రాకెట్ నిర్మాణంలో దశలు ఉంటాయని,
అలా పలు దశలు ఉండే సంకీర్ణ రాకెట్ లు అధిక వేగాన్ని సాధించగలుగుతాయని ఇంతకు ముందు చెప్పుకున్నాం.
ఇప్పుడు రాకెట్ గమనం మీదకి ధ్యాస మళ్లిద్దాం.
ఓ సంకీర్ణ రాకెట్ నేల నుండి బయల్దేరి, నింగికి ఎగసి, కక్ష్య లోకి ప్రవేశించేటంత
వరకు గల మధ్యంతర దశలు ఏంటి? ఈ వివరాలు పరిశీలిద్దాం.
లాంచ్ పాడ్ కి కక్ష్యకి మధ్య
జరిగే వ్యవహారంలో ఎన్నో మధ్యంతర దశలు ఉంటాయి. అవి
-
లాంచ్ కి పూర్వ దశ (pre-launch stage)
-
లిఫ్ట్ ఆఫ్ (lift off)
-
నిలువు గమనం (vertical rise)
-
వాలు గమనం (pitchover)
-
ఆరోహణం (ascent)
-
మొదటి దశ అంతరించడం (first stage)
-
మరింత ఆరోహణం (ascent)
-
రెండవ దశ అంతరించడం (second stage)
-
మరింత ఆరోహణం (ascent)
-
మూడవ దశ అంతరించడం (third stage)
రాకెట్ ని లాంచ్ సైట్ (launch
site) కి తరలించడంతో ‘లాంచ్ కి పూర్వ దశ’ మొదలవుతుంది.
ఈ తరలింపు లాంచి కి సుమారు రెండు వారాల ముందు జరుగుతుంది. రాకెట్ బయల్దేరేటప్పుడు జరిగే
కౌంట్ డౌన్ (countdown) తో ఈ దశ ముగుస్తుంది.
లాంచ్ కి సిద్ధం అవుతున్న మన PSLV
మొదటి దశ యొక్క శక్తితో రాకెట్
భూమి ఉపరితలం నుండి పైకి లేస్తుంది. లాంచ్ టవర్ కి తగలకుండా రాకెట్ నిటారుగా పైకి కదులుతుంది.
రాకెట్ కి లాంచ్ టవర్ ని దాటడానికి కొన్ని సెకనులు పడుతుంది.
లాంచ్ టవర్ ని దాటగానే
exhaust nozzle లు కొంచెం పక్కకి తిరుగుతాయి. ఆ కారణంగా నిటారుగా కదిలే రాకెట్ కొద్దిగా
వాలుతుంది. ఇలా పూర్తిగా నిటారుగా కాకుండా కాస్త వాలు దిశలో ప్రయాణించడానికి ఒక కారణం
వుంది.
అంతరిక్షం కేసి ఎగయబోతున్న రాకెట్
గమనానికి అడ్డుపడే బలాలు రెండు ఉన్నాయి. ఒకటి భూమి గురుత్వం. రెండవది వాయుమండలంలోని
గాలి వల్ల రాకెట్ మీద కలిగే ఈడ్పు (drag). గాలి వల్ల కలిగే ఈడ్పుని తగ్గించుకోవాలంటే
రాకెట్ వీలైనంత త్వరగా వాయుమండలాన్ని దాటుకుని అంతరిక్షంలోకి ప్రవేశించాలి. అంటే వీలైనంత
నిటారుగా ఎగుర్తూ వాయుమండలాన్ని త్వరగా దాటాలి.
కాని రాకెట్ యొక్క లక్ష్యం భూమి చుట్టూ కక్ష్యలోకి
ప్రవేశించడం అయితే నేలకి సమాంతరంగా ఎగరాలి. కనుక క్రమంగా నిలువు దిశకి దూరం అవుతూ నేలకి
సమాంతరంగా ఎగరాలి. అలా కాకుండా నిలువుగా ఎగుర్తూ పోతే ఏదో ఒక దశలో రాకెట్ ఇంధనం అంతా
హరించుకుపోతుంది. అప్పుడా రాకెట్ కి భూమి కక్ష్యలోకి ప్రవేశించడానికి కావలసిన ద్రవ్యవేగం
(momentum) ఉండదు. వేగం పూర్తిగా సున్నా అయిపోయిన
రాకెట్ పైకి విసిరిన రాయిలా దబ్బున నేల మీద పడుతుంది.
కనుక రాకెట్ తన దిశని క్రమంగా
నేలకి సమాంతర దిశగా తిప్పుకుంటూ, తగినంత వేగాన్ని నిలుపుకుంటూ ముందుకు దూసుకుపోవాలి.
తగినంత ఎత్తులో, తగినంత వేగంతో కదిలే రాకెట్ ని గురుత్వం వ్యతిరేకించకపోగా, సహాయపడుతుంది.
కనుక నేలకి సమాంతరంగా తిరుగుతున్నరాకెట్ ని ఒక విధంగా గురుత్వమే తన వైపుకి తిప్పుకుంటోంది
అనుకోవచ్చు. అందుకే ఇలాంటి తిరుగుడుని ‘గురుత్వ భ్రమణం’ (gravity turn) అంటారు. ఈ దశలో
రాకెట్ వేగంలో గాని, గమన దిశలో గాని ఏవైనా తేడా వచ్చిందంటే రాకెట్ లో ఉండే ‘సంచాలక
మరియు నియంత్రణ వ్యవస్థలు’ (guidance and
control systems) రాకెట్ దిశకి కావలసిన సవరణలు చేసి రాకెట్ ని మళ్లీ నిర్ణీత దిశలోకి
తీసుకొస్తాయి.
(ఇంకా వుంది)
Image courtesy: ISRO
0 comments