ఇప్పుడు విషయం
ఏంటంటే… ఎందుకో ఏమిటో అంతా వివరంగా తర్వాత చెప్తా గాను, మేం ప్రస్తుతం మావయ్య అనుకున్న
చోట లేము. ఆ సంగతి మాకు తరువాత అర్థమయ్యింది.
అసలు మేము సముద్రం యొక్క ఉత్తర తీరం లోనే లేము.
“పద మావయ్యా
అయితే. ఏవైనా కొత్త విషయాలు తెలుస్తాయేమో వెతుకుదాం,” మావయ్యని కాస్త ప్రోత్సహిస్తూ
అడిగాను.
హన్స్ తన పనిలో
నిమగ్నమై వుండగా మేం ఇద్దరం బయల్దేరాం. కొండలకి సముద్రానికి మధ్య బాగానే దూరం వుంది.
ఆ రాతి గోడని చేరుకోడానికి అరగంట పైగా పట్టింది. మా అడుగుల కింద ఎన్నో పురాతన గవ్వలు
నలిగి పగిలిపోతున్నాయి. కొన్నిగవ్వలు అంత పెద్దవంటే వాటి వ్యాసం పదిహేను అడుగులకి పైగా
ఉంటుంది. ప్లియోసీన్ జాతికి చెందిన ఏ గ్లిప్టోడాన్ లకో, లేక ఆర్మడిల్లో లకో అవి పై తొడుగులు అయ్యుంటాయి. ప్రస్తుతం మనం చూసే చిట్టే
తాబేలు ఆ బృహత్కాయాలకి మరుగుజ్జు ప్రతినిధి మాత్రమే *. ఇవి కాకుండా అక్కడి మట్టిలో
రాళ్లు చెల్లా చెదురుగా పడి వున్నాయి. ప్రవాహం యొక్క చిరకాల ప్రభావం చేత కాబోలు కొన్ని
రాళ్లు నునుపు దేలి వున్నాయి. మరి కొన్ని రాళ్లలో క్రమబద్ధమైన వరుసలలో గాట్లు కనిపిస్తున్నాయి.
దీన్ని బట్టి సముద్రం ఒకప్పుడు ఇక్కడి దాకా వచ్చి వుండేదని అర్థమవుతోంది. కఠిన శిల
మీద మిగిలిన కెరటాల పలుగాట్లు సముద్రపు సత్తాకి
ఆనవాళ్లుగా మిగిలాయి.
[* గ్లిప్టడాన్
లు, ఆర్మడిల్లో లు స్తన్యజీవులు. కాని తాబేలు సరీసృపం కిందకి వస్తుంది. జీవన వృక్షంలో
అవి వేరు వేరు శాఖలకి చెందినవి. కనుక వాటిని పోల్చడానికి వీలుపడదు. – ఆంగ్ల అనువాదకుడు]
భూగర్భంలో నలభై
కోసుల లోతులో సముద్రం ఉండడం ఆశ్చర్యమే. కాని ఇంతా లోతుకి పోతున్న కొద్ది ద్రవపదార్థం
అంచెలంచెలుగా అడుగంటి పోతుంది. అసలు ఈ సముద్రానికి మూలాలు కూడా పైనున్న మహాసముద్రాలలోనే
ఉంటాయని అనుకోక తప్పదు. పైన సముద్రాల అడుగున ఉన్న చీలికల లోంచి నీరు స్రవించి ఈ భూగర్భ
సముద్రాలని పుట్టించి ఉండొచ్చు. ఏదో ఒక దశలో ఆ చీలికలు పూడుకుపోయి వుండొచ్చు. ఈ భూగర్భ
సముద్రాలు కూడా భూమి కేంద్రంలో ఉండే వేడిమి వల్ల కాస్త ఆవిరై, ఇక్కడ మేం చూస్తున్న
మబ్బులని సృష్టించి ఉండొచ్చు.
ఈ విధంగా నాకు
తెలిసిన భౌతిక శాస్త్రాన్ని ప్రయోగించి చూసుకుంటే భూగర్భంలో మాకు కనిపించే వింతలన్నిటికీ
వివరణ దొరుకుతోంది. విషయం ఎంత జటిలం అయినా, ఎంత వింతగా కనిపించినా క్రమబద్ధంగా భౌతిక
శాస్త్ర నియమాలని ప్రయోగిస్తే అంతుబట్టనిది ఏదీ వుండదని నా నమ్మకం.
కరకు కంకర సందుల
లోంచి నెమ్మదిగా ముందుకు పురోగమిస్తున్నాం. సైలెక్స్, క్వార్జ్ స్ఫటికాలు దారి పొడవునా
పొదగబడి వున్నాయి. కాస్త ముందుకు వెళ్లాక ఓ విశాలమైన మైదానం ఎదురయ్యింది. ఎటు చూసినా
ఎముకలు కుప్పలుగా పడి వున్నాయి. అతి పురాతనమైన శ్మశాన వేదికలా వుందా ప్రదేశం. ఇరవై
యుగాలకి చెందిన అస్తికలు అక్కడ ధూళిలో పడి వున్నాయి. కను చూపు మేరకు ఆ ఎముకల గుట్టలు
తప్ప మరింకేమీ కనిపించడం లేదు. ఆ మూడు చదరపు మైళ్ల ప్రాంతం గత యుగాల జీవ జాతుల చరిత్ర
అంతా కళ్ళకి కట్టినట్టూ కనిపించింది.
ఈ వింతలన్నీ
చూస్తూ ఆనందించేటంత సహనం లేక వడి వడిగా ముందుకి నడిచాం. మా కాళ్ల కింద పడి పట పట మని
పగులుతున్న ఎముకల కోసం పైన ప్రపంచంలో మేటి మ్యూజియమ్ లు పడి చచ్చిపోతాయేమో. ఇక్కడ పడి
వున్న ప్రతీ ఎముకని పరికించి, దానికి చెందిన జీవం యొక్క రూపురేఖల్ని ఊహించడానికి కూవియే
లాంటి పండితులు కొన్ని వేల మంది కావాలేమో!
నేనైతే ఆ దృశ్యానికి
నిర్ఘాంతపోయాను. ఇక మామయ్య అయితే మళ్లీ పూనకంలోకి వెళ్లిపోయాడనే చెప్పాలి. ఆయన కళ్లలో
ఏదో అగ్గి రగులుతోంది. తను చూస్తున్నది నమ్మలేనట్టు తల అటు ఇటు ఊపుతున్నాడు. గతించిన,
వినష్టమైన మహా జీవాల అస్తిత్వానికి ఆనవాళ్లయిన అస్తికలు… ఒకటా రెండా… లెప్టోతీరియా,
మెరికోతీరియా, లోఫియోడియా, అనోప్లోతీరియా, మెగాతీరియా, మాస్టోడాన్ లు, ప్రోటోపితికే
లు, టీరోడాక్టిల్ లు … సంభ్రమం గొలిపించే వైవిధ్యం గల ప్రాచీన జీవ రాశులు.
కాని ఇంతలో మావయ్య
దృష్టిని ఏదో ఆకట్టుకుంది. వేగంగా రెండడుగులు ముందుకు వేసి ఓ ఎముక మీద చెయ్యిపెట్టాడు.
ఏదో చెప్పబోతుంటే తన కంఠం వణికింది.
“ఏక్సెల్! ఏక్సెల్!
ఇది మానవ కపాలం!”
“మానవ కపాలమా?”
గట్టిగా అరిచేశాను.
“అవును అల్లుడూ!
అవును! అయ్యా మిల్నే-ఎడ్వర్డ్స్ గారు, ద కాత్రఫాజ్ గారు ఇప్పుడేవంటారు?”
(ముప్పై ఏడవ అధ్యాయం
సమాప్తం)
లెప్టోతీరియా, మెరికోతీరియా, లోఫియోడియా, అనోప్లోతీరియా, మెగాతీరియా, మాస్టోడాన్ లు, ప్రోటోపితికే లు, టీరోడాక్టిల్ లు ...ఇన్ని రకాల జీవరాశులా!,ఏమిటీ పదజాలం!,నిజంగా అవే పేర్లను జీవశాస్త్రంలో కూడా వాడుతున్నారా? లేక రచయిత సృజనాత్మకతలోంచి పుట్టిన పదాలా?,వాస్తవంగా జరిగిన కథానుభూతిని కలిగిస్తున్నది,ఇంకా చెప్పాలంటే వాటిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి అభివ్యక్తీకరించినట్లున్నది.అమోఘంగా ఉందండీ!.
అవును. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చింది ఇదే. ప్రతీ పేజీలోను అపారమైన ప్రతిభ కనిపిస్తుంది. అలాగని ఓ టెక్స్ట్ బుక్ చదువుతున్నట్టు ఉండదు. ఎంతో ఆసక్తి కరంగా ఉంటుంది. జూల్స్ వెర్న్ మహాశయుడు అంత సవివరంగా రాశాడు గనుకనే గొప్ప వాస్తవికత ఉట్టిపడుతున్నట్టు ఉంటుంది. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ పుస్తకం 1864 నాటిది. ఆ నాటికే అంత విజ్ఞానాన్ని చొప్పిస్తూ అంత గొప్ప రచన చేశాడంటే నిజంగా రచయిత … అసామాన్యుడు. అది చదువుతుంటే … నవల అంటే ఇది, రచన అంటే ఇది… అనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో, ప్రతీ రంగంలో (సినిమాలు, టీవీ, నవలా సాహిత్యం…) mediocrity పెచ్చరిల్లుతున్న పరిస్థితుల్లో, ఇలాంటి తార్కాణాలు వ్యక్తుల ప్రతిభని సవాలు చేస్తాయని, ప్రమాణాలు పెంచుతాయని అనిపిస్తుంది.