అది పర్యాటక యుగం. ఉత్సాహవంతులైన పర్యాటకులు ప్రపంచం నలుమూలలకి ప్రయాణించి కొత్త కొత్త ప్రాంతాలని ఆవిష్కరించిన కాలం అది. ఆ కాలంలోనే పర్యాటకులకి ఎంతో ముఖ్యమైన ఓ కొత్త పరికరం కనుక్కోబడింది. అదే దిక్సూచి. దిక్సూచి సహాయంతో ఆఫ్రికా తీరం మొత్తం గాలించడానికి వీలయ్యింది. 1497 లో ఆ ఖండం యొక్క దక్షిణ కొమ్ము చుట్టూ ప్రయాణించడానికి వీలయ్యింది. ఇండియాకి సముద్ర మార్గం కనుక్కోబడింది. మహ్మదీయ ప్రాంతాలతో సంబంధం లేకుండా యూరప్ నుండి తూర్పు ప్రపంచాన్ని చేరుకోడానికి కొత్త మార్గాలు దొరికాయి. ఇది కాకుండా 1492-1504 నడిమి ప్రాంతాల్లో క్రిస్టఫర్ కొలంబస్ ఎన్నో సాహసోపేతమైన యాత్రలు చేసి ప్రపంచం యొక్క ఓ కొత్త ముఖాన్ని చూశాడు. (అయితే ఆ విషయాన్ని అతనే ఎప్పటికీ ఒప్పుకోలేకపోయాడు.)
ఆ విధంగా క్రమంగా గ్రీకు తాత్వికులకి తెలీని ఎన్నో కొత్త కొత్త విషయాలని యూరొపియన్లు కనుక్కోగలిగారు. గ్రీకులకి తెలీంది లేదని అంతవరకు యూరొపియన్లకి వాళ్ల పట్ళ ఉన్న ఆరాధనాభావం క్రమంగా సన్నగిల్లసాగింది. సముద్రయాత్రలలోనే కాక యూరొపియన్లు క్రమంగా ఎన్నో ఇతర రంగాల్లో తమ ఆధిక్యతను నిరూపించుకున్నారు. కనుక తమ పూర్వీకుల పట్ల, వాళ్ల ప్రతిభ పట్ల యూరొపియన్లకి ఉండే అచంచల భక్తి నెమ్మదిగా క్షీణించసాగింది. తమ ప్రాచీనుల భావాలని, బోధనలని ప్రశ్నించడం మొదలెట్టారు.
ఈ పర్యాటక యుగం లోనే జర్మన్ శాస్త్రవేత్త యోహాన్ గుటెన్బర్గ్ (1397-1468) మొట్టమొదటి ముద్రణ యంత్రాన్ని నిర్మించాడు. అవసరమైతే దాని విడి భాగాలని వేరు చేసి మరో చోట తిరిగి కూర్చే వీలు ఉండేలా ఆ యంత్రాన్ని నిర్మించాడు. అలాగే ఎలాంటి పుస్తకాన్నయినా ముద్రించే వీలు కల్పించాడు. మొట్టమొదటి సారిగా పుస్తకాలని భారీ ఎత్తులో, చవకగా తయారుచెయ్యడానికి వీలయ్యింది. లిఖిత పద్ధతిలో ప్రతులు తయారుచేస్తే దొర్లే దోషాలు ఈ ముద్రణ పద్ధతిలో రాకపోవడం కూడా ఓ విశేషం. (అయితే టైప్ సెట్టింగ్ లో దోషాలు వచ్చే అవకాశం ఉంది. అది వేరే సంగతి).
(సశేషం…)
మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
శి. రా. రావు
సంక్రాంతి లక్ష్మి _శిరాకదంబం
శి.రా. రావు గారు,
మీకు మీ పరివారానికి కూడా మనఃపూర్వక పండగ శుభాకాంక్షలు.