శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.
సృజనత్మకమైన స్వేచ్ఛ + క్రమబద్ధీకరణ = చదువుకి మరింత మెరుగైన ఫార్ములా

బ్లాగర్లకి గణతంత్ర దిన శుభాకాంక్షలు!
ఈ రెండవ ఉదాహరణ కూడా జాన్ హోల్ట్ రాసిన ’How children learn?’ అన్న పుస్తకం నుండి తీసుకున్నదే.
ఇందులో హోల్ట్ తన మిత్రులు కొందరు పిల్లలతో చేసిన కొన్ని ప్రయోగాల గురించి ఒక చోట ఇలా వర్ణిస్తాడు.

కొత్త కొత్త పద్ధతుల్లో ఆసక్తికరంగా పిల్లలకి చదువు చెప్పడంలో చిరకాల అనుభవం ఉన్న Bill Hull తదితరులు బాగా చిన్న పిల్లలకి రంగులు, పరిమాణాలు, ఆకృతులు మొదలైన భావనలు నేర్పడానికి పనికొచ్చేట్టుగా ’Attribute blocks’ లేదా ’A blocks’ అనే విద్యాసంబంధమైన సామగ్రి రూపొందించారు. ఆ సామగ్రిని పిల్లలకి పరిచయం చేసే రోజు వచ్చింది. ఎంతో కష్టపడి వాళ్ల అనుభవం, తెలివితేటలు అన్నీ రంగరించి చేసిన ఆ సరంజామాకి పిల్లలు ఎలా స్పందిస్తారో చూద్దామని ఆ విద్యావేత్తలు ఉత్కంఠగా ఉంది.

పిల్లలు రాగానే ఒక్కొక్కర్ని పిలిచి ఆ సామగ్రిని ఎలా వాడాలో, వాటితో రకరకాల ఆటలు, పజిల్స్ అన్నీ ఎలా చెయ్యాలో, వివరించారు. కాని వాళ్లు ఆశించినట్టుగా పిల్లలు వాటి మీద ఎగబడి ఆడలేదు. కొంచెం బలవంతం చేస్తే ఏదో విధిలేక ఆడారు గాని అందులో వాళ్లకి ఉత్సాహం ఉన్నట్టు కనిపించలేదు.

ఇలా లాభంలేదని ఆ గురువులు వాళ్ల పద్ధతిని మార్చుకున్నారు. (అదే మన గురువులైతే ఆ పిల్లల తలలు వాచేలా తిట్టి, అవసరమైతే రెండు పీకి ’ఆడించే’ వారేమో!) ఈ సారి పిల్లలు వచ్చినప్పుడు పూనుకుని వాళ్లకి ఆ బ్లాక్స్ ఎలా వాడాలో కూర్చోబెట్టి ’బోధించ’లేదు. పిల్లల్ని వాళ్లకి ఇష్టం వచ్చినట్టు వాటితో ఆడనిచ్చారు. అసలు నియమాలని పక్కన బెట్టి పిల్లలు ఆ బ్లాక్స్ తో వాళ్లే ఏవో కొత్త నియమాలు తయారుచేసుకుని కొత్త కొత్త రీతుల్లో ఆడుకోసాగారు. (వీళ్లంతా ఐదేళ్లు నిండని పసివాళ్లు!) వారి ఊహాలోకమంతా ఆ ఆటలోకి ప్రవేశించింది. ఒక వస్తువుని నాన్న అన్నారు, మరో వస్తువు అమ్మ అయ్యింది. అలాగే కుక్క, పిల్లి, కార్లు, కుటీరాలు... వాటితో రకరకాల నిర్మాణాలు చేసుకున్నారు. ఈ “ఆట” చాలా సేపు సాగింది.

మామూలుగా పెద్ద వాళ్లు ఈ వ్యవహారాన్ని చూస్తే ఈ ’అర్థం పర్థం లేని ఆట” ని ఆపి వాటిని సక్రమంగా ఎలా వాడాలో నేర్చుకోమని నిర్బంధం చేస్తారు. కాని బిల్ హల్ మొదలైన వాళ్లు పిల్లలు ఆడుతున్న ఈ కొత్త ఆటలో జోక్యం చేసుకోకుండా అలా వారిని ఆడినంత సేపు ఆడనిచ్చారు. పిల్లలని చాలా సేపు అలా వాళ్లకి నచ్చిన తీరులో ఆ బ్లాక్స్ తో ఆడనిచ్చాక, అప్పుడు మెల్లగా టీచర్లు రంగప్రవేశం చేసి, వాటితో మరింత సంక్లిష్టమైన, ఆసక్తికరమైన ఆటలు ఎలా ఆడాలో నేర్పించారు. ఈ సారి పిల్లలు ఉత్సాహంగా టీచర్లు చెప్పింది నేర్చుకోడానికి సిద్ధమయ్యారు. ఆ తరువాత ఆ బ్లాక్స్ ల వినియోగంలో వేగంగా పురోగమించారు.


ఇలా ఎన్నో ప్రయోగాలలో పిల్లల ప్రవర్తన చూసి విద్యావేత్తలు ఒక అవగాహనకి వచ్చారు:

పిల్లలు నేర్చుకునే క్రమంలో రెండు దశలు ఉంటాయి/ఉండాలి.

1. మొదటి దశలో పిల్లలు ప్రత్యేక ప్రణాళిక లేకుండా, మితిమీరిన నియమావళి లేకుండా, ఒక రంగానికి సంబంధించిన పరిసరాలలో స్వేచ్ఛగా వ్యవహరిస్తారు, పని చేసుకుంటారు, ఆడుకుంటారు. ఇలా స్వేచ్ఛగా వ్యవహరించడం వల్ల ఆ రంగంతో, ఆ రంగానికి సంబంధించిన సాధన సామగ్రితో పరిచయం ఏర్పడుతుంది, అవి అలవాటు అవుతాయి. వాటి పట్ల భయం పోతుంది. అన్నిటి కన్నా ముఖ్యంగా వాళ్లకి తోచుకున్నటు ఆడుకుంటారు కనుక, వారికి అందులో ఒక సహజమైన ఉత్సాహం ఉంటుంది.

2. రెండవ దశలో పెద్దలు/టీచర్లు రంగప్రవేశం చేసి మరింత క్రమబద్ధమైన బోధనని, శిక్షణని ప్రవేశపెట్టవచ్చు.

మన విద్యావిధానంలో పైన చెప్పబడ్డ ఒకటవ దశ ఇంచుమించు ఉండదనే చెప్పాలి. ఎప్పుడూ టైం టేబుల్ ప్రకారం పరిగెడుతున్న రైళ్లలా, ఎక్కడికి పోతున్నారో, ఎందుకు పోతున్నారో తెలీకుండా, తరగతి నుండి తరగతికి, సెమిస్టర్ నుండి సెమిస్టర్ కి, కాలేజి నుండి కాలేజికి, దేశం నుండి దేశానికి పరిగెడుతుంటారు. నచ్చిన చోట కొంచెం ఆగి, ఆ శాస్త్రంలోని సొగసుని ఆనందిద్దాం అంటే తీరిక ఉండదు. నచ్చని చోట ఆగకుండా సాగిపోదాం అంటే స్వేచ్ఛ ఉండదు. అందుకే మనసుకి పోషణ నివ్వాల్సిన చదువు తలనొప్పిగా దాపురిస్తుంది.

పిల్లలకి అందుబాటులో తగ్గ సాధన సామగ్రిని ఉంచి, వసతులు ఇచ్చి, అడిగినప్పుడు (కేవలం అడిగినప్పుడు మాత్రమే!!!) సరైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చి, తగినంత సమయాన్ని, బోలెడంత స్వేచ్చని ఇచ్చి, ముఖ్యంగా పొరబాట్లు చేసి నేర్చుకునే అవకాశాన్ని ఇస్తే ఎంత బ్రహ్మాండంగా పురోగమిస్తారో మరో చిన్న ఉదాహరణ:

ఇంజినీరింగ్ విద్యార్థుల్లో సృజనాత్మకత వ్యక్తం కావడానికి తగిన వసతి ఉండాలని మా సంస్థలో ఇటీవల Center for Innovation (CFI) అనే ఓ కేంద్రాన్ని ఆరంభించారు (http://cfi.iitm.ac.in/cfi/home). మా ఆలమ్నై ఇచ్చిన విరాళాల సహాయంతో ఈ కేంద్రాన్ని స్థాపించారు. ఇక్కడ క్లాసులు ఉండవు, గురువులు ఉండరు. అంతా విద్యార్థులే చూసుకుంటారు. వాళ్లే ప్రాజెక్ట్ లు ప్రతిపాదించుకుంటారు. ప్రాజెక్ట్ ఏ మాత్రం సమంజసంగా ఉన్నా దాన్ని ఆమోదించి ధనం మంజూరు చేస్తారు. ఈ వ్యవహారంలో ఫాకల్టీ పాత్ర పరిమితంగా ఉంటుంది. విద్యార్థులకి తమ ప్రయత్నంలో ఎక్కడైనా ఎవరైనా ప్రత్యేక నిపుణుడు సహాయం కావాలంటే, ఆ మనిషి దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతారు. అంతేగాని పిల్లల మీద అజమాయషీ చెయ్యడానికి ఎవరూ ఉండరు. అలాగే ఇక్కడ పిల్లలు చేసే పనులకి గ్రేడ్ లు, మార్కులు కూడ ఉండవు. మాములుగా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చెయ్యడానికి ముక్కి మూలిగే పిల్లలు ఇక్కడ రాత్రనక పగలనక కష్టపడడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మరి అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఊరికే ఆడుకుంటూ, డబ్బు వృధా చేస్తారని భయపడేవాళ్లు పొరబడ్డట్టే. ఇక్కడ పిల్లల కార్యక్రమాల్లో చక్కని సృజనాత్మక, అంకిత భావం కనిపిస్తుంది. రెక్కలు అల్లారుస్తూ ఎగిరే విమానాలు, GPS సహాయంతో ఎగిరే నమూనా విమానాలు, విమానము+హెలికాప్టర్ కలగలిపిన హైబ్రిడ్ విమానాలు, నేల మీద నీట్లోను ప్రయాణించే ఉభయచర వాహనాలు, దాననదే బాలన్స్ చేసుకునే సైకిలు... ప్రతీ సృష్టి లోనూ ఏదో కొత్తదనం. వట్టి కొత్తదనం మాత్రమే కాదు, వాళ్ల కార్యక్రమాల్లో (ఎంతోమంది పెద్దలలో కూడా కనిపించని) సామాజిక స్పృహ కనిపిస్తుంది. వీళ్ల సృజన ఎన్నో స్థానిక పరిశ్రమలని కూడా ఆకర్షిస్తోంది.

కనుక ఒక పక్క సృజనాత్మకమైన స్వేచ్ఛ, మరొక పక్క క్రమబద్ధీకరణ – ఈ రెండిట్నీరంగరిస్తూ విద్యాప్రణాళికలని రూపొందించాలి. యూ.జీ., పీ.జీ. స్థాయిలోనే కాక, కే.జీ. నుండి కూడా ఈ ఫార్ములా వాడడం ఆరంభించాలి. ఇలాంటి పద్ధతిలో ఎన్నో సాధకబాధకాలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి, పరిస్థితులని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకి సాగాలి.

స్వేచ్ఛని ప్రవేశపెడితే విద్యాజీవనం గందరగోళం అవ్వొచ్చని కొందరు అభ్యంతరపెట్టొచ్చు. స్వేచ్ఛ విలువ తెలిసిన వాళ్లు, స్వేచ్ఛని గౌరవించేవాళ్లు అలాంటి భయాలని అధిగమించగలరు.

మన విద్యావ్యవస్థల్లో మరో వెలితి:
“జ్ఞానం అన్న పదం పట్ల మన అవగాహనలో ఒక మౌలిక దోషం ఉంది”
దీని గురించి వచ్చే పోస్ట్ లో...

4 comments

 1. Nice post.

   
 2. భావన Says:
 3. మంచి పోస్ట్. నిజమే సృజనాత్మకమైన స్వేచ్ఛ, మరొక పక్క క్రమబద్ధీకరణ దీనికి నా వోట్ కూడా... మా అబ్బాయి TYE (The Young Entrepreneurs) క్లబ్ లో బలే ప్లాన్ లు వేస్తారు. ఈ సవత్సరపు వుత్తమ బిజినెస్స్ కోసం వాళ్ళ బేచ్ skype on 3G with all other amenities అనే ప్లాన్ ఇంకా shopping carts with self check out on each with database and search facilities అనే దాని మీద చేస్తున్నారు. ఎంత కష్ట పడతారో దానికోసం. ఇంతా చేసి 15 ఏళ్ళు 16 ఏళ్ళ వాళ్ళు అందరు. స్వేచ్చ అంత వుత్సాహాన్ని ఇస్తుందనుకుంటా. మీ బ్లాగ్ చాలా బాగుంది.

   
 4. budugoy Says:
 5. nice post.
  @భావన గారు: మీ పుత్రోత్సాహంలో పాపం వాళ్ళ ఐడియాలని ఇలా ఇంటర్‌నెట్లో షేర్ చేసుకోవడం తప్పు కదా. ఎంటర్ప్రెన్యూర్స్ కి ఐడియాలే కీలకం.

   
 6. Anonymous Says:
 7. "నచ్చిన చోట కొంచెం ఆగి, ఆ శాస్త్రంలోని సొగసుని ఆనందిద్దాం అంటే తీరిక ఉండదు. నచ్చని చోట ఆగకుండా సాగిపోదాం అంటే స్వేచ్ఛ ఉండదు".

  చాలా బాగుందండీ!.

   

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email