1.
మరి
కట్టెల పొయ్యిలో ఊదినప్పుడు మంట ఎందుకు పెరుగుతుంది?
పైన
కొవ్వొత్తి ఉదాహరణలో ఇంధనం వత్తి అనే ఇరుకు దారి వెంట మంటని చేరుకుంటోంది. అక్కడ, వత్తి
కొసలో, అంటే ఆ ఒక్క చిన్న బిందువు వద్ద, మంటని పక్కకి ఊదేస్తే ఇక మళ్లీ మంట పుట్టదు.
మంటని ఊదినప్పుడు వత్తి కొస కాస్త చల్లబడుతుంది. కనుక ఇక మళ్లీ మంట పుట్టదు.
కాని
కట్టెల పొయ్యిలో ఇంధనం ఒక్క బిందువు వద్ద లేదు. కట్టె ఉపరితలం మొత్తం ఇంధనానికి మూలం.
కనుక ఊదినప్పుడు జరిగేది మంటని పక్కకి తొలగించడం కాదు. ఎందుకంటే అన్ని కట్టెల మీద మంటని
ఒకే సారి తొలగించడం జరగదు.
ఊదినప్పుడు
ఏర్పడ్డ వాయు ప్రవాహంలో పీడనం (pressure) తగ్గుతుంది.
దీన్నే వెంచురీ ప్రభావం (Venturi effect) అంటారు. దీన్ని అర్థం చేసుకోడానికి ఈ చిన్న
ప్రయోగం చెయ్యొచ్చు.
రెండు
పొడవాటి కాగితపు బద్దలని వేలాడుతున్నట్టుగా పట్టుకుని (చిత్రం) వాటి మధ్య నుండి ఊదాలి.
మనం ఉదిన గాలికి రెండు కాగితాలు దూరం అవుతాయి అనుకుంటాం. కాని నిజానికి దగ్గరికి వస్తాయి.
కాగితాలకి ‘బయట’ వైపు ఉన్న గాలి పీడనం, ‘లోపలి’ వైపు పీడనం కన్నా ఎక్కువ కావడం వల్ల
గాలి లోపలికి తోసుకొస్తుంది. కాగితాలు దగ్గర అవుతాయి.
http://woodgears.ca/physics/venturi.html
కనుక
కట్టెపొయ్యిలోకి గాలి ఊదినప్పుడు, చుట్టూ ఉన్న గాలి పీడనం కాస్త ఎక్కువగా ఉండడం వల్ల
చుట్టుపక్కల గాలి లోపలికి చొచ్చుకొస్తుంది. దాని వల్ల మరింత ఆక్సిజన్ కట్టెలకి లభ్యం
అవుతుంది. మంట వృద్ధి చెందుతుంది.
కట్టె
పొయ్యిలో ఊదినప్పుడు మరొకటి కూడా జరుగుతుంది. మండే కట్టే వల్ల బూడిద పుడుతుంది. ఆ బూడిద
పొయ్యిలోనే పేరుకుంటూ ఉంటుంది. కట్టె మీద బూడిద పేరుకుని కట్టె లోపలి ఇంధనానికి, బయట
ఉన్న ఆక్సిజన్ కి మధ్య ఓ నిరోధకపు తెరలాగా (insulating layer) ఏర్పడి అడ్డుపడుతూ ఉంటుంది. దీన్నే మనం కాస్త కవితా ధోరణిలో “నివురు గప్పిన
నిప్పు” అంటూ వుంటాం!
కొవ్వొత్తిలో
ఈ బెడద వుండదు. మైనం మండగా ఏర్పడ్డ అంశాలన్నీ ఆవిరై ఆ చుట్టుపక్కల లేకుండా తొలగిపోతాయి.
కనుక ఇంధనం యొక్క ప్రవాహం నిరంతరాయంగా మంట వద్దకి చేరుతూ ఉంటుంది. (మీబోటి నా బోటి
వాళ్లెవరైనా గట్టిగా ఊదేసి రసాభాస చేస్తే తప్ప!!!)
కట్టెల
మీదకి ఊదినప్పుడు ఆ బూడిద పైపూత తొలగిపోతుంది. లోపల వున్న వేడెక్కిన కట్టెకి, పైనున్న
ఆక్సిజన్ తో సంపర్కం ఏర్పడుతుంది. వంట కొనసాగుతుంది…
(కొసమెరుపు:
కట్టెపొయ్యి
చిత్రాల కోసం గూగుల్ లో దేవుళ్లాడుతుంటే దేవుళ్ళా ఈ వెబ్ సైట్ తారసపడింది.
ఆయనెవరో
మన కట్టెపొయ్యిల గొప్పదనాన్ని వేనోళ్లకొనియాడుతున్నారు. కట్టెపొయ్యిల వల్ల ఎన్నో “క్రిమికీటకాలు”
దూరంగా తొలగిపోయని అంటున్నారు. అక్కడితో ఆగక అంత గొప్ప పొయ్యిలని మనకి వారసత్వంగా ఇచ్చిన
మన ప్రాచీన భారత సంస్కృతిని గణుతిస్తున్నారు. హైందవ సంస్కృతికి, ప్రాచీన భారత సంస్కృతికి
జయ్యంటున్నారు.
కట్టెపొయ్యిల
నుండి వచ్చే పొగ వల్ల వచ్చే ఆరోగ్యసమస్యల గురించి కొంత సమాచారం!!!
)
సరిగ్గా చదివండి సర్ . కట్టెల పొయ్య మీద వండమని చెప్పలేదు ఆయన , మాడిన బియ్యపు వాసన గురించి చెప్పారు .