డోమ్ చుట్టూ కొంత దూరం వరకు ప్రదక్షిణ చేశాక ఒక చోట ద్వారం లాంటిది కనిపించింది. చాలా చిన్న ద్వారమది. వెడల్పు రెండు మీటర్లే. అది వృత్తాకారంలో ఉండడం వల్ల అది ద్వారం అని గుర్తించడానికి సమయం పట్టింది.
“జాగ్రత్త! అది ద్వారం కాదు” గౌరంగ్ స్వరం రేడియోలో వినిపించింది. “అదేదో ఉల్క చేసిన ఘనకార్యం.”
“అసంభవం!” ప్రొఫెసర్ అరిచినంత పని చేశాడు. “దాని ఆకృతి మరీ తీరుగా ఎవరో గీసినట్టు ఉంది.”
గౌరంగ్ ఒప్పుకోలేదు.
“ఉల్కాపాతాలు జరిగినప్పుడు ఎప్పుడూ వృత్తాకారపు గోతులే పడతాయి. దాని అంచులు చూడండి. ఏదో విస్ఫోటం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆ దెబ్బకి ఉల్క పూర్తిగా ఆవిరైపోయి ఉంటుంది. దాని అవశేషాలు కూడా దొరక్కపోవచ్చు.”
“అయినా ఇలాంటివి మామూలే,” కాప్టెన్ వర్ధమాన్ కూడా సమర్ధిస్తూ వచ్చాడు. “అవునూ, ఇది ఇక్కడ ఎంత కాలంగా ఉందన్నారూ? ఐదుమిలియన్ సంవత్సరాలా? ఇలాంటివి దీని ముఖం నిండా కనిపించకపోతే ఆశ్చర్యపడాలి.”
“సరే ఏదో ఒకటి.” ప్రొఫెసర్ కి ఈ వాదన ఎక్కువగా పొడిగించడం ఇష్టం లేకపోయింది. “నేను మాత్రం ముందు లోపలికి వెళ్తున్నా.”
“సరే అయితే...” ఇలాంటి వ్యవహారాల్లో కెప్టెన్ వర్ధమాన్ మాటే వేదం. “మీకు ఇరవై మీటర్ల పొడవున్న తాడు ఇస్తాను. మేం ఇక్కడే ఈ గొయ్యి అంచు వద్ద కూర్చుంటాం. లేకపోతే మనిద్దరి మధ్య రేడియో సంభాషణలు సాధ్యం కావు.”
ప్రొఫెసర్ విశ్వనాథం పంచమం లోతుల్లోకి ప్రవేశించాడు. ఆయన నుండి వచ్చే సంకేతాలు కెప్టెన్ వర్ధమాన్ కే అందుతుంటాయి కనుక అందరం అతడి చుట్టూ మూగాం.,
కాని ప్రొఫెసర్ పురోగమనం ఎంతో దూరం సాగలేదు. పైన కనిపించే లోహపు కవచం అడుగున మరో కవచం ఉంది.
ఈ రెండు కవచాల నడుమ ప్రొఫెసర్ పట్టేటంత స్థలం మాత్రం ఉంది. ఇంకా అడుగున టార్చి లైటు కాంతిలో కనిపించినంత మేరకు చూస్తే లోహపు ఊచల బాటలే కనిపిస్తున్నాయి. అడుగున ఉన్నది ఓ లోహపు కమ్మీల కారడవి.
మరి కాస్త లోపలికి వెళ్లడానికి మేం మరో ఇరవై నాలుగు గంటలు కుస్తీ పట్టాల్సి వచ్చింది. మందుగుండు పెడితే విషయం చిటికెలో తేలిపోవును. అన్నీ ఆలోచించే ప్రొఫెసర్ కి మందుగుండు మొసుకురావాలన్న ఆలోచన ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. అదే అడిగా. నాకేసి మళ్లీ జాలిగా చూశాడు.
“మనందరి ఉమ్మడి దహనానికి కావలసినంత మందుపాతర తెచ్చాను. కాని మనం శోధిస్తున్న వస్తువులు చాలా విలువైనవి. అది నీకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఎక్కడా విధ్వంసం జరగకుండా జాగ్రత్తపడుతున్నాను.”
ఆయన ఓర్పుని చూసి మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆయన తాపత్రయం ఏంటో ఇప్పుడు అర్థమయ్యింది. ఈ సుముహూర్తం కోసం ఆయన ఇరవై ఏళ్లు ఎదురుచూశాడు. మరి కొద్ది రోజులు ఓపిక పడితే పోయిందేం లేదు.
అలా ఆ కవచాలని భేదించడానికి అంతా కుస్తీ పడుతుంటే చివరికి ఆ రహస్యాన్ని కనుక్కున్నది ఎవరనుకున్నారు? చెప్తే నమ్మరు. మా శేషుగాడు! ఉపగ్రహం యొక్క ఉత్త్తర ధృవం వద్ద తనకో పెద్ద ఉల్కాబిలం కనిపించింది. దీని వ్యాసం ఓ వంద మీటర్లు ఉంటుందేమో. అక్కడ రెండు కవచాల్లోనూ పెద్ద రంధ్రం పడింది.
కాని రెండో కవచంలో పడ్డ రంధ్రం లోంచి లోనికి ప్రవేశించి చూస్తే అక్కడ మరో చిన్న కవచం కనిపించింది. కాని మా అదృష్టం బావుండి ఆ మూడవ కవచంలో కాస్త చిన్న రంధ్రం ఉండడం కనిపించింది. మరీ పెద్దదేం కాదుగాని ఓ స్పేస్ సూట్ పట్టేటంత పెద్దది. ఒక్కొక్కరం ఆ రంధ్రం లోంచి దూరి లోనికి ప్రవేశించాం.
ఉత్సాహంగా లోనికి దూరామన్న మాటే గాని మా అవస్థని ఏమని వర్ణించను? ఆ సమయంలో మేము సరైన పేరు కూడా లేని అనామక లోకపు లోహపు చూరు పట్టుకుని వేలాడే గబ్బిలాలం! దివికి భువికి మధ్య దిక్కులేకుండా వేలాడే విగతాత్మలం! మా టార్చిలైట్ కాంతులు ఆ లోహపు చూరు మీద నాట్యం చేస్తున్నాయి. కాని ఆ కాంతిని
“కిందికి” ప్రసరిస్తే నేల ఎంత దూరంలో ఉందో కూడా అర్థం కాకుండా ఉంది.
ఆట్టే గురుత్వం లేని ఈ చిన్నారి లోకంలో అందరం మా చూరు ఆసరా వొదిలేసి నెమ్మదిగా కిందికి కొట్టుకుపోయాం. కొంత దూరం పోయాక పైన రంధ్రానికి కట్టబడ్డ తాడే మమ్మల్ని ఆపింది. పైకి చూస్తే కవచపు నోటి వద్ద కాస్తంత కాంతి కనిపించింది. ఆ సమయంలో ఆ కాంతులే మా జీవన ఆశాకిరణాలు.
నా నడుముకి కట్టబడ్డ తాడుకి లోలకంలా కాసేపు నెమ్మదిగా వేలాడుతూ ఊగాను. కలో నిజమో తెలీని ఏదో సదసత్ లోకంలో తేలిపోతున్నట్టు ఉంది. నాకు కాస్త పైగా వేలాడుతున్న నా మిత్రుల టార్చిలైట్ కాంతులు మిణుగురుపురుగుల్లా మినుకుమినుకు మంటున్నాయ్. ఆ విచిత్ర దృశ్యాన్ని మైమరచి తిలకిస్తున్న నా తలలో ఉన్నట్టుండి ఏదో మెరుపులా మెరిసి గట్టిగా గావుకేక పెట్టాను:
“ప్రొఫెసర్! ఇదసలు ఉపగ్రహమే కాదు! ఇదో పేద్ద వ్యోమనౌక!”
(సశేషం...)
0 comments