అతి క్రూరంగా ప్రవర్తించి జామొరిన్ మీద, స్థానికుల మీద ప్రతీకారం తీర్చుకున్న వాస్కో ద గామా మార్చ్ 5, 1503, నాడు తిరిగి పోర్చుగల్ కి పయనమయ్యాడు. సెప్టెంబర్ 1 నాడు నౌకాదళం లిస్బన్ ని చేరుకుంది. మహారాజు మాన్యుయెల్ వాస్కో కి ఘనస్వాగతం పలికాడు. పెద్ద మొత్తంలో ధనం బహుమానంగా ఇచ్చి ఆదరించాడు. ఈ డబ్బుతో వాస్కో ద గామా ఎవోరా లో ఓ పెద్ద భవంతి కట్టుకున్నాడు. అయితే ఏనాటికైనా తన చిన్ననాటి ఊరు ‘సైన్స్’ (Sines) ని సొంతం చేసుకోవాలన్న కల మాత్రం తన మదిని వీడలేదు.
(చిత్రం - సైన్స్ నగరంలో వాస్కో ద గామా స్మారక చిహ్నం)
కాని సైన్స్ ని సొంతం చేసుకోడానికి కొన్ని అవరోధాలు ఉన్నాయి. ఆ ఊరు ‘సావో తియాగో’ అనే మతవర్గం హయాంలో ఉంది. ఈ వర్గం వారు ఆ ఊరిని రాజుకి అమ్మడానికి ఒప్పుకోలేదు. మతవర్గంతో పేచీ పెట్టుకుని ఊరిని బలవంతంగా లాక్కునేటంత ధైర్యం లేదు రాజుకి. ఇక గత్యంతరం లేక వాస్కో ద గామా స్వయంగా సైన్స్ కి వెళ్ళి అక్కడే ఓ ఇల్లు కట్టుకున్నాడు. పుట్టి పెరిగిన ఊళ్ళో గర్వంగా, మీసం మెలేసుకుని తిరిగేవాడు. ఆ ఊరి వారికే కాక సమస్త పోర్చుగీస్ జాతికీ మరి వాస్కో ద గామా జాతి గర్వపడదగ్గ అసమాన శూరుడు. అలాంటి వాడు తమ మధ్య జీవిస్తూ, తమ ఊరి వీధుల్లో సంచరించడం సైన్స్ పుర వాసులకి కూడా సంతోషం కలిగించింది.
ఇది తెలిసిన ‘సావో తియాగో’ మత వర్గానికి చెందిన అధికారులు వాస్కో తో తల గోక్కోవడం ఇష్టం లేక నేరుగా రాజుకే ఫిర్యాదు చేశారు. వాస్కో ఆ ఊరు వదిలి వెళ్లిపోవాలని ఆజ్ఞ ఇస్తూ, నెల రోజులు గడువు ఇచ్చాడు రాజు. రాజు మాట కాదనలేక వాస్కో ఊరు వదిలి వెళ్లినా, లోగడ రాజు తనకి ఇచ్చిన మాట ఇంకా నిలుపుకోలేదని ఓ సారి గుర్తుచేశాడు. ఇండియాకి మొదటి యాత్ర తరువాత రాజు తనకి ఇస్తానన్న పారితోషకం ఇంకా ఇవ్వలేదని మరో సారి జ్ఞాపకం చేశాడు.
మొదటి సారి వాస్కో ద గామా ఇండియా నుండి తిరిగి వచ్చాక, అతడు సాధించిన అనుపమాన విజయానికి గొప్ప పారితోషకం ఇస్తానని రాజు వరం ఇచ్చాడు. కాని ఒకసారి ఇండియా కి దారి తెలిశాక ఇక వాస్కో ద గామ అవసరం అంతగా లేదు. తెలిసిన దారి వెంట నౌకలని తీసుకుని ఇండియాకి వెళ్లగల నావికులు ఎంతో మంది ఉన్నారు. రాజు వాస్కో కి ఇచ్చిన ప్రమాణం గురించి పట్టించుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణం.
అందుకే మాట ఇచ్చి పదేళ్లు అయినా ఇంకా మాట నిలుపుకోకుండా తాత్సారం చెయ్యసాగాడు మాన్యుయెల్ రాజు. ఈ ఆలస్యం వాస్కో భరించలేకపోయాడు. ఒకసారి రాజు వద్దకి సూటిగా వెళ్ళిన్ నిలదీశాడు. మాట నిలుపుకోకపోతే ఇక పోర్చుగీస్ రాజు కొలువులో ఉండడం అనవసరం అని, మరో రాజుని ఆశ్రయించక తప్పదని హెచ్చరించాడు.
ఆ హెచ్చరికకి రాజు కాస్త కంగారు పడ్డాడు. ఏనాడైనా వాస్కో తో పని పడొచ్చు. కనుక తనతో ఊరికే కలహం పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు. కనుక ఏదో సర్దుబాటు చేస్తానని, మరొక్క ఏడాది వేచి ఉండమని సర్దిచెప్పి వాస్కో ని పంపించేశాడు. వాస్కో కి బహుమతిగా ఇవ్వడానికి ఎక్కడైనా తగినంత భూమి దొరుకుతుందేమో అని రాజు నాలుగు చోట్ల వాకబు చేశాడు. రాజు మేనల్లుడు ఒకడు తన అధికారంలో ఉన్న రెండు ఊళ్ళు రాజుకి అమ్ముతాను అన్నాడు. చివరికి 1519 డిసెంబర్ లో, రాజు తనకి మాట ఇచ్చిన ఇరవై ఏళ్ల తరువాత, వాస్కో ద గామాకి తనకి బహుమానంగా రావలసిన నేల దక్కింది.
వాస్కో ద గామా రెండవ యాత్ర తరువాత, ఆ దారి వెంట ఎన్నో పోర్చుగీస్ ఓడలు ఇండియాకి పయనమయ్యాయి. నావికులకి ఈ మార్గంలో పవనాలు ఏ కాలంలో ఏ దిశలో వీస్తాయో అన్నీ తెలిసిపోయాయి. కనుక ఆ పవనాలని తగు రీతిలో వాడుకుంటూ తమ యాత్రా మార్గాలని రూపొందించుకుంటూ వచ్చారు. 1500 నుండి 1504 వరకు ఎక్కువగా వాణిజ్య నౌకలే ఇండియాకి పయనం అయ్యాయి.
తొలి దశల్లో వాస్కో బృందం చేసినట్టు అందిన చోట అందినట్టు కొల్లగొట్టుకు వచ్చే పద్ధతి ఎంతో కాలం సాగదు. వాణిజ్యం సజావుగా సాగాలంటే అన్ని పక్షాల వారు ఒక చట్టబద్ధమైన వ్యవస్థకి ఒడంబడి ఉండాలి. అలాంటి వ్యవస్థ యొక్క సంస్థాపనలో మొదటి మెట్టుగా మహరాజు మాన్యుయెల్ ఇండియాలో వైస్రాయ్ అనే పదవిని స్థాపించాడు. ఎలగైనా స్థానిక ముస్లిమ్ వర్తకులకి అక్కణ్ణుంచి తరిమేయాలని రాజు పన్నాగం. అందుకోసం ముందు అక్కడ పోర్చుగీస్ అధికారంలో ఉండే ఓ మండలాన్ని స్థాపించాలి.
అలాంటి మండలాన్ని స్థపించడానికి పశ్చిమ తీరంలోనే ఉన్న గోవా నగరం అన్ని విధాలా సౌకర్యంగా అనిపించింది. పోర్చుగీస్ సామంత ప్రాంతంగా గోవా వేగంగా ఎదిగింది. అయితే ఆ విస్తరణ సామరస్యంగా సాగలేదు. మొత్తం వాడలు తుడిచి పెట్టుకుపోయాయి. ఎంతో మంది జైలుపాలు అయ్యారు. వారిలో ఎంతో మంది జైల్లోనే నానా చిత్ర హింసకీ గురై హతం అయ్యారు. కనుక ఎంత వేగంగా ఎదిగిందో, అంతే వేగంగా ఆ ప్రాంతం పతనం అయ్యింది. గోవా ప్రాంతం అరాచకం అయ్యింది. సభ్య సమాజానికి ఉండాల్సిన లక్షణాలు కనుమరుగు అయ్యాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండేవారు జనం. ప్రతి ఒక్కరూ అవతలి వారిని ఎలా దొంగ దెబ్బ తీసి ముందుకు పోదామా అనే ఆలోచనలో ఉండేవారు. “నెత్తురు, అత్తరు కలగలసిన దారుణ మిశ్రమం…” అంటాడు ఆ పరిస్థితిని వర్ణిస్తూ ఓ పోర్చుగీస్ రచయిత.
ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి దక్షుడు, నిజాయితీ పరుడు అయిన ఓ పాలకుడు కావాలి. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ వాస్కో ద గామా రంగప్రవేశం చేశాడు.
(ఇంకా వుంది)
0 comments