1927 లో బోస్ యూరప్ ని మరో సారి సందర్శించాడు. ఆ ఏడాది “Plant autographs and their revelations” అన్న రచన వెలువడింది. ఫ్రెంచ్ రచయిత రొమెయిన్ రోలాండ్ తన నవల ’జాన్ క్రిస్టోఫ్’ యొక్క సంతకం చేసిన ప్రతిని బోస్ కి అంకితం చేస్తూ, అందులో అంకిత ముద్రగా “నవ్య ప్రపంచపు ప్రకటనకర్తకు” అని రాశాడు. తరువాత పక్షుల భాషల మీద ఎంతో పరిశోధించిన యూరొపియన్ శాస్త్రవేత్త సీగ్ఫ్రెడ్ తో బోస్ ని పోల్చుతూ రోలాండ్ ఇలా అన్నాడు: “ప్రకృతిని అన్వయించడానికి బయలుదేరిన ఆ యూరొపియన్ శాస్త్రవేత్త మానసం లోంచి క్రమంగా సౌందర్య దృష్ణి అణగారిపోయింది. డార్విన్ కూడా అలాగే జీవశాస్త్రంలో తను చేసిన పరిశోధనల వల్ల తనలో కవితారసాస్వాదనా శాక్తి బాగా అడుగంటిపోయిందని వాపోయాడు. బోస్ విషయం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది.”
1928 లో బోస్ రాసిన చివరి పుస్తకం అయిన “Motor mechanisms of Plants” వెలువడింది. ఇటీవలి కాలంలో అత్యుత్తమ వృక్షశాస్త్రవేత్తలలో ఒకరిగా పేరు పొందిన, వియన్నాకి చెందిన, ప్రొఫెసర్ హన్స్ మోలిష్, ఆస్ట్రియా రాజధాని నగరంలో బోస్ ప్రసంగాన్ని విన్నాక, ఎలాగైనా ఇండియాకి వెళ్లి ఆ బెంగాలీ శాస్త్రవేత్తతో పని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అలాగే ఇండియాలో కొంత కాలం గడిపి తిరిగి యూరప్ కి వచ్చాక ప్రఖ్యాత నేచర్ పత్రికకి ఇలా రాశాడాయన: “వాయు స్థితిలో ఉన్న ఆహారాన్ని మొక్కలు జీర్ణించుకుంటుండగా ఆ ప్రక్రియని లిఖిత రూపంలో చూశాను. మొక్కల్లో విద్యుత్ సంబంధమైన్ ఉత్తేజం నిలువెల్లా వ్యపిస్తుంటే దాన్ని రెసొనంట్ రికార్డర్ నమోదు చెయ్యగా చూశాను. అసలివన్నీ పురాణకథల కన్నా నమ్మశక్యం కానంత అద్భుతంగా ఉన్నాయి.”
ఒక యాంత్రికమైన, పార్థివమైన, జడమైన విశ్వదర్శనపు సమ్మోహనంలో వైజ్ఞానిక సమాజం మొత్తం జోగుతున్న దశలో, అతిశయ ప్రత్యేకీకరణ అనే జాఢ్యం వల్ల శాస్త్ర నిపుణులు ఎవరికి వారు చిన్న చిన్న శాస్త్ర విభాగపు కలుగులలో బందీలుగా ఉన్న పరిస్థితిలో, ఓ మహత్తర జీవన స్పందనతో సమస్త ప్రకృతీ పరవశిస్తోందని, ప్రకృతిలో ప్రతీ అంశం మనకెన్నో కథలు చెప్పాలని తపిస్తోందని, వాటి భాషని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యడంలో మనదే ఆలస్యం అని బోస్ కృషి మనకి గుర్తుచేస్తోంది.
ప్రచండ హిరణ్మయ రేతస్సుతో, ఏడు వన్నెల తేరు నెక్కి, చీకటి శక్తుల మీద తన దైనిక జైత్రయాత్ర మీద బయల్దేరిన మార్తాండుడి వైభవాన్ని ప్రకటిస్తూ, చూరు మీద కాంస్య, రజత, సువర్ణ లోహాల మిశ్రమంతో చేసిన పోత చిత్రం మెరిసిపోతూ ఉంటే, తన సంస్థలో ఒక రోజు ప్రసంగిస్తూ, బోస్ తన వైజ్ఞానిక చింతనలోని సారాన్ని ఇలా వర్ణించాడు:
“పదార్థం మీద శక్తుల ప్రభావాన్ని శోధించే ప్రయత్నంలో సజీవ, జీవరహిత పదార్థాల మధ్య సరిహద్దులు చెరిగిపోవడం, వాటి మధ్య కొత్త సంబంధాలు పుట్టుకురావడం గమనించాను. కాంతులు చిందే సముద్రపు నడిమధ్యలో మనం గుడ్డి వాళ్లలా నిలిచి వున్నామని నా కృషి నాకు నేర్పిన మొదటి పాఠం. ఎలాగైతే భౌతిక కాంతి గురించిన శోధనలో దృశ్య కాంతి సీమ నుంచి మనం అదృశ్య కాంతి లోకంలోకి ప్రవేశిస్తామో, అలాగే సజీవ ప్రపంచంలో, వ్యక్తం నుండి అవ్యక్తంలోకి ప్రవేస్తున్నప్పుడు, జీవన్మరణ సమస్య యొక్క పరిష్కారానికి మరింత సన్నిహితంగా వస్తాము.
“మన జీవనానికి, వృక్ష లోకపు జీవనానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఇది కేవలం నిరాధారిత చర్చలకి సంబంధించిన విషయం కాదు. నిర్వివాదమైన ప్రయోగాత్మక విధానాలతో ఈ విషయాన్ని వాస్తవంలో ప్రస్ఫుటం చెయ్యాలి. అలా చెయ్యాలంటే సత్యదూరమైన, వాస్తవానికి వ్యతిరేకమైన మన పూర్వభావనలని ముందు త్యజించాలి. చివరి మాట మొక్కదే కావాలి. మొక్క యొక్క ఆమోదముద్ర లేనిదే ఎలాంటి ఆధారాలనైనా, భావనలనైనా తిరస్కరించే తెగువ ఉండాలి.”
(బోస్ మీద వ్యాస శీర్షిక సమాప్తం)
Reference:
Peter Tompkins and Christopher Bird, The Secret Life of Plants, Rupa and Co.
Great work with Bose.
Have you read "The man who knew infinity". Its a very well written/researched bio of ramanujan.
"చివరి మాట మొక్కదే కావాలి. మొక్క యొక్క ఆమోదముద్ర లేనిదే ఎలాంటి ఆధారాలనైనా, భావనలనైనా తిరస్కరించే తెగువ ఉండాలి.”
ఎంత గొప్ప వాక్యాన్ని చదివానీరోజు. ఎంత గొప్ప మహత్తర సత్యాన్ని ఆస్వాదించానీరోజు. మీకు మనఃపూర్వక అభినందనలు.
రాజు.
చందమామ
అసలివన్నీ పురాణకథల కన్నా నమ్మశక్యం కానంత అద్భుతంగా ఉన్నాయి...పదహారణాల నిజం....
అసలు రచయిత ఎలా వ్రాశారో తెలియదు గాని,మీకైతే నూటికి నూరు.
Budugu garu: Man who knew infinity చదివాను. అందులోని సమాచారం ఆధారంగా ఈ మధ్యన 'శ్రీనివాస రామానుజన్' జీవితం మీద చిన్న పుస్తకం రాశాను. దాన్ని Peacock publishers, Hyd వాళ్లు ప్రచురించారు.