జాన్ హోల్ట్
రాసిన Learning all the time పుస్తకానికి అనువాదం
మొదలు.
అధ్యాయం 1
1.
చదవడం – వ్రాయడం
“ఈ
పుస్తకం నాది అని ఓ పుస్తకాన్ని తీసుకుని మనసుకి హత్తుకున్న నాడు కమలకి పుస్తక ప్రపంచంలోకి
ప్రవేశం దొరికింది. ఆ ప్రపంచంలో పౌరసత్వం లభించింది.”
చదవడానికి
కావలసింది నమ్మకం
ఒకసారి
నేను ఒకళ్లింటికి వెళ్లాను వాళ్ల బుల్లిపాపని చూద్దామని. ఆ పాపని చూసి కొన్నేళ్లయ్యింది.
ఇప్పుడు ఐదేళ్లు ఉంటాయేమో. అల్లంత దూరంలో నేను కనిపించగానే ఓ మారు నాకేసి ఎగాదిగా చూసింది.
‘పర్లేదు మంచివాడే,’ అనుకుంది కాబోలు కాసేపయ్యాక నా దగ్గరికి వచ్చి జట్టు కట్టింది.
‘నాకు చదవడం నేర్పిస్తావా?’ అనడిగింది. తన ఉద్దేశం అర్థం కాక సరే నన్నాను. డా॥ స్యూస్
రాసిన Hop on pop పుస్తకం తీసుకొచ్చి, నన్ను లాక్కెళ్లి, సోఫా మీద కూర్చోబెట్టి, నా
ఒళ్లో కూర్చుని పుస్తకం తెరిచి మెల్లగా, బిగ్గరగా చదవడం ఆరంభించింది. నాతో కూర్చుని
చదవాలంటే ముందు నాతో సాన్నిహిత్యం, స్నేహం అవసరం కాబోలు!
‘Lives
of children’ అనే పుస్తకంలో జార్జ్ డెన్నిసన్, జోసే అనే అనాథ పిల్లవాడితో తన అనుభవాలని
పేర్కొంటూ సరిగ్గా అదే అంటాడు. ఈ జోసే చదువూ సంధ్యా లేకుండా విచ్చలవిడిగా వీధుల్లో
తిరిగే కుర్రాడు. అలాంటి వాణ్ణి చదువుకోడానికి ఒప్పించడం ఎంతో కష్టం. ఆ పిల్లవాడితో
డెన్నిసన్ ఏకాంతంగా ఓ గదిలో సమావేశం అయ్యేవాడు. ఆ సమావేశాలు ఎంత లాభదాయకంగా ఉండేవో ఆ పుస్తకంలో ఇలా వర్ణిస్తున్నాడు డెన్నిసన్ –
“చదువు
విషయంలో మేం చెయ్యబోయే కృషికి మా మధ్య అనుబంధమే పునాది. మొదటి నుండే జోసేకి నా మీద
నమ్మకం కుదిరింది. ఇది చాలా మామూలు విషయంలా అనిపించినా ఆ నమ్మకం లేకుండా తన విషయంలో
ఏమీ సాధ్యం కాదని అనిపించింది…”
ఆ
నమ్మకానికి కారణం ఇదమిత్థంగా ఇదీ అని చెప్పలేకపోవచ్చు. కాని చదువు చెప్పేవాడి మీద అకారణంగా
కలిగే నమ్మకమే ఆ పిల్లవాడి చదువుకి శ్రీకారం చుడుతుంది. పునాది అవుతుంది.
ఐదేళ్ల
‘బాల మేధావి’కైనా, ఓనమాలు రాని పన్నెండేళ్ల వాడికైనా ఓ కొత్త పుస్తకం చదవాలంటే ఏదో
సాహస కృత్యం చేస్తున్నట్టే ఉంటుంది. ఓ అపరిచిత ప్రపంచం లోకి అడుగు పెడుతున్నట్టు ఉంటుంది.
భయమేస్తుంది! చదువుతుంటే తప్పులు దొర్లుతాయి. నాలిక పిడచకట్టుకుపోతుంది. సరిగ్గా చదవకపోతే
అవతలి వాళ్లు ఏమనుకుంటారో! మాస్టారు తిడితే ఎంత అవమానం. సిగ్గుతో చచ్చిపోవాలి. ఇలాంటి
మథనతో మొదలవుతుంది చదువు.
ఆ
సాహస యాత్రలో బయల్దేరాలంటే కొంత ప్రోద్బలం కావాలి. ధైర్యం కావాలి, నమ్మకం కావాలి. అన్నిటికన్నా
తప్పులు వస్తే కొంపలేం అంటుకుపోవన్న హామీ కావాలి. భద్రతా భావం కావాలి. కాని మామూలుగా క్లాస్ రూమ్ వాతావరణం
ఇందుకు అనుకూలంగా ఉండదు. తప్పు మాట్లాడితే తోటి విద్యార్థులు వెక్కిరిస్తారు. సరిదిద్దుతారు.
తెలిసో తెలీకో టీచరు కూడా ఈ వ్యవహారానికి మద్దతు నిస్తుంటాడు. దాంతో విద్యార్థికి క్లాస్
రూమ్ ఓ నరకంలా దాపురిస్తుంది.
కోపెన్హాగెన్
నగరం వద్ద ‘లిల్ నై స్కోల్’ (కొత్త బుల్లి బడి) అని ఓ బడి వుంది. దీని గురించి నా Instead
of school అనే పుస్తకంలో కూడా చెప్పడం జరిగింది.
ఇక్కడ చదవడానికి ప్రత్యేక విద్యాకార్యక్రమాలేవీ ఉండవు. పాఠ్యప్రణాళిక వంటిది ఏమీ ఉండదు.
క్లాసులు ఉండవు. అధ్యయన బృందాలు ఉండవు.
బోధన
ఉండదు. పరీక్షలు ఉండవు. ఏమీ ఉండవు. పెద్దల్లాగే పిల్లలు కూడా వాళ్లకి ఏం కావలిస్తే
అది, ఎప్పుడు కావలిస్తే అప్పుడు, ఎంత కావలిస్తే అంత, ఎవరి వద్ద కావలిస్తే వారి వద్ద
కెళ్ళి చదువుకుంటూ ఉంటారు. కాని అక్కడ పిల్ల లందరికీ తెలిసిన విషయం (అది కూడా ప్రకటిస్తూ
బోర్డులు ఉండవు, పిల్లలు వారి అంతకు వారే తెలుసుకుంటారు) ఏంటంటే, పిల్లలకి ఎప్పుడు
బుద్ధి పుట్టినా వాళ్ల ప్రియతమ టీచరైన రాస్ముస్ హాన్సెన్ ని అడిగితే చదువు చెప్తాడు.
ఈ రాస్ముస్ ఆజానుబాహువు. అతడిది కంచు గంటలా గంభీరమైన స్వరం. కాని మృదు భాషి. ఎన్నో
ఏళ్లు స్కూలు ప్రిన్సిపాలుగా పని చేశాడు. పిల్లలకి ఇతడంటే ప్రాణం.
ఓ
పిల్లవాడికో, పాపకో ఉన్నట్లుండి చదువు మీదకి గాలి మళ్లింది అనుకుందాం. ఓ పుస్తకం పట్టుకుని
ఆ పాప నేరుగా రాస్ముస్ వద్దకెళ్లి ‘నాతో కలిసి చదువుతావా?’ అని అడుగుతుంది. ‘ఓ యస్!’
అంటాడు రాస్ముస్. అలా మొదలవుతుంది వాళ్ల చదువు. ఇద్దరూ కలిసి రాస్ముస్ గదికి వెళ్తారు.
టీచరు పక్కనే కూర్చుని చదువు మొదలెడుతుంది పాప. ఈ వ్యవహారంలో పెద్దగా జోక్యం చేసుకుంటున్నట్టు
కనిపించడు రాస్ముస్. మధ్య మధ్యలో మ్రుదువుగా ‘వెరీ గుడ్, వెరీ గుడ్’ అంటుంటాడు. పాప
బెదుర్తోందని అనిపిస్తే తప్ప తప్పులు ఎత్తి చూపించడు. ఏదైనా పదం అడిగితే అది మాత్రం
చెప్పి ఊరుకుంటాడు. ఈ తంతు ఓ ఇరవై నిముషాలు సాగుతుంది. పాప చదువుకోవడం ఆపేసి పుస్తకం
మూసేసి హాయిగా మరో పన్లో పడిపోతుంది.
పైన
జరిగిన తంతుని ‘బోధన’, ‘శిక్షణ’ మొదలైన మాటలతో వర్ణించడం కొంచెం కష్టమే. పిల్లలకి చదవడం
నేర్పించడంలో మంచి శిక్షణ పొందిన వాడు రాస్ముస్. కాని తన ఎన్నో ఏళ్ల అనుభవంలో రాస్ముస్
చేసిన దేంటంటే తను నేర్చుకున్న శిక్షణా పద్ధతులన్నిటినీ ఒక్కొటొక్కటిగా వదిలిపెట్టడం.
పిల్లలకి కాస్తంత మద్దతు, చేయూత నివ్వడానికి మించి, మితిమీరిన ఉత్సాహంతో ఏం చేసినా
అది అనుకున్న ఫలితాలని ఇవ్వదన్న విషయం తన అనుభవంలో బాగా తెలుసుకున్నాడు రాస్ముస్.
(ఇంకా
ఉంది)
0 comments