ముప్పై
గంటల చదువు
పిల్లల్లో
స్వతహాగా చదవాలని బుద్ధి పుట్టాలంటే ఈ ‘సహాయం’ ఎంత కాలం అందివ్వాలని అడిగాను రాస్ముస్
ని. ఒక శాస్త్రవేత్తలా రాస్ముస్ తన ప్రయోగాల ఫలితాలని పదిలంగా నమోదు చేసుకుని క్రోడీకరించుకున్నాడు.
మొత్తం 30 గంటలకి పైగా ఏ పిల్లవాడూ తన వద్ద చదవలేదని రాస్ముస్
చెప్పాడు. సారెకు సగటున 20 నిముషాలు చొప్పున ఈ పఠనం కొన్ని నెలల పాటు సాగింది.
కొందరు అంత కన్నా తక్కువ సమయమే చదివారు. కొందరు అసలు ఎప్పుడూ చదవనేలేదు. ‘నై లిల్ స్కోల్’
లో చదివిన పిల్లలలో ఇంచుమించు అందరూ జిమ్నేషియమ్ (హై స్కూల్) కి వెళ్లారు. అక్కడ చదువు
చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ కూడా ‘నై లిల్ స్కోల్’ పిల్లలు బాగా రాణించారు. అంటే ఎలా
చదివినా, ఎంత చదివినా స్వతహాగా ముందుకొచ్చి చదివారు కనుక అందరూ మంచి చదువరులుగానే వికాసం
చెందారు.
ముప్పై
గంటల చదువు… ఈ ముప్పై అన్న సంఖ్య నాకు మరో చోట కూడా ఎదురయ్యింది. ఓ సారి ఒహోయోలో క్లీవ్లాండ్
నగరంలో ఓ వయోజన విద్యా కార్యక్రమానికి సలహాదారుగా వెళ్లాను. విద్యార్థుల వయసు ముప్పైకి
యాభైకి మధ్య ఉంటుంది. చాలా పేద వారు. వారిలో సగం మంది నీగ్రో జాతి వారు. చాలా మంది
అపలేషియా పర్వత ప్రాంతం నుండో, దక్షిణ అమెరికా
నుండో క్లీవ్ లాండ్ కి వచ్చినవారు. మొత్తం మూడు వారాల పాటు మూడు దఫాలుగా క్లాసులు జరిగాయి.
మొదటి దఫాలో ప్రతీ రాత్రి రెండు గంటలు, వారానికి ఐదు రోజుల చొప్పున అంటే మూడు వారాలుగా
ముప్పై గంటల పాటు క్లాసులు జరిగాయి.
పాఠాలకి
‘కాలెబ్ గాటిన్యో’ రాసిన ‘Words in colors’ (రంగుల్లో పదాలు) అనే పుస్తకంలో చెప్పబడ్డ
అభ్యుదయ పద్ధతిని (కొంచెం అతితెలివి పద్ధతి అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది) వాడడం జరిగింది.
సరిగ్గా వినియోగిస్తే ఈ పద్ధతి సత్ఫలితాలనే ఇస్తుంది. ఇందులో టీచరు పాత్ర ఎక్కువగా
ఉంటుంది. టీచరు గట్టివాడు కాకపోతే ప్రయోగం నీరుగారి పోతుంది. అసలు ఈ టీచర్లకి కూడా
కార్యక్రమానికి కొంచెం ముందే హడావుడిగా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో
టీచర్ల పని తీరు గమనించాను. చాలా మంది టీచర్లు ఈ పద్ధతిని నిపుణంగానే వాడారు అనిపించింది.
ఒకరిద్దరు
చాలా బాగా వాడారు. కొందరు విఫలులయ్యారు. అలాగే విద్యార్థుల్లో, క్లాసుల్లో కూడా వైవిధ్యం
కనిపించింది. కొన్ని క్లాసుల్లో మంచి ఉత్సాహం కనిపించింది. విద్యార్థుల్లో కూడా పట్టుదల
ఉత్సాహం ఉన్నవారు చాలా మంది వున్నారు.
ఇక్కడ
నేర్చుకున్నది ఆ తరువాత విద్యార్థులకి ఎంత వరకు ఉపయోగపడింది అన్న విషయం మీద ఏవైనా అనుసంధాన
అధ్యయనాలు జరిగాయో లేదో నాకు తెలీదు. ఏదైతేనేం. ఈ ముప్పై గంటల పఠనాభ్యాసంతో ఆ విద్యార్థులు
తమకి కావలసిన నైపుణ్యాన్ని, తమకి కావలసినంత మేరకు సంపాదించారని ఆ కార్యక్రమాన్ని చూశాక
నాకు గట్టి నమ్మకం ఏర్పడింది.
ఆ
రోజుల్లోనే పాలో ఫ్రయర్ అనే బ్రెజీలియన్ విద్యావేత్త గురించి విన్నాను. ఇతడు సంఘసంస్కర్త
కూడా. ఇతడు బ్రెజిల్ లో నిరుపేద ప్రాంతాల్లోని పల్లెటూళ్లలో రైతులకి చదవడం, వ్రాయడం
నేర్పించేవాడు. ఆ తరువాత ఆ దేశపు మిలిటరీ ప్రభుత్వం అతగాణ్ణి దేశం నుండి తరిమేసింది.
అది వేరే విషయం. ఈయన బోధించిన విద్యావిధానం ప్రత్యేకంగా ఉంటుంది. కొంచెం ఇలాంటి విద్యావిధానమే
సిల్వియా ఏష్టన్ తన “బ్రహ్మచారిణి,” “ఉపాధ్యాయిని” అన్న పుస్తకాలలో వర్ణించింది. అయితే
పాలో రూపొందించిన విధానం సిల్వియా చెప్పిన దానికి మరింత అభ్యుదయ (రాజకీయంగా విప్లవాత్మకమైనది
కూడా) రూపం అనుకోవచ్చు. రైతులకి రాజకీయ పరిస్థితుల గురించి చెప్తూ, వాటికి, వాటి కారణంగా
తాము ఎదుర్కుంటున్న సమస్యలకి మధ్య సంబంధం గురించి విడమర్చి చెప్పేవాడు. మరి మిలిటరీకి
నచ్చనిది సరిగ్గా అదే! తన సంభాషణలో తరచు దొర్లే పదాలని చదవడం, రాయడం నేర్పించేవాడు.
ఆ పేద రైతులు తమంతకి తాము చదువుకుంటూ పోవడానికి కేవలం 30 గంటల తర్ఫీదు చాలని అతడు కూడా గమనించాడు.
ముప్పై
గంటలు. అంటే స్కూల్లో ఒక వారం. చదవడం అనే ప్రక్రియ యొక్క పరిమాణం.
(ఇంకా వుంది)
0 comments