కొన్ని
తారలు సూర్యోదయానికి కాస్త ముందుగా గాని, సూర్యాస్తమయానికి కాస్త వెనుకగా
గాని ఉదయిస్తాయి. అవి ఉదయించే స్థానం, కాలం ఋతువుల
బట్టి మారుతుంటుంది. ఏళ్ల తరబడి తారలని పరిశీలిస్తూ, వాటి చలనాలని నమోదు చేస్తూ పోతే ఋతువుల రాకపోలని నిర్ణయించవచ్చు. అలాగే సూర్యుడు దిక్చక్రం (horizon) మీద
సరిగ్గా ఎక్కడ ఉదయిస్తున్నాడో తెలిస్తే, ఏడాదిలో ఎక్కడ
ఉన్నామో గుర్తుపట్టగలం. శ్రద్ధగా పరిశీలనలు చేసి వాటిని నమోదు చేసుకునే ఓపిక ఉన్నవారికి ఆకాశం అంతా విస్తరించిన కాలెండర్ లా బట్టబయలు అవుతుంది.
ఋతువుల
మార్పుని కనిపెట్టడానికి మన ప్రాచీనులు ఎన్నో పరికరాలు తయారుచేశారు. అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో, చాకో అనే లోయలో ఓ ప్రాచీన ఆలయం
ఉంది. ‘కివా’ (kiva) అనబడే పై చూరు లేని ఆ ఆలయం పదకొండవ
శతాబ్దం నాటిది. ప్రతీ ఏడాది
జూన్ 21 నాడు, అంటే పగటి
కాలం దీర్ఘతమమైన రోజు, ఈ గుళ్ళో
ఓ వింత జరుగుతుంది. ఆ రోజు ఉదయానే
ఒక సూర్యకాంతి పుంజం కిటికీ లోంచి ఎదుట గోడ మీద పడి, ఒక
ప్రత్యేక అర మీదుగా కదులుతుంది. ఇది జూన్ 21 దరిదాపుల్లో మాత్రమే జరుగుతుంది. ఏటేటా జూన్ 21 నాడు,
తమని
తాము “ప్రాచీనులం” అని
పిలుచుకునే అలనాటి అనసాజీ (Anasazi) తెగ వారు ఆ గుళ్ళో చేరి, రంగురంగుల ఈకలు, రొదచేసే చిడతలు, రవ్వలు కట్టిన మాలలు ధరించి, అంబరీషుడి వైభవాన్ని తలచుకుంటూ సంబరాలు చేసుకునేవారేమో. అలాగే చంద్రుడి చలనాలని కూడా వాళ్లు శ్రద్ధగా పరిశీలించేవారు. కివా ఆలయంలోని ఇరవై ఎనిమిది అరలు, చంద్రుడి కాలచక్రంలోని
ఇరవై ఎనిమిది రోజులకి చిహ్నాలేమో. ఆ తెగవారు సూర్య, చంద్ర, తారల చలనాలని
శ్రద్ధగా గమనించేవారు. ఇలాంటి పరికరాలు ప్రపంచంలో మరెన్నో చోట్ల దొరికాయి. కాంబోడియాలోని అంగ్
కర్ వాట్, ఇంగ్లాండ్ లోని
స్టోన్ హెంజ్, ఈజిప్ట్ లోని
అబూ సింబెల్, మెక్సికో లోని
చిచెన్ ఇట్జా, అమెరికాలోని గ్రేట్
ప్లేన్స్ మొదలైన చోట్ల ఈ కోవకి చెందిన
నిర్మాణాలు దొరికాయి.
అయితే
ఇలాంటి ఖగోళ పరిశోధనా సౌధాలు అని చెప్పుకోబడే వాటిలో కొన్ని కాకతాళీయంగా ఏర్పడ్డవి కావచ్చు. ఉదాహరణకి అనుకోకుండా
ఒక భవనంలో కిటికీ, లోపలి అర ఒక వరుసలో
ఉండడం వల్ల, జూన్ 21 నాడు కిటికీలోంచి లోపలికి వచ్చే సూర్య పుంజం ఆ అర మీద పడవచ్చు. కాని ఇందుకు
చాలా భిన్నమైన పరికరాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి అమెరికాలో
దక్షిణ-పశ్చిమ ప్రాంతంలో
ఒక చోట మూడు నిలువు రాతి దిమ్మలు వెయ్యేళ్ల క్రితం తమ స్వస్థానం నుండి జరిగాయి. గెలాక్సీ ఆకారాన్ని
తలపిస్తూ ఓ సర్పిలాకారం (spiral)
ఒక రాతి మీద చెక్కబడింది. సరిగ్గా జూన్
21 వ రోజు, ఓ సన్నని
కాంతి రేఖ, రెండు
దిమ్మల నడుమ ప్రాంతంలోంచి ప్రసరిస్తూ, సరిగ్గా సర్పిలాన్ని రెండుగా ఛేదిస్తుంది. అలాగే డిసెంబర్ 21 నాడు, శీతాకాలపు తొలినాడు, సర్పిలానికి ఇరుపక్కలా పడతాయి. ఆ విధంగా
నేల మీది రాళ్లతో ఆకాశంలోని కాలెండర్ ని చదవడానికి వీలవుతోంది.
ఖగోళశాస్త్రాన్ని
అర్థం చేసుకోడానికి ప్రపంచం అంతటా మనుషులు ఎందుకంత కృషి చేశారు? లేళ్లని, దుప్పులని, దున్నలని వేటాడి బతికిన మన పూర్వీకులు, ఋతువుల ప్రకారం వాటి సంఖ్యలో మార్పులు వస్తాయని గుర్తించారు. పళ్లు, పూలు కూడా
కొన్ని కాలాలలో దొరుకుతాయి, కొన్నిట్లో దొరకవు. సేద్యం చెయ్యడం
నేర్చుకున్న మానవుడు, ఏ కాలంలో
విత్తులు నాటాలో, ఎప్పుడు పంట
కోతకొస్తుందో తెలుసుకున్నాడు. ఎక్కడెక్కడో దూరదూరంగా బతికే దేశదిమ్మరి తెగలు ఏడాదిలో కొన్ని నిర్ణీత కాలాలలోనే కలుసుకుంటారు. ఆకాశం కేసి చూసి కాలెండర్ చదవగలడం ఒక విధంగా జీవన్మరణ సమస్యగా మారింది. అమావాస్య తరువాత
పున్నమి చంద్రుడి ఆగమనం, పూర్ణ సూర్యగ్రహణం
తరువాత సూర్యుడి ఆవిర్భావం, రాత్రంతా కనిపించకుండా
పోయి మనుషుల మనసుల్లో కలవరం సృష్టించిన సూర్యుడు మర్నాడు ఉదయానే ఉదయించడం –మొదలైన పరిణామాలన్నీ
మనుషులు అనాదిగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ పరిణామాలలో మన
ప్రాచీనులకి మృత్యువు మీద విజయానికి సూచనలు కనిపించాయి. ఆకాశంలో అమరత్వపు సంకేతాలు ద్యోతకమయ్యాయి.
అమెరికాలోని
దక్షిణ-పశ్చిమ ప్రాంతపు
కనుమలలో గాలి ఊళలు వేస్తోంది. అది వినడానికి
ప్రస్తుతం మనం తప్ప మరెవరూ లేరు. 40,000 తరాల చైతన్యవంతులైన పురుషులు, స్త్రీలు అక్కడ
జీవనం కొనసాగించారు. వారే మన పూర్వీకులు, మన నాగరికతకి మూలపురుషులు. కాని వారి గురించి మనకి తెలిసింది చాలా తక్కువ.
యుగాలు
గడిచాయి. తమ పూర్వీకుల
గురించి మనుషుల అవగాహన పెరిగింది. సూర్య, చంద్ర, తారల గతులని ఎంత కచ్చితంగా నిర్ణయించగలిగితే, అంత కచ్చితంగా ఎప్పుడు వేటాడాలో, ఎప్పుడు నాట్లు
వేయాలో, ఎప్పుడు సమావేశాలు
జరుపుకోవాలూ తెలుసుకోడానికి వీలవుతుంది. ఖగోళ పరికరాలు సునిశితం అవుతున్న కొద్ది, పరిశీలనలని క్రమబద్ధంగా
నమోదు చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. కాబట్టి గణితం, వ్రాత అభివృద్ధి చెందాయి.
కొంతకాలం
తరువాత మరో చిత్రమైన భావబీజం మనుషుల మనసుల్లో నాటుకుంది. అంతవరకు పూర్తిగా
వ్యావహారిక రంగానికి సంబంధించిన శాస్త్రంలోకి మతం, మూఢ
నమ్మకం దుడుకుగా చొచ్చుకువచ్చాయి. సూర్యుడు, తారలు ఋతువులని, ఆహారోత్పత్తిని, భూమి మీద తాపాన్ని నియంత్రిస్తాయి. చంద్రుడు కెరటాలని, ఎన్నో జంతువుల
జీవన చక్రాలని, (బహుశా స్త్రీలలో ఋతుచక్రాలని కూడా) నియంత్రిస్తాడు[1]. సంతాన ప్రాప్తి కోసం తపించే జాతిలో మరి ఋతుచక్రాలు ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. సూర్య, చంద్ర, తారలు
కాకుండా మరో రకం వస్తువులు కూడా ఆకాశంలో దర్శానమిస్తాయి. అయితే ఇవి దిక్కు, తెన్ను లేని
ఆకాశ సంచారులు, ఖగోళలోకపు దేశద్రిమ్మరులు. వాటినే గ్రహాలు (planets) అన్నారు. దేశద్రిమ్మరులైన
మన పూర్వీకులకి గ్రహాల పట్ల ఏదో చెప్పలేని ఆకర్షణ ఉండేది. సూర్య, చంద్రులని
పక్కన పెడితే ఐదే గ్రహాలు కనిపించేవి. సుదూరమైన స్థిర తారల నేపథ్యం మీద ఈ గ్రహాలు కదిలేవి. నెలల తరబడి వాటి వ్యక్తగతిని
(apparent motion) అనుసరిస్తే
అవి కొంత కాలం ఒక తారరాశిలో గడిపి, తరువాత మరి
కొంత కాలం మరో తారా రాశిలోకి ప్రవేశించడం కనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో సూటిగా ముందుకు సాగక, మధ్యలో ఒక
చుట్టు చుట్టి మళ్లీ మునుపటి గతిలో సాగే విచిత్ర గమనం గ్రహాలకే ప్రత్యేకం. ఆకాశంలో అన్నిటికీ
జీవితం మీద ఏదో ఒక రకమైన ప్రభావం వుంది. మరి గ్రహాలకి
ఎలాంటి ప్రభావం వుందో?
నేడు
పాశ్చాత్య ప్రపచంలో రోడ్డు మీది అంగడిలో కూడా జ్యోతిష్యం (astrology) మీద
పత్రికలు సులభంగా దొరుకుతాయి. కాని ఖగోళశాస్త్రం మీద పత్రికలైతే అంత సులభంగా దొరకవు. అమెరికాలో ఇంచుమించు
ప్రతీ వార్తా పత్రికలోను అస్ట్రాలజీ మీద ఒక దైనిక విభాగం తప్పనిసరిగా ఉంటుంది. కాని అదే
ఖగోళశాస్త్రం మీద అయితే వారానికొక వ్యాసం ప్రచురించే పత్రికలు కూడా అపురూపమే. అమెరికాలో ఖగోళశాస్త్రవేత్తల
కన్నా జ్యోతిష్యులు పది రెట్లు ఎక్కువ మంది ఉన్నారు. విందులలో అప్పుడప్పుడు
నేను శాస్త్రవేత్తని అని తెలియనివారు ‘మీరు జెమినీ నా?” అనో,
(వారి ఊహ నిజమయ్యే ఆస్కారం 1/12 వంతు ఉంటుంది), లేదా “మీది ఏ
రాశి?” అనో అడుగుతుంటారు. అంతేకాని “సూపర్నోవా విస్ఫోటాలలో
బంగారం పుడుతుందట తెలుసా?” అనో, “మార్స్ రోవర్
ని కాంగ్రెస్ ఆమోదిస్తుందా?” అనో అడిగే అవకాశాలు చాలా తక్కువ.
జ్యోతిష్యం
ప్రకారం, మీరు పుట్టినప్పుడు
గ్రహాలు ఏ తారా రాశిలో
ఉన్నాయో, ఆ తారా
రాశి మీ జీవితాన్ని ప్రగాఢంగా ప్రభావితం చేస్తుంది. కొన్ని వేల
ఏళ్ల క్రితం గ్రహాల కదలికలు రాజుల, రాజవంశాల, సామ్రాజ్యాల
అదృష్టాన్ని శాసిస్తాయన్న నమ్మకం ఊపిరి పోసుకుంది. ఉదాహరణకి, కిందటి
సారి శుక్రగ్రహం మేష రాశిలో ఉదయించినప్పుడు ఏం జరిగిందో జ్యోతిష్యులు పరిశీలించేవారు. బహుశా ఈ సారి అలాంటిదే
ఏదో జరుగుతుందని భావించేవారు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యవహారం. జ్యోతిష్యులు కేవలం
రాజసభలలోనే పని చేసేవారు. కొన్ని దేశాలలో
అయితే రాజ జ్యోతిష్యుడు తప్ప అన్యులు జ్యోతిష్యం చెప్పడం దండనీయమైన నేరంగా ఉండేది. ఒక రాజసింహాసనాన్ని
కూలదోయడానికి అతి సులభమైన మార్గం ఆ సింహాసనం కూలిపోతుందని
జ్యోతిష్యం చెప్పడం. చైనాలో తప్పుడు
జోస్యాలు చెప్పిన జ్యోతిష్యులకి మరణదండన విధించేవారు. తక్కిన వారు తమ జోస్యాలకి కాస్త రంగుపూసి, హంగు కూర్చి
వాస్తవాలకి అనుగుణంగా అన్వయించుకునేవారు. జ్యోతిష్యం అంటే నిశితమైన పరిశీలన, కచ్చితమైన గణితం, శ్రద్ధతో పరిశీలనలని నమోదుచేసుకునే అలవాటు, కాస్త అయోమయ చింతన, మరి కాస్త పవిత్రమైన
వంచన – ఇవన్నీ కలగలిసిన విచిత్ర వ్యవహారంగా ఉండేది.
(ఇంకా వుంది)
0 comments