శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

సూర్యస్తుతి

Posted by V Srinivasa Chakravarthy Monday, January 30, 2012 4 commentsఅరవింద్ గుప్తా రాసిన 'The Story of Solar Energy' అనే కామిక్ బుక్ యొక్క అనువాదం నిన్ననే పూర్తయ్యింది.పుస్తకం చివర్లో సూర్యుడి మీద ఓ తమాషా పద్యం ఉంది. దాని అనువాదం ఇక్కడ ఇస్తున్నాను.
సూర్యస్తుతి
శక్తి నిపుణులు

అరుస్తుంటారు

అయిపోతాయని

బొగ్గు, చమురు.


హిమధృవాలు కరుగుతాయని,

గడ్డు కాలం వచ్చేస్తోందని.

జపనీస్ అణు సంస్థలు

అంతే లేని అవస్థలు.


కరెంటు పోతే చెప్పాపెట్టక

ఫరవాలేదు బెంబేలు పడక

ఉచితంగా రవిశక్తి వాడుకో

హాయిగ వంటలు వండుకోగాలిని పట్టి బంధించు

ఇంట్లో దీపం వెలిగించు

సూర్యుడి శక్తిని గ్రహించు

బంగరు భవితను వరించు.ఆంగ్ల మూలం...


ODE TO THE SUNEnergy experts

Howl and shout

Oil and coal

Are running outIcecaps melt

Not all is well

Japanese Nukes

All went to hellWhen power fails

Welcome the crunch

Use the sun

To cook your lunchCatch the wind

Switch on a light

Tap the sun

For a future bright
అతి క్రూరంగా ప్రవర్తించి జామొరిన్ మీద, స్థానికుల మీద ప్రతీకారం తీర్చుకున్న వాస్కో ద గామా మార్చ్ 5, 1503, నాడు తిరిగి పోర్చుగల్ కి పయనమయ్యాడు. సెప్టెంబర్ 1 నాడు నౌకాదళం లిస్బన్ ని చేరుకుంది. మహారాజు మాన్యుయెల్ వాస్కో కి ఘనస్వాగతం పలికాడు. పెద్ద మొత్తంలో ధనం బహుమానంగా ఇచ్చి ఆదరించాడు. ఈ డబ్బుతో వాస్కో ద గామా ఎవోరా లో ఓ పెద్ద భవంతి కట్టుకున్నాడు. అయితే ఏనాటికైనా తన చిన్ననాటి ఊరు ‘సైన్స్’ (Sines) ని సొంతం చేసుకోవాలన్న కల మాత్రం తన మదిని వీడలేదు.


(చిత్రం - సైన్స్ నగరంలో వాస్కో ద గామా స్మారక చిహ్నం)


కాని సైన్స్ ని సొంతం చేసుకోడానికి కొన్ని అవరోధాలు ఉన్నాయి. ఆ ఊరు ‘సావో తియాగో’ అనే మతవర్గం హయాంలో ఉంది. ఈ వర్గం వారు ఆ ఊరిని రాజుకి అమ్మడానికి ఒప్పుకోలేదు. మతవర్గంతో పేచీ పెట్టుకుని ఊరిని బలవంతంగా లాక్కునేటంత ధైర్యం లేదు రాజుకి. ఇక గత్యంతరం లేక వాస్కో ద గామా స్వయంగా సైన్స్ కి వెళ్ళి అక్కడే ఓ ఇల్లు కట్టుకున్నాడు. పుట్టి పెరిగిన ఊళ్ళో గర్వంగా, మీసం మెలేసుకుని తిరిగేవాడు. ఆ ఊరి వారికే కాక సమస్త పోర్చుగీస్ జాతికీ మరి వాస్కో ద గామా జాతి గర్వపడదగ్గ అసమాన శూరుడు. అలాంటి వాడు తమ మధ్య జీవిస్తూ, తమ ఊరి వీధుల్లో సంచరించడం సైన్స్ పుర వాసులకి కూడా సంతోషం కలిగించింది.

ఇది తెలిసిన ‘సావో తియాగో’ మత వర్గానికి చెందిన అధికారులు వాస్కో తో తల గోక్కోవడం ఇష్టం లేక నేరుగా రాజుకే ఫిర్యాదు చేశారు. వాస్కో ఆ ఊరు వదిలి వెళ్లిపోవాలని ఆజ్ఞ ఇస్తూ, నెల రోజులు గడువు ఇచ్చాడు రాజు. రాజు మాట కాదనలేక వాస్కో ఊరు వదిలి వెళ్లినా, లోగడ రాజు తనకి ఇచ్చిన మాట ఇంకా నిలుపుకోలేదని ఓ సారి గుర్తుచేశాడు. ఇండియాకి మొదటి యాత్ర తరువాత రాజు తనకి ఇస్తానన్న పారితోషకం ఇంకా ఇవ్వలేదని మరో సారి జ్ఞాపకం చేశాడు.

మొదటి సారి వాస్కో ద గామా ఇండియా నుండి తిరిగి వచ్చాక, అతడు సాధించిన అనుపమాన విజయానికి గొప్ప పారితోషకం ఇస్తానని రాజు వరం ఇచ్చాడు. కాని ఒకసారి ఇండియా కి దారి తెలిశాక ఇక వాస్కో ద గామ అవసరం అంతగా లేదు. తెలిసిన దారి వెంట నౌకలని తీసుకుని ఇండియాకి వెళ్లగల నావికులు ఎంతో మంది ఉన్నారు. రాజు వాస్కో కి ఇచ్చిన ప్రమాణం గురించి పట్టించుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణం.

అందుకే మాట ఇచ్చి పదేళ్లు అయినా ఇంకా మాట నిలుపుకోకుండా తాత్సారం చెయ్యసాగాడు మాన్యుయెల్ రాజు. ఈ ఆలస్యం వాస్కో భరించలేకపోయాడు. ఒకసారి రాజు వద్దకి సూటిగా వెళ్ళిన్ నిలదీశాడు. మాట నిలుపుకోకపోతే ఇక పోర్చుగీస్ రాజు కొలువులో ఉండడం అనవసరం అని, మరో రాజుని ఆశ్రయించక తప్పదని హెచ్చరించాడు.

ఆ హెచ్చరికకి రాజు కాస్త కంగారు పడ్డాడు. ఏనాడైనా వాస్కో తో పని పడొచ్చు. కనుక తనతో ఊరికే కలహం పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు. కనుక ఏదో సర్దుబాటు చేస్తానని, మరొక్క ఏడాది వేచి ఉండమని సర్దిచెప్పి వాస్కో ని పంపించేశాడు. వాస్కో కి బహుమతిగా ఇవ్వడానికి ఎక్కడైనా తగినంత భూమి దొరుకుతుందేమో అని రాజు నాలుగు చోట్ల వాకబు చేశాడు. రాజు మేనల్లుడు ఒకడు తన అధికారంలో ఉన్న రెండు ఊళ్ళు రాజుకి అమ్ముతాను అన్నాడు. చివరికి 1519 డిసెంబర్ లో, రాజు తనకి మాట ఇచ్చిన ఇరవై ఏళ్ల తరువాత, వాస్కో ద గామాకి తనకి బహుమానంగా రావలసిన నేల దక్కింది.

వాస్కో ద గామా రెండవ యాత్ర తరువాత, ఆ దారి వెంట ఎన్నో పోర్చుగీస్ ఓడలు ఇండియాకి పయనమయ్యాయి. నావికులకి ఈ మార్గంలో పవనాలు ఏ కాలంలో ఏ దిశలో వీస్తాయో అన్నీ తెలిసిపోయాయి. కనుక ఆ పవనాలని తగు రీతిలో వాడుకుంటూ తమ యాత్రా మార్గాలని రూపొందించుకుంటూ వచ్చారు. 1500 నుండి 1504 వరకు ఎక్కువగా వాణిజ్య నౌకలే ఇండియాకి పయనం అయ్యాయి.

తొలి దశల్లో వాస్కో బృందం చేసినట్టు అందిన చోట అందినట్టు కొల్లగొట్టుకు వచ్చే పద్ధతి ఎంతో కాలం సాగదు. వాణిజ్యం సజావుగా సాగాలంటే అన్ని పక్షాల వారు ఒక చట్టబద్ధమైన వ్యవస్థకి ఒడంబడి ఉండాలి. అలాంటి వ్యవస్థ యొక్క సంస్థాపనలో మొదటి మెట్టుగా మహరాజు మాన్యుయెల్ ఇండియాలో వైస్రాయ్ అనే పదవిని స్థాపించాడు. ఎలగైనా స్థానిక ముస్లిమ్ వర్తకులకి అక్కణ్ణుంచి తరిమేయాలని రాజు పన్నాగం. అందుకోసం ముందు అక్కడ పోర్చుగీస్ అధికారంలో ఉండే ఓ మండలాన్ని స్థాపించాలి.

అలాంటి మండలాన్ని స్థపించడానికి పశ్చిమ తీరంలోనే ఉన్న గోవా నగరం అన్ని విధాలా సౌకర్యంగా అనిపించింది. పోర్చుగీస్ సామంత ప్రాంతంగా గోవా వేగంగా ఎదిగింది. అయితే ఆ విస్తరణ సామరస్యంగా సాగలేదు. మొత్తం వాడలు తుడిచి పెట్టుకుపోయాయి. ఎంతో మంది జైలుపాలు అయ్యారు. వారిలో ఎంతో మంది జైల్లోనే నానా చిత్ర హింసకీ గురై హతం అయ్యారు. కనుక ఎంత వేగంగా ఎదిగిందో, అంతే వేగంగా ఆ ప్రాంతం పతనం అయ్యింది. గోవా ప్రాంతం అరాచకం అయ్యింది. సభ్య సమాజానికి ఉండాల్సిన లక్షణాలు కనుమరుగు అయ్యాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండేవారు జనం. ప్రతి ఒక్కరూ అవతలి వారిని ఎలా దొంగ దెబ్బ తీసి ముందుకు పోదామా అనే ఆలోచనలో ఉండేవారు. “నెత్తురు, అత్తరు కలగలసిన దారుణ మిశ్రమం…” అంటాడు ఆ పరిస్థితిని వర్ణిస్తూ ఓ పోర్చుగీస్ రచయిత.

ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి దక్షుడు, నిజాయితీ పరుడు అయిన ఓ పాలకుడు కావాలి. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ వాస్కో ద గామా రంగప్రవేశం చేశాడు.

(ఇంకా వుంది)


కొన్ని సార్లు గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో కూడా అదే గదిలో మరెవరో కూడా ఉన్నారనిపిస్తుంది. మనకి తెలియకుండా గదిలో మరెవరో అదృశ్య వ్యక్తి ఉన్నారన్న ఊహకే ఒళ్లు జలదరిస్తుంది. కొందరు ఇది వట్టి భ్రాంతి అని కొట్టిపారేస్తే, మరి కొందరు ఇది దయ్యాలు, భూతాలు ఉన్నాయని తెలిపే ఆధారం అనుకుని బెదురుతుంటారు.

కాని ఈ విచిత్రమైన అనుభూతిని అర్థం చేసుకునే విషయంలో నాడీవిజ్ఞానం కొంత పురోగతి సాధించింది. స్విట్జర్లాండ్ లో ‘ఎకోల్ పాలితెక్నీక్ ఫెదరాల్ ద లోసాన్’ (EPFL) అనే విశ్వవిద్యాలయంలో, దాని సంబంధిత ఆసుపత్రిలోను, నాడీ విజ్ఞాన విభాగానికి చెందిన ఒక బృందం చేసిన ప్రయోగాలలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.

ఎపిలెప్సీ (మూర్చరోగం)తో బాధపడుతున్న ఒక రోగికి ఈ బృందం శస్త్రచికిత్సకి కావలసిన పరీక్షలు చేస్తున్న సమయంలో అనుకోకుండా ఈ విషయాలు బయటపడ్డాయి. ఎపిలెప్సీ రోగుల మెదళ్లలో కొన్ని ప్రత్యేక స్థానల నుండి నాడీ కణాల విద్యుత్ చర్య విపరీతంగా పెరిగి, ఇరుగు పొరుగు మెదడు ప్రాంతాలకి ఓ కార్చిచ్చులా పాకుతుంది. అలా వ్యాపించిన అసాధారణ నాడీ విద్యుత్ చర్య కొన్ని సార్లు మొదణ్ణి పూర్తిగా ఆక్రమించుకుంటుంది. అలాంటి సమయంలో ఇక స్పృహ కోల్పోవడం, కొంద పడి కొట్టుకోవడం మొదలైన బాహ్య చిహ్నాలు కనిపిస్తాయి. మందులతో లొంగని సందర్భాలలో శస్త్రచికిత్స చేసి, మెదడులో ఈ అసాధారణ సంకేతాలని కారకమైన ప్రాంతాన్ని తొలగిస్తారు. అలాంటి స్థానాన్ని epileptic focus అంటారు. అలా శస్త్రచికిత్స చేసే ముందుగా, రోగి మెదడుకి విద్యుత్ పేరణలు ఇచ్చి వివిధ ప్రాంతాలు ఆ ప్రేరణకి ఎలా స్పందిస్తాయో పరీక్షిస్తారు. సమస్య ఉన్న స్థానం అయితే ప్రేరణ ఇచ్చినప్పుడు seizure కలుగజేస్తుంది.

ఎపిలెప్సీతో బాధపడుతున్న ఓ 22 ఏళ్ల స్త్రీ రోగి మెదడుకి ప్రేరణనిచ్చి పరీక్షిస్తున్న సమయంలో ఈ కొత్త సత్యాలు తెలిసొచ్చాయి. మెదడులో ఎడమ పక్క, టెంపొరల్ లోబ్ కి, పెరైటల్ లోబ్ కి మధ్య సరిహద్దు వద్ద (దీన్ని temporo-parietal junction అంటారు – కింద చిత్రంలో బాణం సూచిస్తున్న ప్రాంతం) ప్రేరణ నిచ్చినప్పుడు రోగి తనకి చెంతనే మరెవరో ఉన్నట్టు అనిపిస్తోందని చెప్పింది.


రోగి యొక్క భంగిమకి, విద్యుత్ ప్రేరణ వల్ల కలిగిన అనుభూతికి మధ్య సంబంధం ఉన్నట్టు తెలిసింది.

రోగి పూర్తిగా వెల్లకిలా పడుకుని ఉన్న సమయంలో ప్రేరణ నిస్తే, రోగికి వెనుక ఎవరో ఉన్న అనుభూతి కలిగింది (చిత్రం b). ఆ “వెనుక ఉన్న వ్యక్తి” ఎలా ఉంటాడు అని అడిగితే, “వయసులో చిన్న వ్యక్తే” నని, అయితే మగో, ఆడో చెప్పడం కష్టంగా ఉందని చెప్పింది!

ఈ సారి రోగి కూర్చుని తన మోకాళ్ళని గట్టిగా చేతులతో పట్టుకుని కూర్చున్న సమయంలో మెదడుకి అదే స్థానంలో ప్రేరణ ఇచ్చారు (చిత్రం c). ఈ సారి “వెనుక ఉన్న వ్యక్తి” కూడా కూర్చునే ఉన్నాడని, పైగా తనని పట్టుకుని కూర్చున్నాడని, ఇది కాస్త ఇబ్బందికరంగా ఉందని రోగి చెప్పింది!
ఇక మూడవ సందర్భంలో రోగి చేతిలో కొన్ని కార్డులు ఉంచి, వాటి మీద ఉన బొమ్మల పేర్లు చెప్పమన్నారు నిపుణులు. ఈ పనిలో రోగి నిమగ్నమై ఉండగా ప్రేరణ ఇచ్చినప్పుడు ఆమె స్పందన ఇంకా విచిత్రంగా ఉంది. వెనుక ఉన్న వ్యక్తి ఈ సారి తన “చేతిలో ఉన్న కార్డు కావాలంటున్నాడ”ని, “చదవనివ్వడం లేద”ని ఆ రోగి చెప్పింది.

ఇలా ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నకి ఈ అధ్యయనం చేసిన నిపుణులు ఇలా వివరణ ఇస్తున్నారు. Temporo-parietal junction మెదడులో చాలా ముఖ్యమైన ప్రాంతం. దృశ్య, శ్రవణ, స్పర్శ ఇంద్రియాలకి సంబంధించిన సమాచారం ఇక్కడ సంయోజించబడుతుంది. వెర్నికీ ప్రాంతం అని పిలువబడే భాషని అర్థం చేసుకునే ప్రాంతం కూడా ఇక్కడికి దగ్గర్లోనే ఉంటుంది. మనలో ‘నేను’ అన్న భావన కలగడానికి ఆధారభూతమైన మెదడు ప్రాంతాలలో ఈ Temporo-parietal junction ఒకటి. కనుక ఈ ప్రాంతానికి ప్రేరణ ఇచ్చినప్పుడు నేను అన్న భావన వికారం చెంది, మరొకరు అన్న భావన చోటుచేసుకుంది.

ఈ అధ్యయనం ప్రఖ్యాత ‘నేచర్’ పత్రికలో 2006 లో ప్రచురితం అయ్యింది.
Reference:
Arzy et al, Induction of an illusory shadow person, Nature, vol 443, no. 21, 2006.
ప్రతుల కోసం

మంచిపుస్తకం ప్రచురణలు

ప్రచురణ కర్త - సురేష్ కొసరాజు (kosaraju.suresh@gmail.com)

బృహస్పతి పంచమం - కొత్త పుస్తకం

Posted by V Srinivasa Chakravarthy Thursday, January 19, 2012 0 comments
ప్రతుల కోసం:

Address: Manchipustakam Publications H.No 12-13-450, Street No:1, Tarnaka, Secunderabad- 500 017.
భూమికి మల్లె అక్కడా దట్టమైన వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణంలో పుష్కలంగా నైట్రోజెన్ ఉంటుంది. అక్కడా ఆకాశంలో మబ్బులు ఉంటాయి. ఆ మబ్బులు వర్షిస్తుంటాయి. చక్రికంగా మారే ఋతువులు ఉంటాయి. నదులు, సముద్రాలు ఉంటాయి. ఎత్తైన తిన్నెలు, పర్వతాలు ఉంటాయి. కాని పోలిక అక్కడితో ఆగిపోతుందండోయ్! ఎందుకంటే అక్కడి మబ్బులు వర్షించేది నీరు కాదు. ద్రవ రూపంలోని మీథేన్. అక్కడి పర్వతాలలో ఉండేది రాయి కాదు, రాతి కన్నా కఠినమైన ఘనీభవించిన నీరు. మనం ప్రస్తావించే విచిత్ర లోకం పేరు – టైటన్.

టైటన్ శనిగ్రహం యొక్క ఉపగ్రహాల్లో అతి పెద్ద ఉపగ్రహం. మనకి కచ్చితంగా తెలిసినంత మేరకు ఉపరితలం మీద ద్రవరూపంలో పదార్థం ఉన్న మరో లోకం ఇదే. సౌరమండలంలో ఇది రెండవ అతి పెద్ద సహజ ఉపగ్రహం. (అతి పెద్ద ఉపగ్రహం జూపిటర్ ఉపగ్రహమైన గానిమీడ్). 1655 లో డచ్ ఖగోళశాస్త్రవేత్త క్రిస్టియన్ హయ్గెన్స్ దీన్ని కనుక్కున్నాడు.

టైటన్ లో ఒక ప్రత్యేకత దాని వాతావరణం. మొత్తం సౌరమండలంలో కెల్లా వాతావరణం గల సహజ ఉపగ్రహం ఇదే. అయితే భూమి వాతావరణం కన్నా ఇక్కడి వాతావరణం చాలా దట్టంగా ఉంటుంది. దీని ఉపరితలం వద్ద వాయుపీడనం భూమి మీద కన్నా 1.45 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఉపగ్రహం అంతా ఎప్పుడూ ముసురు కప్పినట్టు ఉంటుంది. ఆ కారణం చేతనే అంతరిక్షం నుండి చూస్తున్నప్పుడు ఉపగ్రహం ఉపరితలం మీద విశేషాలు స్పష్టంగా కనిపించవు. సూర్యకాంతిలోని అతినీలలోహిత (అల్ట్రావయలెట్) కాంతి ఆ వాతావరణంలోని మీథేన్ వాయువు మీద జరిపే చర్యవల్ల ఆ ముసురు పుడుతోంది. అందుకే 1980 లలో వాయేజర్ 1,2 వ్యోమనౌకలు దీని పక్కగా ప్రయాణిస్తూ ఫోటోలు తీసినప్పుడు పెద్దగా సమాచారం బయటపడలేదు.
దూరం నుండి ఫోటోలు తీసే పద్ధతి లాభం లేదని, ఏకంగా టైటన్ మీద వాలి అధ్యయనాలు చేసేందుకు గాను హైగెన్స్-కాసినీ అనే వ్యోమనౌక పంపబడింది. ఈ నౌక జులై 1, 2004, లో సాటర్న్ సమీప ప్రాంతాన్ని చేరుకుంది. ఉపగ్రహం చుట్టూ కక్ష్యలో తిరుగుతూ త్వరలోనే ఫోటోలు తీసుకోవడం మొదలెట్టింది. అదే ఏడాది అక్టోబర్ లో హైగెన్స్-కాసినీ వ్యోమనౌక నుండి కాసినీ అనే ప్రోబ్ (సర్వే చేసే చిన్న నౌక) వేరు పడి, ఉపగ్రహం నుండి 1,200 కి.మీ.ల దూరానికి సమీపించి ఎన్నో స్పష్టమైన ఫోటోలు తీసి భూమికి పంపింది. జనవరి 2005 లో, హైగెన్స్ అనే ప్రోబ్ కూడా వేరుపడి, టైటన్ ఉపరితలం మీద వాలి ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించింది. మనం పంపిన వ్యోమనౌకలు వాలిన లోకాలు అన్నిట్లోకి అతి దూరమైన లోకం ఈ టైటన్.'కాసినీ' ప్రోబ్ టైటన్ మీద అధ్యయనాలు జరుపుతున్నప్పుడు దక్షిణధృవం వద్ద నల్లగా, ఓ చిక్కని నీడలాంటి ప్రాంతం కనిపించింది. తదనంతరం అదొక పెద్ద సరస్సు అని తేలింది. దానికి ఒంటారియో లాకస్ అని పేరు పెట్టారు. అయితే అది నీటి సరస్సు కాదు. హైడ్రోకార్బన్ల సరస్సు! తదనంతరం కాసినీ వ్యోమనౌక తీసిన రాడార్ చిత్రాల బట్టి ఉపగ్రహం యొక్క ఉత్తర ధృవం వద్ద కూడా అలాంటి ఎన్నో ‘మచ్చలు’ కనిపించాయి. ఉత్తర గోళార్థంలో ఏకంగా సముద్రాలు అని చెప్పుకోదగినంత పెద్ద మీథేన్ సరస్సులు కొన్ని కనుక్కోబడ్డాయి. వీటి పరిమాణం ఒక కిమీ నుండి కొన్ని వందల కిమీల వరకు ఉంటుంది. ఈ పరిశీలనలు అన్నిటి ఆధారంగా టైటన్ మీద నిశ్చయంగా మీథేన్ సరస్సులు ఉన్నాయని 2007 లో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎంతో కాలంగా టైటన్ గురించి తెగని రహస్యంగా ఉన్న విషయం చివరికి నిజమని తేలింది.ఆ విధంగా 2008 వరకు కాసినీ నుండి పోగైన సమాచారాన్ని బట్టి భూమి మీద ఉన్న మొత్తం చమురు నిలువల కన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ హైడ్రోకార్బన్ల నిలువలు టైటన్ మీద ఉన్నాయని రూఢిగా తెలిసింది. అపారమైన చమురు నిలువలు ఉండడంతో భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలకి గమ్యంగా టైటన్ ప్రాముఖ్యత పెరిగింది. పుష్కలమైన ఇంధనపు వనరులు జూపిటర్ పరిసరాలలో కూడా ఉన్నా ఆ గ్రహం చుట్టూ ఉండే తీవ్రమైన రేడియేషన్ దృష్ట్యా అక్కడ మకాం పెట్టి ఇంధనాలని తవ్వితీసే ప్రయత్నం మరింత కష్టం అవుతుంది. మహావాయు గ్రహాలైన (gas giants) జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ల నాలుగింటిలోను సాటర్న్ చుట్టూ ఉన్న ఇంధనపు వనరులని కొల్లగొట్టడం మరింత సులభం అంటాడు రాబర్ట్ జుబ్రిన్ అనే అమెరికన్ ఎయిరోస్పేస్ ఇంజినీరు. ఎందుకంటే సాటర్న్ జూపిటర్ కన్నా దూరమే కాని, తక్కిన రెండు మహావాయుగ్రహాల కన్నా చాలా దగ్గర. సాటర్న్ చుట్టూ సులభంగా ఆవాసాలు ఏర్పాటు చేసుకోదగ్గ ఉపగ్రహాలు ఉన్నాయి. రేడియేషన్ కూడా తక్కువే.కేవలం చమురు కోసమే కాక ఉండడానికి కూడా భూమి తరువాత సౌరమండలంలో ఓ ముఖ్యమైన ప్రదేశంగా టౖటన్ ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఉపగ్రహపు ఉపరితలం మీద మీథేన్ ఉన్నా, భూగర్భంలో ద్రవరూపంలో నీరు, అమోనియా లు ఉన్నాయని తెలిపే ఆధారాలు ఉన్నాయి. ఆ నీటిని పైకి తీసి మానవ అవసరాలకి వాడుకోవచ్చు. అలాగే అక్కడ సులభంగా దొరికే ఇంధన వనరులలోని శక్తిని ఉపయోగించి, నీటిని భేదించి, ఆక్సిజన్ తయారుచేసుకోవచ్చు. అక్కడ దొరికే హైడ్రోకార్బన్లని పంటలకి ఫెర్టిలైజర్లుగా వాడుకోవచ్చు. ఇన్ని ఆకర్షణలు ఉన్న ఆ లోకం మీద ఈ శతాబ్దంలో ఏదో ఒక దశలో మనిషి పాదం మోపే అవకాశం తప్పకుండా ఉంది.

అంతరిక్షం నుండి భూమి ఫోటోలు తియ్యాలంటే ఏ శాటిలైట్ ద్వారానో సాధ్యం అవుతుంది. లేదాఓ రాకెట్ నుంచో, షటిల్ నుంచో తియ్యాలి. కాని కేవలం $150 (Rs 7500) ఖర్చుతోఅంతరిక్షం నుండి భూమిని ఎలా ఫోటోలు తియ్యారో కనిపెట్టారు. ఆ కనిపెట్టింది ఏ తలలు పండినశాస్త్రవేత్తలో కారు. అమెరికాలో ఎమ్. ఐ.టి విశ్వవిద్యాలయంలో చదువుకునే ఇద్దరు విద్యార్థులు.
జస్టిన్ లీ, ఆలివర్ యే అనే ఆ విద్యార్థులు రూపొందించిన విధానానికి కావలసిన సరంజామా చాలాసింపుల్! సాఫ్ట్ డ్రింక్స్ చల్లగా ఉంచుకోవడానికి వాడే స్టైరోఫోమ్ పెట్టె, ఓ సాధారణ కెమేరా (Canon A470),జి.పి.ఎస్. సౌకర్యం ఉన్న ఓ ప్రీపెయిడ్ సెల్ ఫోన్. పబ్లిక్ టాయిలెట్ లలో వాడే చేతులు డ్రై చేసుకునేడ్రయర్ కూడా ఆ పెట్టెలో ఉంచారు. పైన చలికి బ్యాటరీలు పనిచెయ్యడం ఆగిపోకుండా ఆడ్రయర్ కాపాడుతుంది. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా కావలసినది ఓహీలియం బెలూన్. వాతావరణ పరిశోధనల్లో ఇలాంటి బెలూన్ లని వాడతారు.ఈ మొత్తం సరంజామాకి అయిన ఖర్చు కేవలం $150 (Rs 7500).
2009, సెప్టెంబర్ 2 నాడు బెలూన్ కి ఆ పెట్టెను కట్టి ఆకాశంలోకి వదిలేశారు.మసాచుసెట్స్ రాష్ట్రంలో, స్టర్ బ్రిడ్జ్ అనే ఊరి నుంచి బెలూన్ ని వదిలారు. మరి కాస్త తూర్పు దిశగా జరిగి బెలూన్ ని వదిలి వుంటే అది కింద పడేటప్పుడు అట్లాంటిక్ సముద్రంలో పడిపోయేది.కనుక కాస్త రాష్ట్రం లోపలికి, తీరానికి దూరంగా వచ్చి బెలూన్ ని వదలవలసి వచ్చింది.
వదిలిన బెలూన్ ఎలా కదులుతుందో, ఎక్కడ తిరిగి భూమిని చేరుకుంటుందో తెలుసుకోడానికియూనివర్సిటీ ఆఫ్ వయోమింగ్ కి చెందిన బెలూన్ ట్రాజెక్టరీ వెబ్ సైట్ ని సంప్రదించారు. బెలూన్ల కదలికలకి సంబంధించిన సమాచారం ఈ వెబ్ సైట్ లో ఉంటుంది.
Canon Hacker’s Development Kit ని వాడి కెమేరాని తమకి అవసరమైన విధంగా ప్రోగ్రాం చేసుకున్నారు జస్టిన్, ఆలివర్ లు. ఐదు నిముషాలకి ఒక సారికెమేరా దానికదే ఫోటోలు తీసేలా ప్రోగ్రాం చేశారు. పైగా ఐదు గంటల సేపు తీసే ఫోటోలు సరిపోయేలాఅదనంగా ఓ 8-GB మెమరీ కార్డ్ కూడా కెమెరాలో జత చేశారు.
పైన కనిపిస్తున్న చిత్రం ఈ 93,000 అడుగుల ఎత్తు నుండి, అంటే 18 మైళ్లకి కాస్త తక్కువఎత్తు నుండి తీయబడింది. (అంతర్జాతీయ విమానాలు ఎగిరే ఎత్తు కేవలం 30-35 వేల అడుగులే.) లెక్క ప్రకారం అంతరిక్షం లోకి ప్రవేశించాలంటే 100 km ఎత్తు చేరాలి.ఆ అంతరిక్షపు సరిహద్దుని కార్మన్ రేఖ అంటారు. అంత తక్కువ ఎత్తు నుండి తీసినాగోళాకారపు భూమి యొక్క అందంగా కనిపిస్తోంది.
కాని ఆ ఎత్తులో పీడనం తక్కువ కనుకబెలూన్ పేలిపోయి కెమేరా ఉన్న పెట్టె కింద పడిపోయింది. ఓ నలభై నిముషాల పాటు భద్రంగా ప్రయాణించినకెమేరా పెట్టె భూమికి తిరిగొచ్చింది.
ఈ ప్రయోగం పేరు ప్రాజెక్ట్ ఐకరస్. ఈ ఐకరస్ ఓ గ్రీకు పౌరాణిక పాత్ర పేరు. రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగరడానికి ప్రయత్నించి, చివరికి ప్రాణాలు కోల్పోతాడు.


దృగ్గోచర కాంతి మితి – 10వ క్లాసు పాఠంలో దోషాలు
91 పేజీలో
“ 1 ల్యూమెన్ = 1 ఎర్గ్/సె/స్టెరేడియన్/ కాండెలా/స్టెరేడియన్ అవుతుంది” – (1)
అని వుంది. ఈ సూత్రం తప్పు.

ల్యూమెన్ = కాండెలా X స్టెరేడియన్, (2)
అన్నది సరైన సూత్రం.

పై సూత్రం అచ్చుతప్పు అయ్యుంటుంది అనుకోవాలా?
1 ల్యూమెన్ = 1 ఎర్గ్/సె = కాండెలా X స్టెరేడియన్, (3)
అని వుండాల్సింది అలా తప్పుగా అచ్చయ్యింది అనుకొవాలా? కాని (3) కూడా పూర్తిగా సరైనది కాదు.
ల్యూమెన్ కి ఎర్గ్/సె (=సామర్థ్యం లేదా power) కి మధ్య సంబంధం పైన సూత్రంలో సూచింపబడుతోంది అనుకుంటే దాని సంగతేంటో చూద్దాం.

నిజంగానే ల్యూమెన్ కి సామర్థ్యనికి సూటిగా సంబంధం లేదు గాని, ల్యూమెన్ కి సామర్థ్యం/వైశాల్యం కి (దీని ఎస్. ఐ. యూనిట్లు W/m2) మధ్య సంబంధం వుంది.

కాంతి ఒక విధమైన శక్తి రూపం కనుక, కాంతి అభివాహానికి (ల్యూమెన్) శక్తి ప్రవాహానికి మధ్య సంబంధం ఉండి ఉండాలి. అయితే ఆ సంబంధం నిర్ణయించడం అంత సులభం కాదు. ఇక్కడ ముందుగా మనం ఒకటి గమనించాలి. దృగ్గోచర కాంతి మితి అనేది కంటికి కనిపించే కాంతి యొక్క మితి. కంటికి కనిపించకపోతే అక్కడ కాంతి అభివాహం లేనట్టే లెక్క.

ఉదాహరణకి ఒక పరారుణ (infrared) జనకం లోంచి ఉద్గారమయ్యే కాంతి దృశ్య వర్ణపటానికి బయట ఉంది కనుక కంటికి కనిపించదు. దాని నుండి వచ్చే కాంతి అభివాహం విలువ సున్నా ల్యూమెన్ లు. అంత మాత్రాన అందులో శక్తి లేదని కాదు.

మనిషి కన్ను 550 nm తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతికి బాగా సునిశితంగా స్పందిస్తుంది. ఇది దృశ్య కాంతిలో ఆకుపచ్చ రంగుకి సన్నిహితంగా ఉంటుంది. ఈ తరంగదైర్ఘ్యం గల కాంతి, దానికి పరిసరాలలో ఉన్న కాంతులు, మాత్రమే ‘కాంతి అభివాహం’లో అధిక భాగం పంచుకుంటాయి.

ఉదాహరణకి రెండు విభిన కాంతి జనకాలని పరిగణిద్దాం. రెండింటి నుండి వచ్చే కాంతి (లేదా వికిరణ శక్తి, radiation) యొక్క మొత్తం సామర్థ్యం 1 వాట్ అనుకుందాం.

ఒకటవ జనకం యొక్క వర్ణపటంలో, కింది చిత్రం లో చుపినట్టుగా, ఎన్నో తరంగదైర్ఘ్యాలు ఉన్నాయి. దానిలో ఉన్న 1 వాట్ సామర్థ్యం ఎన్నో తరంగదైర్ఘ్యాల మీదుగా పంచబడి వుంది. వాటిలో ఆకుపచ్చ రంగు, దాని ఇరుగుపొరుగు రంగులు మాత్రమే కంట్లో స్పందన కలుగజేసి ‘కాంతి అభివాహం’ రూపంలో కనిపిస్తాయి. వర్ణపటంలో దృశ్య కాంతికి సంబంధించని పౌనఃపున్యాలన్నీ ఈ దృగ్గోచర కాంతిమితిలో భాగం కావు.రెండవ జనకం యొక్క వర్ణపటంలో, కింది చిత్రం లో చూపినట్టుగా, ఎక్కువగా 550 nm తరంగదైర్ఘ్యం పరిసరాలలో వున్న ఆకుపచ్చ రంగు మాత్రమే వుంది. అందులోని 1 వాట్ సామర్థ్యం అంతా ఆ ఒక్క తరంగదైర్ఘ్యం సమీపంలోనే కేంద్రీకృతం అయి వుంది. అలాంటి జనకం నుండి వచ్చే కాంతి అభివాహం ఎక్కువగా ఉంటుంది.
పై రెండు జనకాల గురించి ఒక చిన్న వ్యాఖ్యానం చెయ్యొచ్చు. ఇంట్లో వెలుగు కోసం పై రెండు జనకాల్లో దేన్ని వాడుతారు? నిశ్చయంగా రెండవ దాన్నే. ఎందుకంటే రెండవ జనకంలో శక్తి అంతా కేవలం దృశ్యకాంతికి చెందిన పౌనఃపున్యాల వద్ద, ముఖ్యంగా కన్ను బాగా స్పందించే 550 nm తరంగదైర్ఘ్యం వద్ద ఉంది. కనుక శక్తి వృధా కావడం లేదు. మొదటి జనకంలో కూడా 1 W సామర్థ్యమే ప్రవేశపెడుతున్నా, అది దృశ్యకాంతికి చెందిన పౌనఃపున్యాలకి అవతల ఉన్న పౌనఃపున్యాలలో ఎక్కువగా విస్తరించి వుంది. కనుక ఇందులో శక్తి మరింత ఎక్కువగా వృధా అవుతుంది.


ఒక జనకంలో ప్రవేశపెట్టే సామర్థ్యంలో ఎంత భాగం దృశ్యకాంతి శక్తి రూపంలో అభివ్యక్తం అవుతుంది అన్న దాని మీద ఆ జనకం యొక్క సమర్థత అర్థమవుతుంది. దానికి సంబంధించిన భావన ఒకటి పరిచయం చేసుకుందాం.


ఒక వాట్ సామర్థ్యం గల కాంతి జనకం నుండి వచ్చే కాంతి అభివాహం (ల్యూమెన్లు) ని ఆ జనకం యొక్క ల్యూమినస్ ఎఫికసీ (luminous efficacy) అంటారు.

1 Watt సామర్థ్యం ఉన్న ఆకుపచ్చ కాంతి (తరంగదైర్ఘ్యం = 550 nm) జనకం నుండి వచ్చే కాంతి యొక్క ‘అభివాహం’ విలువ 683 ల్యూమెన్లు ఉంటుంది అని ప్రయోగం వల్ల తేలింది.
అంటే 1 వాట్ సామర్థ్యం గల కాంతి జనకం నుండి 683 ల్యూమెన్ల కన్నా తక్కువ కాంతి అభివాహం వెలువడితే ఆ జనకం యొక్క ‘ల్యూమినస్ ఎఫికసీ’ తక్కువ అని అర్థం చేసుకోవాలి.

వివిధ కాంతి జనకాల ల్యూమినస్ ఎఫికసీ-
1) Incandescent lamp = 14 lumens/watt
ఇది మనం ఇంట్లో వాడే ‘పచ్చ బల్బు.’ ఈ రకం బల్బు నుండి వేడి ఎక్కువ పుడుతుంది. కనుక ఒక వాట్ లో అధిక శాతం వేడి రూపంలో పోతుంది. అందుకే దీన్ని తాకితే వేడిగా ఉంటుంది. ఈ కారణం చేతనే ఈ రకం బల్బులని పసికందులని ఉంచే ‘ఇంక్యుబేటర్లలో గాలిని వెచ్చగా ఉంచడానికి వాడుతారు. అందుకే దీని నుండి పుట్టే ల్యూమెన్లు తక్కువ.

2) Fluorescent lamp = 43 lumens/watt
ఇది మనం ఇంట్ళో వాడే ‘ట్యూబ్ లైటు.’ దీని నుండి వేడి తక్కువ పుడుతుంది. అందుకే ట్యూబ్ లైట్ ని తాకినా మరీ వేడిగా ఉండదు. కనుకనే దీని నుండి పుట్టే ల్యూమెన్లు కాస్త ఎక్కువ.

౩) Halogen lamp = 58 lumens/watt
వీధి దీపాల్లో వాడే హాలొజెన్ లాంపుల నుండి పుట్టే కాంతి మరి కాస్త ఎక్కువ.

పాఠంలో ‘లూమినస్ ఎఫికసీని’ కాండిల్ సామర్థ్యం (candle power) అన్నారు. ఇది చాలా తప్పు. కాండిల్ సామర్థ్యం అనేది ‘కాంతి తీవ్రత’కి యూనిట్. ఆధునిక ప్రమాణాల ప్రకారం కాండిల్ సామర్థ్యం అన్నా ‘కాండెలా’ అన్నా ఒకటే.

ఆఖరు ఉపన్యాసం

Posted by V Srinivasa Chakravarthy Monday, January 9, 2012 2 comments
ఈ పోస్ట్ లో రాండీ పాష్ రాసిన ‘Last Lecture’ అన్న పుస్తకం నుండి ఒక వృత్తాంతాన్ని వర్ణిస్తాను.


రాండీ పాష్ కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా ఉండేవాడు. 2008 లో పాంక్రియాటిక్ కాన్సర్ తో మరణించాడు. తన చివరి రోజులలో రాసిన Last Lecture అనే ఆత్మకథకి చాలా మంచి పేరు వచ్చింది.

అందులో ఒక అధ్యాయంలో రాండీ ఒక కోర్సులో తన స్టూడెంట్లతో జరిగిన అనుభవాన్ని వర్ణిస్తాడు. కొద్దిగా ప్రోత్సాహం ఇస్తే చాలు విద్యార్థులు తమకి మామూలుగా సాధ్యమైన దాని కన్నా ఎంతో ఎత్తుకు వెళ్ళి తమ టీచర్లని ఆశ్చర్యపరుస్తారు అని రాండీకి ఆ అనుభవంలో ఋజువు అవుతుంది.

రాండీ ‘building virtual worlds’ అనే కోర్సు చెప్పేవాడు. ఆ క్లాసులో వివిధ రంగాలకి చెందిన విద్యార్థులు ఉన్నారు. “సాహిత్యం, శిల్పకళ, అభినయం మొదలైన కళారంగాల నుండి మాత్రమే కాకుండా, ఇంజినీరింగ్, లెక్కలు, కంప్యూటర్ సైన్స్” ఇలా నానా రంగాల నుండి వచ్చారు. ఒక కృతక ప్రపంచం (virtual world) నిర్మించడం వాళ్ల క్లాస్ ప్రాజెక్ట్ గా ఇవ్వబడింది.

ప్రాజెక్ట్ లో ముఖ్య నియమాలు రెండు – అశ్లీలత, హింస ఎక్కడా కనిపించకూడదు. ఈ పిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్ లో ఎలాగూ ఈ రెండు అంశాలూ పుష్కలంగా ఉంటాయి. కనుక కొత్త పంథాలు తొక్కాల్సి వచ్చింది. నలుగురేసి మంది ఉన్న బృందాలు గా ఏర్పడ్డారు. గొప్ప వైవిధ్యం గన నేపథ్యాల నుండి వచ్చిన మనసుల కలయిక లోంచి సృజన పుడుతుంది అంటారు. రాండీ క్లాసులో సరిగ్గా అదే జరిగింది.

మొట్టమొదటి సారి ఈ కోర్సు ఇచ్చినప్పుడు రాండీ విద్యార్థులు ప్రదర్శించిన సృజన చూసి ఆశ్చర్యపోయాడు. నిస్సందేహంగా అందరికీ ‘ఏ’ గ్రేడ్లు ఇచ్చి తీరాల్సిందే అనుకున్నాడు. కాని అందరికీ ‘ఏ’ గ్రేడులు ఇవ్వడంలో అర్థం లేదనిపించి, ఏం చెయ్యాలో పాలుపోక తన గురువైన ఆండీ వాన్ డామ్ అనే ప్రొఫెసర్ ని సలహా అడిగాడు.

ఆండీ ఇచ్చిన సలహా ఇది – “రేపు క్లాస్ కి వెళ్లి వాళ్ళ కళ్లలోకి సూటిగా చూసి ఇలా చెప్పు – ‘చూడండి నేస్తాలూ! మీరు చేసింది బావుంది. కాదనను. కాని మీలో ఇంతకన్నా సత్తా వుందని నా నమ్మకం.’ “ ఆండీ చెప్పినట్టే చేశాడు రాండీ.

పిల్లలు పన్లోకి దిగారు. సృజన కట్టలు తెంచుకుంది. ప్రమాణాలు పెరుగుతూ పోయాయి. ఆ విషయమై రాండీ ఇలా రాస్తాడు – “ఆ ప్రాజెక్ట్ లు చూస్తే దిమ్మ దిరిగిపోయింది. కొండల మీంచి కిందికి దూకే భీకర జలపాతాల మీద రాఫ్ట్ ల మీద ప్రయాణించే అనుభూతి నిచ్చింది ఒక ప్రాజెక్ట్. వెనీస్ నగరపు జలవీధులలో సాంప్రదాయక గొండోలా పడవల మీద విహరిస్తున్న అనుభూతి నిచ్చింది మరో ప్రాజెక్ట్. మరి కొందరు విద్యార్థులైతే పూర్తిగా ఊహాత్మక ప్రపంచాలని సృష్టించి అందులో ఏవో విచిత్రమైన, ముద్దులొలికే ప్రాణులకి ప్రాణప్రతిష్ఠ చేశారు. అలాంటి జీవాల గురించి వారి చిన్నతనంలో కలలు కనేవారేమో!”


చివరికి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్లు ఇచ్చే రోజు వచ్చింది. యాభై మంది ఉండాల్సిన క్లాసులో ఓ పెద్ద జనాభా హాజరు అయ్యింది. విద్యార్థుల తల్లిదండ్రులు, రూమ్మేట్లు ఇలా అయినవాళ్లు కానివాళ్లు ఉత్సాహంగా విచ్చేశారు.
ఈ కోర్సు ఇచ్చిన ప్రతీ ఏడూ ప్రెజెంటేషన్లు ఇచ్చే రోజు ఓ జాతరలా, పండగలా ఘనంగా జరిగేది.

విభిన్నమైన నేపథ్యాలకి చెందిన వ్యక్తులు ఒక సమస్య మీద కలిసి పనిచెయ్యడంలోనే ఉంది రహస్యం అంతా, అంటాడు రాండీ పాష్.

ఈ విజయ గాధ అక్కడితో ఆగలేదు.

డ్రామా విభాగానికి చెందిన డాన్ మారినెల్లీతో రాండీ పాష్ చేతులు కలిపాడు. సి.ఎమ్.యు. ఇచ్చిన సహకారంతో ఇద్దరూ ‘Entertainment technology center” (ETC)’ కి శ్రీకారం చుట్టారు. దానినొక ‘కలల కుటీరం’గా తీర్చిదిద్దారు.
ఆ కేంద్రం రెండేళ్ల మాస్టర్స్ ప్రోగ్రాం అందిస్తుంది. కళాకారులు, సాంకేతిక నిపుణులు అక్కడ కలిసి పనిచేస్తారు. తలకి తట్టిన ప్రతీ కలని సాకారం చేసుకోడానికి ఆ కేంద్రం ఓ వేదిక అయ్యింది.

ఈ ఎదుగుదల అంతా చూసిన కంపెనీలు కూడా ఆసక్తి చూపించాయి. విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి.

అక్కడితో ఆగక డాన్ మారినెల్లీ ETC కి ఆస్ట్రేలియాలో ఓ సాటిలైట్ కాంపస్ నిర్మించాడు. అలాంటి కాంపస్ లు కొరియాలోను, సింగపూర్ లోను కూడా నిర్మించాలని ఆలోచనలు ఉన్నాయి.

ఓ అందమైన ఆలోచనకి అత్యంత శ్రద్ధతో ప్రాణం పోసి పెంచి పెద్ద చేస్తే, ఆ ఆలోచన యొక్క జీవితకథ వినడానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. టీచర్లకి, స్టూడెంట్లకి – అంటే అందరికీ – ఈ కథ నచ్చుతుందని ఆశిస్తూ…

Reference:
Randy Pausch, The Last Lecture.

అధ్యాయం 15


ఎట్టకేలకు స్నెఫెల్ పర్వతం

ఐదువేల అడుగుల ఎత్తున్న పర్వతం స్నెఫెల్. దీనికి రెండు శిఖరాగ్రాలు ఉన్నాయి. ఈ ద్వీపం మీద స్ఫుటంగా కనిపించే ట్రాకైటిక్ పర్వతశ్రేణికి ఒక కొసలో ఉందీ పర్వతం. మేం ఉన్న చోటి నుండీ చూస్తే ధూసరవర్ణపు ఆకాశపు నేపథ్యంలో ఈ పర్వతపు రెండు తలలు పొడుచుకొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ శిరస్సులకి ఎవరో హిమాభిషేకం చేసినట్టు పక్కల నుండి తెల్లని మంచు జాలువారుతోంది.
ఇక ఇక్కడి నుండి దారి ఇరుకుదారి. అందరం ఓ వరుసలో ముందుకి సాగాం. మా బృందానికి హన్స్ ముందుండి దారి చూపిస్తున్నాడు. పక్క పక్కగా నడిచే వీలు లేకపోవడం వల్ల మాట్లాడుకునే అవకాశం లేకపోయింది. స్టాపీ ఫోర్డ్ కి పక్కగా వుండే బేసాల్టిక్ ప్రాకారాన్ని దాటాక ఓ కర్దమ నేల (*) పక్క నుండి వెళ్లాం. ఆ ద్వీపకల్పానికి చెందిన ప్రాచీన వృక్షజాతులతో ఏర్పడ్డ బొగ్గు సరస్సు అది. ఈ బొగ్గు సరస్సుని ఇంధనంగా వాడుకుంటే మొత్తం ఐర్లాండ్ అంతటికీ ఓ శతాబ్దకాలం పాటు వెచ్చదనాన్ని అందిస్తుంది. ఇలాంటి సరస్సులు ఈ ప్రాంతంలో ఎన్నో చోట్ల ఉన్నాయి. కొన్ని చోట్ల వాటి లోతు డెబ్బై అడుగుల దాకా ఉంటుంది. ఆ లోతుల్లో కర్బనీకృత జీవ్యావశేషాల పొరలు, గాజులా గట్టిపడ్డ లావా పొరలు మారిమారి వస్తుంటాయి.

(* నీరు నిలువ ఉన్న చోట వృక్షసంపద కుళ్ళినప్పుడు కర్దమ నేల (bog) ఓ దట్టమైన పొరలా ఏర్పడుతుంది. అవశేషాలు క్రమంగా పేరుకుంటున్న సరస్సులలో గాని, ఆ సరస్సుల అంచుల వద్ద గాని ఇలాంటి నేల ఏర్పడుతుంది. ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉండడం వల్ల, కాలక్రమేణా అలా చిక్కుకున్న మొక్కలు కుళ్లి ‘పీట్’ అనే దట్టమైన నల్లని, చిక్కని పొరగా ఏర్పడుతాయి. ఆ ప్రాంతంలో పుట్టిన కొత్త మొక్కలు కూడా అదే పొరలో చివరికి సమసి ఆ పొరని ఇంకా పోషిస్తాయి. ఈ పీట్ పొర చిక్కని ద్రవరూపంలో ఉన్న బొగ్గు లాంటిది. ఐర్లాండ్, స్కాట్ లాండ్ మొదలైన ప్రాంతాల్లో ఈ ముద్దని కోసుకుని ఇంధనంగా వాడుతారు. మరిన్ని వివరాల కోసం –
http://www.ehow.com/how-does_4969793_bogs-form.html - అనువాదకుడు)


ఒక పక్క భవిష్యత్తు గురించి గుండెలో గుబులుగానే ఉన్నా నా చుట్టూ ఓ పురావస్తు నిలయంలో లాగా అందంగా అమరి వున్న సువిస్తార ఖనిజసంపదని చూసి అబ్బురపడకుండా ఉండలేకపోయాను. (ఎంతైనా మామకి తగ్గ అల్లుణ్ణి అనిపించుకోవాలిగా మరి!) వాటిని చూస్తుంటే ఐస్లాండ్ యొక్క భౌగోళిక స్వరూపం క్రమంగా స్పష్టం కాసాగింది.

ఈ విచిత్రమైన దీవి సముద్రపు లోతుల్లో నుండి పైకి పొడుచుకొచ్చి ఎంతో కాలం కాలేదు. ఇప్పటికీ అది ఇంకా పైకి లేస్తూ ఉండొచ్చు. ఇదంతా భూగర్భంలోంచి దీవిని పైకి తోస్తున అగ్నుల ప్రభావమే ననిపిస్తుంది. అదే నిజమైనతే సర్ హంప్రీ డేవీ ఆలోచనలు, సాక్నుస్సెం రహస్య సందేశాలు, మా మావయ్య విడ్డూరపు సిద్ధాంతాలు అన్నీ ఇట్టే మట్టిగలుస్తాయి. ఈ ఆలోచనతో అక్కడి భూమి ఉపరితలాన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలించడం మొదలెట్టాను. ఈ దీవి పుట్టుకకి కారణమైన శక్తుల తీరుతెన్నుల గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చాను.

(ఇంకా వుంది)దృగ్గోచర కాంతి మితి అన్న అంశం మీద లోగడ ఒక పోస్ట్ లో (http://scienceintelugu.blogspot.com/2011/12/blog-post_13.html)
నీటి ప్రవాహానికి, కాంతి ప్రవాహానికి మధ్య పోలిక గురించి చెప్పుకున్నాం. నీటి ప్రవాహం విషయంలో మూడు భావనలని పరిచయం చేశాము. అవి –
ప్రవాహం – దీన్ని cc/sec (క్యూసెక్కులు) లో కొలుస్తాం.
తీవ్రత = ప్రవాహం/కోణం. ఇది జనకం యొక్క ‘తీవ్రత’ని తెలుపుతుంది.
“ధాటి” = తీవ్రత/r. ధాటి అన్నది జనకం యొక్క తీవ్రత బట్టి పెరుగుతుంది, జనకం నుండి దూరం బట్టి తగ్గుతుంది.


పై మూడు భావాలని ఇప్పుడు కాంతికి వర్తింపజేద్దాం.

అభివాహం – నీటి విషయంలో ప్రవాహం ఎలాగో కాంతి విషయంలో ‘అభివాహం’ అలాంటిది. ఇంగ్లీష్ లో దీనికి ‘flux’ అన్న పదాన్ని వాడుతారు. దీని పూర్తి రూపం ‘light flux’ లేదా ‘కాంతి అభివాహం’. ఇంగ్లీష్ లో flow (అంటే ప్రవాహం) అన్న పదానికి flux అన్న పదం లాటిన్ మూలరూపం. నీటి ప్రవాహానికి యూనిట్ ‘క్యూసెక్’ అయినట్టే కాంతి అభివాహానికి యూనిట్ ‘లూమెన్.’ (lumen). దీన్ని ‘lm’ అన్న అక్షరలతో సూచిస్తారు.


కాంతి తీవ్రత –
నీటి ప్రవాహం యొక్క తీవ్రతని అంతకు ముందు మనం ఇలా నిర్వచించాం –
“ఒక యూనిట్ కోణం లోంచి పోయే ప్రవాహమే ‘తీవ్రత’.”
అదే విధంగా కాంతి తీవ్రత కూడా ఒక యూనిట్ కోణం లోంచి పోయే ‘కాంతి అభివాహం’ అవుతుంది.
అయితే ఇక్కడ యూనిట్ కోణం అన్న దానికి కాస్త కొత్త అర్థం ఇవ్వవలసి ఉంటుంది. ఇందాక ‘నీటి ప్రవాహం’ ఉదాహరణలో నీరు సమతలంలోనే ప్రవహిస్తుంది. కనుక తలానికి సంబంధించిన భావన అయిన ‘కోణం’ ని వాడడం జరిగింది. కాని కాంతి జనకం నుండి కాంతి త్రిమితీయ ఆకాశంలో (three dimensional space) అన్ని దిశలా ప్రవహిస్తుంది. త్రిమితీయ పరిస్థితుల్లో నిర్వచించబడ్డ ఓ కొత్త కోణమే ‘ఘనకోణం.’ దీని యూనిట్లు ‘స్టెరేడియన్లు.’ దీన్ని ‘sr’ అనే అక్షరలతో సూచిస్తారు.
(ఘన కోణం గురించి వివరణ ఈ పోస్ట్ లో - http://scienceintelugu.blogspot.com/2011/12/blog-post_23.html)

కనుక,
కాంతి తీవ్రత = కాంతి అభివాహం/ఘనకోణం
దీని యూనిట్ ‘లూమెన్/స్టెరేడియన్’ దీన్ని ‘lm/sr’ అని సూచిస్తారు. దీనికే ‘కాండెలా’ అని మరో పేరు కూడా ఉంది. దీన్ని ‘cd’ అని సూచిస్తారు. అంటే,
cd = lm/sr.

కాండెలా అన్న పదం ఎలా వచ్చింది?ఒక రాశిని కొలవాలి అంటే ముందు ఆ రాశికి ఒక ప్రామాణిక వస్తువుని తీసుకోవాలి. పొడవుని కొలవాలంటే ఫలానా పొడవుని ప్రమాణంగా తీసుకుంటాం. దానికి మీటర్ అనో, అడుగు అనో పేరు పెడతాం. అలాగే కంతి జనకాల్లో ఒక ప్రామాణిక ప్రకాశం గల జనకాన్ని తీసుకోవాలి. అప్పుడు దాని పరంగా దాని కన్నా ఎక్కువ ప్రకాశం గాని, తక్కువ ప్రకాశం గాని ఉన్న జనకాల ప్రకాశాన్ని సంఖ్యాత్మకంగా వ్యక్తం చెయ్యొచ్చు.

పందొమ్మిదవ శతబ్దంలో (అప్పటికి విద్యుత్ దీపాలు లేవు) కొవ్వొత్తి (candle) ఒక సర్వసామాన్యమైన కాంతి జనకం కనుక కొవ్వొత్తిని అలాంటి ప్రామాణిక జనకంగా తీసుకున్నారు. అయితే కొవ్వొత్తిని ప్రమాణాంగా తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కలగొచ్చు. ఎందుకంటే పెద్ద కొవ్వొత్తుల నుండి, చిన్న కొవ్వొత్తుల కన్నా ఎక్కువ ప్రకాశం పుడుతుంది. అలాగే కొవ్వొత్తిలోని మైనం రకం బట్టి కూడా ప్రకాశం మారుతుంది. కనుక కచ్చితంగా ఒక ప్రత్యేకమైన పొడవు, మందం కలిగి ఒక రకమైన మైనంతో (దీన్ని స్పెర్మసెటీ మైనం అంటారు) తయారుచెయ్యబడ్డ కొవ్వొత్తిని ప్రామాణాత్మక కాంతి జనకంగా ఎంచుకున్నారు. (స్పెర్మ్ తిమింగలం తల నుండి తీసే ఒక ప్రత్యేకమైన మైనాన్ని స్పెర్మసెటీ అంటారు. దీంతో చేసిన కొవ్వొత్తులు బాగా వెలిగేవట.) అలాంటి కొవ్వొత్తి యొక్క తీవ్రతే ‘కాండెలా’.


వివిధ కాంతి జనకాల తీవ్రతలు -సూర్యుడి కాంతి తీవ్రత (రమారమి) = 10^23 cd
25 W ల సామర్థ్యం గల కంపాక్ట్ ఫ్లోరెసెంట్ బల్బ్ యొక్క కాంతి తీవ్రత = 135 cd
ఒక లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్. ఇ. డి) యొక్క కాంతి తీవ్రత = 15 milli cd (1 milli cd = 1/1000 cd)

కాంతి తీవ్రతకి, మొత్తం అభివాహానికి మధ్య సంబంధం
ఒక కాంతి జనకం నుండి కాంతి అన్ని దిశలలోకి ప్రసరిస్తున్నప్పుడు, దాని నుండి వచ్చే మొత్తం కాంతి అభివాహం విలువ =
కాంతి తీవ్రత X బిందువు చుట్టూ మొత్తం ఘనకోణం
= కాంతి తీవ్రత X 4 pi

కాంతి తీవ్రతకి, కాంతి అభివాహానికి మధ్య తేడా తెలిపే ఉదాహరణలు –
1) ఒక 100 వాట్ బల్బు లోంచి ఎంతో కాంతి వెలువడుతుంది. అలాంటి జనకానికి కాంతి తీవ్రత ఎక్కువ. అందులోంచి వెలువడే కాంతి అభివాహం కూడా ఎక్కువే.
2) ఒక మిణుగురు పురుగు లోంచి తక్కువ కాంతి వెలువడుతుంది. అలాంటి జనకానికి కాంతి తీవ్రత తక్కువ. అందులోంచి వెలువడే కాంతి అభివాహం కూడా తక్కువే.
3) కాని ఒక లేజర్ పాయింటర్ లోంచి వెలువడే మొత్తం కాంతి అభివాహం తక్కువే అయినా, లేజర్ ప్రసారం అయ్యే దిశలో కాంతి తీవ్రత ఎక్కువ. ఎందుకంటే అతి చిన్న ఘనకోణంలో ఆ అభివాహం అంతా కేంద్రీకృతం అయి వుంటుంది. (అభివాహం/ఘనకోణం) విలువ ఎక్కువ అవుతుంది.

ఇందాక నీటి ప్రవాహం విషయంలో ‘ధాటి’ అన్న రాశిని ఇలా నిర్వచించాం - ‘జనకం నుండి r దూరంలో ఒక యూనిట్ వ్యాసం గల గొట్టం లోంచి పోయే ప్రవాహం విలువ.’ కాంతి విషయంలో దీన్ని పోలిన రాశినే ఇల్యూమినెన్స్ అంటారు.


ఇల్యూమినెన్స్ (Illuminance)-
ఒక యూనిట్ వైశాల్యం లోంచి పోయే అభివాహం యొక్క విలువే ఇల్యూమినెన్స్. కాంతి జనకం నుండి దూరం పెరుగుతున్న కొద్ది దీని విలువ వేగంగా తగ్గుతుంది. కాంతి త్రిమితీయ ఆకాశంలో (three-dimensional space) ప్రసరిస్తుంది కనుక, r వ్యాసార్థం గల వృత్తానికి బదులు, r వ్యాసార్థం గల గోళాన్ని తీసుకోవాలి.
కాంతి జనకం యొక్క తీవ్రత = I
గోళం ఉపరితల వైశాల్యం = 4 pi r^2
గోళం లోంచి పోయే మొత్త అభివాహం విలువ = I X 4 pi
అందులో, యూనిట్ వైశాల్యం గల ప్రాంతం లోంచి పోయే అభివాహం విలువ = I X 4 pi X (1/4 pi r^2)= I/r^2
కనుక ఇల్యూమినెన్స్ అనేది దూరం యొక్క వర్గానికి విలోమంగా మారుతుంది.
ఇల్యూమినెన్స్ యూనిట్లు = cd * sr/ m^2 = lm/m^2

గురుత్వం విషయంలో ‘వర్గవిలోమ నియమం’ (inverse square law) ఉన్నట్టే, కాంతిమితి విషయంలో కూడా ఒక ‘వర్గవిలోమ నియమం’ ఉండడం విశేషం.
ఇల్యూమినెన్స్ అన్న భావన పదవక్లాసు పాఠం “దృగ్గోచర కాంతిమితి” లో లేదు. కాని ఆ పాఠంలో కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలని సవరించే ప్రయత్నంలో ఇల్యూమినెన్స్ అన్న భావనని పరిచయం చెయ్యవలసి ఉంటుంది. పాఠంలోని దోషాల గురించి మరో పోస్ట్ లో…(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email