ఈ సందర్భంలో నాకో సంఘటన గుర్తొస్తోంది.
ఆ సంఘటన గురించి నాకు చెప్పిన వ్యక్తి ఓ ప్రొఫెసరు. ఓ సారి ఇతడు తన శిష్యుడితో కలిసి
ఊరి బయట ఓ రోడ్డు మీద నడుస్తున్నాడు. అలా వెళ్తుంటే ఉన్నట్లుండి తన చిన్నప్పటి జ్ఞాపకాలు
వెల్లువలా తన్నుకొచ్చి తన మానసాన్ని క్రమ్ముకున్నాయి. వాళ్లు మాట్లాడుకుంటున్న మాటలకి
ఆ జ్ఞాపకాలకి ఏ సంబంధమూ లేదనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి ఏ చోటి నుండి అయితే ఈ
జ్ఞాపకాలు మొదలయ్యాయో ఆ చోటి వరకు నడుద్దామని తన శిష్యుడికి సూచించాడు ఆ ప్రొఫెసరు.
అలా వెనక్కి వెళ్తుంటే ఒక చోట అడవి బాతుల వాసన తగిలింది. తన చిన్ననాటి జ్ఞాపకాలకి కారణం
ఈ వాసనే అని ప్రొఫెసరు కి వెంటనే అర్థమయ్యింది.
ఇతగాడు తన చిన్నతనంలో అడవి బాతులు
ఉండే పొలాల మధ్య పెరిగాడు. ఇప్పుడు మర్చిపోయినా ఆ వాసన తన చిత్తం మీద గాఢంగా ముద్రపడిపోయింది.
మొదట ఆ దారిన పోతున్నప్పుడు ఆ వాసనని అతడు ఉపచేతనంగా అనుభూతి చెందాడు. ఈ ఉపచేతన సంవేదత
అతడి చిన్ననాటి జ్ఞాపకాలని బయటికి రప్పించాయి. ఆ సమయంలో ధ్యాస మరెక్కడో వుంది కనుక
ఈ వాసనని ఉపచేతనంగా మాత్రమే గుర్తుపట్టడం జరిగింది. ఆ వాసనలో ధ్యాసని మరల్చి సచేతనలోకి
ప్రవేశించగలిగేంత శక్తి లేదు. అయినా ఆ కాస్త ప్రేరణ కూడా ఎప్పుడో “మర్చిపోయిన” జ్ఞాపకాలని
వెలికి రప్పించింది.
ఏ విధంగా అయితే మామూలు మనుషుల్లో
ఓ దృశ్యం, ఓ శబ్దం, ఓ వాసన పాత జ్ఞాపకాలని వెలిక తీయగల హేతువు అవుతుందో, న్యూరాటిక్
రోగులలో అలాంటి “సంజ్ఞ” ఓ ట్రిగ్గర్ లా పని చేసి న్యూరాటిక్ లక్షణాలు వ్యక్తమయ్యేలా
చేస్తుంది. ఉదాహరణగా మంచి ఆరోగ్యం కలిగి, తన ఆఫీసులో చక్కగా పని చేసుకుంటున్న ఓ అమ్మాయినే
తీసుకుందాం. మరుక్షణమే ఏ కారణమూ లేకుండా ఆమె విపరీతమైన తలనొప్పి బాధతో చతికిలబడిపోయిందని అనుకుందాం. మరి కొన్ని ఇతర న్యూరాటిక్ లక్షణాలు కూడా అందుకు
వ్యక్తమయ్యాయి. ఏం జరిగిందని శోధిస్తే విషయం అర్థమయ్యింది. ఆమెకి తెలియకుండానే ఎక్కడో
దూరంలో ఓ ఓడ కూత విందామె. ఆ శబ్దం ఎప్పుడో తన ప్రియుడితో తెగిపోయిన బంధాన్ని గుర్తుకు
తెచ్చింది. మర్చిపోవాలనుకున్న చేదు జ్ఞాపకాలని మళ్లీ వెలికి తెచ్చింది. ఆ బాధామయ జ్ఞాపకాలే
తలనొప్పి తదితర భౌతిక లక్షణాలుగా అభివ్యక్తం అయ్యాయి.
మామూలు విస్మృతి కాకుండా, బాధామయ
జ్ఞాపకాలని “మర్చిపోయే” ప్రత్యేక సందర్భాలెన్నిటినో ఫ్రాయిడ్ వర్ణించాడు. అహంకారం అడ్డొచ్చినప్పుడు
స్మృతి దానంతకదే ఓడిపోతుంది అంటాడు నీషే. మనం మర్చిపోయిన జ్ఞాపకాలు, ఉపచేతనంగా ఉంటూ
పిలిచినా పైకి రాని జ్ఞాపకాలు, అలా ఉపచేతనంగా ఉండడానికి ఒక కారణం వుంది. అవి బాధామయ
జ్ఞాపకాలు, సచేతన స్థితితో పొత్తు కుదరని జ్ఞాపకాలు. వీటినే మనస్తత్వ శాస్త్రవేత్తలు
‘అణగ దొక్కిన అంశాలు’ (repressed contents) అంటారు.
ఈ సందర్బంలో ఓ సెక్రటరీ కథని
ఉదాహరణగా తీసుకుందాం. ఈమెకి తన బాస్ యొక్క స్నేహితులలో ఒకరంటే అసూయ. సమావేశాలకి అందరికీ
ఆహ్వానాలు పంపేటప్పుడు ఈ స్త్రీని పిలవడం అలవాటుగా
మర్చిపోతుంది. అయితే ఆమె వాడే ఆహ్వానితుల జాబితాలో ఈ స్త్రీ పేరు ఉంటుంది. ఎందుకా పొరబాటు
చేశావు అని నిలదీస్తే “మర్చిపోయా”ననో, లేక “పరధ్యానంగా” ఉన్నాననో చెప్తుంది. ఇక్కడ
ఆమె అబద్ధం చెప్తోందని కాదు. నిజం ఏంటో తనకి తాను కూడా ఆమె ఒప్పుకోదు.
(ఇంకా వుంది)
0 comments