శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

కాంతి కిరణం - కాంతి పుంజం

Posted by V Srinivasa Chakravarthy Tuesday, November 29, 2011 0 comments










కాంతి కిరణం (Light ray)- కాంతి సరళ రేఖా మార్గాలలో ప్రయాణం చేస్తుందని మనకి తెలుసు. ఒక కాంతి జనకం నుండి వచ్చే కాంతి కిరణం సరళ రేఖలో ప్రయాణిస్తుంది. చిత్రం (**)లో కిరణాన్ని ఓ సరళ రేఖతో సూచిస్తాం. కాంతి ప్రయాణించే దిశని బాణంతో సూచిస్తాం.





కాంతి పుంజం (light beam) - ఎన్నో కిరణాల కట్ట లాంటిది కాంతి పుంజం. వాస్తవంలో ఆదర్శవంతమైన కాంతి కిరణం అనేదే లేదు. ఉన్నవి కాంతి పుంజాలు మాత్రమే. కాంతి పుంజం బాగా సన్ననిదైతే దాన్నే కాంతి రేఖ, లేదా కాంతి కిరణం (light ray) అనుకోవచ్చు.









ఎన్నో సందర్భాల్లో వాస్తవ ప్రపంచంలో మనం కాంతి పుంజాలని చూడొచ్చు. ఉదాహరణకి మబ్బుల్లోంచి భూమి మీద పడుతున్న సూర్య కాంతి పుంజం, అందులోని కిరణాలు…


















కాంతి పుంజం – వాస్తవ జీవితంలో దాని ప్రయోజనాలు


1. లైట్ హౌస్ - సముద్రం మీద ప్రయాణించే నౌకలకి లైట్ హౌస్ నుండి వెలువడుతున్న కాంతి పుంజం చీకట్లో తీరం యొక్క ఉన్కిని తెలిపుతుంది. లైట్ హౌస్ లో ఓ పెద్ద బల్బ్ నుండి వచ్చే కాంతి మామూలుగా అయితే అన్ని దిశలలోను వ్యాపిస్తుంది. ఆ కాంతిని అద్దాలతో కేంద్రీకరించి ఒక పుంజంగా మార్చి, ఒక ప్రత్యేక దిశలో కేంద్రీకరిస్తారు. అందుచేత పుంజంలో కాంతి తీక్షణం అవుతుంది. ఆ కాంతి ఎంతో దూరం నుండి కూడా కనిపిస్తుంది.



2. సినిమా ప్రొజెక్టర్.
ప్రొజెక్టర్ లోంచి వచ్చే కాంతిని ఒక పుంజంగా కేంద్రీకరించడం వల్లనే తెర మీద పడే చిత్రం ప్రస్ఫుటంగా ఉంటుంది.









3. వాహనాల హెడ్ లైట్ల కాంతి

వాహనాల హెడ్ లైట్ల లోంచి కాంతి పుంజంలా వెలువడుతుంది. బయటి పరిస్థితుల బట్టి ఆ పుంజం యొక్క దిశని మార్చుకుంటూ ఉండాలి.
బయట ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో, పుంజం కిందికి, అంటే కాంతి రోడ్డు మీద, వాహనానికి దగ్గరగా పడేలా, హెడ్ లైటు వేసుకోవాలి. దీన్నే ‘లో బీమ్’ అంటాం.

లో బీమ్


పొడవాటి ఖాళీ రోడ్ల మీద చీకట్లో వాహనాన్ని నడిపిస్తున్నప్పుడు కాంతి వాహనానికి దూరంగా, రోడ్డు మీద ఎక్కువ దూరం కనిపించేలా హెడ్ లైటు వేసుకోవాలి. దీన్నే ‘హై బీమ్’ అంటాం. హై బీమ్ వేసినప్పుడు కొన్ని సార్లు సుమారు నూరు మీటర్ల దూరం వరకు కూడా రోడ్డు కనిపిస్తుంది. అయితే ఎదురుగా వ్యతిరేక దిశలో వాహనాలు వస్తున్నప్పుడు, మనం వేసిన హై బీమ్ అవతలి వారి కంట్లో పడొచ్చు. వారికి కళ్లు బైర్లు క్రమ్మి మన వాహనం యొక్క రూపురేఖలు సరిగ్గా కనిపించకపోవచ్చు. అటువంటప్పుడు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కనుక అవతలి నుండీ వాహనాలు వస్తున్నప్పుడు మాత్రం ఒక సారి హై బీమ్ నుండి లో బీమ్ కి మార్చుకుని, వాహనం దాటిపోగానే తిరిగి హై బీమ్ వేసుకోవచ్చు. ఈ నియమాలన్నీ ఉన్నా, దురదృష్టవశాత్తు, మన దేశంలో ఎంతో మంది డ్రయివర్లు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో కూడా హైబీమ్ వాడుతూ ప్రమాదకర పరిస్థితులకి దారి తీస్తుంటారు.


(ఇంకా వుంది)



అధ్యాయం - 13
ఆర్కిటిక్ వృత్తం వద్ద మజిలీ (పాతాళానికి ప్రయాణం - 36)




అది రాత్రి కావలసిన సమయం. కాని 65 అక్షాంశ రేఖ వద్ద నడిరేయి ధృవకాంతిలో లోకం అంతా తేటతెల్లంగా కనిపిస్తోంది. జూన్, జులై నెలలలో ఐస్లాండ్ లో సూర్యాస్తమయం అనేది జరగని పని.

కాని ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉంది. నాకైతే చలి తీవ్రత కన్నా ఆకలి తీవ్రత మరింత యాతన పెడుతోంది. మాకు ఆతిథ్యం ఇవ్వడానికి ఒప్పుకున్న రైతు ఉండే ఇల్లు అల్లంత దూరంలో కనిపించగానే నాకు ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది.



పేరుకి అది రైతు ఇల్లేగాని మాకు అక్కడ జరిగింది రాచ మర్యాదే. మేము ఆ గడప తొక్క గానే ఇంటి యాజమాని వచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు. ఇక ఎక్కువ ఆర్భాటం లేకుండా తనని అనుసరించమని మాకు సంజ్ఞ చేసి వడిగా నడుచుకుంటూ పోయాడు.

ఆ సన్నని, చీకటి బాటలో తన పక్కనే నడిచి వెళ్ళడం అసాధ్యం. కనుక అతడు చెప్పినట్టే తన వెనుకే అనుసరిస్తూ పోయాం. ఆ భవనం ఇంచుమించు చదరపు ఆకరంలో ఉండే చెక్క పలకలతో తయారు చెయ్యబడి ఉంది. దారికి ఇరుపక్కలా నాలుగు గదులు ఉన్నాయి. ఒక వంట గది, ఓ బట్టలు నేసే గది, ఓ పడగ్గది, ఓ అతిథుల అది. అన్నిటికన్నా అతిథుల గదే కాస్త బావుంది. ఈ ఇల్లు కచ్చితంగా మా మామయ్యని దృష్టిలో పెట్టుకుని కట్టినది కాదని నాకు త్వరలోనే అర్థమయ్యింది. ద్వారబంధాలు బాగా కిందికి ఉండడం వల్ల మామయ్య తల అప్పటికే నాలుగు సార్లు గుమ్మానికి కొట్టుకుంది.

మాకు ఉండడానికి ఇచ్చిన గది విశాలంగానే ఉంది. నేల గచ్చునేల కాదు. గట్టిగా నొక్కిన మట్టి నేల. కిటికీ లోంచి పడే వెలుగులో గదిలో వస్తువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎర్రని చెక్క చట్రాల మధ్య కాస్తంత ఎండు గడ్డి పరచబడింది. ఇదే మా హంసతూలిక తల్పం! ఆ చెక్క ‘పక్క’ మీద ఏవో ఐస్లాండి అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. అయితే ఈ మాత్రం భాగ్యానికి కూడా నోచుకుంటాం అనుకోలేదు ముందు. కాని అవతల వంట గదిలోంచి వస్తున్న ఎండుచేపల కంపు, వేలడదీసిన మాంసపు వాసన నాకు దక్కిన కొద్దిపాటి అదృష్టాన్ని కుడా వమ్ము చేశాయి.

మేం సామాన్లు విప్పుతుంటే వంటగది లోంచి మాకు ఆతిథ్యం ఇస్తున్న రైతన్న పిలుపు వినిపించింది. భోజనానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఒక్క వంటగదిలోనే మంట వుంది. చలి ఎంత విపరీతంగా ఉన్నా ఆ ఒక్క గదిలోనే నిప్పు రాజేస్తారట.



మామయ్య వెంటనే లేచి వంటగది వైపు వెళ్లాడు. నేను కూడా ఆయన వెంటే వెళ్లాను.

వంటగదిలో పాతకాలపు పొగగొట్టం ఉంది. గది మధ్యలో పొయ్యి వుంది. దానికి సరిగ్గా పైన చూరులో ఓ రంధ్రం వుంది. భోజనాలు కూడా వంటగదిలోనే చెయ్యాలి.

మేం వంటగదిలోకి అడుగుపెట్టగానే మమ్మల్ని మొట్టమొదటి సారిగా చూస్తున్నట్టు “సేల్వెర్టూ” అన్న పదంతో ఎంతో మర్యాదగా సంబోధించాడు. ఆ మాటకి “సుఖీభవ” అని అర్థం చెప్పుకోవచ్చు. అలా సంబోధించి మా మీదకి వంగి బుగ్గల మీద చుంబించాడు!

ఆయన వెనుకే ఆయన భార్య కూడా వచ్చి అదే కర్మకాండని తను కూడా శాస్త్రోక్తంగా అమలు చేసింది! తరువాత ఇద్దరూ చేతులు జోడించి మాకు వినమ్రంగా నమస్కరించారు.

చెప్తే నమ్మరుగాని ఆ రైతు భార్య పందొమ్మిదిమంది పిల్లలని కన్న తల్లి! ఇంతలేసి వారు, అంతలేసి వాళ్లూ అంతా బిలబిల మంటూ వంటగదిలో తల్లి చుట్టూ మూగారు. పొయ్యి లోంచి వచ్చే దట్టమైన పొగ మాటున ఆగాగి కనిపిస్తున్న ఆ పిల్లల ముఖాలు మాతొ దోబూచులు ఆడుతున్నట్టుగా ఉన్నాయి.



నేను, మామయ్య ఆ పిల్లలని అభిమానంగా చేరదీశాం. కాసేపట్లోనే ఆ బుడుతలు మా భుజాల మీద, ఒళ్లోను, మోకాళ్ల మీద ఇలా ఎవరి వీలుని బట్టి వాళ్లు సముచితాసనాలు ఆక్రమించుకున్నారు. వారిలో కాస్త పెద్ద పిల్లలు “సెల్వెర్టూ” అని చిలకల్లా వల్లెవేయసాగారు. అలా వల్లెవేయలేని వారు వట్టి కేకలతో, కేరింతలతో సరిపెట్టుకున్నారు.

భోజనాకి వేళ్లయ్యింది అన్న ప్రకటనతో ఆ బృందగానం ఆగింది. అప్పుడే మా హన్స్ కూడా లోపలికి ప్రవేశించాడు. గుర్రాలకి మేత వేసి వస్తున్నాడు. మేత వెయ్యడం అంటే మరేం లేదు. కట్లు విప్పి బయట బయళ్లలో వొదిలేయడమే. బయళ్ళు అంటే పచ్చని చేలు ఊచించుకుంటున్నారేమో. కాదు. అతి చల్లని ఎడారి భూమి మీద అక్కడక్కడ మొలిచిన పలచని గడ్డి. ఆ గడ్డి కోసం గాలించి, నేల లోంచి పెరికి, మేసి ఆ గుర్రాలు తమ కడుపు నింపుకోవాలి.



“సెల్వెర్టూ” అన్నాడు హన్స్ ఆ బృందాన్ని చూసి.



అక్కడితో ఆగక ఎంతో శ్రధ్ధతో, క్రమశిక్షణతో ఆ ఇంటి యజమాని మీద, ఇంటి ఇల్లాలి మీద, ముద్దులొకికే వారి నవదశ సంతానం మీద లెక్క పద్దు లేకుండా ముద్దులు కురిపించాడు!



బృందం, అంటే మొత్తం ఇరవై నాలుగు మందిమి, ఓ బల్ల చుట్టూ భోజనానికి కూర్చున్నాం. అంత మందీ పక్కపక్కగా కూర్చోవడం భౌతికంగా అసాధ్యం కనుక ఒకరి మీద ఒకరం కూర్చున్నాం. మోకాళ్ళ మీద కేవలం ఇద్దరు బడుధ్ధాయిల మోతతో బతికిపోయినవాడు ధన్యుడు!

సూప్ రంగప్రవేశం చెయ్యగానే గదిలో ఓ కమ్మని నిశ్శబ్దం నెలకొంది. అసలే ఈ దేశంలో జనం పెద్దగా మాట్లాడే రకాలు కారు. లిచెన్ అనబడే ఒక రకమైన నాచుతో చేసిన సూప్ ఘుమఘుమలు గది మొత్తం నిండిపోయాయి. సూప్ కాస్త కొత్తగా ఉంది. పూర్తిగా బాలేదనడానికి కూడా లేదు. దాని తరువాత పులియబెట్టిన (rancid) వెన్నలో తేలాడుతున్న ఎండుచేపలు ఉన్న గిన్న ఒకటి మా ముందుకి వచ్చింది. ఆ వెన్న తీసింది, నిన్న, నేడు కాదట! ఇరవయ్యేళ్ల కిందటి వెన్నట! ఐస్లాండ్ పాక సాంప్రదాయంలో ఇలాంటి వెన్న చాలా అపురూపమట. ఆ తరువాత ఓ జున్ను లాంటి పదార్థం, కొన్ని బిస్కట్లు, ఆరగించాం. బెర్రీ పళ్ల నుండీ తీసిన ఏదో రసం సేవించాం. తరువాత పాలు, నీళ్లు కలిసిన ఏదో పలచని పదార్థం సాక్షాత్కరించింది. దీనికి ‘బ్లాండా’ అని ఓ పేరు కూడాను. మొత్తం మీద భోజనం బావుందా లేదా అనడిగితే ఉన్నపళంగా చెప్పమంటే కష్టం. బాగా ఆకలి మీద ఉన్నానో ఏమో, ఆఖర్లో గోధుమ పాలతో చేసిన ఏదో తీయని పానీయం వస్తే దాని రంగు, రుచి, వాసన కూడా చూడకుండా గటగటా తాగేశాను.

ఎట్టకేలకు భోజనం పూర్తయ్యింది. పిల్లలు మెల్లగా అక్కణ్ణుంచి వాళ్ల గదిలోకి వెళ్లిపోయారు. పెద్దలంతా చలిమంట చుట్టూ మూగారు. పిడకలు, చేప ఎముకలు మొదలుకొని నానా రకాల గడ్డిగాదరా పోగేసి,నిప్పు రాజేశారు. పార్థివ దేహం కాస్త వెచ్చబడ్డాక నెమ్మదిగా ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. ఐస్లాండ్ సాంప్రదాయం ప్రకారం అతిథులకి బట్టలు మార్చే బాధ్యత కూడా ఇంటి ఇల్లాలిదేనట! మాకు గుండె గుభేలు మంది. “అయ్యో మీకెందుకండీ శ్రమ!” అంటూ ఆవిణ్ణి మర్యాదగా సాగనంపాం. ఆవిడ మరు మాట్లాడకుండా వెళ్లిపోయింది.



ఒక్కసారిగా బడలిక క్రమ్ముకుంది. ఆ విచిత్ర పరిసరాల మధ్య, గుచ్చుకునే పచ్చిక పక్క మీద వాలి క్షణంలో గాఢ నిద్రలోకి జారుకున్నాను.


(ఇంకా వుంది)


నేర్చుకోవడం పిల్లల నైజం (Learning All the Time)

Posted by నాగప్రసాద్ Friday, November 25, 2011 2 comments


జాన్ హోల్ట్ (1923- 1985) ఓ పేరు మోసిన అమెరికన్ విద్యావేత్త.
అతడు పిల్లలని ఎంతగానో ప్రేమించాడు. పిల్లలు తమ చుట్టూ ఉండే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కోసం, దాని గురించి నేర్చుకోవడం కోసం చేసే ప్రయాసని బాగా అర్థం చేసుకున్నాడు. ఆ ప్రయాసే అసలు చదువు అని తెలుసుకున్నాడు. పిల్లలు తమ పరిసరాల గురించి నేర్చుకోవడంలో కాస్తంత దోహదం చెయ్యడమే పెద్దల కర్తవ్యం అంటాడు. అంతకు మించి పిల్లల సహజ వృద్ధి క్రమంలో పెద్దలు అతిగా జోక్యం చేసుకుంటే పిల్లల ఎదుగుదలకి హాని చెయ్యడం తప్ప ఏమీ ఉండదు అంటాడు.

పిల్లలు నేర్చుకోవడానికి సంబంధించి జాన్ హోల్ట్ తన అవగాహన అంతటినీ ఈ పుస్తకంలో రంగరించాడు. ‘పిల్లలు ఎలా నేర్చుకుంటారు?’ (How children learn?), ‘పిల్లలు ఎలా వెనకబడతారు?’ (How children fail?) అనే పుస్తకాల రచయితగా బాగా ఆదరణ పొందిన హోల్ట్, ఈ పుస్తకంలో పిల్లలు ఇంటిదగ్గర చదవడం, రాయడం, లెక్కలు చెయ్యడం మొదలైనవి ఎలా నేర్చుకుంటారో వర్ణిస్తాడు. ఈ అద్భుతమైన ప్రక్రియను పెద్దవాళ్లు ఎలా గౌరవించాలో, ఎలా ప్రోత్సహించాలో తెలియజేస్తాడు. మానవులకి నేర్చుకోవడం అన్నది ఊపిరి తీసుకోవడమంత సహజమని మరోసారి గుర్తుచేస్తాడు.
 పిల్లల చదువు పట్ల, పిల్లల అభివృద్ధి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం.







7.5 దృగ్గోచర కాంతిమితి (Visual Photometry)

Posted by V Srinivasa Chakravarthy Thursday, November 24, 2011 0 comments

కాంతి యొక్క ఓ ముఖ్య లక్షణం ప్రకాశం. ప్రకాశాన్ని కొలిచే విధానమే, శాస్త్రమే ‘దృగ్గోచర కాంతిమితి.’

దీని గురించి తెలుసుకోవాలంటే దానికి ఆధారమైన కొన్ని ప్రాథమిక భావాలని పరిచయం చెయ్యాలి. ఆ భావాలని వరుసగా కొన్ని పోస్ట్ లలో పరిశీలిద్దాం.


కాంతి జనకాలు – వాటి ప్రకాశం (Light sources and luminescence)

కాంతిని వెలువరించే వస్తువులని కాంతి జనకాలు అంటాం.

సూర్యుడు, బల్బు, కొవ్వొత్తి, మిణుగురు పురుగు మొదలైనవి మనకి బాగా తెలిసిన కాంతిజనకాలు. వీటిలో కొన్నిటికి ప్రకాశం ఎక్కువగాను, కొన్నిటికి తక్కువగాను ఉంటుంది. ఉదాహరణకి సూర్యుడికి ప్రకాశం విపరీతంగా ఉంటుంది. కొవ్వొత్తి ప్రకాశం చాలా తక్కువగా ఉంటుంది. మిణుగురు పురుగుకి ప్రకాశం ఇంకా తక్కువగా ఉంటుంది. చీకట్లోనే స్పష్టంగా కనిపిస్తుంది గాని పగటి పూట దాన్ని గుర్తుపట్టడం కష్టం.

ప్రకాశంలో ఈ తేడాలు ఆయా వస్తువుల సహజ లక్షణం మీద ఆధారపడతాయి. ఉదాహరణకి ఓ కట్టెపుల్లని కాల్చినప్పుడు అందులోని రసాయన శక్తి కాంతి శక్తిగా మారుతుంది. బోలెడు చితుకులు పేర్చి రాజేసిన మంట నుండి ఎక్కువ ప్రకాశం పుడుతుంది. పుల్లలు అధిక సంఖ్యలో ఉన్నాయి కనుక, వాటి నుండి పుట్టిన కాంతి ప్రకాశం కూడా ఎక్కువే అవుతుంది. కాని ఓ చిన్న కట్టెపుల్ల నుండి వచ్చే కంతి ప్రకాశం తక్కువగా ఉంటుంది. కనుక వస్తువులో ఎంత శక్తి కాంతిగా మారుతోంది అన్న దాని బట్టి దాని ప్రకాశం మారుతుంది.

వస్తువుల ప్రకాశంలో మార్పుకు మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది మన నుండి ఆ వస్తువు యొక్క దూరం. దూరంగా ఉండే వస్తువు తక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అదే వస్తుని దగ్గరి నుండి చూస్తే మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

ఉదాహరణ – దూరం నుండి ఓ కారు చీకట్లో హెడ్ లైట్లతో వస్తోంది. ఆ రెండు లైట్లు రెండు మెరిసే చుక్కల్లా ఉంటాయంతే. కాని ఆ కారు బాగా దగ్గరికి వచ్చినప్పుడు ఆ హెడ్ లైట్లని చూస్తే బాగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఆ కాంతి సూటిగా కంట్లో పడితే కళ్లు మండుతాయి కూడా. కనుక దూరం తక్కువ కావడం వల్ల ప్రకాశం పెరిగింది.

ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హెడ్ లైట్లు దూరంలోను, దగ్గరలోను ఒకే విధంగా ఉన్నాయి. వాటిలో ఏ మార్పూ రాలేదు. వాటిని చూస్తున్న మనకి, వాటికి మధ్య దూరం మారింది కనుక, వాటి ప్రకాశంలో మార్పు ఉన్నట్టుగా కనిపిస్తోంది. పైన చెప్పుకున్న సందర్భంలో ప్రకాశంలో తేడా ఆ వస్తువు యొక్క సహజ లక్షణంలో తేడా వల్ల వస్తోంది. ఇక్కడ ప్రకాశంలో మార్పు చూస్తున్నవారికి, కాంతి జనకానికి మధ్య దూరంలో మార్పు వల్ల వస్తోంది. అందుకే ఇదొక దృగ్గోచర విషయం. ప్రకాశంలో ఈ విధంగా కలిగే మార్పుని కొలవడమే దృగ్గోచర కాంతి మితి. దీన్నే ఇంగ్లీష్ లో Visual Photometry అంటారు. (visual=“దృగ్గోచర” = “కనిపించే”; photo = “కాంతి”; metry = “మితి” = “కొలవడం.”).

ఉదాహరణ 2:- ఓ చీకటి గదిలో కొవ్వొత్తి వెలుతురులో మీరు ఒక పుస్తకాన్ని చదువుతున్నారు. కొవ్వొత్తి దగ్గరగా పుస్తకాన్ని పట్టుకుంటే చదవడానికి సాధ్యమవుతుంది. కాని కొవ్వొత్తికి ఓ పది అడుగుల దూరంలో పుస్తకం పట్టుకుని చదవడం ఇంచుమించు అసంభవం అవుతుంది. దూరం పెరగడం వల్ల ప్రకాశం తగ్గింది.

ఉదాహరణ 3:- దూరం బట్టి ప్రకాశం తక్కువ అవుతుంది అనడానికి మరో ముఖ్యమైన ఉదాహరణ. మనకి తెలిసిన కాంతి జనకాలలో అత్యంత ప్రకాశవంతమైన కాంతి జనకం సూర్యుడు. కాని విశ్వంలోని కోటానుకోట్ల తారలలో సూర్యుడు ఒక మామూలు తార అని చిన్న తరగతుల్లో చదువుకున్నాం. మరి సూర్యుడు మాత్రమే అంత ప్రకాశవంతంగా కనిపించి, మిగతా తారలన్నీ మినుకు మినుకు మంటూ, కనీకనిపించనంత అప్రకాశంగా ఎందుకు ఉన్నాయి? దానికి వాటి దూరమే కారణం. సూర్యుడికి మనకి మధ్య దూరం 1 యూనిట్ అనుకుంటే, మనకి అతి దగ్గరి తార అయిన ప్రాక్సిమా సెంటారీ దూరం సుమారు 2,40,000 యూనిట్లు అవుతుంది. ఇక మిగతా తారలు ఇంకా ఎంతో దూరాల్లో ఉన్నాయి. అందుకే తారలు అంత తక్కువ ప్రకాశం ఉన్నట్టు కనిపిస్తాయి.

ఇంతవరకు కాంతి జనకాల ప్రకాశంలో తేడాలు ఉంటాయని, ఆ ప్రకాశం రెండు కారణాల మీద ఆధారపడి ఉంటుందని గమనించాం.
1) కాంతి జనకం యొక్క సహజ లక్షణం,
2) కాంతి జనకం నుండి పరిశీలకుడి దూరం
అయితే ఆ ప్రకాశాన్ని ఎలా కొలవాలి? దూరం బట్టి ఆ ప్రకాశం తగ్గే తీరుని ఎలా నిర్వచించాలి? ఈ రెండు ప్రశ్నలకి సమాధానలు వెతకడమే ఈ అధ్యాయం యొక్క లక్ష్యం.

(ఇంకా వుంది)

హై స్కూల్ సైన్స్ పాఠం

Posted by V Srinivasa Chakravarthy Wednesday, November 23, 2011 6 comments



ఇంతవరకు ఈ బ్లాగ్ లో ఎన్నో రకాల సైన్స్ వ్యాసాలని పోస్ట్ చెయ్యడం జరిగింది. అయితే అవన్నీ సైన్స్ విషయాల మీద సామాన్యమైన ఆసక్తి పెంచే దిశలోనే ఉన్నాయి. విద్యార్థులకి కూడా అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నా కూడా, ప్రత్యక్షంగా బడి చదువులకి, బళ్లో చెప్పే సైన్స్ కి సంబంధించిన పోస్ట్ లు పెద్దగా లేవు. బళ్లో చెప్పే సైన్స్ పాఠాలతో సూటిగా సంబంధం ఉన్న సమాచారాన్ని అందిస్తే ఈ బ్లాగ్ స్కూలు పిల్లలకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

ఆ ఉద్దేశంతో పదోక్లాస్ భౌతికశాస్త్రం నుండి ఒక అంశాన్ని తీసుకుని ధారావాహికంగా కొన్ని పోస్టులలో ‘హై స్కూల్ సైన్స్’ అన్న టాగ్ తో చెప్పుకొచ్చే ప్రయత్నం చేద్దాం.

ముందు ‘కాంతి’ తో మొదలుపెడదాం. ప్రత్యేకించి పదోక్లాసు పాఠ్యపుస్తకంలో ‘దృగ్గోచర కాంతి మితి’ అన్న పాఠాన్ని తీసుకుందాం. కాస్త అర్థాంతరంగా మొదలుపెట్టినట్టు అనిపించినా, తగినంత ఉపోద్ఘాతం ఇచ్చి, పాఠం సులభంగా అర్థమయ్యేట్టు జాగ్రత్తపడదాం. ఎక్కడో అక్కడ మొదలుపెట్టాలి కనుక ‘కాంతి’తో ఆరంభించినా, క్రమంగా ఇతర పాఠాలు కూడా చెప్పుకురావాలని ఆలోచన.

ఏ పాఠం తీసుకున్నాం అన్నది అంత ముఖ్యం కాదు. పాఠం చెప్పే తీరులో కొన్ని నియమాలని పాటించాలన్నది ముఖ్యోద్దేశం. ఆ నియమాలు -

1. పాఠం అర్థం చేసుకోడానికి చాలా సులభంగా ఉండాలి. సామన్య తెలివితేటలు కలిగి, కాస్త తెలుగు అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి, హైస్కూల్ లో చదువుకునే ఒక పల్లెటూరి విద్యార్థి(ని), పెద్దగా పెద్దవాళ్ల సహాయం లేకుండానే తనంతకు తాను చదువుకుని అర్థం చేసుకోగలిగేటంత సులభంగా, స్వయం విదితంగా ఉండాలి.

2. ఊరికే పరిభాషతో బెదరగొట్టకుండా, నిర్వచనాలతో ఉక్కిరిబిక్కిరి చెయ్యకుండా, సులభమైన, సముచితమైన వివరణలతో భావాలని నిర్ద్వంద్వంగా వివరించాలి.

3. సముచిత స్థాయిలో భావాల చరిత్ర చెప్పాలి. చరిత్ర అంటే ఎవరు, ఎప్పుడు కనిపెట్టారు అన్నది కాదు. తప్పుడు భావాలు సరైన భావాలుగా ఎలా వికాసం చెందాయో చెప్పే భావ చరిత్ర క్లుప్తంగా చెప్పాలి.

4. ప్రతీ భావనని పరిచయం చేసే ముందు, అసలు అలాంటి భావనని ప్రతిపాదించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి.

5. వాస్తవ ప్రపంచంలో ఆ భావన ఎక్కడ పనికొస్తుందో బోధపరచాలి. వీలైనన్ని ఉదాహరణలతో భావన మనసులో బాగా నాటుకునేలా చెయ్యాలి.

6. భావం పట్టుబడే విధంగా విద్యార్థులు ఇంట్లో చేసుకోదగ్గ ప్రయోగాలు కూడా వివరించాలి.

7. భావనల పరిచయంలో ఒక క్రమం ఉండాలి. ప్రాథమిక భావనలని పరిచయం చేశాకనే మరింత ఉన్నత భావనల జోలికి వెళ్లాలి. పాఠం సాంతం చిట్టి చిట్టి మెట్లున్న మెట్ల దారిలా ఉండాలి. పెద్ద పెద్ద అంగలు వెయ్యాల్సిన అవసరం రాకూడదు.

8. భావనలు పరిచయం చేసే క్రమంలో ఓ గొలుసుకట్టు ఉండాలి. ఒక కొత్త భావాన్ని పరిచయం చేసేటప్పుడు అంతవరకు పరిచయమైన భావన(ల)కి, ఈ కొత్త భావానికి మధ్య సంబంధం ఏంటో స్పష్టం చెయ్యాలి.

9. పాఠంలో భాష సరళమైన వ్యావహారిక భాష కావాలి. గ్రాంథికానికి ఆమడ దూరంలో ఉంటే మేలు. పాఠం ఓ కథలాగా, తైలధార లాగా సాఫీగా ప్రవహించాలి.

10. సందర్భోచితంగా కాస్తంత హాస్యం చల్లితే ఫరవాలేదు. మన చదువులు పిల్లలకి అందించవలసినవి చిరునవ్వులు, కన్నీళ్ళు కావు.

పై సూత్రాలు విద్యారంగంలో అందరికీ తెలిసినవే అయినా, ప్రత్యేకించి చెప్పడం ఎందుకంటే, పాఠ్యపుస్తకాలలో ఈ సూత్రాలని పూర్తిస్థాయిలో పాటించడం లేదు. పరిభాష విపరీతంగా ఉంటుంది. వివరణ కొరవడుతుంది. భాష పూర్తిగా వ్యావహారికం కాదు. వ్యావహారిక, గ్రాంథిక భాషల విచిత్ర మిశ్రమం. ఉదాహరణకి ఆ ‘దృగ్గోచర కాంతిమితి’ అన్న పాఠంలో ఈ కింది నిర్వచనాన్ని చూడండి.

“ఒక గోళాకార ఉపరితలంపైన ఉన్న కొంత భాగంలోని హద్దుల వెంబడి గోళ కేంద్రమునకు అభిలంబ రేఖలను గీసిన అవి శంకువును ఏర్పరచును. ఈ శంకువు పీఠం గోళ కేంద్రం వద్ద చేసే కోణమే ఘనకోణం. ఇది శంకువు పీఠం వైశాల్యానికి మరియు గోళ వ్యాసార్థము యొక్క వర్గానికి గల నిష్పత్తికి సమానము.”


ఈ నిర్వచనం మహాపండితులకి తప్ప సామాన్య మానవులకి అర్థం కాదని నా అభిప్రాయం!

మరో సమస్య ఏంటంటే ఇది చాలా చిన్న, ఐదు పేజీల, పాఠం. అందులోనే హడావుడిగా ‘కాంతి అభివాహం,’ ‘ఘనకోణం,’ కాంతి తీవ్రత’, ‘దీపన సామర్థ్యం’ వంటి భావనలు, ‘ల్యూమెన్,’ ‘కాండెలా,’ ‘స్టెరేడియన్’ వంటి కొత్త యూనిట్లు పరిచయం చెయ్యబడ్డాయి.

కాంతిని కొలవడానికి ఇన్ని భావనలు అసలు అవసరమా? ఇంత పరిభాష కావాలా? ఇలా తప్ప మరో విధంగా ప్రకాశాన్ని కొలవడానికి సాధ్యం కాదా? పిల్లలకి ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలన్నీ పిల్లలకి తీరుతాయని నాకు నమ్మకం లేదు.

సైన్స్ లో ఒక పాఠం అర్థం అయ్యింది అని ఎప్పుడు అంటామంటే, ఆ అంశాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తకి అర్థమయినంత లోతుగా, ఆ పాఠం చదివిన వాడికి అర్థమయినప్పుడు! అలా అర్థం కావాలంటే ఆ పాఠం విషయంలో సందేహాలన్నీ కావాలి . ఆ అంశానికి సంబంధించిన చీకట్లన్నీ తొలగి మూల మూలలా ‘కాంతి’ ప్రసరించాలి! అలా అర్థమైన సైన్స్ పాఠం పుట్టెడు మార్కులనే కాదు, చెప్పలేని ఆనందాన్ని కూడా ఇస్తుంది.

వచ్చే పోస్ట్ నుండి పాఠం మొదలెడదామా?

రెండు కథలు

Posted by V Srinivasa Chakravarthy 0 comments

ఈ మధ్య ‘మాలిక’ వెబ్ జైన్ లో రెండు కథలు ప్రచురించబడ్డాయి. ఈ బ్లాగ్ కేవలం సైన్స్ కోసమే కనుక అవి ఇక్కడ పూర్తి రూపంలో ఇవ్వడం లేదు. లింకులు మాత్రమే ఇస్తున్నాను. వీలుంటే ఓ సారి చూడండి…


ఏ రాయి అయితేనేం?

ఇద్దరు మిత్రుల దాంపత్య జీవితాలని పోల్చుతూ చెప్పే ఓ సరదా సెటైర్ ఈ కథ. విదేశాల్లో ఉండేవాడు తన ‘వెస్టర్నైజేషన్’ వల్లనే తన కాపురం ఇలా ఉందని బాధపడుతుంటాడు. కాని ఇండియాలో ఉంటూ బాగా ‘సాంప్రదాయంగా’ ఆలోచించే తన మిత్రుడి పరిస్థితి కూడా అంత మెరుగ్గా ఏమీ లేదని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. కథ అంతా ఓ టెలిఫోన్ సంభాషణ…

http://magazine.maalika.org/2011/08/17/%e0%b0%8f-%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b1%88%e0%b0%a4%e0%b1%87%e0%b0%a8%e0%b1%87%e0%b0%82/




నిన్న లేని అందం
ఓ సున్నితమైన ప్రేమ కథ. కథ అంతా ఒక్క రోజులో జరిగిన వృత్తాంతం.

http://magazine.maalika.org/2011/11/06/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b2%e0%b1%87%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%82/

ఇండియాకి దారి చూపగల సమర్థుడైన మార్గగామి దొరికాక వాస్కో ద గామా పరిస్థితి మెరుగయ్యింది. ఆ మార్గగామి పేరు అహ్మద్ బిన్ మజిద్. అరబ్ లోకంలో గొప్ప నావికుడిగా ఈ మజిద్ కి మంచి పేరు ఉంది. ఇతడి పూర్వీకులకి కూడా నౌకాయానంలో ఎంతో అనుభవం ఉంది. నౌకాయానం మీద ఇతడు నోరు తిరగని పేరున్న ఓ అరబిక్ పుస్తకం కూడా రాశాడు. సముద్రాల మధ్య తేడాలని వర్ణిస్తూ సముద్ర శాస్త్రం మీద కూడా ఓ పుస్తకం రాశాడు.

అంతకు ముందు వాస్కో నౌకాదళానికి దారి చూపిస్తానని వచ్చిన ఓ అరబిక్ నావికుడు ఈ బృందాన్ని ఆఫ్రికా తూర్పు తీరం వెంట పైకి కిందకి తిప్పించాడు. పెను తుఫానులలో ఇరికించాడు. కాని అహ్మద్ మజిద్ మార్గదర్శకత్వంలో అలాంటి అవాంతరాలేమీ జరగలేదు. మే 20, 1498 నాడు వాస్కో బృందం సురక్షితంగా ఇండియా పశ్చిమ తీరాన్ని చేరుకుంది. పోర్చుగల్ నుండి బయల్దేరిన పదకొండు నెలల తరువాత మూడు పోర్చుగీస్ ఓడలూ కాలికట్ రేవులోకి ప్రవేశించాయి. ఆ కాలంలో ఇండియాలో దక్షిణ-పశ్చిమ కోస్తా ప్రాంతంలో కాలికట్ ఓ ముఖ్యమైన రేవుగా, గొప్ప నాగరికత గల నగరంగా, గొప్ప వ్యాపార కేంద్రంగా వెలిగేది. ఆ ప్రాంతాన్ని ఏలే రాజు పేరు ‘జామొరిన్’. మళయాళంలో ఆ పదానికి ‘సముద్రానికి రాజు’ అని అర్థం. హిందువైన ఈ రాజు, అధికశాతం ముస్లిమ్లు ఉండే ఆ ప్రాంతాన్ని సమర్ధవంతంగా పరిపాలించేవాడు.

మాలింది లో బయల్దేరిన ఇరవై ఆరు రోజుల తరువాత మళ్లీ తీరాన్ని చూస్తున్నారు నావికులు. కనుక ఎప్పుడెప్పుడు తీరం మీద అడుగు పెడదామా అని తహతహలాడుతున్నారు. ఓడలు రేవులోకి ప్రవేశించగానే నాలుగు చిన్న పడవలు ఓడని సమీపించాయి. ఆ పడవల్లో కొందరు స్థానిక అధికారులు వాస్కో ద గామా ఓడల లోకి ప్రవేశించి వాళ్ల గురించి వివరాలు సేకరించారు. కాని తీరం మీద అడుగుపెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. మర్నాడు మళ్లీ అలాగే ఆ పడవలు వచ్చాయి. మళ్లీ విచారణలు జరిగాయి కాని ఊళ్ళోకి వెళ్లడానికి అనుమతి లేదు. ఈ జాప్యం వాస్కో కి నచ్చలేదు. అరబిక్ భాష మాట్లాడగల ఓ దూతని ఆ వచ్చిన అధికారులతో పంపాడు. తీరం మీద కొందరు అరబ్బులు దూతతో కొంచెం దురుసుగా మాట్లాడారు. ఆ సమయంలో రాజు కాలికట్ లో లేడని, కాస్త దూరంలో ఉన్న పాననే అనే ఊరికి వెళ్లాడని చెప్పారు. దూత ఆ విషయం వచ్చి వాస్కో తో చెప్పాడు.

వాస్కో ద గామా ఆలస్యం చెయ్యకుండా ఈ సారి ఇద్దరు దూతలని పోర్చుగల్ రాచ ప్రతినిధులుగా నేరుగా జామొరిన్ వద్దకే పంపాడు. దూతల ద్వారా వాస్కో ద గామా గురించి తెలుసుకున్న జామొరిన్ సాదరంగా ప్రత్యుత్తరం పంపాడు. తను త్వరలోనే కాలికట్ కి తిరిగి వస్తున్నట్టు, వాస్కో ద గామాని కలుసుకోవడానికి కుతూహల పడుతున్నట్టు ఆహ్వానపూర్వకంగా జవాబు రాశాడు.

చివరికి మే 28 నాడు రాజు గారి దర్శనం చేసుకునే అవకాశం దొరికింది. పదమూడు మంది అనుచరులతో, వాస్కో ద గామా తీరం మీద అడుగుపెట్టాడు. తమ్ముడు పాలోని ఉన్న ఓడల బాధ్యత అప్పజెప్పుతూ, ఏ కారణం చేతనైనా తను తిరిగి రాకపోతే, వెంటనే ఓడలని తీసుకుని పోర్చుగల్ కి తిరిగి వెళ్ళిపొమ్మని ఆదేశించాడు. వాస్కో ద గామాని ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున వేడుక ఏర్పాటు చేశాడు రాజు. జామొరిన్ మనుషులు వాస్కో ద గామా బృందాన్ని కాలికట్ వీధుల వెంట బళ్లలో తీసుకెళ్లారు. పాశ్చాత్య నావికులని చూడడానికి పురవీధులకి ఇరుపక్కల జనం బారులు తీరారు. పెద్ద పెద్ద నగారాలు మ్రోగాయి. డప్పుల శబ్దం మిన్నంటింది. వాళ్లకి జరిగిన సత్కారాన్ని తలచుకుంటూ వాస్కో బృందంలో ఒకడు తదనంతరం “అసలు ఇంత గౌరవం స్పెయిన్ లో స్పెయిన్ రాజుకి కూడా ఆ దేశ ప్రజలు అందించరేమో” అంటూ రాసుకున్నాడు. దారిలో ఓ హైందవ ఆలయంలో ఆగింది బృందం. వాస్కో ద గామాకి హైందవ మతం గురించి పెద్దగా తెలీదు. ఆ గుళ్లన్నీ చర్చిలే అనుకుని అపోహ పడ్డాడు. ఒక చోట కనిపించిన దేవి విగ్రహం చూసి అది వర్జిన్ మేరీ విగ్రహం అనుకుని పొరబడ్డాడు.

చివరికి బృందం రాజుగారి కోటని చేరుకుంది. వాస్కో ద గామా రాజ సభలో అడుగుపెట్టాడు. భారతీయ పద్దతిలో రెండు చేతులు జోడించి రాజుగారికి నమస్కరించాడు. స్థానికులు ఆ విధంగా ఒకర్నొకరు పలకరించుకోవడం అంతకు ముందే గమనించాడు. రాజు గారు సముచితాసం ఇచ్చి, అతిథులకి ఫలహారం ఏర్పాటు చేసి ఆదరించారు. ముందు కుశల ప్రశ్నలు వేసి వారు వచ్చిన కార్యం గురించి వాకబు చేశారు. పోర్చుగీస్ రాజు మాన్యుయెల్ ఇండియా గురించి, ప్రత్యేకించి కాలికట్ గురించి ఎంతో విన్నాడని, కాలికట్ తో వాణిజ్యం రెండు దేశాలకి ఎంతో లాభదాయకమని వాస్కో ద గామా విన్నవించాడు.

వాస్కో కి, తన అనుచరులకి రాజమందిరంలోనే ఆ రాత్రికి ఆతిథ్యం దొరికింది. మర్నాటి ఉదయం వాస్కో జామొరిన్ అనుచరులని తన గదికి పిలిపించాడు. జామొరిన్ కి ఇవ్వడానికి తెచ్చిన వస్తువులు చూపించి, రాజుగారికి ఇవి నచ్చుతాయా అని అడిగాడు. ఆ వస్తువులు చూసి వాళ్లు నిర్ఘంతపోయారు. అలాంటి బహుమతులు ఓ చిన్న గూడెం దొరకి ఇవ్వడానికి సరిపోతాయేమో గాని, అంత పెద్ద రాజుకి ఇవ్వడం సరికాదు అన్నారు వాళ్లు.

ఈ బహుమతుల భాగోతం రాజుగారి చెవిన పడింది. ఆయనకి ఆ సంగతి ససేమిరా నచ్చలేదు. తరువాత వాస్కో రాజుగార్ని కలుసుడానికి వెళ్ళినప్పుడు బహుమతులు నచ్చని విషయం మొహం మీదే చెప్పాడు. ఆ ముందు రోజే అంత ఆదరంగా మాట్లాడిన మనిషి ఒక్క రోజులోనే, అదీ అంత చిన్న విషయం గురించి, అంతగా మారిపోవడం వాస్కో దగామాకి కాస్త సందేహం కలిగించింది. తన సందేహం నిజమేనని తరువాత జరిగిన సంఘటనలు నిరూపించాయి.

(ఇంకా వుంది)




సైన్స్ ఫిక్షన్ ప్రియులకి ప్రతీ శనివారం రాత్రి ఓ చక్కని విందు – టెరా నోవా సీరియల్. సైన్స్ ఫిక్షన్ రంగంలో సినిమాలే తక్కువ. ఇక టీవీ సీరియళ్లు మరీ అపురూపం. గతంలో బాగా ఆదరణ పొందిన, ఒక మొత్తం తరాన్నే సైన్స్ దిశగా ప్రభావితం చేసిన సీరియల్ స్టార్ ట్రెక్. ఈ కొత్త సీరియల్ ఆ ఎత్తుని చేరుకుంటుందో లేదో గాని, ‘పవిత్ర రిష్తా’లని, ‘మొగలి రేకుల’ ని చూపించి, చూపించి కృంగి కృశించిపోయిన మా టీవీ ఈ కొత్త షో వల్ల ఏదో కొత్త వన్నె తెచ్చుకున్నట్టయ్యింది.

క్లుప్తంగా ఈ సీరియల్ కి నేపథ్యం ఇది. కథ క్రీ.శ. 2149 లో మొదలవుతుంది. వాతావరణం కాలుష్యం బాగా పెరిగిపోవడం వల్ల, మితిమీరిన జనాభా వల్ల భూమి మీద జీవన పరిస్థితులు దుర్భరంగా మారుతాయి. అలాంటి పరిస్థితుల్లో చికాగో నగరంలో ఒక చోట కాలాయతనంలో (space-time) ఓ చీలికని కనుక్కుంటారు శాస్త్రవేత్తలు (!!!) దాని లోంచి గతం లోకి ప్రయాణించవచ్చని కనుక్కుంటారు. ఇక గుంపులుగా గుంపులుగా దుర్భరమైన భావి భూమి నుండి తప్పించుకుని 84 మిలియన్ల సంవత్సరాలు గతం లోకి ప్రయాణిస్తారు మనుషులు. ఆ విధంగా ఈ ‘తీర్థయాత్రల’ వల్ల ఎంతో మంది విమోచనం పొందుతారు. వాటిలో పదవ తీర్థ యాత్రలో షానన్ కుటుంబం గతం లోకి ప్రవేశిస్తుంది. పదవ తీర్థయాత్రలో వెనక్కు వెళ్ళిన వారంతా ఒక ‘కాలనీ’ లాంటిది నిర్మించుకుని అందులో జీవనం మొదలెడతారు. ఆ కాలనీ పేరే ‘టెరా నోవా’ (అంటే నవ్య భూమి).

84మిలియన్ సంవత్సరాలు గతంలో అంటే అది భూమి మీద క్రిటేషియస్ యుగం నడుస్తున్న కాలం. గతంలో 145.5 నుండి 65.5 మిలియన్ల సంవత్సరాల మధ్య కాలాన్ని క్రిటేషియస్ యుగం అంటారు. ప్రస్తుత భూమితో పోల్చితే అప్పటి భూమి రూపురేఖలు చాలా భిన్నంగా ఉండేవి. అప్పటికి ఇండియా ఇంకా ఏషియాలో భాగం కాదు. అప్పుడే ఆఫ్రికా ఖండం నుండి వేరు పడి నెమ్మదిగా ఏషియా దిశగా తన సుదీర్ఘ ప్రయాణం మొదలెట్టింది. ఆస్ట్రేలియా ఇంచుమించు అంటార్కిటికాతో కలిసి వుంది. యూరొప్ అంతా ఛిన్నాభిన్నమై, జలమయమై వుంది. ఆఫ్రికా ఉత్తర భాగం అంతా నీరు. ఉత్తర అమెరికా ఖండాన్ని ఓ సముద్రం నిలువుగా రెండుగా వేరుచేస్తోంది. అది భూమి మీద డైనోసార్లు స్వైరవిహారం చేస్తున్న కాలం. ఈ క్రిటేషియస్ యుగాంతంలోనే భారీ ఎత్తున భూమి మీద జీవరాశులు అంతరించిపోయాయి. అంత తక్కువ కాలంలో హఠాత్తుగా ఎన్నో రకాల జీవరాశులు (డైనోసార్లు కూడా) ఎందుకు అంతరించిపోయాయి ఇప్పటికీ ఓ అంతుబట్టని విషయంగా ఉండిపోయింది. దాన్నే కే-టీ వినాశన ఘట్టం అంటారు. అలాంటి వినాశనానికి ఉల్కాపాతాలు కారణం కావచ్చని ఓ సిద్ధాంతం ఉంది.

అలాంటి భయంకరమైన ధరాగత పరిస్థితుల్లో టెరా నోవా లో బతికే వ్యక్తుల జీవితాల కథే ఈ సీరియల్.

వీలున్నప్పుడు ఈ సీరియల్ లో విశేషాలు పోస్ట్ చేస్తాను. కాని ప్రస్తుతానికి ఓ చిన్న సంఘటన గురించి చెప్తాను. ఈ సీరియల్ లో ప్రతీ ఘట్టంలో ఎంత ఆలోచన, ఎంత శాస్త్రవిజ్ఞానం చొప్పించబడిందో చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ.

ఒక సన్నివేశంలో షానన్ ఐదేళ్ల కూతురు రాత్రి వేళ ఇంట్లోంచి బయటికి వచ్చి చందమామని చూసి గతుక్కుమంటుంది. అది పున్నమి. చందమామ ఆకాశంలో నిండుగా ప్రకాశిస్తుంటాడు. కాని చంద్రుడి పరిమాణం కొంచెం విపరీతంగా కనిపించి పాప భయపడుతుంది. అప్పుడు తండ్రి భయంలేదని చెప్తూ, చందమామ అలా పెద్దగా కనిపించడానికి కారణం చెప్తాడు.

చందమామ పుట్టుపూర్వోత్తరాల గురించి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. (దాని మీద లోగడ ఓ బ్లాగ్ పోస్ట్ కూడా ఉంది). ఏదో దారే పోయే గ్రహం భూమి లోంచి పెల్లగించగా చందమామ ఏర్పడింది అని ఓ సిద్ధాంతం. దానికి నిదర్శనంగా చందమామ ఏటేటా 3.8 cms భూమి నుండి దూరంగా జరుగుతోంది అన్నది వాస్తవం. కనుక గతంలో, అదీ ఎనభై మిలియన్ సంవత్సరాల క్రితం, చందమామ భూమికి మరింత (సుమారు 3000 kms) దగ్గరిగా ఉండాలి.

ఎనభై నాలుగు మిలియన్ల సంవత్సరాలు గతంలో భూమి మీదే కాక, అంతరిక్ష పరిసరాలలో కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఈ సీరియల్ ని దాని సూత్రధారులు ఎంతో పకడ్బందీగా నిర్మించినట్టు ఉన్నారు. ఇలాంటి సూక్ష్మాలు ఎన్నెన్నో ఈ సీరియల్ లో కనిపించి మురిపిస్తుంటాయి.
సైన్స్ ప్రియులూ! స్టార్ వరల్డ్ చానెల్ లో ప్రతీ శనివారం రాత్రి తొమ్మిదికి… మర్చిపోకండేం?

మరింత సమాచారం కోసం…
http://en.wikipedia.org/wiki/Terra_Nova_%28TV_series%29
http://en.wikipedia.org/wiki/Cretaceous
http://en.wikipedia.org/wiki/Cretaceous%E2%80%93Tertiary_extinction_event
http://curious.astro.cornell.edu/question.php?number=124
http://scienceintelugu.blogspot.com/2009/12/blog-post_04.html
http://scienceintelugu.blogspot.com/2009/12/2.html














ఫిబ్రవరి 24 నాడు మళ్లీ యాత్ర మొదలయ్యింది. ఉత్తర-తూర్పు దిశలో ఓడలు ముందుకి సాగిపోయాయి. మార్చి 2 నాడు ఆఫ్రికా తూర్పు తీరం మీద ఉన్న మొజాంబిక్ దేశంలోని మొసాంబిక్ రేవుని చేరుకున్నాయి. ఆ రోజుల్లో మొసాంబిక్ రేవు ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఓ ముఖ్యమైన రేవు. ఇండియా, చైనా, అరేబియా, మలయా మొదలుకొని ఎన్నోదేశాల ఓడలు అక్కడికి వస్తుంటాయి. అరేబియా, ఇండియన్ మహాసముద్రం ప్రాంతంలో అదో పెద్ద వ్యాపార కేంద్రంగా విలసిల్లేది.



ఆ ప్రాంతం వారు ఎక్కువ శాతం ముస్లిమ్లు. వీరికి ఎక్కువగా క్రైస్తవులైన యూరొపియన్లకి మధ్య ఎంతో కాలంగా వైరం ఉంది. స్థానికులతో వాకబు చేసి ఇండియాకి దారి ఎటో తెలుసుకోవాలి. కనుక తమ బృందం అంతా క్రైస్తవులు అన్న నిజం బయటపడకుండా వాస్కో ద గామా జాగ్రత్తపడ్డాడు. స్థానికుడైన ఓ షేక్ సహాయంతో ఇండియాకి దారి చూపగల ఇద్దరు అరబ్బీ నావికులని కుదుర్చుకున్నాడు వాస్కో. సాయం చేసినందుకు పారితోషకంగా 30 బంగారు ‘మాటికల్’ (4000) ఇచ్చాడు. ప్రయాణం తరువాత కన్నా ముందే ఇస్తే ఆ నావికులు కుటుంబీకులు సంతోషిస్తారని అలా చేశాడు. అయితే ఆ ధనం తమ కుటుంబాలకి ఇవ్వడానికి వాళ్లు ఊళ్లోకి వెళ్లాలి. వెళ్లిన వాళ్లు వస్తారో రారో అని ఒకణ్ణి మాత్రం పోనిచ్చి, రెండో వాణ్ణి ఓడలోనే అట్టేబెట్టుకున్నాడు.



ఆ వెళ్లినవాడు ఏం చేశాడో, ఏం అయ్యాడో తెలీదు. కొన్నాళ్ళ వరకు వాడి ఆచూకీ లేదు. వాడి కోసం ఎదురుచూస్తుండగా ఒక రోజు ఉన్నట్లుండి రెండు అరబ్బీ యుద్ధనౌకలు వారి ఓడల కేసి వస్తుండడం గమనించాడు వాస్కో. బహుశ తాము క్రైస్తవులమని స్థానికులకి తెలిసిపోయిందేమో? ఆ వెళ్లిన నావికుడు ఎలాగో ఆ రహస్యాన్ని తెలుసుకుని షేక్ కి తెలియజేసి ఉంటాడు. వస్తున్న అరబ్బీ నౌకలకి తగిన బుద్ధి చెప్పేందుకు గాను, చిన్న ఓడ అయిన ‘బెరియో’లో ఉన్న పాలో ద గామా, అరబ్బీ ఓడల కేసి గురి పెట్టి ఫిరంగులు పేల్చాడు. ఆ దెబ్బకి రెండు ఓడలలోని అరబ్బీ సైనికులు ఓడలని వొదిలేసి నీట్ళోకి దూకి పలాయనం చిత్తగించారు. జరిగిన గొడవ చాలనుకుని నౌకాదళం మొసాంబిక్ రేవుని వొదిలి ఇంకా ముందుకి సాగిపోయింది.

(మాలిందిలో వాస్కో స్మారక చిహ్నం)









ఏప్రిల్ 14 నాడు నౌకాదళం కెన్యా దేశంలోని ‘మాలింది’ నగరాన్ని చేరుకున్నారు. ఆ ప్రాంతం కూడా ఓ షేక్ పాలనలో ఉంది. ఇతగాడికి పోర్చుగీస్ గురించి, సముద్రయానంలో వారి సత్తా గురించి బాగా తెలుసు. వాస్కో బృందంతో స్నేహం చేస్తే తనకే మేలని గ్రహించాడు. వాస్కోని సందర్శించడానికి స్వయంగా వాస్కో ఓడకి విచ్చేశాడు. ఎన్నో విలువైన బహుమతులు తెచ్చి ఇచ్చాడు. వాస్కో ద గామా కూడా తనకి చేతనైనంతలో మంచి బహుమతులే ఇచ్చాడు. ఇండియాకి దారి చూపగల మార్గగామిని ఇచ్చి పంపుతానని షేక్ మాట ఇచ్చాడు. ఇద్దరు నేతలూ స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకున్నారు.



ఇలా కొన్నాళ్లు వరుసగా ఇరు పక్కల వాళ్లు వేడుకలు జరుపుకుంటూ విందులు విలాసాలలో మునిగితేలారు. వాస్కో ద గామాకి ఈ ఆలస్యం నచ్చలేదు. షేక్ కావాలని జాప్యం చేస్తున్నాడేమో ననిపించింది. ఒక రోజు తమ ఓడలోకి వచ్చిన షేక్ బంటుని ఒకణ్ణి పట్టుకుని బంధించాడు వాస్కో ద గామా. తనకి ఇస్తానన్న మార్గగామిని తక్షణమే పంపిస్తే గాని ఆ బంటుని వదలనని హెచ్చరిస్తూ షేక్ కి కబురు పెట్టాడు. అనవసరంగా వీళ్లతో కలహం కొని తెచ్చుకోవడం ఇష్టం లేక షేక్ వెంటనే ఓ సమర్ధుడైన మార్గగామిని పంపాడు.


ఆ మర్గగామి రాకతో వాస్కో ద గామా బృందంలో త్వరలోనే ఇండియా చేరుకుంటాం అన్న ఆశ చిగురించింది.


(ఇంకా వుంది)




ఇంకా ముందుకు పోతే ఎలాంటి భయంకర అగ్నిపర్వత శిలా ప్రాకారాలని చూడాల్సి వస్తుందోనని కొంచెం ఆదుర్దా పడసాగాను. కాని అప్పుడు ఓల్సెన్ మ్యాపుని పరిశీలించగా ఒక విషయం అర్థమయ్యింది. తీరం వెంట ముందుకి పోతే ఈ అగ్నిపర్వత శిలలు ఉన్న ప్రాంతాన్ని తప్పించుకోవచ్చు. అసలు అగ్నిపర్వత విలయతాండవం అంతా ద్వీపం యొక్క కేంద్రభాగానికే పరిమితం అని తరువాత తెలిసింది. ఆ ప్రాంతంలో లావాప్రవాహం ఘనీభవించగా ఏర్పడ్డ ట్రాకైట్, బేసల్ట్ మొదలైన శిలా జాతులన్నీ కలగలిసి అతిభీషణ పాషాణ విన్యాసాలుగా ఏర్పడ్డాయి. ఇక స్నేఫెల్ ద్వీపకల్పంలో మా కోసం ఎలాంటి దారుణ భౌగోళిక దృశ్యాలు వేచి ఉన్నాయో ఆ క్షణం ఊహించుకోలేకపోయాను.

రెయిక్యావిక్ నగరాన్ని వొదిలిన రెండు గంటలకి గఫ్యూన్స్ అనే చిన్న ఊరు చేరాము. అక్కడ ఓ చర్చి ఉంది. కొన్ని చిన్న ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ పెద్దగా విశేషాలేమీ కనిపించలేదు. అసలు దీన్ని ఊరు అనే కన్నా, జర్మనీ ప్రమాణాలతో చుస్తే కాస్త పెద్ద పల్లె అనొచ్చునేమో.

హన్స్ అక్కడ ఓ అరగంట సేపు ఆగుదాం అన్నాడు. అందరం కలిసి తెచ్చుకున్న సరంజామా లోంచి కడుపారా తిన్నాం. మామయ్య వేసే అంతులేని ప్రశ్నలకి హన్స్ ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు. ఇక ముందు దారి ఎలా ఉంటుందో, రాత్రి ఎక్కడ బస చెయ్యాలో అన్నీ ముక్తసరిగా ‘అవును’, ‘కాదు’ అన్న పదాలు తప్ప నిఘంటువులో మిగతా పదాలు ఆట్టే వాడకుండా చెప్పాడు. ఒక్క పదం మాత్రం నా దృష్టిని ఆకట్టుకుంది – ‘గర్దార్’.

ఈ గర్దార్ ఎక్కడుందో నని మ్యాపులో చూశాను. వాల్ ఫోర్డ్ కాలువ గట్టున అదో చిన్న ఊరు. అది రెయిక్యావిక్ నుండి నాలుగు మైళ్ల దూరంలో ఉంది. అదే మామయ్యకి చూపించాను.

“నాలుగు మైళ్లేనా?” అదిరిపోయాడు మామయ్య. “మొత్తం ఇరవై ఎనిమిది మైళ్లలో ఇంతవరకు వచ్చింది నాలుగు మైళ్లేనా?”
ఆ విషయం గురించే గైడు ని పిలిచి ఏదో అనబోయాడు మామయ్య. కాని ఆ పెద్దమనిషి వినిపించుకోకుండా బయల్దేరిపోయాడు.

అప్పట్నుంచి ఓ మూడు గంటల పాటు పాలిపోయిన పచ్చిన మీదుగా నడుస్తూ ‘కోలా ఫోర్డ్’ కాలువని చేరుకున్నాం. ఆ కాలువ వెంట కాస్త దూరం పోగానే యూల్బర్గ్ అనే ఊరు చేరాం. అది చర్చి ప్రధానంగా గల ఓ పారిష్ నగరం. అక్కడ చర్చికి పెద్ద గోడ గడియారం లేదు గాని ఉంటే ఆ సమయంలో మధ్యాహ్నం పన్నెండు కొట్టి ఉండేది. అక్కడ మా గుర్రాలకి మేత వెయ్యడం జరిగింది.

మా ప్రయాణం మళ్లీ మొదలయ్యింది. ఒక పక్క దుర్గమ దుర్గాలు. మరో పక్క దుస్తర సముద్రం. మధ్యలో ఇరుకు దారిన నెమ్మదిగా పురోగమించాం. సాయంకాలం నాలుగు గంటలకి వాల్ ఫోర్డ్ కి దక్షిణ తీరం చేరుకున్నాం. అప్పటికి నాలుగు మైళ్ల దూరం వచ్చాం. అంటే అవి ఐస్లాండ్ మైళ్లు. బ్రిటిష్ ప్రమాణాల బట్టి అవి ఇరవై నాలుగు మైళ్లతో సమానం*.

(* ఒక ఐస్లాండ్ మైలు = ఆరు బ్రిటిష్ మైళ్లు)

ఆ ప్రాంతంలో ఆ కాలువ వెడల్పు కనీసం మూడు ఇంగ్లీష్ మైళ్ల వెడల్పు ఉంటుంది. కెరటాలు ఉవ్వెత్తున లేచి తీరం మీద ఉన్న కరకు శిలల మీద పడి అల్లకల్లోలం అవుతున్నాయి. ఆ కాలువ ద్వీపం యొక్క కేంద్ర ప్రాంతం లోకి చొచ్చుకు పోతోంది. కాలువకి ఇరుపక్కలా రెండు వేల అడుగుల ఎత్తుగల శిలా స్తంభాలు, నేల లోంచి పొడుచుకొచ్చి ఆకాశం కేసి దూసుకుపోతున్న బరిశెల్లా భయంకరంగా కనిపిస్తున్నాయి. ఎరుపు రంగు గల ‘టఫ్’ రాతి పొరల మధ్య గోధుమ రంగు స్తరాలు ఆ ప్రదేశానికి ఓ విచిత్రమైన అందాన్ని ఇస్తున్నాయి.

అయితే ఆ పరిసరాల అందం ఇప్పుడు మా సమస్య కాదు. ఆ కాలువని దాటి అవతలి పక్కకి చేరాలి ఇప్పుడు. ఈ కార్యభారాన్ని పాపం మా నాలుగుకాళ్ల నేస్తాల భుజస్కంధాల మీద మోపడం ఎందుకో శ్రేయస్కరం అనిపించలేదు. అయుతే అవి కూడా దూకుడు మీద సముద్రంలోకి ఉరికే రకాల్లాగా కూడా ఏమీ కనిపించలేదు. అనవసరంగా వాటిని రెచ్చగొట్టడం ఎందుకులే అని ఊరుకున్నాను.

కాని మామయ్య ఊరుకుంటేగా? నీటి అంచు వరకు తన గుర్రాన్ని అదిలించాడు. యజమాని అజమాయిషీ చేస్తున్నాడు కదా పోనీ అని తను ఎక్కిన ‘పోనీ’ కొంచెం ముందుకి వంగి, ఓ సారి కెరటాలని పరీక్షించి ఆగిపోయింది. మామయ్య అక్కడితో ఆగక దాని డొక్కలో గట్టిగా నొక్కాడు. అది ససేమిరా కదలనని మొరాయించింది. మనుషులకి అర్థమయ్యే రీతిలో తల అడ్డుగా అటు ఇటు ఊపింది. మామయ్య అహం దెబ్బ తింది. గుర్రపు తిట్ల దండకం అందుకున్నాడు. కొరడా ఝుళిపించాడు. ఇక లాభం లేదని పాపం ఆ గుర్రం మోకాళ్లు మడిచి, కాస్త వంగి, మామయ్య కింద నుండి చల్లగా జారుకుని తప్పించుకుంది.
ఒక్క క్షణంలో అశ్వపతి హోదా నుండి మామూలు సిపాయి హోదాకి దిగిపోయినందుకు మామయ్య అహం మళ్లీ దెబ్బతింది. “పాపిష్టి దానా!” అంటూ రంకె వేశాడు.

“ఫార్యా…” అన్నాడు ఇంతలో మా గైడు, మామయ్య భుజాన్ని తాకుతూ.
“ఏంటీ? పడవా? ఎక్కడా?” మామయ్య ఆదుర్దాగా అడిగాడు.
హన్స్ అల్లంత దూరంలో ఉన్న పడవని వేల్తో చూపించాడు.
“అవునవును. పడవే!” ఉత్సాహంగా అరిచాను.
“అదేదో ముందే చెప్పొచ్చు కదయ్యా బాబు!” మామయ్య కాస్త విసుగ్గా అన్నాడు.

“టిడ్వాటెన్…” అన్నాడు గైడు ఈసారి.
ఈ పెద్దమనిషి ఇలా డేనిష్ భాషలో చంపడం చిరాగ్గా ఉంది. ఇక మామయ్య ప్రపంచంలో భాషలన్నీ తనకే తెలిసినట్టు అనువదించేయడం చెడ్డ మంటగా కూడా వుంది.

“ఏవంటున్నాడు?” నీరసంగా అడిగాను.
“ ‘కెరటాలు’ అంటున్నాడు.”
“అవునవును. కెరటాల కోసం ఆగొద్దూ మరి?”
“ఫొర్బిడా…” అడిగాడు మామయ్య. ప్రతాపం చూపించేస్తున్నాడు మామయ్య. ‘అంతేనంటావా?’ అని బేరం ఆడుతున్నాడు కాబోలు.
“యా!” ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు హన్స్.

ఈ ముక్క అర్థమయ్యింది.

నీటి మట్టం సరైన ఎత్తుకి వచ్చిన దాక ఎదురుచూడాలి. కెరటం మరీ ఎత్తుకి లేస్తే, పడవ అవతలి గట్టుకి చేరే బదులు సముద్రంలో కొట్టుకుపోతుంది. మట్టం మరీ అడుగంటితే పడవ నేలలో దిగబడిపోయే ప్రమాదం ఉంది.


ఆ సుముహూర్తం సాయంత్రం ఆరు గంటలకి వచ్చింది. మామయ్య, నేను, మా గైడు, మరి ఇద్దరు ప్రయాణీకులు, నాలుగు గుర్రాలు – అందరం ఓ పెళుసైన తెప్ప మీదకి ఎక్కాం. ఎల్బే నది మీద స్టీమర్లలో తిరిగినవాణ్ణి. ఈ తెప్ప మీద ప్రయాణం ఓ సహన పరీక్షే అయ్యింది. కాలువ దాటడానికి మొత్తం గంట పట్టింది. అయితే ఏ అవాంతరమూ జరక్కుండా ఆవలి గట్టుని చేరుకున్నాం.

మరో అరగంటలో గర్దార్ నగరాన్ని చేరుకున్నాం.
(పన్నెండవ అధ్యాయం సమాప్తం)


Image credits:



















మాల్థస్ భావాలని అర్థం చేసుకున్న డార్విన్ కి జీవపరిణామాన్ని ఒక ప్రత్యేక దిశలో ప్రేరిస్తున్న అదృశ్య శక్తేమిటో అర్థం అయ్యింది. జనాభాని ఎలాగైతే వ్యాధి, మృత్యువు, యుద్ధం మొదలైన శక్తులు అదుపు చేస్తున్నాయో, ఆ శక్తుల ‘సహజ ఎంపిక’ చేత కొంత జనాభా ఏరివేయబడుతోందో, అదే విధంగా జీవపరిణామంలో కూడా పరిమితమైన ప్రకృతి వనరుల కోసం పోటీ పడడం, మారుతున్న పృథ్వీ పరిస్థితులకి తట్టుకోవడం, అనే ‘సహజ ఎంపిక’ వల్ల కొన్ని జీవాలు, జీవజాతులు ఏరివేయబడుతున్నాయి. జీవజాతుల్లో ఆంతరికమైన వైవిధ్యాన్ని కలుగజేసే విధానాలు ఉండడం వల్ల కొత్త కొత్త రూపాంతరాలు పుట్టడం, వాటిలో సహజ ఎంపికలో గెలువగల రూపాలు నిలదొక్కుకోవడం, తక్కినవి మట్టిగలవడం – పరిణామంలో జరుగుతున్నది ఇదే నని గుర్తించాడు డార్విన్.
ఆ విధంగా తక్కిన వారు ‘ప్రతిభతో కూడిన రూపకల్పన’ అనుకున్నది, వైవిధ్యం + సహజ ఎంపిక అనే జంట శక్తులు పాడే యుగళగీతం అని ప్రతిపాదించాడు డార్విన్. ప్రతిభతో కూడిన రూపకల్పనకి ఆధారం ప్రకృతిలో జరిగే యాదృచ్ఛిక ఘటనలు అనడం ఒక విధంగా విడ్డూరంగా అనిపించింది. జీవజాతుల వికాస క్రమంలో కనిపించే ఎన్నో విశేషాలు కేవలం ఈ రెండు శక్తుల లాస్యంగా వివరించడానికి వీలయ్యింది. వీటికి బాహ్యంగా ఏదో అదృశ్య దివ్య హస్తం యొక్క ప్రమేయం అనవసరం అనిపించింది.


ముప్పై ఏళ్ళ వయసుకే, అంటే 1839 కే, డార్విన్ ఇంత ప్రగాఢమైన, విప్లవాత్మక సిద్ధాంతానికి ప్రాణం పోశాడు. అది కేవలం తార్కిక, తాత్విక చింతన కాదు. అసంఖ్యాకమైన ఆధారాల ఆసరాతో నిలబడ్డ బలమైన, బారైన భావసౌధం. సిద్ధాంతాన్నైతే నిర్మించాడు గాని దాన్ని వెంటనే ప్రచురించడానికి వెనకాడాడు. దాన్ని ప్రచురించడానికి మరో ఇరవై ఏళ్లు ఆగాడు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతం బయట పొక్కితే ఎలాంటి దుమారం లేస్తుందో తనకి బాగా తెలుసు. ఈ సిద్ధాంతాన్ని ప్రకటించడం అంటే మతఛాందస వాదులతో తల గోక్కోవడమే అవుతుంది. మతవాదులని వ్యతిరేకించిన శాస్త్రవేత్తలకి గతంలో ఎలాంటి దుర్గతి పట్టిందో తనకి బాగా తెలుసు. విశ్వానికి కేంద్రం భూమి కాదన్న జోర్డానో బ్రూనోని గుంజకి కట్టి బహిరంగంగా సజీవ దహనం చేశారు. బైబిల్ బోధించిన సౌరమండల నిర్మాణాన్ని ప్రశ్నించినందుకు గెలీలియోని గృహనిర్బంధం చేశారు. అయితే అది కొన్ని శతాబ్దాల క్రితం నాటి మాట. అప్పటికి, పందొమ్మిదవ శతాబ్ద కాలానికి, ఈ విషయంలో ఎంతో పురోగతి జరిగింది. మరీ సజీవదహం చెయ్యకపోయినా కటువైన విమర్శ తప్పదని అనిపించింది. సున్నిత స్వభావుడైన డార్విన్ కి ఆ విమర్శని ఎదుర్కోవడానికి మనస్కరించలేదు.

దేవుడితో ప్రమేయం లేకుండా కొన్ని ప్రకృతి ధర్మాల అనుసారం పరిణామం జరిగింది అంటే, తననో నాస్తికుడిగా ముద్రవేసే ప్రమాదం లేకపోలేదు. అందుకు తనకి పూర్తిగా మనసొప్పలేదు. ఎందుకంటే ఒక శాస్త్రవేత్తగా ఒక పక్క కచ్చితమైన ఆధారాలు లేనిదే దేనినీ ఒప్పుకోని నిష్ఠ కలవాడే అయినా, వ్యక్తిగత రంగంలో డార్విన్ దైవాన్ని నమ్మేవాడు. ఒక దశలో పూర్తిగా శాస్త్ర చదువులు వదిలి మత విద్యలో చేరిపోవాలని కూడా నిశ్చయించుకోవడం మనకి తెలుసు. మూల విశ్వాసంలో అస్తికుడైన తనని నాస్తికుడని లోకం ఆడిపోసుకుంటే తను తట్టుకోలేడు.
మతానికి సంబంధించిన కారణాలే కాక కేవలం వైజ్ఞానిక పరంగా కూడా డార్విన్ తన సిద్ధాంతాన్ని ప్రచురించడంలో ఆలస్యం చెయ్యడానికి కారణాలు ఉన్నాయి. తన సిద్ధాంతానికి ఎన్నో ఆధారాలు ఉన్నా అత్యున్నత వైజ్ఞానిక ప్రమాణాల దృష్ట్యా అవి సరిపోవని డార్విన్ గుర్తించాడు. కేవలం శాస్త్రపరంగా చూసినా తన సిద్ధాంతాన్ని ఎన్నో విధాలుగా విమర్శించొచ్చు.


ఉదాహరణకి జీవజాతుల్లో అనుకోని వివిధ్యం అవసరమని తన సిద్ధాంతం కోరుతుంది. ఆ వైవిధ్యం ఎలా కలుగుతోంది? దాన్ని కలుగజేసే ప్రకృతిగత విధానాలు ఏమిటి? ఎలాంటి ప్రశ్నలకి సమాధానాలు శోధిస్తూ మరిన్ని ఆధారాలు సేకరిస్తూ పోయాడు. 1851, 1854 లలో తను సేకరించిన ఆధారాలని మాత్రం, పూర్తి సిద్ధాంతన్ని ఎక్కడా ప్రస్తావించకుండా, కొన్ని చిన్న పుస్తకాలుగా ప్రచురించాడు. తను తలపెట్టిన మహాసిద్ధాంత నిర్మాణం గురించి అప్పటికే తన స్నేహితులకి కొందరికి తెలుసు. మరీ ఆలస్యం చెయ్యకుండా చప్పున తన సిద్ధాంతాన్ని ప్రచురించమని శ్రేయోభిలాషులు ప్రోత్సహించారు. “మరీ ఆలస్యం చేస్తే ఇదే విషయాన్ని మరి ఇంకెవరైనా ప్రచురించేస్తారు చూసుకో,” అని తమ్ముడు ఎరాస్మస్ మందలించాడు.

1856 లో తన భావాలన్నిటినీ కొన్ని అధ్యాయాలుగా కూర్చుతూ ఓ పుస్తక రూపం ఇవ్వడానికి ఉపక్రమించాడు. ఆ పుస్తకానికి ‘సహజ ఎంపిక’ అని పేరు కూడా సహజంగా ఎంపిక చేసుకున్నాడు. అలా మొదలైన గ్రంథ రచనా కార్యక్రమం ఓ ఏడాది పైగా సాగింది. 1857 లో విపరీతమైన శ్రమ వల్ల ఆరోగ్యం బాగా దెబ్బ తింది. పని నుండి పక్కకి తప్పుకుని కొంత కాలం విశ్రాంతి తీసుకోక తప్పలేదు.

ఇలా ఉండగా ఓ హఠాత్ సంఘటన జరిగింది. 1858 లో జూన్ నెలలో డార్విన్ కి ఓ ఉత్తరం వచ్చింది. దాన్ని రాసిన వాడు ‘ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్’ అనే ఓ కుర్ర ప్రకృతిశాస్త్రవేత్త. ఇతగాడు ఎన్నో ఏళ్ళుగా మలయ్ దీవుల మీద సంచరిస్తూ ఓ సొంత పరిణామ సిద్ధాంతం కోసం సమాచారం సేకరిస్తున్నాడు. తన పరిశోధనలని క్లుప్తంగా వివరిస్తూ డార్విన్ కి లేఖ రాశాడు. అది చదివిన డార్విన్ నిర్ఘాంతపోయాడు. అన్నీ అచ్చం తన భావాలే! పదాల ఎంపికలో కూడా ఎంతో పోలిక ఉంది. డార్విన్ నీరుగారిపోయాడు. ఇక తన రచనలని ప్రచురించడం వృధా అనుకున్నాడు. ఇప్పుడు ప్రచురిస్తే మరో కొత్త దుమారం లేస్తుంది. చివరికి స్నేహితుల, తోటి శాస్త్రవేత్తల ప్రోత్సాహం మీద డార్విన్, వాలస్ లు ఇద్దరూ కలిసి జులై 1, 1858, నాడు ఓ వ్యాసం ప్రచురించారు. ఆధునిక పరిణామ సిద్ధాంతపు సంగ్రహ రూపం ఆ వ్యాసంలో మొట్టమొదటి సారిగా ప్రకటించబడింది. తదనంతరం డార్విన్ తన భావజాలాన్ని సమీకరిస్తూ ‘జీవజాతుల ఆవిర్భావం’ (The Origin of Species) అనే పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించాడు. పరిణామ సిద్ధాంతం మీదనే కాక, అసలు మొత్తం జీవశాస్త్రంలోనే ఆ పుస్తకం శిరోధార్యం అని చెప్పుకోవచ్చు.

డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతానికి ఎన్నో విమర్శలు వచ్చాయి. కొన్ని కేవలం ఓర్వలేని తనం వల్ల వచ్చినవి. వాటిని డార్విన్ పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని శాస్త్రీయ అభ్యంతరాలకి తన వద్ద సమాధానం లేకపోయింది. కొన్ని సందర్భాలలో ఆ తరువాత జరిగిన శాస్త్ర పురోగతి వల్ల ఆ అభ్యంతరాలు తప్పని తేలింది. డార్విన్ తరువాత ఆ దిశలో పరిశోధించిన ‘నియో డార్విన్’ వాదులు, మరింత సమాచారాన్ని సేకరించి, మూల సిద్ధాంతాన్ని తగురీతుల్లో సవరిస్తూ వచ్చారు. ఇక ఆధునిక జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ మొదమైన రంగాల రంగప్రవేశంతో పరిణామానికి పరమాణు పరమైన ఆధారాలు ఏమిటో అర్థం కాసాగాయి. ఆధునిక జీవశాస్త్రంలో పరిణామ సిద్ధాంతం కేవలం ఓ ప్రత్యేక సిద్ధాంతం కాదు. ఆధునిక జీవశాస్త్రానికి వెన్నెముక లాంటిది పరిణామ సిద్ధాంతం. పరిణామాత్మక దృక్పథంతో చూడకపోతే జీవశాస్త్రంలో ఏదీ సరిగ్గా అర్థం కాదు అంటాడు డోబ్ జాన్స్కీ అనే జీవశాస్త్రవేత్త. అలాంటి అపురూపమైన సిద్ధాంతానికి ఊపిరి పోసిన చార్లెస్ డార్విన్ వైజ్ఞానిక చరిత్రలో చిరస్మరణీయుడు.

(సమాప్తం)

References:
J. Miller, B. van Loon, Introducing Darwin, Icon Books, UK.










ఐనిస్టయిన్ ఉవాచ…

Posted by V Srinivasa Chakravarthy Sunday, November 13, 2011 0 comments



1. కాస్తంత తెలివి ఉన్న ఏ మూర్ఖుడైనా విషయాలని మరింత పెద్దగా, సంక్లిష్టంగా మార్చేయగలడు. పరిస్థితిని అందుకు వ్యతిరేక దిశలో తీసుకెళ్లడానికి మేధస్సు కావాలి. దమ్ము ఉండాలి.

2. దేవుడి ఆలోచనలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇక తక్కినవన్నీ చిన్న చిన్న వివరాలే.

3. ఈ లోకంలో కెల్లా అర్థం చేసుకోవడం అత్యంత కఠినమైన విషయం ఆదాయపు పన్ను.

4. బాహ్య ప్రపంచం ఓ భ్రాంతి. సులభంగా వదలని భ్రాంతి.

5. దేవుడు పాచికలు ఆడడని నాకు పూర్తి నమ్మకం ఉంది.

6. భగవంతుడిది సూక్షబుద్ధి, వక్రబుద్ధి కాదు.

7. మతం లేని విజ్ఞానం కుంటిది. విజ్ఞానం లేని మతం గుడ్డిది.

8. ఎప్పుడూ పొరబాటు చెయ్యని వాడు కొత్తగా ఏదీ ప్రయత్నించ లేదన్నమాట.

9. ధీరాత్ములు ఎప్పుడూ బలహీన మనస్కుల నుండి తీవ్రమైన వ్యతిరేకతని ఎదుర్కుంటూ వచ్చారు.

10. పొట్టపోసుకోవడం కోసం కాకపోతే వైజ్ఞానిక వృత్తి బాగానే ఉంటుంది.

11. మనిషి యొక్క నైతిక వర్తనం సానుభూతి, విద్య, సామాజిక బంధాలు – వీటి మీద ఆధారపడితే చాలు. మతపరమైన శిక్షణ అనవసరం. చావు తరువాత శిక్ష పడుతుంది అన్న భయమో, లబ్ది పొందుతామన్న ఆశో మానవ చర్యలని అదుపు చేస్తూ ఉంటే, మనిషి యొక్క వికాసం అస్తవ్యస్తంగా ఉంటుంది.

12. భావావేశం అంటే ఏంటో తెలీని వాడు, తన ఎదుట ఉన్న నిత్యాద్భుతాన్ని చూసి ప్రగఢమైన ఆశ్చర్యాన్ని అనుభూతి చెందని వాడు చచ్చినవాడి కింద లెక్క. వాడి కళ్లు ఎప్పుడో మూతపడ్డాయి.

13. గణితంతో నీ ఇబ్బందుల గురించి బెంగపడకు. నా సమస్యలు అంతకన్నా పెద్దవని నిశ్చయంగా చెప్పగలను.

14. వైజ్ఞానిక సూత్రాల పరీక్ష ఎలా ఉంటుందో నైతిక సూత్రాల పరీక్ష కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. అనుభవం అనే పరీక్షకి ఒక్క సత్యం మాత్రమే నిలబడుతుంది.

15. ఈ రోజు నేను అనుభవిస్తున్న బహ్య, ఆంతరిక జీవనం, ప్రస్తుతం ఉన్న, లేని ఎంతో మంది యొక్క కృషి మీద ఆధారపడి ఉంది కనుక, వారి నుండి ఇంతవరకు పొందిన, పొందుతున్న దానికి సమానంగా తిరిగి ఇవ్వాలని నాకు నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను.

16. మనుషులు ప్రేమలో పడితే అందుకు బాధ్యత గురుత్వానికి కాదు. తొలి ప్రేమ లాంటి సజీవ ప్రక్రియని భౌతిక, రసాయన చర్యలకి కుదించడం ఎలా సాధ్యం?

17. నా శిష్యులకి నేను ఎపుడూ పాఠాలు చెప్పను. వాళ్లు నేర్చుకోడానికి అవసరమైన పరిస్థితులు కల్పిస్తానంతే.

18. నేను ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచించను – అది అనుకున్నదాని కన్నా తొందరగానే వచ్చేస్తుంది.

19. జ్ఞానం కన్నా ఊహాశక్తి ఇంకా ముఖ్యం.

20. మన పెళుసైన, బలహీనమైన మనస్సుకి కనిపించే అతి సూక్ష్మమైన వివరాలలో కూడా వ్యక్తం అయ్యే ఓ అపరిమిత, మహోన్నత తత్వాన్ని మనసారా, వినమ్రంగా ఆరాధించడం – ఇదే నా మతం.

21. హద్దుల్లేనివి రెండే – ఒకటి విశ్వం, రెండోది మానవ మూర్ఖత్వం. ఈ రెండిట్లోనూ మొదటి దాని విషయంలో నాకు కొంచెం సందేహమే.

22. పరమాణు శక్తి యొక్క విడుదల వల్ల ఓ కొత్త సమస్య తలెత్తలేదు. ముందే ఉన్న ఓ సమస్య యొక్క పరిష్కారం అత్యవసరం అయ్యేట్టు చేసింది.

23. నాకు ప్రత్యేకమైన ప్రతిభ ఏమీ లేదు. నాకు ఉన్నది అలుపులేని కుతూహలం మాత్రమే.

Sources:
http://rescomp.stanford.edu/~cheshire/EinsteinQuotes.html
http://www.quotationspage.com/quotes/Albert_Einstein







డార్విన్ కి తన యాత్రల నుండి తిరిగి తెచ్చుకున్న సరంజామాని, సమాచారాన్ని విశ్లేషించగా ఒక్క విషయం మాత్రం తేటతెల్లంగా కనిపించింది. జీవపరిణామం అనేది వాస్తవం. జీవజాతులు క్రమంగా మార్పుకి లోనవుతున్నాయి. అయితే ఆ మార్పుని కలుగజేస్తున్న శక్తి ఏంటో తనకి మొదట అర్థం కాలేదు. అందుకు కారణాల కోసం ఆలోచించగా తనకి తట్టిన మొట్టమొదటి కారణం ఇది.




ఎన్నో రకాల భూభౌతిక శక్తుల ప్రభావం వల్ల భూమి యొక్క ఉపరితలం, పర్యావరణం క్రమంగా మార్పుకి లోనవుతున్నాయి. మారుతున్న పృథ్వీ పరిస్థితులకి తట్టుకుని మనగలగడానికి, జీవ జాతులు కూడా తగు రీతుల్లో మారుతూ పోవాలి. ఆ మార్పుకి తగ్గట్టుగా తమ జీవన సరళిని, చేష్టలని, ప్రవర్తనని, అలవాట్లని మార్చుకోవాలి. అలవాటుగా కొన్ని చేష్టలు చేస్తున్నప్పుడు అందుకు అనుగుణంగా శరీరంలో కూడా కొన్ని దీర్ఘకాలిక మార్పులు వస్తాయని భావించాడు డార్విన్. ఆ మార్పులే తదనంతరం తరువాతి తరానికి సంక్రమిస్తాయని అనుకున్నాడు. ఈ రకమైన జీవపరిణామాన్ని మొట్టమొదట ఊహించినవాడు ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త లామార్క్ (చిత్రం). జీవజాతులలో వచ్చే మార్పుల విషయంలో లమార్క్ రెండు సూత్రాలు ప్రతిపాదించాడు. శరీరంలో ఏదైనా అంగాన్ని అతిగా వాడినప్పుడు ఆ అంగం గణనీయంగా వృద్ధి చెందుతుంది అని మొదటి సూత్రం చెప్తుంది. అలా ఒక ప్రాణిలో వచ్చిన మార్పు తదనంతరం దాని సంతతికి సంక్రమించే అవకాశం ఉంది అంటుంది రెండవ సూత్రం. అయితే ఈ తీరులో అనువంశికంగా లక్షణాలు సంక్రమించవని ఆధునిక జన్యు శాస్త్రం (జెనెటిక్స్) చెప్తుంది. కాని లామార్క్ చెప్పిన తప్పుడు భావననే డార్విన్ స్వీకరించాడు.

భూమి మీద పరిస్థితులు నిరంతరం మారుతుంటాయి గనుక, ఆ మార్పుకు అలవాటు పడ్డ జంతు శరీరాలలో తదనుగుణమైన మర్పులు వస్తుంటాయి గనుక, ఒక తరం జంతువులలో వచ్చిన మార్పులు తదుపరి తరానికి సంక్రమిస్తుంటాయి కనుక భూమి మీద మారే పరిస్థితులే పరిణామాన్ని ప్రేరించే ప్రముఖ శక్తులుగా డార్విన్ కి కనిపించాయి.



జీవ జాతుల లక్షణాలలో మార్పు కలుగుజేసే మరో శక్తిని కూడా డార్విన్ గుర్తించాడు. పిల్లలకి వారి తల్లిదండ్రుల పోలికలు వస్తాయన్నది అందరికీ తెలిసిన విషయం. అలాగని పిల్లలు అచ్చం వారి తల్లిదండ్రుల మాదిరిగానే (కూతుళ్ళందరూ వారి తల్లి లాగానో, కొడుకులు అందరూ వారి తండ్రి లాగానో) ఉండరు. తల్లిదండ్రులలో లేని కొన్ని లక్షణాలు కూడా పిల్లల్లో కనిపిస్తాయి. ఒక మొక్క యొక్క కొమ్మని నరికి, దాన్ని నాటగా పుట్టిన మొక్క అచ్చం దాని తల్లి మొక్కకి మల్లె ఉంటుంది. అలా కాకుండా రెండు మొక్కల మధ్య పరాగ సంపర్కం చేత పూవులు పుష్పించి, ఫలించి, విత్తనాలు పుట్టి, ఆ విత్తనాలు మళ్లీ మొక్కలైనప్పుడు, అలా పుట్టిన మొక్కలకి, వాటి ‘తల్లి, దండ్రులకి’ మధ్య ఎన్నో తేడాలు కనిపించాయి. కనుక జీవప్రపంచంలో లైంగిక పునరుత్పత్తి వల్ల జీవజాతులలో అనుకోని వైవిధ్యం ప్రవేశిస్తోందని గుర్తించాడు డార్విన్.



ఆ విధంగా జీవజాతులలో ఒక తరం నుండి మరో తరానికి మార్పు రావడం వెనుక ఉన్న కారణాలు గుర్తించాడు డార్విన్. కాని మరో ప్రశ్న మిగిలిపోయింది. ఈ మార్పులన్నీ ఎటు పోతున్నాయి? జీవ పరిణామానికి ఏదైనా చరమ లక్ష్యం ఉందా? ఈ ప్రశ్నకి కారణాలు డార్విన్ కి మరో సందర్భంలో కనిపించాయి. రైతులు, తోటమాలులు, పశువుల కాపర్లు – వీళ్ల వృత్తులకి సంబంధించిన వ్యవహారాలతో డార్విన్ కి చాలా పరిచయం ఉండేది. పశువులని పెంచుకునే వాడు బాగా పాలిచ్చి, దీర్ఘ కాలం బతికి, సులభంగా వ్యధులకి లోను కాని ఆవులు ఉంటే బాగుణ్ణు అనుకుంటాడు. ప్రకృతి సాధించినట్టుగా జీవజాతులలో గొప్ప వైవిధ్యాన్ని అతడు సాధించలేడు. అందుకు ఒక ముఖ్యమైన కారణం సమయం లేకపోవడం. ప్రకృతి జీవజాతులలో మార్పులని నెమ్మదిగా లక్షల సంవత్సరాలుగా సాధిస్తుంది. కాని పశువుల కాపరి తన జీవితకాలంలో ఆ మార్పులు చూడగోరుతాడు. కనుక తను చెయ్యగిలింది ఒక్కటే. మేలు జాతి పశువులని తెచ్చి, అవి కలిసేట్టు చేస్తే, వాటి సంతతి కూడా మేలు జాతికి చెందినది అయ్యే అవకాశం ఉంటుంది. అలా పుట్టిన పశువుల జాతులు నాలుగు కాలాల పాటు మన్నుతాయి.



కనుక పశువుల కాపర్లు చేసే కృత్రిమ ఎంపిక చేత పశువుల జాతులలో కొన్ని ఉపజాతులు అధికంగా వృద్ధి చెందుతాయి, మరి కొన్ని అంతరించిపోయాయి. పశువుల కాపర్లు చేసే కృత్రిమ ఎంపికను పోలిన ఏంపికే ప్రకృతి జీవజాతుల విషయంలో చేస్తోంది. అంటే ప్రకృతి పనిగట్టుకుని తనకి నచ్చిన జీవాలని బతికించి, నచ్చని వాటిని ఏరివేస్తోందని కాదు. జీవజాతులు ప్రకృతి లోని వనరుల కోసం పోటీ పడతాయి. వనరులు పరిమితమైనవి కనుక పోటీలో నెగ్గిన జీవజాతులు మరింత సమర్ధవంతంగా భూమి మీద మనగలిగే అవకాశం ఉంది. కనుక పరిమితమైన సహజ వనరుల కోసం జీవజాతులు పడే పోటీయే ఒక విధమైన సహజ, ప్రకృతిసిద్ధమైన ఎంపికగా జీవ జాతుల మీద పని చేస్తోందని అర్థం చేసుకున్నాడు డార్విన్.



ఈ అవగాహనతో డార్విన్ తన సిద్ధాంతంలో బాగా పురోగమించాడు. అయితే ఈ ‘సహజ ఎంపిక’ అన్న భావన యొక్క ప్రాముఖ్యత డార్విన్ మరింత లోతుగా తెలుసుకునేలా చేసిన పుస్తకం ఒకటి ఉంది. జనాభా వృద్ధిలో క్రమం గురించి మాల్థస్ రాసిన పుస్తకం ఒకటి 1838 లో డార్విన్ కంటపడింది. ఏ విధమైన అవరోధమూ లేకపోతే ప్రపంచ జనాభా ఇరవై ఐదేళ్ల కి ఒకసారి రెండింతలు అవ్వాలి. కాని వ్యాధి, మరణం, యుద్ధం, ప్రకృతిలో ఉత్పాతాలు మొదలైన పరిణామాల వల్ల జనాభ వృధ్ధి చెందే వేగం అంతకన్నా తక్కువగానే ఉంటుంది. జనాభా అతిగా పెరిగినప్పుడు యుద్ధం, వ్యాధి, సహజ విపత్తులు మొదలైన కారణాల వల్ల జనాభా తగ్గుతుంది. జనాభా ఆ విధమైన సహజ పరిస్థితుల్లో తగ్గాలే గాని, కృత్రిమమైన సంక్షేమ పథకాల వల్ల జనాభాని అరికట్టడానికి ప్రయత్నిస్తే అది బెడిసి కొడుతుంది అంటాడు మాల్థస్.



ఈ భావాలు మొదట్లో డార్విన్ కి అంతగా రుచించకపోయినా, మాల్థస్ భావాలకి జీవపరిణామానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకున్న డార్విన్ మహదానందం చెందాడు.



(ఇంకా వుంది)



(చాలా కాలం క్రిందట నిలిపేసిన ‘పాతాళంలో ప్రయాణం’ సీలియల్ ని మళ్లీ కొనసగిస్తున్నాం.)

అధ్యాయం 12
నిర్జన భూమి

ఆకాశం మేఘావృతమై ఉంది. కాని నిశ్చలంగా ఉంది. మరీ వెచ్చగానూ లేదు. అలాగని వర్షం కూడా లేదు. ఇలాంటి వాతావరణం కోసమే పర్యాటకులు పడి చస్తారు.


ఈ కొత్త, విచిత్ర ప్రపంచంలో గుర్రం మీద స్వారీ అంటే నాకు మొదట్నుంచి భలే ఉత్సాహంగా అనిపించింది. ఓహో, ఏం హాయి? ఎంత ఆనందం? అందుకే ఈ అశ్వారూఢానందంలో పీకల్దాకా మునిగిపోయాను!


“అసలైనా ఆలోచించి చూస్తే, గుర్రం మీద స్వారీ చెయ్యడం వల్ల పెద్దగా మునిగిపోయింది ఏవుందో నాకైతే అర్థం కాలేదు.
అందమైన పరిసరాలలో హాయిగా ముందుకి సాగిపోతాం. మహా అయితే ఓ కొండ ఎక్కుతాం. అంతగా అయితే ఓ పాత బిలం లోంచి కిందకి దిగుతాం. అంతేగా? ఆ సాక్నుస్సేమ్ మాత్రం ఇంతకన్నా పొడిచేసిందేంవుంది? ఇక భూమి కేంద్రం దాకా తీసుకుపోయే దారి సంగతి అంటారా? నన్నడిగితే అంతా వట్టి కాకమ్మకథ! అదంతా జరిగే పని కాదు. లేని దాని గురించి ఇలాంటి చక్కని సన్నివేశంలో ఆలోచించి మనసు పాడుచేసుకోవడం మంచిది కాదు.” ఈ తీరులో నా ఆలోచనలు ఆగాయి.

నా ఆలోచనలు ఒక పక్క అలా సాగుతుంటే మేం రెయిక్యావిక్ పొలిమేరలు చేరుకున్నాం.
హన్స్ మాకు కొంచెం ముందుగా వేగంగా నడుస్తున్నాడు. అతని వెనకే సామాన్లు మోస్తున్న గుర్రాలు బుధ్ధిగా నడుస్తున్నాయి. వాటి వెనుక మామయ్య, ఆయన వెనుక నేను…గుర్రాల మీద…

యూరొప్ లో కెల్లా అతి పెద్ద దీవుల్లో ఐస్లాండ్ ఒకటి. దానిది పద్నాలుగు వేల చదరపు మైళ్ల విస్తీర్ణత. జనాభా పదహారు వేలు. భౌగోళికులు దాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు. వాటిలో ‘దక్షిణ-పశ్చిమ’ విభాగమైన ‘ సూడ్వెస్టర్ ఫోర్డ్యుంగర్’ ని కోసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం.

రెయిక్యావిక్ పొలిమేరలు దాటాక హన్స్ మమ్మల్ని తీరం వెంట తీసుకుపోయాడు. అల్లంత దూరంలో ఆకుపచ్చగా కనిపించాలనుకుని బయల్దేరిన బయళ్లు వీల్లేక పసుపుపచ్చకి దిగాయి. ట్రాకైట్ శిలతో చేయబడ్డ ఎత్తైన శిఖరాల రూపురేఖలు తూరుపు ఆకాశంలో లీలగా కనిపిస్తున్నాయి. కొండల వాలు మీద అక్కడక్కడ మంచు ముద్దలు మురిపెంగా అద్దినట్టు ఉన్నాయి. ఆ మంచు మీద పడ్డ కాంతుల తళుకులు ఆ లోకాన్ని వింతగా ప్రకాశింపజేస్తున్నాయి. ఇక కొన్ని శిఖరాలైతే దూకుడు మీద మబ్బులని ఛేదించుకుని ఆ పైనున్న స్వర్లోకపు సొగసులని ఆత్రంగా చూస్తున్నాయి.

కొన్ని చోట్ల ఈ కరకు శిలాశ్రేణులు నేరుగా సముద్రంలోకే అడుగుపెట్టి, తీరం మీద ఉన్న కాస్తంత పచ్చిక కూడా కనిపించకుండా చేస్తున్నాయి. అలాంటి చోట్ల తీరం మీద ముందుకి సాగడం కష్టం అవుతోంది. అయినా మా గుర్రాలకి ఈ దారులన్నీ కొట్టినపిండి లాగుంది. మామయ్యకి తన గుర్రాన్ని డొక్కల్లో తన్నడం, కొరడాతో కొట్టడం, రెంకెలెయ్యడం మొదలైన విన్యాసాలు చెయ్యొద్దని ముందుగా హెచ్చరిక వచ్చింది. నోరు (చెయ్యి, కాలు కూడా) మెదపకుండా గుర్రం మీద బుధ్ధిగా కూర్చున్నాడు. చెట్టంత మనిషి అలా ఆ చిన్ని పోనీ మీద కూర్చుని ఉంటే, కింద కాళ్లు నేలకి తగులుతుంటే, ఓ విచిత్రమైన ఆరుకాళ్ల కీటకంలా కనిపించి చూస్తేనే నవ్వొస్తోంది.

“బంగారు గుర్రం! బహు చక్కని గుర్రం!” అంటూ మామయ్య మొదలెట్టగానే అనుకున్నాను గుర్రం మీద ఉపన్యాసం తన్నుకొస్తోందని. “చూశావా, ఏక్సెల్. ఈ ఐస్లాండ్ గుర్రం కన్నా మొండి గుర్రం ఉంటుందని అనుకోను. మంచు గాని, తుఫాను గాని, ఇరుకు దారులు గాని, కరకు శిలలు గాని, హిమానీ నదాలు గాని – ఏదీ దీన్ని ఆపలేదు. ఎప్పుడూ అడుగు తడబడదు. ముందుకు పోనని మొరాయించదు. ఏ చిట్టేరునో దాటాలన్నా ముందు వెనక చూడకుండా అందులో దూకి ఆదరాబాదరాగా ఆవలి గట్టుకి ఈదుకుపోతుంది. ఆ క్షణం ఓ ఉభయచరంలాగా మారిపోతుంది. దాన్ని తొందర పెడితే లాభం ఉండదు. తన ఓపికని బట్టి సాఫీగా ముందుకు పోనిస్తే రోజుకి ముప్పై మైళ్లయినా సజావుగా ముందుకు సాగిపోతుంది.”

“మన సంగతి బాగే వుంది. కాని మన గైడు సంగతేంటి?”


“ఓహ్! తనకేం భయం లేదు. తన విషయం అసలు ఆలోచించకు. తను చూడబోతే ఎంత దూరమైనా సులభంగా నడిచేసేట్టు ఉన్నాడు. పైగా ఒక్క నడక తప్ప తను మరింకేం చేస్తున్నాడనీ! అంతగా కావలిస్తే నా గుర్రాన్ని అతడికి ఇస్తాను. ఇలా గుర్రం మీద కుదేసినట్టు ఎంతసేపని కూర్చోను? కాస్త దిగి నడిస్తే హాయిగా ఉంటుంది.”

మా బృందం వేగంగానే ముందుకి సాగిపోతోంది. చుట్టూ ఎడారి భూమిలా ఉంది. అక్కడక్కడ విసిరేసినట్టు పూరి గుడిసెలు కనిపిస్తున్నాయి. చెక్కతో గాని, బురదతో గాని, గట్టిపడ్డ లావా రాయితో గాని చెయ్యబడ్డ ఇళ్ళవి. ఆ దారిన పర్యాటకులు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆ ఇళ్లలో మనుషులు ఎదురుచూస్తారు కాబోలు. ఆ ప్రాంతంలో బయటి వారు రావడం బాగా అరుదు. అసలక్కడ పెద్దగా దారులు కూడా ఉండవు. అరుదుగా పడే బాటసారుల అడుగుజాడలని, మొలుచుకొచ్చే పలచని పచ్చిక కొన్నాళ్లలోనే చెరిపేస్తుంది.


కాని చిత్రం ఏంటంటే రాజధాని నుండి ఎంతో దూరంలేని ఈ ఇంచుమించు నిర్జన ప్రాంతం ఐస్లాండ్ ప్రమాణాల బట్టి చూస్తే బాగా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఒకటి. రాజధానికి ఇంకా దూరంగా పోతే అక్కడ ఇంకెంత నిర్జనంగా ఉంటుందో? ఇప్పటికే ఈ ప్రాంతంలో అరమైలు దూరం దాటాం. ఈ అరమైలులో ఒక్క రైతుగాని, ఒక్క గొల్లవాడు గాని కనిపిస్తే ఒట్టు. అక్కడక్కడ కొన్ని గోవులు, గొర్రెలు వాటి సంగతి అవి చూసుకుంటున్నాయి. ఇక్కడే ఇలా ఉంటే, అల్లంత దూరంలో కనిపిస్తున్న, పేలే జ్వాలాముఖులు ఎగజిమ్మే నిప్పు శిలల భీకర తాడనానికి బద్దలై కొంకర్లు పోయిన భయంకర మరుభూమి మరింకెంత నిర్జీవంగా ఉంటుందో?



(ఇంకా వుంది)
Image credits: http://www.aaroads.com/blog/2010/03/16/iceland-ii/











http://www.andhrabhoomi.net/sisindri/vasco-da-gama-719


వాస్కో ద గామా తన సిబ్బందితోపాటు అక్కణ్ణుంచి పలాయనం చిత్తగించాడు.నౌకాదళం ఇంకా ముందుకి సాగిపోయింది. వాతావరణంలో క్రమంగా మార్పులు రాసాగాయి. సముద్రంలో కూడా పోటు ఎక్కువగా ఉంది. ఉవ్వెత్తున కెరటాలు లేచి ఓడలని ఎత్తి పడేస్తున్నాయి. గతంలో దియాజ్ దళం కూడా సరిగ్గా ఇక్కడి నుండే వెనక్కి వెళ్లిపోయారని వాస్కో సిబ్బంది అర్థం చేసుకున్నారు. డిసెంబర్ 16వ తారీఖుకల్లా దియాజ్ బృందం పాతిన ఆఖరు ‘పద్రావ్’ని దాటారు. క్రిస్మస్ రోజుకల్లా దియాజ్ బృందం ఎక్కడి నుండి వెనక్కు తిరిగారో ఆ స్థలాన్ని దాటి 200 మైళ్లు ముందుకి వచ్చేశారు. ఆ తీర ప్రాంతాన్ని ప్రస్తుతం ‘నాటల్’ అంటారు. పోర్చుగీస్‌లో ఆ పదానికి క్రిస్మస్ అని అర్థం.ఇక్కడితో తెలిసిన దారి పూర్తయ్యింది. ఇక ముందున్నది అంతా తెలీని దారే.

నాటల్ ప్రాంతాన్ని దాటి మరో ఎనిమిది రోజులు ప్రయాణించింది వాస్కో ద గామా నౌకా దళం. ఓడలలో మంచినీరు అడుగంటుతోంది. వంటవాళ్ళు వంటలో కూడా సముద్రపు నీరే వాడుతున్నారు. మళ్లీ తీరం మీదకి వెళ్లి మంచినీటి వేట మొదలెట్టాలి. జనవరి 25 నాడు ఓ నదీముఖం కనిపించింది. ఓడలు లంగరు వేసి తీరం మీద ఉన్న ఓ గూడెం వద్ద వాకబు చెయ్యగా ఆ నది పేరు కెలీమానె అని తెలిసింది. ఆ గూడెం నాయకులు ఇద్దరు వాస్కోని కలుసుకున్నారు. ఎప్పట్లాగే వాళ్లకి వాస్కో కొన్ని చవకబారు బహుమతులు ఇచ్చాడు. వాళ్లకి అవి అంతగా నచ్చలేదు. అంతలో వాళ్లు పెట్టుకున్న అందమైన పట్టు టోపీ వాస్కో దృష్టిని ఆకర్షించింది. అదెక్కడిది అని అడిగాడు. పోర్చుగీస్ వారిలాగానే పెద్ద పెద్ద ఓడలతో తూర్పు నుండి కొందరు వస్తుంటారని, ఇవి వాళ్లు తెచ్చిన టోపీలని వాళ్లు సంజ్ఞలు చేసి చెప్పారు. ఇండియాకి దగ్గరపడుతున్నామని వాస్కోకి అర్థమయ్యింది.


ఆ ప్రాంతంలోనే ఓడలు 32 రోజులు ఆగిపోవలసి వచ్చింది. సావో రఫాయెల్ ఓడలో తెరచాప కట్టిన గుంజ తుఫాను ధాటికి విరిగిపోయింది. దాన్ని మరమ్మత్తు కోసం అగారు. కాని అదే సమయంలో సౌకా సిబ్బంది ‘స్కర్వీ’ వ్యాధి వాత పడ్డారు. ఆ రోజుల్లో సముద్రాల మీద సుదీర్ఘ యాత్రలు చేసే నావికులు ఈ స్కర్వీ వ్యాధితో తరచు బాధపడుతుండేవారు. ఆ వ్యాధి సోకినవారికి చిగుళ్లలో నల్లని రక్తం చేరి చాలా బాధిస్తాయి. వ్యాధి ముదిరితే చేతులు, కాళ్లు వాచి కదలడం కూడా కష్టం అవుతుంది. ఆహారంలో వైటమిన్ సి లోపం వల్ల ఈ వ్యాధి వస్తుందని మనకి ఇప్పుడు తెలుసు. వైటమిన్ సి నారింజ, నిమ్మ మొదలైన పళ్లలో ఉంటుంది. ఓడలలో ఎక్కువ కాలం నిలువ ఉండే ఆహారం ఉండేది. పళ్లు తక్కువగా ఉండేవి. కాని ఆ రోజుల్లో వైటమిన్ సి గురించి తెలీకపోయినా, కొన్ని రకాల పళ్లు తింటే వ్యాధి తగ్గిపోతుందని తెలుసు. కనుక తీరం మీదే ఉండే తగిన ఫలహారం తీసుకుంటూ నావికులు తిరిగి ఆరోగ్యవంతులు అయ్యారు.

ఫిబ్రవరి 24 నాడు మళ్లీ యాత్ర మొదలయ్యింది. ఉత్తర-తూర్పు దిశలో ఓడలు ముందుకి సాగిపోయాయి. మార్చి 2 నాడు ఆఫ్రికా తూర్పు తీరం మీద ఉన్న మొజాంబిక్ దేశంలోని మొసాంబిక్ రేవుని చేరుకున్నాయి. ఆ రోజుల్లో మొసాంబిక్ రేవు ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఓ ముఖ్యమైన రేవు. ఇండియా, చైనా, అరేబియా, మలయా మొదలుకొని ఎన్నోదేశాల ఓడలు అక్కడికి వస్తుంటాయి.



(image credits: http://www.christies.com/lotfinder/lot_details.aspx?intObjectID=5234156)













అలా ఐదేళ్ళ పాటు సాగిన వైజ్ఞానిక యాత్రలో డార్విన్ అపారమైన సమాచారాన్ని సేకరించాడు. ఆ సమాచారాన్ని విశ్లేషించి జీవజాతుల వికాస క్రమం గురించి కొన్ని సూత్రాలని గుర్తించగలిగాడు.





దక్షిణ అమెరికాలో డార్విన్ కి ఆర్మడిల్లో అనే రకం జంతువులు ఆసక్తి కలిగించాయి. ఈ జంతువులు మూడు, నాలుగు అడుగుల పొడవు కూడా ఉంటాయి. రూపురేఖల్లో కాస్త పందిని, ఎలుకను పోలి ఉంటాయి. ఒంటి మీద కవచం (ఆర్మర్) లాంటి దట్టమైన చర్మపు పొర ఉంటుంది కనుకనే వాటికి ఆ పేరు వచ్చింది. వీటిలో కొన్ని ఉపజాతులు వినష్టం (extinct) అయిపోగా, మరి కొన్ని వేగంగా తరిగిపోతున్నాయి. వినష్టం అయిపోయిన ఆర్మడిల్లోల శిలాజాలు, అదే ప్రాంతంలో సజీవంగా ఉన్న ఆర్మడిల్లోల శిలాజాల కన్నా బాగా పెద్దవిగా ఉన్నాయి. పరిమాణంలో తేడా ఉన్నా ఆ పెద్ద ఆర్మడిల్లోల నుండే ఈ చిన్న ఆర్మడిల్లో వచ్చి ఉంటాయనడానికి దాఖలాలు బలంగా ఉన్నాయి. పాతవి పోయాక మళ్లీ కొత్తగా సృష్టి జరగడం వల్ల కొత్తవి పుట్టాయనడంలో అర్థం లేదు. పాత వాటి నుండి కొత్తవి పరిణామం చెందాయని అనడమే సబబు. ఈ రకమైన మార్పుని ‘నిలువు పారంపర్యం’ (succession of types) అన్నాడు. అంటే ఒక జీవజాతి కాలానుగతంగా మరో జీవజాతిగా మారడం అన్నమాట.

జీవజాతులలో కాలానుగతమైన మార్పులే కాదు, దేశానుగతమైన, అంటే స్థలాన్ని బట్టి కూడా మార్పులు వచ్చినట్టు కనిపించాయి. ఒకే జంతువు అది ఉన్న ప్రాంతానికి అనుగుణంగా చిన్న మార్పులు చేర్పులతో ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించడం కనిపించింది. దక్షిణ అమెరికాలో పంపా పచ్చిక భూములలో పర్యటిస్తున్నప్పుడు ఆస్ట్రిచ్ జంతువు యొక్క ఎన్నో ఉపజాతులు తారసపడ్డాయి. ప్రతీ ప్రాంతానికి ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన ఒక రకమైన ఆస్ట్రిచ్ కనిపించేది. ఇవన్నీ ఒక దానితో ఒకటి సంబంధంలేని వేరు వేరు సృష్టి కార్యాల ఫలితాలు అయ్యే అవకాశం తక్కువ అనిపించింది. అన్నీ ఒకే మూల రూపం నుండి వచ్చినట్టు కనిపించాయి. జంతువులు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వలస పోయినప్పుడు, ఆ కొత్త ప్రదేశంలో కాలానుగతమైన మార్పుకు లోనవుతాయి. ఆ భౌగోళిక పరిస్థితుల్లో మార్పు జీవజాతుల రూపురేఖల్లో ఎలా మార్పుకు దారితీస్తుందో గుర్తించాడు డార్విన్.

పరిణామాన్ని సమర్ధించే మరో ఆసక్తికరమైన ఆధారం దీవుల మీద నివసించే జీవజాతులలో కనిపించింది. డార్విన్ తన యాత్రలో ఎన్నో దీవులని సందర్శించాడు. వాటిలో దక్షిణ అమెరికా పశ్చిమ తీరానికి దగ్గర్లో ఉన్న గాలపాగోస్ దీవులు, ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉన్న కేప్ వెర్దే దీవులు ఉన్నాయి. భౌగోళికంగా ఈ రెండు దీవుల మీద పరిస్థితులలో ఎంతో పోలిక ఉంది. జీవజాతులు అన్నీ దైవసృష్టి వల్ల జరినట్టయితే, లేదా ‘ప్రతిభతో కూడిన రూపకల్పన’ చేత జరిగినట్టయితే, ఒకే రకమైన పరిసరాలకి చెందిన జంతువులు ఒకే రకంగా సృష్టింపబడాలి, లేదా రూపొందించబడాలి. కాని డార్విన్ కి ఈ రెండు దీవులలో కనిపించిన వాస్తవం చాలా భిన్నంగా ఉంది. కేప్ వెర్దే మీద కనిపించిన జంతు జాతులకి, సమీపంలో ఉన్న ఆఫ్రికా ఖండం మీద తీరానికి దగ్గర్లో కనిపించే జంతు జాతులకి మధ్య ఎంతో సాన్నిహిత్యం కనిపించింది. కాని కేప్ వెర్దే జంతువులకి, భౌగోళికంగా పోలికలు ఉన్నా, ఎంతో దూరంలో ఉన్న గాలపాగోస్ దీవి మీద ఉండే జంతువులకి, మధ్య పోలిక మరింత తక్కువగా ఉంది. కనుక కేప్ వెర్దే మీద జంతువులు, ఆఫ్రికా తీరం మీద ఉండే జంతువులు ఒకే మూల జాతి నుండి ఉద్భవించి, దేశకాలానుగతంగా వేరుపడి ఉండాలి.





యాత్ర నుండి తిరిగి వచ్చాక అకుంఠితంగా శ్రమించి తను తెచ్చిన వైజ్ఞానిక నమూనాల నుండి ఎంతో విలువైన శాస్త్ర సారాన్ని రాబట్టాడు. ఆ సమాచారాన్ని అంతటినీ పుస్తకాలుగా రాయడం మొదలెట్టాడు. దక్షిణ అమెరికా భౌగోళిక విశేషాల మీద, అగ్నిపర్వత దీవుల మీద, పగడపు దీవుల మీద ఇలా వేరు వేరు పుస్తకాల రచన మొదలయ్యింది. తన పరిశీలనలు అటు జీవ జాతుల పరిణతుల గురించి తెలపడమే కాక, భూమి మీద వివిధ ప్రాంతాల భౌగోళిక విశేషాల గురించి కూడా ఎన్నో కొత్త విషయాలని తేటతెల్లం చెయ్యడంతో, డార్విన్ 1838 లో భౌగోళిక సదస్సుకి సెక్రటరీగా ఎన్నికయ్యాడు.





క్రమంగా వైజ్ఞానిక సమాజాలలో అతడి పరపతి పెరిగింది. లండన్ మేధావి వర్గం అతడికి సలాము చేసింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తలలో కొందరు అతడికి చిరకాల మిత్రులయ్యారు. ఆ విధంగా వైజ్ఞానిక సమాజాలలో అతడికి స్నేహితులు, శ్రేయోభిలాషులు పెరిగినా, వ్యక్తిగత జీవితంలో అతడి ఏదో వెలితి కనిపిస్తూనే ఉంది. ఏళ్లపాటు చేసిన విపరీతమైన పరిశ్రమ వల్ల బడలిక తెలియసాగింది. కాస్త సేదతీరే అవకాశం కోసం, కాస్త స్వాంతన కోసం తపించసాగాడు. ఆ తపననే ఈ మాటల్లో వ్యక్తం చేశాడు – “భగవంతుడా! ఇలా జీవితమంతా పని, పని పని, అంటూ తేనెటీగలా శ్రమించి కడతేరిపోతానేమో నని తలుచుకుంటే బెదురు పుడుతుంది. లేదు, ఇలా ఎంతో కాలం జీవించలేను. పొగచూరిన ఈ పాత కొంపలో, ఈ ఏకాంత వాసంలో, ఓ ‘పరిణామం’ రావాలి. ఓ మెత్తని సోఫా, ఆ సోఫా మీద ఓ సుతిమెత్తని భార్య, ఎదురుగా వెచ్చని చలిమంట, కొన్ని పుస్తకాలు, కాస్తంత సంగీతం… జీవితం అంటే ఇదీ! మరి నా తక్షణ కర్తవ్యం? వివాహం!”





అలాంటి సుతిమెత్తని సతి త్వరలోనే దొరికింది. బంధువుల అమ్మాయి అయిన ఎమ్మా వెడ్జ్ వుడ్ కి చార్లెస్ డార్విన్ కి మధ్య 1839 లో వివాహం అయ్యింది. తను అప్పుడప్పుడే సృష్టిస్తున్న పరిణామ సిద్ధాంతపు ముఖ్యాంశాలని భార్యకి వివరించాడు. భర్త మాట కాదనలేక ఎమ్మా తలాడించింది కాని ఇలా మత భావాలకి విరుద్ధంగా ఉన్న సిద్ధాంతానికి లోకం ఎలా స్పందిస్తుందో నని ఆమెకి లోలోపల భయం మొదలయ్యింది.





(ఇంకా వుంది)



postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts