సౌరమండలం ఆవిర్భావాన్ని గురించిన మొట్టమొదటి ఊహాగానాల గురించి ఈ వ్యాసం. ఈ విషయం గురించి రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య సంఘర్షణని వర్ణిస్తుంది ఈ వ్యాసం. సౌరమండలం, అందులోని వివిధ అంశాలు ఉపద్రవాత్మకంగా పుట్టుకొచ్చాయని ఒక సిద్ధాంతం, కాదు క్రమమైన పరిణామానికి ఫలితంగా పుట్టాయని మరొక సిద్ధాంతం అంటుంది. భౌతిక శాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్ది, సౌరమండలం గురించి మరింత సమాచారం పోగవుతున్న కొద్ది ఈ సిద్ధాంతాలలో స్పష్టత వచ్చిన తీరు ఇక్కడ వర్ణించబడుతుంది.
ఐసాక్ అసిమోవ్ రాసిన “Guide to Science” లో,’భూమి’ అనే అధ్యాయం, ఈ వ్యాసానికి మూలం.
సౌరమండలం యొక్క ఆవిర్భావం
విశాల విశ్వానికి ఎల్లలు లేకపోవచ్చు గాక. దాని బృహత్తు ముందు భూమి అత్యల్పంగా కనిపించొచ్చు గాక. కాని ఈ భూమే మనిషికి ఇల్లు. ఇదే మన ఇల్లు. మానవుడు అధునాతన వ్యోమనౌకలలో ఇరుగు పొరుగు గ్రహాలన్నీ ఎంత కలయదిరిగినా చిట్టచివరికి ఈ ఇంటికి తిరిగి రావాలసిందే.
న్యూటన్ కాలం నుండే విశ్వారంభానికి సంబంధించిన సమస్య గురించి, భూమి పుట్టుకకి సంబంధించిన సమస్య గురించి వేరువేరుగా ఆలోచించడం మొదలెట్టారు. అప్పటికే సౌరమండలానికి సంబంధించిన పరిశీలనల దృష్ట్యా సౌరమండలం యొక్క విన్యాసం గురించి, గ్రహ చలనాల గురించి కొన్ని సామాన్య విషయాలు బయటపడ్డాయి.
1. ముఖ్య గ్రహాలన్నీ సూర్యుడి సూర్యమధ్యరేఖ (sun's equator) ఉన్న తలంలోనే సూర్యుడి చుట్టూ వృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి. అంటే సూర్యుడు, గ్రహాలు అన్నీ ఇంచుమించు ఓ సమతలం మీద ఇమిడిపోతాయి అన్నమాట.
2. ముఖ్య గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ ఒకే దిశలో తిరుగుతుంటాయి. సౌరమండలం పై నుండి అంటే ధృవనక్షత్రం ఉన్న వైపు నుండి సౌరమండలం కేసి చూస్తే గ్రహాలన్నీ అపసవ్య దిశలో తిరుగుతూ కనిపిస్తాయి.
3. ప్రతీ ముఖ్య గ్రహం (కొన్ని మినహాయింపులని పక్కన పెడితే) సూర్యుడి చుట్టూ అపసవ్య దిశలో తిరిగినట్టే దాని అక్షం మీద అది (ఆత్మభ్రమణం) అపసవ్యదిశలో తిరుగుతుంటుంది. సూర్యుడి ఆత్మభ్రమణం కూడా అపసవ్య దిశలోనే జరుగుతుంది.
4. సూర్యుడి నుండి గ్రహాల దూరం క్రమంగా పెరుగుతుంది. గ్రహ కక్ష్యలు ఇంచుమించు వృత్తాకారంలోనే ఉంటాయి.
5. ఉపగ్రహాలన్నీ (కొన్ని మినహాయింపులని పక్కన పెడితే) వాటి సంబంధిత గ్రహాల చుట్టూ ఇంచుమించు వృత్తాకార కక్ష్యలలో ఆయా గ్రహాల గ్రహమధ్య రేఖ ఉన్న తలంలో, అపసవ్య దిశలో తిరుగుతుంటాయి.
గ్రహాల, ఉపగ్రహాల చలనాలలో కనిపించే ఇంత క్రమబద్ధతని గమనిస్తే మొత్తం సౌరమండలం ఓ ఏకైక మూలం నుండి ఉద్భవించి ఉండొచ్చు ననిపిస్తుంది. ఇంతకీ ఏంటా మూలం? సౌరమండలాన్ని పుట్టించిన ఆ ప్రక్రియ ఎటువంటిది? సౌరమండలం యొక్క ఆవిర్భావాన్ని వర్ణించే సిద్ధాంతాలు రెండు రకాలు. 1) ఉపద్రవాత్మక సిద్ధాంతం, 2) పరిణామాత్మక సిద్ధాంతం. వీటిలో మొదటిదైన ఉపద్రవాత్మక సిద్ధాంతం ప్రకారం సూర్యుడు తటాలున ఏమీ లేని శూన్యంలో ఒక్కసారిగా ప్రత్యక్షం అయ్యాడు; అదే విధంగా మరో విస్ఫోటాత్మక ప్రక్రియ లోంచి గ్రహాలు ఉద్భవించాయి. ఇక రెండవదైన పరిణామాత్మక సిద్ధాంతం ప్రకారం మొత్తం సౌరమండలం అంతా ఓ క్రమపద్ధతిలో కొన్ని మూలాంశాల నుండి ఆవిర్భవించింది.
పద్దెనిమిదవ శతాబ్దంలో కూడా ప్రళయానికి సంబంధించిన బైబిల్ కథల ప్రభావం శాస్త్రవేత్తల మనసుల మీద బలంగా ఉండేది. అందుకే కాబోలు భూమి చరిత్ర అంతా పెద్ద పెద్ద ఉపద్రవాలతో కూడుకుని ఉన్నట్టుగా ఊహించుకునేవారు. మరి చరిత్ర పొడవునా ఎన్నో ఉపద్రవాలు ఉన్నప్పుడు, చరిత్ర ఆరంభంలో ఓ మహా ఉపద్రవం జరిగినట్టు ఊహించుకోవడంలో ఆశ్చర్యం లేదు. అలాంటి ఊహాగానాలలో ఒకటి ఫ్రాన్స్ కి చెందిన ప్రకృతి శాస్త్రవేత్త జార్జ్ లూయీ లెక్రెక్ ద బఫాన్ ప్రతిపాదించిన సిద్ధాంతం. సూర్యుడితో ఓ పెద్ద తోకచుక్క ఢీకొన్నప్పుడు సౌరమండలం పుట్టిందని ఇతడు ప్రతిపాదించాడు. అయితే సూర్యుడితో పోల్చితే తోకచుక్కలు అత్యల్పమైన మట్టిగడ్డలని తదనంతరం తెలిసొచ్చాక సిద్ధాంతం మూలనపడింది.
ఇక పందొమ్మిదవ శతాబ్దంలో ఉపద్రవాలకి బదులు, నెమ్మదిగా పని చేసే దీర్ఘకాలిక ప్రకృతి చర్యలలో సమాధానాలు వెతకడం మొదలెట్టారు శాస్త్రవేత్తలు. ఈ కోవకి చెందిన సిద్ధాంతాలలో ఒకటి హటన్ ప్రతిపాదించిన సమనిర్మాణ సిద్ధాంతం (Hutton’s uniformitarian principle). (దీని విషయానికి మళ్లీ వద్దాం). కనుక శాస్త్రవేత్తలు వైజ్ఞానిక స్ఫూర్తి కోసం బైబిల్ ని ఆశ్రయించడం మానేసి న్యూటన్ సిద్ధాంతాలని, ప్రకృతి సహజ చర్యలని ఆశ్రయించడం ఆరంభించారు. ఓ పలుచని వాయు, ధూళి రాశి దాని అంతరంగ గురుత్వాకర్షణ ప్రభావం వల్ల క్రమంగా సంఘనితమై సౌరమండలం రూపొంది ఉంటుందని న్యూటనే సూచించాడు. ద్రవ్యరాశిలోని రేణువులు దగ్గర పడుతున్న కొద్దీ గురుత్వాకర్షణ పెరిగి, ద్రవ్యరాశి మరింత వేగంగా దగ్గర పడుతూ ఉంటుంది. చివరికి మొత్తం ద్రవ్యరాశి మన సూర్యుడి లాంటి సాంద్రమైన వస్తువుగా మారిపోతుంది. ఆ సంఘనన శక్తే కాంతి శక్తిగా మారి సూర్యుణ్ణి ప్రజ్వలింపజేస్తుంది.
0 comments