శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

ఆధునిక జ్యోతిష్యపు వేళ్లు

Posted by V Srinivasa Chakravarthy Sunday, December 27, 2020 1 comments

 


మరి రాజ్యాల రాతలనే మార్చే గ్రహాలు, పాపం సామాన్య వ్యక్తులని వదిలిపెడతాయా? ఆ విధంగా ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాలో వ్యక్తి స్థాయి జ్యోతిష్యం మొదలయ్యింది. క్రమేపీ అది 2000 ఏళ్ల క్రితం గ్రీకు, రోమన్ ప్రపంచాలలో వ్యాపించింది. అలనాడు మానవ జీవనం మీద జ్యోతిష్య ప్రభావం యొక్క ఆనవాళ్లుగా కొన్ని పదాలని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి disaster అనే ఇంగ్లీష్ పదం ‘చెడు తార’ (dis = చెడు, aster = తార) అనే అర్థం గల గ్రీకు పదం నుండి వచ్చింది. అలాగే influenza (ఇది ఒక రకమైన ఫ్లూ వ్యాధి) అన్న పదం ఇటాలియన్ భాషలో ‘జ్యోతిష్య ప్రభావం’ అన్న అర్థం గల పదం నుండి వచ్చింది. మాజెల్టోవ్ అనే హీబ్రూ పదం (తదనంతరం ఇది బాబిలోనియన్ సంస్కృతిలోకి ప్రవేశించింది) ‘శుభ తారారాశి’ అనే అర్థం కలిగి వుంది. అలాగే ష్లమాజెల్ (shlamazel) అనే యిడ్డిష్ (Yiddish) భాషా శబ్దం ‘ఎడతెగని దురదృష్టానికి గురైన వ్యక్తి’ని సూచిస్తుంది. ఈ శబ్దాన్ని కూడా చివరికి బాబిలోనియాకి చెందిన జ్యోతిష్య పరిభాషతో ముడి వేయొచ్చు. రోమన్ రచయిత ప్లైనీ ప్రకారం కొంతమంది రోమన్లని ‘సిడెరాటియో’ (sideratio) గా (అంటే గ్రహాల వాత పడ్డవారిగా) పరిగణించవచ్చు. ఇక మృత్యువు పూర్తిగా గ్రహాల ప్రభావం వల్లనే జరుగుతుందని భావించేవారు. ఇక consider (పరిగణించు అనే అర్థం గలది) అనే ఇంగ్లీష్ పదాన్ని పరిగణించండి. దీని అర్థం ‘గ్రహాలతో పాటు’. అంటే ఒక విషయం గురించి లోతుగా ఆలోచించాలంటే, నిశితంగా పరిగణించాలంటే, గ్రహాల తోడ్పాటు అవసరం అన్నమాట. 1632 లో లండన్ నగరంలో మృత్యువాత పడ్డ వారి గణాంకాలు పరిశీలించండి. ఆ ఏడాది బాలవ్యాధుల వల్ల ఎంతో మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఆ మరణాలకి కారణమైన వ్యాధులలో ‘కాంతుల ఆరోహణ,’ ‘రాజుగారి దిష్టి’ మొదలైన వ్యాధులు కూడా ఉన్నాయి. మొత్తం 9,535 మరణాలలో 13 మరణాలకి కారణం ‘గ్రహాలు’ గా నమోదు చెయ్యబడింది. కాన్సర్ వాత పడ్డవారి కన్నా వీరి సంఖ్య పెద్దది. ఇంతకీ వాళ్ల రోగలక్షణాలు ఏమై వుంటాయో?

వ్యక్తి స్థాయి జ్యోతిష్యం ఇప్పటికీ మనని వదిలిపెట్టలేదు. ఒకే ఊళ్లో, ఒకే రోజు రెండు వేరు వేరు వార్తా పత్రికల్లో ప్రచురించబడ్డ జ్యోతిష్య వివరాలు తిసుకుందాం. ఉదాహరణకి సెప్టెంబర్ 21 నాడు, 1979 లో ప్రచురించబడ్డ న్యూ యార్క్ పోస్ట్, న్యూ యార్క్ డెయిలీ న్యూస్ పత్రికలనే తీసుకుందాం. పోస్ట్ లో రాసిన జ్యోతిష్యుడి ప్రకారం “రాజీ పడితే ఘర్షణ తగ్గే అవకాశం వుంది.” బానే వుంది కాని కాస్త అయోమయంగా వుంది. ఇక డెయిలీ న్యూస్ లో రాసిన జ్యోతిష్యుడి ప్రకారం “మీ నుండి మీరు మరింత ఎక్కువ ఆశించాలి.” ఆదేశం బానే వుంది కాది ఇది కూడా అయోమయంగా, అయితే కాస్త భిన్నంగా వుంది. ఇవి భవిష్యత్తుని సూచించే ‘జోస్యాలు’ కావు. ఇవి కేవలం కమ్మని సలహాలు. అవి ఏం చెయ్యాలో చెప్తున్నాయి, ఏం జరుగుతుందో చెప్పడం లేదు. బాగా సార్వత్రికంగా వర్తించేలా కావాలని వాటిని అలా కూర్చారు. పైగా వాటిలో వాటి మధ్య ఎన్నో అంతర్ వైరుధ్యాలు ఉన్నాయి. క్రీడా గణాంకాల లాగానో, స్టాక్ మార్కెట్ నివేదికల లాగానో అంత మామూలుగా, నిర్లజ్జగా వాటిని ఎలా ప్రచురించగలుగుతున్నారు?



కవలల జీవితాలని ఆలంబనగా చేసుకుని జ్యోతిష్యాన్ని పరీక్షించొచ్చు. ఎన్నో సందర్భాలలో కవలలో ఒకరు ఏ రోడ్డు ప్రమాదం లోనో, పిడుగు పడో, చిన్నప్పుడే మృత్యు వాత పడతారు. రెండవ వ్యక్తి నిండు నూరేళ్లు వైభవంగా జీవిస్తాడు. మారి వాళ్లు పుట్టినప్పుడు సరిగ్గా ఒకే గ్రహసముదాయం ఉదయిస్తోంది.ఇద్దరూ సరిగ్గా ఒకే చోట, కొన్ని నిముషాలు అటుఇటుగా పుట్టారు. జ్యోతిష్యమే నిజమైతే అలాంటి కవలలకి అంత భిన్నమైన అదృష్టాలు ఉండడం ఎలా సాధ్యం? ఒక వ్యక్తి యొక్క జన్మకుండలి అంతరార్థం ఏమీటో కూడా సరిగ్గా తేల్చుకోలేని జోతిష్యుల మధ్య వాదోపవాదాలు జరుగుతుంటాయి. కేవలం జన్మస్థలం, జనన కాలం బట్టి ఒక వ్యక్తి యొక్క లక్షణాలని నిర్ణయించడంలో కచ్చితంగా, శాస్త్రీయంగా రూపకల్పన చేసిన పరీక్షల్లో జ్యోతిష్యులు విఫలం చెందారు.[1]



భూమి మీద వివిధ దేశాలకి చెందిన జాతీయపతాకల విషయంలో కూడా కొన్ని విడ్డూరమైన సంగతులు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ జెండాలో యాభై తారలు ఉన్నాయి. సోవియెట్ యూనియన్, ఇజ్రాయెల్ జెండాలలో ఒక తార; బర్మా జెండాలో పద్నాలుగు; గ్రెనాడా, వెనూజువేలా లో ఏడు; చైనా జెండాలో ఐదు; ఇరాక్ జెండాలో మూడు; సావో తోమ్ ఎ ప్రిన్సిప్ లో రెండు; జపాన్, ఉరుగ్వే, మలావీ, బంగ్లాదేష్, టైవాన్ జెండాలలో సూర్యుడు ఉన్నాడు; బ్రెజిల్ లో ఖగోళం చిత్రం; ఆస్ట్రేలియా, పశ్చిమ సమొవా, న్యూ జీలాండ్, పపువా న్యూ గినియా లలో దక్షిణ క్రాస్ అనే తారా రాశి; భూతాన్ జెండాలో భూమికి చిహ్నమైన డ్రాగన్ ముత్యపు చిత్రం ఉంటుంది; కాంబోడియా జెండాలో అంగ్ కర్ వాట్ నక్షత్రశాల చిహ్నం; ఇండియా, సౌత్ కొరియా, మోంగోలియన్ పీపుల్స్ రిపబ్లిక్ లకి చెందిన జెండాలలో ఖగోళ చిహ్నాలు. ఎన్నో సోషలిస్టు దేశాల పతాకాలలో తారల చిహ్నాలు ఉంటాయి. ఎన్నో మహ్మదీయ దేశాల జెండాలలో అర్థచంద్రుడి చిహ్నాలు ఉంటాయి. వివిధ దేశాల పతాకాలలో సగానికి సగం ఖగోళ చిహ్నాలు ప్రదర్శిస్తాయి. ఈ పద్ధతి ఒక ప్రత్యేక సంస్కృతికి గాని, సమాజానికి గాని, తెగకి గాని పరిమితం కాదు. ఇది విశ్వజనీనం. పైగా ఇది ఆధునిక యుగానికే చెందిన విషయం కాదు. క్రీ.పూ. మూడవ సహస్రాబ్ద కాలానికి చెందిన సుమేరియన్ సిలిండరు ముద్రలలోను, చైనాలో పూర్వవిప్లవ కాలానికి చెందిన టావోయిస్ట్ జెండాల మీదను తారాశుల చిత్రాలు కనిపిస్తాయి. దివి యొక్క ఆమోదముద్ర పొందాలని దేశాలు తహతహ లాడుతుంటాయి అనడంలో సందేహం లేదు. ఎలాగైనా విశ్వంతో సంబంధం కలుపుకోవాలని అనుకుంటాం. విశ్వదర్శనంలో మనకీ ఓ స్థానం ఉండాలనుకుంటాం. అలాంటి సంబంధం నిజంగానే వుంది. అయితే ఆ సంబంధం జోస్యులు మనని తప్పుదారి పట్టిస్తున్నట్టుగా, అబద్దపు పునాదుల మీద లేదు. జీవపదార్థపు మూలాల దృష్ట్యా, భూమి యొక్క నివాసయోగ్యత దృష్ట్యా, మానవ జాతి యొక్క పరిణామ చరిత్ర, భవితవ్యాల దృష్ట్యా, ఓ ప్రగాఢమైన బంధం మనందరినీ కలుపుతోంది. ఈ సంగతులన్నీ మళ్లీ వివరంగా చర్చించుకుందాం.



ఆధునిక జ్యోతిష్యపు వేళ్లు వెతుక్కుంటూ పోతే అవి మనని క్లాడియస్ టోలెమాయస్ వరకు తీసుకుపోతాయి. అతణ్ణే మనం మరింత క్లుప్తంగా టోలెమీ అని పిలుచుకుంటాం. అయితే అదే పేరు గల రాజులకి, అతడికి మధ్య ఏ సంబంధమూ లేదు. రెండవ శతాబ్దంలో అలెగ్జాండ్రియాలోని గ్రంథాలయంలో అతడు పని చేశాడు. సౌరమానం ప్రకారమో, చంద్రమానం ప్రకారమో గ్రహాలు ఒక “ఇంటి” నుండి మరో ఇంటికి మారడం, ‘అక్వేరియస్ యుగం’ ఆరంభం కావడం మొదలైన విచిత్ర కథనాలన్నీ టోలెమీ నుండి వచ్చినవే. బాబిలోనియాకి చెందిన జ్యోతిష్య సాంప్రదాయాన్ని ఇతడు క్రమబద్ధీకరించాడు. క్రీ.పూ. 150 లో జన్మించిన ఓ పాప జన్మ కుండలి (horoscope) ఇలా ఉంది. గ్రీకు భాషలో, తాళపత్రాల మీద టోలెమీ స్వయంగా రాసిన కుండలి ఇది. “ఫైలో జననం. మహా ప్రభువు ఆంటోనియస్ సీజర్ యొక్క పదవసంవత్సరం. ఫామెనోత్ మాసంలో 15కి 16 కి మధ్య. రాత్రి మొదటి ఘడియ. సూర్యుడు మీన (Pisces) రాశిలో ఉన్నాడు. బృహస్పతి, బుధుడు మేష (Aries) రాశిలో, శని కర్కాటక (Cancer) రాశిలో, అంగారకుడు సింహ (Leo) రాశిలో, శుక్రుడు, చంద్రుడు కుంభ (Aquarius) రాశిలో ఉన్నారు. జన్మ రాశి మకరం (Capricorn).” నెలలని, సంవత్సరాలని లెక్కించే పద్ధతి ఇన్ని శాతాబ్దాల తరువాత, అప్పటికి ఇప్పటికి చాలా మారింది. కాని జ్యోతిష్యుల పరిభాషలో మాత్రం పెద్దగా మార్పు లేదు. టోలెమీ రాసిన జ్యోతిశ్శాస్త్ర గ్రంథం ‘టెట్రాబిబ్లియోస్’ నుండి ఒక అంశం:

“శని తూర్పులో ఉంటే, అది వున్న వారు చామన ఛాయగా, ధృఢంగా, నల్లని ఉంగరాలు తిరిగిన జుట్టుతో, ఛాతీ మీద జుట్టుతో, మరీ పెద్దవి చిన్నవి కాని కళ్లతో, మధ్యస్థమైన విగ్రహంతో, బాగా తేమపట్టిన శరీర ధర్మాన్ని కలిగి ఉంటారు.” కేవలం మనిషి ప్రవర్తననే కాదు, మనిషి శరీర ఛాయ, ఎత్తు, పొడవు, జాతీయ లక్షణాలు, పుట్టుకతో వచ్చే శరీర వైకల్యాలు మొదలైన వాటిని కూడా తారలు శాసిస్తాయని టోలెమీ నమ్మాడు. ఆధునిక జోస్యులు మరీ అలాంటి దుడుకుతనానికి పోక మరి కాస్త నెమ్మది వహించారు.

(ఇంకా వుంది)


[1] జ్యోతిష్యం పట్ల అవిశ్వాసం అనేది కొత్తగా జరుగుతున్నది కాదు. అది పాశ్చాత్యలోకానికే పరిమితం కూడా కాదు. 1332 లో త్సురెజురెగుసా కెంకో రాసిన ‘’సోమరితనం మీద వ్యాసాలు” అన్న పుస్తకంలో – “[జపాన్ లోని] యిన్-యాంగ్ బోధనలకి ‘ఎర్రనాలుక రోజుల’ కి ఎలాంటి సంబంధమూ లేదు. మొదట్లో ఈ రోజులు అశుభం అని అనుకునేవాళ్లు కారు. కాని ఇటీవలి కాలం ఈ ఆచారం ఎవరు ప్రారంభించారో తెలియదు. ‘ఎర్రనాలుక రోజు ఆరంభించిన పని పూర్తి కాదు’ అనే పుకారు బయల్దేరింది. అది కాకపోతే, ‘ఎర్రనాలుక రోజు ఏ పని తలపెట్టినా అది నిష్ఫలం అవుతుంది. నువ్వు గెలుచుకున్నది నష్టపోతావు, నీ పథకాలు బుగ్గిపాలు అవుతాయి,’ అని కూడా అంటుంటారు. ‘శుభ దినాలు’గా పిలువబడే రోజులలో మొదలుపెట్టిన పనులలో ఎన్ని విఫలమయ్యాయి లెక్కపెడితే, ఎర్రనాలుక రోజులలో తలపెట్టగా పాడైన పనులతో సమానం అవుతాయేమో.

మానవ జీవనం - ఖగోళం

Posted by V Srinivasa Chakravarthy Monday, September 28, 2020 0 comments

 

కొన్ని తారలు సూర్యోదయానికి కాస్త ముందుగా గాని, సూర్యాస్తమయానికి కాస్త వెనుకగా గాని ఉదయిస్తాయి. అవి ఉదయించే స్థానం, కాలం ఋతువుల బట్టి మారుతుంటుంది. ఏళ్ల తరబడి తారలని పరిశీలిస్తూ, వాటి చలనాలని నమోదు చేస్తూ పోతే ఋతువుల రాకపోలని నిర్ణయించవచ్చు. అలాగే సూర్యుడు దిక్చక్రం (horizon)  మీద సరిగ్గా ఎక్కడ ఉదయిస్తున్నాడో తెలిస్తే, ఏడాదిలో ఎక్కడ ఉన్నామో గుర్తుపట్టగలం. శ్రద్ధగా పరిశీలనలు చేసి వాటిని నమోదు చేసుకునే ఓపిక ఉన్నవారికి ఆకాశం అంతా విస్తరించిన కాలెండర్ లా బట్టబయలు అవుతుంది.

ఋతువుల మార్పుని కనిపెట్టడానికి మన ప్రాచీనులు ఎన్నో పరికరాలు తయారుచేశారు. అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో, చాకో అనే లోయలో ప్రాచీన ఆలయం ఉంది. ‘కివా’ (kiva) అనబడే  పై చూరు లేని ఆలయం పదకొండవ శతాబ్దం నాటిది. ప్రతీ ఏడాది జూన్ 21 నాడు, అంటే పగటి కాలం దీర్ఘతమమైన రోజు, గుళ్ళో వింత జరుగుతుంది. రోజు ఉదయానే ఒక సూర్యకాంతి పుంజం కిటికీ లోంచి ఎదుట గోడ మీద పడి, ఒక ప్రత్యేక అర మీదుగా కదులుతుంది. ఇది జూన్ 21 దరిదాపుల్లో మాత్రమే జరుగుతుంది. ఏటేటా జూన్ 21 నాడు,  తమని తాముప్రాచీనులంఅని పిలుచుకునే అలనాటి అనసాజీ (Anasazi) తెగ వారు గుళ్ళో చేరి, రంగురంగుల ఈకలు, రొదచేసే చిడతలు, రవ్వలు కట్టిన మాలలు ధరించి, అంబరీషుడి  వైభవాన్ని తలచుకుంటూ సంబరాలు చేసుకునేవారేమో. అలాగే చంద్రుడి చలనాలని కూడా వాళ్లు శ్రద్ధగా పరిశీలించేవారు. కివా ఆలయంలోని ఇరవై ఎనిమిది అరలు, చంద్రుడి కాలచక్రంలోని ఇరవై ఎనిమిది రోజులకి చిహ్నాలేమో. తెగవారు సూర్య, చంద్ర, తారల చలనాలని శ్రద్ధగా గమనించేవారు. ఇలాంటి పరికరాలు ప్రపంచంలో మరెన్నో చోట్ల దొరికాయి. కాంబోడియాలోని అంగ్ కర్ వాట్, ఇంగ్లాండ్ లోని స్టోన్ హెంజ్, ఈజిప్ట్ లోని అబూ సింబెల్, మెక్సికో లోని చిచెన్ ఇట్జా, అమెరికాలోని గ్రేట్ ప్లేన్స్ మొదలైన చోట్ల కోవకి చెందిన నిర్మాణాలు దొరికాయి.


కివా ఆలయపు శిధిలాలు (https://en.wikipedia.org/wiki/Kiva#/media/File:GreatKiva.jpg)

అయితే ఇలాంటి ఖగోళ పరిశోధనా సౌధాలు అని చెప్పుకోబడే వాటిలో కొన్ని కాకతాళీయంగా ఏర్పడ్డవి కావచ్చు. ఉదాహరణకి అనుకోకుండా ఒక భవనంలో కిటికీ, లోపలి అర ఒక వరుసలో ఉండడం వల్ల, జూన్ 21 నాడు కిటికీలోంచి లోపలికి వచ్చే సూర్య పుంజం ఆ అర మీద పడవచ్చు. కాని ఇందుకు చాలా భిన్నమైన పరికరాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి అమెరికాలో దక్షిణ-పశ్చిమ ప్రాంతంలో ఒక చోట మూడు నిలువు రాతి దిమ్మలు వెయ్యేళ్ల క్రితం తమ స్వస్థానం నుండి జరిగాయి. గెలాక్సీ ఆకారాన్ని తలపిస్తూ సర్పిలాకారం (spiral)  ఒక రాతి మీద చెక్కబడింది. సరిగ్గా జూన్  21 రోజు, సన్నని కాంతి రేఖ, రెండు దిమ్మల నడుమ ప్రాంతంలోంచి ప్రసరిస్తూ, సరిగ్గా సర్పిలాన్ని రెండుగా ఛేదిస్తుంది. అలాగే డిసెంబర్ 21 నాడు, శీతాకాలపు తొలినాడు, సర్పిలానికి ఇరుపక్కలా పడతాయి. విధంగా నేల మీది రాళ్లతో ఆకాశంలోని కాలెండర్ ని చదవడానికి వీలవుతోంది.

ఖగోళశాస్త్రాన్ని అర్థం చేసుకోడానికి ప్రపంచం అంతటా మనుషులు ఎందుకంత కృషి చేశారు? లేళ్లని, దుప్పులని, దున్నలని వేటాడి బతికిన మన పూర్వీకులు, ఋతువుల ప్రకారం వాటి సంఖ్యలో మార్పులు వస్తాయని గుర్తించారు. పళ్లు, పూలు కూడా కొన్ని కాలాలలో దొరుకుతాయి, కొన్నిట్లో దొరకవు. సేద్యం చెయ్యడం నేర్చుకున్న మానవుడు, కాలంలో విత్తులు నాటాలో, ఎప్పుడు పంట కోతకొస్తుందో తెలుసుకున్నాడు. ఎక్కడెక్కడో దూరదూరంగా బతికే దేశదిమ్మరి తెగలు ఏడాదిలో కొన్ని నిర్ణీత కాలాలలోనే కలుసుకుంటారు. ఆకాశం కేసి చూసి కాలెండర్ చదవగలడం ఒక విధంగా జీవన్మరణ సమస్యగా మారింది. అమావాస్య తరువాత పున్నమి చంద్రుడి ఆగమనం, పూర్ణ సూర్యగ్రహణం తరువాత సూర్యుడి ఆవిర్భావం, రాత్రంతా కనిపించకుండా పోయి మనుషుల మనసుల్లో కలవరం సృష్టించిన సూర్యుడు మర్నాడు ఉదయానే ఉదయించడంమొదలైన పరిణామాలన్నీ మనుషులు అనాదిగా పరిశీలిస్తూ వస్తున్నారు. పరిణామాలలో మన ప్రాచీనులకి మృత్యువు మీద విజయానికి సూచనలు కనిపించాయి. ఆకాశంలో అమరత్వపు సంకేతాలు ద్యోతకమయ్యాయి.

అమెరికాలోని దక్షిణ-పశ్చిమ ప్రాంతపు కనుమలలో గాలి ఊళలు వేస్తోంది. అది వినడానికి ప్రస్తుతం మనం తప్ప మరెవరూ లేరు. 40,000 తరాల చైతన్యవంతులైన పురుషులు, స్త్రీలు అక్కడ జీవనం కొనసాగించారు. వారే మన పూర్వీకులు, మన నాగరికతకి మూలపురుషులు. కాని వారి గురించి మనకి తెలిసింది చాలా తక్కువ.

యుగాలు గడిచాయి. తమ పూర్వీకుల గురించి మనుషుల అవగాహన పెరిగింది. సూర్య, చంద్ర, తారల గతులని ఎంత కచ్చితంగా నిర్ణయించగలిగితే, అంత కచ్చితంగా ఎప్పుడు వేటాడాలో, ఎప్పుడు నాట్లు వేయాలో, ఎప్పుడు సమావేశాలు జరుపుకోవాలూ తెలుసుకోడానికి వీలవుతుంది. ఖగోళ పరికరాలు సునిశితం అవుతున్న కొద్ది, పరిశీలనలని క్రమబద్ధంగా నమోదు చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. కాబట్టి గణితం, వ్రాత అభివృద్ధి చెందాయి.

కొంతకాలం తరువాత మరో చిత్రమైన భావబీజం మనుషుల మనసుల్లో నాటుకుంది. అంతవరకు పూర్తిగా వ్యావహారిక రంగానికి సంబంధించిన శాస్త్రంలోకి మతం, మూఢ నమ్మకం దుడుకుగా చొచ్చుకువచ్చాయి. సూర్యుడు, తారలు ఋతువులని, ఆహారోత్పత్తిని, భూమి మీద తాపాన్ని నియంత్రిస్తాయి. చంద్రుడు కెరటాలని, ఎన్నో జంతువుల జీవన చక్రాలని, (బహుశా స్త్రీలలో ఋతుచక్రాలని కూడా) నియంత్రిస్తాడు[1]. సంతాన ప్రాప్తి కోసం తపించే జాతిలో మరి ఋతుచక్రాలు ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. సూర్య, చంద్ర, తారలు కాకుండా మరో రకం వస్తువులు కూడా ఆకాశంలో దర్శానమిస్తాయి. అయితే ఇవి దిక్కు, తెన్ను లేని ఆకాశ సంచారులు, ఖగోళలోకపు దేశద్రిమ్మరులు. వాటినే గ్రహాలు (planets)  అన్నారు.  దేశద్రిమ్మరులైన మన  పూర్వీకులకి గ్రహాల పట్ల ఏదో చెప్పలేని ఆకర్షణ ఉండేది. సూర్య, చంద్రులని పక్కన పెడితే ఐదే గ్రహాలు కనిపించేవి. సుదూరమైన స్థిర తారల నేపథ్యం మీద గ్రహాలు కదిలేవి. నెలల తరబడి వాటి వ్యక్తగతిని (apparent motion) అనుసరిస్తే అవి కొంత కాలం ఒక తారరాశిలో గడిపి, తరువాత మరి కొంత కాలం మరో తారా రాశిలోకి ప్రవేశించడం కనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో సూటిగా ముందుకు సాగక, మధ్యలో ఒక చుట్టు చుట్టి మళ్లీ మునుపటి గతిలో సాగే విచిత్ర గమనం గ్రహాలకే ప్రత్యేకం. ఆకాశంలో అన్నిటికీ జీవితం మీద ఏదో ఒక రకమైన ప్రభావం వుంది. మరి గ్రహాలకి ఎలాంటి ప్రభావం వుందో?

నేడు పాశ్చాత్య ప్రపచంలో రోడ్డు మీది అంగడిలో కూడా జ్యోతిష్యం (astrology)  మీద పత్రికలు సులభంగా దొరుకుతాయి. కాని ఖగోళశాస్త్రం మీద పత్రికలైతే అంత సులభంగా దొరకవు. అమెరికాలో ఇంచుమించు ప్రతీ వార్తా పత్రికలోను అస్ట్రాలజీ మీద ఒక దైనిక విభాగం తప్పనిసరిగా ఉంటుంది. కాని అదే ఖగోళశాస్త్రం మీద అయితే వారానికొక వ్యాసం ప్రచురించే పత్రికలు కూడా అపురూపమే. అమెరికాలో ఖగోళశాస్త్రవేత్తల కన్నా జ్యోతిష్యులు పది రెట్లు ఎక్కువ మంది ఉన్నారు. విందులలో అప్పుడప్పుడు నేను శాస్త్రవేత్తని అని తెలియనివారుమీరు జెమినీ నా?” అనో, (వారి ఊహ నిజమయ్యే ఆస్కారం 1/12 వంతు ఉంటుంది), లేదామీది రాశి?” అనో అడుగుతుంటారు. అంతేకానిసూపర్నోవా విస్ఫోటాలలో బంగారం పుడుతుందట తెలుసా?” అనో, “మార్స్ రోవర్ ని కాంగ్రెస్ ఆమోదిస్తుందా?” అనో అడిగే అవకాశాలు చాలా తక్కువ.

జ్యోతిష్యం ప్రకారం, మీరు పుట్టినప్పుడు గ్రహాలు తారా రాశిలో ఉన్నాయో, తారా రాశి మీ జీవితాన్ని ప్రగాఢంగా ప్రభావితం చేస్తుంది. కొన్ని వేల ఏళ్ల క్రితం గ్రహాల కదలికలు రాజుల, రాజవంశాల, సామ్రాజ్యాల అదృష్టాన్ని శాసిస్తాయన్న నమ్మకం ఊపిరి పోసుకుంది. ఉదాహరణకి, కిందటి సారి శుక్రగ్రహం మేష రాశిలో ఉదయించినప్పుడు ఏం జరిగిందో జ్యోతిష్యులు పరిశీలించేవారు. బహుశా సారి అలాంటిదే ఏదో జరుగుతుందని భావించేవారు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యవహారం. జ్యోతిష్యులు కేవలం రాజసభలలోనే పని చేసేవారు. కొన్ని దేశాలలో అయితే రాజ జ్యోతిష్యుడు తప్ప అన్యులు జ్యోతిష్యం చెప్పడం దండనీయమైన నేరంగా ఉండేది. ఒక రాజసింహాసనాన్ని కూలదోయడానికి అతి సులభమైన మార్గం సింహాసనం కూలిపోతుందని జ్యోతిష్యం చెప్పడం. చైనాలో తప్పుడు జోస్యాలు చెప్పిన జ్యోతిష్యులకి మరణదండన విధించేవారు. తక్కిన వారు తమ జోస్యాలకి కాస్త రంగుపూసి, హంగు కూర్చి వాస్తవాలకి అనుగుణంగా అన్వయించుకునేవారు. జ్యోతిష్యం అంటే నిశితమైన పరిశీలన, కచ్చితమైన గణితం, శ్రద్ధతో పరిశీలనలని నమోదుచేసుకునే అలవాటు,  కాస్త అయోమయ చింతన, మరి కాస్త  పవిత్రమైన వంచనఇవన్నీ కలగలిసిన విచిత్ర వ్యవహారంగా ఉండేది.

(ఇంకా వుంది)



[1] ఇంగ్లీష్ లో menstrual అన్న పదంలోని మూల శబ్దానికి అర్థం ‘’చంద్రుడు”.

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts