పదాల పరిశీలన
లియొనార్డో బ్లూమ్ ఫీల్డ్, క్లారెన్స్ బర్న్ హార్డ్ అనే రచయితలు
Let us read (చదువుకుందాం రండి) అనే చక్కని పుస్తకం రాశారు. పిల్లలు తమంతకు తాము చదవడం
నేర్చుకునేట్టుగా రాయబడింది ఆ పుస్తకం. కాని దాని రచయితలు ఆ ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని
రాయలేదు. ఆ పుస్తకాన్ని వాళ్ల తల్లిదండ్రులు చదివి పిల్లలకి చదవడం నేర్పిస్తారని వాళ్ల
ఉద్దేశం. కాని అలా చెయ్యడం అనవసరం అని, చెయ్యడం వల్ల ప్రయోజనం ఉండదని, మంచిది కాదని
నా ఉద్దేశం. పిల్లలు తమంతకి తాముగా, ఇతరుల పర్యవేక్షణ లేకుండా, అడిగినప్పుడు, అడిగినంత
మేరకు మాత్రమే, సహాయాన్ని అందుకుంటూ ముందుకి సాగినప్పుడు మాత్రమే మరింత మెరుగ్గా సంతోషంగా
చదవడం నేర్చుకుంటారు.
అయితే ఈ పుస్తకం వల్ల పిల్లలకి అంతో ఇంతో మేలు జరుగుతుందనే
అనుకుంటాను. పుస్తకంలో ఇంచుమించు ఓ అరవై పేజీలు పిల్లలకి చదువు ఎలా చెప్పాలి అన్న విషయం
మీద పెద్దలకి ఎన్నో అక్కర్లేని, అర్థం లేని సూచనలు ఉన్నాయి. అది తప్పితే ఈ పుస్తకంలో
ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ప్రతీ పేజీ లోను పేజీకి పై భాగంలో ఇంగ్లీషులో ఏకాక్షర
(monosyllabled) పదాలు ఉన్నాయి. ఉదాహరణకి –an శబ్దంతో ముగిసే పదాలు – can, Dan, fan, man,
Nan, pan, ran, tan, ban, an, van. ఆ తరువాత
ఆ పదాలని ఉపయోగిస్తూ చిన్న చిన్న వాక్యాలు ఉన్నాయి. తరువాత -at శబ్దంతో
ముగిసే పదాలు – bat, cat, fat, mat, Nat, pat, rat, sat, at, tat, vat. వీటితో కూడా
వాక్యాలు నిర్మించబడ్డాయి.
తరువాత పేజీలో –ad తో ముగిసే పదాలు. ఇక ఆ పై పేజీల్లో వరుసగా –ap,
-ag, -am, -ab, -at, -at, -ig, -in, -id, మొదలైన శబ్దాలతో అంతమయ్యే పదాలు. ఈ పదాలన్నీ
కావాలంటే మనమే ఆలోచించుకుని కూర్చుకోవచ్చు నిజమే. కాని అవన్నీ అలా ఎవరైనా అనువుగా వర్గీకరించి
ఒక చోట పెద్ద పెద్ద అక్షరాలతో స్పష్టంగా అచ్చు వేస్తే సౌకర్యంగా ఉంటుంది. ప్రతీ పేజీలోను
వచ్చిన నవీన పదాలతో కూర్చిన వాక్యాలు ఉంటాయి. అవి కాక అంతకు ముందు వచ్చిన పదాలు కూడా
ఉంటాయి. అయితే ఆ వాక్యాలు కమ్మని కథలు చెప్పకపోవచ్చు. కాని ఆ దశలో పిల్లలు పదల అర్థం
తెలుసుకోవడమే చాలా గొప్ప విషయం అంటారు రచయితలు. ఇది మటుకు చాలా నిజం. పదజాలం పెరుగుతున్న
కొద్ది వాక్యాలు పేరుకుని కథలుగా రూపొందుతాయి.
అలా మెల్లగా నూరో పేజీ దాకా వచ్చేసరికి (కొన్ని సార్లు ఇంకా ముందే) పిల్లలకి ‘చదువులోని మర్మం’ ఏమిటో పట్టుబడిపోతుంది.
ఆ అనుభవంతో పిల్లలు మెల్లగా వాళ్లంతకు వాళ్లే పత్రికల్లో హెడ్ లైన్లు, సైన్ బోర్డులు,
వ్యాపార ప్రకటనలు మొదలైనవి చదవడం మొదలెడతారు.
ఇలాంటి పుస్తకం ఒకటుంటే పిల్లలకి తిరగేయడానికి బాగుంటుంది.
నా మేనగోడలికి నాలుగేళ్లప్పుడు ఆ పుస్తకం ఒకటి తెచ్చి నా చెల్లెలి చేతిలో పెట్టాను.
దాంతో తన కూతురికి చదువు చెప్తుందని. కాని నా మేనగోడలి విషయంలో గాని, ఆ తర్వాత ఆమె
చిట్టి తమ్ముడి విషయంలో గాని చదువు చెప్పే
ప్రయత్నాలేవీ ఫలించలేదు. చదువు చెబుదామని ఎవరైనా ముందుకొస్తే మొండిగా నిరాకరించేవారు.
బాబోయ్ వద్దని పారిపోయేవారు. అందుచేత అదే పుస్తకాన్ని వాళ్ల అందుబాటులో పెట్టి వదిలేసి
వాళ్ళలో ‘ఈ పుస్తకం నాది’ అనే భావన కలిగేలా ప్రోత్సహించేవారు. ఆ తరువాత కొంత కాలానికి
వెళ్లి చూస్తే ఆ పుస్తకంలో మాసిన మరకలు కనిపించాయి. అవి ఆ పాప చేతి గుర్తులని అర్థమయ్యింది.
కొన్ని నెలల పాటు ఆ పుస్తకంలో పేజీలు బాగా తిరగేసి ఆ అక్షరాల ఆకారాలని పదే పదే మనసులో
నెమరు వేసుకుని వుంటుంది. ఆ అనుభవంతో తరువాత తదితర పుస్తకాలని కూడా తిరగేసి వుండొచ్చు.
చదివే విషయంలో ఆ తరువాత ఆ పాప ఏం ప్రయత్నాలు చేసిందో నేను చూళ్లేదు. ఎందుకంటే అలాంటప్పుడు
తన గదిలోకి వెళ్లి తలుపేసుకుని ఒక్కర్తీ ఏదో చదువుకునేది. మరీ అవసరమైతే ఎవరినైనా ఓ
రెండు ప్రశ్నలు అడిగేది. అలా తన గదిలో ఒక్కర్తీ ఏం చదివేదో ఓ రహస్యంగానే మిగిలిపోయింది.
ఎంతో మంది పిల్లలకి తమకంటూ అలాంటి పుస్తకం ఒకటి వుంటే హాయిగా
కూర్చుని తిరగెయ్యాలని ఉంటుందని నా నమ్మకం. చూడ్డానికి ఆ పుస్తకం ‘పిల్లల పుస్తకం’లా
ఉండదు. అందులో పెద్దగా బొమ్మలు కూడా లేవు. కేవలం నాలుగు పేజీల్లోనే బొమ్మలు ఉన్నాయి.
తక్కిన పేజీల్లో అన్నీ అక్షరాలే. అవీ చాలా పెద్ద అక్షరాలు. సులభంగా పిల్లల దృష్టికి
ఆనుతాయి. అలాగే పదాలు కూడా చిన్న చిన్న పదాలు. వాటి ఉచ్ఛారణ పిల్లలు సులభంగా పట్టుకోగలరు.
నా దగ్గరే కనుక చిన్న పిల్లలు ఉంటే తప్పకుండా ఈ పుస్తకం (ఇలాంటివే
మరెన్నో పుస్తకాలని కూడా) ఇస్తాను. దాన్ని వాళ్లు ఎలా చదువుతారో ఏం చేస్తారో
వాళ్లకే వదిలేస్తాను. నన్ను చదివి పెట్టమని అడిగితే చదువుతాను. లేదంటే ఊరుకుంటాను.
చదివేటప్పుడు మాత్రం వాక్యం క్రింద నా వేలు పోనిస్తూ మెల్లగా స్పష్టంగా చదువుతాను.
కాని మళ్లీ ఆలోచిస్తే ఆ కాస్త చొరవ కూడా పిల్లలు ‘శిక్షణ’ కిందే తీసుకుని అభ్యంతరం
చెప్తారని అనిపించింది. సహాయాన్ని కోరినంత మేరకు అందజేయడం. వద్దంటే దూరంగా ఉంటూ
వాళ్ల స్వయం శిక్షణా ప్రయత్నాలకి సాక్షిగా మిగలడమే మేలైన పద్ధతి అని నా అభిప్రాయం.
(ఇంకా వుంది)
0 comments