కనుక అచేతనలో ఒక భాగంలో తాత్కాలికంగా
మరుగుపడ్డ ఆలోచనలు, అనుభూతులు, మనోచిత్రాలు దాగి వుంటాయి. అవి సచేతన నుండి కనుమరుగైనా
తెర చాటు నుండి సచేతన మీద ప్రభావం చూపుతుంటాయి. ఓ వ్యక్తి పరధ్యానంగా ఒక గది లోంచి
పక్క గదిలోకి వెళ్తాడు. తీరా ఆ గదికి వెళ్లేసరికి అక్కడికి ఎందుకు వచ్చాడో మర్చిపోతాడు.
నిద్రలో నడుస్తున్నట్టు చుట్టుపక్కన వస్తువులని తడుముకుంటాడు. తన లక్ష్యాన్ని మర్చిపోయాడు.
కాని అతడి అచేతనే అక్కడి వరకు అతణ్ణి తీసుకొచ్చింది. అంతలో లక్ష్యం జ్ఞాపకం వస్తుంది. అంటే అచేతనలో వున్నది సచేతనలోకి
పైకి తేలింది అన్నమాట.
ఓ న్యూరాటిక్ వ్యక్తి ప్రవర్తనని గమనిస్తే అతడు ఎన్నో పనులు సచేతనంగా, ఉద్దేశపూర్వకంగా
చేస్తున్నట్టు కనిపిస్తాడు. కాని తీరా వాటి గురించి అతణ్ణి అడిగితే వాటి పట్ల అతడు
అచేతనంగా ఉన్నట్లు తెలుస్తుంది. లేదా వాటి పట్ల అతడి ఎరుక మనం ఊహించిన దాని కన్నా చాలా
భిన్నంగా ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. అతడు వింటాడు గాని వినిపించుకోడు. చూస్తాడు గాని
గుర్తించడు, గుడ్డిగా ఉండిపోతాడు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఈ విషయాలు మనస్తత్వ శాస్త్రవేత్తలకి
సుపరిచితాలు. న్యూరాటిక్ వ్యక్తుల మనసుల్లోని అచేతన విషయాలు సచేతనంగా ఉన్నట్టు కనిపిస్తాయి.
అలాంటి వ్యక్తుల్లో ఆలోచన, భాష, చర్య సచేతనంగా ఉన్నాయో లేదో కచ్చితంగా చెప్పడం చాలా
కష్టం.
ఇలాంటి సందర్భాల బట్టే హిస్టీరియాతో
బాధపడుతున్న రోగులు చెప్పేదంతా అబద్ధం అని డాక్టర్లు కొట్టి పారేస్తుంటారు. నిజమే.
మనతో పోల్చితే వాళ్లు చెప్పే అసత్యాలు ఎక్కువే. అయితే వాటిని “అబద్ధాలు” అనడానికి వీల్లేదు.
ఎందుకంటే అవి పూర్తిగా సచేతనంగా అన్న విషయాలు కావు. వారి మనోస్థితి వల్ల వారి ప్రవర్తనలో
ఒక రకమైన అనిశ్చితి నెలకొంటుంది. ఎందుకంటే వారి అచేతన వారి సచేతన వ్యవహారాలలో కలుగజేసుకుని
అనూహ్యమైన విధంగా సచేతనని క్రమ్ముకుంటుంది. నిజానికి వారి స్పర్శానుభూతి లో కూడా ఈ
రకమైన ఆటుపోట్లు, అనూహ్యమైన మార్పులు కనిపించవచ్చు. హిస్టీరియా పేషెంట్ విషయంలో ఒక
సందర్భంలో చేతికి గుచ్చుకున్న సూది యొక్క స్పృహ కలగవచ్చు. కాని మరు క్షణం మళ్లీ గుచ్చితే
ఈ సారి సూది గుచ్చిన అనుభూతి కలగకుండా పోవచ్చు. అతడి ధ్యాస ఒక ప్రత్యేక బిందువు మీద
నిలపగలిగేలా చెయ్యగలిగితే తాత్కాలికంగా అతడి శరీరం మొత్తం మీద సంవేదన లేకుండా చెయ్యడం
సాధ్యమవుతుంది. అలా చెయ్యడం వల్ల ఏ గుప్త ఆందోళన వల్లనైతే అతడి సచేతనలో ఆ విధంగా చీకటి
క్రమ్ముకుంటోందో ఆ ఆందోళనని నయం చెయ్యవచ్చు, తొలగించవచ్చు. ఆ తరువాత ఇంద్రియాల సంవేదన
మునుపట్లా తిరిగొస్తుంది. కాని అంతవరకు మాత్రం అతడికి జరిగేదంతా అచేతనంగా మాత్రమే తెలుస్తుంటుంది.
ఈ వైఖరి అంతా నిపుణుడు పేషెంట్
ని హిప్నటైజ్ చేసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. పేషెంటు అచేతనంగా ఉన్నట్టు కనిపించినా
తనకి జరుగుతున్నదంతా వివరంగా తెలుసని తర్వాత నిర్ధారణ చేసుకోవచ్చు. సూదితో చేతి మీద
గుచ్చిన సంఘటన గాని, సచేతన ఆవరించబడ్డ స్థితిలో
డాక్టర్ అన్న మాటలు గాని - అన్నీ కచ్చితంగా
తరువాత పేషెంట్ కి జ్ఞాపకం వచ్చేలా చెయ్యొచ్చు. ఈ సందర్భంలో నాకో స్త్రీ పేషెంట్ సంగతి
గుర్తొస్తోంది. ఈ మహిళని పూర్తిగా అచేతనమైన స్థితిలో ఆసుపత్రిలో చేర్పించారు. మర్నాడు
తనకి స్పృహ వచ్చినప్పుడు తనెవరో తనకి గుర్తుంది గాని, తను ఎక్కడుందో, అక్కడికి ఎలా
వచ్చిందో, ఎందుకొచ్చిందో, అసలు ఆ రోజు తేదీ ఏంటో ఏమీ గుర్తులేదు. తరువాత తనని హిప్నటైజ్
చేస్తే తనకి అనారోగ్యం ఎలా కలిగిందో, ఆస్పత్రికి ఎలా వచ్చిందో, ఎవరు చేర్పించారో అన్నీ
చెప్పింది. ఆ వివరాలన్నీ నిజాలేనని వేరేగా నిర్ధారణ చేసుకోవచ్చు. ఆస్పత్రిలో కచ్చితంగా
ఎప్పుడు చేర్పించారో కూడా తనకి గుర్తుంది. ఆస్పత్రి లోకి వస్తున్నప్పుడు గోడ గడియారాన్ని
చూడడం ఆమెకి గుర్తు.
0 comments