శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

ఫ్లాగిస్టాన్ కి వ్యతిరేకత

Posted by V Srinivasa Chakravarthy Monday, February 28, 2011 0 comments

1669 లో యోహాన్ జోఅకిమ్ బెచర్ (1635-1682) ఈ భావనని మరింత హేతుబద్ధంగా మార్చే ఉద్దేశంతో దాని పేరు మార్చాడు. ఘనపదార్థాలలో మూడు రకాల “పృథ్వీ” తత్వాలు ఉంటాయని ఊహించాడు ఇతడు. వీటిలో ఒక దాని పేరు “టెరా పింగ్విస్” (కొవ్వు పట్టిన పృథ్వి). దీని వల్లనే మండే గుణం అబ్బుతోందని భావించాడు బెచర్.

బెచర్ బోధించిన అయోమయపు భావనలని జార్జ్ ఎర్నెస్ట్ స్టాల్ (1660-1734) అనే మరో జర్మన్ వైద్యుడు అనుసరించాడు. ఉన్నవి సరిపోనట్టు జ్వలన లక్షణాన్ని వర్ణించడానికి ఇతడు మరో కొత్త పదాన్ని సూత్రీకరించాడు. అదే “ఫ్లాగిస్టాన్”. “నిప్పు పెట్టడం” అనే అర్థం గల గ్రీకు పదం నుండి ఈ పదం వచ్చింది. ఈ ఫ్లాగిస్టాన్ ని ఉపయోగించి జ్వలన క్రియని వర్ణించడానికి ఇతడు ఓ పద్ధతి ఆలోచించాడు.

స్టాల్ భావన ప్రకారం జ్వలనీయమైన వస్తువుల్లో ఈ ఫ్లాగిస్టాన్ పుష్కలంగా ఉంటుంది. వస్తువు మండాక మిగిలిన పదార్థంలో ఇక ఫ్లాగిస్టాన్ ఉండదు. అందుకే అది ఇక మండదు. అందుకే కట్టెలో ఫ్లాగిస్టాన్ ఉంటుంది గాని, బూడిదలో ఉండదు.

అలాగే లోహాలు తుప్పు పట్టే ప్రక్రియకి, కట్టె మండే ప్రక్రియకి మధ్య పోలిక ఉందని ఊహించాడు స్టాల్. లోహంలో ఫ్లాగిస్టాన్ ఉన్నా దాని తుప్పులో ఫ్లాగిస్టాన్ లేదంటాడు. ఈ భావనని ఆధారంగా చేసుకుని, నాగరిక మానవుడు సాధించిన మొట్టమొదటి మహత్తర రసాయనిక ఆవిష్కరణ అయిన, ముడి లోహం నుండి శుద్ధ లోహాన్ని వెలికి తిసే ప్రక్రియకి ఓ వివరణని ఇవ్వడానికి సాధ్యం అయ్యింది. ఆ వివరణ తీరు ఇలా ఉంటుంది. ఫ్లాగిస్టాన్ పాలు చాలా తక్కువగా ఉన్న ముడి లోహాన్ని, ఫ్లాగిస్టాన్ నిండుగా ఉన్న బొగ్గుతో కాల్చుతారు. అప్పుడు ఫ్లాగిస్టాన్ బొగ్గు నుండి ముడి లోహం లోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ఫ్లాగిస్టాన్ నిండుగా ఉన్న బొగ్గు బూడిదగా మరుతుంది. ఫ్లాగిస్టాన్ లేని ముడి లోహం, ఫ్లాగిస్టాన్ సమృద్ధిగా ఉండే శుద్ధ లోహంగా మారుతుంది.

గాలికి కూడా జ్వలన క్రియలో ఓ పాత్ర ఉందని భావించాడు స్టాల్. కట్టె నుండి లోహానికి, అక్కడి నుండి మరో చోటికి, ఇలా ఫ్లాగిస్టాన్ ని ఒక చోటి నుండి మరో చోటకి చేర్చే వాహకమే గాలి అంటాడు.

స్టాల్ బోధించిన ఈ ఫ్లాగిస్టాన్ సిద్ధాంతానికి త్వరలోనే వ్యతిరేకత మొదలయ్యింది. అలా వ్యతిరేకించిన వారిలో ప్రథముడు హెర్మాన్ బోర్హావే (1668-1738) అనే డచ్ వైద్యుడు. సామాన్య జ్వలనం, తుప్పు పట్టడం – ఈ రెండు ప్రక్రియలు ఒకే దృగ్విషయం యొక్క రెండు ముఖాలు అయ్యే అవకాశం లేదని ఇతడి వాదన.

(సశేషం...)

ఆవిరి యంత్రం

Posted by V Srinivasa Chakravarthy Friday, February 25, 2011 1 comments


1700 లో సరిగ్గా అలాంటి ఆవిరి యంత్రాన్నే థామస్ సవేరీ (1650-1715) అనే ఓ ఇంగ్లీష్ ఇంజినీరు తయారుచేశాడు. అయితే దాని పని తీరు ప్రమాదకరంగా ఉండేది. ఆ యంత్రంలో అధిక పీడనం వద్ద ఆవిరిని వాడేవారు. అయితే ఆ రోజుల్లో అధికపీడనం వద్ద ఆవిరిని సురక్షితంగా నియంత్రంచడానికి తగ్గ సాంకేతిక పరిజ్ఞానం ఉండేది కాదు. తరువాత థామస్ న్యూకొమెన్ (1663-1729) అనే మరో ఇంగ్లీష్ వ్యక్తి సవేరీతో కలిసి పని చేస్తూ తక్కువ పీడనం వద్ద పని చెయ్యగల ఆవిరి యంత్రాన్ని తయారుచేశాడు (చిత్రం). ఆ యంత్రానికి పద్దెనిమిదవ శతాబ్దపు చివరి దశలో జేమ్స్ వాట్ (1736-1819) అనే స్కాటిష్ ఇంజినీరు మరిన్ని మెరుగులు దిద్ది, మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాడు.

ఈ ఇలాంటి కృషి వల్ల చరిత్రలో మొట్టమొదటి సారిగా మనిషి కఠిన పరిశ్రమ కోసం తన కండబలం మీద, జంతువుల కండబలం మీద ఆధారపడాల్సిన పని లేకుండా పోయింది. గాలివాటంగా వచ్చి పోతుండే వాయుశక్తి తో ఇక తంటాలు పడనక్కర్లేదు. దొరకడమే అపురూపంగా ఉండే నీటి ప్రవాహాలని ఇక నమ్ముకోనక్కర్లేదు. ఇక ఇప్పుడు శక్తి ఎప్పుడు, ఎక్కడ కావాలన్నో కాసిన్ని బొగ్గులో, కట్టెలో కాల్చి, నీళ్లు మరిగించి, ఆ శక్తిని వినియోగించి వీలుగా పనిచేసుకోవచ్చు. ఈ అద్భుత ఆవిష్కరణే పారిశ్రామిక విప్లవానికి అంకురార్పణ చేసింది.

1650 నుండి నిప్పుకి అన్ని కొత్త ప్రయోజనాలు ఉండడం, అగ్ని శక్తితో భారమైన లౌకిక కార్యాలని సాధించగలగడం, మొదలైనవన్నీ చూసిన రసాయనికులకి నిప్పు ఓ కొత్త కోణం నుండి కనిపించసాగింది. అసలు నిప్పు అంటే ఏంటి? అన్ని వస్తువులూ ఎందుకు మండవు? అసలు జ్వలన క్రియలో ఏం జరుగుతుంది?

మండే వస్తువులలో “అగ్ని” లాంటి ఏదో ప్రత్యేక పదార్థం ఉంటుందని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది బహిర్గతం అవుతుందని ప్రాచీన గ్రీకులు నమ్మేవారు. రసవాదుల ఆలోచనలు కూడా కొంచెం ఆ విధంగానే ఉండేవి. మండే వస్తువుల్లో “సల్ఫర్” అనే పదార్థం ఉంటుందనేవారు వాళ్లు. అయితే ఆ “సల్ఫర్” కి ప్రస్తుతం మనకి తెలిసిన సల్ఫర్ కి సంబంధం లేదు.

(సశేషం...)

ఆకాశానికి నిచ్చెనలు వెయ్యగలమా?

Posted by నాగప్రసాద్ Monday, February 21, 2011 0 comments

ఇవ్వాళ ఆంధ్రభూమిలో ప్రచురితమైన వ్యాసం. లింకు ఇక్కడ: http://www.andhrabhoomi.net/intelligent/akasaniki-389

Enhanced by Zemanta

ఫ్లాగిస్టాన్

Posted by V Srinivasa Chakravarthy Saturday, February 19, 2011 0 comments

నిషేధం లేకపోతే నిమ్న జాతి లోహాలని బంగారంగా మార్చవచ్చని, ఆ విధంగా రసాయనికులు అణువాదాన్ని నిరూపించగలరని బాయిల్ నమ్మకం.

కాని అలా అనుకోవడంలో బాయిల్ నిజంగా పొరబడ్డాడు. ఎందుకంటే లోహాలు మూలకాలని అప్పుడు తెలీదు. నిజానికి ప్రస్తుతం మూలకాలుగా గుర్తించబడే తొమ్మిది పదార్థాలు ప్రాచీన లోకంలో సుపరిచితమైన పదార్థాలు. వాటిలో ఏడు లోహాలు (బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరం, సీసం పాదరసం), రెండు అలోహాలు (non-metals) (కార్బన్, సల్ఫర్) ఉన్నాయి. ఇవి కాకుండా మధ్యయుగపు రసవాదులకి మరి నాలుగు పదార్థాలతో కాస్తోకూస్తో పరిచయం ఏర్పడింది (అవి ఆర్సెనిక్, ఆంటిమొనీ, బిస్మత్, జింక్).

అసలు బాయిల్ విషయంలోనే ఓ కొత్త మూలకాన్ని కనుక్కునే సువర్ణావకాశం వెంట్రుకవాసిలో తప్పిపోయింది. 1680 లో అతడు మూత్రం నుండి ఫాస్ఫరస్ ని వెలికి తీసే పద్ధతిని కనుక్కున్నాడు. అందుకు ఐదో, పదో ఏళ్ల క్రితం అదే మహత్కార్యాన్ని (!) హెన్నిగ్ బ్రాండ్ (-1692) అనే మరో జర్మన్ రసాయనికుడు చేశాడు. ఈ బ్రాండ్ ని కొన్ని సార్లు “చిట్టచివరి రసాయనికుడు”గా చెప్పుకుంటారు. అతడా ఆవిష్కరిణని యాదృచ్ఛికంగా చేశాడు. (మరెక్కడా దొరకనట్టు) మూత్రంలోనే పరుసవేది (philosopher’s stone) దొరుకుతుందని ఎందుకో అతడికో నమ్మకం. ఏదైతేనేం, ఆధునిక వైజ్ఞానిక యుగానికి ముందు, ప్రాచీన లోకంలో తెలీని ఓ కొత్త మూలకాన్ని కనుక్కున్న వాడిగా బ్రాండ్ చరిత్రకెక్కాడు.

ఫ్లాగిస్టాన్

పంపుతో గాలిని తొలగించి శూన్యాన్ని తయారు చెయ్యొచ్చన్న విషయం, వాయుపీడనంతో గొప్ప పనులు సాధించొచ్చన్న విషయం, మొదలైన పదిహేడవ శతాబ్దానికి చెందిన మహద్విజయాలకి గొప్ప పర్యవసానాలు ఉన్నట్టు తెలుస్తోంది. అసలు పంపు అవసరం లేకుండానే శూన్యం తయారుచెయ్యొచ్చని మరి కొందరు నెమ్మదిగా తెలుసుకున్నారు.

ఉదాహరణకి నీటిని మరిగించి ఆ ఆవిరిని ఓ పాత్రలో నింపాం అనుకుందాం. తరువాత ఆ పాత్ర మీదుగా చల్ల నీరు ప్రవహింపజేసి పాత్రని చల్లబరిచాం అనుకుందాం. పాత్రలోని ఆవిరంతా కొద్దిపాటి నీటి బిందువులుగా ఘనీభవిస్తుంది. దాని స్థానే శూన్యం ఏర్పడుతుంది. ఆ పాత్ర యొక్క గోడలలో ఒక గోడ కదిలేదిగా ఏర్పాటు చేసుకుంటే, బయట ఉండే వాయు పీడనం వల్ల ఆ గోడ లోపలికి కదులుతుంది.

మళ్లీ పాత్రలో ఆవిరి ప్రవేశపెట్టి అలా లోపలికి వచ్చిన గోడని తిరిగి బయటికి తొయ్యొచ్చు. మళ్లీ ఆవిరి ఘనీభవించేలా చేసి గోడ లోపలికి వచ్చేలా చెయ్యొచ్చు. అలా లోపలికి బయటికి కదిలే గోడని ఓ పిస్టన్ లా ఊహించుకుంటే, ఆ ఏర్పాటుతో ఓ పంపుని నడిపించొచ్చు. ఆ ఏర్పాటే మొట్టమొదటి ఆవిరి యంత్రానికి దారి తీసింది.

(సశేషం...)


ఫిబ్రవరి 14, సోమవారం నాడు ఆంధ్రభూమిలో ప్రచురితమైన మా వ్యాసం. బొమ్మపై నొక్కితే పెద్దగా కనిపిస్తుంది.  http://www.andhrabhoomi.net/intelligent/deep-brain-103



Enhanced by Zemanta

ఆంధ్రభూమిలో మా బ్లాగు పరిచయం.

Posted by నాగప్రసాద్ Wednesday, February 16, 2011 0 comments

శ్రీరామ
ఆంధ్రభూమి దినపత్రికలో మా సైన్సు బ్లాగు గురించి పరిచయం చేస్తూ పోయిన శనివారం సిసింద్రిలో ప్రచురించారు. పరిచయం చేసినందుకు జ్యోతి గారికి ధన్యవాదములు. http://www.andhrabhoomi.net/sisindri/telugulo-science-928



Enhanced by Zemanta

మూలకాల పట్ల ఓ నవీన అవగాహన

Posted by V Srinivasa Chakravarthy Monday, February 14, 2011 0 comments

“ఆల్కెమీ”, “ఆల్కెమిస్ట్” అన్న శబ్దాలని కొద్దిగా మార్చి రాయడంతో ఒక రసాయనవేత్తగా బాయిల్ దశ తిరిగింది. 1661 లో బాయిల్ “ద స్కెప్టికల్ కైమిస్ట్” (సందేహాత్ముడైన రసాయనికుడు) అన్న పుస్తకాన్ని ప్రచురించాడు. ఆల్కెమిస్ట్ అన్న పదంలోని “అల్” తీసేసి, వట్టి కైమిస్ట్ అని ఇక్కడ వాడాడు. ఆ నాటి నుండి ఈ రంగంలో పని చేసే వాళ్లకి కెమిస్ట్ లు అన్న పేరు సార్థకం అయ్యింది. అసలు ఈ రంగమే కెమిస్ట్రీగా చలామణి కాసాగింది.

ఇందులో బాయిల్ తానొక “సందేహాత్ముడి” నని చెప్పుకున్నాడు. ఎందుకంటే ఈ రంగంలో ప్రాచీనుల భావాలనిక గుడ్డగా నమ్మనని చాటుకున్నాడు. మూల సూత్రాల నుండి కేవలం తర్కాన్ని ఉపయోగించి నిర్మించిన సిద్ధాంతాలని ఇక ఒప్పుకోనన్నాడు. అలా కాకుండా, వాస్తవికతా దృష్టితో చూస్తూ, ఆచరణ యుక్తంగా మూలకాలని నిర్వచించాలని బయలుదేరాడు. ఏ ఆదిమ పదార్థాల నుండి అయితే విశ్వం ఆవిర్భవించిందో అవే మూలకాలు అన్న భావన థేల్స్ నాటి నుండి ఉంది. ఒక పదార్థం మూలకం అని అనుకున్నప్పుడు, అది నిజంగా ప్రాథమిక, మౌలిక పదార్థమో కాదో పరీక్షించి తేల్చుకోవాలి. ఆ పదార్థాన్ని మరింత సరళమైన, మౌలికమైన అంశాలుగా విడగొట్టడం సాధ్యమైతే అదిక మూలకం కాజాలదు. ఏ సరళ అంశాలుగా అయితే ఆ పదార్థం విడగొట్టబడుతుందో వాటినే మూలకాలు అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకా భవిష్యత్తులో వాటిని కూడా విడగొట్టడానికి సాధ్యం అయితే వాటిని కూడా మూలకాలు అన్న స్థాయి నుండి తొలగించాల్సి ఉంటుంది. ఆ విధంగా మూలకం అన్న పదాన్ని కేవలం తార్కికంగా కాక, ఆచరణయుక్తంగా నిర్వచించాడు బాయిల్.

అంతే కాకుండా రెండు మూలకాలు గాఢంగా కలిసిపోయినప్పుడు ఓ కొత్త పదార్థం పుట్టొచ్చు. దాన్నే సంయోగం (compound) అంటారు. ఈ సంయోగాన్ని భేదిస్తే అందులో అంశాలుగా ఉన్న మూలకాలు బయట పడతాయి.

కనుక ఈ విధమైన నిర్వచనంలో మూలకం అన్న పదానికి కేవలం ఆచరణాత్మకమైన అర్థం మాత్రమే ఉంది. ఉదాహరణకి ఇలాంటి నిర్వచనం ప్రకారం క్వార్జ్ (quartz) లాంటి పదార్థాన్నే తీసుకుంటే, ప్రయోగాత్మక రసాయనికులు దాన్ని భేదించగలిగినంత వరకు దాన్నొక మూలకం గానే పరిగణించాలి. మూలకాన్ని గురించి ఇలాంటి ఆచరణాత్మక, తాత్కాలీన (provisional) నిర్వచనంతో వచ్చిన చిక్కేంటంటే, ఈ పద్ధతిలో ఏ పదార్థాన్నయినా కేవలం తార్కికంగా మాత్రమే మూలకం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేడు అబేధ్యం అనుకున్న పదార్థాన్ని కూడా సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక మరింత సరళమైన అంశాలుగా భేదించడానికి వీలవుతుందేమో. అప్పుడిక అంతవరకు మూలకం అనుకున్నది కాస్తా మూలకం కాకుండా పోతుంది.

ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభం వరకు, అంటే మూలకాలని మరింత నిర్దుష్టంగా నిర్వచించడానికి వీలైనంత వరకు, ఇలాంటి తాత్కాలీన నిర్వచనమే చలామణి అయ్యింది.

ప్రయోగాత్మక పద్ధతిలో మూలకాలని నిర్వచించాలని, కనుక్కోవాలని అన్నాడే గాని బాయిల్ కి కూడా అసలు మూలకాలు ఏమిటో, ఎలా ఉంటాయో ససేమిరా తెలీదు. తీరా ప్రయోగాత్మక పద్ధతితో పరీక్షించినా వెనుకటికి ప్రాచీన గ్రీకులు చెప్పిన పదార్థాలే (మట్టి, నీరు, గాలి, నిప్పు) మూలకాలని మళ్లీ తేలవచ్చు. ఈ విషయంలో బాయిల్ కి కచ్చితమైన అవగాహన ఏమీ ఉన్నట్టు లేదు.

ఎందుకంటే లోహాల విషయంలో ఇతడు కూడా ప్రాచీన రసవాదులు చెప్పిందే నమ్మాడు. లోహాలు మూలకాలు కాదని, అందుకే ఒక లోహాన్ని మరో లోహంగా మార్చడానికి వీలవుతుందని ఇతడు కూడా నమ్మాడు. అందుకే రసవాద పద్ధతితో బంగారాన్ని తయారు చేసే పద్ధతిని నిషేధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసిన చట్టాన్ని రద్దు చెయ్యమంటూ బాయిల్ ప్రభుత్వానికి 1689 లో అర్జీ పెట్టుకున్నాడు. అలాంటి నిషేధం లేకపోతే నిమ్న జాతి లోహాలని బంగారంగా మార్చవచ్చని, ఆ విధంగా రసాయనికులు అణువాదాన్ని నిరూపించగలరని అతడి నమ్మకం.

(సశేషం...)

“ఆల్కెమీ”, “ఆల్కెమిస్ట్” అన్న శబ్దాలని కొద్దిగా మార్చి రాయడంతో ఒక రసాయనవేత్తగా బాయిల్ దశ తిరిగింది. 1661 లో బాయిల్ “ద స్కెప్టికల్ కైమిస్ట్” (సందేహాత్ముడైన రసాయనికుడు) అన్న పుస్తకాన్ని ప్రచురించాడు. ఆల్కెమిస్ట్ అన్న పదంలోని “అల్” తీసేసి, వట్టి కైమిస్ట్ అని ఇక్కడ వాడాడు. ఆ నాటి నుండి ఈ రంగంలో పని చేసే వాళ్లకి కెమిస్ట్ లు అన్న పేరు సార్థకం అయ్యింది. అసలు ఈ రంగమే కెమిస్ట్రీగా చలామణి కాసాగింది.

ఇందులో బాయిల్ తానొక “సందేహాత్ముడి” నని చెప్పుకున్నాడు. ఎందుకంటే ఈ రంగంలో ప్రాచీనుల భావాలనిక గుడ్డగా నమ్మనని చాటుకున్నాడు. మూల సూత్రాల నుండి కేవలం తర్కాన్ని ఉపయోగించి నిర్మించిన సిద్ధాంతాలని ఇక ఒప్పుకోనన్నాడు. అలా కాకుండా, వాస్తవికతా దృష్టితో చూస్తూ, ఆచరణ యుక్తంగా మూలకాలని నిర్వచించాలని బయలుదేరాడు. ఏ ఆదిమ పదార్థాల నుండి అయితే విశ్వం ఆవిర్భవించిందో అవే మూలకాలు అన్న భావన థేల్స్ నాటి నుండి ఉంది. ఒక పదార్థం మూలకం అని అనుకున్నప్పుడు, అది నిజంగా ప్రాథమిక, మౌలిక పదార్థమో కాదో పరీక్షించి తేల్చుకోవాలి. ఆ పదార్థాన్ని మరింత సరళమైన, మౌలికమైన అంశాలుగా విడగొట్టడం సాధ్యమైతే అదిక మూలకం కాజాలదు. ఏ సరళ అంశాలుగా అయితే ఆ పదార్థం విడగొట్టబడుతుందో వాటినే మూలకాలు అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకా భవిష్యత్తులో వాటిని కూడా విడగొట్టడానికి సాధ్యం అయితే వాటిని కూడా మూలకాలు అన్న స్థాయి నుండి తొలగించాల్సి ఉంటుంది. ఆ విధంగా మూలకం అన్న పదాన్ని కేవలం తార్కికంగా కాక, ఆచరణయుక్తంగా నిర్వచించాడు బాయిల్.

అంతే కాకుండా రెండు మూలకాలు గాఢంగా కలిసిపోయినప్పుడు ఓ కొత్త పదార్థం పుట్టొచ్చు. దాన్నే సంయోగం (compound) అంటారు. ఈ సంయోగాన్ని భేదిస్తే అందులో అంశాలుగా ఉన్న మూలకాలు బయట పడతాయి.

కనుక ఈ విధమైన నిర్వచనంలో మూలకం అన్న పదానికి కేవలం ఆచరణాత్మకమైన అర్థం మాత్రమే ఉంది. ఉదాహరణకి ఇలాంటి నిర్వచనం ప్రకారం క్వార్జ్ (quartz) లాంటి పదార్థాన్నే తీసుకుంటే, ప్రయోగాత్మక రసాయనికులు దాన్ని భేదించగలిగినంత వరకు దాన్నొక మూలకం గానే పరిగణించాలి. మూలకాన్ని గురించి ఇలాంటి ఆచరణాత్మక, తాత్కాలీన (provisional) నిర్వచనంతో వచ్చిన చిక్కేంటంటే, ఈ పద్ధతిలో ఏ పదార్థాన్నయినా కేవలం తార్కికంగా మాత్రమే మూలకం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేడు అబేధ్యం అనుకున్న పదార్థాన్ని కూడా సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక మరింత సరళమైన అంశాలుగా భేదించడానికి వీలవుతుందేమో. అప్పుడిక అంతవరకు మూలకం అనుకున్నది కాస్తా మూలకం కాకుండా పోతుంది.

ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభం వరకు, అంటే మూలకాలని మరింత నిర్దుష్టంగా నిర్వచించడానికి వీలైనంత వరకు, ఇలాంటి తాత్కాలీన నిర్వచనమే చలామణి అయ్యింది.

ప్రయోగాత్మక పద్ధతిలో మూలకాలని నిర్వచించాలని, కనుక్కోవాలని అన్నాడే గాని బాయిల్ కి కూడా అసలు మూలకాలు ఏమిటో, ఎలా ఉంటాయో ససేమిరా తెలీదు. తీరా ప్రయోగాత్మక పద్ధతితో పరీక్షించినా వెనుకటికి ప్రాచీన గ్రీకులు చెప్పిన పదార్థాలే (మట్టి, నీరు, గాలి, నిప్పు) మూలకాలని మళ్లీ తేలవచ్చు. ఈ విషయంలో బాయిల్ కి కచ్చితమైన అవగాహన ఏమీ ఉన్నట్టు లేదు.

ఎందుకంటే లోహాల విషయంలో ఇతడు కూడా ప్రాచీన రసవాదులు చెప్పిందే నమ్మాడు. లోహాలు మూలకాలు కాదని, అందుకే ఒక లోహాన్ని మరో లోహంగా మార్చడానికి వీలవుతుందని ఇతడు కూడా నమ్మాడు. అందుకే రసవాద పద్ధతితో బంగారాన్ని తయారు చేసే పద్ధతిని నిషేధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసిన చట్టాన్ని రద్దు చెయ్యమంటూ బాయిల్ ప్రభుత్వానికి 1689 లో అర్జీ పెట్టుకున్నాడు. అలాంటి నిషేధం లేకపోతే నిమ్న జాతి లోహాలని బంగారంగా మార్చవచ్చని, ఆ విధంగా రసాయనికులు అణువాదాన్ని నిరూపించగలరని అతడి నమ్మకం.

(సశేషం...)

ఓ ఈ-లర్నింగ్ విజయ గాధ

Posted by V Srinivasa Chakravarthy Sunday, February 13, 2011 0 comments

ఇంటర్నెట్ చదువులు, బ్లాగ్ వ్యాసాలు మొదలైన వన్నీ నగరాల వాళ్లకే గాని, సరైన విద్యుత్ సరఫరా కూడా లేని మన పల్లెల్లో పిల్లలకి వీటి వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని కొంత మంది వాదిస్తూ ఉంటారు. ఇలాంటి వాదనలని వమ్ము చేస్తూ బీహార్ లోని ఓ చిన్న గ్రామం నుండీ వచ్చిన వార్త....

http://timesofindia.indiatimes.com/city/patna/Ex-IITian-starts-world-class-school-in-Bihar-village/articleshow/7419365.cms

బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో, చమన్ పురా గ్రామంలో ఓ కొత్తరకమైన బడి స్థాపించబడింది. దాని పేరు చైతన్య గురుకుల్ పబ్లిక్ స్కూల్. దాన్ని స్థాపించినవాడు చంద్రకాంత్ సింగ్ అనే ఓ ఎక్స్-ఐఐటియన్. బెంగుళూర్ కి చెందిన ఈ వ్యక్తి 2009 లో బడిని స్థాపించాడు.

అంతవరకు విద్యుత్ సరఫరా కూడా లేని ఈ పల్లెలో, ఈ-లర్నింగ్ కి అవసరమైన వసతులతో ఈ కొత్త బడి ప్రత్యక్షమయ్యింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభావంతులైన టిచర్లు ఇక్కడ ఒకటి నుండీ ఎనిమిదో క్లాసు వరకు పిల్లలకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు చెప్తారు. సింగరౌలీ లో ఉండే పంకజ్ కుమార్ ఫిజిక్స్ నేర్పిస్తే, యు.పి. లోని కోర్వాలో ఉండే సంజయ్ రాయ్ కెమిస్ట్రీ చెప్తాడు. అమెరికాలో ఉండే వత్స్ గణితం నెర్పిస్తాడు. కంప్యూటర్లకి కావలసిన విద్యుత్తు జెన్సెట్ల నుండి వస్తుంది.

బీహార్ కి చెందిన చంద్రకాంత్ సింగ్, తన రాష్ట్రం వాళ్లు మహారాష్ట్రలో నవనిర్మాణ్ సేన కార్యకర్తల వల్ల పడుతున్న ఇబ్బందుల గురించి విన్నాడు. బీహార్ కి చెందిన విద్యార్థులు చదువుల కోసం ఇతర రాష్ట్రాలకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏదైనా చెయ్యాలని అనుకున్నాడు.

తన ఆలోచన గురించి ఐఐటి బాంబేలో తన గురువైన డా. సూర్య నారాయణకి చెప్పాడు. ఇద్దరూ కలిసి ఓ పధకం ఆలోచించారు. అలా తయారైన పథకాన్ని మూడు వేల మంది స్నేహితులకి తెలియజేయగా, వారిలో ఎనిమిది మంది దానికి ధనసహాయం చెయ్యడానికి ఒప్పుకున్నారు.

దేశ రాష్ట్రాలన్నిటిలోకి మన రాష్ట్రం అక్షరాస్యత విషయంలో చాలా హీన స్థితిలో ఉందన్న సంగతి మనకి తెలిసినదే. 2001 సెన్సస్ ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత 60.5% (http://india.gov.in/knowindia/literacy.php). ఈ ఏడాది రావలసిన సెన్సస్ సమాచారం మరి కొన్ని నెలలలో బయటపడుతుంది. కాని కిందటి సంవత్సరం వచ్చిన కొన్ని ముందస్తు నివేదికల ప్రకారం గత దశాబ్దంలో మన రాష్ట్రంలో అక్షరాస్యత పెద్దగా పెరక్కపోవడం ఆశ్చర్యకరం.
ఐటి రంగంలో గత ఒకటి రెండు దశాబ్దాల్లో గొప్ప పురోగతి సాధించిన మన రాష్ట్రం అక్షరాస్యతలో వెనుకబడడం బాధాకరం. ఐటి రంగంలో జరిగిన పురోగతిని ఆసరాగా చేసుకుని ఈ దశాబ్దం అంతాని కల్లా 90% అక్షరాస్యతని సాధించగలిగితే బావుంటుంది.

బాయిల్ నియమం నుండి అణువాదానికి

Posted by V Srinivasa Chakravarthy Thursday, February 10, 2011 0 comments

ఆ విధంగా రసాయనిక చరిత్రలో మొట్టమొదటి సారిగా సంఖ్యాత్మక కొలమాన పద్ధతులతో ఒక పదార్థాన్ని వర్ణించడానికి వీలయ్యింది.

అయితే బాయిల్ నియమం వర్తించాలంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలని బాయిల్ పేర్కొనలేదు. ఆ విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదని అనుకుని ఉంటాడు. తదనంతరం 1680 దరిదాపుల్లో బాయిల్ నియమాన్ని స్వతంత్రంగా కనుక్కున్న ఫ్రెంచ్ భౌతికశాస్త్రవేత్త ఎద్మె మారియో (1630-1684), ఆ నియమం వర్తించాలంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలని ప్రత్యేకంగా పేర్కొన్నాడు. అందుకే యూరప్ ఖండం మీద బాయిల్ నియమాన్ని తరచు మారియో నియమంగా వ్యవహరిస్తూ ఉంటారు.

బాయిల్ ప్రయోగాలు క్రమంగా అణువాదులని ఆకట్టుకున్నాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు లుక్రెటియస్ రాసిన కావ్యం అణువాదం విషయంలో ప్రాచీన గ్రీకుల భావనలని యూరొపియన్ పండితులకి పరిచయం చేసింది. ఈ రచనల చేత బాగా ప్రభావితుడైన ఒక ఫ్రెంచ్ తాత్వికుడు ఉన్నాడు. అతడి పేరు పియర్ గాసెందీ (1592-1655). ఆ ప్రభావం వల్ల అతడు పూర్తిగా అణువాదాన్ని సమ్మతించాడు. ఇతడు రాసిన రచనలు చదివిన బాయిల్ కూడా అణువాదిగా మారిపోయాడు.

ఘనపదార్థాలకి, ద్రవాలకి మాత్రమే దృష్టి పరిమితమైనంత కాలం అణువాదానికి ప్రత్యేకమైన సాక్ష్యాలేవీ దొరకలేదు. డెమాక్రిటస్ కాలంలో పరిస్థితి ఎలా వుండేదో బాయిల్ కాలంలోనూ అలాగే ఉండేది. ఘనపదార్థాలని, ద్రవాలని గణనీయంగా సంపీడితం (compress) చెయ్యడం సాధ్యం కాదు. వాటిలో అణువులే గనక ఉన్నట్లయితే, ఆ అణువులు ఒకదానికొకటి దగ్గరదగ్గరగా ఉండి ఉండాలి. ఇక అంతకన్నా దగ్గరగా వాటిని ఒత్తిడి చెయ్యడం సాధ్యం కాదు. కనుక ఘనపదార్థాలలోను, ద్రవాలలోను అణువులు ఉన్నాయన్న వాదనకి పెద్దగా బలం ఉండదు. ఎందుకంటే వాటిలో ఉన్నది అణువులకి బదులు, అవిచ్ఛిన్న పదార్థం అయిన పక్షంలో కూడా, అలాంటి పదార్థాన్ని పెద్దగా సంపీడితం చెయ్యడానికి సాధ్యం కాదు. అలాంటప్పుడు ఇక అణుసిద్ధాంతంతో పనేముంది?

కాని గాలి గురించి అనాదిగా మనుషులకి తెలుసు. గాలిని సంపీడితం చెయ్యొచ్చని ఇప్పుడు బాయిల్ నియమం సుస్పష్టం చేస్తోంది. మరి గాలిలో అణువులే లేకపోతే, వాటి మధ్య ఖాళీ స్థలమే లేకపోతే, ఆ గాలిని సంపీడితం చెయ్యడం ఎలా సాధ్యం? గాలిని సంపీడితం చెయ్యడం అంటే వాటి మధ్య ఉండే ఖాళీ స్థలం కుంచించుకుపోయేలా గాలి మీద ఒత్తిడి చెయ్యడమే.

వాయువుల విషయంలో ఈ విధమైన భావనని ఒప్పుకున్నట్లయితే, ద్రవాలు, ఘనపదార్థాలు కూడా అణువులతో నిండి ఉన్నాయని అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఉదాహరణకి నీరు ఆవిరి అవుతుంది. అది ఎలా సాధ్యం అవుతుంది? నీటిలోని అణువులు కొంచెం కొంచెంగా నీటి లోంచి బయట పడి చుట్టూ ఉన్న గాలిలో కలిసిపోయాయి అని అనుకోవడం తప్ప మరోలా ఎలా అనుకోగలం? అలాగే నీటిని మరిగిస్తే ఆవిరి పుడుతుంది. మరుగుతున్న నీట్లోంచి పైకి వస్తున్న ఆ ఆవిరిని స్పష్టంగా కళ్లతో చూడొచ్చు. అలా పైకి వచ్చిన ఆవిరి లక్షణాలకి, గాలి లక్షణాలతో పోలిక ఉంది కనుక అందులో అణువులు ఉన్నాయని అనుకోవాల్సి ఉంటుంది. మరి వాయు రూపంలో ఉన్న నీట్లో అణువులు ఉన్నప్పుడు, ఘన రూపంలోను, ద్రవరూపంలో కూడా అణువులు ఎందుకు ఉండవు? నీట్లో అణువులు ఉన్నప్పుడు తక్కిన అన్ని పదార్థాల్లోను అణువులు ఉన్నాయని నమ్మడానికి ఏంటి అభ్యంతరం?

ఇలాంటి వాదనలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి. రెండు వేల ఏళ్లుగా పెద్దగా ఎవరూ పట్టించుకోని ఈ భావనకి ఒక్కసారిగా గొప్ప ప్రాచుర్యం లభించింది. ఆ ఒరవడి లోనే న్యూటన్ కూడా అణువాదాన్ని ఆశ్రయించాడు.

ఆ విధంగా అణువాదానికి అంతో ఇంతో ప్రాచుర్యం పెరిగినా అదో అవిస్పష్ట భావనగానే మిగిలిపోయింది. ఆ భవనలో మరింత స్పష్టత రావడానికి మరో ఒకటిన్నర శతాబ్దాల కాలం ఎదురుచూడాల్సి వచ్చింది.

(సశేషం...)

ప్రాచీన భారతంలో రసాయన పర్వం

Posted by V Srinivasa Chakravarthy Wednesday, February 9, 2011 0 comments

ఈ సోమవారం నాడు ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించబడ్డ "ప్రాచీన భారతంలో రసాయన పర్వం" అనే వ్యాసాన్ని, ఆంధ్రభూమి వారి సౌజన్యంతో,ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
http://www.andhrabhoomi.net/intelligent/prachina-973



Enhanced by Zemanta

బాయిల్ నియమం

Posted by V Srinivasa Chakravarthy Saturday, February 5, 2011 0 comments



ఫాన్ హెల్మాంట్ జీవితం చివరి దశలలో వాయువుల అధ్యయనం మీద (ముఖ్యంగా గాలి యొక్క అధ్యయనం మీద) ధ్యాస క్రమంగా పెరగసాగింది. 1643 లో ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త ఎవాంజెలిస్టా టోరిసెల్లీ (1608-1647) గాలి ఒత్తిడి చేస్తుందని, దానికి పీడనం ఉందని నిరూపించాడు. ముప్పై అంగుళాల మట్టం ఉన్న పాదరసపు స్తంభాన్ని (mercury column) నిలుపగలిగేటంత పీడనం గాలిలో ఉందని నిరూపించాడు.

ఆ విధంగా వాయువుల పట్ల అవగాహన విషయంలో కొద్దిగా మబ్బులు తొలగాయి. వాయువులు కూడా పదార్థమే. వాటికీ భారం ఉంది. ద్రవాలని, ఘనపదార్థాలని ఆధ్యయనం చేసినట్టే వాటినీ అధ్యయనం చేయొచ్చు నని క్రమంగా అర్థం కాసాగింది. ద్రవాలకి, ఘనాలకి, వాయువులకి మధ్య తేడా సాంద్రతలోనే వస్తుంది.

వాయుమండలం యొక్క భారం వల్ల పుట్టే పీడనం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆటో ఫాన్ గ్యూరిక్ (1602-1686) అనే జర్మన్ భౌతిక శాస్త్రవేత్త చాలా సంచలనాత్మకంగా ప్రదర్శించాడు. ఇతడు గాలి పంపుని కనుక్కున్నాడు. ఆ పంపుతో పాత్రలలో గాలిని తొలగించి, బయట పీడనం కన్నా పాత్రలో పీడనం కాస్త తక్కువ అయ్యేలా చేశాడు.

1654 లో ఇతడు ఓ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రెండు సమానమైన పెద్ద లోహపు అర్థగోళాలని తీసుకున్నాడు. రెండు అర్థగోళాల అంచులకి గ్రీసు పూసి, అవి రెండు గాలి చొరబడ కుండా అతుక్కునేలా ఏర్పాటు చేశాడు. అలా అతికించిన అర్థగోళాల లోపలి భాగం నుండి పంపుతో కొంత గాలిని తొలగించాడు. అప్పుడు బయటి పీడనం కన్నా లోపలి పీడనం తక్కువయ్యింది కనుక, బయట గాలి వత్తిడి వల్ల అర్థగోళాలు మరింత గట్టిగా అతుక్కుంటాయి. కనుక అలాంటి పరిస్థితిలో రెండు అర్థగోళాలని లాగి వేరు చెయ్యడం కష్టం. అది ఎంత కష్టమో ప్రదర్శించడానికి రెండు అర్థగోళాలకి గుర్రాలని కట్టి, వాటిని కొరడాలతో కొట్టి లాగేట్టు చేశాడు. గుర్రాలు ఎంత పెనుగులాడినా అర్థగోళాలని వేరుచెయ్యలేకపోయాయి. ఈ సారి అర్థగోళాలలోకి తిరిగి గాలిని ప్రవేశపెట్టగానే రెండూ సునాయాసంగా వేరుపడ్డాయి.

ఇలాంటి ప్రయోగాలు గాలి యొక్క లక్షణాల పట్ల జనంలో గొప్ప కుతూహలం రేకెత్తించాయి. అలా గాలి మీదకి గాలి మళ్లిన వాళ్లలో ఒకడు ఐర్లండ్ కి చెందిన రాబర్ట్ బాయిల్ (1621-1691) అనే రసాయన శాస్త్రవేత్త. ఇతడు ఫాన్ గ్యూరిక్ నిర్మించిన గాలి పంపు కన్నా సమర్థవంతమైన పంపుని కనిపెట్టాడు. గ్యూరిక్ తలపెట్టిన ప్రయోగానికి వ్యతిరేకమైన ప్రయోగాన్ని బాయిల్ తలపెట్టాడు. ఒక పాత్రలోని గాలిని పంపుతో తొలగించి ఆ విధంగా పాత్రని సంపీడితం (compress) చెయ్యాలని చూశాడు.
వాయువు నిండిన పాత్రలలో పీడనానికి, ఘనపరిమాణానికి మధ్య ఓ సంబంధాన్ని గుర్తించాడు బాయిల్. ఈ ప్రయోగాలలో పొడవాటి నాళాలని తీసుకునేవాడు. నాళానికి అడుగున ఓ కొళాయి ఉంటుంది. నాళంలో గాలి నిండి ఉంటుంది. ఇప్పుడు నాళంలో పై నుండి పాదరసం నింపేవాడు. పాదరసానికి అడుగున కొంత గాలి చిక్కుకుంటుంది. పాదరసం యొక్క మట్టం పెరుగుతున్న కొద్ది పాత్రలో గాలి మీద పీడనం పెరుగుతుంది. పీడనం రెండింతలు అయితే గాలి యొక్క ఘనపరిమాణం సగం అవ్వడం గమనించాడు. అలాగే పీడనం మూడింతలు అయితే ఘనపరిమాణం మూడో వంతు అయ్యింది. అలాగే పీడనాన్ని తగ్గిస్తే ఘనపరిమాణం పెరిగింది. ఆ విధంగా పీడనానికి ఘనపరిమాణానికి మధ్య ఉన్న విలోమానుపాత (inversely proportional) సంబంధాన్ని గుర్తించి, ఆ వివరాలని బాయిల్ 1662 లో ప్రచురించాడు. ఆ సంబంధమే బాయిల్ నియమంగా ప్రసిద్ధి పొందింది.


(సశేషం...)

గాలి – ఆవిరి – ఆత్మ

Posted by V Srinivasa Chakravarthy Wednesday, February 2, 2011 0 comments

భాష్పశీల (సులభంగా ఆవిరయ్యే, volatile) ద్రవాలని వాళ్లు ఏమని పిలిచేవారో ఓసారి గమనిస్తే, ఈ ఆవిరుల పట్ల ప్రాచీనులకి ఉండే మనోభావంలోని రహస్యం అర్థమవుతుంది. అలాంటి ద్రవాలని వాళ్ళు “spirits” అనేవారు. Spirit అంటే ’ఊపిరి’, లేక ’వాయువు’ అన్న స్థూలార్థం ఉంది. అయితే ఆ పదానికి అదేదో నిగూఢమైన, పారలౌకికమైన తత్వం (ఆత్మ) అన్న భావం కూడా ఉంది. ఉదాహరణకి “spirits of alchohol” అని “spirits of turpentine” అంటుంటాం. మనకి తెలిసిన భాష్పశీల ద్రవాలలోకెల్లా ఆల్కహాలు ఎంత పాతది అంటే, “spirits” అన్న పదం ప్రముఖంగా ఆల్కహాలు గల మత్తుపానీయాలకి ఉద్దేశించిన పదంగా పరిణామం చెందింది.

ద్రవాల నుండి పుట్టిన ఆవిరులని అధ్యయం చేసినవారిలో మొదటివాడు ఫాన్ హెల్మాంట్. భౌతిక, దృశ్య లక్షణాలలో అవి గాలిలాగానే ఉన్నా, కొన్ని లక్షణాలు వేరేగా ఉన్నాయని అతడు గమనించాడు. ఉదాహరణకి మండే కట్టె నుండి పుట్టే ఆవిరులు గాలిలాగే కనిపించినా వాటి ప్రవర్తన గాలి కన్నా భిన్నంగా ఉందని గుర్తించాడు.

కచ్చితమైన ఘనపరిమాణం, ఆకారం లేని ఈ గాలి లాంటి పదార్థాలు గ్రీకులు “chaos” అని పిలిచే ఓ ప్రత్యేక పదార్థాన్ని పోలి ఉన్నాయని ఊహించాడు. గ్రీకుల చింతనలో ఈ chaos అంటే విశ్వార్భావానికి మూలమైన ఓ రూపంలేని, రచనలేని ఆదిమ పదార్థం. ఫాన్ హెల్మాంట్ ఈ వాయువులని chaos అని పిలిచాడు. అయితే ఫ్లెమిష్ ఉచ్ఛారణలో అది కాస్తా gas గా మారిపోయింది. ఈ gas అన్న పదంతోనే ఇప్పటికీ మనం గాలి లాంటి పదార్థాలని వ్యవహరిస్తున్నాం.

ఫాన్ హెల్మాంట్ కాలే కట్టె నుండి ఓ వాయువుని వెలికి తీసి దాన్ని అత్యంత శ్రద్ధతో అధ్యయనం చేశాడు. ఆ వాయువుకి “gas sylvestre” (కట్టె నుండి తీసిన వాయువు) అని పేరు పెట్టాడు. ఆ వాయువునే మనం ప్రస్తుతం కార్బన్ డయాక్సయిడ్ అంటున్నాం.

ఈ వాయువుల అధ్యయనం లోనే మొట్టమొదటిసారిగా రసాయన శాస్త్రంలో కచ్చితమైన సంఖ్యాత్మక పద్ధతుల వినియోగం మొదలయ్యింది. ఆ అధ్యయనమే ఆధునిక రసాయన శాస్త్రానికి రాచబాట అయ్యాయి.

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts