శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.





రాకెట్ నిర్మాణంలో దశలు ఉంటాయని, అలా పలు దశలు ఉండే సంకీర్ణ రాకెట్ లు అధిక వేగాన్ని సాధించగలుగుతాయని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు రాకెట్ గమనం మీదకి ధ్యాస మళ్లిద్దాం.  ఓ సంకీర్ణ రాకెట్ నేల నుండి బయల్దేరి, నింగికి ఎగసి, కక్ష్య లోకి ప్రవేశించేటంత వరకు గల మధ్యంతర దశలు ఏంటి? ఈ వివరాలు పరిశీలిద్దాం.

లాంచ్ పాడ్ కి కక్ష్యకి మధ్య జరిగే వ్యవహారంలో ఎన్నో మధ్యంతర దశలు ఉంటాయి. అవి 

-      లాంచ్ కి పూర్వ దశ (pre-launch stage)
-      లిఫ్ట్ ఆఫ్ (lift off)
-      నిలువు గమనం (vertical rise)
-      వాలు గమనం (pitchover)
-      ఆరోహణం (ascent)
-      మొదటి దశ అంతరించడం (first stage)
-      మరింత ఆరోహణం (ascent)
-      రెండవ దశ అంతరించడం (second stage)
-      మరింత ఆరోహణం (ascent)
-      మూడవ దశ అంతరించడం (third stage)

రాకెట్ ని లాంచ్ సైట్ (launch site)  కి తరలించడంతో ‘లాంచ్ కి పూర్వ దశ’ మొదలవుతుంది. ఈ తరలింపు లాంచి కి సుమారు రెండు వారాల ముందు జరుగుతుంది. రాకెట్ బయల్దేరేటప్పుడు జరిగే కౌంట్ డౌన్ (countdown)  తో ఈ దశ ముగుస్తుంది.
 లాంచ్ కి సిద్ధం అవుతున్న మన PSLV


మొదటి దశ యొక్క శక్తితో రాకెట్ భూమి ఉపరితలం నుండి పైకి లేస్తుంది. లాంచ్ టవర్ కి తగలకుండా రాకెట్ నిటారుగా పైకి కదులుతుంది. రాకెట్ కి లాంచ్ టవర్ ని దాటడానికి కొన్ని సెకనులు పడుతుంది. 

లాంచ్ టవర్ ని దాటి పైకి లేస్తున్న PSLV
 


లాంచ్ టవర్ ని దాటగానే exhaust nozzle లు కొంచెం పక్కకి తిరుగుతాయి. ఆ కారణంగా నిటారుగా కదిలే రాకెట్ కొద్దిగా వాలుతుంది. ఇలా పూర్తిగా నిటారుగా కాకుండా కాస్త వాలు దిశలో ప్రయాణించడానికి ఒక కారణం వుంది.

అంతరిక్షం కేసి ఎగయబోతున్న రాకెట్ గమనానికి అడ్డుపడే బలాలు రెండు ఉన్నాయి. ఒకటి భూమి గురుత్వం. రెండవది వాయుమండలంలోని గాలి వల్ల రాకెట్ మీద కలిగే ఈడ్పు (drag). గాలి వల్ల కలిగే ఈడ్పుని తగ్గించుకోవాలంటే రాకెట్ వీలైనంత త్వరగా వాయుమండలాన్ని దాటుకుని అంతరిక్షంలోకి ప్రవేశించాలి. అంటే వీలైనంత నిటారుగా ఎగుర్తూ వాయుమండలాన్ని త్వరగా  దాటాలి. కాని  రాకెట్ యొక్క లక్ష్యం భూమి చుట్టూ కక్ష్యలోకి ప్రవేశించడం అయితే నేలకి సమాంతరంగా ఎగరాలి. కనుక క్రమంగా నిలువు దిశకి దూరం అవుతూ నేలకి సమాంతరంగా ఎగరాలి. అలా కాకుండా నిలువుగా ఎగుర్తూ పోతే ఏదో ఒక దశలో రాకెట్ ఇంధనం అంతా హరించుకుపోతుంది. అప్పుడా రాకెట్ కి భూమి కక్ష్యలోకి ప్రవేశించడానికి కావలసిన ద్రవ్యవేగం (momentum)  ఉండదు. వేగం పూర్తిగా సున్నా అయిపోయిన రాకెట్ పైకి విసిరిన రాయిలా దబ్బున నేల మీద పడుతుంది. 

కనుక రాకెట్ తన దిశని క్రమంగా నేలకి సమాంతర దిశగా తిప్పుకుంటూ, తగినంత వేగాన్ని నిలుపుకుంటూ ముందుకు దూసుకుపోవాలి. తగినంత ఎత్తులో, తగినంత వేగంతో కదిలే రాకెట్ ని గురుత్వం వ్యతిరేకించకపోగా, సహాయపడుతుంది. కనుక నేలకి సమాంతరంగా తిరుగుతున్నరాకెట్ ని ఒక విధంగా గురుత్వమే తన వైపుకి తిప్పుకుంటోంది అనుకోవచ్చు. అందుకే ఇలాంటి తిరుగుడుని ‘గురుత్వ భ్రమణం’ (gravity turn) అంటారు. ఈ దశలో రాకెట్ వేగంలో గాని, గమన దిశలో గాని ఏవైనా తేడా వచ్చిందంటే రాకెట్ లో ఉండే ‘సంచాలక  మరియు నియంత్రణ వ్యవస్థలు’ (guidance and control systems) రాకెట్ దిశకి కావలసిన సవరణలు చేసి రాకెట్ ని మళ్లీ నిర్ణీత దిశలోకి తీసుకొస్తాయి.

(ఇంకా వుంది)


 Image courtesy: ISRO






మన జ్ఞాపకాలకి రహస్య కారణాలు

Posted by V Srinivasa Chakravarthy Sunday, December 29, 2013 0 comments



ఈ సందర్భంలో నాకో సంఘటన గుర్తొస్తోంది. ఆ సంఘటన గురించి నాకు చెప్పిన వ్యక్తి ఓ ప్రొఫెసరు. ఓ సారి ఇతడు తన శిష్యుడితో కలిసి ఊరి బయట ఓ రోడ్డు మీద నడుస్తున్నాడు. అలా వెళ్తుంటే ఉన్నట్లుండి తన చిన్నప్పటి జ్ఞాపకాలు వెల్లువలా తన్నుకొచ్చి తన మానసాన్ని క్రమ్ముకున్నాయి. వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలకి ఆ జ్ఞాపకాలకి ఏ సంబంధమూ లేదనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి ఏ చోటి నుండి అయితే ఈ జ్ఞాపకాలు మొదలయ్యాయో ఆ చోటి వరకు నడుద్దామని తన శిష్యుడికి సూచించాడు ఆ ప్రొఫెసరు. అలా వెనక్కి వెళ్తుంటే ఒక చోట అడవి బాతుల వాసన తగిలింది. తన చిన్ననాటి జ్ఞాపకాలకి కారణం ఈ వాసనే అని ప్రొఫెసరు కి వెంటనే అర్థమయ్యింది.

ఇతగాడు తన చిన్నతనంలో అడవి బాతులు ఉండే పొలాల మధ్య పెరిగాడు. ఇప్పుడు మర్చిపోయినా ఆ వాసన తన చిత్తం మీద గాఢంగా ముద్రపడిపోయింది. మొదట ఆ దారిన పోతున్నప్పుడు ఆ వాసనని అతడు ఉపచేతనంగా అనుభూతి చెందాడు. ఈ ఉపచేతన సంవేదత అతడి చిన్ననాటి జ్ఞాపకాలని బయటికి రప్పించాయి. ఆ సమయంలో ధ్యాస మరెక్కడో వుంది కనుక ఈ వాసనని ఉపచేతనంగా మాత్రమే గుర్తుపట్టడం జరిగింది. ఆ వాసనలో ధ్యాసని మరల్చి సచేతనలోకి ప్రవేశించగలిగేంత శక్తి లేదు. అయినా ఆ కాస్త ప్రేరణ కూడా ఎప్పుడో “మర్చిపోయిన” జ్ఞాపకాలని వెలికి రప్పించింది.

ఏ విధంగా అయితే మామూలు మనుషుల్లో ఓ దృశ్యం, ఓ శబ్దం, ఓ వాసన పాత జ్ఞాపకాలని వెలిక తీయగల హేతువు అవుతుందో, న్యూరాటిక్ రోగులలో అలాంటి “సంజ్ఞ” ఓ ట్రిగ్గర్ లా పని చేసి న్యూరాటిక్ లక్షణాలు వ్యక్తమయ్యేలా చేస్తుంది. ఉదాహరణగా మంచి ఆరోగ్యం కలిగి, తన ఆఫీసులో చక్కగా పని చేసుకుంటున్న ఓ అమ్మాయినే తీసుకుందాం. మరుక్షణమే ఏ కారణమూ లేకుండా ఆమె విపరీతమైన తలనొప్పి బాధతో  చతికిలబడిపోయిందని అనుకుందాం.  మరి కొన్ని ఇతర న్యూరాటిక్ లక్షణాలు కూడా అందుకు వ్యక్తమయ్యాయి. ఏం జరిగిందని శోధిస్తే విషయం అర్థమయ్యింది. ఆమెకి తెలియకుండానే ఎక్కడో దూరంలో ఓ ఓడ కూత విందామె. ఆ శబ్దం ఎప్పుడో తన ప్రియుడితో తెగిపోయిన బంధాన్ని గుర్తుకు తెచ్చింది. మర్చిపోవాలనుకున్న చేదు జ్ఞాపకాలని మళ్లీ వెలికి తెచ్చింది. ఆ బాధామయ జ్ఞాపకాలే తలనొప్పి తదితర భౌతిక లక్షణాలుగా అభివ్యక్తం అయ్యాయి.

మామూలు విస్మృతి కాకుండా, బాధామయ జ్ఞాపకాలని “మర్చిపోయే” ప్రత్యేక సందర్భాలెన్నిటినో ఫ్రాయిడ్ వర్ణించాడు. అహంకారం అడ్డొచ్చినప్పుడు స్మృతి దానంతకదే ఓడిపోతుంది అంటాడు నీషే. మనం మర్చిపోయిన జ్ఞాపకాలు, ఉపచేతనంగా ఉంటూ పిలిచినా పైకి రాని జ్ఞాపకాలు, అలా ఉపచేతనంగా ఉండడానికి ఒక కారణం వుంది. అవి బాధామయ జ్ఞాపకాలు, సచేతన స్థితితో పొత్తు కుదరని జ్ఞాపకాలు. వీటినే మనస్తత్వ శాస్త్రవేత్తలు ‘అణగ దొక్కిన అంశాలు’ (repressed contents) అంటారు.

ఈ సందర్బంలో ఓ సెక్రటరీ కథని ఉదాహరణగా తీసుకుందాం. ఈమెకి తన బాస్ యొక్క స్నేహితులలో ఒకరంటే అసూయ. సమావేశాలకి అందరికీ ఆహ్వానాలు పంపేటప్పుడు ఈ స్త్రీని పిలవడం  అలవాటుగా మర్చిపోతుంది. అయితే ఆమె వాడే ఆహ్వానితుల జాబితాలో ఈ స్త్రీ పేరు ఉంటుంది. ఎందుకా పొరబాటు చేశావు అని నిలదీస్తే “మర్చిపోయా”ననో, లేక “పరధ్యానంగా” ఉన్నాననో చెప్తుంది. ఇక్కడ ఆమె అబద్ధం చెప్తోందని కాదు. నిజం ఏంటో తనకి తాను కూడా ఆమె ఒప్పుకోదు.

(ఇంకా వుంది)








“జైగాన్టోస్టెలియోలొజీ!!!”

Posted by V Srinivasa Chakravarthy Friday, December 27, 2013 0 comments


[ఈ సీరియల్ లో కిందటి పోస్ట్ లో ‘మానవ అస్తిపంజరం’ అని అనువదించడం జరిదింది. అది పొరబాటు. వీళ్లకి దొరికింది మానవ కళేబరం, ఎండిపోయిన మానవ కళేబరం! – అనువాదకుడు]

ఆ మానవ కళేబరం యొక్క రూపురేఖలని స్పష్టంగా గుర్తుపట్టడానికి వీలవుతోంది. ఇన్ని యుగాలుగా  దీని రూపురేఖలు సుస్థిరంగా ఉండడానికి కారణం అది పూడ్చబడ్డ మట్టి మహిమా? ఫ్రాన్స్ లో బొర్దో నగరానికి చెందిన సెయింట్ మైకేల్స్ శ్మశానం లో ఇలాంటి మహత్యమే జరుగుతుందని విన్నాను. ఎండిపోయిన ఈ కళేబరం యొక్క కుబుసం లాంటి చర్మం దాని ఎముకల మీద అతుక్కుపోయినట్టు ఉంది. కాళ్లు, చేతుల రూపం కూడా చూఛాయగా మిగిలి వుంది. పళ్లు ఇంకా వున్నాయి. జుట్టు పూర్తిగా ఊడలేదు. చేతి గోళ్లు బారెడు పొడవుకి పెరిగి కొంకర్లు పోయి వికృతంగా ఉన్నాయి. ఏదేమైనా గత యుగాల నాటి ఈ అనార్ద్ర శవ దర్శనానికి ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పొడిచింది. ఏదో దెయ్యాన్ని చూస్తున్నట్టు అందరం నోళ్లు వెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాం. మామూలుగా లొడ లొడా వాగే మావయ్య నోరు కూడా కాసేపు మూత బడిపోయింది. శవాన్ని పైకెత్తి ఓ బండకి ఆన్చి నించోబెట్టాం. కళ్ళు ఉండాల్సిన చోట ఉన్న ఖాళీలు మా వైపే చూస్తున్నట్టు అనిపించి వెన్ను లోంచి చలిపుట్టుకొచ్చింది. డొల్లగా ఉన్న దాని ఛాతీ మీద వేలితో ఓ సారి తట్టి చూశాం.

అలా ఓ నిముషం పాటు మౌనం వ్రతం పాటించిన మావయ్య ఇక ఉండబట్టలేక గొంతు సవరించుకున్నాడు. తను ఉన్న స్థానం, కాలం, సందర్భం అన్నీ మర్చిపోయినట్టున్నాడు. మళ్లీ యోహానియంలో విశ్వవిద్యాలయంలో తన పాండిత్య స్రవంతి ఎప్పుడు కట్టలు తెంచుకుంటుందాని అని చెవులాడించుకుంటూ ఎదురుచూసే పిల్లలు ఎదురుగా ఉన్నారను కున్నాడో ఏమో. మొదలెట్టాడు –
“మహాశయులారా! చతుర్థ యుగానికి గాని, తృతీయోత్తర యుగానికి గాని చెందిన మానవుణ్ణి ఈ సందర్భంలో మీకు పరిచయం చెయ్యడానికి ఎంతో గర్వపడుతున్నాను. మహా మహా భౌగోళిక శాస్త్రవేత్తలు కూడా ఇతగాడి ఉన్కిని ఇంతవరకు తిరస్కరిస్తూ వచ్చారు. అయితే ఇతడి ఉన్కిని నమ్మిన ఘనులు లేకపోలేదు. పురాజీవశాస్త్రానికి చెందిన సెయింట్ థామస్ లాంటి సందేహాత్ములు కావాలంటే వచ్చి ఇతగాణ్ణి వేళ్లతో తాకి నిర్ధరించుకుని, తమ లోపాలని సరిదిద్దుకోవచ్చు. ఈ రకమైన ఆవిష్కరణలు చేసే టప్పుడు సైన్స్ కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నేనూ ఒప్పుకుంటున్నాను. ఈ రకమైన శిలాజ మానవులని చూసినప్పుడు బార్నుమ్ హావే లాంటి పండితులు ఏమంటారో తెలుసుకోగోరుతున్నాను.

“ప్రాచీన గ్రీకు వీరుడు అజాక్స్ యొక్క మోకాలి చిప్పలు తవ్వకాలలో దొరికిన ఉదంతం గురించి విన్నాను.  ఓరెస్టెస్ శవం దొరికిందని స్పార్టాన్లు చాటుకోవడం గురించి విన్నాను. పాసానియాస్ వర్ణించిన, పది అడుగుల పొడవున్న ఎస్టీరియస్ శవం గురించి విన్నాను. పద్నాలుగవ శతాబ్దంలో సిసిలీ కి చెందిన ట్రపానీ అనే ముని శవం దొరికినట్టు ప్రకటించిన వార్తల గురించి విన్నాను. మొదట్లో ఆ శవం గ్రీకు గాధ అయిన ఒడెస్సీ లోని పాలిఫీమస్ అనే వ్యక్తిది  అనుకున్నారు. ఇటలీలో పాలెర్మో అనే ఊరి వద్ద పదహారవ శతాబ్దానికి చెందిన ఓ మహాకాయుడి శవం దొరికిన కథ గురించి విన్నాను. 1577  లో లూసెర్నే వద్ద జరిగిన తవ్వకాల విశ్లేషణ యొక్క ఫలితాల గురించి మీరంతా వినే వుంటారు. ఆ అస్తిపంజరాన్ని పరిశోధించిన డా॥ ఫెలిక్స్ ప్లాటర్ అది పందొమ్మిది అడుగులు పొడవున్న ఓ మహాకాయుడికి చెందినదని నిర్ణయించాడు. గాల్ రాజ్యం మీద దండయాత్ర చేసి జయించిన ట్యూటోబాకస్ యొక్క శవాన్ని 1613  లో దాఫ్నే వద్ద తవ్వి తీశారు. ఆ వృత్తాంతం గురించి కాసానియన్ రాసిన రచనలన్నీ చదివాను. ఇక పద్దెనిమిదవ శతాబ్దంలో షాయిజర్ ప్రతిపాదించిన పూర్వ-ఆదామ్ మానవుణ్ణి నేనూ సమర్ధించేవాణ్ణి. ఆ సందర్భంలోనే మరో వ్యాసం కూడా చదివాను. దాని పేరు జైగాన్…”

ఇక్కడే మావయ్య మాట తడబడింది. నాలుక మడతబడింది. వాణి మూగబోయింది. మావయ్యకి ఓ బలహీనత వుంది. నలుగురిలో మాట్లాడేటప్పుడు కఠిన పదాల వద్ద తత్తరపడతాడు.
“ఆ వ్యాసం పేరు జైగాన్…” మళ్లీ ప్రయత్నించి చూశాడు. లాభం లేకపోయింది.
ఎంత గింజుకున్నా పైకి రానని మాట మొరాయిస్తోంది. యోహానియంలో క్లాసులో అయితే ఈ పాటికి శిష్యకోటి అంతా కిసుక్కున నవ్వేవారు.
“జైగాన్టోస్టెలియోలొజీ!!!” నోట్లోంచి మాట ఒక్కసారిగా ఊడిపడింది.
దాంతో రెట్టించిన ఉత్సాహంతో మావయ్య తన ఉపన్యాసాన్ని కొనసాగించాడు.

(ఇంకా వుంది)







చలివిడి ముద్దలా, కొంచెం అదే రంగులో, కనిపిస్తానే గాని నిజానికి నేనో జాలాన్ని. మీరు ఊహించగలిగే దాని కన్నా పెద్ద జాలాన్ని. కావాలంటే ప్రపంచంలో కెల్లా  ఓ అతిపెద్ద జాలాన్ని ఊహించుకోండి. భూమి మీద మొత్తం జనాభా సుమారు 7  బిలియన్లు. నూటికి  సుమారు 87  మందికి సెల్ ఫోన్లు ఉన్నాయి. పోనీ సెల్ ఫోన్ల వినియోగం నూరు శాత అనుకుందాం. ప్రతీ సెల్ ఫోన్ లోను 200  కాంటాక్ట్ లు ఉంటాయని అనుకుందాం. అంటే 7  బిలియన్ల సెల్ ఫోన్లు గల ఈ జాలంలో, ఒక్కొక్క సెల్ ఫోను రెండొందల ఇతర ఫోన్లతో సూటిగా సంబంధం గలిగి వుంది.  ఇది చాలా పెద్ద, సంక్లిష్టమైన జాలం అని సులభంగా ఒప్పుకోగలం. మెదడులోని జాలం దీని కన్నా నూరు రెట్లు పైగా పెద్దది. ఎందుకంటే మెదడులో మొత్తం న్యూరాన్ల సంఖ్య  100  బిలియన్లు. ఒక్కొక్క న్యూరానుకి 1,000 నుండి 10,000   వరకు ఇతర న్యూరాన్లతో సంధులు (connections) ఉంటాయి.   అంటే మొత్తం 10^14 – 10^15  సంధులు అన్నమాట. ఇక కొన్ని న్యూరాన్లలో అయితే తలా లక్షా, రెండు లక్షల సంధులు ఉంటాయి. మెదడులో సెరిబెల్లం అనే ప్రాంతంలో ఉన్నాయి లేండి చింపిరి జుట్టు బూచాళ్లు… పుర్కిన్యే కణాలు (Purkinje cells) అంటారు వాళ్లని… వీళ్లకి తలా లక్షన్నర సంధులు దాకా ఉంటాయి (చిత్రం).



ఇక మా తీగలలో ప్రసారం అయ్యే విద్యుత్ సంకేతాలు మహా జోరుగా పరిగెడతాయి. లేకపోతే మీ కాలికి ముల్లు గుచ్చుకున్నప్పుడు, మీరు తేరుకుని కాలు వెనక్కి తీసుకునే సరికి తెల్లారిపోతే మరి ఇబ్బంది కదండి! నాడీ తీగల్లో సంకేతం ప్రసారం అయ్యే వేగాల్లో కూడా ఎంతో తేడా ఉంటుందనుకోండి. కొన్ని తీగల్లో అయితే 120 మీటరు/సెకను వేగం వరకు కూడా ఉంటుంది.  ఈ తీగలు కాస్త దళసరిగా అంటే ఓ 20  మైక్రాన్లు (1  మైక్రాను అంటే ఓ మిల్లీమీటరులో వెయ్యోవంతు!) మందం కలిగి ఉంటాయి. ఇక మరి కొన్ని తీగలైతే బాగా బక్కపలచగా ఉంటాయి. వీట్లో వేగం మరి కాస్త నెమ్మది – 4 మీటర్/సెకను దరిదాపుల్లో ఉంటుంది.

ఇన్ని చేస్తాం గానీండి ఒక్కటి మాత్రం మాకు చాతకాదండి. అదే… పునరుత్పత్తి అంటారు చూశారూ… మా మిగతా కణం తమ్ముళ్ళందరికీ ఇది బాగా చాతనవును. చర్మం కణం గాళ్ళు, రక్త కణాలు … ఈ కణాలు ఎప్పుడైనా చచ్చిపోయినా పెద్దగా బెంగ లేదండి. వాళ్ళ సంతానం ఉంటారు గనుక లెక్క సరిపోతుంది. కాని న్యూరాన్లు ప్రాణాలొదిల్తే  వాటి వంశ గౌరవం నిలపడానికి ఒక్కడు ఉండడండి. మీ మెదడులో న్యూరాన్లు ఒకసారి పోతే ఇక అదే పోవడం అండి. ఇప్పుడు మీ వయసు 35  అనుకోండి. మీ మెదడులో రోజుకి 1000  న్యూరాన్లు చొప్పున టపా కట్టేస్తుంటాయి. అందుకే వయసు పైబడుతున్న కొద్ది మెదడు కుంచించుకుంటుంది. బరువు కూడా తగ్గుతుంది. అప్పుడిక మీ మతి మరుపు పెరిగిపోతుందన్నమాట. పేర్లు, టెలిఫోన్ నెంబర్లు, తేదీలు లాంటివి గుర్తుకు రాక తల బాదేసుకుంటూ ఉంటారు. కాని మిగతా ముఖ్యమైన పనుల్లో మాత్రం పొరబాటు రానీకుండా నేను జాగ్రత్త పడుతుంటాను.

మీ లోని మిగతా అంగాలకి నాకు ఓ ముఖ్యమైన పోలిక వుంది. మీకు రెండు ఊపిరితిత్తులు – ఎడమ, కుడి వైపుల్లో – ఉన్నాయి. అలాగే రెండు మూత్ర పిండాలు. రెండు కళ్లు, చెవులు, చేతులు, కాళ్లు… అదే అర్థమయ్యింది కదండీ… ఇలా చాలా అవయవాలు రెండేసి చెరో వైపు ఉంటాయి. మెదడు మాత్రం ఒక్కటే ఉందని మీరు అపోహపడతారు. నాకు తెలుసు. కాని మెదడులో కూడా రెండు విభాగాలు చెరోవైపు ఉంటాయి. మీ ఒంట్లో కుడి వైపున జరిగే తంతులో ఎక్కువగా నా లో ఎడమ భాగం చెప్పు చేతల్లో ఉంటుంది. అలాగే మీ ఒంట్ళో ఎడమ వైపుని నాలో కుడి భాగం అదిలిస్తుంది. నాలో రెండు భాగాలున్నా రెండూ సరి సమానం కాదన్నమాట. మనకి చేతులు రెండున్నా కుడి చేయి చేసే పని ఎడమ చేయి చెయ్యలేదు కదండి. అలాగే మెదడులో కూడా ఒక భాగానిది పై చేయి అవుతుంది. అది తరచు ఎడమ బాగానిది అవుతుంది. ఎడమ మెదడు కుడి మెదడు మీద పెత్తనం చేస్తున్నట్లయితే అలాంటి మెదడున్న వాళ్ళు కుడి చేతి వాటం గల వాళ్లయి వుంటారు. అలాగే అమితాబ్ బచ్చన్ లాంటి ఎడమ చేతి వాళ్లలో కుడి మెదడు పెత్తనం ఎక్కువ అన్నమాట.
(ఇంకా వుంది)









postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts