[ఈ సీరియల్ లో
కిందటి పోస్ట్ లో ‘మానవ అస్తిపంజరం’ అని అనువదించడం జరిదింది. అది పొరబాటు. వీళ్లకి
దొరికింది మానవ కళేబరం, ఎండిపోయిన మానవ కళేబరం! – అనువాదకుడు]
ఆ మానవ కళేబరం
యొక్క రూపురేఖలని స్పష్టంగా గుర్తుపట్టడానికి వీలవుతోంది. ఇన్ని యుగాలుగా దీని రూపురేఖలు సుస్థిరంగా ఉండడానికి కారణం అది పూడ్చబడ్డ
మట్టి మహిమా? ఫ్రాన్స్ లో బొర్దో నగరానికి చెందిన సెయింట్ మైకేల్స్ శ్మశానం లో ఇలాంటి
మహత్యమే జరుగుతుందని విన్నాను. ఎండిపోయిన ఈ కళేబరం యొక్క కుబుసం లాంటి చర్మం దాని ఎముకల
మీద అతుక్కుపోయినట్టు ఉంది. కాళ్లు, చేతుల రూపం కూడా చూఛాయగా మిగిలి వుంది. పళ్లు ఇంకా
వున్నాయి. జుట్టు పూర్తిగా ఊడలేదు. చేతి గోళ్లు బారెడు పొడవుకి పెరిగి కొంకర్లు పోయి
వికృతంగా ఉన్నాయి. ఏదేమైనా గత యుగాల నాటి ఈ అనార్ద్ర శవ దర్శనానికి ఒక్కసారిగా ఒళ్ళు
గగుర్పొడిచింది. ఏదో దెయ్యాన్ని చూస్తున్నట్టు అందరం నోళ్లు వెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయాం.
మామూలుగా లొడ లొడా వాగే మావయ్య నోరు కూడా కాసేపు మూత బడిపోయింది. శవాన్ని పైకెత్తి
ఓ బండకి ఆన్చి నించోబెట్టాం. కళ్ళు ఉండాల్సిన చోట ఉన్న ఖాళీలు మా వైపే చూస్తున్నట్టు
అనిపించి వెన్ను లోంచి చలిపుట్టుకొచ్చింది. డొల్లగా ఉన్న దాని ఛాతీ మీద వేలితో ఓ సారి
తట్టి చూశాం.
అలా ఓ నిముషం
పాటు మౌనం వ్రతం పాటించిన మావయ్య ఇక ఉండబట్టలేక గొంతు సవరించుకున్నాడు. తను ఉన్న స్థానం,
కాలం, సందర్భం అన్నీ మర్చిపోయినట్టున్నాడు. మళ్లీ యోహానియంలో విశ్వవిద్యాలయంలో తన పాండిత్య
స్రవంతి ఎప్పుడు కట్టలు తెంచుకుంటుందాని అని చెవులాడించుకుంటూ ఎదురుచూసే పిల్లలు ఎదురుగా
ఉన్నారను కున్నాడో ఏమో. మొదలెట్టాడు –
“మహాశయులారా!
చతుర్థ యుగానికి గాని, తృతీయోత్తర యుగానికి గాని చెందిన మానవుణ్ణి ఈ సందర్భంలో మీకు
పరిచయం చెయ్యడానికి ఎంతో గర్వపడుతున్నాను. మహా మహా భౌగోళిక శాస్త్రవేత్తలు కూడా ఇతగాడి
ఉన్కిని ఇంతవరకు తిరస్కరిస్తూ వచ్చారు. అయితే ఇతడి ఉన్కిని నమ్మిన ఘనులు లేకపోలేదు.
పురాజీవశాస్త్రానికి చెందిన సెయింట్ థామస్ లాంటి సందేహాత్ములు కావాలంటే వచ్చి ఇతగాణ్ణి
వేళ్లతో తాకి నిర్ధరించుకుని, తమ లోపాలని సరిదిద్దుకోవచ్చు. ఈ రకమైన ఆవిష్కరణలు చేసే
టప్పుడు సైన్స్ కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నేనూ ఒప్పుకుంటున్నాను. ఈ రకమైన
శిలాజ మానవులని చూసినప్పుడు బార్నుమ్ హావే లాంటి పండితులు ఏమంటారో తెలుసుకోగోరుతున్నాను.
“ప్రాచీన గ్రీకు
వీరుడు అజాక్స్ యొక్క మోకాలి చిప్పలు తవ్వకాలలో దొరికిన ఉదంతం గురించి విన్నాను. ఓరెస్టెస్ శవం దొరికిందని స్పార్టాన్లు చాటుకోవడం
గురించి విన్నాను. పాసానియాస్ వర్ణించిన, పది అడుగుల పొడవున్న ఎస్టీరియస్ శవం గురించి
విన్నాను. పద్నాలుగవ శతాబ్దంలో సిసిలీ కి చెందిన ట్రపానీ అనే ముని శవం దొరికినట్టు
ప్రకటించిన వార్తల గురించి విన్నాను. మొదట్లో ఆ శవం గ్రీకు గాధ అయిన ఒడెస్సీ లోని పాలిఫీమస్
అనే వ్యక్తిది అనుకున్నారు. ఇటలీలో పాలెర్మో
అనే ఊరి వద్ద పదహారవ శతాబ్దానికి చెందిన ఓ మహాకాయుడి శవం దొరికిన కథ గురించి విన్నాను.
1577 లో లూసెర్నే వద్ద జరిగిన తవ్వకాల విశ్లేషణ
యొక్క ఫలితాల గురించి మీరంతా వినే వుంటారు. ఆ అస్తిపంజరాన్ని పరిశోధించిన డా॥ ఫెలిక్స్
ప్లాటర్ అది పందొమ్మిది అడుగులు పొడవున్న ఓ మహాకాయుడికి చెందినదని నిర్ణయించాడు. గాల్
రాజ్యం మీద దండయాత్ర చేసి జయించిన ట్యూటోబాకస్ యొక్క శవాన్ని 1613 లో దాఫ్నే వద్ద తవ్వి తీశారు. ఆ వృత్తాంతం గురించి
కాసానియన్ రాసిన రచనలన్నీ చదివాను. ఇక పద్దెనిమిదవ శతాబ్దంలో షాయిజర్ ప్రతిపాదించిన
పూర్వ-ఆదామ్ మానవుణ్ణి నేనూ సమర్ధించేవాణ్ణి. ఆ సందర్భంలోనే మరో వ్యాసం కూడా చదివాను.
దాని పేరు జైగాన్…”
ఇక్కడే మావయ్య
మాట తడబడింది. నాలుక మడతబడింది. వాణి మూగబోయింది. మావయ్యకి ఓ బలహీనత వుంది. నలుగురిలో
మాట్లాడేటప్పుడు కఠిన పదాల వద్ద తత్తరపడతాడు.
“ఆ వ్యాసం పేరు
జైగాన్…” మళ్లీ ప్రయత్నించి చూశాడు. లాభం లేకపోయింది.
ఎంత గింజుకున్నా
పైకి రానని మాట మొరాయిస్తోంది. యోహానియంలో క్లాసులో అయితే ఈ పాటికి శిష్యకోటి అంతా
కిసుక్కున నవ్వేవారు.
“జైగాన్టోస్టెలియోలొజీ!!!”
నోట్లోంచి మాట ఒక్కసారిగా ఊడిపడింది.
దాంతో రెట్టించిన
ఉత్సాహంతో మావయ్య తన ఉపన్యాసాన్ని కొనసాగించాడు.
(ఇంకా వుంది)
0 comments