు రాయాలంటే బద్ధకంగా ఉండేది కాని ఈ పరిస్థితుల్లో ఇక తప్పలేదు,” అని రాసుకున్నాడు. లండన్, పారిస్, బెర్లిన్ నగరాల్లో తన ప్రసంగాలన్నీ సమీకరిస్తూ ఒక పుస్తకంగా రాసి 1902 నడిమి కాలంలో ప్రచురించాడు. అదే “Response in the Living and the Non-living” అన్న పుస్తకంగా వెలువడింది.

మొక్కల్లో విద్యుత్ చలనాలని అధ్యయం చేశాక బోస్, యాంత్రిక చలనాల మీద తన దృష్టి సారించాడు. మానవ,జంతు శరీరాలలో ఉండే చలనాల లాంటివే, మొక్కల్లో కూడా ఉంటాయేమో పరిశోధించసాగాడు. మొక్కల్లో ఊపిరితిత్తులు లేకపోయినా శ్వాస క్రియ జరుగుతుందని, ఉదరం లేకపోయినా జీర్ణ క్రియ జరుగుతుందని, కండరాలు లేకపోయినా కదలికలు ఉంటాయని తెలిసిన బోస్, మొక్కల్లో జంతువులలో ఉండే సంక్లిష్ట నాడీమండలం లాంటిది లేకపోయినా, దాన్ని పోలిన ఉత్తేజాలు ఉంటాయని నమ్మాడు.

మొక్కల్లో కంటికి కనిపించని మార్పులని కొలవాలంటే, వాటికి సున్నితమైన ఘాతాలు ఇచ్చి, ఆ ఘాతాలకి అవి ఎలా ప్రతిస్పందిస్తున్నాయో కొలవాలి. ఆ విషయమై ఇలా రాసుకున్నాడు. “ఎలాంటి ఉత్తేజాన్ని ఇస్తే మొక్క ఆ ఉత్తేజానికి ప్రత్యుత్తరంగా సంకేతాన్ని ఇస్తుందో చూడాలి. అలా మొక్క చెప్పిన సంకేతాలని కలిపి ఓ అర్థవంతమైన లిపిగా అమర్చాలి. అది చెయ్యగలిగామంటే మొక్కలు చెప్పే ఆ అలేఖ్యసందేశాలని అర్థంచేసుకోగలుగుతాము.” ఆ ఒక్క వాక్యంలో రెండు దశాబ్దాలకి సరిపోయే పరిశోధనా ప్రణాళికని ఏర్పాటు చేసుకున్నాడు.

అంతకు ముందు చేసిన optic lever నిర్మాణాన్ని కొంచెం మార్చి ఒక optical pulse recorder గా మార్చుకున్నాడు. ఆకు మీద పడే కాంతి రేఖ పరావర్తనం చెంది, అద్దాల చేత దారి మళ్లించబడి ఓ కాగితం చుట్ట మీద పడుతుంది. కాగితం మీద కాంతి పడ్డ చోట సిరా బాటలు ఏర్పడేట్టుగా మరని రూపొందించాడు. ఈ సున్నితమైన యంత్రాన్ని ఉపయోగించి, ఎంతో విస్తృతమైన జీవ పదార్థాలలో ఒకే విధమైన చలనాలు ఉన్నట్టు నిరూపించాడు.

ఉదాహరణకి డెస్మోడియమ్ గైరాన్స్ అనే మొక్కలో ఆకులు పదే పదే డోలాయమానంగా కదులుతుంటాయి. ఆ మొక్కలో ఆకుల కదలికలు జెండా ఊపుతున్నట్టు ఉంటుందని దానికి టెలిగ్రాఫ్ మొక్క అని కూడా ఓ పేరు ఉంది. ఈ మొక్క మీద ఒక రకమైన విషాన్ని ప్రయోగిస్తే ఆ చలనం ఆగిపోతుందని గమనించాడు బోస్. అయితే విశేషం ఏంటంటే అదే విష ప్రయోగం జంతువులో హృదయ స్పందనని నిలిపివేస్తుంది. అలాగే జంతువులో ఏ పదార్థం అయితే ఆ విషానికి విరుగుడులా పనిచేస్తుందో, అదే పదార్థం ఈ మొక్కలో కూడా మునుపటి చలనాన్ని తిరిగి స్థాపించింది.

మిమోసా మొక్క మీద కూడా ఇలాంటి ప్రయోగాలే చేశాడు. మిమోసా రెమ్మలో కాడకి ఇరుపక్కలా సౌష్టవంగా ఆకులు అమరి ఉంటాయి. ఈ కాడకి సున్నితమైన విద్యుత్ ఘాతాన్ని (electric shock) ఇచ్చినా, లేక వేడెక్కిన కడ్డీని తాకించినా, ఆ స్థానానికి దగ్గరలో ఉన్న ఆకు ముందు ముడుచుకుంటుంది. అక్కణ్ణుంచి వరుసగా ఆకులు ముడుచుకుంటూ, చివరికి రెమ్మ కొసన ఉన్న ఆకు కూడా ముడుచుకుంటుంది. ఇది చూడడానికి ఏదో “తరంగం” రెమ్మ మూలం నుండి కొసకి ప్రసారం అవుతున్నట్టు ఉంటుంది. రెమ్మకి ఓ గాల్వనోమీటరు కనెక్ట్ చేసి నిజంగానే ఓ విద్యుత్ ప్రవాహం రెమ్మలో ఒక చివరి నుండి మరో చివరికి ప్రవహిస్తున్నట్టు నిరూపించాడు బోస్. అంటే ఓ ఎలక్ట్రిక్ మోటారులో జరిగినట్టు, మొక్కలో విద్యుత్ ప్రవాహం యాంత్రిక చలనాలని కలుగజేస్తోంది అన్నమాట.

(సశేషం...)

వైజ్ఞానిక రంగంలో “కుల వ్యవస్థ”

Posted by V Srinivasa Chakravarthy Thursday, January 7, 2010 3 comments

వైజ్ఞానిక రంగంలో “కుల వ్యవస్థ”

బోస్ ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. ఆ ప్రసంగం విని, లోహ శాస్త్రంలో నిపుణుడైన సర్ రాబర్ట్ ఆస్టెన్, బోస్ ని మెచ్చుకుంటూ, “నేను జీవితమంతా లోహాల మీద పని చేస్తూ వచ్చాను, ఇప్పుడు వాటిలోనూ ప్రాణం ఉందని వింటుంటే చాలా సంతోషంగా ఉంది,” అన్నాడు. అయితే బోస్ పరిశోధనలు నచ్చని వాళ్లు లేకపోలేదు.

సర్ జాన్ బర్డన్ సాండర్సన్ ఇంగ్లండ్ లో జీవక్రియా శాస్త్రానికి పితామహుడు అని పేరు. కండరాలలో చలనాలనే కాక, ప్రత్యేక చలనాలు గల వీనస్ ఫ్లై ట్రాప్ (Venus Flytrap) అనే మొక్కని కూడా ఇతడు పరిశోధించాడు. ఈ రంగంలో ఇతడి మాటే వేదం. మొక్కల్లో “విద్యుత్ ప్రతిస్పందన...” (electrical response) అని బోస్ వాడిన మాట ఈ సాండర్సన్ కి నచ్చలేదు. “ప్రతిస్పందన” (response) కి బదులుగా ప్రతిక్రియ (reaction) అన్న మాట వాడితే సరిపోతుందట! ప్రతిస్పందన అన్న మాట కేవలం జీవశాస్త్రవేత్తల సొత్తు అని, ఆ మాటని వాడే హక్కు భౌతిక శాస్త్రవేత్త అయిన బోస్ కి లేదని, చిత్రవిచిత్రంగా వ్యాఖ్యానించాడు సాండర్సన్. అక్కడితో ఆగక వీనస్ ఫ్లై ట్రాప్ లాంటి మొక్కల్లో విద్యుత్ సంబంధమైన ప్రతిస్పందనలు ఉండొచ్చేమోగాని, “మామూలు” మొక్కల్లో అలాంటి ప్రతిస్పందనలు ఉండే అవకాశమే లేదని, అసలు తానే స్వయంగా ఎంతో కాలం అలాంటి ప్రతిస్పందనల కోసం అన్వేషించి విఫలుడయ్యాడని, ఖండితంగా చెప్పాడు సాండర్సన్.

మరి అంత పెద్దాయన తిరస్కారంగా మాట్లాడాక రాయల్ సొసయిటీ బోస్ పరిశోధనలని విపులంగా ప్రచురించడానికి వెనకాడింది. కేవలం అధికార బలం మీద, ఏ విధమైన సాంకేతిక, వైజ్ఞానిక అభ్యంతరాలు లేకపోయినా, ఇలా తన పరిశోధనలని ఆ సొసయిటీ ఎలా నిర్లక్ష్యం చెయ్యగలదో బోస్ కి అర్థం కాలేదు. ఇండియాలో కుల వ్యవస్థ గురించి బ్రిటిష్ వారు దుమ్మెత్తిపోయడం చిన్నప్పట్నుంచి విని విసిగిపోయి ఉన్నాడు బోస్. కాని బ్రిటిష్ వైజ్ఞానిక వ్యవస్థలో అంతర్లీనంగా ఉన్న ఈ మరో రకం కుల వ్యవస్థ ని చూసిన బోస్ కళ్లు తెరుచుకున్నాయి.

రాయల్ సంస్థకి చెందిన ఒక ప్రయోగశాలలో పని చేసే లార్డ్ రాలీ, బోస్ దుస్థితి చూసి, బోస్ తో తన స్వీయానుభవం గురించి బాధపడుతూ చెప్పుకున్నాడు. భౌతిక శాస్త్రవేత్త అయిన రాలీని రసాయన శాస్త్రవేత్తలు ఇలాగే గతంలో చాలా వేధించారు. అంతవరకు ఎవరికీ తెలీని ఓ కొత్త మూలకం గాలిలో తప్పకుండా ఉంటుందని ఈ రాలీ సైద్ధాంతికంగా ఊహించాడు. ’నీకు సంబంధం లేని రంగంలో కాలు పెట్టడానికి ఎన్ని గుండెలు?” అంటూ రసాయనికులు అతడి మీద విరుచుకుపడ్డారు. ఆ తరువాత రాలీ తన స్నేహితుడు సర్ విలియమ్ రామ్సే సహాయంతో, ఆర్గాన్ అనే కొత్త మూలకాన్ని గాల్లో కనుక్కున్నంత వరకు ఆ వేధింపులు ఆగలేదు.

గతంలో బోస్ కి చదువు చెప్పిన ప్రొఫెసర్ సిడ్నీ వైన్స్, బోస్ కి జీవక్రియాశాస్త్రవేత్తలకి మధ్య ఈ వివాదం గురించి విన్నాడు. బోస్ ప్రయోగాలని స్వయంగా వచ్చి చూడడానికి అనుమతి కోరాడు వైన్స్. వృక్ష శాస్త్ర నిపుణుడైన టి.కె. హోవ్స్ ని తన తో కూడా తెచ్చుకున్నాడు. బోస్ మొక్కల్లో విద్యుత్ ప్రతిస్పందనలు చూసిన హోవ్స్ ఉత్సాహంగా “ఈ ఒక్క ప్రయోగాన్ని చూడడానికి థామస్ హక్స్లే (Thomas Huxley) తన జీవితకాలంలో సగభాగం త్యాగం చేసి ఉండేవాడ”ని మురిసిపోతూ అన్నాడు.

రాయల్ సొసయిటీ బోస్ పేపర్ ని తిరస్కరించింది కనుక, ఆ పేపర్ ని లిన్నియన్ సొసయిటీ స్వీకరించడమే కాకుండా, బోస్ ని తన ప్రయోగాలని జీవక్రియా శాస్త్రవేత్తల ముందు, ముఖ్యంగా తన ప్రత్యర్థుల ముందు ప్రదర్శించమని లిన్నియన్ సొసయిటీ ఆహ్వానించింది. (ఈ లిన్నియస్ సొసయిటీ కార్ల్ ఫాన్ లిన్నేయియస్ (Carl von Linnaeus) అనే ప్రఖ్యాత స్వీడిష్ వృక్ష శాస్త్రవేత్త గౌరవార్థం స్థాపించబడింది. వృక్ష జాతుల వర్గీకరణలో మొట్టమొదట కృషి చేసిన వారిలో ఈ లిన్నేయియస్ ముఖ్యుడు.)

అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 21, 1902 నాడు లిన్నేయియన్ సొసయిటీ ముందు ప్రదర్శన ఇచ్చాడు బోస్. ఆ ప్రదర్శన విజయవంతం అయ్యింది. ఆ విషయం గురించి చిరకాల మిత్రుడయిన ఠాగూర్ కవికి ఇలా రాసుకున్నాడు బోస్: “విజయం వరించింది! ప్రత్యర్థుల అటకాయింపులకి సిద్ధమయ్యాను కాని పదిహేను నిమిషాలలో కరతాళధ్వనులు నలుదిశలా మిన్నుముట్టాయి. ఆ ప్రసంగం పూర్తయ్యాక ప్రొఫెసర్ హోవ్స్ ఇలా అన్నాడు. నేను వరుసగా ప్రయోగాలు వర్ణిస్తూ పోతుంటే, ప్రతీ ప్రయోగం తరువాత ఆయనకి ఆ ప్రయోగంలో ఏదో దోషం కనిపించేదట. కాని ప్రతీ సందర్భంలోను ఆ తదుపరి ప్రయోగం ఆ సందేహాలని తీర్చేదట.”

యాంత్రిక, రసాయనిక తదితర ప్రేరణలకి మొక్కలన్నీ నిర్దుష్టమైన విద్యుత్ ప్రతిస్పందనలు ప్రదర్శిస్తున్నా, ఆ ప్రతిస్పందన కంటికి కనిపించే చలనాల రూపంలో ఎందుకు ఉండదు అని బోస్ కి సందేహం వచ్చింది. అయితే అలాంటి మొక్క ఒకటి ఉంది. అదే మిమోసా పుడికా (mimosa pudica). దీన్నే ’టచ్ మీ నాట్’ (నన్ను తాకకు!!!) అని కూడా అంటుంటారు. ఈ మిమోసా పుడికా మొక్కలో పల్వినర్ (pulvinar) అన్న భాగంలో ఉన్న ప్రత్యేక యంత్రాంగం కారణంగా, మామూలుగా మొక్కల్లో సూక్ష్మంగా ఉండే చలనాలు బాగా సంవర్ధనం (magnify) చెంది, ఆకులు ముడుచుకోవడం వంటి కంటికి కనిపించే భౌతిక చలనాలు కనిపిస్తాయి. అంటే మామూలు మొక్కల్లోని చలనాలని కూడా సరైన సాధన సామగ్రితో విపరీతంగా సంవర్థనం చేస్తే, మిమోసా లో కనిపించే చలనాల లాంటివే మరింత సూక్ష్మంగా ఉన్నట్టు కనిపించాలి. ఆ చలనాలని కొలవడానికి గాను ఒక కాంతి మరని (optic lever) తయారు చేశాడు. తను ఊహించినట్టుగానే, మిమోసాలో ఉండే చలనాల వంటివే మరింత సూక్ష్మంగా అన్ని మొక్కల్లోనూ ఉండడం చూడాడు బోస్.

డిసెంబర్ 1903 లో తన కొత్త ప్రయోగాల ఫలితాలని ఉత్సాహంగా రాయల్ సొసయిటీకి ప్రచురణార్థం పంపించాడు. అక్కడ ఏం రాజకీయం జరిగిందో ఏమో బోస్ పేపర్ ని ఏ సాంకేతిక సంజాయిషీ చెప్పకుండా తిప్పికొట్టారు. తన ఆవిష్కరణలు ప్రపంచానికి తెలుపడానికి రాయల్ సొసయిటీ మీద ఇక ఆధారపడకూడదని ఆనాడే నిశ్చయించుకున్నాడు బోస్...

(సశేషం...)

ఏది జీవం? ఏది అజీవం - బోస్

Posted by V Srinivasa Chakravarthy Wednesday, January 6, 2010 1 comments

ఏది జీవం? ఏది అజీవం - బోస్


ఆ విధంగా భౌతిక శాస్త్రవేత్తల నుండి ఎంతో మన్నన లభించినా, జివక్రియాశాస్త్రవేత్తల నుండి అలాంటి ఆదరాభిమానాలు దొరకలేదు. ఎందుకంటే బోస్ పరిశోధనలు కేవలం విద్యుదయస్కాంత తరంగాలకి, భౌతిక శాస్త్రానికి పరిమితమైతే బావుంటుంది. కాని తగుదునమ్మా అని ఇప్పుడు కొత్తగా జీవపదార్థం మీద ప్రేరణల ప్రభావం గురించి, జీవ, జీవరహిత పదార్థాల మధ్య సాన్నిహిత్యం గురించి మట్లాడి తనకి సంబంధం లేని రంగంలోకి అడుగుపెడుతున్నాడు! ఈ దుడుకుతనం జీవక్రియాశాస్త్రవేత్తలకి (physiologists) బొత్తిగా నచ్చలేదు. హెర్జియన్ తరంగాలని జివపదార్థం మీద ప్రసరించినప్పుడు, లోహపు ప్రతిస్పందనకి, జీవపదార్థపు ప్రతిస్పందనకి మధ్య పోలికలు కనిపించాయి. ఈ ఫలితాలన్నీ ఏకరువు పెడుతూ బోస్ జీవక్రియాశాస్త్రవేత్తల ముందు ఒక పేపరు చదివినప్పుడు హర్షధ్వానాలు కాక నిష్టూరంతో కూడిన నిశ్శబ్దమే అతడి ప్రసంగానికి ప్రతిస్పందన అయ్యింది.

ఈ కాలంలోనే బోస్ ఆలోచనలు ఓ కొత్త దిశలో పయనింసాగాయి. లోహంలోను, జంతుధాతువు లోని ఒకే విధమైన ప్రతిస్పందన కనిపించినప్పుడు ఈ రెండు ధృవాలకి మధ్యస్థంగా ఉండే వృక్ష ధాతువులో కూడా మరి అలాంటి ప్రతిస్పందనే కనిపించాలని అతడికి అనిపించింది. అయితే ఆ ప్రయోగం కొంచెం సాహసమే అనుకోవాలి ఎందుకంటే, మొక్కలలో నాడీ మండలం ఉండదు కనుక ప్రేరణలకి ప్రతిస్పందించే గుణం వాటికి ఉండదని సాంప్రదాయక అభిప్రాయం. ముందుగా తన తోటలో ఓ చెట్టు ఆకులు కోసుకొచ్చి వాటి మీద విద్యుదయస్కాంత తరంగాలు ప్రసరించి చూశాడు. మునుపటి ప్రయోగాలలో కనిపించిన ఫలితాలే మళ్లీ కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ సారి సందు చివర కూరగాయల అంగడికెళ్లి కొన్ని కారట్లు, తెల్ల ముల్లంగులు కొనుక్కు వచ్చాడు. చైతన్య రహితంగా కనిపించే ఈ దుంపల్లో కూడా చక్కని ప్రతిస్పందన కనిపించింది. మొక్కల మీద క్లోరోఫామ్ ప్రయోగించినప్పుడు జంతువుల్లో కనిపించిన ప్రభావం లాంటిదే కనిపించింది. మొక్కలకీ మత్తెక్కుతంది అన్నమాట! క్లోరోఫామ్ తో ఓ పెద్ద పైన్ చెట్టుకి “మత్తెక్కించి” దాన్ని ఉన్న చోట నుండి కూకటి వేళ్లతో పెకలించి, మరో చోట పాతిపెట్టి, అది సజీవంగా ఉండగలదని నిరూపించాడు బోస్.

రాయల్ సొసయిటీకి అధ్యక్షుడుగా ఉన్న సర్ మైకేల్ ఫోస్టర్ ఒక రోజు ఉదయాన బోస్ ప్రయోగశాలని సందర్శించాడు. బోస్ లోగడ తను తీసుకున్న కొలతల గ్రాఫులు కొన్ని చూపించాడు.

“ఓస్! ఇదేముంది బోస్! అర్థ శతాబ్దంగా మనందరికీ ఈ గ్రాఫుల గురించి తెలుసు,” అన్నాడు సర్ ఫోస్టర్.

“ఇంతకీ ఈ గ్రాఫులు ఏమని అనుకుంటున్నారు?” బోస్ నెమ్మదిగా అడిగాడు.

“ఇంకేముంది? ఇది కండరం యొక్క ప్రతిస్పందనే కదా?” కొంచెం చిరాగ్గా అడిగాడు సర్ ఫోస్టర్.

“క్షమించాలి. ఇది లోహపు తగరం యొక్క ప్రతిస్పందన,” అన్నాడు బోస్.

“ఏంటి నువ్వనేది?” నిర్ఘాంతపోయాడు సర్ ఫోస్టర్. “తగరమా? నువ్వు చెప్పేది తగరం గురించా?”

బోస్ తన ప్రయోగాల గురించి ఓపిగ్గా వివరించాడు. బోస్ ఆవిష్కరణల గురించి శుక్రవారం సాయంత్రపు ప్రసంగాల సందర్భంలో మాట్లాడమని వెంటనే ఆహ్వానించాడు. మే 10, 1901 నాడు నాలుగేళ్లుగా చేసిన ప్రయోగాలన్నిటినీ క్రోడీకరిస్తూ, వివరంగా ప్రసంగించాడు బోస్. ప్రసంగం చివర్లో విజ్ఞానానికి, తత్వ చింతనకి ముడి పెడుతూ ఇలా అన్నాడు:

“జీవరహిత, మరియు జీవసహిత పదార్థంలో ప్రేరణకి ప్రతిస్పందనల చరిత్రల యొక్క అనురచనలని ఈ సాయంకాలం మీ ముందు ప్రదర్శించాను. ఆ రెండు రచనలు ఎంత సన్నిహితంగా ఉన్నాయో చూశారా? రెండింటికీ తేడా చెప్పడం కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో భౌతిక పదార్థం ఇక్కడ అంతం అవుతుందని, జీవపదార్థం ఇక్కడ ఆరంభం అవుతుందని గిరి గీసి చెప్పడం ఎలా సాధ్యం? అలాంటి కఠోర విభజన రేఖలు అసలు లేవు.

“ఈ స్వతస్సిద్ధమైన అనురచనలకి మౌన సాక్షిగా ఉంటూ, విశ్వంలో సర్వత్ర – నీరెండలో మిలమిలలాడే ధూళి కణం లోను, భూమి మీద కిటకిటలాడే జీవసముద్రం లోను, రోదసిలో రగిలే ప్రచండ భాను హిరణ్యతేజం లోను – అన్నిటా ఆవరించి ఉన్న ఆ అద్భుతమైన ఏకత్వాన్ని పొడచూసినప్పుడు, ముప్పై శతాబ్దాల క్రితం పవిత్ర గంగా నదీ తీరంలో, ’విశ్వంలో అనంతంగా, అనవరతంగా వ్యాపించిన వైవిధ్యంలోని ఏకత్వాన్ని పొడగన్న వారికే సనాతన సత్యం సొంతం అవుతుంది – మరొకరికి కాదు, మరొకరికి కాదు,’ అని ఘోషించిన నా పూర్వీకుల మాటల్లో సారం కాస్తంత అర్థమవుతోంది.”

(సశేషం...)

విజయుడై ఇండియాకి తిరిగొచ్చిన బోస్ చెవిన ఓ శుభవార్త పడింది. ప్రెసిడెన్సీ కాలేజిలో, భౌతిక శాస్త్ర అధ్యయనంలో, పరిశోధనలో, బ్రిటిష్ “సామ్రాజ్యం యొక్క హోదాకి తగ్గ” ఓ సాటిలేని కేంద్రాన్ని స్థాపించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ, రాయల్ సొసయిటీకి అధ్యక్షుడిగా ఉన్న లార్డ్ లిస్టర్, భారత రాష్ట్ర కార్యదర్శికి ఓ ఉత్తరువు పంపించాడు. అందుకు మొదటి విడతగా 40,000 పౌన్ల నిధులు కూడా మంజూరు అయ్యాయి. అయితే బోస్ పొడ గిట్టని బెంగాల్ విద్యా విభాగ అధికారులు ఆ ప్రాజెక్టు ముందుకు సాగనీకుండా అడ్డు పడ్డారు. ఆ రోజుల్లోనే బోస్ ని సందర్శించి అభినందనలు చెప్పడానికి రవీంద్ర కవి ఒకసారి బోస్ ఇంటికి వచ్చాడు. అయితే ఆ సమయంలో బోస్ ఇంట్లో లేడు. మఖత: మెచ్చుకోలు మాటలు చెబ్దామని అనుకున్న కవి, ఆ శాస్త్రవేత్త కోసం ఓ పలువన్నెల పూల గుత్తిని విడిచి వెళ్లాడు. ఆఫీసు రాజకీయాలతో విసిగిపోయిన ఉన్న బోస్ సాయంత్రం ఇంటికి రాగానే నవ్వులు చిందించే ఆ సుమాలు కాస్తంత స్వాంతన నిచ్చాయి.

అలా నిరంతరాయంగా వేధింపులు కొనసాగుతూనే ఉన్నా బోస్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా తన పరిశోధనలు సాగిస్తూనే ఉన్నాడు. ఆ శ్రమ లోంచి 1898 లో విద్యుదయస్కాంత తరంగాల మీద ఆణిముత్యాల్లాంటి నాలుగు పేపర్లు వెలువడ్డాయి. Proceedings of the Royal Society లోను, ప్రఖ్యాత Nature పత్రికలోను అవి ప్రచురితమయ్యాయి.

ఇదిలా ఉండగా 1899 లో బోస్ ఓ విచిత్రమైన విషయాన్ని గుర్తించాడు. విద్యుదయస్కాంత తరంగాలని గ్రహించే ’కొహెరర్’ (coherer) అని తను చేసిన ఓ పరికరాన్ని నిరంతరాయంగా ఎక్కువ సేపు వాడితే దాని సునిశితత్వం (sensitivity) తగ్గడం కనిపించింది. కాని కాసేపు దానికి ’విశ్రాంతి’ నిచ్చి మళ్లీ వాడడం మొదలెడితే మునుపటి సునిశితత్వం మళ్లీ వచ్చింది. పని ఎక్కువ కావడం వల్ల కొహెరర్ లోని లోహపు పదార్థం “అలసిపోయిందా”? మనుషులకి, జంతువులకి అలసట ఉన్నట్టే లోహానికీ అలసట ఉంటుందా? బోస్ ఆలోచనలు కొత్త దారులు తొక్కడం మొదలెట్టాయి. జీవరహిత లోహాల లక్షణాలని, జీవపదార్థం యొక్క లక్షణాలని తులనాత్మకంగా అధ్యయనం చెయ్యడం ప్రారంభించాడు.

వివిధ పదార్థాలు బాహ్య ప్రేరణలకి ఎలా ప్రతిస్పందిస్తాయో పరీక్షిస్తూ వచ్చాడు బోస్. కొద్దిగా వెచ్చజేసిన మాగ్నెటిక్ ఐరన్ ఆక్సయిడ్ యొక్క ప్రతిస్పందన తీరు, కండరాల ప్రతిస్పందన తీరు ఎంతో పోలిక కలిగి ఉండడం గమనించాడు. ఒత్తిడి ఎక్కువై, ప్రతిస్పందన బలహీనం అయినప్పుడు, రెండు పదార్థాలని కొంచెం గోరువెచ్చని నీట్లో కాసేపు ముంచి తీస్తే, రెండూ తేరుకున్నాయి. నిస్సత్తువ (fatigue) పోయి మునుపటి ప్రతిస్పందన మళ్లీ కనిపించింది. తదితర లోహాలు కూడా ఈ విధంగా జీవపదార్థాన్ని పోలిన విడ్డూరమైన పోకడలు ప్రదర్శించాయి. లోహపు ఉపరితలం మీద ఆమ్లాన్ని (acid) పోసి, తరువాత దాని ఛాయలు కూడా లేకుండా బాగా రుద్దాక కూడా, ఆమ్లం పోయని ప్రదేశానికి, మునుపు ఆమ్లం పోసిన చోటికి మధ్య ప్రతిస్పందనలో తేడా కనిపించింది. ఆమ్లపు ఆనవాళ్లు కూడ లేకుండా రుద్దిగా ఇంకా దాని ఉన్కిని తెలిపే ప్రత్యేక ప్రతిస్పందన ఎందుకు కనిపిస్తోంది? ఆమ్లంతో సంపర్కం వల్ల లోహంలో మిగిలిన ఒక రకమైన స్మృతికి ఇది ఫలితం అని వివరించాడు బోస్.

ఈ ప్రయోగ ఫలితాలన్నిటినీ బోస్ 1900 లో పారిస్ లో జరిగిన International Congress of Physics అనే సమావేశంలో ప్రదర్శించాడు. ’De la généralité des phénomènes Moleculaires Produits par l'électricité sur la matière inorganique et sur la matière vivante (జీవ, జీవరహిత పదార్థాలలో విద్యుత్ ప్రభావం వల్ల పుట్టిన అణుసంబంధిత చర్యలలో సమానత ) అన్న పేరు గల ఫ్రెంచ్ పత్రంలో “ప్రకృతిలో బయటికి కనిపించే వైవిధ్యం వెనుక దాగి ఉన్న ఐక్యత” గురించి విడమర్చి చెప్పాడు. “జీవరహిత చర్యలు ఇక్కడ అంతం అవుతాయని, జీవసహిత చర్యలు ఇక్కడ ఆరంభం అవుతాయని గిరి గీసి చెప్పడం అసంభవం” అన్నాడు. అలాంటి సంచలనాత్మక సూచన విన్న కాంగ్రెస్ సభ్యులు నోళ్లు వెళ్లబెట్టారు. సమావేశం అధ్యక్షుడే “అవాక్కయ్యా” నని చెప్పుకున్నాడు.
(సశేషం...)

బోస్ - ఇండియాకి తిరిగి రాక

Posted by V Srinivasa Chakravarthy Sunday, January 3, 2010 0 comments

బోస్ - ఇండియాకి తిరిగి రాక

తన ప్రతిభా పాటవాల గురించి ఫాసెట్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ఇచ్చిన సిఫారసు పత్రాన్ని పట్టుకుని ఇండియాకి తిరిగి వచ్చిన బోస్ అప్పటికి వైస్రాయ్ గా ఉన్న లార్డ్ రిప్పన్ ని కలుసుకున్నాడు. రిప్పన్ గారి అభ్యర్థన మీదట, ప్రజా బోధనా రంగానికి అధ్యక్షుడిగా ఉన్న సర్ ఆల్ఫ్రెడ్ క్రాఫ్ట్, బోస్ ని కలకత్తాలో ప్రెసిడెన్సీ కాలేజిలో భౌతిక శాస్త్రపు ప్రొఫెసర్ గా నియమించాడు. కాలేజి ప్రిన్సిపాలు గా ఉన్న సి.హెచ్. టానీ ఆ సంగతి నచ్చక కొంచెం నిరసన చూపించినా, పై అధికార్ల ఒత్తిడికి తల ఒగ్గక తప్పలేదు.

నియామకం అయితే జరిగిపోయింది గాని, బోస్ కి కాలేజిలో జాత్యహంకార వేధింపు మొదలయ్యింది. పరిశోధనలకి అవసరమైన వసతులు అందలేదు. జీతంలో కూడా వివక్ష చూపించేవారు. ఆ రోజుల్లో ప్రొఫెసర్ హోదాలో ఉన్నవాడు భరతీయుడైతే జీతం Rs. 200 Rs. ఉండేది, యూరొపియన్ అయితే Rs. 300 ఉండేది. బయటి నుండి సిఫారసుతో వచ్చాడన్న కోపంతో బోస్ కి Rs. 100 మాత్ర్రమే అందేది. ఆత్మగౌరవాన్ని, జాతి గౌరవాన్ని దెబ్బ కొట్టే ఈ ఏర్పాటుని బోస్ సహించలేకపోయాడు. అసలు జీతమే పుచ్చుకోవడం మానేశాడు. అలా జీతం లేకుండా మూడేళ్లు పని చేశాడు. చివరికి ప్రజా బోధనా రంగానికి అధ్యక్షుడే కాక, కాలేజి ప్రిన్సిపాలు కూడా బోస్ ప్రతిభని, వ్యక్తిత్వాన్ని గుర్తించి తమ తప్పు దిద్దుకుంటూ, మూడేళ్ల జీతాన్ని ఒక్కసారిగా ఇచ్చారు. అదే ఊపులో బోస్ నియామకాన్ని ’పర్మనెంటు’ కూడా చేశారు!

ఈ కొత్తగా వచ్చిన నెలసరి జీతం తప్ప వేరే ఆదాయం లేని పరిస్థితిలో, ఇరవై ఐదు చదరపు అడుగుల గదినే ప్రయోగశాలగా చేసుకుని, ఓ చదువు రాని కంసాలికి తన వద్ద మెకానిక్ గా పనిచెయ్యడానికి శిక్షణనిచ్చి, 1894 లో తన ప్రయోగాలలో మునిగిపోయాడు బోస్. ఆ సమయంలో బోస్ ఎదుర్కుంటున్న సమస్యలని వర్ణిస్తూ, స్వామి వివేకానందుడి శిష్యురాలైన సిస్టర్ నివేదిత ఇలా అంటారు: “అర్థం లేని వేధింపులకి, కుటిల సమస్యలకి గురవుతున్న ఆ మహామేధావి పరిస్థితి చూసి అదిరిపోయాను... ఇక పరిశోధనలకి సమయం మిగలకుండా ఉండేట్టుగా అతడి కాలేజి దినచర్య వీలైనంత దుర్భరం గావించబడింది.” ఈ చికాకులన్నిటిని భరిస్తూ ఏకాగ్రచిత్తంతో పనిలో మునిగిపోయాడు బోస్.

అప్పటికి కొన్నేళ్ల క్రితమే జర్మనీలో హైన్రిక్ హెర్జ్ గాలిలో ప్రసారం కాగల రేడియో తరంగాలని (లేదా ’హెర్జియన్’ తరంగాలు) సృష్టించాడు. దాంతో ఇరవై ఏళ్ల క్రితం జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ సైద్ధాంతికంగా ప్రతిపాదించిన “ఈథర్ లో ప్రసరించే విద్యుదయస్కాంత ఆటుపోట్ల”కి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ కొత్త విద్యుదయస్కాంత తరంగాలు కూడా కాంతి లాంటివేనని, (అసలు కాంతి కూడా ఒక విద్యుదయస్కాంత తరంగమేనని), కాంతికి మల్లె వీటికి కూడా పరావర్తనం (reflection), వక్రీభవనం (refraction), ధృవీకరణం (polarisation) మొదలైన లక్షణాలు ఉంటాయని నిరూపించబడింది. హెర్జ్ పయనించిన దిశలో ఇంకా ముందుకి సాగిపోవాలని అనుకున్నాడు బోస్.

అదే సమయంలో బొలోనాలో మార్కోనీ తంతిరహితంగా విద్యుదయస్కాంత తరంగాలని ప్రసారం చెయ్యడానికి తిప్పలు పడుతున్నాడు. ఆ పోటీలో మరి నలుగురు ఉన్నారు – ఇంగ్లండ్ కి చెందిన లాడ్జ్, అమెరికాకి చెందిన ముయిర్హెడ్, రష్యాకి చెందిన పోపోవ్, భారతీయుడు బోస్. విజయం బోస్ ని వరించింది.

1895 లో ఓ బహిరంగ ప్రదర్శనలో, కలకత్తా టౌన్ హాల్ లో, అప్పటి బెంగాల్ గవర్నర్ సర్ అలెగ్జాండర్ మకెన్జీ అధ్యక్షత వహించిన సమావేశంలో, బోస్ ఉన్న చోటి నుండి విద్యుదయస్కాంత సంకేతాన్ని పంపించి మూడు గోడల కవతల, 25 అడుగుల దూరంలో ఉన్న తుపానికి పేల్చగలిగాదు. ప్రపంచంలో ’రిమోట్ కంట్రోల్’ యొక్క మొట్టమొదటి ప్రదర్శన అదేనేమో.

బోస్ ఆ విష్కరణలు బ్రిటిష్ రాయల్ సొసయిటీ దృష్టిని ఆకట్టుకున్నాయి. లార్డ్ రాలీ సిఫారసు మీద ఆ సొసైటీ బోస్ ని తమ సొసైటీ ప్రచురణలో “విద్యుత్ కిరణాల తరంగదైర్ఘ్య మూల్యాంకనం” అన్న పేరుతో ఓ పత్రాన్ని ప్రచురించమని ఆహ్వానించింది. ప్రచురణకయ్యే వ్యయంలో సబ్సిడీ కూడా ఇచ్చింది. ఇది జరిగిన కొంత కాలానికి లండన్ యూనివర్సిటీ బోస్ కి డాక్టరేట్ నిచ్చి గౌరవించింది.

బోస్ కృషిని ఆధారంగా చేసుకుని లైట్ హౌస్ లలో కాంతికి బదులు విద్యుదయస్కాంత తరంగాలని వాడొచ్చని ’ఎలక్ట్రీషియన్’ అనే పత్రిక సూచించింది. ఈ కొత్త సాధనం నావికుల పాలిటి “త్రినేత్రం” అవుతుంది అందా పత్రిక.

ఇంగ్లండ్ లో, లివర్ పూల్ నగరంలో British Association for Advancement of Science సమావేశంలో బోస్ తన విద్యుదయస్కాంత పరికరాల గురించి ప్రసంగించాడు. ఆ ప్రసంగం విని మురిసిపోయిన లార్డ్ కెల్విన్, స్త్రీల విభాగంలో కూర్చున్న అందాల రాశి అయిన శ్రీమతి అబలా బోస్ వద్దకి నెమ్మదిగా కుంటుకుంటూ వెళ్లి ఆమెకి అభినందనలు చెప్తూ, ఆమె భర్త సాధించిన విజయాలు సామాన్యమైనవి కావని మెచ్చుకున్నాడు. ఆ తరువాత జనవరి 1897 లో Royal Institution లో మాట్లాడాడు బోస్. వైజ్ఞానిక రంగంలో అసామాన్యమైన, సరికొత్త ఆవిష్కరణలు ఆ సదస్సులో ప్రస్తావించడం జరుగుతుంటుంది. ఆ సదస్సులో బోస్ ప్రసంగం గురించి ’టైమ్స్’ పత్రిక ఇలా రాసింది: “ఒక పక్క ఉక్కిరిబిక్కిరి చేసే కాలేజి బాధ్యతలని నిర్వహిస్తూ, ఈ దేశపు ప్రమాణాల బట్టి చాలీచాలని వసతులతో, పరికరాలతో బోస్ సాధించిన విజయాలు, ఆయన ఆవిష్కరణల ప్రతిభని మరింతగా ఇనుమడింపజేస్తున్నాయి.”

ఆ విధంగా విద్యుదయస్కాంత తరంగ రంగంలో తను సాధించిన విజయాలకు యూరొపియన్ నిపుణుల గౌరవాదరాలు పొందిన బోస్ విజేయుడై ఇండియాకి తిరిగి వచ్చాడు.
(సశేషం...)

బోస్ – బాల్యం

Posted by V Srinivasa Chakravarthy Friday, January 1, 2010 0 comments

బోస్ – బాల్యం
1858లో నవంబర్ 30 నాడు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న మైమెన్సింగ్ లో జన్మించాడు బోస్.
బోస్ తండ్రి గొప్ప దేశభక్తుడు. నవతరం మీద బ్రిటిష్ విద్యావ్యవస్థ యొక్క హానికరమైన ప్రభావాన్ని బాగా గుర్తించినవాడు. పాశ్చాత్య విషయాలని నిర్విమర్శగా స్వీకరించే బానిస ప్రవృత్తి, పాఠ్యాంశాలని గుడ్డిగా కంఠస్థం చేసే పద్ధతి – ఇవీ బ్రిటిష్ విద్యా వ్యవస్థ మనకు మిగిల్చిన వారసత్వం. కనుక బోస్ తండ్రి బ్రిటిష్ వారు నడిపించే బడికి కాకుండా, సాంప్రదాయబద్ధమైన ఓ పాఠశాలకి జగదీశ్ చంద్రుణ్ణి పంపించాడు.

నాలుగేళ్ళ బోస్ రోజూ పాఠశాలకి వెళ్లే తీరు చిత్రం గా ఉండేది. ఓ పెద్ద గజదొంగ తన వాహనం. అతగాడి భుజాల మీద స్వారీ చేస్తూ ఠీవిగా బడికి వెళ్లేవాడు బోస్. ఈ గజదొంగ చాలా కాలం జైల్లో ఉండి బయటికి వచ్చినవాడు. ఎవరూ ఉద్యోగం ఇవ్వకపోతే జగదీశ్ చంద్రుడి తండ్రి దయదలిచి తన వద్ద పనికి పెట్టుకున్నాడు. ఆయన ఉదారగుణానికి హృదయపరివర్తన కలిగిన ఆ దొంగ నమ్మకంగా ఆయన వద్ద పనిచెయ్యసాగాడు. జగదీశ్ చంద్రుణ్ణి రోజూ తన భుజాల మీద బడికి మోసుకుపోతూ దార్లో తన గతానికి చెందిన చిత్రవిచిత్ర సాహసగాధలు చెప్తుండేవాడు. సమాజం దుర్మార్గుడని ముద్రవేసిన ఆ మనిషిలో ఎంత మంచితనం, మానవత్వం దాగి ఉన్నాయో పసివాడైన బోస్ గుర్తించాడు. ఆ విషయం గురించే తరువాత ఇలా రాసుకున్నాడు: “చట్టవ్యతిరేక లోకానికి రారాజైన ఆ మనిషికి ఉన్నంత మెత్తని హృదయం ఏ ఆయాకీ ఉండదేమో. చట్టం యొక్క, సమాజం యొక్క కృత్రిమమైన కట్టుబాట్లని ఒక పక్క వెక్కిరిస్తూనే ఉన్నా, వ్యక్తిగత జీవితంలో చాలా ఉన్నతమైన నైతిక ప్రమాణాలని కలిగి ఉండేవాడు.”
అలాగే కూలి నాలి చేసుకునే వారితో, పామర వర్గంతో, రైతులతో తన సావాసం ప్రకృతి గురించి ఎన్నో పాఠాలు నేర్పింది అంటాడు. ఆ విషయమే చాలా కాలం తరువాత ఓ వైజ్ఞానిక సమావేశంలో చెప్పుకున్నాడు: “నాగలి చేతబట్టి మట్టిలో పచ్చని సంపత్తిని వెలయింపజేసే కర్షకుల నుండి, మహానదులలో, నిశ్చల తటాకాలలో కనిపించే విచిత్ర జలజీవాల గురించి కథకథలుగా చెప్పే జాలరిబాలుర నుండి, నేను నా ప్రప్రథమ ప్రకృతి పాఠాలు నేర్చుకున్నాను. ప్రకృతి అంటే ప్రేమ నాకు వాళ్లు నేర్పినదే.”

సెయింట్ జేవియర్ కాలేజిలో చదువు పూర్తి చేశాడు బోస్. గణిత, భౌతిక శాస్త్రాలలో అక్కడ బోస్ కనబరచిన ప్రతిభ అక్కడ ఫాదర్ లాఫాంట్ అనే ఓ టీచరు దృష్టిని ఆకట్టుకుంది. సివిల్ సర్విసెస్ చదవడానికి ఇంగ్లండ్ వెళ్లమని ఆయన బోస్ ని ప్రోత్సహించాడు. అధికార వర్గంలో ఉండేవారిలో మానవత్వం క్రమంగా ఎలా అణగారిపోతుందో స్వయంగా చూసిన బోస్ తండ్రి, బాహ్యసామ్రాజ్యాన్ని ఏలే పాలకుడిగా కాక, ఆత్మసామ్రాజ్యాన్ని ఏలుకునే పండితుడిగా ఎదగమని కొడుక్కి సలహా ఇచ్చాడు.

మొదట లండన్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చేద్దాం అని వెళ్లాడు. కాని ఆ శవపరిచ్ఛేదాలు, ఆ కంపు అతడికి పడలేదు. ఆరోగ్యం దెబ్బ తిని మధ్యలో చదువు నిలిపేయాల్సి వచ్చింది.

తరువాత కేంబ్రిడ్జ్ లో క్రైస్ట్ కాలేజిలో ప్రకృతి శాస్త్ర అధ్యయనాలలో చేరాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ప్రకృతి శాస్త్రంలో ట్రైపోస్ పట్టం కూడా పుచ్చుకున్నాడు. తరువాత లండన్ విశ్వవిద్యాలయం లో బి.యస్.సి. లో చేరాడు. అక్కడ బోస్ భౌతిక, రసాయన, వృక్షశాస్త్రాలు నేర్చుకున్నాడు. ఆయారంగాల్లో మహామహులు అక్కడ బోధకులుగా వచ్చేవారు. గాలిలో ఆర్గాన్ ఉందని కనుక్కున్న లార్డ్ రాలీ, పరిణామ సిద్ధాంతకారుడు చార్లెస్ డార్విన్ కొడుకైన ఫ్రాన్సిస్ డార్విన్ తదితరులు అక్కడ పాఠాలు చెప్పేవారు. 1884 లో లండన్ విశ్వవిద్యాలయం నుండి బాచెలర్స్ డిగ్రీ అందుకున్నాడు.

ఇంగ్లండ్ లో చదువు పూర్తి చేసుకుని 1885 లో ఇండియాకి తిరిగి వచ్చాడు బోస్.

(సశేషం...)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email