శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

పాతాళంలో పురాతన జీవరాశులా?

Posted by V Srinivasa Chakravarthy Tuesday, July 31, 2012 0 comments


“ఏంటి నువ్వనేది?”

“ఇదుగో చూడండి” అంటూ పొరలు పొరలుగా అమరి వున్న సాండ్ స్టోన్, లైమ్ స్టోన్ శిలా స్తరాలని చూపించాను. నెమ్మదిగా స్లేట్ శిల యొక్క తొలి సూచనలు కనిపించడం కూడా చూపించాను.

“అయితే?”

“మొట్టమొదటి మొక్కలు, జంతువులు ఆవిర్భవించిన దశలో ఉన్నాం అంటాను.”

“కావాలంటే దగ్గర్నుండి చూడండి.”

లాంతరుని సొరంగం గోడలకి దగ్గరిగా పెట్టి చూడమన్నాను. మామయ్య అలాగే చూశాడు కాని ముఖంలో ఆశ్చర్యపు ఛాయలైనా లేవు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముందుకి నడిచాడు.

నేను అన్నది ఆయనకి అర్థం అయ్యిందా లేదా? అల్లుడు అన్న దాన్ని ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తోందా? తూర్పు దిశగా పోతున్న సొరంగాన్ని ఎంచుకున్నప్పుడు పప్పులో కాలేశానని ఒప్పుకొడానికి ఇబ్బందిగా వుందా? ఇంత జరిగినా ఈ సొరంగ మార్గం యొక్క అంతు వరకు పోవాలనే మంకు పట్టు వొదిలిపెట్టడా? ఈ దారి వెంట పోతే స్నెఫెల్ పర్వతం యొక్క మూలానికి చేరుకోలేమని ఆయనకి ఇప్పటికీ అర్థం కాలేదా?కాని ఆలోచించగా రాతి స్తరాలలో వచ్చిన ఈ మార్పులకి నేను మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానేమో నని నాకే సందేహం కలిగింది. బహుశ నేనే పొరబడ్డానేమో? కంకర రాతి పునాది మీద ఇవి కేవలం కొన్ని పొరలేనేమో?

నేను అనుకున్నదే నిజమైతే త్వరలోనే కొన్ని ఆదిమ జీవరాశులకి చెందిన శిలాజాలు కనిపించాలి. అప్పుడిక సందేహానికి తావు ఉండదు. చూద్దాం ఏం జరుగుతుందో.మరో నూరు అడుగులు వేశామో లేదో సందేహపు ఛాయలకు కూడా తావు ఇవ్వకుండా ఆధారాలు కనిపించసాగాయి. అనుమానం లేదు. ఎందుకంటే సైలూరియన్ దశలో సముద్రాలలో కనీసం పదిహేను వందల వృక్ష, జంతు జాతులు ఉండేవి. అంతవరకు కఠిన లావా నేల యొక్క స్పర్శకి అలవాటు పడ్డ నా పాదాలు ఉన్నట్లుండి శిధిలమైన పురాతన మొక్కలకి, గవ్వల ధూళిని తాకాయి. గోడలలో fucoids (ఒక విధమైన సముద్రపు నాచు), lycopodites (వినష్టమైనపోయిన ఒక వృక్ష జాతి) కి సంబంధించిన అవిస్పష్టమైన ముద్రలు కనిపిస్తున్నాయి.


http://www.marlin.ac.uk/habitatsbasicinfo.php?habitatid=356&code=1997#


కాని ప్రొఫెసర్ లైడెన్ బ్రాక్ మాత్రం ఈ అధారాలన్నీ చూసీ చూడనట్టు ధీమాగా ముందుకి పోతున్నాడు.ఎదురులేని మొండితనం అంటే ఇదేనేమో. ఇక ఉండబట్టలేక పోయాను. ఓ పరిపూర్ణంగా రూపొందిన గవ్వని తీసుకుని మామయ్య వద్దకి పరుగెత్తి చూపిస్తూ ఇలా అన్నాను –

“ఇదుగో చూడు మామయ్యా!”

“అదో క్రస్టేషియన్ జాతి జీవానికి చెందినది. ప్రస్తుతం వినష్టమైపోయిన జాతి. దాని పేరు ట్రైలోబైట్. అంతకన్నా మరేం లేదు,” అన్నాడు మామయ్య.

“అంతకన్నా మరేం లేదా?”

“వుంది. నువ్వు ఊహించిందే నిజం కావచ్చు. నేను పొరబడి వుండొచ్చు. కాని ఆ విషయంలో నాకు పూర్తి నమ్మకం కుదరాలంటే ఈ సొరంగం అంతం వరకు వెళ్లాలి.”

“మీ పట్టుదలని మెచ్చుకుంటాను. బాగానే వుంది. కాని పొంచి వున్న ప్రమాదాన్ని మీరు గమనించినట్టు లేదు.”

“ఏం ప్రమాదం?”

“నీటి కొరత.”

“దాందేవుంది. ఇక నుండి నీటిని పొదుపుగా వాడదాం.”(19 వ అధ్యాయం సమాప్తం)

జీవలోకపు నిర్మాణాలు

Posted by V Srinivasa Chakravarthy Sunday, July 29, 2012 0 comments


మానవుడు నిర్మించిన కృత్రిమ నిర్మాణాలకి మునుపే జీవలోకంలో ఎన్నో నిర్మాణాలు ఉద్భవించాయి. జీవలోకపు నిర్మాణాలకి ముందు ప్రకృతిలో ఏవో కొండలు, గుట్టలు తప్ప చెప్పుకోదగ్గ నిర్మాణాలేవీ లేవనే చెప్పాలి. జీవరాశి యొక్క ప్రప్రథమ దశలలో కూడా దాని మనుగడ కోసం ఏదో ఒక రకమైన నిర్మాణం అవసరం అయ్యింది. చుట్టూ ఉండే జీవరహిత పదార్థాన్ని, ప్రాణి లోపల ఉండే జీవపదార్థం నుండి వేరు చేస్తూ ఏదో ఒక విధమైన పాత్ర అవసరం అయ్యింది. ప్రాణిని బాహ్య ప్రాపంచం నుండి వేరు చేసే ఒక రకమైన తెర అవసరం అయ్యింది. ఆ తెరకి, లేదా పొరకి కొంత కనీస యాంత్రికమైన బలం ఉండాల్సి వచ్చింది. అప్పుడే బాహ్య శక్తుల ప్రభావానికి జీవపదార్థం చెక్కుచెదర కుండా ఉండేలా కాపాడుతుంది.ప్రప్రథమ జీవ రాశులు కేవలం నీటిలో అటు ఇటు తేలాడే ద్రవపు బిందువులలా ఉండేవేమో. ఆ ద్రవపు బొట్టు చుట్టూ ఉండే నీటిలో కలిసిపోకుండా కాపాడడానికి కేవలం తలతన్యత (surface tension) సరిపోయేదేమో. పరిణామ క్రమంలో నెమ్మదిగా జివరాశుల సంఖ్య పెరిగింది. ప్రాణుల సంఖ్య పెరుగుతున్న కొద్ది వాటి మధ్య పోటీ పెరిగింది. బలహీనమై, ముద్దలలా, నిశ్చేష్టమై పడి ఉండే జీవాలు ఆ పోటీలో నెగ్గలేకపోయి ఉండొచ్చు. చర్మాలు మరింత దళసరి అయ్యాయి, చలనానికి కావలసిన యంత్రాంగం ఏర్పడింది. ఆ విధంగా బహుళకణ జీవులు ఆవిర్భవించాయి. అవి కదలగలిగేవి, కొరకగలిగేవి, వేగంగా ఈదగలిగేవి. ఇలాంటి భయంకర పోటీ లోకంలో పాణులకి ఇక రెండే మార్గాలు – వేటాడడం లేదా వేటాడబడడం, భక్షించడం లేదా భక్షితం కావడం. ఈ పరిస్థితినే అరిస్టాటిల్ అల్లెలోఫేజియా అన్నాడు. అంటే పరస్పర భక్షణ. దీన్నీ డార్విన్ సహజ ఎంపిక (natural selection) అన్నాడు. ఇలాంటి పరిణామ లీలలో మనగలగడానికి మరింత ధృఢమైన శరీరాలు, మన్నికైన జీవపదార్థాలు, మరింత సమర్థవంతమైన, క్రియాశీలమైన దేహాంగాలు తప్పనిసరిగా అవసరం అయ్యాయి.ప్రప్రథమ జీవాల శరీరాలు సుతిమెత్తగా, ముద్దగా ఉండేవి. ఆ కారణం చేత అవి సులభంగా ఇరుకు ప్రదేశాలలో దూరగలిగేవి, వివిధ దిశలలో సుళువుగా విస్తరించగలిగేవి. కాని ఆశ్చర్యం ఏంటంటే మెత్తని ధాతువుల (soft tissue) లో ధృతి (toughness) ఎక్కువగా ఉంటుంది. గట్టిగా ఉండే వస్తువులు (ఉదాహరణకి ఎముకలు) పెళుసుగా ఉండి సులభంగా విరిగిపోతాయి.(మెత్తని శరీరం గల జెల్లీ ఫిష్)ధృఢంగా (rigid) ఉండే పదార్థాలతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. జీవవికాసానికి, జీవపునరుత్పత్తికి ధృడత్వం అడ్డుపడుతుంది. కానుపు సఫలం కావాలంటే ధాతువులో గణనీయమైన సాగతీత (strain) జరగాల్సి ఉంటుందని పిల్లలని గన్న తల్లులందరికీ తెలిసిన విషయమే. సకశేరుకాల పిండాలనే (vertebrate fetuses) తీసుకుంటే గర్భ ధారణ జరిగిన క్షణం నుండి అవి మెత్తని స్థితి నుండి మొదలై క్రమంగా గట్టిపడుతూ పోతాయి. శిశుప్రాణి పుట్టిన తరువాత కూడా ఆ గట్టిబడే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది.జీవపదార్థంలో ధృఢత్వం నెమ్మదిగానే అభివృద్ధి చెందుతూ వచ్చింది. నీట్లోంచి బయటికి వచ్చిన జంతువులు నేల పరిస్థితులకి అలవాటు పడసాగాయి. వాటి దేహాల పరిమాణం కూడా పెరగసాగింది. క్రమంగా అస్తిపంజరాలు, పళ్లు, కొమ్ములు, కొన్ని సార్లు కవచాలు కూడా, అభివృద్ధి చెందసాగాయి. ఆ విధంగా ధృఢంగా ఉండే అంగాలు జంతు శరీరాలలో పెంపొందినా శరీరం మొత్తం ధృఢంగా మారలేదు. మనిషి నిర్మించిన్ కృత్రిమ యంత్రాలకి జంతు శరీరాలకి మధ్య తేడా ఇక్కడే వస్తుంది. జంతు శరీరంలో మెత్తదనం, ధృఢత్వం అనే విరుద్ధ లక్షణాల సామరస్యమైన కలబోత కనిపిస్తుంది. మెత్తని భాగాలని తెలివిగా వాడుకోవడం వల్ల అస్తిపంజరం మీద అధికంగా భారం పడకుండా నివారించడానికి వీలవుతుంది. ఎముకలు గట్టిగానే వున్నా పెళుసుగా (brittle) ఉండడం వల్ల ఈ రకమైన ఏర్పాటు జంతు శరీరాలకి మరింత రక్షణ నిచ్చింది.జంతు శరీరాల్లో అధికశాతం మెత్తని పదార్థాలు, సులభంగా వంగే (flexible) పదార్థాలు ఉంటాయి గాని మొక్కల్లో పరిస్థితి వేరు. మొక్కలకి వేటాడాల్సిన పని గాని, వేటగాళ్ల నుండి పారిపోయే అవకాశం గాని లేవు. అయితే మరింత ఎత్తుకి ఎదిగి తమ భద్రతను పెంచుకోగలవు. ఎత్తుకి ఎదగడం వల్ల మరో లాభం కూడా వుంది. సూర్యరశ్మిలో, వర్షపు నీటిలో వాటికి అందే వాటా పెరుగుతుంది. బాగా ఎత్తైన చెట్లు కొన్ని 360 అడుగులు అంటే 110 మీటర్ల ఎత్తుకి కూడా ఎదుగుతాయి. మొక్క అందులో పదో వంతు ఎత్తుకి ఎదగాలన్నా దాని నిర్మాణంలో మూల భాగం గట్టిగా, తేలిగ్గా వుండాలి. ఇక్కడే మొక్కకి, చెట్టుకి మధ్య నిర్మాణంలో తేడా తెలుస్తుంది. ఈ తేడా నుండి ఇంజినీర్లు నేర్చుకోదగ్గ పాఠాలు ఉన్నో వున్నాయి.

ధృడత్వం, మెత్తదనం మొదలైన నిర్మాణానికి సంబంధించిన లక్షణాలన్నీ జీవపదార్థానికి ఎంతో ముఖ్యమైన లక్షణాలే అయినా జీవశాస్త్రవేత్తలు, వైద్యులు ఎంతో వాటి జోలికి పోకుండా ఊరుకున్నారు. ఈ భావాలకి సంబంధించిన పరిభాష, ఇంజినీరింగ్ గణితం మొదలైనవి వారికి గిట్టకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. కాని విచిత్రం ఏంటంటే జీవపదార్థానికి సంబంధించిన రసాయనిక విషయాల మీద అపారమైన శ్రధ్ధ చూపించే జీవశాస్త్రవేత్త, జీవ శరీరాల నిర్మాణానికి సంబంధించిన అంశాలని ఎందుకో నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. జీవరసాయనాల నిర్వహణలో, నియంత్రణలో ప్రకృతి ఎంత అపారమైన ప్రతిభ చూపిస్తుందో, జీవ నిర్మాణాల రూపకల్పనలో కూడా అంతే నిశితబుద్ధి చూపిస్తుంది. ఒక దాన్ని పట్టించుకుని మరో దాన్ని విస్మరించడం అవివేకం.

(ఇంకా వుంది)

మనం పోతున్నది పైకా కిందకా?

Posted by V Srinivasa Chakravarthy Saturday, July 28, 2012 1 comments

ఆఫ్రికా నడిబొడ్డులోనో, నవ్య ప్రపంచంలోనో (అమెరికా ఖండాలు) ప్రయాణించే యాత్రికులు, రాత్రి వేళ్లల విశ్రమించేటప్పుడు ఒకరికొకరు కాపలా కాస్తారని అంటారు. కాని మేం అలాంటి జాగ్రత్తలేవీ తీసుకోలేవు. జీవ ఛాయలే లేని ఈ పాతాళ బిలంలో ఇక క్రూర మృగాలకి తావెక్కడిది?


మర్నాడు ఉదయం లేచేసరికి అందరికీ మళ్లీ ఓపిక వచ్చి ఉత్సాహం పెరిగింది. మా యాత్ర మళ్లీ కొనసాగించాం. లావా ప్రవహించిన మార్గానే మళ్లీ ముందుకి సాగిపోయాం. మా చుట్టూ కనిపించే రాళ్ల జాతులని పోల్చుకోవడం కష్టంగా వుంది. మేం నడిచే సొరంగ మార్గం కిందికి జారకుండా నేలకి సమాంతరంగా పోతోంది. నిజం చెప్పాలంటే కొద్దిగా పైకి పోతున్నట్టు కూడా కనిపించింది. కాసేపు అయ్యాక వాలు పైకి వుందన్న విషయం నిస్సందేహం అయ్యింది. అలసట వల్ల నడక నెమ్మదించింది.

“ఏవయ్యింది ఏక్సెల్?” ప్రొఫెసర్ మామయ్య వెనక్కి తిరిగి అసహనంగా అడిగాడు.

“ఇక నా వల్ల కాదు మామయ్యా!” రొప్పుతూ జవాబు చెప్పాను.

“అదేంటి. ఇంత సులభమైన దారిలో మూడు గంటల నడకకే?”

“దారి సులభమే కావచ్చు. కాని చెడ్డ ఆయాసం వస్తోంది.”

“ఇందులో ఆయాసపడడానికి ఏవుంది? హాయిగా కిందకి నడవడమేగా?”

“కిందకి కాదు, పైకి.”

“పైకా?” ‘నీకేవైనా మతి పోయిందా?’ అన్నట్టు వుందా ప్రశ్న.

“సందేహమే లేదు. గత అరగంటలో వాలు పూర్తిగా మారిపోయింది. ఈ లెక్కన ఇంకాసేపట్లో ఐస్లాండ్ ఉపరితలాన్ని చేరుకుంటాం.”

నమ్మకం లేకపోయినా ఒప్పుకోక తప్పదన్నట్టు మామయ్య నెమ్మదిగా తల ఊపాడు. నేను సంభాషణ కొనసాగించడానికి ప్రయత్నించాను. ఆయన మరు మాట్లాడకుండా నడవమని సంజ్ఞ చేసి ముందుకి కదిలాడు. అలాంటి సమయంలో ఆయన మౌనం ఒకరమైన వికృత హాస్యంలా అనిపించింది.ఇక చేసేది లేక నా భారం భుజానికి ఎత్తుకుని ముందుకు కదిలాను. ముందు మామయ్య, మధ్యలో హన్స్, చివరిగా నేను. వెనకబడిపోతానేమో నని వేగంగా అడుగులు వేశాను. ఈ పాతాళపు సొరంగ జాలంలో తప్పిపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది.

మేం నడుస్తున్న దారి వాలు పైకి వుంటే లోలోన సంతోషించేవాణ్ణి. తిరిగి ఉపరితలానికి చేరుకుంటామని ఓ ఆశ. మళ్లీ నా బంగారు గ్రౌబెన్ ని తిరిగి కలుసుకుంటానన్న ఆలోచనకి ఈ సారి ఒళ్లు పులకరించింది.

మధ్యాహ్నాని కల్లా మేం నడుస్తున్న సొరంగం గోడల లక్షణంలో ఏదో తేడా కనిపించింది. గోడల మీద పడి ప్రతిబింబించే కాంతి క్షీణిస్తున్నట్టు అనిపించింది. లావా పై పూత పోయి కఠిన శిల ప్రస్ఫుటం అవుతోంది. గోడలలో శిలా పదార్థపు స్తరాలు కొన్ని చోట్ల నిలువుగాను, మరి కొన్ని చోట్ల వాలుగాను ఉన్నాయి. సిలూరియన్ శిలావ్యవస్థలో (*) సంక్రమణ దశలో ఉన్న రాళ్లని చూస్తున్నాం అని అర్థమయ్యింది.

(* ఓ సువిస్తారమైన శిలాజ జాతికి చెందిన స్తర శ్రేణికి సర్ రోడెరిక్ ముర్చిసన్ (Sir Roderick Murchison) ఇచ్చిన పేరు ఇది. అడుగున ఉన్న అశిలాజ జాతికి చెందిన slatychist శిలకి, పైనున్న ఎర్రని sandstone జాతి శిలకి మధ్యన ఉన్న స్తరాలివి. ష్రాప్ షైర్ సమీప ప్రాంతాలలో ఈ శిలావ్యవస్థ బాగా రూపొందింది. ఈ ప్రాంతాన్ని వెనకటికి సైల్యూర్ జాతికి చెందిన కరాక్టకస్ అనే రాజు పాలించేవాడు. అందుకే ఈ ప్రాంతానికి, ఇక్కడి శిలా వ్యవస్థకి ఆ పేరు వచ్చింది. – ఆంగ్ల అనువాదకుడు)


(నార్వేలో ఒక చోట సిలూరియన్ శిలా వ్యవస్థ - వికీ)

“అర్థమైపోయింది!” ఉత్సాహంగా అరిచాను. “ఇవన్నీ రెండవ కాలంలో ఏర్పడ్డ సాగర అవక్షేపాలే. ఈ షేల్, లైమ్ స్టోన్, సాండ్ స్టోన్ మొదలైనవి అన్నీ అలా ఏర్పడ్డవే. ప్రాథమిక గ్రానైట్ శిల నుండి దూరం అవుతున్నాం. హాంబుర్గ్ నుండి హానోవర్ మీదుగా లుబెక్ కి వెళ్లడం లాంటిదే ఇదీను.”

నా ఈ లోతైన పరిశీలనలన్నీ నాలోనే అట్టేబెట్టేసుకుంటే బావుండేదేమో. కాని భౌగోళిక శాస్త్రం పట్ల నా అభిమానం నా వివేకాన్ని అణిచేసింది. నా మాటలకి మామయ్య స్పందించాడు.

(ఇంకా వుంది)

డార్విన్ లండన్ కి తిరిగి రాక

Posted by V Srinivasa Chakravarthy Friday, July 27, 2012 0 comments


గత రెండేళ్ల మూడు నెలల కాలం నా జీవితం అత్యంత ప్రయాసతో కూడుకున్న దశ అని చెప్పగలను. ఆ దశలో అస్వస్థత వల్ల కొంత సమయాన్ని పోగొట్టుకున్నాను. ష్రూస్ బరీ, మాయర్, కేంబ్రిడ్జ్, లండన్ నగరాలలో కొంత కాలం మారి మారి జీవించాక చివరికి డిసెంబర్ 13 నాడు లండన్ లో స్థిరపడ్డాను. నేను సేకరించిన సామగ్రి అంతా అక్కడ హెన్స్లో రక్షణలో భద్రంగా వుంది. అక్కడ మూడు నెలలు మకాం పెట్టాను. నేను సేకరించిన రాళ్లని, ఖనిజాలని ప్రొ. మిల్లర్ చేత పరీక్ష చేయించాను.

నా యాత్రా పత్రికకి మెరుగులు దిద్దే ప్రయత్నం మొదలెట్టాను. ఇదంత పెద్ద సమస్య కాలేదు. ఎందుకంటే మూల ప్రతి ఎంతో శ్రధ్ధగా రాయబడింది. నేను చేయవలసింది అల్లా నా వైజ్ఞానిక ఆవిష్కరణలలో ఆసక్తికరమైన అంశాలని మరింత సంక్షిప్తరూపంలో ప్రకటించడమే. చిలీ దేశపు తీర రేఖ యొక్క ఉన్నతి గురించి నేను చేసిన పరిశీలనలకి సంబంధించిన, లయల్ సూచన ప్రకారం, భౌగోళిక సంఘానికి పంపాను. ఆ విశేషాలు Proceedings of Geological Society పత్రికలో (పేజీలు 446-449) 1838 లో అచ్చయ్యాయి.

1837 లో మార్చి 7 నాడు నేను లండన్ లో గ్రేట్ మార్ల్ బరో వీధికి మకాం మార్చాను. అక్కడే రెండేళ్లు, అంటే నా వివాహం అయినంత వరకు నివసించాను. ఈ రెండేళ్లలో నా యాత్రా పత్రిక పూర్తి చేశాను. భౌగోళిక సదస్సులో ఎన్నో సిద్ధాంత వ్యాసాలు చదివాను. ‘Geological Observations’ అనే పత్రికకి పంపడానికి ఓ సువిస్తారమైన వ్యాసాన్ని కూడా సిద్ధం చేశాను. బీగిల్ యాత్రలో కనుగొనబడ్డ జంతు శాస్త్ర విశేషాలు అన్న పుస్తకాన్ని ప్రచురణ కోసం సిద్ధం చేశాను. హులై 1 నాడు Origin of the Species అన్న గ్రంథ రచనకి పూనుకుని ఆ సందర్భంలో నా మొట్టమొదటి నోట్ బుక్ ని తెరిచాను. ఈ పుస్తక రచన గురించి ఎంతో కాలంగా ఆలోచిస్తున్నాను. మరో ఇరవై ఏళ్ల పాటు ఆ పుస్తక రచన సాగింది.

ఈ రెండేళ్లలో నేను కొంచెం సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం మొదలెట్టాను. ఆ కాలంలోనే చార్లెస్ లయల్ ని పలుమార్లు కలుసుకున్నాను. ఈయనలో ఓ మంచి లక్షణం ఇతరలు భావాల పట్ల ఇతడు కనబరిచే సద్భావన. నేను ఇంగ్లండ్ కి తిరిగొచ్చాక పగడపు దీవుల గురించి నా అభిప్రాయం గురించి ఆయనకి వివరించినప్పుడు ఆయన చూపించిన ఆసక్తి చూసి నాకు ఆశ్చర్యం తో పాటు ఎంతో సంతోషం కలిగింది. ఆయన మాటలు ఎంతో ప్రోత్సాహకరంగా అనిపించాయి. నా మీద ఎంతో ప్రభావం చూపించాయి. ఈ కాలంలోనే రాబర్ట్ బ్రౌన్ ని కూడా ఎన్నో సార్లు కలుసుకున్నాను. ఎన్నోసార్లు ఆదివారాలు ఉదయానే ఆయన ఇంటికి కాఫీకి అని వెళ్లేవాణ్ణి. ఆ సంభాషణలలో ఆయన పంచుకునే వైజ్ఞానిక అనుభవాల, నిశిత శాస్త్ర భావాల, పరిశీలనల విందుని ఆత్రంగా ఆరగించేవాణ్ణి. అయితే ఆయన మాటలు ఎప్పుడూ వైజ్ఞానిక సూక్ష్మాలకి సంబంధించినవై వుండేవి. ప్రగాఢ మైన మౌలికమైన విజ్ఞానిక సమస్యల మీద ఆయనెప్పుడూ వ్యాఖ్యానించేవాడు కాదు.

ఈ కాలంలోనే ఎన్నో సార్లు విశ్రాంతి కోసమని ఇరుగు పొరుగు ప్రాంతాలకి చిన్న చిన్న విహార యాత్రలు చేశాను. ఆ యాత్రలలో కాస్త సుదూరమైనది ‘Parallel roads of Glen Roy’ అనే ప్రాంతానికి (కింద చిత్రం) చేసిన యాత్ర. ఆ వివరాలన్నీ Philosophical Transactions అనే పత్రికలో ప్రచురించాను (1839, pages 39-82). అయితే ఈ పత్రం అంత గొప్పగా లేదని చెప్పడానికి సిగ్గు పడుతున్నాను. దక్షిణ అమెరికాలో తీర రేఖ యొక్క ఉన్నతి గురించి నేను చేసిన పరిశీలనల ప్రభావం నా మీద బలంగా వుంది. కాని ఈ సమస్య గురించి తదనంతరం అగాస్సీస్ తన ‘హిమానీనదం-సరస్సు’ సిద్ధాంతాన్ని (glacier-lake theory) ప్రతిపాదించాడు. ఆ దశలో నాకు తెలిసినంత వరకు మరో సిద్ధాంతం నిజం కావడానికి వీలు లేకపోయింది. కనుక సముద్రం యొక్క చర్య వల్ల ఆ ప్రాంతం అలా రూపుదేలింది అని నేను సిద్ధాంతీకరించాను. ఈ పొరబాటు నాకు ఓ మంచి పాఠం నేర్పింది. వైజ్ఞానిక రంగంలో ఎప్పుడూ ‘మినహాయింపు సిద్ధాంతం’ ని (మరో కారణం ఉండడానికి వీలు లేదు కనుక ఇదే సరైన కారణం కావాలి అనే వాదనా వైఖరి) నమ్మకూడదని అర్థమయ్యింది.

(wiki)


రోజంతా పరిశోధనలో మునిగి పనిచెయ్యడం కష్టం కనుక ఈ దశలో ఎన్నో రంగాలకి సంబంధించిన పుస్తకాలు చదివాను. కొన్ని తాత్విక గ్రంథాలు కూడా చదివాను. కాని అలాంటి పుస్తకాలు నాకు సరిపడవని అర్థమయ్యింది. ఈ దశలోనే వర్డ్స్ వర్త్, కోలెరిడ్జ్ కవుల కవిత్వం అంటే అపేక్ష పెరిగింది. ఆ కాలంలోనే (వర్డ్స్ వర్త్ రాసిన) ‘Excursion’ అనే కావ్యాన్ని సాంతం రెండు సార్లు చదివాను. అంతకు ముందు మిల్టన్ రాసిన ‘Paradise Lost’ కావ్యం నాకు అత్యంత ప్రియమైన కావ్యంగా ఉండేది. బీగిల్ యాత్రలో నేను ఒకే పుస్తకాన్ని తీసుకెళ్లడానికి వీలైనప్పుడు ఎప్పుడూ ఆ పుస్తకాన్నే తీసుకెళ్ళేవాణ్ణి.


(ఇంకా వుంది)


భౌగోళిక అధ్యయనాలు… భూగర్భంలో

Posted by V Srinivasa Chakravarthy Tuesday, July 24, 2012 0 comments

అధ్యాయం 19


భౌగోళిక అధ్యయనాలు… భూగర్భంలోమర్నాడు మంగళవారం, జూన్ 30. ఉదయం 6 గంటలకి అవరోహణ మళ్ళీ మొదలయ్యింది.

లావా ఏర్పరిచిన వాలు దారిని అనుసరిస్తూ కిందికి సాగిపోయాం. కొన్ని పాతకాలపు ఇళ్ళలో మెట్లదారికి బదులు ఈ రకమైన వాలుదారి కనిపిస్తుంటుంది. మధ్యాహ్నం 12:17 వరకు మా నడక సాగింది. అంతలో హన్స్ ఎందుకో ఠక్కున ఆగిపోయాడు. అతడి వెనకే మేమూ ఆగాం.

“అబ్బ వచ్చేశాం,” అన్నాడు మామయ్య. “పొగగొట్టం కొసకి వచ్చేశాం.”

నా చుట్టూ ఓ సారి చూశాను. అది రెండు దారులు కలిసిన కూడలి. రెండు దారులూ చిమ్మచీకటిగా ఉన్నాయి. రెండిట్లో ఏది తీసుకోవాలి. ఇదో సమస్య అయ్యింది.

నా ముందు, మా గైడ్ ముందు అయోమయంగా, అమాయకంగా కనిపించడం మామయ్యకి ఇష్టం లేదనుకుంటా. తూర్పు దిశగా పోతున్న సొరంగం కేసి చూపించాడు. ముగ్గురం ఆ మార్గాన ముందుకి సాగాం.

కాని నిజం చెప్పాలంటే ఆ మార్గాల ఎంపికలోని సందేహం తీరే మార్గమే లేదు. కనుక ఊరికే ఆలోచిస్తూ కూర్చునే బదులు నమ్మకంగా ఏదో ఒక దారిని ఎంచుకుని ముందుకి పోవడం మేలు.

ఇప్పుడు నడుస్తున్న దారికి అంత వాలు ఉన్నట్లు లేదు. పరిసరాలు కూడా ఎప్పుడూ ఒక్కలా లేవు. కొన్ని సార్లు పాతకాలపు గోథిక్ ఆలయాలలో (కింద చిత్రం) లాగా ఎత్తైన సహజ తోరణాలు దాటుకుంటూ పోయాం. ఈ సహజ తోరణాలు మధ్యయుగపు శిల్పులకి ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటాయేమో. కూసుమొన గల తోరణాల రూపకల్పన ఆలవాలంగా గల ఎంతో ఆలయసంబంధమైన కళాసృష్టికి ఈ సహజతోరణాలు స్ఫూర్తిని ఈయగలవు. ఓ మైలు ముందుకి నడిచాక సూది మొన కాకుండా రోమానెస్క్ సాంప్రదాయానికి చెందిన తోరణాలని పోలిన దీర్ఘవృత్తాకారపు తోరణాలు కనిపించాయి. అలాంటి చోట్ల బాగా కిందికి వున్న చూరు నుండి బలమైన స్తంభాలు కిందికి దిగడం కనిపించింది. మరి కొన్ని చోట్ల దారి మరీ ఇరుకై బీవర్ జంతువుల గూళ్లలా తయారయ్యింది. ఆ ఇరుకు దారుల్లోంచి ఎలాగే కష్టపడి దూరి ముందుకి సాగిపోయాం.

మా పరిసరాలు మరీ అంత వెచ్చగా ఏమీ లేవు. వద్దనుకున్నా నా ఆలోచనలు స్నెఫెల్ జ్వాలాముఖి విస్ఫోటం చెందుతున్న ఘడియలలో, ఇప్పుడిలా నిశ్శబ్దంగా ఉన్న మార్గంలో అప్పుడు సలసల కాగుతున్న లావా ప్రవహించిన తీరు మీదకి పోయేవి. అంతంతలేసి అగ్నికీలల కొరడా దెబ్బలకి ఈ పాతాళ మందిరం మారుమ్రోగిపోతుంటే, రగిలే గాలుల పిడికిటి పోట్లకి చుట్టూ గోడలు మూలుగుతుంటే… ఊహించుకుంటుంటేనే మా చుట్టూ ఉన్న గాలి మరింత వేడెక్కిన భావన కలుగుతోంది.కొంపదీసి ఈ ముసలి పర్వతం తన కుర్రతనం గుర్తొచ్చి మళ్లీ ఆ ‘నిప్పుతో చెలగాటం’ ఆరంభించదు కద!ఈ భయాలన్నీ మా ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ ముందు ఉంచదలచుకోలేదు. అసలు నా గోడు ఆయనకి అర్థమే కాదు. ఆయన మనసులో ఎప్పుడూ ఒక్కటే ఆలోచన – ముందుకి పోవడం! నడుస్తూ, జారుతూ, పాకుతూ, డేకుతూ అనంతమైన సహనంతో, పట్టుదలతో ఆయన అలా ముందుకి సాగిపోతుంటే అబ్బురపడకుండా ఉండలేం.సాయంకాలం ఆరు గంటలకల్లా దక్షిణ దిశగా రెండు లీగ్ లు నడిచాం. కాని నిలువు దిశలో పావు మైలు కూడా దాటి వుండం అనిపించింది.విశ్రమించే వేళ అయ్యిందని ప్రకటించాడు మామయ్య. అందరం మరు మాట్లాడకుండా ఏదో ఇంత తిని నిద్ర లోకి జరుకున్నాం.నిద్రపోడానికి ఆ రాత్రికి మేం చేసుకున్న ఏర్పాట్లు చాలా ప్రాథమికంగా ఉన్నాయి. అందరం తలా ఒక రైల్వే రగ్గులోకి దూరి దాన్ని చాపలా చుట్టచుట్టుకున్నాం. ఇక పెద్దగా చలి వెయ్యలేదు. ఆ దారే పోయే చిన్న చితక జీవాలు దండెత్తుతాయన్న భయమూ లేదు.

(ఇంకా వుంది)

ప్రతీ వస్తువు ఓ నిర్మాణమే

Posted by V Srinivasa Chakravarthy Saturday, July 21, 2012 1 comments

నిజజీవితంలో నిర్మాణాలు
బరువులని మోసేది ఏదైనా నిర్మాణమే. ఓ వంతెన, ఓ భవంతి, ఓ కొమ్మ, ఓ శరీరం – అన్నీ నిర్మాణాలే. నిర్మాణాలని విఫలమైతే ప్రమాదాలు జరుగుతాయి. ప్రాణనష్టం జరుగుతుంది. కనుక నిర్మాణాలు విఫలమైనా, విజయవంతం అయినా అవి మనుషుల జీవితాల మీద ప్రభావం చూపిస్తాయి. బరువులని సుస్థిరంగా నిలపగల నిర్మాణాలని రూపకల్పన చెయ్యడం, నిర్మించడం ఇంజినీర్ల పని. అలాంటి నిర్మాణాలు ఇంజినీర్లు ఎలా చేస్తారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. కాని ఇంజినీర్లు వారి వృత్తి రహస్యాల గురించి బయటి వారికి చెప్తున్నప్పుడు అదేదో చిత్రమైన పరిభాష వాడుతారు. అది సామాన్యులకి అర్థం కాని భాష. అది విన్నవారికి విషయం స్పష్టం కాకపోగా మరింత అయోమయంలో పడతారు. నిర్మాణాలతో మనం అందరం అనుక్షణం వ్యవహరిస్తుంటాం. అలాంటి ముఖ్యమైన వస్తువుల గురించి అయోమయమైన అవగాహన ఉండడం అంత హర్షనీయం కాదు.

ఆయుర్వేదంలో ఒక కథ వుంది. ఓ గురువు వద్ద ఓ శిష్యుడు ఆయుర్వేదం ఎన్నో ఏళ్ళు కష్టపడి చదివి పూర్తి చేసాడు. చివరికి ఓ పరీక్షని ఎదుర్కుని తన పాండిత్యాన్ని నిరూపించుకోవాల్సిన తరుణం వచ్చింది. గురువు ఓ చిత్రమైన పరీక్ష పెట్టాడు. చుట్టుపక్కల కొండలన్నీ వెతికి ఎలాంటి వైద్య ప్రయోజనం లేని మొక్క ఏదైనా ఉంటే తీసుకు రమ్మని పంపాడు గురువు. శిష్యుడు ఓ రెండు నెలల పాటు చుట్టుపక్కల కొండలన్నీ వెతికి వెతికి, కోరుకున్న మూలిక దొరక్క, విచారంగా ఆశ్రమానికి తిరిగొచ్చాడు. గురువుగారి ముందు మొహం వేలాడేసి ‘గురువుగారూ! నేను ఓడిపాయాను. బొత్తిగా వైద్య ప్రయోజనం లేని మొక్కే దొరకలేదు నాకు,” అన్నాడట. అందుకు ఆ గురువు శిష్యుణ్ణి కౌగిలించుకుని, “ఈ రోజుతో నీ చదువు పూర్తయ్యింది” అన్నాట్ట.

నిర్మాణాల గురించి తెలుసుకునే ముందు అసలు నిర్మాణం అంటే ఏంటి అని ఓ సారి ఆలోచించాలి. కాని ఆలోచించి చూడగా ఏది నిర్మాణం కాదు? అని ప్రశ్నించుకోవలసి వస్తుంది. మనకి కంటపడే ప్రతీ వస్తువు ఓ నిర్మాణమే, ఏదో విధంగా దాన్ని నిర్మాణంగా అన్వయించుకోవచ్చు. కావాలంటే మామూలుగా నిర్మాణాలు అని మనం అనుకోని వస్తువులు కొన్ని తీసుకుందాం. ఓ సెల్ ఫోన్ – కిందపడినా, భావావేశంలో గట్టిగా నొక్కినా, పెంపుడు కుక్క నాకినా పగిలిపోకూడదు, పాడైపోకూడదు. ఓ పుస్తకం – కాగితాలు సులభంగా చిరిగిపోకూడదు, కాండం నుండి సులభంగా ఊడి రాకూడదు. పుస్తకాన్ని ఓ బుక్ ర్యాక్ లో నిలబెడితే వంగిపోకూడదు. అరిటాకు విస్తరి – స్వయంగా ముల్లే వచ్చి మీద పడ్డా సర్రున చిరిగిపోకూడదు! ఈ ఉదాహరణల బట్టి నిర్మాణాలలో మనం కొన్ని ప్రత్యేక లక్షణాలు ఆశిస్తామని అర్థమవుతుంది.నిర్మాణాల గురించి మనం ప్రశ్నలు వేసేటప్పుడు భవనాలు, వంతెనలు ఎందుకు కూలిపోతాయి, యంత్రాలు, విమానాలు ఎందుకు పాడైపోతుంటాయి? మొదలైన సాంప్రదాయబద్ధమైన ప్రశ్నలు మాత్రమే అడగం. ఇలా కొన్ని సాంప్రదాయేతర ప్రశ్నలు కూడా అడుగుతుంటాం.

కీటకాలకి వాటి వాటి ఆకారాలు ఎలా సంతరించాయి?

ముళ్ల పొదలోకి ఎగురుతున్న గబ్బిలం ముళ్ళు గుచ్చుకుని రెక్కలు చిరిగిపోకుండా ఎలా జాగ్రత్త పడుతుంది?పెద్దవాళ్లకి వెన్నులో నొప్పి (back ache) ఎందుకు కలుగుతుంది?

కండరాలు ఎలా పని చేస్తాయి?

పక్షులకి రెక్కల్లో ఈకలు ఎందుకు ఉంటాయి?

అంగవైకల్యం గల పిల్లలకి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అందివ్వగలం?

గ్రీకు రాజు ఒడిసెస్ యొక్క వింటి నారిని సంధించడం ఎందుకంత కష్టం?

ప్రాచీనులు రథ చక్రాలని రాత్రి వేళల్లో ఎందుకు ఊడదీసి పెట్టేవారు?

గాలికి వెదురు బొంగు ఎందుకు ఊగులాడుతుంది?

గ్రీకుల పార్థెనాన్ మందిరం ఎందుకంత అందంగా ఉంటుంది?


జీవలోకపు సహజ నిర్మాణాల నుండి ఇంజినీర్లు ఏం నేర్చుకోగలరు? అలాగే వైద్యులు, జీవశాస్త్రవేత్తలు, కళాకారులు, పురావస్తు పరిశోధకులు ఇంజినీర్ల నుండి ఏం నేర్చుకోగలరు?నిర్మాణాలు ఎలా పని చేస్తాయి, ఎందుకు విఫలమవుతాయి అన్న ప్రశ్నలకి కారణాలు క్షుణ్ణంగా అర్థం కావడానికి ఎన్నో శతాబ్దాలు పట్టింది. నిర్మాణాలకి సంబంధించి మన పరిజ్ఞానంలో ఎన్నో ఖాళీలు గత శతాబ్దంలోనే పూరించబడ్డాయి. అలా నెలకొన్న పరిజ్ఞానం వల్ల నిర్మాణాల రూపకల్పనలో, వినియోగంలో దక్షత ఎంతో పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో నిజ జీవితంలో అందరికీ రోజూ ఎదురయ్యే నిర్మాణాల గురించిన పరిజ్ఞానం - కనీసం కొన్ని మౌలిక సూత్రాలు – కేవలం కొందరు నిపుణుల సొత్తు కాకూడదు. అవి అందరికీ తెలియాల్సిన విలువైన విషయాలు.(ఇంకా వుంది)

పదండి ముందుకు, ఇంకా లోతుకు

Posted by V Srinivasa Chakravarthy Wednesday, July 18, 2012 0 comments

నడవమనే కన్నా ముందుకు జారమని వుంటే సబబుగా ఉండేదేమో. ఇంత విపరీతమైన వాలు దారిలో ఇంచుమించు జారినట్టుగానే ముందుకు సాగాము. ఇటాలియన్ కవి వర్జిల్ ఒక చోట అంటాడు - facilis est descensus Averni అని. ‘ఇంత కన్నా నరకంలోకి దిగడం సులభం’ అని ఆ వాక్యానికి అర్థం. మా పరిస్థితి ఇంచుమించు అలాగే వుంది. మా దిక్సూచి స్థిరంగా దక్షిణ-తూర్పు దిశనే సూచిస్తోంది. అలనాటి లావాప్రవాహం అటు ఇటు చూడకుండా నేరుగా దూసుకుపోయింది అన్నమాట.
కాని లోపలికి పోతున్న కొద్ది ఉష్ణోగ్రత పెద్దగా పెరుగుతున్నట్టు అనిపించలేదు. కనుక డేవీస్ సిద్ధాంతానికి సమర్థింపు దొరికినట్టు అనిపించింది. ఈ విషయం గురించే ఎన్నో సార్లు థర్మామీటరు కేసి చూసి ఆశ్చర్యపోయాను. మరో రెండు గంటలు నడిచాక చూసుకుంటే ఉష్ణోగ్రత 10 C మాత్రమే వుంది. కేవలం 4 C పెరిగింది. అంటే మేం నిలువుగా కన్నా ఏటవాలుగా ముందుకి సాగుతున్నాం అన్నమాట. ఇక ఎంత లోతుకు వచ్చాం అని ఆలోచించుకుంటే వాలు తెలుసు కనుక, వేగం తెలుసు కనుక లోతు కూడా సులభంగా అంచనా వేసుకోవచ్చు. ప్రొఫెసర్ మామయ్య చాలా కచ్చితంగా ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు కొలుచుకుని నమోదు చేసుకుంటున్నాడు గాని ఆ వివరాలు ఎందుకో రహస్యంగా దాచుకుంటున్నాడు.రాత్రి ఎనిమిది అయ్యేసరికి ఆగమని సూచన ఇచ్చాడు మామయ్య. హన్స్ వెంటనే కింద చతికిలబడ్డాడు. పైన పొడుచుకొస్తున్న రాతికి లాంతర్లు తగిలించాడు. మేం ఉన్న ప్రదేశం ఏదో గుహలా వుంది. పుష్కలంగా గాలి వుందిక్కడ. పైగా కొన్ని సార్లు గాలి గుప్పు గుప్పున అలల లాగా ముఖానికి తగులుతోంది. ఇంత లోతులో వాతావరణ సంక్షోభం ఎలా సాధ్యం అనిపించింది. దానికి సమాధానం వెంటనే తట్టలేదు. అయినా ఇలాంటి ధర్మసందేహాల గురించి ఆలోచించేటంత ఓపిక లేదు. ఆకలి, నిస్సత్తువల వల్ల ఆలోచన మొద్దుబారిపోయింది. ఏకబిగిన ఏడుగంటలు దిగి వచ్చేసరికి తల ప్రాణాం తోకకి దిగింది. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని పరిస్థితి. అందుకే ఆగమని మామయ్య చేసిన సంజ్ఞ నాకు బాగా నచ్చింది. భోజన సామగ్రి అంతా హన్స్ ఓ చక్కని లావా బండ మీద అమర్చాడు. అందరం ఆవురావురని తిన్నాం. కాని నాకు ఒక్క విషయం మాత్రం మనసులో కొంత కంగారు పుట్టించింది. మేం తెచ్చుకున్న నీరు సగానికి వచ్చింది. భూగర్భ జలాల గురించి మామయ్య తెగ చెప్పాడు గాని మేం ఇంతవరకు అలాంటి భాగ్యానికి నోచుకోలేదు. ఈ విషయం గురించే ఆయన్న ఓ సారి కాస్త భయంభయంగా అడిగాను.“నీటి బుగ్గలు కనిపించ లేదని బుగులు పుడుతోందా?” అడిగాడు మామయ్య.“బుగులేంటి? చెడ్డ భయంగా వుంది. తెచ్చుకున్న నీరు మరో ఐదు రోజులకి మించి రాదు.”

“కంగారు పడకు ఏక్సెల్. మనకి కావలసినంత నీరు దొరుకుతుంది.” మామయ్య ధీమాగా అన్నాడు.

“అదే ఎప్పుడు అని అడుగుతున్నా.”

“ఈ లావా స్తరాన్ని దాటి పోగానే. ఇంత కఠిన శిలని ఛేదించుకుని నీరు పైకెలా తన్నుకొస్తుంది అనుకున్నావు?”

“బహుశ ఈ సొరంగం చాలా లోతుకి పోతుందేమో. మనం నిలువు దిశలో పెద్దగా పురోగమించలేదని అనిపిస్తోంది.”

“అలా ఎందుకు అనుకుంటున్నావు?” నిలదీశాడు మామయ్య.

“భూమి యొక్క పైపొర లో తగినంత లోతుగా పోయినట్టయితే గొప్ప వేడిమి ఎదురుపడాలి కదా?”

“అది నీ ఆలోచన ప్రకారం,” అన్నాడు మామయ్య. “నీ థర్మామీటర్ ఏం చెప్తోంది?”

“మహా అయితే 15 C ఉంటుందంతే. బయల్దేరిన దగ్గర్నుండి 9 C మాత్రమే పెరిగింది.”

“అయితే దీన్ని బట్టి నీకు తెలుస్తున్నది ఏంటి?”

“నాకు అనిపిస్తున్నది ఇది. కచ్చితమైన పరిశీలనల బట్టి భూమి లోతుల్లోకి పోతున్న కొద్ది ప్రతీ నూరు అడుగులకి 1 C పెరుగుతూ పోవాలి. స్థానిక పరిస్థితుల వల్ల ఈ వేగంలో కొద్దిగా సవరణలు రావచ్చు. మచ్చుకి సైబీరియాలోని యాకూట్స్క్ ప్రాంతంలో అయితే ప్రతీ 36 అడుగులకి ఉష్ణోగ్రతలో అంత మార్పు వస్తుంది. ఆ ప్రాంతపు రాళ్ల యొక్క ఉష్ణవాహక లక్షణాల బట్టి ఆ మార్పు ఆధారపడుతుంది. ఇలంటి మృత జ్వాలాముఖి యొక్క పరిసరాలలో అయితే ప్రతీ 125 అడుగులకి అంత ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీన్ని బట్టి మనం ఎంత లోతుకి వచ్చామో సులభంగా లెక్కెట్టేయొచ్చు.”

“ఇకనేం? లెక్కెట్టేసేయ్ అల్లుడూ!”

“ఓస్! ఇదెంత సేపు? 9 X 125 = 1125 అడుగుల లోతుకి వచ్చాం,” గర్వంగా సమాధానం ప్రకటించాను.

“బాగా చెప్పావ్.”

ఆయన స్పందనలో ఎక్కడో వెక్కిరింత కనిపిస్తోంది.

“ఏం కాదా?” ప్రతిఘటిస్తూ అడిగాను.

“నా అంచనాల ప్రకారం మన సముద్ర మట్టం కన్నా 10,000 అడుగులు కిందకి వచ్చాం.”

“ఏంటీ? అసలది సాధ్యమా?” అదిరిపోయి అడిగాను.

“సాధ్యం కాకపోతే అసలు అంకెలకి అర్థమే లేదు.”

ప్రొఫెసర్ మామయ్య అంచనాలు చాలా కచ్చితంగా ఉన్నాయి. మానవుడు అంతవరకు చేరుకున్న ప్రగాఢతమమైన లోతు కేవలం 6000 అడుగులు. ఉదాహరణకి కైరోల్ లోని కిట్జ్ బాల్ గనులు, బొహీమియా లోని వుటెన్ బోర్గ్ గనులు మనిషి చేరుకున్న అతి లోతైన ప్రాంతాలకి తార్కాణాలు. మేం అంతకన్నా ఎక్కువ లోతుకి వచ్చేశాం.

మరి లెక్క ప్రకారం ఉష్ణోగ్రత 81 C ఉండాలి. కాని ఎందుకో మరి 15 C కి మించి లేదు.

దీని గురించి కొంచెం లోతుగా ఆలోచించాల్సిందే.(పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం)
ప్రొ॥ జె. ఇ. గోర్డన్ ఆధునిక బయోమెకానిక్స్ (biomechanics), పదార్థ విజ్ఞాన (material science) రంగాల పితామహులలో ఒకరని చెప్పుకోవచ్చు.

1913 లో పుట్టిన ఈయన గ్లాస్గో విశ్వవిద్యాలయం నుండి నేవల్ ఆర్కిటెక్చర్ లో పట్టం పుచ్చుకున్నారు.

స్కాట్లాండ్ షిప్ యార్డ్ లలో పని చేస్తూ తొలిదశలలోనే ఓడల రూపకల్పనలో తన అసామాన్య నైపుణ్యం నిరూపించుకున్నారు. ఓడలు నిర్మించడమే కాక వాటిలో విస్తృతంగా ప్రయాణించి రూపకల్పనకి, ప్రవర్తనకి మధ్య సంబంధాన్ని లోతుగా అర్థంచేసుకున్నారు. సరైన పదార్థం + సరైన నిర్మాణం – ఈ రెండూ కలిస్తేనే మన ప్రయోజనం కోరుకున్న విధంగా నెరవేరుతుందని తెలుసుకున్నారు.

గోర్డన్ యొక్క అభిరుచులు ఇంజినీరింగ్ రంగానికే పరిమితం కాదు. సాహిత్య, కళా రంగాలలో కూడా ఈయన ఎంతో ఆసక్తి చూపించేవారు. సాంప్రదాయక సాహిత్యంలో అతడికి మంచి ప్రవేశం ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ నౌకాదళంలో పని చేసిన ఈయన, రాత్రిళ్లు తీరిక వేళల్లో స్వాధ్యాయం చేసి గ్రీకు భాష నేర్చుకున్నారు. ప్రాచీన సాహిత్యంతో ఆయనకి ఉండే పరిచయం ప్రాచీన సంస్కృతులలో వాడబడ్డ కవచాల మీద, వాటిలో వాడే పదార్థాల మీద ఆయన చేసిన అధ్యయనాలకి శ్రీకారం చుట్టింది.మానవ చరిత్రలో పదార్థాలకి ప్రబలమైన పాత్ర వుందని, కొత్త పదార్థాల ఆవిష్కరణ వల్ల చరిత్ర ఎన్నో ముఖ్యమైన మలుపులు తిరిగిందని ఆయన గుర్తించారు. రాబోయే కాలంలో పదార్థాల ప్రాబల్యం పెరుగుతుందని, వాటి ప్రాధాన్యత లోతుగా గుర్తించబడుతుందని, ఓ కొత్త “పదార్థ సంస్కృతి” ఆవిర్భవిస్తుందని ఆయన ముందే ఊహించారు. పదార్థాలకి, ప్రాచీన సంస్కృతులకి మధ్య ఉన్న సంబంధాన్ని బాగా గుర్తించిన గోర్డన్ ఈ రెండు విద్యావిభాగాలని కలుపుతూ ఓ కొత్త ఉమ్మడి విభాగాన్ని స్థాపించారు. ఆ విభాగం ఈ రెండు రంగాల్లో ఉమ్మడిగా పట్టం ప్రదానం చేస్తుంది. అయితే గోర్డన్ లాగా ఈ రెండు విభిన్న రంగాలని కలిపి జీర్ణించుకోగల సత్తా ఉన్న విద్యార్థులు అరుదు. కనుక ఈ విభాగం పెద్దగా రాణించలేదు.

గోర్డన్ పని చేసే కాలంలో పదార్థ విజ్ఞానం అంటూ ప్రత్యేకించి ఏమీ ఉండేది కాదు. నిర్మాణాలలో ఎక్కువ సాంప్రదాయబద్ధమైన పదార్థాలనే వాడేవారు. కనుక ఆ రోజుల్లో పదార్థ విజ్ఞానం లోహ విజ్ఞానం (metallurgy)తో సమానం. కాని గోర్డన్ నౌకానిర్మాణంలో ఆయన గడించిన అనుభవాన్ని ఉపయోగించి, నౌకా నిర్మాణంలో వాడే పదార్థాలని విమానాల రుపకల్పనలో వినియోగించే ప్రయత్నం ప్రారంభించారు. ఓడలలో వాడే చెక్క మాత్రమే కాకుండా ప్లాస్టిక్ మొదలైన సాంప్రదాయేతర పదార్థాలని యుధ్ధవిమానాలలో వినియోగించి ఎన్నో చక్కని ఫలితాలు సాధించారు.

ఆ కాలంలోనే గాలితో పూరించబడ్డ డింగీ (dinghy) అనబడే పడవల రూపకల్పనలో ఎంతో ప్రగతి సాధించారు. ఈ డింగీ అన్న పదం బెంగాలీ నుండి గాని, ఉర్దూ నుండి గాని వచ్చి వుంటుంది అంటారు (వికీ). ఈ చిన్న పడవలని యుద్ధ విమానాలు మోస్తాయి. అలాగే గాజు, కార్బన్, బోరాన్ మొదలైన పదార్థాలతో ప్రబలీకృత ఫైబర్ల (reinforced fibers) ప్రవర్తనని ఈయన అధ్యయనం చేశారు.

ఇంగ్లండ్ కి, ప్రపంచ పదార్థ వైజ్ఞానిక రంగానికి ఈయన చేసిన సేవలకి గుర్తింపుగా రాయల్ ఎయిరోనాటిక్స్ సొసయిటీ ఇతనికి రజత పతకం ఇచ్చి సత్కరించింది.ప్రొ. గోర్డన్ రాసిన పుస్తకాలలో రెండు మచ్చుతునకలు ఉన్నాయి. అవి –

1. Structures or Why things don’t fall down.

2. The New Science of Strong Materials or Why You Don't Fall Through the Floorఈ రెండు పుస్తకాలు ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి. పాపులర్ సైన్స్ సాహిత్యంలో ముఖ్యంగా పదార్థ విజ్ఞాన రంగంలో ఈ రెండు పుస్తకాలకి పోటీ లేవని చెప్పుకోవచ్చు. తన వైజ్ఞానిక జీవితం యొక్క చివరి దశల్లో రాయబడ్డ ఈ పుస్తకాలలో విస్తృతమైన తన అనుభవం యొక్క సారాన్ని పొందుపరిచారు. లోతైన వైజ్ఞానిక విషయాలని చర్చిస్తున్నా ఈ పుస్తకాలు భారంగా పాఠ్యపుస్తకాలలా కాకుండా సరదాగా చందమామ కథలలా సాగిపోతాయి. ఈ పుస్తకాల రచనలో ప్రాచీన సంక్కృతులతో, ప్రాచీన సాహిత్యంతో రచయితకి ఉన్న పరిచయం ఎంతో ఉపయోగపడింది. ఉదాహరణకి -గ్రీకు వీరుడు ఒడిసెస్ వాడిన వింటికి నారిని సంధించడం ఎందుకంత కష్టం?

ప్రాచీన గ్రీకులు రాత్రి వేళల్లో రధ చక్రాలని ఎందుకు ఊడదీసి పెట్టేవారు?

గ్రీకుల కాటపల్ట్ ఎలా పని చేస్తుంది?

పార్థెనాన్ మందిరం ఎందుకంత అందంగా ఉంటుంది?

విస్మయం గొలిపే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు గోర్డన్ పుస్తకాలని అందంగా అలంకరించి పాఠకులని పుస్తకాన్ని పక్కన పెట్టనివ్వకుండా చదివింపజేస్తాయి.గోర్డన్ రాసిన పుస్తకాలలో మొదటిదైన Structures నుండి కొన్ని విశేషాలని వరుసగా కొన్ని వ్యాసాలలో రాసుకొద్దామని ఉద్దేశం.References:

http://en.wikipedia.org/wiki/J.E._Gordon

http://press.princeton.edu/chapters/i8225.htmlకాంతులు చిందే స్ఫటిక సొరంగం

Posted by V Srinivasa Chakravarthy Friday, July 13, 2012 0 comments

ఇందాక మామయ్య తీసుకున్న పరిశీలనలలో చివర్లో కొలిచిన దిశ మా ఎదుట ఉన్న వాలు సొరంగానికి వర్తిస్తుంది.

“ఇక చూసుకో ఏక్సెల్,” మామయ్య ఉత్సాహంగా అన్నాడు. “ఇప్పట్నుంచి మనం నిజంగా భూగర్భంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ క్షణమే మన యాత్ర మొదలవుతుంది.”

ఆ మాటలంటూ మామయ్య అంత వరకు తన మెడకి వేలాడుతున్న రుమ్ కోర్ఫ్ పరికరాన్ని చేతిలోకి తీసుకున్నాడు. రెండవ చేత్తో ఆ పరికరానికి లాంతరలో ఉన్న చుట్టతీగకి మధ్య విద్యుత్ సంపర్కాన్ని కల్పించాడు. లాంతరు లోంచి పెల్లుబికిన కాంతి మా ఎదుట ఉన్న చీకటి దారిని ప్రకాశవంతం చేసింది.హన్స్ మోస్తున్న పరికరం కూడా అదే విధంగా వినియోగించబడింది. చుట్టూ ఎలాంటి ప్రమాదకర, జ్వలనీయ వాయువులు ఉన్నా ఈ అద్భుత విద్యుత్ పరికరం సహాయంతో ఎంతో సేపు కృతిమ కాంతి ఉత్పన్నం చేసుకోవచ్చు.“ఇక బయల్దేరదాం,” అన్న మాటలకి ముగ్గురం ముందుకు నడిచాం.ఎవరి భారం వాళ్లు మోస్తూ ముందుకు సాగాం. త్రాళ్లు, బట్టలు ఉన్న మూటని ఈడ్చుకుంటూ హన్స్ అందరి కన్నా ముందు నడిచాడు. ఇక చివరిలో నేనున్నాను. అందరం ఓ చీకటి ప్రాంగణంలోకి ప్రవేశించాం.చీకటి ప్రాంగణంలోకి అడుగుపెట్టే ముందు చివరిసారిగా ఓ సారి (మళ్ళీ అసలెప్పుడైనా చూస్తానో లేదో తెలీదు కనుక) ఆ పొడవాటి చీకటి సొరంగానికి అవతల కనిపించే చిన్న పాటి ఐస్లాండ్ ఆకాశపు తునకని ఆత్రంగా చూసుకుని ముందుకు అడుగేశాను.

1229 లో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటానికి పర్వత గర్భంలోని లావా ద్రవం ఈ సొరంగాన్ని ఏర్పరుస్తూ పైకి ఎగజిమ్మింది. సొరంగపు గోడల మీద దట్టమైన పొరలా ఏర్పడి దాని మీద ఎన్నెన్నో తళుకులు అలమింది. ఈ కృత్రిమ విద్యుత్ కాంతి ఆ గోడల మీద పడి ప్రతిబింబితమై కోటి కాంతులై ప్రజ్వరిల్లింది.

మేం నడుస్తున్న వాలు బాట మీద వేగంగా పోవడం పెద్ద కష్టం కాదు. సుమారు నలభై ఐదు డిగ్రీల వాలు ఉన్న ఈ సొరంగం లో వేగంగా ముందుకు జారకుండా నిలదొక్కుకోవడం కష్టం.మా కాళ్ల కింద మెట్లలా అనిపిస్తున్నదే మా నెత్తి పైన స్టాలాక్ టైట్ లుగా ఏర్పడింది. ఎన్నో చోట్ల సచ్ఛిద్రంగా ఉన్న లావా పొర ఎన్నో చోట్ల గోడలు బొబ్బలెక్కినట్టు చిప్పిల్లింది. రంగుదేలిన క్వార్జ్ స్ఫటికాల హంగులతో, నాజూకైన గాజు మాలికలతో, ఆ సహస్ర సుసంపన్న సుదీప వైభగం గల పరిసరాలలో మేం ముందుకు సాగిపోతుంటే ఒక్కసారిగా ఎవరో మంత్రం వేసినట్టు జేగీయమానం అవుతాయేమో నన్న ఆలోచనకి ఒళ్లు గగుర్పొడిచింది. భూగర్భంలో జీవించే ఏవరో పిల్ల దేవతలు ఈ భూవాసుల ఆగమనానికి ఆహ్వానంగా వేల దివ్వెలు వెలిగించినట్టు అనిపించింది.


http://www.freewebs.com/flash012/
“అబ్బ! ఎంత అందం!” ఆనందాన్ని పట్టలేక బయటికి అనేశాను. “ఈ దృశ్యం ఎంత బావుంది కదా మామయ్యా? ఈ లావా వన్నెల అందమే అందం. ఈ చివరలోని అరుణ ఛాయ ఆ చివరికి చేరేసరికి అతిసూక్ష్మంగా రూపాంతరం చెందుతూ పచ్చని పసిమిగా మారిపోతోంది కదూ? ఒక్కొక్క స్ఫటిక ఓ చక్కని కాంతి గుళికలా వుందేం?”“అవునా? అంత నచ్చిందేం అల్లుడూ?పోగా పోగా ఇంకా గొప్ప వైభవాలు చూస్తావు. పద పద. వేగంగా నడువు.”


(ఇంకా వుంది)

భూగర్భంలో రెండు వింతలు

Posted by V Srinivasa Chakravarthy Wednesday, July 11, 2012 0 comments

అధ్యాయం 18


భూగర్భంలో రెండు వింతలుమర్నాడు ఉదయం ఓ ఒంటరి రవికిరణం మమ్మల్ని మేలుకొలిపింది.

సొరంగంలోకి ఎలాగో చొచ్చుకొచ్చిన ఆ కిరణం గరుకైన లావా శిలల కోటి ముఖాల మీద పడి నలు దిశలా చిందడం వల్ల సొరంగం అంతా సున్నితమైన మెరుపులు కురిపించింది.

ఆ పాటి కాంతి సహాయంతో చుట్టూ ఉన్న వస్తువులని పోల్చుకోడానికి వీలయ్యింది.“ఏవంటావ్ ఏక్సెల్,” అన్నాడు మామయ్య మెల్లగా సంభాషణ మొదలెడుతూ. “కోనిగ్స్ బర్గ్ లో మన బుల్లి ఇంట్లో ఇంత ప్రశాంతంగా ఎప్పుడైనా ఉందంటావా? గుర్రపు బళ్ల చప్పుళ్లు, కూరల వాళ్ల కేకలు, పడవల వాళ్ల అరుపులు ఇవేవీ లేకుండా ఇంత హాయిగా, నిశ్శబ్దంగా…”

“ఈ నూతి లోతుల్లో నిజంగానే చాలా నిశ్శబ్దంగా వుంది. కాదనను. కాని ఎందుకో ఈ మౌనం భయంకరంగా అనిపించడం లేదూ?”

“చాల్చాల్లే ఊరుకో!” దబాయిస్తున్నట్టుగా అన్నాడు మామయ్య. “ఇప్పటికే ఇంత భయపడిపోతే ఇక ముందు ముందు ఎలా ఉంటావో? అసలైన భూగర్భంలోకి ఇంకా మనమొక ఇంచి కూడా పోలేదు.”

“అదేంటి అలా అంటున్నావ్?”

“అవును. ప్రస్తుతానికి మనం దీవిలో నేల మట్టానికి వచ్చాం. పైన అగ్నిబిలం నుండి మొదలైన ఈ నిలువు సొరంగం కింద సముద్రమట్టం వద్ద ఆగిపోతుంది.”

“కచ్చితంగా చెప్పగలవా మామయ్యా?”

“నిస్సందేహంగా. కావలిస్తే ఇదుగో ఈ బారోమీటర్ ని అడుగు.”

మేం సొరంగంలో కిందకి దిగుతుంటే వేగంగా పైకి లేచిన పాదరసం ఇరవై తొమ్మిది అంగుళాల గుర్తు వద్ద ఆగింది.

నిజానికి సముద్ర మట్టం వద్ద వాయు పీడనం కన్నా సొరంగం లో పీడనం ఎక్కువైతే ఇక ఈ బారోమీటర్ పని చెయ్యదు.

“బాగేనే వుంది గాని,” మరో కొత్త భయం పుట్టి అడిగాను, “లోపలికి పోతున్న కొద్ది పీడనం పెరుగుతూ పోతే మనకి ఏ ఇబ్బందీ ఉండదా?”

“ఉండదు. ఎందుకంటే మనం చాలా నెమ్మదిగా కిందకి దిగుతాం కనుక మన ఊపిరితిత్తులు పరిసరాల పీడనానికి అలవాటు పడిపోతాయి. విమాన యానం చేసేటప్పుడు పైన గాలి పలచన అవుతుంది కనుక శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది.* కాని మనకి ఆ సమస్య లేదు. కనుక పద ఆలస్యం చెయ్యకుండా చకచక ముందుకి సాగిపోదాం. ఇందాక మనం కింద పడేసిన మూట ఎక్కడుంది?”

(*ఈ పుస్తకం రాయబడ్డ కాలానికి (1864) విమానాలు లేవన్న సంగతి గమనించాలి. – అనువాదకుడు.)ముందు రోజు సాయంత్రం ఆ మూట కోసమే వృధాగా వెతికాం. మామయ్య హన్స్ ని అడిగాడు. వేటగాడికి ఉండే నిశితదృష్టితో కాసేపు వెతికిన హన్స్,

“డెర్ హుప్పె” అన్నాడు.

“అదుగో పైన.”

నిజంగానే పైనే ఉంది ఆ మూట. మేం ఉన్న చోటికి ఓ నూరు అడుగులు పైన పొడుచుకొస్తున్న ఓ రాతికి తగులుకుంది ఆ మూట. అనడమే ఆలస్యంగా ఆ ఐస్లాండ్ వాసి పిల్లిలా సొరంగపు గోడలు ఎగబ్రాకి కొద్ది నిముషాలలోనే మూటతో తిరిగొచ్చాడు.

“రండి టిఫిన్ చేద్దాం. అయితే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇంకా ఎంత దూరం వెళ్లాలో తెలీదు.”

ఓ బిస్కట్టు, కాస్త మాంస రసం, దీంతో పాటు కాస్త జిన్ కలిపిన నీరు తాగి దాంతోనే కడుపు నిండింది అనుకున్నాం.

ఫలహారం పూర్తయ్యాక మామయ్య జేబులోంచి ఓ చిన్న పాకెట్ నోట్ బుక్ తీశాడు. వైజ్ఞానిక పరిశీలనలు నమోదు చేసుకోవడానికి వాడే పుస్తకం. తన పరికరాలని ఓ సారి సంప్రదించి తన నోట్ బుక్ లో ఇలా రాసుకున్నాడు.

“జులై 1. సోమవారం.”

“సమయ మానిని – 8:17 ఉ. బారోమిటర్ - 29.7 ఇంచిలు; థర్మామీటర్ – 6 C (43 F); దిశ – తూర్పు/దక్షిణ-తూర్పు.”

(ఇంకా వుంది)


సురేష్ కొసరాజు, మంచిపుస్తకం ప్రచురణలు,

సౌరశక్తి చరిత్రని ఎంతో ఆసక్తి కరంగా వర్ణించే కార్టూన్ పుస్తకం...
ప్రచురణ -  సురేష్ కొసరాజు, మంచి పుస్తకం పబ్లిషర్స్.
kosaraju.suresh@gmail.com


postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email