అధ్యాయం 38
ప్రొఫెసర్ గారు
మళ్లీ పాఠం మొదలెట్టారు
ఎవరో కనిపించని
ఫ్రెంచ్ పండితులని ఉద్దేశించి మా మామయ్య అన్న
మాటలు అర్థం కావాలంటే మీకు కొంత ఉపోద్ఘాతం ఇవ్వాలి. పురాజీవశాస్త్రం
(paleontology) ప్రకారం అతిముఖ్యమైనది గా పరిగణించబడ్డ
ఒక ఘటన గురించి చెప్పాలి. ఆ ఘటన మేము మా యాత్ర మీద బయల్దేరడానికి కొంచెం ముందు జరిగింది.
1863 లో మార్చి
28 నాడు, ఎమ్. బూషే ద పెర్త్ అనే ఫ్రెంచ్
పండితుడి అధ్వర్యంలో ఒక పురాజీవశాస్త్ర బృందం తవ్వకాలు కొనసాగిస్తోంది. ఫ్రాన్స్ లో
ఏబ్విల్ వద్ద, మోలాన్ క్విగాన్ రాళ్ల గని లో తవ్వుతున్నారు. ఆ తవ్వకాలలో పద్నాలుగు
అడుగుల లోతులో ఓ మానవ దవడ ఎముక దొరికింది. ఈ రకమైన శిలాజం బయటపడడం అదే మొదటి సారి.
అక్కడికి కొంత దూరంలోనే రాతి కత్తులు, సూదంటు రాయితో చేసిన బాణపు ములుకులు మొదలైన వస్తువులు
బయటపడ్డాయి. కాల ప్రభావం వల్ల వాటి మీద సన్నని తుప్పుపొర ఏర్పడింది.
ఈ అపూర్వ ఆవిష్కరణకి
ఫ్రాన్స్ లోనే కాదు ఇరుగు పొరుగు దేశాలైన ఇంగ్లండ్, జర్మనీలలో కూడా గొప్ప స్పందన వచ్చింది.
ఫ్రాన్స్ కి చెందిన ఎమ్. ఎమ్. మిల్నే ఎడ్వర్డ్స్ మరియు ద కాత్ర్ ఫాజ్ మొదలైన పండితులు
వెంటనే ఆ ఆవిష్కరణ యొక్క ప్రాముఖ్యత గుర్తించారు. అది అసలు సిసలైన ఎముకేనని వీళ్లు
నిరూపించారు. ఇంగ్లండ్ కి చెందిన ఫాల్కనర్, బస్క్, కార్పెంటర్ మొదలైన పండితులంతా ఈ
ఆవిష్కరణని సమర్ధించారు. ఇంత మంది ఇంత ఇదిగా చెప్తుంటే మేం మాత్రం ఎందుకు కాదంటాం అంటూ
జర్మన్లు కూడా మద్దతు ఇచ్చారు. అలా మద్దతు ఇచ్చిన జర్మన్లలో అతి ముఖ్యుడు మావయ్య, ప్రొఫెసర్
లీడెన్బ్రాక్.
కనుక చతుర్థ
యుగం (quarternary period) లో మనిషి జీవించాడు అనడానికి ఈ శిలాజమే ఆధారం.
కాని ఈ సిద్ధాంతాన్ని
వ్యతిరేకించిన వాళ్లు లేకపోలేదు. వారిలో ప్రథముడు
ఎమ్. ఎలీ ద బోమో అనే పండితుడు.
మోలాన్ క్విగాన్
కి చెందిన మట్టి బైబిలో చెప్పిన ప్రళయ కాలానికి (diluvial) చెందినది కాదని, అంతకన్నా అర్వాచీన కాలానికి చెందినది
ఇతడి వాదన. కనుక చతుర్థ యుగానికి చెందిన జంతువులకి మానవుడు సమకాలీనుడు కాడని ఇతడి అభిప్రాయం.
మావయ్య బోలెడు మంది భూగర్భ శాస్త్రవేత్తలని పోగేసుకుని ఇతడికి వ్యతిరేకంగా వాదించేవాడు.
కాని లాభం లేకపోయింది. ఇంత మందికి వ్యతిరేకంగా ఎమ్. ఎలీ ద బోమో గారు తమ ఒంటరి పోరాటాన్ని
కొనసాగించారు.
ఇక్కడి వరకు
కథ బాగా తెలిసిందే గాని, మేం బయల్దేరిన నాటి నుండి ఈ సమస్య విషయంలో ఎంతో పురోగతి జరిగిందన్న
విషయాన్ని మేం గమనించలేదు. వివిధ దేశాలకి చెందిన గతించిన వ్యక్తుల యొక్క దవడ ఎముకలు
ఎన్నో చోట్ల దొరికాయి. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బెల్జియమ్ మొదలైన దేశాల్లో కొన్ని
గుహల్లో వదులుగా ఉన్న మట్టిలోనే దొరికాయి. ఇవి కాకుండా ఎన్నో ఆయుధాలు, పనిముట్లు, మట్టి
పాత్రలు, పిల్లల, పెద్దల అస్తికలు ఎన్నో దొరికాయి. కనుక చతుర్థ యుగంలో మనిషి జీవించాడన్న
విషయం మరింత రూఢి అయ్యింది.
ఆ సాక్ష్యాల
స్రవంతి అక్కడితో ఆగిపోలేదు. ప్లియోసీన్ యుగానికి చెందిన మరి కొన్ని ఆధారాలబట్టి మానవుడు
మనం ప్రస్తుతం అనుకున్న దాని కన్నా ప్రాచీనుడు అన్న భావనకి సమర్ధన దొరికింది. అయితే
అక్కడ దొరికినవి మానవ అస్తికలు కావు. మానవ హస్తం యొక్క కళాత్మక ప్రభావాన్ని చూరగొన్న
జంతు అస్తికలు. మనిషి చేత తీరుగా ఓ శిల్పంలా మలచబడ్డ జంతువుల కాలి అస్తికలు.
ఆ విధంగా మానవ
మూలాలు చరిత్రలో ఎంతో సుదూర గతానికి చెందినవి అన్న సిద్ధాంతం ఊపిరి పోసుకుంది. ఏనుగు
లాంటి మహాకాయమైన మాస్టడాన్ కన్నా అతడు పూర్వీకుడు.
దక్షిణ గోళార్థానికి చెందిన ఏనుగుకి అతడి సమకాలీనుడు. ప్లియోసీన్ నిర్మాణం ఇంకా పురోగమిస్తున్న
దశలో లక్ష ఏళ్ల క్రితం కూడా మనిషి జీవించాడు.
అలా మేము ఆ అస్తికలని
దాటుకుంటూ ముందుకి నడుస్తుంటే నాకు ఇరవై గజాల దూరంలో ఉన్న మామయ్యకి ఓ మానవ అస్తిపంజరం కనిపించింది!
(ఇంకా వుంది)
0 comments