ఈ కృషిలో [సిరీపీడ్ ల మీద గ్రంథ రచన] నేను ఎనిమిదేళ్లు గడిపినా అందులో అనారోగ్యం వల్ల రెండేళ్లు పోయాయి. ఆ విషయం నేను నా డైరీలో రాసుకున్నాను. ఆ కారణం చేత 1848 లో నేను హైడ్రోపతిక్ చికిత్స కోసం మాల్వర్న్ లో కొంత కాలం గడిపాను. ఆ చికిత్స నాకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. అక్కణ్నుంచి ఇంటికి తిరిగి రాగానే మళ్లీ పని మొదలెట్టాను. ఆ రోజుల్లో నా ఆరోగ్యం ఎంత దీనంగా ఉండేదంటే 1848 లో నవంబర్ 13 నాడు నా తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరిపించడానికి కూడా నాకు వీలుపడలేదు.
సిరీపీడ్ ల మీద నేను చేసిన కృషి గణనీయమైనదని చెప్పాలి. కొన్ని కొత్త, విశేషమైన రూపాలని కనుక్కోవడమే కాక, వివిధ జీవాలలో అంగాలలోని సారూప్యాన్ని ఎత్తి చూపాను. వివిధ అంగాలు ఒకదాన్నొకటి అతుక్కునేలా చేసే జిగురు యంత్రాంగాన్ని గుర్తించాను. అయితే ఆ జిగురు గ్రంథుల (cement glands) విషయంలో మాత్రం ఘోరంగా పొరబడ్డాను. అంతేకాక [సిరీపీడ్ లకి చెందిన] కొన్ని ఉపజాతులలో (genera) అతి చిన్న మగ జీవాలు ఉభయలింగ జీవాల (hermaphrodite) ల మీద పడి పరాన్నభుక్కులుగా (parasites) బతకడం గుర్తించాను. ఈ రెండవ ఆవిష్కరణకి సంబంధించిన ఆధారాలు తదనంతరం దొరికాయి. కాని మొదట్లో మాత్రం ఆ వృత్తాంతం అంతా కేవలం నా అభూత కల్పన అని ఓ జర్మన్ రచయిత కొట్టిపారేశాడు. సిరీపీడ్ లు గొప్ప వైవిధ్యం గల జీవ జాతి. వాటిని వర్గీకరించడం అంత సులభం కాదు. Origin of Species లో ప్రకృతి నిబద్ధ వర్గీకరణ సూత్రాలని చర్చించే ప్రయత్నంలో సిరీపీడ్ ల మీద కృషి ఎంతో ఉపకరించింది. అయితే ఆ అంశం మీద అంత కాలాన్ని వెచ్చించడం అవసరమా అని తరువాత అనిపించింది. [దీని గురించి మరింత సమాచారం కావాలంటే ఈ లింక్ చూడండి. http://darwin-online.org.uk/EditorialIntroductions/Richmond_cirripedia.html - అనువాదకుడు.]
1854 సెప్టెంబర్ నుండి నేను సృష్టించిన అపారమైన వ్రాత ప్రతులని క్రమబద్ధీకరించే ప్రయత్నంలో మునిగిపోయాను. జీవజాతుల రూపాంతరీకరణకి సంబంధించి ఎన్నో పరిశీలనలు, ప్రయోగాలు చెయ్యడంలో మునిగిపోయాను. బీగిల్ యాత్రలలో పాంపియన్ శిలా నిర్మాణాలలో (Pampaen formations) పెద్ద పెద్ద శిలాజాలని చూశాను. ప్రస్తుతం మనం చూసే ఆర్మడిలోలకి ఉండే కవచం లాంటి పైతొడుడు వుందీ శిలాజాలలో. దక్షిణ అమెరికా ఖండం మీద దక్షిణంగా ప్రయాణిస్తుంటే లక్షణాలలో పోలికలు గల జంతువులు వరుసగా ఒకదాని స్థానంలో ఒకటి క్రమబద్ధంగా రావడం నాకు విస్మయం కలిగించింది. గలపాగోస్ ద్వీపకల్పం మీద జంతువులకి, దక్షిణ అమెరికా మీద కనిపించే జంతువుల లక్షణాలకి మధ్య సాన్నిహిత్యం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంతే కాక ఆ ద్వీపకల్పంలో వివిధ దీవుల మీద కనిపించే జంతువుల మధ్య కనిపించే సూక్ష్మమైన వైవిధ్యం కూడా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఆ దీవులలో ఏదీ కూడా భౌగోళిక దృష్టితో చూస్తే అంత పురాతనమైనది కాదు.
ఇలాంటి వాస్తవాలు (ఇలాంటివే మరెన్నో ఇతర వాస్తవాలు) చూస్తుంటే ఒక్కటే నిర్ణయానికి రాగలం అనిపిస్తోంది. జీవజాతులు క్రమంగా పరిణతి చెందుతూ వస్తున్నాయి. మొదటినించీ కూడా ఈ విషయం నా మనసుని ఆకట్టుకుంది. ఇక్కడ మనకు మరో విషయం కూడా ప్రస్ఫుటం అవుతుంది. పరిసరాల ప్రభావం గాని, ప్రాణుల సంకల్పబలం గాని (ముఖ్యంగా మొక్కల విషయంలో) జీవకోటి దాని పరిసరాలకి అనుగుణంగా పరిణమించిన అసంఖ్యాకమైన సందర్భాలకి కారణాలు కాలేవు. చెట్టునెక్కగల వడ్రంగి పిట్ట, సులభంగా గాలి మీద సవారీ చేసేందుకు వీలుగా పింఛాలు మొలిచిన విత్తనం – మొదలైన వన్నీ అలాంటి అనుగుణ్యమైన పరిణతికి తర్కాణాలు. అలాంటి అనుగుణ్యమైన పరిణామం నాకు కనిపించిన ప్రతీ సారి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఎలా జరిగిందో వివరించకుండా ఏదో బాహ్య శక్తి జీవజాతులని మలచిందని, మార్చిందని పరోక్షంగా వివరించాలని చేసే ప్రయత్నాలన్నీ నాకు అర్థరహితంగా అనిపిస్తాయి.
ఇంగ్లండ్ కి తిరిగొచ్చిన తరువాత భౌగోళిక శాస్త్రంలో లయల్ నడిచిన బాటలోనే నడవాలని బయల్దేరాను. సహజ పరిస్థితులకి చెందినవి, మనిషి పెంపకంలో పెరిగినవి అయిన జంతువులని, మొక్కలని పరిశీలించి వాటిలో కనిపించే నానా రకాల వైవిధ్యానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించడం మొదలెట్టాను. ఆ విధంగా జీవజాతుల పరిణామ క్రమం మీద కొంత అవగాహన ఏర్పడుతుందని ఆశ. జులై 1837 లో నా మొట్టమొదటి నోట్సు పుస్తకాన్ని తెరిచాను. బేకన్ బోధించిన సూత్రాల అనుసారం పని చేస్తూ, ఏ విధమైన సైద్ధాంతిక పూర్వభావాలు లేకుండా భారీ ఎత్తున వాస్తవాలు సేకరిస్తూ పోయాను. ముఖ్యంగా మనిషి పెంపకంలో ఎదిగిన జీవాల గురించి ఎన్నో విషయాలు సేకరించాను. తోటమాలులతో, జంతువులని పెంచేవారితో సంభాషించాను, ఉత్తరాలు రాసి జవాబులు సేకరించాను. విస్తృతంగా చదివాను. ఈ ప్రయత్నంలో నేను చదివి సంక్షిప్త రూపంలో రాసుకున్న పుస్తకాలు, పత్రికలు అన్నీ చూస్తే నేను పడ్డ శ్రమకి నాకే ఆశ్చర్యం కలుగుతుంది. జంతువులలో, మొక్కలలో ఉన్నత జాతుల సృష్టిలోని రహస్యం ఎంపిక అన్న విషయం నాకు త్వరలోనే అర్థమయ్యింది. కాని సహజ పరిస్థితుల్లో ఎదిగే జంతువుల విషయంలో ఆ ఎంపిక ఎలా జరుగుతుంది అన్న విషయం మాత్రం నాకు ఎంతో కాలం అవగతం కాలేదు.
(ఇంకా వుంది)
0 comments