ఈ పోస్ట్ లో రాండీ పాష్ రాసిన ‘Last Lecture’ అన్న పుస్తకం నుండి ఒక వృత్తాంతాన్ని వర్ణిస్తాను.
రాండీ పాష్ కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా ఉండేవాడు. 2008 లో పాంక్రియాటిక్ కాన్సర్ తో మరణించాడు. తన చివరి రోజులలో రాసిన Last Lecture అనే ఆత్మకథకి చాలా మంచి పేరు వచ్చింది.
అందులో ఒక అధ్యాయంలో రాండీ ఒక కోర్సులో తన స్టూడెంట్లతో జరిగిన అనుభవాన్ని వర్ణిస్తాడు. కొద్దిగా ప్రోత్సాహం ఇస్తే చాలు విద్యార్థులు తమకి మామూలుగా సాధ్యమైన దాని కన్నా ఎంతో ఎత్తుకు వెళ్ళి తమ టీచర్లని ఆశ్చర్యపరుస్తారు అని రాండీకి ఆ అనుభవంలో ఋజువు అవుతుంది.
రాండీ ‘building virtual worlds’ అనే కోర్సు చెప్పేవాడు. ఆ క్లాసులో వివిధ రంగాలకి చెందిన విద్యార్థులు ఉన్నారు. “సాహిత్యం, శిల్పకళ, అభినయం మొదలైన కళారంగాల నుండి మాత్రమే కాకుండా, ఇంజినీరింగ్, లెక్కలు, కంప్యూటర్ సైన్స్” ఇలా నానా రంగాల నుండి వచ్చారు. ఒక కృతక ప్రపంచం (virtual world) నిర్మించడం వాళ్ల క్లాస్ ప్రాజెక్ట్ గా ఇవ్వబడింది.
ప్రాజెక్ట్ లో ముఖ్య నియమాలు రెండు – అశ్లీలత, హింస ఎక్కడా కనిపించకూడదు. ఈ పిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్ లో ఎలాగూ ఈ రెండు అంశాలూ పుష్కలంగా ఉంటాయి. కనుక కొత్త పంథాలు తొక్కాల్సి వచ్చింది. నలుగురేసి మంది ఉన్న బృందాలు గా ఏర్పడ్డారు. గొప్ప వైవిధ్యం గన నేపథ్యాల నుండి వచ్చిన మనసుల కలయిక లోంచి సృజన పుడుతుంది అంటారు. రాండీ క్లాసులో సరిగ్గా అదే జరిగింది.
మొట్టమొదటి సారి ఈ కోర్సు ఇచ్చినప్పుడు రాండీ విద్యార్థులు ప్రదర్శించిన సృజన చూసి ఆశ్చర్యపోయాడు. నిస్సందేహంగా అందరికీ ‘ఏ’ గ్రేడ్లు ఇచ్చి తీరాల్సిందే అనుకున్నాడు. కాని అందరికీ ‘ఏ’ గ్రేడులు ఇవ్వడంలో అర్థం లేదనిపించి, ఏం చెయ్యాలో పాలుపోక తన గురువైన ఆండీ వాన్ డామ్ అనే ప్రొఫెసర్ ని సలహా అడిగాడు.
ఆండీ ఇచ్చిన సలహా ఇది – “రేపు క్లాస్ కి వెళ్లి వాళ్ళ కళ్లలోకి సూటిగా చూసి ఇలా చెప్పు – ‘చూడండి నేస్తాలూ! మీరు చేసింది బావుంది. కాదనను. కాని మీలో ఇంతకన్నా సత్తా వుందని నా నమ్మకం.’ “ ఆండీ చెప్పినట్టే చేశాడు రాండీ.
పిల్లలు పన్లోకి దిగారు. సృజన కట్టలు తెంచుకుంది. ప్రమాణాలు పెరుగుతూ పోయాయి. ఆ విషయమై రాండీ ఇలా రాస్తాడు – “ఆ ప్రాజెక్ట్ లు చూస్తే దిమ్మ దిరిగిపోయింది. కొండల మీంచి కిందికి దూకే భీకర జలపాతాల మీద రాఫ్ట్ ల మీద ప్రయాణించే అనుభూతి నిచ్చింది ఒక ప్రాజెక్ట్. వెనీస్ నగరపు జలవీధులలో సాంప్రదాయక గొండోలా పడవల మీద విహరిస్తున్న అనుభూతి నిచ్చింది మరో ప్రాజెక్ట్. మరి కొందరు విద్యార్థులైతే పూర్తిగా ఊహాత్మక ప్రపంచాలని సృష్టించి అందులో ఏవో విచిత్రమైన, ముద్దులొలికే ప్రాణులకి ప్రాణప్రతిష్ఠ చేశారు. అలాంటి జీవాల గురించి వారి చిన్నతనంలో కలలు కనేవారేమో!”
చివరికి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్లు ఇచ్చే రోజు వచ్చింది. యాభై మంది ఉండాల్సిన క్లాసులో ఓ పెద్ద జనాభా హాజరు అయ్యింది. విద్యార్థుల తల్లిదండ్రులు, రూమ్మేట్లు ఇలా అయినవాళ్లు కానివాళ్లు ఉత్సాహంగా విచ్చేశారు.
ఈ కోర్సు ఇచ్చిన ప్రతీ ఏడూ ప్రెజెంటేషన్లు ఇచ్చే రోజు ఓ జాతరలా, పండగలా ఘనంగా జరిగేది.
విభిన్నమైన నేపథ్యాలకి చెందిన వ్యక్తులు ఒక సమస్య మీద కలిసి పనిచెయ్యడంలోనే ఉంది రహస్యం అంతా, అంటాడు రాండీ పాష్.
ఈ విజయ గాధ అక్కడితో ఆగలేదు.
డ్రామా విభాగానికి చెందిన డాన్ మారినెల్లీతో రాండీ పాష్ చేతులు కలిపాడు. సి.ఎమ్.యు. ఇచ్చిన సహకారంతో ఇద్దరూ ‘Entertainment technology center” (ETC)’ కి శ్రీకారం చుట్టారు. దానినొక ‘కలల కుటీరం’గా తీర్చిదిద్దారు.
ఆ కేంద్రం రెండేళ్ల మాస్టర్స్ ప్రోగ్రాం అందిస్తుంది. కళాకారులు, సాంకేతిక నిపుణులు అక్కడ కలిసి పనిచేస్తారు. తలకి తట్టిన ప్రతీ కలని సాకారం చేసుకోడానికి ఆ కేంద్రం ఓ వేదిక అయ్యింది.
ఆ కేంద్రం రెండేళ్ల మాస్టర్స్ ప్రోగ్రాం అందిస్తుంది. కళాకారులు, సాంకేతిక నిపుణులు అక్కడ కలిసి పనిచేస్తారు. తలకి తట్టిన ప్రతీ కలని సాకారం చేసుకోడానికి ఆ కేంద్రం ఓ వేదిక అయ్యింది.
ఈ ఎదుగుదల అంతా చూసిన కంపెనీలు కూడా ఆసక్తి చూపించాయి. విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి.
అక్కడితో ఆగక డాన్ మారినెల్లీ ETC కి ఆస్ట్రేలియాలో ఓ సాటిలైట్ కాంపస్ నిర్మించాడు. అలాంటి కాంపస్ లు కొరియాలోను, సింగపూర్ లోను కూడా నిర్మించాలని ఆలోచనలు ఉన్నాయి.
ఓ అందమైన ఆలోచనకి అత్యంత శ్రద్ధతో ప్రాణం పోసి పెంచి పెద్ద చేస్తే, ఆ ఆలోచన యొక్క జీవితకథ వినడానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. టీచర్లకి, స్టూడెంట్లకి – అంటే అందరికీ – ఈ కథ నచ్చుతుందని ఆశిస్తూ…
Reference:
Randy Pausch, The Last Lecture.
Reference:
Randy Pausch, The Last Lecture.
విభిన్నమైన నేపథ్యాలకి చెందిన వ్యక్తులు ఒక
సమస్య మీద కలిసి పనిచెయ్యడంలోనే ఉంది
రహస్యం అంతా
baavundi sir