శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

ఆంటీబయాటిక్ ల యుగం మొదలయ్యింది

Posted by V Srinivasa Chakravarthy Tuesday, October 30, 2012 0 comments
ప్రతీ క్రిమికి దాన్ని మాత్రమే అనితరంగా నాశనం చేసే మందులు ఉండాలని వాదిస్తూ, ‘magic bullet’ అన్న భావనకి ప్రాచుర్యం పెంచాడు ఎహర్లిక్. ఈ రకమైన మందుల అన్వేషణలో పడ్డాడు ఎహర్లిక్. 1907 లో ‘ట్రిపాన్ రెడ్’ (Trypan red) అనే ఒక అద్దకానికి (dye) ఆఫ్రికన్ నిద్రా వ్యాధి (African sleeping sickness) అనే ఓ వ్యాధిని అరికట్టే గుణం వుందని కనుక్కున్నాడు. అలాగే ఆర్సెనిక్ సంయోగాల (arsenic compounds) తో పని చేస్తూ ఒక ప్రత్యేక సంయోగం (దానికి 606 అని పేరు పెట్టాడు) సిఫిలిస్ రోగాన్ని నయం చెయ్యగలదని కనుక్కున్నాడు. (నిజానికి ఈ ప్రత్యేక సంయోగాన్ని ప్రయోగించి దాని లక్షణాన్ని కనుక్కున్నది ఎహర్లిక్ శిష్యుడు సహచిరో హాటా.) సిఫిలిస్ వ్యాధి యూరప్ లో ఎన్నో శతాబ్దాలుగా ఉన్నా అది లైంగికంగా సంక్రమించే వ్యాధి గనుక దాని విషయంలో జనం బయటపడేవారు కారు. కనుక రోగం అడ్డు లేకుండా పెచ్చరిల్లేది. ఈ కొత్త ఆర్సెనిక్ సంయోగం ప్రభావం వల్ల ఆ మహమ్మారి రోగం అరికట్టబడింది.

ఆర్సెనిక్ సంయోగాలకి మల్లె సల్ఫర్ ఉన్న కొన్ని కర్బన రసాయనాలకి కూడా కొన్ని ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్నాయని కనుక్కున్నారు. ఆ వర్గంలో ఒక్కొక్క రసాయనానికి ఒక్కొక్క రకమైన బాక్టీరియా మీద ప్రభావం చూపే గుణం వుంది. ఈ ప్రయత్నంలో ‘సల్ఫాపిరిడిన్’, ‘సల్ఫాథయాజోల్’ , ‘సల్ఫాడయాజీన్’, మొదలుకొని ఎన్నో కొత్త ‘సల్ఫా మందులు’ (sulfa drugs) అని పిలువబడే కొత్త ఔషద జాతి ఉత్పన్నమయ్యింది. ఈ మందుల ప్రభావం వల్ల న్యూమోకాకల్ న్యుమోనియా (pneumococcal pneumonia) వంటి ఎన్నో బాక్టిరియాల వల్ల కలిగే రోగాలు అరికట్టబడ్డాయి. ఈ రకం మందుల రూపకల్పనలో నేతృత్వం వహించిన జర్మన్ శాస్త్రవేత్త గెర్హార్డ్ డోమాక్ కి 1939 లో వైద్య, జీవక్రియా శాస్త్రాలలో నోబెల్ బహుమతి దక్కింది.కాని ఈ మందులన్నిటికన్నా అతి శక్తివంతమైన బాక్టీరియా వినాశని అనుకోకుండా జరిగిన ఓ ప్రయోగంలో బయటపడింది.

1927 లో బ్రిటన్ కి చెందిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే బాక్టీరియావేత్త స్టఫిలోకాకస్ అనే రకం బాక్టీరియాల మీద పరిశోధనలు చేస్తున్నాడు. అప్పటికే అతడు లైజోజైమ్ అనే బాక్టీరియాని నాశనం చెయ్యగల ఓ ఎంజైమ్ ని కనుక్కుని గొప్ప పేరు పొందాడు. అయితే ఇతడి ప్రయోగశాలలో తగినంత పరిశుభ్రంగా ఉండేది కాదు. కణజీవశాస్త్రంలో ప్రయోగశాలలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలి. ఈ ప్రయోగశాలలో కణసందోహాలని (cell cultures) వాటి శుద్ధ రూపంలో వేరు వేరుగా భద్రపరుస్తారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే అన్య పదార్థాలు జొరబడి కణసందోహాలు కలుషితమయ్యే ప్రమాదం వుంది.

1928 సెప్టెంబర్ 3 నాడు ఫ్లెమింగ్ ఓ నెల సెలవుల తరువాత తిరిగి తన లాబ్ కి వచ్చాడు. లాబ్ లో ఓ బల్ల మీద స్టఫిలోకాకస్ కణ సందోహాలు ఉన్న గాజు పళ్లేల దొంతర వుంది. వాటిలో ఒక పళ్ళెంలో మాత్రం కాస్త బూజు పట్టింది. ఈ బూజుకి వైజ్ఞానిక నామం శిలీంధ్రం (yeast). చిత్రం ఏంటంటే శిలీంధ్రం ఉన్న చోట మాత్రం స్టఫిలోకాకస్ కణాలు చచ్చిపోయి వున్నాయి. అంటే ఆ శిలీంధ్రం లోంచి ఏదో బాక్టీరియా నాశని పుడుతోందన్నమాట. ఫ్లెమింగ్ ఆ బూజుని శుద్ధ రూపంలో వేరేగా పెంచాడు. దాని నుండి పుట్టే ఏదో పదార్థం ఎన్నో రకాల రోగకారక బాక్టీరియాని చంపగలుగుతోంది. పెనిసీలియమ్ అనే జాతి శిలీంధ్రం లోంచి ఆ పదార్థం పుడుతోందని కనుక్కున్నాడు. అందుకే ఆ పదార్థానికి పెన్సిలిన్ అని పేరు పెట్టాడు. 1929 ఈ కొత్త మందుకి సంబంధించిన లక్షణాల గురించి వివరంగా నివేదిక రాస్తూ ప్రచురించాడు. కాని ఆ సమయంలో ఆ ప్రకటనని ఎవరూ పట్టించుకోలేదు.
(అలెగ్జండర్ ఫ్లెమింగ్ తన ప్రయోగశాలలో)పదేళ్లు గడిచాక హవర్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ చెయిన్ అనే ఇద్దరు జీవరసాయన శాస్త్రవేత్తలు ఫ్లెమింగ్ ఫలితాలని మళ్లీ పరిశీలించారు. పెన్సిలిన్ మందును పెద్ద ఎత్తున ఉత్పత్తి చెయ్యడానికి కావలసిన ప్రయత్నాలు చేశాడు ఫ్లోరీ. పెన్సిలిన్ యొక్క అత్యద్భుత క్రిమినాశక లక్షణాలు క్రమంగా బయటపడ్డాయి. న్యుమోనియా, గనేరియా, సిఫిలిస్, మెనింజైటిస్ మొదలుకొని ఎన్నో మహమ్మారి రోగాల మీద పెన్సిలిన్ బ్రహ్మాస్త్రంలా పని చేసింది. అసలు వైద్య చరిత్రలోనే పెన్సిలిన్ కి సాటి అయిన మందులేదన్నంతగా ఆ మందుకి పేరు వచ్చింది.“1928 సెప్టెంబర్ 3 నాడు ఉదయం నిద్ర లేస్తున్నప్పుడు, ఆ రోజు నేను ప్రపంచంలో మొట్టమొదటి ఆంటీబయాటిక్, బాక్టీరియా నాశని, అయిన మందుని కనుక్కుని వైద్య చరిత్రలో ఓ గొప్ప విప్లవాన్ని సాధిస్తానని ససేమిరా అనుకోలేదు. కాని ఆ రోజు చేసింది సరిగ్గా అదే,” అంటాడు ఫ్లెమింగ్ ఆ మధురక్షణాలని సింహావలోకనం చేసుకుంటూ.

పెన్సిలిన్ ఆవిష్కరణకి గుర్తింపుగా ఫ్లెమింగ్, ఫ్లోరీ, చెయిన్ లకి 1945 లో వైద్యం, జీవక్రియా శాస్త్రాలలో నోబెల్ పురస్కారం లభించింది. పెన్సిలిన్ తో ఆంటీబయాటిక్ ల యుగం మొదలయ్యింది. క్రమంగా మరింత మెరుగైన ఆంటీబయాటిక్ ల కోసం వేట మొదలయ్యింది. అలాంటి కోవలో మొట్టమొదటి ఆంటీబయాటిక్ ల జాతి ‘టెట్రాసైక్లిన్’ లు. ఇవి ‘అధిక విస్తృతి’ (broad-spectrum) గల ఆంటీబయాటిక్ లు. అంటే ఎన్నో రకాల బాక్టీరియాలని తుదముట్టించల లక్షణం గలవి.ఇలా శాస్త్రవేత్తలు కొత్త కొత్త మందులు కనిపెట్టి ఎన్నో రకాల బాక్టిరియాలని నాశనం చేస్తుంటే, బక్టీరియాలు కూడా ఆ దండయాత్రకి తట్టుకునే విధంగా రూపాంతరం చెందసాగాయి. అంతవరకు ఉన్న ఆంటీబయాటిక్ ల వల్ల నాశనం అయ్యే బక్టీరియా జాతులు కూడా, ఉత్పరివర్తనాల (mutations) వల్ల, అంటే వాటి జన్యువులలో వచ్చే మార్పుల వల్ల, కొత్త అవతారాలెత్తసాగాయి. బాక్టీరియాల ఈ కొత్త రూపాంతరాలు అంతవరకు తెలిసిన ఆంటీబయాటిక్ లకి లొంగేవి కావు. ఆ విధంగా ఒక పక్క జీవరసాయన శాస్త్రవేత్తలకి, మరో పక్క బాక్టీరియా జాతులకి మధ్య కనిపించని పోరు కొనసాగింది. ప్రత్యర్థి మొండిగా నిరోధిస్తున్న కొద్ది, దాడి మరింత ఉధృతం అవుతుంటుంది. కనుక క్రిముల మీద ఈ దారుణ రసాయనిక దాడి నానాటికి తీవ్రతరం కాసాగింది. డీ.డీ.టీ. (డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్) లాంటి క్రిమినాశక పదార్థాల విచ్చలవిడి వినియోగం పెరిగింది.

రసాయనాల ఈ విపరీత వినియోగం వల్ల మానవ జాతి రసాయనాల మీద ఇంకా ఇంకా ఆధారపడే పరిస్థితి వస్తోందని శాస్త్రవేత్తలు క్రమంగా గుర్తించసాగారు. అంతే కాక విచ్చలవిడిగా క్రిమినాశక పదార్థాలని వాడడం వల్ల క్రిముల తో పాటు మంచి కణాలని కూడా నాశనం చెయ్యడం తరచు జరుగుతుంది. దీని వల్ల మంచికి పోయి చెడు ఎదురవుతోంది. 1962 లో ఈ రేచెల్ కార్సన్ అనే అమెరికన్ రచయిత్రి ఈ సమస్య గురించి ‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకంలో విపులంగా చర్చించింది. ప్రస్తుతం చెలరేగుతున్న రసాయనిక సమరం వల్ల ఎన్నో రకాల హాని చెయ్యని జీవరాశులు కూడా నాశనం అవుతున్నాయని ఆమె ఆ పుస్తకంలో గుర్తుచేసింది. జీవరాశులు ఒక దాని మీద ఒకటి ఆధారపడుతూ ఓ విశాలమైన జీవజాలంలా మనుగడ సాగిస్తున్నాయని, మనుషులు వాటిలో కొన్నిటిని ‘శత్రు జీవాలు’ గా ముద్రవేసి వాటిని ఇష్టానుసారం నాశనం చెయ్యడం వల్ల వివిధ జీవజాతుల మధ్య ఉండే సున్నితమైన సమతౌల్యం భంగపడుతోందని ఆమె వివరించింది. కనుక ఈ రకమైన రసాయనిక సంగ్రామం వల్ల మానవజాతికి కలుగుతున్నది మేలా, కీడా అన్న విషయం గురించి ఓ సారి లోతుగా ఆలోచించుకోవాలని ఆమె సూచించింది.

బాక్టీరియాల మీద రసాయనిక యుద్ధం అలా కొనసాగుతుండగా ఓ కొత్త సమస్య వచ్చిపడింది. అంటురోగాలలో కూడా అన్ని రోగాలకి క్రిములు కారణాలు కావు. కొన్ని అంటురోగాల విషయంలో రోగకారక క్రిమి ఎంత వెతికినా దొరకలేదు. ఇక అలాంటి సందర్భాలలో ఆంటిబయాటిక్ లు పని చేసే ప్రసక్తే లేదు. ఈ రకమైన రోగాలు కొన్ని సహస్రాబ్దాలుగా మానవజాతిని వేధిస్తున్నా వాటికి కారణమైన ‘క్రిమి’ గురించిన పరిజ్ఞానం ఇరవయ్యవ శతాబ్దంలోనే ఎర్పడింది. ఆ క్రిమి ‘వైరస్’ అనే అతి సూక్ష్మమైన జీవం అని, దాన్ని నాశనం చెయ్యడానికి పూర్తిగా భిన్నమైన వ్యూహం అవసరమని మెల్లగా తెలిసింది.

(ఇంకా వుంది)
ఈ బ్లాగ్ లో ఈ మధ్యన ప్రచురించబడ్డ ఓ వ్యాసానికి,

http://scienceintelugu.blogspot.in/2012/10/blog-post_24.html?showComment=1351391583818

ఈ కింది కామెంట్ వచ్చింది.

Dr. Srinivas, do you want to make this "Science" blog like another other "Religious Science" blog? For that, there are tens of such blogs in the Telugu blogsphere, you dont need one more. Please stop this nonsense here.అందుకు నా సమాధానం, వివరణ…

Dear Anonymous,

Your point is accepted. Even I am a bit concerned about the above article. There is an unnecessary admixture of modern science and traditional stuff. From here on I will try to make sure the articles in this blog are written according to proper standards of science writing. Normally I wouldn’t write such an article. But this time, though I didn’t write it myself, I published it. There is a reason behind this lenience. Let me explain. Firstly, let me reminisce a bit…నేను యూ.ఎస్. లో పదేళ్ళు ఉండి ఇండియాకి తిరిగి వచ్చేశాను. అక్కడి సమాజంలో సైన్స్ చాలా లోతుగా వేళ్లూని ఉండడం చూసి ఆశ్చర్యం కలిగేది.పాశ్చాత్య సమాజాల్లో సైన్స్

ఒక చిన్న ఉదాహరణ –

యూ.ఎస్. లో మేం ఉన్న ఊళ్లో ఒక అధ్యాత్మిక బృందం యొక్క కార్యక్రమాలలో భాగంగా మేం మా ఊళ్లో డౌన్ టౌన్ లో పేదవారికి అన్నదానం చేసేవాళ్ళం. ఒకసారి అలాగే సాండ్ విచ్ లు, అరటిపళ్ళు ఇస్తుంటే ఒక నిరుపేద వ్యక్తి అరటిపండు అందుకుంటూ, “Oh! Banana! It has potassium!” అన్నాడు. నేనైతే అదిరిపోయాను. అప్పటికి నేను PhD చేస్తున్నాను. నాకే ఆ విషయం పెద్దగా తెలీదు. అలాంటిది ఉండడానికి నీడ, కట్టుకోడానికి సరైన బట్టలు కూడా లేని ఈ వ్యక్తికి ఆ సంగతి ఎలా తెలుసు? మన దేశంలో చిన్న చిన్న పల్లెల్లో, పెద్దగా చదువుకోని వాళ్లకి కూడా రామాయణ, భారత కథలు ఎలాగైతే బాగా తెలిసి వుంటాయో, అక్కడ సైన్స్ విషయాలు అంత లోతుగా ప్రచారం అయి వుండడం గమనించాను. అక్కడ మరింత మెరుగైన జీవన పరిస్థితులకి ఈ రకమైన సామాజిక అవగాహన మూలం అనిపించింది.మరొక ఉదాహరణ. నేను అక్కడ ఓ ఆయిల్ కంపెనీలో కొంత కాలం పని చేశాను. అదే కంపెనీలో ఓ పెద్దాయన (వయసు అరవై ఉంటుందేమో) ఓ సీనియర్ ఇంజినీరుగా ఉండేవాడు. అప్పడప్పుడు కలుసుకున్నప్పుడు సరదాగా సైన్స్ విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఈ వ్యక్తి ‘సాపేక్ష సిద్ధాంతం’ ని నమ్మడు. అదంతా తప్పని, ఐన్ స్టైన్ పప్పులోకాసేశాడని అంటాడు. ఐన్ స్టైన్ కి ముందు, సాపేక్షతాసిద్ధాంతంలోని ఫలితాలైన length contraction మొదలైన ప్రభావాలకి కారణం అంతకు ముందు Hendrik Lorenz విద్యుదయస్కాతం సిద్ధాంతం పరంగా ఇచ్చిన వివరణే సరైనది అని వాదించేవాడు. ఆయన వరస చూస్తే మరొకరైతే “నువ్వేమైనా ఐన్ స్టైన్ నే ప్రశ్నించేటంత వాడివా?” అని నవ్వుతారు. నాకైతే చాలా విస్మయం కలిగేది. ఈ వ్యక్తి ఆ కంపెనో ఓ మామూలు ఇంజినీరు. వృత్తి రీత్యా భౌతిక శాస్త్రవేత్త కూడా కాడు. అయినా అసలు ఐన్ స్టైన్ తప్పయితే ఏంటి, రైట్ అయితే ఏంటి? దానికి ఈయన ఉద్యోగానికి కూడా ఎలాంటి సంబంధమూ లేదు. పోనీ ఈయన మాట ఎవరైనా సీరియస్ గా తీసుకోవడానికి ఈయన ఏ MIT లోనో, Stanford లోనో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త కూడా కాడు. కాని ఈయనకి భౌతిక శాస్త్రం అంటే మరి అంత passion! దానికి తన ఉద్యోగానికి, తన సామాజిక స్థాయికి సంబంధం లేదు. అది కేవలం మనసుకి, బుద్ధికి సంబంధించిన విషయం!

మన దేశంలో వృత్తి రీత్యా భౌతిక శాస్త్రవేత్తలు అయిన వాళ్లలో కూడా ఎంతో మందిలో ఇలాంటి passion చూడము. (ప్రస్తుతం వేగంగా పరిస్థితులు మారుతున్నాయి. కొన్ని చోట్ల మెరుగుపడుతున్నాయి. అది వేరే సంగతి.) ఏదో మొక్కుబడిగా పాఠం చెప్పి ఇంటీకి పోతారు. ధ్యాసంతా పెన్షన్, టీయే. డీయే., ఎల్.టి.సి. మొదలైన abbreviations మీదే ఉంటుంది!(యూ.ఎస్. లో ఎన్నో కుహనా శాస్త్రాలు చలామణిలో ఉంటాయి. క్రిస్టల్ హీలింగ్, రేకీ మొదలైనవి ఎన్నో ప్రచారంలో ఉంటాయి. కాని ఆధునిక వైజ్ఞానిక సమర్థన వాటికి లేదన్న అవగాహన సామాన్యంగా జనంలో ఉంటుంది. మన సమాజంలో అలాంటి విచక్షణ కనిపించదు.)మన సమాజంలో సైన్స్


ఇలా ఎన్నో ఉదాహరణలు ఇస్తూ పోగలను. అక్కడ సమాజంలో సైన్స్ ప్రభావం, వైజ్ఞానిక విధానాల ప్రభావం బాహ్యప్రపంచం మీద అడుగడుగునా కనిపిస్తుంది. అది మన దేశంలో కొరవడుతుంది. మన దేశంలో వ్యవస్థాత్మకంగా చూస్తే ఎన్నో సైన్స్ సంస్థలు ఉన్నాయి – విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు వగైరాలు ఉన్నాయి. కాని చుట్టూ ఉన్న సమాజం మీద వాటికి సజీవమైన, సంచలితమైన ప్రభావం ఉండదు. సైన్స్ అనే సజీవ శక్తి ఇక్కడ మన సంస్థలని గాని, వాటిని పోషించే సమాజాన్ని కాని ఉత్తేజపరిచి, ఉద్ధరించి, ఉద్దేపింపజేస్తున్నట్టు కనిపించదు.


మన సమాజంలో సైన్స్ బాగా వేళ్లూనడానికి ఓ పెద్ద ప్రతిబంధకం మన సాంప్రదాయబద్ధమైన భావాలు అని చాలా మంది అన్నారు. నేకు కొత్తగా చెప్తున్నది కాదు. మన దేశంలో సాంప్రదాయ భావాలు విపరీతంగా చలామణి అవుతాయి. ‘కుంపుపూవు పాలలో కలుపుకుని తాగుతే తెల్లబడతారు.’ ‘వెల్లకిల్లా పడుకుంటే దెయ్యాలు వచ్చి వాలతాయి.’ ఇలా కోకొల్లలు.


ఇక ఇప్పుడు ఓ ఫ్యాషను ఏంటంటే సాంప్రదాయ భావాలకి ఓ సన్నని, మేలిమి సైన్స్ పూత పులమడం. ‘మడి ఆచారాలకి అసలు కారణం పరిశుభ్రత. తాకితే అంటురోగాలు వస్తాయి అని డాక్టర్లు చెప్తారు. అందుకే వండేటప్పుడు మడిగా వండాలి.’ ఈ వాదనలో బోలెడు దోషాలు – 1) అంటురోగాలు ఉన్న పరిస్థితుల్లో తాకితే సమస్య, కాని ఇంట్లో అందరికీ అంతో ఇంతో ఆరోగ్యం వుందని తెలిస్తే అంత విపరీతంగా చర్యలు తీసుకోనక్కర్లేదు. 2) అంటురోగాలు రాకుండా చర్యలు తీసుకునేట్లయితే, కేవలం వండేటప్పుడే కాదు అన్ని వేళలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3) ఈ పరిశుభ్రతా స్ఫూర్తి (!) ఇంటికే పరిమితం కాకూడదు, వీధిలో కూడా వర్తించాలి.


ఇంత కన్నా ఘోరమైన racket ఒకటి వుంది. సైన్స్ ని తప్పుగా వ్యాపారప్రయోజనాల కోసం వాడుకోవడం. ఆ మధ్యన ఓ తెలుగు చానెల్ ఓ ప్రోగ్రాం చూశాను. ఎవడో మణిమాణిక్యాలు అమ్ముతున్నాడు. అవి పెట్టుకుంటే ఎలాంటి ‘దోషాలు’ తొలగిపోతున్నాయో చెప్తున్నాడు. అక్కడితో ఆగిపోతే బాగుణ్ణు, వాణ్ణి పూర్తిగా క్షమించేసేవాణ్ణే! అందరిలాగా కాక, వాడు ఆ రంగురాళ్లని ‘సైంటిఫిక్ గా’ పరీక్షించి వాటి ‘నాణ్యత’ వెలకట్టి అమ్ముతున్నాడట. ఇక్కడ నాణ్యత అంటే రెండర్థాలు – వైజ్ఞానికంగా పరీక్షించి ఫలనా రాయి నిజంగా గోమేధికమేనా, నిజంగే కెంపేనా తేల్చి చెప్పడం ఒకటి. ఆ రాయి వల్ల నిజంగా ‘దోషాలు’ తొలగుతాయా, ధనలాభం ఉంటుందా, మగపిల్లలు పుడతారా, చక్కని చుక్క లాంటి పెళ్లాం వస్తుందా మొదలైనవన్నీ ‘సైంటిఫిక్’ గా తేల్చి చెప్పడం వేరు!


ఇలా ఉండగా ‘ఇవన్నీ వేదాల్లోనే ఉన్నాయిష’ అనే బాపతు జనం కుప్పలుతెప్పలు. ఆ మధ్య ఓ తెలుగు బ్లాగ్ లో చదివాను. చంద్రయాన్ మిషన్ పూర్తయ్యాక చంద్రుడి మీద నీరు ఉందని తెలిసింది. ఆ నేపథ్యంలో ఆ తెలుగు బ్లాగ్ లో ఒకాయన రాస్తున్నాడు. చందమామ మీద నీరు ఉందని మన పూర్వీకులకి ఏనాడో తెలుసునట. వాదన మహా పసందుగా ఉంటుంది వినండి. శివుడి తల మీద చందమామ ఉంటాడు, ఆ పక్కనే గంగ కూడా ఉంటుంది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న గంగ చంద్రుడి మీద కూడా పడగా, చంద్రుడు తడిసి ముద్దయిపోయాడు!ఇంకా దారుణమైన ఓ ఉదాహరణ. ఈ మధ్య ఓ శాస్త్రవేత్త, ఓ సహోద్యోగి నాతో అంటున్నాడు. “అందుకే మన పూర్వీకులు బంగారం ఎప్పుడూ నడుముకి పైనే పెట్టుకోవాలని, వెండి మాత్రం నడుముకి కింద పెట్టుకోవాలని అంటారు.” ఇక్కడితో ఆగితే అదేదో ఆనవాయితీ అని సరిపెట్టుకోవచ్చు. కాని దీనికో ‘సైంటిఫిక్’ పూత – “ఎందుకంటే (!) బంగారం రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, వెండి రక్తాన్ని శుద్ధి చేస్తుంది!” నాకైతే కాసేపు నోట మాట రాలేదు. ఒంటిమీద పెట్టుకునే నగ రక్తప్రసారాన్ని ఎలా పెంచుతుంది, రక్తాన్ని ఎలా శుద్ధి చేస్తుంది? అసలు రక్తాన్ని ‘శుద్ధి’ చెయ్యడం అంటే ఏంటి?ఇతర ప్రపంచ సంస్కృతులలో కూడా ఏవో పురాణాలు, ఇతిహాసాలు ఉంటాయి. వాటిని ఓ కళారూపంలా చూసి గౌరవిస్తాయి, ఆనందిస్తాయి గాని. కాని వాటిని మనం చేసినట్టుగా ఆధునిక విజ్ఞానంతో కలిపి, కలగాపులగం చెయ్యవు. అలా కలగా పులగం చేసినా అక్కడి వైజ్ఞానిక సమాజం అంతా ముక్తకంఠంతో అభ్యంతరం చెప్పి ఆ పొరబాటుని ఎప్పటికప్పుడు సరిదిద్దుతుంటుంది. కాని మన దేశంలో వైజ్ఞానిక సమాజం అసలు సమాజం అనేదే లేనట్టు ప్రవర్తిస్తుంది!అలాగే మనిషి, మనసు ఉన్నంత కాలం అధ్యాత్మికత అనేది ఉంటుంది, ఆ రంగంలో ఏదో శోధన జరుగుతూనే ఉంటుంది. కాని సైన్స్ రంగం వేరు అధ్యాత్మిక రంగం వేరు. మన సమాజంలో కూడా ఈ రెండు రంగాలని కలగలిపి, అల్లకల్లోలం చేస్తాము.జ్ఞాన సంకరం

ఇలాంటి జ్ఞాన సంకరం మన సమాజానికి మంచిది కాదని నాకపిస్తుంది.

సైన్స్ ని శుద్ధ రూపంలో అర్థం చేసుకోవాలి, ఆచరించాలి, ప్రకటించాలి, ప్రచారం చెయ్యాలి. ఇంగ్లీష్ లో అలా సైన్స్ ని ప్రచారం చేసే అద్భుత సాంప్రదాయం ఉంది. భారతీయ భాషల్లో అది లేదు. అలాంటిది ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది.బ్లాగ్ ని ప్రారంభించిన కొత్తల్లో పైన చెప్పిన సమస్యలన్నీ ఏకరువు పెడుతూ కాస్త వ్యంగ్యంగా ఓ వ్యాసం రాశాను. అందులో - ‘మన సమాజంలో (తెలుగులో) సివిల్ ఇంజినీరింగ్ మీద పుస్తకాలు ఉండవు కాని, వాస్తు మీద పుస్తకాలు కోకొల్లలు,’ మొదలైన విసుర్లు విసిరాను. అది చదివి జనం మీద పడిపోయారు.

(http://scienceintelugu.blogspot.in/2009/07/blog-post_21.html )

‘నీకసలు మన సంస్కృతి మీద గౌరవం లేద’ న్నారు. ‘ఆయుర్వేదానికి, ఆధునిక ఫార్మకాలజీకి మూలాలు ఒక్కటే నని నీకు తెలీదా?’ అని నిలదీశారు. (అవునా? ఆయుర్వేదానికి మూలాలు వాత పిత్త కఫాలనే దోషాల సమతౌల్య సిద్ధికి చెందినవని, ఆధునిక ఫార్మకాలజీ కి మూలాలు biochemistry, cell and molecular biology లో ఉన్నాయని నే విన్నాను!) నీకసలు దేశభక్తి లేదన్నట్టు మాట్లాడారు. అలాంటి స్పందనకి నేను అదిరిపోయాను. ఆ వ్యాఖ్యానాలన్నిటికీ నాకు సహేతుకమైన జవాబులు ఉన్నాయి. కాని హేతువుని వినిపించుకునే పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపించలేదు వాళ్ళు.


‘యోగం అంటే నీకేంతెలుసు?’ అని అడిగాడు ఒకాయన. అందుకు జవాబుగా మాత్రం భారతీయ అధ్యాత్మిక చరిత్ర అన్న అంశం మీద వరుసగా కొన్ని వ్యాసాలు రాసి ఊరుకున్నాను. బుద్ధుడి నుండి, శ్రీ అరొబిందో దాకా అధ్యత్మిక రంగంలో భావాల పరిణామ క్రమాన్ని వర్ణిస్తూ వచ్చాను. దానికి మళ్లీ ఒక్క సమాధం లేదు! ( ఆ వ్యాసాలు ఇప్పుడు నెట్ లో లేవు. ఈ సారి మళ్లీ ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. )

(ఆ వ్యాసమాలికలో నేను ‘శ్రీరామకృష్ణుల’ మీద రాసిన వ్యాసంలో భాగాన్ని ఎవడో కొట్టేసి ఇక్కడ పెట్టుకున్నాడు.

http://bhaktipustakam.blogspot.in/2011/08/19.html అది వేరే సంగతి!)ఆ రోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. సమస్య నేను ఊహించిన దాని కన్నా చాలా లోతుగా వుంది. ఇది అంత సులభంగా మారేది కాదు. ఎందుకంటే ఎక్కడో పల్లెల్లో, పూర్తిగా నిరక్షరాస్యులు అలాంటి భావాలు పట్టుకుని వేలాడితే అర్థం చేసుకోగలం. కాని ఇంటర్నెట్ లో ప్రవేశం ఉండి, చదువు ఉండి, మంచి ఉద్యోగంలో ఉన్న వారు కూడా ఇలా…శాస్త్రవిజ్ఞానం బ్లాగ్ లో కూడా ఈ తీరులో కొన్ని సార్లు వ్యాఖ్యానాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే నవ్వు వస్తుంది, బాధ కలుగుతుంది, భయం వేస్తుంది. ఇదంతా ఎప్పటికి మారుతుంది?


శాస్త్రవిజ్ఞానం బ్లాగ్ లో కుడా ఒక సారి నా మిత్రులు శ్రీరాముడిజన్మ నక్షత్రం లోని ‘ఖగోళ విజ్ఞానం’ గురించి, వినాయక చవితికి సంబంధించిన ‘ఖగోళ విజ్ఞానం’ గురించి రాశారు. ఏదో కొంత అభ్యంతరం చెప్పినా మిత్రులు కనుక ఏమీ చెయ్యలేకపోయాను.ఈ ‘శాస్త్రవిజ్ఞానం’ బ్లాగ్ మూడేళ్లకి పైగా నడుస్తోంది. మంచి స్పందన వచ్చింది. చాలా మంది రీడర్లు, ఫాలోయర్లు చేరారు.

కాని కామెంట్లు పెద్దగా ఉండవు. ఉన్నా ఏదో ‘nice’ అనో ‘keep it up’ అనో అతి క్లుప్తంగా ఉంటాయి! వ్యాసం మీద చర్చ ఉండదు. (ఇంగ్లీష్ లో సైన్స్ బ్లాగ్ లలో ఎన్నో సందర్భాల్లో వ్యాసం మీద చక్కని చర్చ కనిపిస్తుంది. )కనుక నిజంగా ఈ వ్యాసాలలో బ్లాగర్లు ఏం చూస్తున్నారో తెలీదు. చాలా మంది సాంప్రదాయానికి నిర్ధారణ సైన్స్ లో ఉందేమో నని వెతుక్కుంటూ ఉంటారు. అంతే కాని సైన్స్ ని సైన్స్ లాగా చూడరు. ఈ బ్లాగ్ కి అందుకోసమే వస్తే ఒకవిధంగా దురదృష్టమే. ఇది చాలనట్టు వ్యాసకర్తని అతిగా పొగిడేవారు ఒకరైతే, అంతగా పొగడనక్కర్లేదని మరొకరు. దీనికి తోడు తెలుగులో మన “సాంస్కృతిక వారసత్వం” అయిన చవకబారు భాష ఇక్కడ కూడా ప్రత్యక్షమై నిరుత్సాహ పరుస్తుంది.

(ప్రతీ చర్చలోను ఒక వ్యక్తిని తిట్టడమో, పొగడడమో తప్ప, ఆ వ్యక్తి అన్న మాటలని వస్తుగత దృష్టితో చూసి విశ్లేషించి, చర్చించే సంస్కారం మన సమాజంలో ఇంచుమించు లేనట్టే. మరి ఏం చేద్దాం?)


ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి విసుగు పుడుతుంది. ఏం రాస్తే యేం? అనిపిస్తుంది. నచ్చింది రాస్తే సంతోషిస్తారు. నచ్చంది రాస్తే, వారి నమ్మకాలని ప్రశ్నించేది రాస్తే, అది నిజమైనా సరే, దుమ్మెత్తిపోస్తారు. ఇక అధికశాతం మంది ఏం రాసినా మౌనంగా ఉండిపోతారు.


అనానిమస్!

మీ కామెంట్ తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నిజానికి అలాంటి ప్రమాణాల ప్రకారమే సైన్స్ రచన చెయ్యాలి. కాని అలాంటి ప్రమాణాలని ఎంత మంది ఒప్పుకుంటారు, ఎంత మంది కోరుకుంటారు? “మన పూర్వీకులు చెప్పిందల్లా శుద్ధవైజ్ఞానికం” అని నిరూపించుకోవాలన్న ఆత్రుతే మళ్లీ మళ్లీ కనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు ‘ప్రాచీన భారత విజ్ఞానం’ మీద వ్యాసాలు రాస్తే బోలెడు స్పందన వస్తుంది! దాని మీద చాంతాడంత చర్చ వుంటుంది. నిజంగా ఎంతో ఆలోచించి ఓ చక్కని సైన్స్ వ్యాసం రాస్తే అందుకు ‘nice’ కి మించి స్పందన వస్తే గొప్ప! మనం కోరుకునేది విజ్ఞానం కాదు. మనం కోరుకునేది మనం గొప్ప, మన జాతి గొప్ప, మన పూర్వీకులు గొప్ప, మన సంస్కృతి గొప్పది అనే అర్థం లేని అహంకారానికి అర్థం లేని సమర్థింపు!కాని మీ కామెంట్ చూశాక సంతోషం కలిగింది. నా విసుగు చెరిగిపోయింది. ఏది సైన్స్, ఏది కాదు అన్న sensitivity ఉన్న వారు బ్లాగ్ లోని వ్యాసాలు చదువుతున్నారని, చాలా నిశితంగా, critical గా వ్యాసాలని పరిశీలిస్తున్నారని అర్థమయ్యింది. అంతకన్నా సంతోషకరమైన విషయం మరొకటి లేదు.ఇప్పట్నుంచి అత్యున్నత జన విజ్ఞాన సాహితీ ప్రమాణాలని అనుసరించి ఈ బ్లాగ్ లో సైన్స్ వ్యాసాలని రాయడానికి, ప్రచురించడానికి ప్రయత్నిస్తాను.

మీ కామెంట్ కి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ,-శ్రీనివాస చక్రవర్తి

1860 లలో ఫ్రాన్స్ కి చెందిన పట్టుపరిశ్రమ కొన్ని ఇబ్బందులకి గురయ్యింది. ఏదో తెలీని రోగం వల్ల పెద్ద సంఖ్యలో పట్టుపురుగులు చచ్చిపోయేవి. అంతకు ముందే సూక్ష్మదర్శిని వినియోగం గురించి, దాని లాభాల గురించి తెలిసిన పాశ్చర్, ఆ పరికరాన్ని ఉపయోగించి రోగానికి కారకమైన సూక్ష్మక్రిములని కనుక్కున్నాడు. రోగం సోకిన పురుగులని, అవి తినే మల్బరీ ఆకులని ఏరివేయించి, వాటిని నాశనం చేయించాడు. రోగం సోకిన పురుగుల సంపర్కం లేకపోవడం వల్ల మిగతా పురుగులు ఆరోగ్యంగా మిగిలాయి. ఆ విధంగా ఫ్రెంచ్ పట్టుపరిశ్రమని నిలబెట్టాడు పాశ్చర్.
ఉత్కృష్టమైన వైన్ కి ప్రసిద్ధమైన ఫ్రాన్స్ లో ఆ దశలో వైన్ పరిశ్రమకి కూడా అలాంటి సమస్య ఒకటి వచ్చి పడింది. ఏవో తెలీని కారణాల వల్ల వైన్ కొన్ని సార్లు పులిసిపోయి పాడైపోయేది. పాడైన వైన్ ని సూక్ష్మదర్శినిలో పరిశీలించిన పాశ్చర్ ఈ సమస్యకి కారణమైన క్రిములని కనుక్కున్నాడు. ఈ క్రిములని నాశనం చేసేందుకు గాని వైన్ తయారీకి వాడే విధానాన్ని కొద్దిగా సవరించాడు. వైన్ ని తగినంతగా మరగబెడితే లోపల ఉన్న క్రిములు చచ్చిపోతాయి. ఆ తరువాత వైన్ ని శీతలపరుస్తారు (refrigerate చేస్తారు) కనుక మిగిలిన క్రిములు స్తబ్దుగా ఉండిపోతాయి.ఇలాంటి అనుభవాలని ఆధారంగా చేసుకుని పాశ్చర్ క్రిములకి, రోగాలకి మధ్య సంబంధాన్ని గుర్తించాడు. ఆ విధంగా germ theory of disease (క్రిముల వల్ల రోగాలు కలుగుతాయి అన్న సిద్ధాంతం) ఆవిర్భవించింది. ఈ క్రిములలో చాలా మటుకు బాక్టీరియా కావడంతో బాక్టీరియా ప్రాధాన్యత పెరిగింది. వాటి మీద ‘bacteriology’ అనే శాస్త్రం కూడా పుట్టింది.

కేవలం మరిగించడం మొదలైన ప్రాథమిక ప్రక్రియల వల్ల బాక్టీరియాలని నాశనం చెయ్యడం అన్ని సందర్భాలలోను వీలుపడదు. శరీరంలో ఉంటూ రోగానికి కారణమైన బాక్టీరియాని మరిగించేదెలా!? కనుక రసాయనాల ద్వారా బాక్టీరియాల మీద దండయాత్ర మొదలయ్యింది.

అలా ధ్వజం ఎత్తిన వారిలో ప్రథముడు బహుశ ఇంగ్లండ్ కి చెందిన జోసెఫ్ లిస్టర్ (Joseph Lister). దెబ్బ తగినప్పుడు ఏర్పడే పుండులో బాక్టీరియా ప్రవేశించి పుండు infect కావడం జరుగుతుంది. ఇది తెలుసుకున్న లిస్టర్, ఫీనాల్ (కార్బాలిక్ ఆసిడ్) ని ఉపయోగించి ముందు పుండుని శుభ్రం చేసే పద్ధతి మొదలెట్టాడు. ఇలా శుభ్రం చెయ్యడం వల్ల గాయం మరింత త్వరగా నయం అయ్యింది.

ఆ విధంగా గాయం కుళ్ళకుండా (sepsis) నివారించే రసాయనాల కోసం వేట మొదలయ్యింది. సెప్సిస్ ని నిరోధించే రసాయనాలకి ఉమ్మడిగా ఆంటీ-సెప్టిక్ (anti-septic) లు అని పేరు పెట్టారు.

అలాంటి ప్రయత్నంలో బయటపడ్డ మరో రసాయనం ఐయొడిన్ (iodine). ఫ్రెంచ్ వైద్యుడు కాసిమిర్ డవేన్ 1873 లో ‘టించర్ ఆఫ్ అయొడిన్’ యొక్క క్రిమిసంహారక లక్షణాల గురించి అధ్యయనాలు చేశాడు.

పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా ఎక్కడ క్రిములు ఉన్నాయని తెలిసినా కొన్ని సామాన్య రసాయనాలు వాడి వాటిని నిర్మూలించే మోటు పద్ధతే కొంత కాలం కొనసాగింది. అంతే కాని ఏ రోగానికి ఏ క్రిమి కారణం, ఏ క్రిమికి ఏ రసాయనం విషం? – ఇలాంటి ప్రశ్నలకి జవాబులు లేవు. ఆ ధోరణిలో ఆలోచించినవాడు రాబర్ట్ కాక్ (Robert Koch) అనే జర్మను వైద్యుడు.

వివిధ రోగాలకి కలుగజేసే బాక్టీరియాలని వేరు చేసి, వాటిని వర్గీకరించే ప్రయత్నానికి పూనుకున్నాడు కాక్. బాక్టిరియాలని వేరు చేసి నిలువ ఉంచే ప్రయత్నంలో మొదట్లో ఓ సమస్య ఎదురయ్యింది. అంతవరకు అలాంటి అధ్యయనాలు చేసిన పాశ్చర్ బాక్టీరియా లని ద్రవాలలో నిలువ ఉంచేవాడు. కాని ద్రవంలో అయితే క్రిములు ద్రవంతో పాటు అటు ఇటు మసలుతూ ఉంటాయి. వాటిని స్థిరంగా ఒక చోట నిలిపేందుకు గాని ద్రవాలని కాకుండా, ఘన పదార్థంలో వాటిని నిలిపే పద్ధతి కనిపెట్టాడు కాక్.

జెలటిన్ (gelatin) అనే జిగురు లాంటీ, జెల్లీ లాంటి పదార్థంలో బాక్టీరియాలని స్థిరపరిచడం మొదలెట్టాడు కాక్. అలాంటి మాధ్యమంలో ఒక చోట ఒక ఏకాంత బాక్టీరియాని ప్రవేశపెడితే అది అక్కడే కదలకుండా ఉండడమే కాక, దాని సంతతి కూడా అదే ప్రదేశంలో ఓ రాశిగా వృద్ధి చెందుతుంది. ఈ విధంగా సంకరం లేని ‘శుద్ధ సంతతి’ (pure strains) ని సాధించడానికి వీలయ్యింది. రాబర్ట్ కాక్ కి జూలియస్ పెట్రీ (Julius Petri) అనే ఓ సహచరుడు ఉండేవాడు. ఇతగాడు కాస్త లొత్తగా, ప్రమిదలలా, ఉండే గాజు గిన్నెలలో బక్టీరియాలని ఉంచి వాటి మీద మూతలు పెట్టే పద్ధతి అనుసరించేవాడు. మూత లేకపోతే గాలిలో కొట్టుకొచ్చే బాక్టీరియా, గిన్నెలో ఉన్న బాక్టీరియాతో కలిసి వాటిని కలుషితం చేసే ప్రమాదం వుంది. పెట్రీ వాడిన ఈ రకమైన గాజు పళ్లేలనే ఇప్పుడు ‘పెట్రీ డిష్’ (Petri dish) అంటున్నాం.ఇలాంటి మెరుగైన పద్ధతులతో కాక్ కొన్ని ముఖ్యమైన రోగకారక క్రిములని గుర్తించగలిగాడు. ఉదాహరణకి ట్యూబర్ క్యులోసిస్ (టీ.బీ.) కి కారణం బాసిలస్ అనే ఒక రకమైన బాక్టీరియా అని కనుకున్నాడు. అలాగే కలరాకి కారణమైన బాక్టీరియా ని కూడా కనుక్కున్నాడు. ఈ విజయాలకి గుర్తింపుగా రాబర్ట్ కాక్ కి 1905 లో వైద్యం, జీవక్రియాశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు.

ఇప్పుడు వివిధ రకాల బాక్టిరియాల గురించి తెలిసింది గాని, వాటికి తగ్గ మందులు ఇంకా కనుగొనబడలేదు. అంతవరకు వాడే ఆంటీసెప్టిక్ ల లాంటి మందులు సర్వసామాన్యంగా అన్ని రకాల కణాల మీద పని చేసే మందులు. అవి బాక్టీరియా తో పాటు ఆరోగ్యవంతమైన దేహ కణాలని కూడా నాశనం చేస్తాయి. అలా కాకుండా ప్రతీ క్రిమికి దాన్ని మాత్రమే ప్రత్యేకంగా చంపగల మందులని రూపొందించాలని పాల్ ఎహర్లిక్ (Paul Ehrlich) అనే జర్మన్ వైద్యుడు వాదించాడు. అలా సూటిగా, అనితరంగా లక్ష్యాన్ని భేదించే మందుకి ‘magic bullet’ అని పేరు పెట్టాడు ఎహర్లిక్.

(ఇంకా వుంది)లూయీ పాశ్చర్ గురించి ఓ చక్కని ఆనిమేషన్ వీడియో ఇక్కడ వుంది. పిల్లలకి నచ్చుతుంది.

http://www.youtube.com/watch?v=XrKiNp2uI_0

రాబర్ట్ కాక్ నోబెల్ ఉపన్యాసం - http://www.nobelprize.org/nobel_prizes/medicine/laureates/1905/koch-bio.htmlపెట్రీ డిష్ ల గురించి ఓ సరదా పజిల్

ఓ పెట్రీ డిష్ లో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండుకి ఒకే బాక్టిరియం వుంది. ఈ రకం బాక్టీరియా నిముషానికి ఒక సారి విభజన చెంది రెండుగా విడిపోతాయి. 47 నిముషాల తరువాత డిష్ సగానికి నిండింది. మొత్తం డిష్ నిండడానికి ఎంత సేపు పడుతుంది?

http://richardwiseman.wordpress.com/2009/09/11/its-the-friday-puzzle-24/

వైరస్ కథ

Posted by V Srinivasa Chakravarthy Wednesday, October 24, 2012 2 comments

వైరస్ కథ
వైరస్ లు రోగాన్ని కలుగజేసి, ప్రాణాన్ని కూడా హరించగల అతి సూక్ష్మమైన జీవరాశులు.

జీవప్రపంచానికి, అజీవప్రపంచానికి మధ్య సరిహద్దు మీద ఉండే అతి సూక్ష్మమైన వస్తువులు వైరస్ లు. అసలు అంత సూక్ష్మమైన జీవరాశులు ఉంటాయని ఎవరూ ఊహించలేకపోయారు. అందుకే వైరస్ ల గురించి సరైన అవగాహన కలగడానికి ఇరవయ్యవ శతబ్దం వరకు ఆగాల్సి వచ్చింది.పూర్వచరిత్ర

పదిహేడవ శతాబ్దానికి ముందు మనిషికి తెలిసిన అత్యంత సూక్ష్మమైన జీవరాశులు పురుగులు. అంత కన్నా చిన్న ప్రాణులు అసలు ఉండలేవని అనుకునేవారు. అందుకే “భూతద్దాల” (కుంభాకార కటకాలు, convex lenses) గురించి కొన్ని వేల ఏళ్లుగా మనిషికి తెలిసినా ఆ “అద్దాలు” ఉపయోగించి పురుగుల కన్నా చిన్న వస్తువుల కోసం వెతకాలన్న ఆలోచన కూడా చాలా కాలం వరకు ఎవరికీ తట్టలేదు. అయితే భూతద్దాలతో చిన్న చిన్న అక్షరాలు కూడా చదవచ్చని, వాటితో కళ్ళ జోళ్లు తయారుచేసి దృష్టి దోషాన్ని సరిచేసుకోవచ్చని కొన్ని శతాబ్దాలుగా మనుషులకి తెలుసు.

1608 నెదర్లండ్ కి చెందిన హన్స్ లిపర్షే (Hans Lippershey) అనే కళ్ళద్దాలు చేసే వ్యక్తి రెండు కుంభాకార కటకాలని ఒక విధంగా పేర్చి ఓ గొట్టంలో అమర్చితే దూరంగా ఉన్న వస్తువులు దగ్గరగా కనిపిస్తాయని కనుక్కున్నాడు. దానికి telescope (దూరదర్శిని) అని పేరు పెట్టాడు. ఈ పరికరానికి త్వరలోనే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా దూరంగా శత్రుసేనలని గుర్తుపట్టొచ్చు కనుక దీనికి యుద్ధ ప్రయోజనాలు కూడా ఉన్నాయని కనుక్కున్నారు.

ఈ దూరదర్శిని ఇటాలియన్ శాస్త్రవేత్త, ఆధునిక భౌతిక శాస్త్రానికి పితామహుడు అయిన గెలీలియో గెలీలీ కంటపడింది. ఈ పరికరాన్ని ఉపయోగించి ఆయన ఊరికే ఉబుసుపోక కోసం ఇరుగు పొరుగు దృశ్యాలు చూడకుండా, ఏకంగా దాన్ని ఆకాశం కేసి ఎక్కుపెట్టాడు. అంతవరకు అగోచరంగా ఉన్న సువిస్తారమైన విశ్వం ఆయనకి కోటికళలతో దర్శనమిచ్చింది. ఆధునిక ఖగోళశాస్త్రానికి శ్రీకారం చుట్టింది.

దూరదర్శినితో ప్రయోగాలు చేసిన గెలీలియో మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తించాడు. అందులోని కటకాలని మరో విధంగా అమర్చితే అతి సూక్ష్మమైన వస్తువులని సంవర్ధనం చేసి పెద్దగా కనిపించేలా చెయ్యొచ్చు. అలా పుట్టిందే మొట్టమొదటి సూక్ష్మదర్శిని (microscope). సూక్ష్మదర్శినితో గెలీలియో పెద్దగా ఏమీ చెయ్యకపోయినా ఆయన తరువాత తదితరులు దాంతో ఎన్నో పరిశీలనలు చేశారు.

ఇటాలియన్ ప్రకృతి శాస్త్రవేత్త ఫ్రాన్సెస్కో స్టెల్లుటీ దాంతో పురుగుల శరీర నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఇటాలియన్ వైద్యుడు మార్సెల్లో మాల్ఫీజీ దీంతో సూక్ష్మమైన రక్తనాళాలని పరిశిలించాడు. రాబర్ట్ హూక్ దీని సహాయంతో బిరడా (cork) లోని కణాలని పరిశీలించాడు.

(కాస్త మన రేలంగి గార్ని తలపించే ఆంటొనీ వాన్ లీవెన్హాక్!)


తరువాత నెదర్లండ్స్ కి చెందిన ఆంటొనీ వాన్ లీవెన్హాక్ (1632-1722) ఈ సూక్ష్మదర్శినికి బాగా మెరుగులు దిద్దాడు. ఇతడి సూక్ష్మదర్శిని వస్తులని 200X రెట్లు సంవర్ధనం చేసి చూపగలిగింది. లీవెన్హాక్ ఒక రోజు అలవోకగా ఓ వర్షపు నీటి చుక్కని తన సూక్ష్మదర్శిని కింద పెట్టి చూసి తనకి కనిపించిన దృశ్యానికి అదిరిపోయాడు. అందులో అతడికి సంచలనంగా జీవం ఉన్నట్టుగా కదిలే వస్తువులు కనిపించాయి. వాటిని అతడు “చిన్నారి జీవాలు” (wee animalcules) అని “గంతులేసే జంతువుల” ని (cavorting beasties) ముద్దుగా పేర్లు పెట్టుకున్నాడు. ఆ వస్తువుల చలనం గురించి తన మాటల్లోనే విందాం – “పైకి, కిందికి కదులుతూ, చక్కర్లు కొడుతూ నీట్లో వాటి చలనం ఎంత వేగంతో, ఎంత వైవిధ్యంతో కూడుకుని ఉందంటే వాటిని చూసి అబ్బురపడకుండా ఉండలేకపోయాను. వీటిలో కొన్ని నేను ఇంతవరకు చూసిన అతి చిన్న జీవాల కన్నా వేల రెట్లు చిన్నవి… ఇక మరి కొన్ని అయితే [ఎంత చిన్నవంటే] ఒక్క నీటి బొట్టులో కోటానుకోట్లు పట్టేస్తాయేమో…”
(లీవెన్హాక్ సూక్ష్మదర్శినిలో తనకి కనిపించిన "చిన్నారి జీవాల" చూసి వేసిన చిత్రాలు)


దైవచింతన గాఢంగా గల లీవెన్హాక్ ఈ అద్భుత దృశ్యాలన్నీ చూసి “ఆహా! దైవ సృష్టి!” అని సంబరపడిపోయాడు.

లీవెన్హాక్ చూసి మురిసిపోయిన “చిన్నారి జీవాలు” నిజానికి ప్రొటోజువా అనబడే ఏకకణ జీవాలు.

రోగాన్ని కలుగుజేసే ‘క్రిములు’ ఇవి కావు. అవి ఇంత కన్నా బాగా చిన్నవి. లీవెన్హాక్ చేసినట్టే సూక్ష్మదర్శినితో మరిన్ని పరిశీలనలు చేసిన ఆటో ముల్లర్ అనే ఓ డేనిష్ శాస్త్రవేత్త రెండు రకాల “చిన్నారి జీవాల”ని కనుక్కున్నాడు. వీటిలో ఒకటి “చిన్న కడ్డీ” లాగా వుంది కనుక దానికి బాసిలీ (bacili) అని పేరు పెట్టాడు. (bacilli అంటే లాటిన్ లో చిన్న కడ్డీ అని అర్థం). మరకటి సర్పిలాకారంలో చుట్టు చుట్టుకుని వుంది కనుక దానికి spirilla (స్పిరిల్లా) అని పేరు పెట్టాడు. (spirilla అంటే లాటిన్ లో సర్పిలం అని అర్థం). తదనంతరం ఆస్ట్రియాకి చెందిన థియోడోర్ బిల్రాత్ కూడా ఈ రకమైన మరి కొన్ని కణాలని కనుక్కున్నాడు. జర్మనీ కి చెందిన ఫెర్డినాండ్ కోన్ అనే వృక్ష శాస్త్రవేత్త వీటన్నిటికీ ఊకుమ్మడిగా ‘bacterium’ అని పేరు పెట్టాడు. ఈ పదానికి కూడా లాటిన్ లో ‘చిన్న కడ్డీ’ అని అర్థం. ఈ బాక్టీరియాలకే రోకకారక లక్షణాలు ఉన్నాయని క్రమంగా అర్థం కాసాగింది.బాక్టీరియాలకి రోగాలకి మధ్య సంబధాన్ని గుర్తించినవారిలో ప్రథముడు ఫ్రాన్స్ కి చెందిన మేటి వైద్యుడు లూయీ పాశ్చర్ (1822-1895).(ఇంకా వుంది)

References:

1. Isaac Asimov, Guide to Science 2: Biological Sciences, Pelican Books. (Chapter on Micro-organisms), 1972.

2. http://www.answersingenesis.org/articles/aid/v7/n1/antony-van-leeuwenhoek-creation-magnified-microscopes


రచన – రసజ్ఞవైదిక ఆచారం ప్రకారం మనిషి పుట్టుక, జీవనంలోని వేరు వేరు దశలు, చావు అన్నీ దేవుడి చేత నుదుటిపై లిఖింపబడి ఉంటాయి అంటారు కానీ వాస్తవానికి ఒక మనిషికి సంబంధించినది ఏదయినా సరే మొత్తం సమాచారమంతా జన్యు చిప్ (Gene chip) రూపంలో నిక్షిప్తం అయ్యి ఉంటుంది. పిల్లల రంగు,ఎత్తు, ఆరోగ్యం అన్నీ కూడా తల్లిదండ్రుల నుండి, తాతముత్తాతల నుండి పిల్లలకు సంక్రమించే జన్యువుల మీదనే ఆధారపడి ఉంటాయి. పిల్లల పుట్టుకకు సంబంధించిన ఈ వీడియోచూడండి. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక కొన్ని విషయాలను తెలుసుకుంటూ మనకున్న అపోహలను తొలగించుకోవాలి.

కుంకుమ పువ్వుతో పిల్లలు తెల్లగా పుడతారా?

గర్భిణీ స్త్రీలకు పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుట్టాలని కుంకుమ పువ్వు తినిపించటం లేదా పాలల్లో కలిపి పట్టించటం మనం చూస్తూనే ఉంటాం. నిజంగానే కుంకుమ పువ్వుకి ఇంతకముందే నిర్దేశింపబడిన జన్యువులని మార్చే శక్తి ఉందా? అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే శిశువు శరీర రంగుని నిర్ణయించేవి జన్యువులు. మేని ఛాయను నిర్ణయించేది బహుళ జన్యువుల పరస్పర చర్య (polygenic interaction) మరియు సంచాయిక ప్రభావము (cumulative effect). Nelson and Ehley అను శాస్త్రవేత్తలు ఈ శరీర రంగుకి సంబంధించిన పరిశోధనల కోసం నీగ్రోలకు అమెరికన్లకు సంపర్కం జరిగేలా చేసి బహిర్గత జన్యువుల సంఖ్య ఆధారంగా మనిషి రంగు నిర్ణయింపబడుతోంది అని కనుగొన్నారు. వీరి ప్రయోగాల ప్రకారము నీగ్రోలలో నాలుగు బహిర్గత జన్యువులు (మెలనిన్ హెచ్చు స్థాయిలో ఉన్నవి), కొంచెం నలుపు తక్కువగా ఉన్నవాళ్ళల్లో మూడు బహిర్గత జన్యువులు (dominant genes), చామనఛాయగా ఉన్నవాళ్ళల్లో రెండు బహిర్గత జన్యువులు, తెల్లగా ఉన్నవాళ్ళల్లో ఒక బహిర్గత జన్యువు, బాగా తెల్లగా ఉండే అమెరికన్ల వంటివారిలో అసలు బహిర్గత జన్యువులే లేకుండా అన్నీ అంతర్గత జన్యువులే (recessive genes) ఉన్నాయనీ ప్రయోగాత్మకంగా నిరూపించారు.దీనిని బట్టీ రంగుని నిర్ణయించేది జన్యువులే అని స్పష్టమవుతున్నది కనుక కుంకుమ పువ్వు వాడినంత మాత్రాన పిల్లలు తెల్లగా పుడతారు అనేది ఒక అపోహే అని తెలుస్తున్నది కదా! (కుంకుమ పువ్వుకి జన్యువులని మార్చే శక్తి లేదు కానీ గర్భస్థ శిశువులో శ్లేష్మం (mucus) పేరుకోకుండా చూసుకుంటూ బిడ్డని ఆరోగ్యంగా ఉంచుతుంది కనుక రంగు కోసం కాకుండా మామూలుగా (పరిమిత మోతాదులో) తీసుకుంటే మంచిది. *)

1) Principles of Genetics by E. Sinnut, L. Dunn and T. Dobzhansky - Pages 142 to 144 (Telugu edition)
2) Genetics by B.D.Singh, Kalyani publishers – Pages 226 to 229
3) http://fx.damasgate.com/the-nature-of-disease-and-the-doctrine-of-the-four-humors/(*ఈ విషయం మనం సాంప్రదాయబద్ధంగా నమ్మే విషయం కావచ్చు గాని, నాకు తెలిసి ఆధునిక వైద్య విజ్ఞానంలో దీనికి ఋజువు లేదు. ఆధునిక వైద్యానికి తెలీనంత మాత్రాన అది నిజం కాదని కాదు. కనుక ఆ వాక్యాన్ని బ్రాకెట్స్ లో పెట్టడం జరిగింది. ఈ విషయం మీద ఎవరికైనా మరింత సమాచారం తెలిస్తే నలుగురితో పంచుకోగలరు. – శ్రీనివాస చక్రవర్తి)

పుంసవనం వలన మగపిల్లలు పుడతారా?

పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు కనుక కొడుకు పుట్టవలెనన్న బలీయమయిన కోరికతో గర్భస్థ శిశువు యొక్క మూడు లేదా నాల్గవ నెలలో పుష్యమీ నక్షత్రం రోజున పుంసవనం అనే కార్యక్రమం జరపటం ఒక సాంప్రదాయం. ఈ కార్యక్రమంలో మఱ్ఱి ఆకులను పచ్చి ఆవుపాలతో కలిపి బాగా నూరించి(పదేళ్ళ లోపు ఆడపిల్లలతో), వేదమంత్రాల నడుమ, వీణా నాదాలతో గర్భిణీ స్త్రీ యొక్క ముక్కు కుడి రంధ్రములో సిల్కు గుడ్డ ద్వారా (వాతావరణ గాలి సోకకుండా జాగ్రత్తగా) పోస్తారు.ఇది చూసిన/విన్న వెంటనే మళ్ళీ అదే ప్రశ్న తలెత్తుతుంది, వీటికి (మఱ్ఱి ఆకులు, పచ్చి ఆవుపాలు) ఇంతకముందే నిర్దేశింపబడిన జన్యువులని మార్చే శక్తి ఉందా? అని. ఎందుకంటే మనం ముందుగానే జన్యుశాస్త్ర చరిత్రలో చెప్పుకున్నట్టుగా లింగ నిర్ధారణ చేసేవి జన్యువులు కదా! పైగా మూడు, నాలుగు నెలలప్పుడు అంటే అప్పటికి శిశువు లింగ నిర్ధారణ జరిగిపోయి,ఎదుగుదల కూడా మొదలవుతుంది. కనుక పుంసవనం తదితర కార్యక్రమాల ద్వారా మగ పిల్లలు పుడతారనేది కూడా అపోహే.

(మరయితే మఱ్ఱి ఆకులను పచ్చి ఆవుపాలతో కలిపి నూరిన లేహ్యం ఏమి చేస్తుంది? అంటే ఈ లేహ్యం గర్భస్థ పిండం చుట్టూ ఒక పొరలాగా ఏర్పడి, గర్భాశయంలో ఉండే ఇతరేతర పదార్ధాల ద్వారా కలిగే చెడు ప్రభావాలేమీ పిండం మీద పడకుండా ఒక రక్షణ కవచంలా ఉంటుంది. అదే కాక, ప్రసవ సమయములో బిడ్డ క్రింది వైపుకు చురుకుగా కదలడానికి కూడా సహాయపడుతుంది. శిశువు బయటకి వచ్చేసిన తరువాత వాతావరణములోని ఆక్సిజనుతో కలిసి ఘనీభవించటం వలన కత్తెర అవసరం లేకుండానే ఈ పొర శిశువు నుండీ వేరుగా వచ్చేస్తుంది. కనుక ఈ పుంసవన కార్యక్రమం వలన మగపిల్లలు పుడతారు అనే హామీ లేకపోయినా పిల్లలకి ఎటువంటి హానీ ఉండదు, పైపెచ్చు మంచిదే అని కూడా శాస్త్రవేత్తలు నిరూపించటం వలన ఈ కార్యక్రమం చేయించుకోవటం వలన వచ్చే ప్రమాదమయితే లేదు. **)

1) Sushrutha - The book of Sushruta Samhita

2) https://www.trsiyengar.com/id156.shtml

3) http://www.exoticindia.es/article/hindu-samskaras/

4) http://www.dalsabzi.com/Books/Hindu_customs/childbirth_pg1.htm

(**ఇది కూడా సాంప్రదాయక విషయమే. ఆయుర్వేదంలో దీనికి ఏవైనా వివరణ ఉందేమో గాని, నాకు తెలిసి ఆధునిక వైద్య విజ్ఞానంలో దీనికి ఋజువు లేదు. ఈ విషయం మీద ఎవరికైనా మరింత వైజ్ఞానిక సమాచారం తెలిస్తే నలుగురితో పంచుకోగలరు. – శ్రీనివాస చక్రవర్తి)

పుట్టిన పిల్లలలో లోపాలన్నీ జన్యుపరమయినవేనా?

పిల్లలలో లోపాలకు అధిక శాతం జన్యువులే కారణమయితే, ఇతర కారణాలు కూడా ఉంటాయి. పుట్టిన పిల్లలకి వచ్చిన/వచ్చే ప్రతీదీ జన్యుపరమయినవి కానవసరం లేదు.గర్భములో శ్వాసక్రియ సరిగా అందని పిల్లలకి 1940లో బాహ్యముగా ఆక్సిజన్ అందించి శ్వాసక్రియా ప్రమాణాలను సరిచేయగలిగారు. కానీ 1953లో బాహ్యముగా ఇచ్చే ఆక్సిజన్ స్థాయిని పెంచినపుడు పిల్లలు అంధులు అవటం గమనించారు. అదే విధముగా 1954లో ఆక్సిజన్ స్థాయి సమతుల్యతతో ఉన్నప్పుడు రెటినా (Retina) మామూలుగా పెరగటాన్నీ, ఆక్సిజన్ స్థాయి పెరిగినప్పుడు రెటినా pre mature స్థాయిలో ఉండటాన్నీ, ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు మెదడుకి హాని కలిగి, పిల్లలు జీవాన్ని కోల్పోతున్నారని తెలిసింది. Bill Silverman అనే శాస్త్రవేత్త 2004లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రయోగాత్మకంగా అందించారు. బాహ్యముగా అందించే ఆక్సిజన్ వలన కూడా పిల్లలకి ఇంత ప్రమాదం పొంచి ఉందనమాట!

1) Environmental Influences on Gene expression by: Ingrid lobo, Ph.d (Write science right) (c) 2008 Nature Education, citation: Lobo,1.(2008) Environmental influences on gene expression, Nature education
2) Silver man W.A. A cautionary tale about supplemental oxygen the albatross of neonatal medicine pediatrics 113, 394 to 396 (2004)
3) http://www.jameslindlibrary.org/essays/cautionary/silverman.pdf
4) http://www.neonatology.org/classics/parable/ch04.htmlఅలాగే గర్భము దాల్చిన తొలి నెలలలో వేవిళ్ళు (Morning sickness) సర్వసాధారణం. ఈ వేవిళ్ళను నియంత్రించడానికి 1950లలో ఒక మందు (Thalidomide) వాడేవారు. 1961లో ఈ మందు వాడటం వలన వంకరపోయిన చేతులు, పొట్టిగా (మరగుజ్జులా) ఉండే కాళ్ళతో పిల్లలు పుట్టడమే కాక అధిక మోతాదులో వాడటం వలన పిల్లలు చనిపోవటం కూడా జరుగుతోందని కనుగొన్నారు. పిండాభివృద్ధి (embryonic development) జరిగేటప్పుడు ఈ మందు - సంబంధిత కణములను సరిగా అభివృద్ది చెందనీయకపోవడమే దీనికి కారణం.

1) Environmental Influences on Gene expression by: Ingrid lobo, Ph.d (Write science right) (c) 2008 Nature Education, citation: Lobo,1.(2008) Environmental influences on gene expression, Nature education.
2) Bartlett, J.B, et al. The evolution of thalidomide and its IMID. derivatives as anti cancer agents; nature reveiews, Cancer 4, 314 to 320 (2004)వీటిని బట్టీ జన్యులోపాలు లేకపోయినా కూడా పిల్లలు పుట్టేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలుస్తున్నది కదా!చిట్టచివరికి నీటి సవ్వడి

Posted by V Srinivasa Chakravarthy Monday, October 22, 2012 0 comments

అధ్యాయం 23


చిట్టచివరికి నీటి సవ్వడి

ఏవో పిచ్చి ఆలోచనలతో మనసంతా అల్లకల్లోలంగా వుంది. ఎప్పుడూ నిబ్బరంగా ఉండే ఈ వేటగాడు ఉన్నట్లుండి ఎక్కడికి మాయమైపోయాడు? ఓ వెర్రి ఆలోచన మదిలో మెదిలింది.

అంతలో చీకట్లో అడుగుల చప్పుడు వినిపించింది. హన్స్ సమీపిస్తున్నాడు. మేం వున్న రాతిపంజరపు గోడల మీద ఏవో మినుకు మినుకు కాంతులు ముందు కనిపించాయి. తరువాత సొరంగపు ద్వారం వద్ద కాస్త కాంతి కనిపించింది. హన్స్ ప్రత్యక్షమయ్యాడు.

మామయ్య వద్ద కెళ్లి ఆయన భుజం మీద చెయ్యేసి సున్నితంగా ఆయన్ని తట్టి లేపాడు.

మామయ్య లేచి, “ఏవయ్యింది?” అని అడిగాడు.

“వాటెన్” ఐస్లాండిక్ భాషలో సమాధానం ఇచ్చాడు హన్స్.

ఉద్విగ్న భరిత సన్నివేశాలలో మనిషికి భాషాశక్తి హెచ్చు అవుతుంది కాబోలు. నాకు డేనిష్ భాషలో ఒక్క పదం కూడా తెలీదు. కాని ఎందుకో హన్స్ అన్న మాటకి అర్థం ‘నీరు’ అనిపించింది.

“నీళ్లు, నీళ్లు”, పిచ్చివాడిలా చప్పట్లు కొడుతూ అరిచాను.

“నీరు,” మామయ్య కూడా వత్తాసు పలికాడు. “హ్వార్?” అని అడిగాడు ఐస్లాండిక్ భాషలో.

“నెడట్,” బదులు చెప్పాడు హన్స్.

“ఎక్కడ?... కింద…” మాటలకి అర్థాలు చెప్పకనే తెలుస్తున్నాయి. కృతజ్ఞతా పూర్వకంగా ఆ వేటగాడి చేతులు పట్టుకున్నాను. హన్స్ ముఖంలో మారని నిర్లిప్తత తప్ప మరెలాంటి స్పందనా కనిపించలేదు.

మా అవరోహణకి మళ్లీ సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సారి సొరంగం వాలు చాలా ఎక్కువగా వుంది. ఏడడుగులు ముందుకి పోతే రెండు అడుగులు కిందకి దిగుతున్నాం. గంటలో ఒకటింపావు మైలు నడిచాం. రెండు వేల అడుగులు కిందకి దిగాం.

ఆగి జాగ్రత్తగా వింటే కంకర గోడల మాటున లీలగా ఏదో గురగుర మని చప్పుడు వినిపిస్తోంది. మేం బయల్దేరిన తరువాత చాలా సేపటి వరకు ఏ చప్పుడూ వినిపించలేదు. దాంతో నాకు మళ్లీ భయం పట్టుకుంది. కాని కాసేపు అయ్యాక మామయ్య ధైర్యం చెప్పాడు.

“హన్స్ పొరబడలేదు. అది సెలయేటి సవ్వడే.”

“సెలయేరా?” అదిరిపోయి అడిగాను.

“సందేహం లేదు. మన చుట్టూ ఓ అంతర్వాహిని ప్రవహిస్తోంది.”

ఉత్సాహంగా ముందుకి నడిచాం. ఒక్కసారిగా అలసట అంతా ఎవరో చేత్తో తీసేసినట్టు ఎగిరిపోయింది. ఆ సెలయేటి గలగలలు వింటుంటే లేని ఓపిక వస్తోంది. ముందుకి నడుస్తున్న కొద్ది ధ్వని పెరుగుతోంది. మొదట్లో మా తలల మీద వినిపించిన శబ్దం ఇప్పుడు ఎడమ పక్క గోడ వెనుక వినిపిస్తోంది. ఏదైనా తడి తగులుతుందేమో నని గోడలని మళ్లీ మళ్లీ తాకి చూశాను. కాని లాభం లేకపోయింది.

మరో అరగంట గడిచింది. మరో అరకోసు నడిచి వుంటాం.

హన్స్ కూడా ఇంతవరకే వచ్చాడని అర్థమయ్యింది. ఇంకా ముందు పోతే ఏం వుందో తనకి కూడా తెలీదు. పర్వతారోహకులకి ఇలాంటి విషయాలలో చాలా సునిశితమైన జ్ఞానం వుంటుంది. ఇక్కడ రాతి వెనుక నీరు వుందని తను పసిగట్టాడు. కాని తను ఆ ద్రవాన్ని కళ్లార చూళ్లేదు. తనివితీరా తాగలేదు.

ఇంకా ముందుకి నడిస్తే నీటికి దూరం అవుతాం అని మాత్రం అర్థమవుతోంది. ముందుకి నడుస్తుంటే చప్పుడు బలహీనం అవుతోంది.

చప్పుడు కాస్త ఎక్కువగా ఉన్న చోటికి తిరిగి వచ్చాం. రెండు అడుగుల దూరంలో ప్రవాహం ఉధృతంగా ఉన్నట్టు తెలుస్తోంది. మా వాంచితార్థమైన మంచితీర్థానికి మాకు మధ్య కఠిన కంకర గోడ వుందని మర్చిపోలేదు.

(ఇంకా వుంది)
ఈ కృషిలో [సిరీపీడ్ ల మీద గ్రంథ రచన] నేను ఎనిమిదేళ్లు గడిపినా అందులో అనారోగ్యం వల్ల రెండేళ్లు పోయాయి. ఆ విషయం నేను నా డైరీలో రాసుకున్నాను. ఆ కారణం చేత 1848 లో నేను హైడ్రోపతిక్ చికిత్స కోసం మాల్వర్న్ లో కొంత కాలం గడిపాను. ఆ చికిత్స నాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. అక్కణ్నుంచి ఇంటికి తిరిగి రాగానే మళ్లీ పని మొదలెట్టాను. ఆ రోజుల్లో నా ఆరోగ్యం ఎంత దీనంగా ఉండేదంటే 1848 లో నవంబర్ 13 నాడు నా తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరిపించడానికి కూడా నాకు వీలుపడలేదు.

సిరీపీడ్ ల మీద నేను చేసిన కృషి గణనీయమైనదని చెప్పాలి. కొన్ని కొత్త, విశేషమైన రూపాలని కనుక్కోవడమే కాక, వివిధ జీవాలలో అంగాలలోని సారూప్యాన్ని ఎత్తి చూపాను. వివిధ అంగాలు ఒకదాన్నొకటి అతుక్కునేలా చేసే జిగురు యంత్రాంగాన్ని గుర్తించాను. అయితే ఆ జిగురు గ్రంథుల (cement glands) విషయంలో మాత్రం ఘోరంగా పొరబడ్డాను. అంతేకాక [సిరీపీడ్ లకి చెందిన] కొన్ని ఉపజాతులలో (genera) అతి చిన్న మగ జీవాలు ఉభయలింగ జీవాల (hermaphrodite) ల మీద పడి పరాన్నభుక్కులుగా (parasites) బతకడం గుర్తించాను. ఈ రెండవ ఆవిష్కరణకి సంబంధించిన ఆధారాలు తదనంతరం దొరికాయి. కాని మొదట్లో మాత్రం ఆ వృత్తాంతం అంతా కేవలం నా అభూత కల్పన అని ఓ జర్మన్ రచయిత కొట్టిపారేశాడు. సిరీపీడ్ లు గొప్ప వైవిధ్యం గల జీవ జాతి. వాటిని వర్గీకరించడం అంత సులభం కాదు. Origin of Species లో ప్రకృతి నిబద్ధ వర్గీకరణ సూత్రాలని చర్చించే ప్రయత్నంలో సిరీపీడ్ ల మీద కృషి ఎంతో ఉపకరించింది. అయితే ఆ అంశం మీద అంత కాలాన్ని వెచ్చించడం అవసరమా అని తరువాత అనిపించింది. [దీని గురించి మరింత సమాచారం కావాలంటే ఈ లింక్ చూడండి. http://darwin-online.org.uk/EditorialIntroductions/Richmond_cirripedia.html - అనువాదకుడు.]

1854 సెప్టెంబర్ నుండి నేను సృష్టించిన అపారమైన వ్రాత ప్రతులని క్రమబద్ధీకరించే ప్రయత్నంలో మునిగిపోయాను. జీవజాతుల రూపాంతరీకరణకి సంబంధించి ఎన్నో పరిశీలనలు, ప్రయోగాలు చెయ్యడంలో మునిగిపోయాను. బీగిల్ యాత్రలలో పాంపియన్ శిలా నిర్మాణాలలో (Pampaen formations) పెద్ద పెద్ద శిలాజాలని చూశాను. ప్రస్తుతం మనం చూసే ఆర్మడిలోలకి ఉండే కవచం లాంటి పైతొడుడు వుందీ శిలాజాలలో. దక్షిణ అమెరికా ఖండం మీద దక్షిణంగా ప్రయాణిస్తుంటే లక్షణాలలో పోలికలు గల జంతువులు వరుసగా ఒకదాని స్థానంలో ఒకటి క్రమబద్ధంగా రావడం నాకు విస్మయం కలిగించింది. గలపాగోస్ ద్వీపకల్పం మీద జంతువులకి, దక్షిణ అమెరికా మీద కనిపించే జంతువుల లక్షణాలకి మధ్య సాన్నిహిత్యం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంతే కాక ఆ ద్వీపకల్పంలో వివిధ దీవుల మీద కనిపించే జంతువుల మధ్య కనిపించే సూక్ష్మమైన వైవిధ్యం కూడా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఆ దీవులలో ఏదీ కూడా భౌగోళిక దృష్టితో చూస్తే అంత పురాతనమైనది కాదు.

ఇలాంటి వాస్తవాలు (ఇలాంటివే మరెన్నో ఇతర వాస్తవాలు) చూస్తుంటే ఒక్కటే నిర్ణయానికి రాగలం అనిపిస్తోంది. జీవజాతులు క్రమంగా పరిణతి చెందుతూ వస్తున్నాయి. మొదటినించీ కూడా ఈ విషయం నా మనసుని ఆకట్టుకుంది. ఇక్కడ మనకు మరో విషయం కూడా ప్రస్ఫుటం అవుతుంది. పరిసరాల ప్రభావం గాని, ప్రాణుల సంకల్పబలం గాని (ముఖ్యంగా మొక్కల విషయంలో) జీవకోటి దాని పరిసరాలకి అనుగుణంగా పరిణమించిన అసంఖ్యాకమైన సందర్భాలకి కారణాలు కాలేవు. చెట్టునెక్కగల వడ్రంగి పిట్ట, సులభంగా గాలి మీద సవారీ చేసేందుకు వీలుగా పింఛాలు మొలిచిన విత్తనం – మొదలైన వన్నీ అలాంటి అనుగుణ్యమైన పరిణతికి తర్కాణాలు. అలాంటి అనుగుణ్యమైన పరిణామం నాకు కనిపించిన ప్రతీ సారి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఎలా జరిగిందో వివరించకుండా ఏదో బాహ్య శక్తి జీవజాతులని మలచిందని, మార్చిందని పరోక్షంగా వివరించాలని చేసే ప్రయత్నాలన్నీ నాకు అర్థరహితంగా అనిపిస్తాయి.

ఇంగ్లండ్ కి తిరిగొచ్చిన తరువాత భౌగోళిక శాస్త్రంలో లయల్ నడిచిన బాటలోనే నడవాలని బయల్దేరాను. సహజ పరిస్థితులకి చెందినవి, మనిషి పెంపకంలో పెరిగినవి అయిన జంతువులని, మొక్కలని పరిశీలించి వాటిలో కనిపించే నానా రకాల వైవిధ్యానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించడం మొదలెట్టాను. ఆ విధంగా జీవజాతుల పరిణామ క్రమం మీద కొంత అవగాహన ఏర్పడుతుందని ఆశ. జులై 1837 లో నా మొట్టమొదటి నోట్సు పుస్తకాన్ని తెరిచాను. బేకన్ బోధించిన సూత్రాల అనుసారం పని చేస్తూ, ఏ విధమైన సైద్ధాంతిక పూర్వభావాలు లేకుండా భారీ ఎత్తున వాస్తవాలు సేకరిస్తూ పోయాను. ముఖ్యంగా మనిషి పెంపకంలో ఎదిగిన జీవాల గురించి ఎన్నో విషయాలు సేకరించాను. తోటమాలులతో, జంతువులని పెంచేవారితో సంభాషించాను, ఉత్తరాలు రాసి జవాబులు సేకరించాను. విస్తృతంగా చదివాను. ఈ ప్రయత్నంలో నేను చదివి సంక్షిప్త రూపంలో రాసుకున్న పుస్తకాలు, పత్రికలు అన్నీ చూస్తే నేను పడ్డ శ్రమకి నాకే ఆశ్చర్యం కలుగుతుంది. జంతువులలో, మొక్కలలో ఉన్నత జాతుల సృష్టిలోని రహస్యం ఎంపిక అన్న విషయం నాకు త్వరలోనే అర్థమయ్యింది. కాని సహజ పరిస్థితుల్లో ఎదిగే జంతువుల విషయంలో ఆ ఎంపిక ఎలా జరుగుతుంది అన్న విషయం మాత్రం నాకు ఎంతో కాలం అవగతం కాలేదు.(ఇంకా వుంది)

రచన - రసజ్ఞ


లియోపోల్డ్ అగస్ట్ వైస్మన్ (Leopold August Weissmann) అనే శాస్త్రవేత్త - జీవులలో శారీరక కణముల(సొమాటిక్ సెల్స్, somatic cells)లో శారీరక జీవ పదార్థము (సొమాటోప్లాసం, somatoplasm), ప్రత్యుత్పత్తి కణముల(జెర్మ్ సెల్స్, germ cells)లో బీజ పదార్థము (జెర్మ్ ప్లాసం, germ plasm) ఉంటాయనీ, శారీరక కణములలో వచ్చిన మార్పులు తరువాత తరానికి శారీరక జీవ పదార్థము నశించుట వలన రావనీ, బీజ పదార్థము నశించకుండా సంయోగ బీజాలకు పంచబడుతుంది కనుక వీనిలో వచ్చిన మార్పు మాత్రమే తరువాత తరాలకు వస్తుందనీ, అందువలన ఆర్జిత గుణాలు అన్నీ అనువంశికాలు కావనీ వివరించాడు. జీవశాస్త్రంలో దీనిని చాలా గొప్ప సిద్ధాంతంగా పరిగణించారు. మానవుడు ముక్కు, చెవులకు పెట్టుకునే రంధ్రాలు శారీరక పదార్థ సంబంధమయినవి కనుక తదుపరి తరానికి అవి సంక్రమించటం లేదని వివరించారు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ముందే ఎలుకల తోకలను (18 తరాల వరకు) కత్తిరించి, తరువాత తరంలో కూడా ఎలుకలు తోకలతో పుట్టడాన్ని గమనించారు. దీని వలన వైస్మన్ సిద్ధాంతం సరయినదే అని ఋజువవుతోంది.ఆధునిక రేణు భావనకి పునాది వేసిన మహానుభావుడు Gregor Johann Mendel. ప్రతీ లక్షణాన్నీ వ్యక్తీకరించడానికి రెండేసి రేణువులుండి (యుగ్మ వికల్పాలు) తరువాత తరానికి అందించబడతాయని చెప్పాడు. శారీరక కణముల నుండి ప్రత్యుత్పత్తి కణాలకి ఈ జతల రేణువులు (వీటినే కారకాలు లేదా ఫాక్టర్స్ అని వాడటం జరిగింది) ఎలా అందించబడతాయో మాత్రం వివరించలేకపోయాడు. ఈయన ప్రతిపాదించిన బహిర్గతత్వ సిద్ధాంతము (law of dominance), జన్యు పృథక్కరణ సిద్ధాంతము (law of segregation) మరియు స్వతంత్ర్య వ్యూహన సిధ్ధాంతము (law of independent assortment) మాత్రం Hugo de Vries, Corrans, Shiermark అను ముగ్గురు శాస్త్రవేత్తల చేత కూడా ప్రయోగాత్మకంగా ఆమోదించబడ్డాయి. ఎనలేని కృషి చేసి జన్యుశాస్త్రానికి పునాది రాళ్ళు వేసిన ఈయనని జన్యు శాస్త్ర పితగా పరిగణిస్తారు.

మెండెల్ ప్రతిపాదించిన కారకాలు క్రోమోజోముల మీద ఉండి తరువాత తరాలకు అందింపబడతాయి కనుక అవి వాహకాలు అని వాల్టర్ సట్టన్ 1902లో క్రోమోజోమ్ అనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.మెండెల్ ప్రతిపాదించిన పరీక్షా సంకరణ నిష్పత్తి(test cross ratio)లో మార్పును గమనించిన Bateson 1902లో సహలగ్నత(linkage; ఒక క్రోమోజోములో రెండు లేదా అంతకంటే ఎక్కువ కారకాలు కలిసి ఉండటాన్ని సహలగ్నత అంటారు)ను ప్రతిపాదించాడు.దీనికి సహాయకరమయిన పరిశోధనలు చేసిన వ్యక్తి Thomas Hunt Morgan. ఈయన 1909లో క్రోమోజోముల మీద కారకాలు వరుసగా అమరి ఉండి, కొన్ని జట్టుగా లంకెపడి ఉండవచ్చనీ చెపుతూ క్రోమోజోమ్ సహలగ్నతా సిద్ధాంతాన్ని (Chromosomal theory of linkage) ప్రతిపాదించారు.అప్పటిదాకా మెండెల్ చెప్పినట్టు కారకాలు అని భావిస్తున్న వాటికి జన్యువులు (Genes) అని జోహాన్సన్ 1911లో నామకరణం చేశారు. అలాగే దృశ్యరూపము (Phenotype; పైకి కనిపించే లక్షణాలు) మరియు జన్యురూపము (Genotype; అంతర్గతంగా ఉండే జన్యు సముదాయం) అనే పదాలను కూడా ప్రవేశపెట్టారు.ఇప్పటిదాకా జరిగిన అన్ని పరిశోధనల ద్వారా, ఏతా వాతా తేలినది ఏమిటంటే జన్యువులు క్రోమోజోముల మీద ఉండి, తల్లిదండ్రుల నుండీ పిల్లలకి చేరతాయి అని. ఇహ, తెలుసుకోవలసినవి ఏమిటంటే ఆ జన్యువుల ద్వారా పిల్లల లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది?అని. అటువైపుగా పరిశోధనలు సాగించిన Bridges అనే శాస్త్రవేత్త 1916లో లైంగిక నిర్ధారణ కోసం జన్యు సంతులనా సిద్ధాంతాన్ని (Gene Balance theory of sex determination) ప్రతిపాదించారు.జన్యువుల వలన లైంగిక నిర్ధారణ, అనువంశికతే కాకుండా ఇంకా ఏమయినా జరుగుతున్నాయా అన్న దిశగా శోధిస్తున్న George W. Beadle (1903-1989) & Edward L. Tatum (1909-1975) లకు ఒక జన్యువు నుండీ ఒక ఎంజైమ్ తయారవుతోందని తెలిసింది. దానితో 1941లో ఒక జన్యువు - ఒక ఎంజైమ్ ప్రమేయాన్ని (One gene - One enzyme hypotheis) ప్రవేశపెట్టారు. దీనిని ఆధారంగా చేసుకుని జీవరసాయన జన్యుశాస్త్రం (Biochemical Genetics) అనే క్రొత్త శాఖ అభివృద్ది చెందింది.జన్యువులు, వాటి వల్ల మనకొచ్చే ఉపయోగాలు, అవెక్కడ ఉన్నాయి, మొ ., తెలుసుకున్నాం కానీ ఆ జన్యు పదార్ధం ఏమిటి? అని ఎన్నో పరిశోధనలు చేసిన Oswald T. Avery (1877-1955), Colin MacLeod (1909-1972) and Maclyn McCarty (1911-)లు 1944లో ఆ జన్యుపదార్థము DNA (DeoxyriboNucleic Acid) అనే కేంద్రకామ్లమనీ, ఈ పదార్థము జన్యువులలోనే కాక మొత్తం క్రోమోజోములంతా నిండి ఉంటుందనీ ప్రయోగాత్మకంగా నిరూపించారు.కొన్ని సంవత్సరాల తరువాత 1953లో James Watson & Francis Crick అను శాస్త్రవేత్తలు జన్యుపదార్థమయిన DNA నిర్మాణాన్ని కనుగొన్నందుకు 1962లో నోబెల్ బహుమతి కూడా సంపాదించటంతో అణుస్థాయి జన్యుశాస్త్రము (Molecular Genetics) అనే క్రొత్త శాఖ ప్రారంభమయింది.Seymour Benzer (1921 – 2007) 1955లో జన్యువులో మూడు భాగాలు ఉంటాయనీ, ఒక్కో భాగం ఒక్కో విధిని నిర్వర్తిస్తుందనీ చెప్పాడు. అవే సిస్ట్రాన్ (Cistron; ఒక ప్రొటీను తయారుచేయు భాగము), రెకాన్ (Recon; జన్యు వైవిధ్యాన్ని కలుగజేయు భాగము) మరియు మ్యూటాన్ (muton; ఉత్పరివర్తనలు కలుగజేయు భాగము). వీటి గురించి ముందు ముందు మరింత వివరంగా తెలుసుకుందాం.అలా జన్యుశాస్త్రం కొన్ని శాఖలతో సహా ఏర్పడి, స్థిరపడింది.

(ఇంకా వుంది)

జన్యు శాస్త్రం 1

Posted by V Srinivasa Chakravarthy Monday, October 15, 2012 10 comments

రసజ్ఞ గారు (http://navarasabharitham.blogspot.in/) తెలుగు బ్లాగ్ ప్రపంచంలో సుపరిచితులు. ‘జన్యు శాస్త్రం’ మీద ధారావాహికంగా కొన్ని వ్యాసాలు రాయడానికి ఆమె ముందుక్కొచ్చారు. దీం తరువాత మరి కొన్ని అంశాల మీద కూడా రాస్తానని హామీ ఇచ్చారు! ఇలాగే మరి కొందరు శాస్త్ర విజ్ఞానం గురించి రాయడానికి ముందుకొస్తే బావుంటుంది.


జన్యు శాస్త్రం మీద ధారావాహికలో ఇది మొదటి పోస్ట్…---

జన్యు శాస్త్రం 1

రచయిత్రి - రసజ్ఞ

జీవుల ప్రాథమిక లక్షణాలు - పెరుగుదల, పోషణ మరియు ప్రత్యుత్పత్తి. ప్రతీ జీవీ తన సంతానాభివృద్ధి కోసం పాటు పడటం సహజం. ఆ క్రమములోనే తన వంశాన్ని కొనసాగిస్తూ వంశాభివృద్ది చేసుకుంటుంది. విత్తు ఏది వేస్తే మొక్క అదే వస్తుంది, పులి కడుపున పులే పుడుతుంది అన్నట్టుగా వాటి జాతి లక్షణాలను తరువాత తరాలకి పంచుతాయి జీవులు. వీటినే పోలికలు అంటారు. అలాగే గాడిదకి గుఱ్ఱానికి కంచర గాడిద పుడుతుంది. ఇందులో క్రొత్తగా పుట్టిన కంచర గాడిదలో మనకి అటు గాడిద జాతి లక్షణాలూ, ఇటు గుఱ్ఱం జాతి లక్షణాలూ రెండూ కనిపిస్తాయి. ఇందులో పోలికలూ (గాడిదతో పోల్చుకుంటే), విభేదాలూ (గుఱ్ఱంతో పోల్చుకుంటే) కూడా ఉన్నాయి కదా! పోలికలు లేదా విభేదాలు ఒక తరం నుండీ తరువాతి తరానికి ఎలా వస్తాయో చెప్పే శాస్త్రాన్నే జన్యుశాస్త్రం అంటారు.ఇప్పుడంటే మనకి సాంకేతిక విజ్ఞానం బాగా అభివృద్ధి చెందటం వలన జన్యువులు, జన్యుశాస్త్రం అనే పదాలు వాడుతున్నాము కానీ, ఇవన్నీ తెలియక మునుపు ఈ పేర్లు ఎలా వచ్చాయి, ఈ జన్యుశాస్త్రం అనే శాఖ నుండీ మరికొన్ని సంబంధిత శాఖలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాలను చెప్పుకునేముందు ఈ జన్యుశాస్త్రానికి ఎనలేని సేవలను అందించిన మహనీయులని ఒకసారి తలుచుకుంటూ అంచెలంచెలుగా ఒక్కో విషయాన్నీ ఎలా వెలుగులోనికి తీసుకువచ్చారో చూద్దాము.తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని"అనువంశికత" (inheritance) అంటారు. ఈ అనువంశికత ఎలా వస్తుంది అన్న విషయం తెలుసుకోవటం కోసం చాలా రకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు.1. ఆవిరి మరియు ద్రవ సిద్ధాంతాలు :

పైథాగరస్ 500 బి.సి.లో పిల్లలకి తండ్రి పోలిక ఎలా వస్తుందో వివరిస్తూ స్త్రీ, పురుషుల కలయిక సమయంలో పురుషుని దేహములోని ప్రతీ అవయవము నుండీ వెలువడే ప్రత్యేకమయిన, తేమతో కూడిన ఆవిరే కారణమని చెప్పారు.అరిస్టాటిల్ 350 బి. సి. లో ప్రత్యుత్పత్తి పదార్థము తల్లిదండ్రులలోని అన్ని భాగాల నుండీ సేకరించబడుతుందనీ, తల్లి సేకరించిన పదార్థానికి తండ్రి నుండి సేకరించిన పదార్థము చైతన్యమును కలుగచేసి జీవిగా మారుస్తుందనీ వివరించారు.ఈ రెండు సిద్ధాంతాలలోనూ తండ్రిదే ప్రధాన పాత్రగా చూపారు.

2. ప్రీ – ఫార్మేషన్ (preformation) సిద్ధాంతాలు :

లియోనార్డో డావిన్సీ (1452 - 1519) పిల్లలలో ఉండే లక్షణాలకు తల్లిదండ్రులిద్దరూ సమానంగా అనువంశిక పదార్ధాన్ని అందిస్తారని చెప్పాడు కానీ ఆ పదార్ధం ఏమిటో చెప్పలేకపోయాడు.లీవెన్ హాక్ 1677లో సూక్ష్మదర్శని సహాయముతో పురుష సంయోగ బీజాలయిన శుక్ర కణాలను కనుగొని, స్త్రీ - పురుష సంయోగ బీజాల కలయిక గురించి ప్రస్తావించాడు.Swammerdam 1679లో పురుష సంయోగ బీజాలలో ఒక సూక్ష్మ ప్రాణి(హోమంకులస్, homunculus) ఉంటుందనీ, అది మాతృ గర్భంలోనికి ప్రవేశించాక జీవిగా వృద్ధి చెందుతుందని వివరించాడు. సూక్ష్మ ప్రాణి తల్లి గర్భంలోనికి ప్రవేశించే ముందే ఏర్పడుట వలన దీనిని ప్రీ - ఫార్మేషన్ సిద్ధాంతము అన్నారు.హార్ట్సేకర్ 1695లో హోమంకులస్ సూక్ష్మ ప్రాణి ఊహా చిత్రాన్ని సూచించాడు. ఆ ప్రకారముగా, పురుష సంయోగ బీజము యొక్క శీర్ష భాగములో ప్రాణి ఉండి, తోక వంటి పరభాగము ఉంటుంది.మరికొంతమంది మాత్రం ఈ సూక్ష్మ ప్రాణి అండములో ఉండి పురుష సంయోగ బీజముతో కలిసాక జీవిగా వృద్ధి చెందుతుందని అభిప్రాయ పడ్డారు.Kolreuter - సంయోగ బీజాలు అనువంశికతకు భౌతిక ఆధారాలని (పరాగ రేణువులు - అండముల కలయికను పొగాకు మొక్కలలో) కనుగొన్నాడు.ఫ్రెడరిక్ వొల్ఫ్ (Caspar Friedrich Wolff)  – ఎపిజెనెసిస్ (epigenesis) సిద్ధాంతాన్ని (1738 - 1794) ప్రతిపాదించాడు. పురుష - స్త్రీ సంయోగ బీజాల కలయిక తరువాత ఏర్పడిన జీవ పదార్థము మాత్రమే దేహాన్ని ఏర్పరచగలదని వివరించాడు.మొత్తానికి వీటన్నిటిలోనూ ఆధునిక సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నది మాత్రం వాల్ఫ్ చెప్పిన ఎపిజెనెసిస్ సిద్ధాంతం మాత్రమే!3. అనువంశిక రేణువుల సిద్ధాంతాలు (Particulate theories of inheritance) : అనువంశికతను కలుగచేసే పదార్థము రేణువుల రూపంలో ఉండుట వలన వీటికి ఆ పేరు వచ్చింది.Maupertuis (1689 - 1759) - జనకులు జన్యు పదార్థాన్ని రేణువుల రూపంలో అందిస్తారనీ, ఫలదీకరణ (fertilization) జరిగాక స్త్రీ నుండి ఎక్కువ రేణువులు వస్తే అమ్మాయి,పురుషుడి నుండీ ఎక్కువ రేణువులు వస్తే అబ్బాయి పుడతారని, ఈ విధంగా లింగ నిర్ధారణ జరుగుతుందనీ చెప్పారు.లామార్క్ (1744 - 1829) పొడవుగా సాగిన జిరాఫీ మెడను ఉదాహరణగా చూపిస్తూ తల్లిదండ్రులు తాము సంపాదించుకున్న లక్షణాలను పిల్లలకి అందిస్తారని ప్రతిపాదించాడు. సరైన ఆధారాలు చూపలేకపోయినందున దీనిని ఎవ్వరూ ఆమోదించలేదు.చార్లెస్ డార్విన్ అనే ప్రకృతి శాస్త్రవేత్త 1838లో అనువంశికతను కలిగించు రేణువులకు పాన్ జీన్లు (వీటినే జెమ్యూల్స్ అని కూడా అంటారు) అని పేరు పెట్టాడు. ఇవి ప్రతీ అవయవము నుండీ ఏర్పడే అతి సూక్ష్మ రేణువులు. ఇవి రక్తము ద్వారా ప్రత్యుత్పత్తి అవయవాలకు చేరి, సంయోగ బీజాలుగా మారి ఫలదీకరణం జరుపుతాయని వివరించాడు. ఈ పరికల్పనకు ఆధారం 400బి.సి. లో హిప్పోక్రేట్స్ ప్రతిపాదించినది.(ఇంకా వుంది)

రాతి గోతిలో నీటి వేట

Posted by V Srinivasa Chakravarthy Thursday, October 11, 2012 0 comments


రాత్రి ఎనిమిది అయ్యింది. ఎక్కడా ఒక్క బొట్టు నీరు కూడా లేదు. ఇక బాధ భరించలేకున్నాను. మామయ్య మాత్రం ఏమీ పట్టనట్టు నడుచుకుంటూ పోతున్నాడు. ఆయనకసలు ఆగే ఉద్దేశం ఉన్నట్టు లేదు. ఎక్కడైనా సెలయేటి గలగలలు వినిపిస్తాయేమోనని ఆశ. కాని భరించరాని నిశ్శబ్దం తప్ప చెవికి మరొకటి తెలియడం లేదు.ఇక ఒంట్లో సత్తువ అంతా హరించుకుపోయింది. మామయ్యని ఇబ్బంది పెట్టకూడదని అంతవరకు ఎలాగోలా ఓర్చుకున్నాను. ఇక అయిపోయింది. ఇవే ఆఖరు ఘడియలు.

“మామయ్యా! ఇక నా వల్ల కాదు. కొంచెం ఆగు!”

గట్టిగా అరిచి కుప్పకూలిపోయాను.

ఆ కేకకి మామయ్య వెనక్కు నడిచి వచ్చాడు. చేతులు కట్టుకుని కింద పడి వున్న నాకేసి ఓ సారి నిర్లిప్తంగా చూశాడు.

“అయిపోయింది. అంతా అయిపోయింది,” అన్నాడు.

ఆయన ముఖంలో అంత కోపం ఎప్పుడూ చూళ్లేదు. నా కళ్లు మూతలు పడ్డాయి.

మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి నాకు ఇరు పక్కలా మామయ్య, హన్స్ దుప్పట్లో చుట్టచుట్టకుని పడుకున్నారు. ఇద్దరూ నిద్రపోయారా? నా బాధకి మాత్రం అంతు లేకుండా ఉంది. ఆ బాధ తగ్గే మార్గమే లేదన్న ఆలోచన బాధని మరింత తీవ్రం చేస్తోంది. “అంతా అయిపోయింది” అని మామయ్య కోపంగా అంటున్న మాటలే చెవిలో గింగురు మంటూ బాధిస్తున్నాయి. ఇక మళ్లీ భూమి ఉపరితలాన్ని చూసే భాగ్యానికి మేం నోచుకోలేదనిపిస్తోంది.మా నెత్తిన కోసున్నర మందాన భూమి పైపొర వుంది. దాని బరువు నా భుజాల మీద మోపుతున్నట్టు అనిపిస్తోంది. ఆ ఊహా భారానికి కాబోలు నేను పడుకున్న పాషాణ పానుపు మీద అటు ఇటు పొర్లడమే అతికష్టంగా వుంది.కొన్ని గంటలు గడిచాయి. మా చుట్టూ వికృతమైన నిశ్శబ్దం తాండవిస్తోంది. శ్మశాన నిశ్శబ్దమది. మా చుట్టూ ఉన్న గోడల లోంచి ఏ రకమైన శబ్దమూ దూరే అవకాశం లేదు. ఎందుకంటే ఆ గోడలలో అతి తక్కువ మందం గల గోడే ఐదు మైళ్ల మందం వుంది.

ఇలా నా ఆలోచనలు సాగుతుండగా ఇంతలో ఏదో చప్పుడు వినిపించింది. మా ఐస్లాండ్ సోదరుడు లేచి ఎటో వెళ్తున్నాడు. ఎందుకలా వెళ్లిపోతున్నాడు? ఎక్కడికి పోతున్నాడు? గట్టిగా అరుద్దాం అని అనుకున్నా గాని గొంతు పెగల లేదు. నాలుక తడారిపోయింది. పెదాలు వాచి వున్నాయి. చీకట్లో ఎటో వెళ్లిపోయాడు హన్స్.

“హన్స్ మనల్ని వదిలేసి వెళ్లిపోయాడు, హన్స్, హన్స్.” ఎలాగో ఓపిక చేసుకుని అన్నాను.

అన్నాను అనుకున్నానే గాని ఆ మాటలు నా పెదాలు దాటి బయటికి వెళ్లినట్టు లేదు. ఆ క్షణం భయపడ్డానే గాని అంత విశ్వాసపరుడు అలా మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోతాడు? ఆ క్షణం అతణ్ణి సందేహించినందుకు సిగ్గుపడ్డాను. దురుద్దేశం ఉన్నవాడైతే పైకి పోవాలి, పారిపోవాలి. కాని హన్స్ కిందికి దిగుతున్నాడు. అది చూశాక నా ఆందోళన కాస్త సద్దుమణిగింది. ఎందుకు నిద్రపోతున్న వాడల్లా హఠాత్తుగా లేచి కిందికి దిగుతున్నాడు? ఏదైన వెతుక్కుంటూ వెళ్తున్నాడా? ఏదైనా చప్పుడు వినిపించిందా? చీకటి లోతుల్లో నీటి అలికిడి వినవచ్చిందా?--ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం--

(ఇంకా వుంది)

Sin(x) మీద ఓ ప్రాచీన కవిత

Posted by V Srinivasa Chakravarthy Tuesday, October 9, 2012 8 comments‘కటపయ’ పద్ధతి ఉపయోగించి 31 దశాంశ స్థానల వరకు పై విలువని పద్య రూపంలో ప్రాచీన భారత గణితవేత్త ఆర్యభట్టు వ్యక్తం చెయ్యడం గురించి లోగడ ఓ పోస్ట్ లో చెప్పుకున్నాం.
http://scienceintelugu.blogspot.in/2009/09/31.html
  అలాంటి పద్ధతినే ఉపయోగించి ఆ గణితవేత్త sin(x) యొక్క విలువలని పద్య రూపంలో ఓ పట్టికగా ఇచ్చాడు. ఆ విశేషాలు ఈ వ్యాసంలో…అక్షరాలతో పెద్ద పెద్ద సంఖ్యలని వ్యక్తం చేసే పద్ధతి-

ఆర్యభట్టు కనిపెట్టిన పద్ధతిలో ‘క’ నుండి ‘మ’ వరకు గల అక్షరాలు 1 నుండి 25 వరకు అంకెలకి సంకేతాలు. ఆ తరువాత వచ్చే ‘య, ర, ల, వ, శ, ష, స, హ’ అనే హల్లులు 30,40,50,60,70,80,90,100 అంకెలకి సంకేతాలు.

ఇక ‘అ’ నుండి ‘ఔ’ వరకు గల అచ్చులు దశాంశ స్థానాన్ని నిర్దేశిస్తాయి. అది ఈ విధంగా ఉంటుంది –

అ లేదా ఆ = 100^0 = 1

ఇ లేదా ఈ = 100^1 = 100

ఉ లేదా ఊ = 100^2 =10,000

ఋ లేదా ౠ = 100^3

ఌ లేదా ౡ = 100^4

ఎ, లేదా ఏ = 100^5

ఐ = 100^6

ఒ, లేదా ఓ = 100^7

ఔ = 100^8ఇలాంటి ప్రతీకాత్మక పద్ధతితో చాల పెద్ద పెద్ద సంఖ్యలని కూడా ఎంతో క్లుప్తంగ వ్యక్తం చెయ్యొచ్చు.

కొన్ని ఉదాహరణలు –

హల్లు ‘క’ = 1, అచ్చు ‘ఇ’ = X 100. కనుక ‘క, ఇ ల కలయిక వల్ల ఏర్పడ్డ ‘కి’ = 1 X 100 = 100.

హల్లు ‘గ’ = ౩, అచ్చు ‘ఉ’ = X 10^4 = 10,000. కనుక ‘గ, ఉ’ ల కలయిక వల్ల ఏర్పడ్డ ‘గు’ = 3X 10,000 = 30,000.

అంటే ‘హల్లు’, ‘అచ్చు’ కలిసినప్పుడు రెండిటి విలువలని గుణించాలన్నమాట.

కాని రెండు హల్లులు వరుసగా వచ్చినప్పుడు రెండిటి విలువలని కలపాలి. రెండు హల్లుల తరువాత అచ్చు వచ్చినప్పుడు హల్లుల విలువలని కలిపి అచ్చు విలువతో గుణించాలి.

కొన్ని ఉదాహరణలు –

గ = 3, న = 20, ఉ = 10,000. కనుక

గ్ను = (3 + 20) X 10,000 = 23,000

ఆ విధంగా ఒక్క అక్షరంతో అంత పెద్ద సంఖ్యని వ్యక్తం చెయ్యడానికి వీలయ్యింది.

మరో ఉదాహరణ,

ఖ్యుఘృ = (ఖ + య + ఉ + ఘ్ + ఋ) = (2 + 30)X10,000 + 4 X 100X100X100 = 4,320,000

రెండక్షరాల పదంతో ఏడు అంకెల సంఖ్యని వ్యక్తం చెయ్యడానికి వీలయ్యింది. ప్రాచీన భారత కాలమానం ప్రకారం ఈ సంఖ్య ఒక మహాయుగంలో మొత్తం సంవత్సరాల సంఖ్య.

ఈ రకమైన సంఖ్యా పద్ధతిని ఉపయోగించి ఆర్యభట్టు sin(x) ప్రమేయానికి పట్టికలు ఇచ్చాడు.పదాలతో సైన్ పట్టిక -

Sin(x) ప్రమేయాన్ని జ్యామితి బద్ధంగా ఈ కింద చూపించిన లంబకోణం త్రిభుజంలో సూచించొచ్చు. త్రిభుజంలో లంబ కోణానికి ఎదురుగా ఉన్న భుజం (కర్ణం) విలువ 1 అనుకుంటే, x అనే కోణానికి ఎదురుగా ఉండే భుజం యొక్క పొడవే sin(x) విలువ.

లంబ కోణ త్రిబుజం పరంగా కాకుండా వృత్తం పరంగా కూడా sin(x) ని వ్యక్తం చెయ్యొచ్చు.

కింద కనిపిస్తున్న చిత్రంలో వృత్తం యొక్క చుట్టుకొలత లోని ఒక భాగాన్ని ‘చాపం’ (arc) అంటారు. చాపం యొక్క రెండు కొసలని కలిపే సరళ రేఖని ‘జ్యా’ (chord) అంటారు. ఈ జ్యాలో సగభాగానికి (half-chord) కి sin(x) ప్రమేయానికి సంబంధం వుంది. వృత్తం యొక్క వ్యాసార్థం (radius) 1 అనుకుంటే ‘అర్థ జ్యా’ విలువే sin(x) అవుతుంది. X పెరుగుతుంటే ఈ ‘అర్థ జ్యా’ విలువ క్రమంగ ఎలా పెరుగుతుందో ఆర్యభట్టు ఓ పట్టిక రూపంలో వ్యక్తం చేశాడు.పొడవుని కొలవడానికి units (ఏకాంకాలు) కావాలు. మీటర్లో, సెంటీమీటర్లో వాడడానికి బదులుగా ఆర్యభట్టు కోణాలనే వాడాడు. అది ఇలా చేశాడు.

వృత్త కేంద్రం చుట్టూ మొత్తం కోణం 360 డిగ్రీలు అని మనకి తెలుసు.

1 degree = 60 minutes కనుక

360 degrees = 360 X 60 = 21600 minutes.

ఒక విధంగా ఇది వృత్తం యొక్క చుట్టుకొలత అనుకోవచ్చు. చుట్టుకొలతకి వ్యాసార్థానికి మధ్య సంబంధం ఇది,

R = circumference/2pi

కనుక

R = 21600/(2pi) = 3438 minutes (సుమారు)

అంటే x అనే కోణానికి సంబంధించిన ‘అర్థ-జ్యా’ విలువ = R sin(x)

0 నుండి 90 డిగ్రీల వరకు కోణాన్ని 24 భాగాలు చేస్తాడు ఆర్యభట్టు.

90/24 =3.75 degrees కనుక, ఆ కోణాలు వరుసగా 0, 3.75, 7.5, 11.25 … ఇలా ఉంటాయి.

వీటి sin() విలువలు వరుసగా sin(0), sin(3.75), ఇలా ఇవ్వకుండా, పక్కపక్కనే వచ్చే sin(x) విలువల మధ భేదాలని మాత్రమే ఇస్తాడు. ఉదాహరణకి

R*(Sin(3.75) – sin(0))

R*(Sin(7.5) – sin(3.75))

R*(sin(11.25) – sin(7.5))

ఆధునిక కాల్కులేటర్ ఉపయోగించి పై రాశులని గణిస్తే,

R*(Sin(3.75) – sin(0))=224.85

R*(Sin(7.5) – sin(3.75))=223.89

R*(sin(11.25) – sin(7.5))= 221.97

ఆర్యభట్టు ఇచ్చిన విలువలు పై ఆధునిక విలువలతో బాగా సరిపోతున్నాయి. అయితే ఈ విలువలని ఆర్యభట్టు పైన చెప్పుకున్నట్టుగా అక్షరాలతో వ్యక్తం చేసి ఓ పద్య రూపంలో ప్రదర్శించడం విశేషం.కన్నడ లిపిలో రాయబడ్డ ఈ వ్రాతపత్రిలో పదాలు –

మఖి (=225), భఖి (=224), ఫఖి (222), ధఖి (219)– ణఖి –ఞఖి – ఙఖి – హస్ఝ – స్కకి – కిష్గ – శ్ఘకి – కిఘ్వ – ఘ్లకి - కిగ్ర – హక్య – ధకి – కిచ – స్గ – ఝశ – ణ్వ – క్ల – ప్ట – ఫ – ఫ - చపైన ‘మఖి’ విలువ 225, ఇందాక గణించిన R*(Sin(3.75) – sin(0))=224.85 తో చక్కగా సరిపోతోంది.

అలాగే ‘భఖి’ విలువ 224, R*(Sin(7.5) – sin(3.75))=223.89 తో సరిపోతోంది.ఈ విధంగా ఆర్యభట్టు sin(x) ప్రమేయాన్ని ఓ పట్టిక రూపంలో ఇచ్చాడు. ఆ రోజుల్లో జ్ఞానాన్ని ముఖతః నేర్చుకుని కంఠస్థం చేసేవారు కనుక, అంకెలని ఇలా పదాలుగాను పద్యాలుగాను వ్యక్తం చేసుకునేవారు.

ఆర్యభట్టు కనిపెట్టిన క్రీ.శ. 499 నాటి ఈ సైన్ పట్టిక గణిత చరిత్రలోనే మొట్టమొదటి సైన్ పట్టిక అని గణిత శాస్త్ర చారిత్రకులు అభిప్రాయపడుతున్నారు.References:

1. R Narasimha, Sines in terse verse, Nature 414:851, 2001.

2. http://en.wikipedia.org/wiki/%C4%80ryabha%E1%B9%ADa's_sine_tableడార్విన్ గ్రంథ రచన

Posted by V Srinivasa Chakravarthy Sunday, October 7, 2012 0 comments


లండన్లో ఉండే రోజుల్లో ఎన్నో వైజ్ఞానిక సదస్సుల సమావేశాలకి హాజరు అవుతూ ఉండేవాణ్ణి. భౌగోళిక సదస్సుకి సెక్రటరీగా కూడా పని చేశాను. కాని అనారోగ్య కారణాల వల్ల తరచు ఈ సమావేశాలకి హాజరు కావడం వీలపడలేదు. కనుక నేను, నా భార్య లండన్ వదిలి పల్లె ప్రాంతాలకి తరలిపోయాం. మళ్లీ ఎప్పుడూ అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు చింతించలేదు.సర్రీ తదితర ప్రాంతాల్లో ఇంటి కోసం చాలా గాలించాం. కాని ప్రయోజనం లేకపోయింది. చాలా గాలించిన తరువాత చివరికి ఒక ఇల్లు కనిపించింది. అది నచ్చి కొనుక్కున్నాం. అక్కడి పరిసరాల ప్రశాంతత, గ్రామీణ సంస్కృతి మాకు బాగా నచ్చింది. కాని మా ఇంటికి రావడానికి వాహనాల మీద రావడానికి వీలుపడదని కంచరగాడిద (mule) మిదెక్కి రావాలని ఆ జర్మన్ పత్రికా విలేఖరి రాసిన మాట మాత్రం వట్టి అతిశయోక్తే! ఈ కొత్త ఇల్లు మా పిల్లల రాకపోకలకి కూడా చాలా సౌకర్యంగా వుంది.

ఉద్యోగవిరమణ తరువాత ఇంత సుఖమయ జీవనం చాలా తక్కువ మందికి దొరుకుతుందేమో. అప్పుడప్పుడు బంధువుల ఇళ్ళకి వెళ్లి వస్తాం. లేదంటే సముద్ర తీరానికి వెళ్ళి ప్రశాంత ఘడియలు గడుపుతాం. ఇక్కడ దిగిన తొలి రోజుల్లో కొన్ని సార్లు మళ్ళీ సమాజంలోకి వెళ్లాలని చూశాం. ఇంటికి కూడా కొన్ని సార్లు అతిథులని ఆహ్వానించాం. కాని ఆ విందులు, సందడి మొదలైనవి నా ఆరోగ్యానికి సరిపడలేదు. వొంట్లో తీవ్రమైన వణుకు పుట్టేది, వాంతులు అయ్యేవి. ఆ తరువాత కొన్నేళ్ల వరకు ఈ విందులకి, వినోదాలకి తిలోదకాలు వొదిలేశాను. ఆ కారణం చేతనే వైజ్ఞానిక సమాజాలకి చెందిన వ్యక్తులని కూడా ఎక్కువగా కలుసుకోడానికి వీలుపడలేదు.నా జీవితమంతా నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యాపకం వైజ్ఞానిక కృషి. ఒంట్లో ఏ అస్వస్థత ఉన్నా, అసౌకర్యం కలిగినా వైజ్ఞానిక పరిశోధన ఇచ్చే ఉత్సాహం వల్ల, ఉద్వేగం వల్ల అన్నీ మరచిపోతాను. కనుక నా శేష జీవితం అంతా నేను చేసిందల్లా పుస్తకాలు రాయడమే. ఆ పుస్తకాలు ఎలా ఆవిర్భవించాయో ఆ విశేషాలు మీతో కాస్త పంచుకుంటాను.నేను రాసిన పుస్తకాలు

1844 తొలి దశాలలో బీగిల్ యాత్రలో నేను సందర్శించిన అగ్నిపర్వత దీవుల మీద నేను చేసిన పరిశీలనలన్నీ పొందుపరుస్తూ ఓ పుస్తకం రాశాను. 1845 లో ఎంతో ప్రయాస పడి నా ‘పరిశోధనా పత్రిక’ (Journal of Researches) ని సరిదిద్ది దాని కొత్త సంపుటాన్ని ప్రచురించాను. ఫిట్జ్-రాయ్ తో పాటు చేసిన కృషిలో భాగంగా తొలుత 1839 లో ప్రచురించిన మూల ప్రతికి ఇది మెరుగైన రూపం. నా ప్రప్రథమ సాహితీ సృష్టిగా ఈ పుస్తకం సాధించిన విజయాలని తలచుకుంటే సంతోషంగాను, గర్వంగాను ఉంటుంది. ఈ నాటికీ ఈ పుస్తకం ఇంగ్లండ్ లోను, అమెరికా లోను ముమ్మరంగా అమ్ముడు పోతుంది. ఇటీవలే ఈ పుస్తకం జర్మన్ భాషలో రెండో సారి అనువదించబడింది. దీన్ని ఫ్రెంచ్ తదితర భాషలలోకి కూడా అనువదించారు.

ఒక యాత్రాపుస్తకం యొక్క, అదీ వైజ్ఞానిక యాత్రా పుస్తకం యొక్క, పలుకుబడి దాని ప్రథమ ముద్రణ జరిగిన ఇన్నేళ్లకి కూడా సజీవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంగ్లండ్ లో ఈ పుస్తకం యొక్క రెండవ ముద్రణలో పదివేల ప్రతులు అమ్ముడు పోయాయట. 1846 లో నేను రాసిన ‘దక్షిణ అమెరికాలో భౌగోళిక పరిశీలనలు’ ప్రచురించబడింది. భౌగోళిక శాస్త్రం మీద నేను రాసిన మూడు పుస్తకాలకి మొత్తం నాలుగున్నర ఏళ్ల కఠోర శ్రమ అవసరం అయ్యింది. [వాటిలో ‘పగడపు దీవుల’ మీద రాసిన పుస్తకం కూడా ఉంది.] ఈ విషయం గురించి నా చిన్ని డైరీలో ఇలా రాసుకున్నాను – “ఇంగ్లండ్ కి తిరిగొచ్చి ఇప్పటికి పదేళ్లు అవుతోంది. నా అనారోగ్యం వల్ల ఎంత సమయం వృధా అయ్యిందో అనిపించింది.” ఈ మూడు పుస్తకాల గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. ఆ పుస్తకాలు ఇటీవలే మరొక్కసారి ముద్రణ వచ్చాయని మాత్రం చెప్పగలను.

అక్టోబర్ 1846 లో ‘సిరీపీడియా’ (Cirripedia) (పైన చిత్రం) మీద పని మొదలెట్టాను. చిలీ దేశపు తీరం మీద సంచరిస్తున్నప్పుడు ఓ చిత్రమైన సిరీపీడ్ (పీతని పోలిన ఓ జలజీవం) ని చూశాను. ఇవి కోంచొలేపాస్ (Concholepas) (ఆలుచిప్ప లాంటి ఓ జీవం) యొక్క గవ్వలలోకి దూరి బతుకుతాయి. అంతవరకు నేను చూసిన సిరీపీడ్ లకి వీటికి మధ్య చాల తేడా వుంది. అందుకే వీటిని వర్గీకరించడానికి ఓ ప్రత్యేక ఉపజాతిని నిర్వచించవలసి వచ్చింది. ఇటీవలి కాలంలో ఈ సిరీపీడ్ లాంటి జీవజాతే ఒకటి పోర్చుగల్ దేశపు తీరం మీద కనిపించిందట. నేను కొత్తగా కనుక్కున్న జీవం యొక్క అంతరంగ నిర్మాణాన్ని అర్థం చేసుకోడానికి ఈ జీవం యొక్క ఎన్నో సామాన్య రూపాలని తెచ్చి పరిచ్ఛేదించి చూశాను. ఆ విధంగా క్రమంగా ఈ జీవజాతుల మొత్తం కుటుంబాన్ని పరిశోధించడానికి వీలయ్యింది. అప్పట్నుంచి ఓ ఎనిమిదేళ్ళు ఈ సమస్య మీదే ఎడతెగకుండా పని చేశాను. చివరికి ఆ పరిశోధనల ఆధారంగా రెండు పెద్ద పుస్తకాలు ప్రచురించాను. వాటిలో ఈ జీవజాతికి చెందిన సజీవ రూపాలన్నిటినీ వర్ణించాను. వాటిలో వినష్ట రూపాలని కాస్త చిన్న పుస్తకాలుగా కూడా ప్రచురించాను. సర్ ఇ. లిటన్ బుల్వర్ రాసిన ఓ నవలలో ప్రొఫెసర్ లాంగ్ అనే పాత్రని పరిచయం చేస్తాడు. ఈ ప్రొఫెసరు limpet (నత్త లాంటి ఓ జంతువు) మీద రెండు భారీ పుస్తకాలు రాస్తాడు. అది చదివినప్పుడు రచయిత నన్ను చూసి ఆ పాత్రని సృష్టించాడా అనిపించింది.


(సిరీపీడియా చిత్రం - http://en.wikipedia.org/wiki/Barnacle)


(ఇంక వుంది)ఒక్క బొట్టయినా లేదు

Posted by V Srinivasa Chakravarthy Wednesday, October 3, 2012 4 comments

అధ్యాయం 22


ఒక్క బొట్టయినా లేదు

ఈ సారి మా అవరోహణ రెండవ సొరంగంలో మొదలయ్యింది. ఎప్పట్లాగే హన్స్ మా ముందు నడిచాడు.

ఓ నూరు గజాలు నడిచామో లేదో ప్రొఫెసర్ తన చేతులోని లాంతరుని గోడల దగ్గరగా పట్టుకుని చూసి, “అబ్బ! ఇవి ఆదిమ శిలలు. అంటే ఇదే సరైన మార్గం. పదండి ముందుకు” అని అరిచాడు.

ప్రాథమిక దశలలో భూమి నెమ్మదిగా చల్లబడసాగింది. అలా కుంచించుకుపోతున్న భూమి పైపొరలో పగుళ్ళు, బీటలు, చీలికలు, అగాధాలు ఏర్పడ్డాయి. మేం నడుస్తున్న బాట అలాంటి ఓ చీలికే. అయితే ఒక దశలో కరిగిన గ్రానైట్ శిల ఈ చీలికలో ప్రవహించింది. ఘనీభవించిన ఆ పురాతన శిలాప్రవాహం వల్ల ఆ ఆదిమ పాషాణ రాశిలో మెలికలు తిరిగిన గజిబిజి బాటలు ఏర్పడ్డాయి.

మేం వేగంగా కిందికి దిగుతూ ఉంటే భూగర్భంలోని ఆదిమ స్తరాల క్రమం స్పష్టంగా కనిపించింది. ఈ ఆదిమ పదార్థమే భూమి లోని ఖనిజాల పొరకి పునాది అని భౌగోళిక శాస్త్రవేత్తలు భావిస్తారు. అందులో మూడు రకాల శిలా విన్యాసాలు ఉన్నాయని తేల్చారు. అవి – షిస్ట్ (schist), నైస్ (gneiss), మైకా షిస్ట్ (mica schist). ఈ మూడూ వీటి అడుగున మారని పునాదిగా ఉన్న గ్రానైట్ పొర మీద కుదురుగా ఉన్నాయి.ప్రకృతిని ఇంత స్పష్టంగా, ప్రత్యక్షంగా పరిశీలించగల అద్భుత అవకాశం భౌగోళిక శాస్త్రవేత్తలకి ఎప్పుడూ కలగదు అనుకుంటాను. జడమైన బోరింగ్ యంత్రం పైకి తీసుకురాలేని సమాచారం అంతా ఇప్పుడు మా కళ్లకి కట్టినట్టు ఉంది. చేయి చాచి తాకగలిగేటంత దగ్గర్లో వుంది.షిస్ట్ శిలా స్తరాలలో ఎక్కువగా ఆకుపచ్చ రంగులో భేదాలే కనిపిస్తున్నాయి. రాగి, మాంగనీస్ ఖనిజాల దారాలు గోడలలో లతలలా పాకుతున్నాయి. అక్కడక్కడ బంగారు, ప్లాటినమ్ ల సూక్ష్మమైన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మానవ జాతి లోభ దృష్టికి కనిపించకుండా అందరాని ఈ భూగర్భపు చీకటి లోతుల్లో ఇంకా ఎన్ని పెన్నిధులు ఉన్నాయోనని ఆలోచించసాగాను. ఏదో ప్రాచీన యుగానికి చెందిన బృహత్తర కంపనాల వల్ల ఈ అపారమైన లోతుల్లో పూడుకుపోయిన నిధులని గునపాలు, గడ్డపారలు ఏనాటికి భేదించలేవు.

షిస్ట్ స్తరాల తరువాత నైస్ స్తరాలు వచ్చాయి. ఇవి పాక్షికంగానే స్తరీకరణం (stratification) చెందాయి. వాటి పొరలలో కచ్చితమైన సమాంతరీయత (parallelism) కనిపిస్తుంది. ఇక తరువాత వచ్చిన మైకా షిస్ట్ లలో పొరలు ఫలకాలుగా, పళ్లేలుగా ఏర్పడ్డాయి. చదునైన ఆ ఉపరితలాల మీద కాంతి పడి మెరుస్తున్నాయి.

మా ఉపకరణాల నుండి వచ్చే కాంతి క్వార్జ్ స్ఫటికల మీద పడగా ప్రతిబింబించిన కాంతి నానా కోణాలలోను ప్రసరిస్తోంది. ఆ శిలల లోంచి నడుస్తుంటే ఓ పెద్ద వజ్రం గుండా నడుస్తున్నట్టు వుంది. వాటి కోటి ముఖాల మీద పడి తుళ్లి పడి, ఉరకలు వేసే కాంతి రేఖల లాస్యం వల్ల వేల వెలుగుల వేడుకే అక్కడ వెలసింది.


సుమారు ఆరు గంటల కల్లా ఈ లోకోత్తర కాంతుల రంగేళి కాస్త వన్నె తగ్గి, క్రమంగా పూర్తిగా మాయమైపోయింది. స్ఫటికమయమైన గోడలు వెలవెలబోయినట్టు అయ్యాయి. మైకా, క్వార్జ్, ఫెల్డ్ స్పార్ లు సమ్మిళితమై భూమి యొక్క కఠిన పునాదిగా ఏర్పడ్డాయి. ఆ పైనున్న నాలుగు ధరాగత శిలా వ్యవస్థలని చెక్కుచెదరకుండా ఘనంగా మోస్తున్నాయి.

ఆ కఠిన గ్రానైట్ గోడల కారాగారంలో ముగ్గురం బందీలయ్యాము.

(ఇంకా వుంది)

అలాగే ఒకసారి లార్డ్ స్టాన్ హోప్ (Lord Stanhope)(చరిత్రకారుడు) ఇంట్లో మకాలే (Macaulay)ని కలుసుకున్నాను. ఆయన మాటలు వినే సదవకాశం దొరికింది. చూడగానే చాలా నచ్చారు. ఆయన పెద్దగా మాట్లాడలేదు. అయినా అలాంటి వాళ్లు ఎక్కువగా మాట్లాడరు కూడా. ఇతరులు మాట్లాడిస్తే మాట్లాడేవారు అంతే.


మకాలే జ్ఞాపకశక్తి ఎంత కచ్చితంగా, ఎంత సంపూర్ణంగా ఉంటుందో ఋజువు చెయ్యడానికి లార్డ్ స్టాన్ హోప్ ఒక వృత్తాంతం చెప్పారు. లార్డ్ స్టాన్ హోప్ ఇంట్లో ఎంతో మంది చారిత్రకులు సమావేశం అవుతుండేవారు. కొన్ని కొన్ని అంశాలు చర్చిస్తూ కొన్ని సందర్భాలలో మకాలే తో విభేదించేవారు. సందేహం వచ్చినప్పుడు ఎవరిది నిజమే తేల్చుకోడానికి పుస్తకాలు తిరగేసేవారు. కాని లార్డ్ స్టాన్ హోప్ గమనించింది ఏంటంటే క్రమంగా ఆ పద్ధతి మారిపోయింది. చారిత్రకులు పుస్తకాలు చూడడం అనవసరం అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మకాలే చెప్పిందే ప్రతీ సారి నిజమయ్యింది.

మరో సారి కూడా లార్డ్ స్టాన్ హోప్ ఇంట్లో జరిగిన ఓ సమావేశానికి వెళ్లాను. ఎంతో మంది చారిత్రకులు, సాహితీకారులు వచ్చారు. అక్కడే మోట్లీ (Motley)ని, గ్రోట్ (Grote) ని కలుసుకున్నాను. భోజనం తరువాత చీవెనింగ్ పార్క్ లో మోట్లీ తో పాటు ఓ గంట సేపు షికారుకి వెళ్లాను. ఆయన నిరాడంబరత, కల్ల కపటం లేని ప్రవర్తన నాకు బాగా నచ్చాయి.

చాలా కాలం క్రితం చారిత్రకుడు ‘ఎర్ల్’ యొక్క తండ్రితో కలిసి భోజనం చేశాను. ఆయన ఓ విచిత్రమైన మనిషి. కాని బాగా నచ్చాడు. ముక్కుకు సూటిగా, స్నేహపూర్వకంగా మాట్లాడే స్వభావం ఆయనది. చామన ఛాయగా ఉంటాడు. ప్రస్ఫుటమైన ముఖ కవళికలు ఉంటాయి. నేను చూసిన రోజు గోధుమ రంగు బట్టలు వేసుకున్నాడు. ఇతరులకి నమ్మశక్యం కాని విషయాలని కూడా అమాయకంగా నమ్మే మనిషి. ఓ రోజు నాతో అన్నాడు – “ఇదుగో చూడు, నువ్వు ఈ భౌగోళిక శాస్త్రం, జంతు శాస్త్రం మొదలైన పనికిమాలిన కాలయాపన అంతా పక్కన పెట్టి తంత్రవిద్య లోకి దిగరాదూ?” ఆ పక్కనే వున్న లార్డ్ మహోన్ ఆ మాటలు విని అదిరిపోయాడు. సౌందర్యరాశి అయిన ఆయన సతీమణికి కూడా ఆ మాటలు వినోదం కలిగించినట్టు ఉన్నాయి.
ఇక చివరగా కార్లైల్ (Carlyle, పై చిత్రం) గురించి చెప్తాను. మా తమ్ముడి ఇంట్లో ఎన్నో సార్లు ఈయన్ని కలుసుకున్నాను. రెండు, మూడు సార్లు ఆయన మా ఇంటికి కూడా వచ్చారు. ఆయన మాటల్లో మంచి పదును ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటాయి. కాని ఆయన రచనలలో లాగానే ఒకే అంశం మీద ఆగకుండా మాట్లాడుతూనే ఉంటాడు. మా తమ్ముడి ఇంట్లో ఓసారి ఓ తమాషా విందు జరిగింది. ఆ విందుకి చాలా మంది ప్రముఖులు వచ్చారు. వారిలో బాబేజ్, లయల్ లు కూడా వున్నారు. ఇద్దరికీ మాట్లాడడం అంటే ఇష్టమే. కాని కార్లైల్ మాత్రం నిశ్శబ్దం వల్ల జరిగే మేలు గురించి ఏకధాటిగా మాట్లాడుతూ మరెవ్వరికీ మాట్లాడే అవకాశం లేకుండా చేశాడు. భోజనం తరువాత బాబేజ్ (మనసులోనే తిట్టుకుంటూ) నిశ్శబ్దం మీద అంత పెద్ద ఉపన్యాసం ఇచ్చినందుకు కార్లైల్ కి సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపాడు.కార్లైల్ అందరినీ చిన్నచూపు చూసేవాడు. ఓసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన గ్రోట్ రాసిన “చరిత్ర” గురించి మాట్లాడుతూ అది “ ‘కుళ్ళిన మురికి గుంట, అందులో అధ్యాత్మిక సారం అనేది లేనే లేదు” అన్నాడు. ఆయన రాసిన ‘జ్ఞాపకాలు’ (reminiscences) పుస్తకం అచ్చయిన దాక ఆయన పరిహాసం అంతా విందుల్లో వినోదం కలిగించే సాధనాలు అనుకున్నానే గాని, ఇప్పుడు నాకు సందేహం కలుగుతోంది. ఆయన ఔదార్యం నిజమే అయినా దాని మీద నల్లని అసూయ చారలు ఉన్నట్టు అనిపిస్తుంది. మనుషుల స్వభావాలని సునిశితంగా, సజీవంగా చిత్రించే ఆయన అసమాన శక్తి మాకలే ప్రతిభ కన్నా గొప్పదని ఎవరూ సందేహించలేరు. కాని ఆ చిత్రాలు సత్యమైనవా కావా అన్నదే ఇక్కడ ప్రశ్న.


కాని మనుషుల మనసుల్లో కొన్ని మౌలిక నైతిక సత్యాలు ముద్రపడేలా చెయ్యడంలో ఆయన శక్తి అమోఘం. కాని అదే విధంగా బానిసత్వం మీద ఆయన అభిప్రాయాలు వింటే అసహ్యం కలుగుతుంది. ఆయన దృష్టిలో బలవంతుడు చేసిందే సరైనది. ఆయన తృణీకరించిన వైజ్ఞానిక విభాగాలని పక్కన పెట్టినా కూడా, ఆయనది సంకుచిత మనస్తత్వం అని చెప్పొచ్చు. అలాంటి వాణ్ణి పట్టుకుని శాస్త్రపురోగతి సాధించడానికి తగ్గ అర్హత గల వాడని కింగ్ స్లీ (Kingsley) పొగడడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. వెవెల్ (Whewell) లాంటి గణితవేత్త కాంతి మీద గోథే (Goethe) వ్యక్తం చేసిన భావాలని వెలకట్టగలడు అంటే వెక్కిరింతగా నవ్వాడాయన. హిమానీనదాలు (glaciers) అసలు కదులుతాయా లేదా, కదిలితే వేగంగా కదులుతాయా, నెమ్మదిగా కదులుతాయా మొదలైనవన్నీ పనికిమాలిన తాపత్రయాలని హేళన చేసేవాడు. వైజ్ఞానిక పరిశోధనకి ఇంతగా అనర్హమైన మనసు గల మనిషిని ఇంతవరకు నేను ఎక్కడా చూళ్లేదు.

(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email