శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

సర్ ఐజాక్ న్యూటన్

Posted by V Srinivasa Chakravarthy Thursday, September 29, 2011 15 comments
(ఎప్పుడే నేనే ఏదో సోది రాయడం కాకుండా తెలుగులో సైన్సు రాయాలనుకునే ఔత్సాహికుల రచలనని ఈ బ్లాగ్లో పోస్ట్ చెయ్యాలనే కార్యక్రమంలో మొదటి మెట్టుగా ‘సర్ ఐజాక్ న్యూటన్’ జీవితం మీద ఓ వ్యాసం… శ్రీ.చ.)

సర్ ఐజాక్ న్యూటన్ (డిసెంబరు 25, 1642 - మార్చి 20, 1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలొ అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. "ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్సు గా ఎలా పరిణామం చెందింది" అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవిస్తుంది.

సర్ ఐజాక్ న్యూటన్ ఊల్స్ తోర్ప్, లింకన్ షైర్, ఇంగ్లాండ్ లో డిసెంబర్ 25, 1642 సంవత్సరమున జన్మించాడు. ఆరోగ్యం సహకరించక పోయినప్పటికీ , న్యూటన్ 85 సంవత్సరాల వయస్సు వరకు జీవించి, మార్చి 20, 1727 న కెన్సింగ్టన్ పట్టణము నందు మరణించారు.

న్యూటన్ జన్మించిన సమయంలో అతను నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా బరువు తక్కువగాను, బలహీనంగాను ఉండేవాడు. చూసినవాళ్లంతా అసలీ శిశువు బ్రతుకుతాడా అనుకున్నారు. న్యూటన్ తండ్రి న్యూటన్ జననానికి మూడు నెలల ముందు మరణించారు. న్యూటన్ తన తల్లి సంరక్షణ క్రింద 3 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. తరువాత న్యూటన్ కేవలం 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె బార్ స్మిత్ అనే ఆయన్ను రెండవ వివాహం చేసుకున్నారు. అందువలన న్యూటన్ తన చిన్నతనంలో తన తల్లితండ్రుల ప్రేమ కోల్పోయి తన అమ్మమ్మ-తాతల వద్ద పెరగటం జరిగింది. న్యూటన్ తన బలహీనమైన ఆరోగ్యం వలన ఆటల వైపు ఎక్కువగా ఆసక్తి చూపించ లేదు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. న్యూటన్ 10 సంవత్సరముల వయస్సు లో ఉన్నప్పుడు తన సవతి తండ్రి కూడా మరణించాడు, అతని తల్లి ఊల్స్ తోర్ప్ కు తిరిగి వచ్చారు. ఆమె వ్యవసాయం మరియు పశువుల పై ఆసక్తి తీసుకోవడం ప్రారంభించారు.

12 ఏళ్ల వయస్సులో న్యూటన్ గ్రాన్థమ్ లోని గ్రామర్ స్కూలుకు పంపబఢ్డారు. అక్కడ అతని స్నేహితులలో చాలా మంది అమ్మాయిలు ఉండేవారు. న్యూటన్ గ్రామర్ స్కూల్ లో ఉన్నప్పుడు తన మేధోశక్తితో అందరిని ఆకట్టుకున్నారు. న్యూటన్ ఎల్లప్పుడూ భౌతిక, గణిత శాస్త్రాలకు సంబంధించిన సమస్యలను మాత్రమే పరిష్కరించటానికి ఇష్టపడేవారు. లైబ్రరీ లో చాలా సమయం అతను పుస్తక పఠనంలో గడిపేవారు.

న్యూటన్ ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జి వద్ద విద్యార్థిగా ఉన్నప్పుడు అతని తల్లి గ్రామంలో సహాయం కోసం కబురు చేశారు. న్యూటన్ 17 వ సంవత్సరములో ఉన్నప్పుడు ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జి నుండి ఊల్స్ తోర్ప్ తిరిగి రావడం జరిగినది. పల్లెలో నివసిస్తున్నప్పుడు, న్యూటన్ గొర్రెల మందలు మేస్తుండగా కాపలా కాసేవారు. ఈ పనిని న్యూటన్ చాలా అసహ్యించుకునేవారు.అనేక సార్లు న్యూటన్ గణిత శాస్త్ర సమస్యలలో మునిగిపోవడంతో ఒకటి లేదా రెండు గొర్రెలు ఎల్లప్పుడూ తప్పించుకొనేవి. తన అజాగ్రత్త వలన తీవ్రంగా మందలింపబడేవాడు. గణితంలో న్యూటన్ పట్ల ఎంతో ఆసక్తి చూసిన ఒక ఉపాధ్యాయుడు, న్యూటన్ ను ఉన్నత విద్యను అభ్యసించడానికి విశ్వవిద్యాలయానికి పంపండని న్యూటన్ తల్లి కి గట్టిగా చెప్పారు. ఆ ఉపాధ్యాయుడు న్యూటన్ యొక్క విద్యకు అయ్యే ఖర్చును భరించటానికి అంగీకరించారు. న్యూటన్ తిరిగి జూన్ 1661 లో మరోసారి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరి భౌతిక, గణిత శాస్త్రాల అధ్యయనం ప్రారంభించారు.

న్యూటన్ పేద విధ్యార్ధి అవటం వలన సహ విద్యార్థులు (ధనవంతులు) న్యూటన్ ను నిందించి ఆటపట్టించేవారు. కానీ అతి తక్కువ కాలంలోనే, న్యూటన్ అద్భుతమైన భౌతిక, గణిత శాస్త్ర సామర్ధ్యంతో తన తోటి విద్యార్ధుల గౌరవం పోందారు. తదుపరి కాలంలో న్యూటన్ విశ్వవిద్యాలయం లో మిగిలిన స్నేహితుల మరియు ఉపాధ్యాయుల ప్రశంసలను అందుకున్నారు. న్యూటన్ ట్రినిటీ కాలేజ్ నుంచి మెట్రిక్యులేషన్ పోందారు, కానీ స్కాలర్షిప్ పోందటంలో విఫలమయ్యారు. ఇలా జరగడం, తద్వారా ఖర్చులు పెరగడంతో న్యూటన్ చాలా కలవరపడ్డారు.


స్కాలర్షిప్ లేకుండా ఉన్నత విద్యను కొనసాగించడం సాధ్యపడదని ఆయన గ్రహించారు. న్యూటన్ ఎంతో ప్రయత్నించినా, మార్కులు తక్కువ వచ్చిన కారణంగా స్కాలర్షిప్ మీద ఆశలు వదులుకున్నారు. అయినప్పటికి యూనివర్సిటీ బోర్డు సభ్యులు ఆయనకు నాలుగు సంవత్సరముల వరకు స్కాలర్షిప్ ఇచ్చారు. న్యూటన్ ఆనందానికి అవధులు లేవు. ఈ వచ్చిన అవకాశాన్నివీలైనంత సద్వినియోగం చేసుకోవాలని న్యూటన్ నిశ్చయించుకున్నారు. అతని పూర్తి సమయం లెక్కలు మరియు భౌతిక శాస్త్రం అభ్యాసానికే వినియోగించారు. ఆయన ఎంతలా నిమగ్నమయ్యారంటే ఒక్కొక్కసారి తిండి నిద్ర కూడా మరిచేవారు. న్యూటన్ యూనివర్సిటీలో గ్రీకు, లాటిన్, హిబ్రు భాషలను, లాజిక్, జ్యామితి మరియు త్రికోణమితి లను ఎంచుకున్నారు. లైబ్రరీ లో న్యూటన్ తరచుగా మేధావులైన కెప్లర్ మరియు ఇతరులు రాసిన / తయారుచేసిన గొప్ప ప్రయోగాలపై అధ్యయనం చేసేవారు.


న్యూటన్ 1969లో ట్రినిటీ కాలేజిలో ఉండే సమయంలో తన ఆలోచనలను పుస్తకాలలో రాసుకున్నారు. ఆ పుస్తకాలు న్యూటన్ ఆలోచనా ధోరణిని బహిర్గతం చేస్తూ ఇప్పటికీ ఎంతో ముఖ్యమైనవిగా పరిగణింపబడతాయి. న్యూటన్ 1665 లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుండి బాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ లో అనేక ప్రాంతాల్లో ప్లేగు మహమ్మారినబడి వేల మంది మరణించారు. ఆ అంటువ్యాధుల వలన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం రెండు సంవత్సరాల పాటు మూసివేయబడినది. అప్పుడు న్యూటన్ ఊల్స్ తోర్ప్ కు తిరిగి వచ్చి భౌతిక మరియు గణిత శాస్త్ర అధ్యయనంలో రెండు సంవత్సరాల కాలం గడిపారు. ఈ కాలంలో, ఆయన fluxions యొక్క ఆలోచన మరియు కాంతి మరియు రంగు యొక్క పునాదులు వేశారు. అదే సంవత్సరంలో న్యూటన్ ప్రిన్సిపియా అని ఒక సంకలనం తయారు చేశారు. అది న్యూటన్ యొక్క మహత్తర పుస్తకంగా, 1687 లో ప్రచురించబడినది. న్యూటన్ 1667 లో కేంబ్రిడ్జి తిరిగి తన పరిశోధన కార్యకలాపాలను ప్రారంభించారు. న్యూటన్ 1669 లో కేంబ్రిడ్జి నుండి మాష్టర్స్ డిగ్రీ పొందారు, మరియు అదే సంవత్సరంలో గణిత శాస్త్ర ప్రొఫెసరు గా నియమించబడ్డారు.

ప్రొఫెసర్ న్యూటన్ విశ్లేషణాత్మక జ్యామితి, బీజగణితం, మరియు క్యాల్కులస్ రంగాలమీద తన దృష్టి సారించారు. బైనామినల్ సిద్ధాంతం, అనంతం సిరీస్ విస్తరణ కోసం కొత్త పద్ధతులు, fluxions యొక్క ప్రత్యక్ష మరియు విలోమ పద్ధతులు – ఇవీ ఆ కాలంలో ఆయన చేసిన ప్రధాన ఆవిష్కరణలు. న్యూటన్ 1665 నుండి 1666 వరకు కాంతి అధ్యయనం మీద దృష్టి కేంద్రీకరించారు. కాంతి యొక్క ఖచ్చితమైన కూర్పు తెలుసుకోవడానికి అనేక ప్రయోగాలను నిర్వహించారు. ఆయన కాంతి యొక్క అనేక ఇతర లక్షణాలను అధ్యయనం చేశారు.రాయల్ సొసైటీ అధ్యక్షుడు "రాబర్ట్ హు్క్" 1703 లో మరణించాడు. అప్పుడు ప్రొఫెసర్ న్యూటన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. న్యూటన్ అద్భుతమైన రచయిత, అతను అనేక శాస్త్రీయ మరియు అశాస్త్రీయ విషయాల మీద ఎన్నో పుస్తకాలను రాశాడు. దురదృష్టవశాత్తు న్యూటన్ దైవీ శాస్త్రం (theology) మీది రచనలు ప్రచురించబడలేదు.

ప్రొఫెసర్ న్యూటన్ సన్నగా, పొడవుగా ఉండేవారు. న్యూటన్ తన దుస్తులు మరియు కేశాలంకరణపై ఆసక్తి చూపేవారు కాదు. ఎక్కువ సమయం అతను తన సొంత ఆలోచనలలో మునిగిపోయేవారు. ఎప్పుడూ గదిలో ఒక మూలలో లెక్కలు చేసుకునేవారు. తీవ్రమైన చర్చలలో కూడా ఒక్కోక్కసారి సొంత ఆలోచనలలో ఉండేవారు. న్యూటన్ క్రీడలు, వ్యాయామం పై ఎటువంటి ఆసక్తి చూపించేవారు కాదు. అనేక సందర్భాలలో అతను ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది లేదా పందొమ్మిది గంటలు అధ్యయనంలో గడిపేవారు. ప్రొఫెసర్ న్యూటన్ బ్యాచిలర్ గా ఉండి భౌతిక శాస్త్రం మరియు గణిత శాస్త్ర సేవలకే అంకితం చేశారు. న్యూటన్ నిజాయితి మరియు ముక్కుసూటి మనిషి. న్యూటన్ మార్చి 20, 1727 న 84 సంవత్సరాల వయసులో మరణించాడు. అతనని వెస్ట్ మినిస్టర్ అబ్బే లో ఖననం చేశారు.

అనువాదం – స్వాతి మరియు శ్రీవత్సవ చీమకుర్తి
మూలం - http://biography-of.com/sir-isaac-newton

http://www.andhrabhoomi.net/intelligent/darwin-katha-3-610


దీర్ఘకాలం పట్టే పరిణామ ప్రక్రియ చేత జీవకోటి వికాసం చెందుతోంది అనే సిద్ధాంతం నిజం కావాలంటే అందుకు రెండు కనీస అవసరలు తీరాలి. మొదటిది, భూమి వయసు సుదీర్ఘం కావాలి. రెండవది జీవలోకానికి కూడా సుదీర్ఘమైన గతం ఉండాలి. (ఈ రెండూ కూడా ఒక దాని మీద ఒకటి ఆధారపడే విషయాలు అన్నది గమనించాలి.)

పాశ్చాత్య ప్రాచీన సాంప్రదాయంలో సృష్టి ఆరువేల ఏళ్ల క్రితం జరిగిందని అనుకునేవారని కిందటి సారి చెప్పుకున్నాం. ఐర్లండ్ కి చెందిన జేమ్స్ ఉషర్ అనే అర్క్ బిషప్ బైబిల్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ నిర్ణయానికి వచ్చాడు. మరి ఆరు వేల ఏళ్లలో ఇన్ని ఖండాలు, సముద్రాలు, నదులు, పర్వతాలు మొదలైన విలక్షణమైన భౌగోళిక సంపదతో కళకళలాడే పృథ్వి ఎలా రూపొందింది అన్న ప్రశ్నకి మరో కథనం సమాధానంగా ఇవ్వబడింది. గతంలో ఓ పెద్ద ప్రళయం వచ్చి భూమి అంతా జలమయం అయిపోయిందట. ఆ ప్రళయం తరువాత భూమి ఉపరితలం యొక్క రూపురేఖలు గణనీయంగా మారిపోయాయట. మహోగ్ర జలాల వల్ల అతి తక్కువ కాలంలో భూమి యొక్క రూపురేఖలు ఎంత గణనీయంగా మారిపోతాయో ఇటీవలి కాలంలో సునామీల ప్రభావంలో గమనించాం. కనుక భూమి మీద మార్పు అంటూ వస్తే అది వరదలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు మొదలైన ఉపద్రవాత్మక ఘటనల వల్లనే జరిగిందని ఒకప్పుడు జనం భావించేవారు. అలాంటి వాదాన్ని ‘ఉపద్రవాత్మక వాదం’ (catastrophism) అంటారు. కాని ఉపద్రవాల సహాయంతో భూమి మీద విశేషాలన్నీ అర్థం చేసుకునే పద్ధతి సబబుగా లేదని గుర్తించినవాడు ఒకడున్నాడు.

అతగాడు ఇంగ్లండ్ కి చెందిన జేమ్స్ హటన్ (1726–1797). హటన్ పుస్తకాలు చెప్పిన కథలన్నీ పక్కన పెట్టి స్వయంగా తన చుట్టూ కనిపించే భౌగోళిక విశేషాలని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యడం మొదలెట్టాడు. ఉపద్రవాలు మాత్రమే కాక, అతినెమ్మదిగా సాగుతూ, కనీకనిపించని ప్రక్రియలెన్నో భూమిని అత్యంత శక్తివంతంగా మలచుతున్నాయని అతడు గుర్తించాడు. హొయలు పోతూ పారే నది నెమ్మదిగా వేల ఏళ్లుగా తన తీరాన్ని తీర్చిదిద్దుతుంది. శతాబ్దాల ఒత్తిడి చేత మంచు కూడా దాని కింద ఉన్న శిలని తరుగదీస్తుంది. కనుక దీర్ఘకాలం పని చేసే ప్రక్రియల చేత భూమి రూపొందించబడుతోందని హటన్ గుర్తించాడు. సముద్ర గర్భంలో ఉండే అగ్నిపర్వతాల లోంచి పైకి తన్నుకొచ్చే పదార్థం వల్ల నెమ్మదిగా ద్వీపాలు ఏర్పడతాయి. నీటి మధ్యలో నేల తన్నుకొస్తుంది. అలాగే తీరం మీద ఉండే మట్టి కెరటాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఆ విధంగా తీరం క్రమంగా ఒరుసుకుపోయి క్షయం అయిపోతుంది. నీరు నేలని క్రమంగా ఆక్రమిస్తుంది. ఆ విధంగా ఒకప్పుడు నీరు ఉన్న చోట నేల, ఒకప్పుడు నేల ఉన్న చోట నీరు మారి మారి చక్రికంగా వస్తాయని హటన్ ప్రతిపాదించాడు. భూమి మీద విశేషమైన మార్పులలో అధికశాతం క్రమ పరివర్తన వల్ల జరిగినవే నన్న సిద్ధాంతాన్ని ‘క్రమ పరివర్తనా వాదం’ (uniformitarianism) అంటారు.

ఎందుచేతనో హటన్ భావాలకి ఆ కాలంలో తగినంత గుర్తింపు రాలేదు. హటన్ తరువాత పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన చార్లెస్ లయల్ (1797 - 1875), ఆ శతాబ్దంలో మరింతగా అభివృద్ధి చెందిన భౌతిక శాస్త్రాన్ని వాడుకుని హటన్ ప్రతిపాదించిన ‘క్రమపరివర్తనా వాదాన్ని’ మరింత బలపరిచాడు. ‘భౌగోళికశాస్త్ర మూల సూత్రాలు’ (Principles of Geology) అన్న పుస్తకంలో తన భావాలని ప్రచురించాడు. హటన్, లయల్ బోధించిన భావాలు ఆధునిక భౌగోళిక శాస్త్రానికి (geology) మూల స్తంభాలు అయ్యాయి.

ఈ క్రమపరివర్తనా వాదం నిజం అని ఒప్పుకుంటే భూమి వయసు ఆరు వేల ఏళ్ల కన్నా చాలా చాలా ఎక్కువని ఒప్పుకోవాల్సి వస్తుంది. భూమి వయసు నిజంగా అంచనా వెయ్యాలంటే, ముందు సౌరమండలం యొక్క వయస్సుని తెలుసుకోవాల్సి ఉంది. భూమిని మలచే భౌతిక శక్తుల గురించిన అవగాహన పెరుగుతుంటే, భూమి వయసు కూడా ఎంత ఎక్కువో క్రమంగా అర్థం కాసాగింది. భూమి వయసు వేలు, లక్షలు కాక, కొన్ని వందల కోట్ల సంవత్సరాలలో ఉంటుందన్న అవగాహన క్రమంగా ఏర్పడసాగింది. అయితే ఆ అవగాహన కుదురుకోవడానికి ఇరవయ్యయ శతాబ్దం వరకు ఎదురుచూడాల్సి వచ్చింది.

భూమి వయసు సమస్య లాగానే, సృష్టి వాదులని ఇబ్బంది పెట్టిన మరో వాస్తవం కూడా ఉంది. అది శిలాజాలు చెప్పే సాక్షం. ఈ శిలాజాలు ఎప్పుడో సుదూర గతంలో భూగర్భంలో పూడుకుపోయిన జంతువులు భూగర్భశిలలో మిగిల్చిన ఆనవాళ్లు అని ప్రస్తుతం మనకి తెలుసు. కాని కొన్ని శతాబ్దాల క్రితం, పాశ్చాత్యంలో సాంప్రదాయ వాదులు ఈ శిలాజాలని కొత్తరకంగా అన్వయించేవారు. దేవుడే అలంకార యుక్తంగా ఉంటాయని సరదాగా రాళ్లని అలా జంతురూపంలో మలచాడని చెప్పుకునేవారు. కాని ఈ కథ పొసగదని తొందరలోనే తెలిసిపోయింది.

శిలాజాలు నిజంగా గతానికి చెందిన జీవరాశుల ఆనవాళ్లని అర్థం కాసాగింది. పదిహేడవ శతాబ్దానికి చెందిన జాన్ రే అనే శాస్త్రవేత్త శిలాజాల గురించి రాస్తూ ఓ కొత్త సమస్యని ఎత్తి చూపాడు. శిలాజాల ఆనవాళ్ల బట్టి ప్రస్తుతం లేని కొన్ని జీవజాతులు గతంలో ఉండేవని తెలుస్తోంది అన్నాడు. దేవుడి సృష్టి మచ్చలేనిది అయితే మరి ఆ జీవజాతులు ఏవైనట్టు అని అడిగాడు. సృష్టి వాదం ప్రకారం దేవుడు జీవకోటిని పరిపూర్ణంగా, లోపం లేకుండా సృష్టించాడు. ఒకసారి సృష్టించబడ్డాక వాటిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో సృష్టి వాదులు ఇరుకున పడ్డారు. అందులోంచి బయట పడడానికి ఓ కొత్త కథనం మొదలయ్యింది.

మొదటి సారి సృష్టి చేశాక ఒక దశలో దేవుడు ప్రళయం సృష్టించాడు. ఆ ప్రళయంలో జీవకోటి అంతా నాశనం అయ్యింది. కొద్ది పాటి జంతువులు మాత్రం నోవా సూచించిన ఓడనెక్కి బతికి బట్టకట్టాయి. ఆ సమయంలో నాశనమైన జంతువులే ఇప్పుడు శిలాజాలలో కనిపిస్తున్నాయి. బాగానే వుంది. కాని అంత పరిపూర్ణమైన సృష్టిని చేశాక దాన్ని దేవుడు చేతులారా ఎందుకు నాశనం చేసుకున్నట్టు? భూమి మీద పాపం పండిపోయింది కనుక మనుషులని శిక్షించడానికి అలా చేశాడని అందుకు సమాధానం వచ్చింది.
ఈ ప్రళయగాధ కొంత కాలం నడిచింది. అప్పుడు మరో చిక్కు వచ్చి పడింది. భూమి పొరల్లో శిలాజాలన్నీ ఒకే లోతులో లేవు. ఎన్నో పొరలలో విస్తరించి వున్నాయి. అన్నీ ఒక్కసారే నాశనమై ఉంటే అన్నీ ఇంచుమించు ఒకే లోతులో దొరికాలిగా?
ఈ సారి సాంప్రదాయవాదులు పీకల్దాకా దిగబడిపోయారు. నమ్ముకున్న దేవుణ్ణి ఎలాగైనా రక్షించుకోవాలి. కనుక ఓ కొత్త కథనం మొదలుపెట్టారు.

(ఇంకా వుంది)


http://www.andhrabhoomi.net/more/sisindri


ఆ విధంగా యాభై ఆరేళ్ల వయసులో కొలంబస్ తన నాలుగవ యాత్ర మీద బయలుదేరాడు. ఈ సారి ఎలాగైనా ఇండియా, చైనాలని కనుక్కోవాలన్న ధృఢ సంకల్పంతో బయల్దేరాడు. హైటీ కి మాత్రం వెళ్ళరాదని రాజు, రాణి పెట్టిన షరతుకి ఒప్పుకున్నాడే గాని కొలంబస్ కి ఆ షరతుకి కట్టుబడే ఉద్దేశం లేదు.

మళ్లీ హైటీకి వెళ్లి తనని హింసించిన వారి మీద ప్రతీకారం తీసుకోవాలని తన మనసు ఉవ్విళ్లూరుతోంది. కనుక నేరుగా తన ఓడలని హైటీ దిశగా పోనిచ్చాడు. తీరానికి కొంత దూరంలో లంగరు వేసి ఆ ప్రాంతపు గవర్నరు అయిన ఓవాండో కి కబురు పెట్టాడు. తన ఓడలకి కొంచెం మరమ్మత్తు అవసరం ఉందని, కనుక రేవులోకి ప్రవేశించాలని, అలాగే ఓ సారి తనకి గవర్నరు దర్శనం చేసుకోవాలని కూడా ఉందని ఆ ఉత్తరంలో రాశాడు. కాని దురదృష్టవశాత్తు ఆ సమయంలో రేవులో పరిస్థితులు కొలంబస్ రాకకి అనుకూలంగా లేవు.

అదే సమయంలో హైటీ నుండి ఇరవై ఆరు ఓడలు స్పెయిన్ కి బయల్దేరనున్నాయి. ఆ ఓడలలో కొలంబస్ అంటే గిట్టని వాళ్లు – బోబడియా, రోల్దాన్ – మొదలైన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. కొలంబస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డ నావికులు కూడా ఉన్నారు. పెద్ద మొత్తంలో బంగారం కూడా ఆ ఓడలలో స్పెయిన్ కి తరలించబడనుంది. అలాంటి పరిస్థితుల్లో కొలంబస్ రేవులోకి ప్రవేశించి వీళ్లందరికీ ఎదురుపడితే ఏం జరుగుతుందో తెలిసిన ఓవాండో కొలంబస్ రేవులో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు.

గవర్నర్ తిరస్కారానికి కొలంబస్ చిన్నబుచ్చుకున్నాడు. తను నిర్మించిన నగరంలోకి తననే పవేశించనివ్వక పోవడమా? కనుక ఈ సారి మళ్లీ గవర్నర్ కి కబురు పెట్టాడు. సముద్రం మీద పెద్ద తుఫాను ముంచుకొస్తోందని, త్వరగా రేవులోకి ప్రవేశించి లంగరు వెయ్యకపోతే తన ఓడలకి ప్రమాదమని వివరిస్తూ రాశాడు. కొలంబస్ మాటలు వట్టి బుకాయింపులా అనిపించాయి ఓవాండో కి. రేవులోకి ప్రవేశాన్ని తిరస్కరిస్తూ మళ్లీ కబురు పెట్టాడు.

ఈ సారి కొలంబస్ కి మనసులో ఆందోళన పెరిగింది. ఎందుకంటే స్పెయిన్ కి బయలుదేరుతున్న ఓడలలో ఒక ఓడ నిండా తనకి చెందవలసిన బంగారం ఉంది. ఓడలు బయలుదేరితే తన వంతు బంగారం కూడా నీటి పాలు అవుతుంది. కనుక కనీసం తుఫాను నిలిచిపోయిన తరువాతే ఓడలని బయలుదేరనివ్వమని అర్థిస్తూ మరో సారి కబురు పెట్టాడు.

గవర్నరు కొలంబస్ మాటలు పట్టించుకోలేదు. నావికులకి కూడా కొలంబస్ మాటల మీద గురి లేదు. కనుచూపు మేరలో ఆకాశం అంతా నిర్మలంగానే ఉంది. కొలంబస్ ఎప్పట్లాగే ఏవో మాయమాటలు చెప్తున్నాడు అనుకున్నారు. కాని ఎన్నో ఏళ్ల అనుభవం మీద కొలంబస్ వాతావరణంలో సూక్ష్మమైన మార్పుల బట్టి కూడా తుఫాను రాకని కనిపెట్టగలిగే కౌశలాన్ని అలవరచుకున్నాడు.

కొలంబస్ హెచ్చరికని పట్టించుకోకుండా ఇరవై ఆరు ఓడలూ సాంటా డామింగో రేవుని వదిలి స్పెయిన్ దిశగా బయల్దేరాయి. హైటీ దీవి కొస వరకు ప్రయాణించాయో లేదో ఓ పెద్ద తుఫాను విరుచుకుపడింది. మహోగ్రమైన కెరటాల తాకిడికి ఓడలు ముక్కలు చెక్కలై నీట మునిగాయి. ఒక్క ఓడ మాత్రం సురక్షితంగా బయటపడింది. అది కొలంబస్ వంతు బంగారం ఉన్న ఓడ! అ వార్త వేగంగా వ్యాపించింది. తనకి రేవులోకి రానివ్వలేదన్న కోపంతో కొలంబస్సే ఆ తుఫాను సృష్టించాడని, అడ్మిరల్ సామాన్యుడు కాడని, పెద్ద మాయావిని అని కథలు కథలుగా నావికులు చెప్పుకున్నారు!

కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారని నిట్టూర్చి కొలంబస్ మళ్లీ తన యాత్రలు కొనసాగించాడు. హైటీ దీవిని దాటి ఆ ప్రాంతాలన్నీ మళ్లీ పర్యటించడం మొదలెట్టాడు. ఈ సారి చుట్టు పక్కల దీవులని దాటి ఇంకా ముందుకి వెళ్ళగా ఓ విశాలమైన తీరం ఎదురయ్యింది. నిజానికి అది ఆధునిక హోండురాస్ దేశం. ఇది ఉత్తర, దక్షిణ అమెరికాలు కలిసే మధ్య అమెరికా ప్రాంతంలో ఉంది. అంటే ఈ సారి మొట్టమొదటి సారిగా అమెరికా ఖండం మీద అడుగుపెట్టాడు అన్నమాట.

ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత విరివిగా ముత్యాలు, బంగారం మొదలైనవి దొరుకుతాయని తెలిసి సంతోషించాడు కొలంబస్. ఇంకా ముందుకి వెళ్లి ఇండియాని కనుక్కున్నాక, అక్కడ మరింత బంగారాన్ని ఓడలకెత్తించి,వెనక్కు వచ్చే దారిలో ఈ ముత్యాలన్నీ మూటగట్టుకోవచ్చని ఊహించాడు కొలంబస్. కాని ఇండియా ఇంకా ఎంత దూరం ఉంది? అక్కడికి ఎలా వెళ్లాలి?

హోండూరాస్ తీరం వెంట కాస్త దక్షిణంగా పోతే ఓ జలసంధి వస్తుందని, దాని లోకి ప్రవేశించి అవతలికి పోతే ఓ పెద్ద సముద్రం వస్తుందని స్థానికుల నుండి విన్నాడు. నిజానికి అది పనామా జలసంధి. దానికి అవతల ఉన్నదే పసిఫిక్ మహాసముద్రం. కాని కొలంబస్ వేరేలా ఊహించాడు. ఆ జలసంధిని దాటితే వచ్చేది బంగాళా ఖాతం అనుకున్నాడు! మరి కాస్త ముందుకి పోతే వచ్చేదే ఇండియా!
కొలంబస్ జీవితంలోనే ఓ అత్యంత విచిత్రమైన వాస్తవం అతడిలో చివరికంటా తొలగిపోని ఈ భ్రమ. చివరివరకు తను కనుక్కునది ఆసియా సమీప ప్రాంతాలనే భ్రమలోనే ఉన్నాడు గాని, అది ఆసియా నుండి ఎంతో దూరంలో ఉన్న ఓ మహాఖండం అని అర్థం చేసుకోలేకపోయాడు.

అదృష్ట వశాత్తు కొలంబస్ కి ఆ జలసంధి దొరకలేదు. నిజంగానే తన బుల్లి పడవల మీద పసిఫిక్ మహాసముద్రం మీదకి ధ్వజం ఎత్తితే నీట మునగడం ఖాయం!

ఇంతలో ఎడతెగని ఈ పర్యటనలతో అతడి ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. ఓడలో నావికులలో కూడా క్రమంగా నిరసన పెరగసాగింది. 1504 లో నవంబర్ ఏడవ తారీఖున కొలంబస్ కొన్ని ఓడలతో పాటు స్పెయిన్ ని చేరుకున్నాడు.

అప్పటికే కొలంబస్ ఆరోగ్యం బాగా క్షీణించింది. మానసికంగా గతంలో తను అనుభవించిన క్షోభ ఇప్పుడు తన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది. మతి చలించినట్టుగా అయిపోయడు. రాచదంపతుల దర్శనం కోసం వెళ్ళడానికి కూడా ఓపిక లేదు. ఇంతలో రాణి మరణించిందన్న వార్త తెలిసి చాలా బాధపడ్డాడు. ఎన్నో సార్లు కష్టకాలంలో తనని ఆదుకుంది. ఇప్పుడామె లేకపోవడం తన జీవితంలో ఓ శూన్యం ఏర్పడ్డట్టు అయ్యింది.

రాచదంపతులు తనకి ఇస్తానన్న వరదానాలని గుర్తు చేస్తూ రాజు ఫెర్డినాండ్ కి జాబు రాశాడు. టక్కరి వాడైన రాజు వీల్లేదు పొమ్మన్నాడు. ఎన్ని సార్లు అర్జీ పెట్టుకున్నా ఫలితం శూన్యమే అయ్యింది. ఒకసారి ఓపిక చేసుకుని వెళ్ళి రాజు దర్శనం చేసుకున్నాడు. రాజు తీయగా మాట్లాడి పంపేశాడు గాని ముందు ఇచ్చిన మాట మీద నిలవలేదు.

అసలే ఆరోగ్యం సరిగ్గా లేని కొలంబస్ ఈ దెబ్బకి బాగా కృంగిపోయాడు. పెద్ద కొడుకు డీగో రాజసభలో ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. రాజు ఇస్తానన్న వన్నీ ఇచ్చి వుంటే తన తరువాత తన పిల్లలు ఏ లోటూ లేకుండా హాయిగా బతికేవారు. కాని ఇప్పుడు వాళ్లేమవుతారు? ఈ బెంగ తనని లోలోన దొలిచేయసాగింది.

ఇక అలాంటి నిస్సహాయ స్థితిలో దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాడు. తన ప్రార్థనలకి దైవం స్పందించాడు. త్వరలోనే తన కష్టాల నుండి విముక్తి లభించింది. 1506 మే ఇరవై అయిదవ తేదీ నాడు కొలంబస్ తన ఇంట్లోనే చివరి శ్వాస వదిలాడు.

స్వదేశానికి ఎనలేని సేవ చేసి, రాజ్యం విపరీతంగా విస్తరించేలా చేసిన వాడు అతి సామాన్యుడిలా మరణించాడు. ఒకప్పుడు స్పెయిన్ ప్రజలంతే బ్రహ్మరథం పట్టిన వీరుడి చుట్టూ చివరి ఘడియల్లో కొందరు చిరకాల నేస్తాలు తప్ప ఎవరూ లేరు.

కొలంబస్ యాత్రల వల్ల తను భ్రమ పడినట్టుగా ఇండియా, చైనాలకి కొత్త దార్లు దొరకలేదు. భూమి గుండ్రంగా ఉందని కూడా రూఢిగా తెలియలేదు. కాని ఆ యాత్రల వల్లనే రెండు విశాలమైన కొత్త ఖండాలు కనుక్కోబడ్డాయి. వాటి వెనుక ఉన్న ఓ మహాసముద్రం గురించి కూడా చూచాయగా తెలిసింది. ఒక గొప్ప ఆవిష్కరణ వెనుక ఎంత సాహసం, ఎంత ప్రతిభ, ఎంత ప్రమాదం, ఎంత క్షోభ ఉన్నాయో కొలంబస్ కథ వల్ల మనకి తెలుస్తుంది.

(కొలంబస్ కథ సమాప్తం)


Reference:

The True Story of Christopher Columbus, Called the Great Admiral

by Elbridge Streeter Brooks (1846-1902).


http://www.andhrabhoomi.net/intelligent/ship-builder-093

బ్రిటిష్ పరిపానలలో ఉన్న పందొమ్మిదవ శతాబ్దపు భారత దేశంలో జీవించిన ఓ గొప్ప మెరైన్ ఇంజినీరు ఆర్దశీర్ కుర్సట్జీ (1808-1877). ఇతడు ఫార్సీ జాతికి చెందినవాడు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని చూపించుకోగలగడానికి కారణం వారి సాంకేతిక నైపుణ్యం. ఆవిరి యంత్రం మొదలైన ఆవిష్కరణల వల్ల వచ్చిన పారిశ్రామిక విప్లవం బ్రిటిష్ వారి ప్రాబల్యానికి హేతువయ్యింది. ఆ సాంకేతిక బలంతోనే మన దేశం మీద అంత కాలం రాజ్యం చెయ్యగలిగారేమో.


అల్లంత దూరంలో ఉన్న బ్రిటన్ దీవి నుండి భారతాన్ని పాలించడానికి, సాంకేతిక సత్తాని ఉపయోగించి ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆవిరి యంత్రాల మీద పని చేసే ఓడలు ఆ ప్రయోజనం కోసం బాగా పనికొచ్చాయి. ఇవి కాకుండా ఇండియా అంతటా రైలు మార్గాలు వేశారు. టెలిఫోన్ లైన్లు అమర్చారు. ఇండియాలో తమ కార్యాలయాలలో పని చెయ్యడానికి భారతీయులకి తగు శిక్షణ నిచ్చారు. ఆ విధంగా ఆధునిక సాంకేతిక విద్య ఇండియాలోకి ప్రవేశించింది. ఎంతో మంది భారతీయులు సాంకేతిక విద్యలో శిక్షణ పొందారు. పాశ్చాత్య రాజ్యాల ప్రాబల్యానికి వేళ్లు ఎక్కడ ఉన్నాయో అర్థం చేసుకున్నారు.

అలా బ్రిటిష్ పాలనలో పాశ్చాత్య సంకేతిక విద్యలో ప్రవేశం పొందిన వారిలో కుర్సట్జీ వంశం కూడా ఉంది. ఆర్దశీర్ కుర్సట్జీకి పూర్వీకుడైన లోజీ నుసర్వాన్జీ వాడియా సూరత్ రేవులో వడ్రంగిగా పని చేసేవాడు. బ్రిటిష్ వారు బొంబాయిలో రేవు నిర్మించదలచుకున్నప్పుడు ఆ రేవు నిర్మాణంలో లోజీ నుసర్వాన్జీ సేవలు వాడుకున్నారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు నౌకా నిర్మాణంలో ఓక్ చెట్టు యొక్క కలపని వాడేవారు. కాని బ్రిటిష్ నౌకాదళ విస్తరణ వల్ల అన్ని ఓడలని నిర్మించడానికి ఓక్ చెట్లు సరిపోలేదు. కనుక స్థానికంగా దొరికే మలబార్ టేకు కలపని వాడడం మొదలెట్టారు. ఇది బలమైన కలప. సులభంగా కుళ్ళదు. ఈ కొత్త నౌకా నిర్మాణ పధ్ధతితో బొంబాయి గొప్ప రేవుగా రూపొందింది. ఆ విధంగా కుర్సట్జీ కుటుంబంలో నౌకా నిర్మాణం వంశానుగతంగా వస్తున్న విషయం.

అయితే కుర్సట్జీ మొదట శిక్షణ పొందిన రంగం నౌకా నిర్మాణం కాదు, ఆవిరి యంత్రాల నిర్మాణం. చిన్న వయసులోనే 1-హెచ్.పి. యంత్రం నిర్మించి తన సత్తా నిరూపించుకున్నాడు. ఇండియాలో నిర్మించబడ్డ మొట్టమొదటి ఆవిరి యంత్రం అదేనేమో. దాంతో ఓ నీటి పంపు తయారుచేసి ప్రదర్శించాడు. తరువాత 1833 లో ఇంగ్లండ్ నుండి 10 –హెచ్.పి. ఇంజిను తెప్పించుకుని దాన్ని ‘ఇండస్’ అనే పేరుగల ఓడలో అమర్చాడు. 1834 లో గ్యాస్ తో విద్యుత్ దీపాలు ఎలా అమర్చాలో చేసి చూపించాడు. మజగాన్ లో తన బంగళాలోను, తోటలోను గ్యాస్ దీపాలు అమర్చుకున్నాడు.

అప్పుడే బొంబాయిలో కొత్తగా వచ్చిన ఎల్ఫిన్స్టోన్ సంస్థలో ‘మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్’ రంగాల్లో శిక్షణ పొందాడు. నౌకలలో వాడే అధునాతన ఆవిరి యంత్రాల గురించి ఇంకా లోతుగా తెలుసుకోడానికి ఓ ఏడాది పాటు ఇంగ్లండ్ లో గడిపాడు.

కుర్సట్జీ పార్సీ ఆచారాలని తుచ తప్పకుండా పాటించేవాడు. అందుకే తనతో పాటు కొందరు పార్సీ సేవకులని ఇంగ్లండ్ కి తీసుకువెళ్లాడు. వాళ్లు చేసిన వంటే తినేవాడు. కుర్సట్జీకి ఎందుచేతనో లండన్ అంతగా నచ్చలేదు. లండన్ లోని టంకశాల కన్నా బొంబాయి లోని టంకశాలే నయం అనిపించింది. లండన్ లోని మురికి వీధులు చూసి, బొంబాయిలోని శుభ్రమైన వీధులతో పోల్చుకుని, అసహ్యించుకునేవాడు. మన దేశంలో ప్రస్తుత వాస్తవాలు అప్పటి వాస్తవానికి విరుద్ధంగా ఉండడం చింతించదగ్గ విషయం.

ఇంగ్లండ్ లో ఉండగా కుర్సట్జీ కి 1841 లో అక్కడి ప్రఖ్యాత రాయల్ సొసయిటీ లో సభ్యత్వం దొరికింది. అంత ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో సభ్యత్వం పొందిన ప్రథమ భారతీయుడు ఈయనే. ఆ తరువాత 75 ఏళ్ల తరువాత శ్రీనివాస రామానుజన్ కి మళ్లీ అదే గౌరవం లభించింది. అదే సంవత్సరం అతడు గొప్ప హోదాలో ఇండియాకు తిరిగి వచ్చాడు. ఈ కొత్త ఉద్యోగంలో ఎంతో మంది బ్రిటిష్ వారు కూడా కుర్సట్జీ కింద పనిచెయ్యాల్సి వచ్చింది. ఇది నచ్చని బాంబే టైమ్స్ పత్రిక ఈ విధంగా జాత్యహంకారం చూపించుకుంది – “ఎంత సమర్థుడైనా, ఎంత చదువుకున్నా, ఒక స్థానికుడు బాంబే స్టీమ్ ఫాక్టరీ లాంటి గొప్ప పరిశ్రమకి నేతృత్వం వహించడం” ఎంత వరకు సమంజసం అంటూ సందేహం వ్యక్తం చేసింది.


1851 లో కుర్సట్జీ తన పూర్వీకుల గౌరవార్థం ‘లోజీ ఫామిలీ’ అనే పేరుగల ఓ స్టీమరును విడుదల చేశాడు. ఆ స్టీమరులో వాడిన విడిభాగాలన్నీ తన సొంత ఫౌండ్రీలో ఉత్పత్తి చెయ్యబడ్డాయి. బొంబాయిలో మొట్టమొదటిసారిగా కుట్టుమెషిను, ఫోటోగ్రఫీ, ఎలక్ట్రో ప్లేటింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాల ప్రవేశానికి కూడా ఇతడే కారణం.

1861 లో ఇండస్ ఫ్లోటిలా కంపెనీ లో సూపర్ ఇంటెండింగ్ ఇంజినీరుగా పదవీ స్వీకారం చేశాడు. తదనంతరం సింద్ ప్రాంతంలోని కోట్రీ అనే ఊళ్లో ఈ కంపెనీకి శాఖలు కూడా తెరిచాడు. తరువాత 1863 ఇంగ్లండ్ కి వెళ్లి రిచ్మండ్ అనే ఊళ్లో స్థిరపడ్డాడు. జీవితాంతం అక్కడే ఉండి, 16, నవంబర్ 1877 లో కన్నుమూశాడు.

(అరవింద్ గుప్తా రాసిన ‘బ్రైట్ స్పార్క్స్’ అనే పుస్తకం నుండి)http://www.andhrabhoomi.net/intelligent/darwin-katha-2-100


తక్కిన దేశాల ప్రాచీన సాంప్రదాయాలతో పోల్చితే ప్రాచీన భారత సాంప్రదాయంలో కాలమానం చాలా భిన్నంగా ఉంటుంది. అతి క్లుప్తమైన వ్యవధుల దగ్గరి నుండి ఊహించరానంత దీర్ఘమైన యుగాల వరకు భారతీయ కాలమానం బృహత్తరంగా విస్తరించి ఉంటుంది. ఉదాహరణకి మనం సామాన్య సంభాషణల్లో ‘తృటిలో జరిగిపోయింది’ అంటుంటాం. ఆ తృటి విలువ ఆధునిక కాలమానంలో సెకనులో 3290 వంతు. అంత కన్నా చిన్న వ్యవధి ‘పరమాణు’. దీని విలువ 16.8 మైక్రోసెకన్లు (1 మైక్రోసెకను = సెకనులో వెయ్యోవంతులో వెయ్యోవంతు). ఇక వ్యవధుల్లో కెల్లా అతి దీర్ఘమైనది మహాకల్పం. దీని విలువ 311.04 ట్రిలియన్ సంవత్సరాలు (1 ట్రిలియన్= 1 పక్కన పన్నెండు సున్నాలు)! ఇది బ్రహ్మ దేవుడి నూరేళ్ల ఆయుర్దాయమట. ఈ బ్రహ్మ ప్రతీ రోజు ఒక సారి కొత్తగా సృష్టి చేస్తుంటాడు. రోజుకి అంతంలో (బ్రహ్మ దేవుడి రాత్రిలో) ప్రళయం వచ్చి విశ్వం లయమైపోతుంది. బ్రహ్మ యొక్క ఒక రోజు విలువ (ఒక పగలు, ఒక రాత్రి కలుపుకుంటే) రెండు ‘కల్పాలు’. ప్రస్తుతం మనం ఉంటున కల్పం పేరు శ్వేత వరాహ కల్పం. ఇందులో ఇంత వరకు గడచిన కాలం విలువ 8.64 బిలియన్ సంవత్సరాలు (1 బిలియన్ = 1 పక్కన తొమ్మిది సున్నాలు). ఇక్కడ విశేషం ఏంటంటే ఆధునిక ఖగోళ శాస్త్ర అంచనాల ప్రకారం మన విశ్వం యొక్క వయసు 13.75 బిలియన్ సంవత్సరాలు. మన సాంప్రదాయక అంచనా ఆధునిక అంచనాలతో చూచాయగా సరిపోతోంది. భారతీయ కాలమానం యొక్క ఈ లక్షణం గురించి ప్రఖ్యాత ఖగోళశాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత కార్ల్ సాగన్ కూడా మెచ్చుకుంటాడు. ప్రాచీన సాంప్రదాయాలలో అంత సుదీర్ఘమైన కాలవ్యవధులతో వ్యవహరించిన సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం కాక మరొకటి లేదంటాడు.

పరిణామ సిద్ధాంతానికి మొదటి పునాది సుదీర్ఘమైన గతం. జీవజాతులు క్రమంగా వికాసం చెందడానికి, సరళ జాతుల నుండి సంక్లిష్ట జాతులు పరిణామం చెందడానికి సుదీర్ఘమైన కాలం పడుతుంది. సృష్టి వయసు కొన్ని వేల ఏళ్లు మాత్రమే ననుకుంటే ఇక పరిణామం అసంభవం. కనుక పైన చెప్పుకున్నట్టు సుదీర్ఘమైన కాలవ్యవధులని సమ్మతించే సాంప్రదాయం పరిణామ సిద్ధాంతానికి కావలసిన మొదటి అవసరాన్ని తీర్చుతోంది.

భారతీయ సాంప్రదాయం అక్కడితో ఆగిపోలేదు. జీవపరిణామాన్ని గురించిన మరిన్ని విలువైన భావనలు మన ప్రాచీన రచనలలో దొరుకుతాయి. ఉదాహరణకి దశావతారాల గాథలో పరిణామానికి సంబంధించిన సూచనలు ఉన్నాయని కొందరు తలపోశారు. ఈ దశావతారాల కథ భాగవత పురాణంలో వస్తుంది. గరుణ పురాణంలో కూడా శౌనకుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా రోమహర్షణుడు పది అవతారాల గురించి చెప్పుకొస్తాడు. వీటిలో మొదటిదైన ‘మత్స్య’ అవతారం జలచరానికి చిహ్నం. ఆధునిక పరిభాషలో దీన్ని జలచరాలు ఆవిర్భవించిన ‘కాంబ్రియన్’ యుగంతో పోల్చవచ్చు. రెండవ అవతారమైన ‘కూర్మం’ ఉభయచరానికి చిహ్నం. తరువాత వచ్చిన వరాహం, పరిణామ క్రమంలో తరువాత వచ్చిన నేల జంతువుకి, స్తన్య ప్రాణికి సంకేతం. ఆ తరువాత వచ్చిన నరసింహావతారం మనిషికి, మృగానికి వచ్చిన మధ్యస్థ ప్రాణికి సంకేతం. తదుపరి అవతారం అయిన వామనుడు మరుగుజ్జు మానవుడు. ఈ అవతారాన్ని ఆదిమానవ జాతులలో కాస్త పొట్టివారైన నియాండర్తల్ మానవ జాతికి చిహ్నంగా ఊహించినవారు ఉన్నారు. ఇక పరశురామ, రామ, కృష్ణ మొదలైన అవతారాలన్నీ మరింత అర్వాచీన మానవ దశలకి చిహ్నాలుగా ఊచించుకోవచ్చు. ఆ విధంగా అవతార కథలని జీవపరిణామ గాధకి ఓ ఉపమానంగా ఊహించుకోవచ్చని బ్రిటిష్ జీవశాస్త్రవేత్త జే.బి.యస్. హల్డేన్ సూచించాడు.

ఆధునిక విజ్ఞానం ప్రకారం జీవపరిణామ దశలతో సరిపోయే మరో ఆసక్తికరమైన కథ కూడా మహాభారతంలో కనిపిస్తుంది. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అని ఇద్దరు భార్యలు. కద్రువ నాగులకి తల్లి. వినత పక్షులకి తల్లి. కద్రువ పెట్టిన వేయి గుడ్ల (!) నుండి వేయి పాములు పుడతాయి. అందులోంచి ఆదిశేషుడు, తక్షకుడు మొదలైన సర్పాలు వెలువడతాయి. వినత కాస్త ఆలస్యంగా రెండు గుడ్లు పెడుతుంది. అందులోంచి పక్షిరాజైన గరుత్మంతుడు, అనురుడు పుడతారు. ఆధునిక జీవపరిణామ వృత్తాంతం ప్రకారం ‘సౌరాప్సిడ్’ లు అనబడే జీవజాతిలో పాములు (సరీసృపాలు), పక్షులు రెండు ఉపశాఖలు. పైన చెప్పుకున్న కథలో పాములు, పక్షులు ఒకే తండ్రి బిడ్డలు కావడం ఈ పరిణామాత్మక సాన్నిహిత్యానికి చిహ్నంగా ఊహించుకోవచ్చు. పైగా ఆ కథలో పాములు కాస్త ముందు పుట్టడం కూడా విశేషమే. ఎందుకంటే పరిణామ చరిత్రలో కూడా సరీసృపాలు ముందుగాను, పక్షులు వెనుకగాను పుట్టాయి.

లోతుగా అధ్యయనం చేస్తే మన ప్రాచీన గ్రంధాలలో జీవ పరిణామానికి సంబంధించిన ఇలాంటి విశేషాలు మరిన్ని దొరికే అవకాశం ఉంది. అయితే ప్రాచీనులు వ్యక్తం చేసిన ఇలాంటి భావనలకి ఆధారాలేమిటో ప్రస్తుతం మనకు తెలీదు. ప్రాచీనులు ఎన్ని విలువైన విషయాలు చెప్పినా, ఆ ఆవిష్కరణ వెనుక ఉన్న విధానం మనకి తెలియకపోతే ఆ ఆవిష్కరణలని మళ్లీ నిర్ధారణ చెయ్యడానికి గాని, పూర్తిగా వినియోగించడానికి కాని వీలుపడదు. అలా నిర్ద్వంద్వమైన బాహ్య సాక్ష్యాధారాల మీద ఆధరపడుతుంది కనుక ఆధునిక విజ్ఞానం, ఆవిష్కరణలు ఏమిటో చెప్పడమే కాకుండా, ఆ ఆవిష్కరణలు ఎలా చెయ్యాలో కూడా నేర్పిస్తుంది.

కనుక ఆధునిక విజ్ఞానం దృష్ట్యా, జీవపరిణామ సిద్ధాంతానికి పునాదులుగా పనిచేసిన మొట్టమొదటి సాక్ష్యాధారాలని వరుసగా పరిశీలిద్దాం.

(ఇంకా వుంది)http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-656

“కొత్త లోకం”లో చెలరేగుతున్న నిరసనలని కొలంబస్ అదుపు చెయ్యలేకున్నాడు అన్న కారణం చేత స్పెయిన్ రాజు ఫెర్డినాండ్ పరిస్థితిని చక్కబెట్టుకు రమ్మని బోబడియా అనే అధికారిని పంపాడు.

బోబడియా వెంటనే పయనమయ్యాడు. అయితే బోబడియా హైటీని చేరుకునే సరికే కొలంబస్ అక్కడ పరిస్థితులని చక్కబెట్టాడు. సమస్యకి కారణమైన రోల్డాన్ తో రాజీ కుదుర్చుకుని ఆ ప్రాంతంలో తిరిగి శాంతి నెలకొనేలా చేశాడు. బోబడియా హైటీ తీరం మీద అడుగుపెట్టేసరికి ఆ పరిసరాలన్నీ ప్రశాంతంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తను ఓడ దిగీ దిగగానే చేతుల నిండా పని ఉంటుందనుకున్న బోబడీయా కాస్త నిరుత్సాహ పడ్డాడు. ఉన్నపళంగా స్పెయిన్ కి తిరిగి వెళ్లిపోతే అక్కడ జనం నవ్వుతారు. వచ్చినందుకు ఏదో ఒకటి చెయ్యాల్సిందే.

అవసరం లేకపోయినా తన ప్రతాపం చూపించదలచుకున్నాడు బోబడియా. తనే కొత్త గవర్నరుగా ప్రకటించుకున్నాడు. కొలంబస్ ని ఆ పదవి నుండి తొలగించాడు. ‘ఇసబెల్లా’ నగర వాసులని కలుసునుకుని సమస్య గురించి వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు. బంగారం అని ఆశ పెట్టి వట్టి చేతులు చూపించిన కొలంబస్ మీద అక్కసు తీరా చాడీలు చెప్పారు జనం. వెంటనే కొలంబస్ ని, అతడి తమ్ముళ్లని తన మందిరానికి పిలిపించుకుని అక్కడికి వాళ్ళు రాగానే చేతులకి, కాళ్లకి గొలుసులు కట్టి బంధించాడు.

అన్నదమ్ములు ముగ్గురూ కారాగారంలో బందీలు అయ్యారు. మహాసముద్రాలని జయించిన అడ్మిరల్ డాన్ క్రిస్టఫర్ కొలంబస్, ఇండీస్ కి వైస్రాయ్, స్పెయిన్ ప్రజల గౌరవ మర్యాదలని చూరగొన్న మహావ్యక్తి, ఓ మామూలు దొంగలా జైలు పాలయ్యడు. కొలంబస్ కొన్ని పొరబాట్లు చేసి ఉండొచ్చు కాక. కాని ప్రాణాలొడ్డి కొత్త భూములు కనుక్కుని, స్పెయిన్ కి ఎంతో మేలు కూడా చేశాడు. కనుక అతణ్ణి ఇలా జైలు పాలు చెయ్యడం కిరాతకం.

కొలంబస్ ని సోదరులని విల్లిజో అనే అధికారికి అప్పజెప్పి, ఓడలో స్పెయిన్ కి పంపాడు బోబడియా. ఈ విల్లిజోకి కొలంబస్ అంటే ఎంతో అభిమానం. అందుకే ఓడలు కొంత దూరం ప్రయాణించగానే కొలంబస్ సోదరుల సంకెళ్లు తొలగించి వాళ్లని మర్యాదగా ఆదరించాడు. పై అధికారి ఆజ్ఞకి తలవంచక తప్పలేదని, కనుక సంకెళ్ళు వెయ్యాల్సి వచ్చింద్దని, కొలంబస్ ని క్షమాపణ కోరాడు. కాని కొలంబస్ “లేదు విల్లిజో! అది బోబడియా సంకల్పం కాదు. అది రాజు, రాణుల ఆజ్ఞ. కనుక ఈ సంకెళ్ళు ఇలాగే ఉండనీ,” అంటూ బాధపడుతున్న విల్లిజోని ఓదార్చాడు.

1500 అక్టోబర్ నెలలో కొలంబస్ సోదరులని మోసుకొచ్చిన ఓడ స్పెయిన్ లో కాడిజ్ నగరపు రేవులో ప్రవేశించింది. కొలంబస్ ని చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. కాని చేతులకి, కాళ్లకి గొలుసులతో ఓడ దిగి వస్తున్న తమ అడ్మిరల్ ని చూసి జనం నిర్ఘాంతపోయారు. కేవలం ఎనిమిదేళ్ల క్రితం విజయుడై తిరిగొచ్చి మహరాజ సత్కారాన్ని పొందిన కొలంబస్ ని ఇలాంటి స్థితిలో చూస్తారని వాళ్లు అనుకోలేదు. ఏం జరిగింది? కొలంబస్ ఏం అపరాధం చేశాడు? సమాధానం ఎవరికీ కచ్చితంగా తెలీదు.

ఓడ దిగీదిగగానే కొలంబస్ రాచకొలువులో ఉన్న ఓ మిత్రుడికి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఇటీవలి కాలంలో తను పడ్డ యాతనలన్నీ వివరించాడు. తను భరించిన అవమానాలన్నీ ఏకరువు పెట్టాడు. ఏవో కొన్ని పొరబాట్లు చేసినా రాజు, రాణుల పట్ల తన గౌరవాభిమానాలు మారనివని, దేశం కోసం తాను ఎన్నో గొప్ప విజయాలు సాధించానని గుర్తుచేస్తూ తనకీ ఆత్మగౌరవం ఉంటుందని కూడా చాటుకున్నాడు. ఉత్తరం చదివిన రాణి ఇసబెల్లా జరిగినదేంటో తెలిసింది. బోబడియా చేసిన ఘాతుకాలకి మండిపడింది.

వెంటనే కొలంబస్ ని, అతడి సోదరులని చెర విడిపిస్తూ ఉత్తరువులు పంపింది. కొలంబస్ కి పెద్ద మొత్తం ధనం బహుమతిగా పంపుతూ రాజసభకి ఆహ్వనించి తగు రీతిలో సత్కరించింది. రాణి ఆదరణకి కొలంబస్ మనసు తేలిక పడింది. ఇదే అదను అనుకుని మరో సారి యాత్ర చేసే అవకాశం ఇవ్వమని కోరాడు. రాజదంపతులు తప్పకుండా అవకాశం ఇస్తాం అంటూ బోలెడు వాగ్దానలు చేసి పంపేశారు.
కాని ఫెర్డినండ్ రాజుకి ఈ సారి కొలంబస్ ని పంపడం ససేమిరా ఇష్టం లేదు. దాని వెనుక ఓ పన్నాగం ఉంది. ఇంతవరకు కొత్త లోకం నుండి వచ్చిన బంగారం పెద్దగా ఏమీ లేదు. అయితే ఈ యాత్రలు ఇలాగే కొనసాగుతే భవిష్యత్తులో అధిక మొత్తంలో బంగారం దొరికే అవకాశం ఉంది. కాని ప్రతీ సారి కొలంబస్ నే పంపితే ఈ వ్యవహారంలో తనదే ఏకఛత్రాధిపత్యం అవుతుంది. లాభాలలో పెద్ద మొత్తం తనదవుతుంది. కొత్త వాళ్లయితే తక్కువతో సరిపెట్టుకుంటారు. అప్పుడు రాజ్యానికి వచ్చే వాటా పెద్దది అవుతుంది.

కనుకనే వాగ్దానాలు చేశారేగాని ఎంతో కాలం యాత్రకి కావలసిన వసతులు అనుగ్రహించలేదు. కొలంబస్ ఓపిగ్గా ఓ రెండేళ్లు స్పెయిన్ లోనే ఉండి యాత్ర కోసం ఎదురుచూశాడు. చివరికి ఒక షరతుతో రాజు, రాణి యాత్రకి ఒప్పుకున్నారు.
కొలంబస్ కొత్త లోకానికి ప్రయాణించొచ్చు గాని హైటీ దీవి వద్దకి మాత్రం పోకూడదు. అక్కడి వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు. కొలంబస్ కి ఆ షరతులకి ఒప్పుకోక తప్పింది కాదు.

ఆ విధంగా 1502 లో మే తొమ్మిదవ తేదీ నాడు కొలంబస్ నాలుగు చిన్న పడవలతో, నూట యాభై మంది సిబ్బందితో ఇండీస్ కి ప్రయాణమయ్యాడు.

ఇది అతడి నాలుగవ యాత్ర. ఇదే అతడి ఆఖరు యాత్ర కూడా అయ్యింది.

(ఇంకా వుంది)


http://www.andhrabhoomi.net/intelligent/parimaman-992


విశ్వం ఎప్పుడు, ఎలా, ఎక్కణ్ణుంచి పుట్టింది? భూమి ఎలా ఆవిర్భవించింది? భూమి మీద జీవజాతులు ఎలా పుట్టాయి? మానవుడు ఎలా అవతరించాడు?... ఆలోచన పుట్టిన నాటి నుండి మనిషి మనసులో ఇలాంటి ప్రశ్నలు మెదుల్తూనే ఉన్నాయి. ఖగోళం, అందులోని వస్తువుల పుట్టుపూర్వోత్తరాల మాట ఎలా ఉన్నా, మనిషి పుట్టుకకి గురించిన ప్రశ్నలు వాటి సమాధానాలు ప్రతీ మనిషికి మరింత అర్థవంతమైనవిగా, ముఖ్యమైనవిగా అగుపిస్తాయి. ఈ విషయంలో సామాన్య జ్ఞానం కొంతవరకు సమాధానం చెప్తుంది. నేను నా తల్లిదండ్రుల నుంచి వచ్చాను. వాళ్లు వారి తల్లిదండ్రుల నుంచి… అయితే ఈ పరంపర గతంలో ఎంత దూరం పోతుంది? మనిషి నుండి మనిషి వచ్చేట్టయితే మొదటి మానవుడు అనేవాడు ఉండాలిగా? వాడు మరి ఎక్కణ్ణుంచి వచ్చాడన్న ఇబ్బందికరమైన ప్రశ్న ఎదురుపడక మానదు.

ఈ ఇబ్బందికరమైన ప్రశ్నలకి సమాధానంగా ప్రపంచంలో వివిధ ప్రాంతాల ప్రాచీన సాంప్రదాయాలు ఎన్నో రకాలుగా సమాధానాలు, వివరణలు చెప్తూ వచ్చాయి. వివరాలలో వైవిధ్యం ఉన్నా మనిషి పుట్టుక గురించి ప్రాచీన సాంప్రదాయాలు చెప్పేదాంట్లో సారాంశం ఇది – దేవుడు మనిషిని సృష్టించాడు. దేవుడు అన్న పదాన్ని వాడకపోయినా ఏదో శక్తి, ఏదో అదృశ్యమైన ప్రజ్ఞ మనిషిని సృష్టించింది. ఓ కుండని కుమ్మరి మట్టితో తీర్చిదిద్దినట్టు, ఆ శక్తి, లేక ప్రజ్ఞ మనిషిని తయారుచేసింది. ఈ వాదాన్ని ‘సృష్టి వాదం’ (creationism) అంటారు.

ఒకటిన్నర శతబ్దాల క్రితం ఇందుకు దీటుగా మరో వాదన ఉత్పన్నమయ్యింది. కేవలం తర్కం, వాదం మొదలైన వాటి మీద ఆధారపడకుండా, బాహ్య ప్రపంచంలోని సాక్ష్యధారాల పునాది మీద నిలిచిన వాదం ఈ కొత్త వాదం. ఆ వాదానికి మూలపురుషులు ఎంతో మంది ఉన్నా, వారిలో ముఖ్యుడు పందొమ్మిదవ శతాబ్దపు ఇంగ్లండ్ కి చెందిన చార్లెస్ డార్విన్. సరళ జీవాల నుండి, మరింత సంక్లిష్టమైన జీవాలు దీర్ఘకాలం పట్టే క్రమపరివర్తన చేత ఆవిర్భవిస్తాయని ఈ కొత్త వాదం చెప్తుంది. (అందులో భాగంగా నరుడు వానర జాతి నుండి ఒక శాఖగా పరిణామం చెందాడని అనుకోవాల్సి వస్తుంది.) ఆ క్రమ పరివర్తననే పరిణామం (evolution) అంటారు కనుక ఈ కొత్త వాదాన్ని పరిణామ వాదం (evolutionism) అంటారు.గుడ్డు వెళ్ళి పిట్టని వెక్కిరించినట్టు మొదట్నుంచి కూడా ఈ కొత్త ‘పరిణామ వాదానికి’ పాత ‘సృష్టి వాదానికి’ మధ్య స్పర్థ చెలరేగింది. మనకి నచ్చిందా నచ్చలేదా అన్న ప్రాతిపదిక మీద కాకుండా, బాహ్య సాక్ష్యాధారాలు ఏం చెప్తున్నాయి అన్న అంశం మీదే ఆధరపడే ఆధునిక విజ్ఞానం పరిణామ సిద్ధాంతాన్నే సమర్ధిస్తుంది. కాని జనసామాన్యంలో, ముఖ్యంగా పాశ్చాత్య మత భావాల ప్రభావం అంతో ఇంతో ఉన్న వారిలో సృష్టి వాదం యొక్క ప్రభావం బలంగా ఉంది. (2009 లో యూ.కే. లో జరిగిన సర్వేలో జనంలో సగానికి సగం మంది సృష్టి వాదాన్ని నమ్ముతున్నారని తేలింది.)

పరిణామ వాదం సామాన్య ప్రజానీకానికి నచ్చకపోవడానికి కొన్ని మౌలిక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నిమ్నజాతి జీవాలైన చెందిన వానరాల నుండి నరుడు పుట్టాడన్న సూచన. ఇది మనిషిగా మన అహంకారాన్ని దెబ్బతీసే భావన. పోనీ దీన్ని పక్కన పెట్టినా, మరో తార్కికమైన, సమంజసమైన కారణం కూడా ఉంది. సృష్టికర్త లేని సృష్టి ఊహించరాని విషయంగా కనిపిస్తుంది. కుండైనా, కారైనా ఎవరో ఒకరు చెయ్యకపోతే ఎలా వస్తుంది? గాల్లోంచి ఊడిపడదుగా? ఇలాంటి కారణాల వల్ల సృష్టి వాదానికి, పరిణామ వాదానికి మధ్య ఓ శతాబ్దానికి పైగా ఘర్షణ చెలరేగుతూ వస్తోంది.

ఆ ఘర్షణ పాశ్చాత్య సమాజాలలో మరింత తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది. పైన చెప్పుకున్న సామాన్య కారణాలు కాకుండా, ఈ ఘర్షణ పాశ్చాత్యంలో మరింత తీవ్రతరం కావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వేళ్లు పాశ్చాత్య మత సాంప్రదాయాలలో ఉన్నాయి. ఉదాహరణకి పాశ్చాత్య సాంప్రదాయానికి చెందిన ‘బుక్ ఆఫ్ జెనిసిస్’ లో దేవుడు ఆరు రోజులలో సృష్టి కార్యాన్ని పూర్తిచేశాడని పేర్కొనబడింది. మొదటి రోజు ఏమీ లేని చీకట్లో దేవుడి ఆన మీద కాంతి పెల్లుబికింది. రెండవ దినం నుండి నాల్గవ దినానికి మధ్య ఆకాశం, నేల, నీరు, సూర్య చంద్రులు మొదలైన జీవరహిత వస్తువులు సృజించబడ్డాయి. ఐదవ నాడు పక్షులు, జలచరాలు సృష్టించబడ్డాయి. ఆరవ రోజు సరీసృపాలు, నేల జంతువులు, చివరిగా మానవుడు, సృష్టించబడ్డారు. అలా ఆరు దినాలుగా సాగిన సృష్టి కార్యం తరువాత ఏడవ నాడు దేవుడు విశ్రాంతి తీసుకుట్టుగా చెప్తారు.

ఈ సృష్టి కార్యం అంతా ఆరువేల ఏళ్ల క్రితం జరిగిందని కూడా చెప్పబడింది. జీవరాశుల చరిత్ర అంత క్లుప్తమైనది అనుకుంటే ఇక అందులో పరిణామం జరగడానికి తగినంత వ్యవధి లేదు. సృష్టించబడ్డ నాటి నుండి వివిధ జీవజాతులు, ఇతర జాతులతో సంకరం జరగకుండా, (సింహాల నుండి సింహాలు, దున్నల నుండి దున్నలు ఇలా) తమ తమ జాతులని వృద్ధి గావిస్తూ వస్తున్నాయి. కనుక ఒక జాతి నుండి మరో జాతి ఎలా వస్తుంది అన్న ప్రశ్నకి అర్థం ఉండదు.

కాని భూమి పుట్టి ఆరు వేల ఏళ్లేనా అయ్యింది? భూమి మీద జరిగిన విస్తృత భౌగోళిక పరిణామాలన్నీ కేవలం ఆరు వేల ఏళ్లలో జరిగిపోయాయా? ఏకకణ జీవుల నుండి, ఆధునిక మానవుడి వరకు జరిగిన చరిత్రని అంత తక్కువ కాలంలో కుదించడానికి వీలవుతుందా? ఈ విషయంలో ఆధునిక వైజ్ఞానిక వివరణలని కాసేపు పక్కన బెట్టి, ప్రాచీన భారత సాంప్రదాయాలు ఎమంటున్నాయో చూద్దాం.

(ఇంక వుంది)


http://www.andhrabhoomi.net/intelligent/munchu-991

ఇటీవలి కాలంలో 2012 సంవత్సరం ఓ ప్రత్యేకతని సంతరించుకుంది. ప్రాచీన మాయన్ కాలెండరు ప్రకారం వచ్చే ఏడాది లోకం అంతమైపోతుంది అన్న వదంతి కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఆ యుగాంతానికి రకరకాల కారణాలు ప్రతిపాదించబడ్డాయి. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, ఉల్కాపాతాలు, ధృవాలు తారుమారు కావడాలు – ఒకటా రెండా, బోలెడు భీభత్సమైన కారణాలు. ఇవి కాకుండా మంచు వల్ల మానవ జాతి నాశనం కానుంది అన్న విచిత్రమైన భావన ఇంచుమించు ఓ శతాబ్దం క్రితం ప్రతిపాదించబడింది.

దాన్ని ఊహించినవాడు హ్యూ ఔచిన్ క్లాస్ బ్రౌన్ (1879 – 1975). అతడో ఎలక్ట్రికల్ ఇంజినీరు. 1900 లో అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పట్టం పుచ్చుకున్నాడు. 1911 ప్రాంతాల్లో అతడికి ఓ వింతైన వార్త కంటపడింది. ఘనీభవించిన ఆర్కిటిక్ సముద్రంలో జరిగిన తవ్వకాల్లో మామొత్ అనే రకం భారీ (ఏనుగుని పోలిన) జంతువు కళేబరం బయటపడింది. తవ్వకాల్లో జంతువు అస్తికలు, శిలాజాలు బయటపడడం కొత్త కాదు. కాని మాంసంతో పాటు చెక్కుచెదరకుండా దొరకడం కొంచెం ఆశ్చర్యం. అయితే మంచులో చిక్కుకుని ఉంది కనుక మాసం కుళ్ళకుండా ఉండిపోయిందని సర్దిపెట్టుకోవచ్చు. కాని మరింత విచిత్రమైన విషయం మరొకటి ఉంది. ఆ రకం జంతువు సామాన్యంగా ధృవప్రాంతాల వద్ద కనిపించదు. అది ఉష్ణమండల ప్రాంతాల్లో సంచరించే జంతువు. మరి ఆర్కిటిక్ వద్దకి ఎలా వచ్చింది? మరో విశేషం ఏంటంటే అది సహజ పరిస్థితుల్లో మరణించినట్టు లేదు. ఏదో హఠాత్పరిణామంలో ప్రాణాలు కోల్పోయినట్టు కనిపించింది. “అది మేస్తున్న బటర్కప్ పువ్వులు ఇంకా దాని దవడల్లో చిక్కుకుని ఉన్నాయి,” అని రాస్తాడు హ్యూ బ్రౌన్ దాన్ని వర్ణిస్తూ. తదనంతరం జరిగిన తవ్వకాల్లో అలాంటి ఆనవాళ్లు మరిన్ని కనిపించాయి. ఉష్ణమండలానికి చెందిన జంతువులు ధృవప్రాంతాల్లో తవ్వకాల్లో బయటపడడం ఎన్నో సందర్భాల్లో జరిగింది. ఇలాంటి వార్తలు చూసిన హ్యూ బ్రౌన్ దానికి కారణాల గురించి లోతుగా ఆలోచించసాగాడు.

ఆ రోజుల్లో అతడికి అందుబాటులో ఉన్న శాస్త్రసమాచారాన్ని బట్టి, శాస్త్రసాధనాల బట్టి కొన్ని అధ్యయనాలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చాడు. భూమి ధృవాలు ఎప్పుడూ ఒకే స్థానంలో ఉండవు. కాలానుగతంగా వాటిలో మార్పులు వస్తుంటాయి. అయితే భూమి ధృవాలలో మార్పు ఉంటుందన్నది అనాదిగా తెలిసినదే. భూమి అక్షంలో చిన్న చలనం ఉంటుందని, అది 26,000 ఏళ్లకి ఒక సారి ఒక పూర్తి చుట్టు చుడుతుందని, ప్రాచీన భారతీయులకి కూడా తెలుసును అనడానికి దాఖలాలు ఉన్నాయి. అయితే హ్యూ బ్రౌన్ చెప్పే చలనం వేరు. ఇతడు చెప్పే చలనం కాస్తో కూస్తో కాదు. భూమి మొత్తం ఒక పక్కకి ఒరిగిపోయేలా జరిగే గణనీయమైన చలనం. ఇంచుమించు తొంభై డిగ్రీలకి పక్కకి ఒరిగే ఉపద్రవాత్మకమైన ‘ధృవభ్రంశం (pole shift)’. ఈ ధృవ భ్రంశం జరగడానికి కారణాలని ఈ విధంగా సిద్ధాంతీకరించాడు హ్యూ బ్రౌన్.

భూమి ధృవాలు విశాలమైన మంచు ప్రాంతాలు. ప్రస్తుత స్థితిలో మన అంటార్కిటికానే తీసుకుంటే అది దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది. దాని తీరానికి సమీపంలో మంచు కేవలం కొన్ని వేల అడుగుల మందమే ఉన్నా, దక్షిణ ధృవం దగ్గర్లో మంచు మందం రెండు మైళ్ల వరకు ఉంటుంది. కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఆ మందం మూడు మైళ్ల వరకు కూడా ఉండొచ్చు. ఈ మొత్తం మంచు యొక్క భారం 19 క్వాడ్రిలియన్ (ఒకటి పక్కన 15 సున్నాలు) టన్నులు ఉంటుందని అంచనా. అంత పెద్ద బరువు భూమి ధృవాల వద్ద ఉండడం కొంత వరకు భూమి యొక్క ఆత్మభ్రమణానికి స్థిరత్వాన్ని, ధృతిని ఇస్తుందన్నది భౌతికశాస్త్రవేత్తలకి తెలిసినదే. కాని ఆ బరువు మరీ ఎక్కువైతే స్థిరత్వం దెబ్బతిని ఒక దశలో భూమి పక్కకి ఒరిగే ప్రమాదం ఉందంటాడు హ్యూ బ్రౌన్. గతంలో అలాంటి పరిణామం వల్ల భూమి అక్షంలో మళ్లీ మళ్లీ గణనీయమైన మార్పులు వచ్చాయని, అందుకే ఉష్ణమండలానికి చెందిన ప్రాంతాలు తదనంతరం ధృవప్రాంతాలు కావడం జరిగిందని, ఈ పరిణామాలు 8,000 ఏళ్లకి ఒకసారి జరుగుతాయని ఊహించాడు హ్యూ బ్రౌన్. ఇక రాబోయే ధృవ భ్రంశం అతి దగ్గరలోనే జరుగనుందని సంచలనం సృష్టించాడు. ఎలాగైనా అంటార్కిటికా లో మంచు భారం విపరీతంగా పెరగకుండా, అణుబాంబులని ప్రయోగించి అక్కడి మంచుని చెదరగొట్టాలని అందరినీ బెదరగొట్టాడు. అతడి రచనల వల్ల ఈ ధృవభ్రంశం అన్న భావనకి కొంత ప్రచారం లభించినా, అతడి సూచనలని అమలు జరిపే ప్రయత్నాలేవీ జరగలేదు.

హ్యూ బ్రౌన్ తరువాత మరి కొందరు శాస్త్రవేత్తలు ఆ దిశలో ఆలోచించడం మొదలెట్టారు. గతంలో ధృవ భ్రంశం జరిగింది అన్న విషయంలో చాలా మంది ఏకీభవిస్తున్నా, దాన్ని కలుగజేసిన భౌతిక కారణాల విషయంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా హ్యూ బ్రౌన్ అంచనాలలో ఎన్నో దోషాలు ఉన్నాయని, ధృవాలు తారుమారు అయ్యేటంత మేరకు అంటార్కిటికాలో మంచు పేరుకోవడం అసంభవం అని కొందరు వాదించారు. పైగా అది ధరాతాపనం (global warming) గురించి పెద్దగా అవగాహన లేని రోజులు. ధరాతాపనం వల్ల ధృవాల వద్ద హిమం కరుగుతోందే గాని పెరగడం లేదు. కనుక ధృవాలు బరువెక్కి హ్యూ బ్రౌన్ చెప్పిన తీరులో ప్రమాదం కలగకపోయినా, ధృవాలు కరిగి సముద్ర మట్టం పెరిగి, తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలు మాత్రం లేకపోలేదు.
అయితే హ్యూ బ్రౌన్ చెప్పే భౌతిక విధానాలు కాకుండా ధృవ భ్రంశం జరగడానికి మరో అవకాశం కూడా ఉందన్న వారు ఉన్నారు. ఈ మరో రకం ధృవ చలనాన్ని ‘నిజమైన ధృవ సంచారం’ (true pole wander) అంటారు. ఇందులో భూమి అక్షం మారదు. భూమిలో ఘన రూపంలో ఉన్న పైపొరలు (క్రస్ట్ మరియు మాంటిల్), ద్రవ రూపంలో అడుగున ఉన్న ఇనుప ‘కోర్’ మీదుగా జారుతాయి. అలాంటి పరిణామం వల్ల భూమి రూపురేఖలే మారిపోతాయి.

విషయాన్ని ఎటూ తేల్చకుండా శాస్త్రవేత్తల శశభిషలు ఈ విధంగా ఒక పక్క కొనసాగుతుంటే, మరో పక్క సామాన్యుల మనసులో కొంత కలవరం బయల్దేరిందనే చెప్పాలి. మరో పక్క ‘2012’ లాంటి సినిమాలు ఈ ఆందోళనకి ఆజ్యం పోస్తున్నాయి. అసలు ఈ ధృవ భ్రంశం అంటూ జరిగితే ఎంత కాలంలో జరుగుతుంది అన్న ప్రశ్న ఈ విషయం గురించి ఆలోచించే వారందరినీ ఇబ్బంది పెడుతోంది. అతి వేగంగా కొద్ది రోజుల్లో జరిగిపోతుందా, లేక వేల లక్షల ఏళ్లు పడుతుందా? అమెరికన్ “సైకిక్” ఎడ్గర్ సెయిస్ లా కేవలం “ధ్యాన పద్ధతి” లో భవిష్యత్తుని చూసిన వాళ్లుగాని, లేక సాంప్రదాయబద్ధమైన శాస్త్రవేత్తలు కాని వాళ్లు గాని, ఈ పరిణామం చాలా వేగంగా, ఉపద్రవాత్మకంగా జరగొచ్చు అంటూ జనాన్ని కొంచెం బెదరగొట్టినా, ఆధునికులైన శాస్త్రవేత్తలు ఎవరూ అలాంటి ఉపద్రవాత్మక పరిణామాలని ఊహించడం లేదు. ఉదాహరణకి ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆడమ్ మలూఫ్ అనే భౌగోళిక శాస్త్రవేత్త “గతంలో ధృవాల స్థానాలు మారినా ఈ పరిణామాలు ఓ మనిషి జీవిత కాలంలో జరిగేవి కావు. కొన్ని లక్షల సంవత్సరాల పాటు క్రమంగా జరిగే మార్పులివి” అంటాడు. హమ్మయ్య, బతికించాడు!


కొలంబస్ యాత్రల పట్ల స్పెయిన్ రాచదంపతులలో సందేహం కలగడం వల్ల అతడి యాత్ర ఆలస్యం కాసాగింది. కాని రాణి ఇసబెల్లా కి మొదటి నుండి కొలంబస్ పథకాల పట్ల నమ్మకం ఉండేది. కనుక మంచి మాటలు చెప్పి విముఖంగా ఉన్న రాజు ఫెర్డినాండ్ ని కొలంబస్ పట్ల సుముఖంగా అయ్యేట్టు చేసింది. దాంతో కొలంబస్ యాత్రకి కావలసిన నిధులు మంజూరు అయ్యాయి. ఆరు ఓడలతో, తగినంత మంది సిబ్బందితో, సంభారాలతో మే 12, 1498 నాడు కొలంబస్ తన మూడవ యాత్ర మీద పయనమయ్యాడు.

కొలంబస్ యాత్రల పట్ల రాచదంపతులే కాక, గతంలో నావికులు కూడా సందేహించడంతో, పైకి ధీమాగానే కనిపించినా కొలంబస్ మనసులో మాత్రం ఓ మూల సందేహం దొలిచేయసాగింది. తను కనుక్కున్నది ఆసియా కాదని ఒప్పుకోకపోయినా అవి కేవలం ఆసియా ఖండానికి అంచుల వద్ద ఉన్న దీవులే కావచ్చని ఒప్పుకున్నాడు. ఈ మూడవ యాత్రలో ఎలాగైనా ఆ దీవులకి ఆవల ఉన్న విశాల ఆసియా ఖండాన్ని కనుక్కుంటానని ప్రతిజ్ఞ చేశాడు.

ఆ లక్ష్యంతో తన వద్ద ఉన్న ఆరు ఓడల్లో మూడింటిని, క్రిందటి యాత్రలో నిర్మించిన ఇసబెల్లా నగరానికి పొమ్మని పంపించాడు. తక్కిన మూడు ఓడలతో కొలంబస్ దక్షిణ-పశ్చిమ దిశగా పయనమయ్యాడు. ఆగస్టు ఒకటవ తేదీ నాడు ఆ కొలంబస్ బృందానికి మూడు మహోన్నత శిఖరాలు గల ఓ విశాలమైన ద్వీపం కనిపించింది. ఆ మూడు పర్వతాలు ఉన్న దీవికి, క్రైస్తవ సాంప్రదాయంలో త్రిమూర్తులు (ట్రినిటీ) అన్న భావనని తలపించేలా, ట్రినిడాడ్ అని పేరు పెట్టాడు. (ట్రినిడాడ్ దక్షిణ అమెరికా ఖండానికి ఉత్తర తీరం వద్ద ఉంది.) కొలంబస్ ట్రినిడాడ్ చుట్టూ కొంత సమయం సంచరించి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ మరో విశాలమైన దీవి కనిపించింది. అది దీవి అనుకుని పొరబడ్డాడు గాని అది నిజానికి దక్షిణ అమెరికా ఖండమే. తనకి తెలీకుండానే ఓ మహా ఖండాన్ని కనుక్కున్నాడు కొలంబస్. కొలంబస్ నావిక జీవనం అంతా ఇలాంటి ఎన్నో పొరబాట్లతో నిండి వుంది. అయితే ఆయన చేసిన పొరబాట్ల వల్ల భూమి యొక్క రూపు రేఖల గురించిన ఎన్నో మహత్తర వాస్తవాలు బయటపడ్డాయి.

దక్షిణ అమెరికా తీరంలో కొలంబస్ బృందానికి ఓ విశాలమైన నదీముఖం కనిపించింది. ఆ నది పేరు ఓరినోకో. ఆ నది వెంట ఓడలని ముందుకి పోనిచ్చాడు. లోపలి పోతున్న కొద్ది మొదట్లో ఉప్పగా ఉన్న నదీ జలం స్వచ్ఛంగా మారడం కనిపించింది. ఆ నది చుట్టూ పరిసరాలు కూడా చెప్పలేనంత సహజ సౌందర్యంతో మురిపిస్తున్నాయి. పచ్చని, దట్టమైన అడవులు, చుట్టూ ఎత్తైన, బృహత్తరమైన పర్వతాలు, గొప్ప వైవిధ్యంతో కూడిన జంతువులు, సొగసైన పక్షులు. భూమి మీద ఇంత అందమైన ప్రదేశం మరేదీ లేననిపించింది. ఆ ప్రాంతపు సొగసులు తిలకిస్తున్న కొలంబస్ కి ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. బైబిల్ లో ఒక చోట ఈడెన్ అనే అందమైన అడవి ప్రసక్తి వస్తుంది. బహుశ ఇదే ఆ ఈడెన్ అడవి కావచ్చన్న ఆలోచనతో అతడి ఉత్సాహం మరింత పెరిగింది. ఆ అడవిని, సమీప ప్రాంతాలని క్షుణ్ణంగా పరిశీలించాలని అనుకున్నాడు.

కాని అనుకోకుండా ఆ సమయంలోనే అతడికి ‘గౌట్’ వ్యాధి సోకి మంచాన పడ్డాడు. కళ్లు మంటలు పుట్టి ఇంచుమించు గుడ్డివాడు అయినంత పనయ్యింది. ఇక ఆలస్యం చెయ్యడం మంచిది కాదని వెంటనే ఓడలని తిరిగి ఇసబెల్లా నగరానికి పోనివ్వమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో ఇసబెల్లా నగరాన్ని కొలంబస్ సోదరులైన బార్తొలోమ్యూ, మరియి డీగోలు చూసుకునేవారు. కొలంబస్ ఆ నగరానికి తిరిగి రాగానే పెద్ద తమ్ముడైన బార్తొలోమ్యూ జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పాడు.

కొలంబస్ లేని సమయంలో నగరంలో తిరుగుబాటు మొదలయ్యింది. ఆ తిరుగుబాటుకి నాయకుడి పేరు రోల్డాన్. ఇతగాడు కొలంబస్ తో సంబంధం లేదని స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ కొంతమంది నావికులని తీసుకుని అదే దీవిలో మరో చోట బస ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో కొలంబస్ దళం బాగా బలహీనం అయిపోయింది. ఇక ఆ సమయంలో కొలంబస్ కి రోల్డాన్ తో రాజీ పడక తప్పలేదు. అలా రాజీ పడి కొంత మనశ్శాంతిని కొని తెచ్చుకున్నా, జరిగిన ద్రోహం గురించి కబురు పెడుతూ స్పెయిన్ కి మూడు ఓడలని పంపాడు.

మూడు ఓడల నిండా పసిడికి బదులు బోలెడన్ని ఫిర్యాదులు స్పెయిన్ చేరాయి. తన కింద పని చేస్తున్న వారిని అదుపుచెయ్యలేని కొలంబస్ అసమర్థత ఫెర్డినాండ్, ఇసబెల్లా దంపతులకి నచ్చలేదు. తను పంపిన ఓడలలో ఫిర్యాదులతో పాటు కొంత మంది “ఇండియన్లని” బానిసలుగా పంపాడు. వారిలో అక్కడి గూడెం నాయకుల కూతుళ్ళు కూడా ఉన్నారు. ఈ దౌర్జన్యం రాణి ఇసబెల్లాకి ససేమిరా నచ్చలేదు. ఆ బానిసలని తిరిగి వారి ఇంటికి పంపేయమని రాణి ఆజ్ఞాపించింది. పంపుతానన్న బంగారం యొక్క ఆనవాళ్ళు కూడా లేకపోవడం చూసి మరోపక్క రాజు ఫెర్డినాండ్ రుసరుసలాడుతున్నాడు. ఏదో ఒకటి వెంటనే చెయ్యకపోతే వ్యవహారం చేయిదాటిపోతుందని గ్రహించాడు.

రాజు ఫెర్డినాండ్ తన వద్ద పని చేసే బోబడియా అని అధికారిని హైటీ లో కొలంబస్ సమస్యని చక్కబెట్టి రమ్మని పంపాడు. బోబడియా చెప్పినట్టే బుద్ధిగా నడచుకొమ్మని కొలంబస్ కి సూచనలిస్తూ ఉత్తర్వులు పంపాడు.

చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు, ఈ బోబడియా హైటీకి వెళ్ళి సున్నితంగా వ్యవహారం చక్కబెట్టుకురాలేదు. అందరి మీదా పెత్తనం చేసి ఓ నియంతలా ప్రవర్తించాడు. అతడి రాక వల్ల కొలంబస్ జీవితంలో ఓ విషాద అధ్యాయం మొదలయ్యింది.

(ఇంకా వుంది)

లెవోషియే కథకి ముగింపు

Posted by V Srinivasa Chakravarthy Friday, September 9, 2011 0 comments


ఈ విషయాలన్నీ పొందుపరుస్తూ లెవోషియే 1789 లో ఓ పుస్తకం ప్రచురించాడు. తన కొత్త సిద్ధాంతాలని, పరిభాషని ఆధారంగా చేసుకుని అందులో రసయనిక విజ్ఞానం అంతటికి ఓ సమగ్రరూపాన్ని ఇచ్చాడు. ఆధునిక రసాయనిక విజ్ఞానంలో అది మొట్టమొదటి గ్రంథం అని చెప్పుకోవచ్చు.

ఆ పుస్తకంలో అంతవరకు తెలిసిన రసాయనిక మూలకాల పట్టిక ఇచ్చాడు లెవోషియే. బాయిల్ చాటిన నిర్వచనం ప్రకారం (“మరింత సరళమైన అంశాలుగా అవిభాజనీయమైన పదార్థాలు మూలకాలు”) తాను ఏవైతే మూలకాలు అని నమ్మాడో వాటన్నిటినీ ఆ పట్టికలో పొందుపరిచాడు. అలా తాను ఇచ్చిన ముప్పై మూడు ‘మూలకాల’ జాబితాలో రెండే పూర్తిగా తప్పుడువి కావడం గొప్ప విశేషం. ఆ రెండు ‘మూలకాల’లో ఒకటి ‘కాంతి’ రెండవది ‘కాలరిక్’ (అంటే ఉష్ణం). లెవీషియే తదనంతరం కొన్ని దశాబ్దాలలో ఈ రెండూ మూలకాలు కావని, అవసలు పదార్థాలే కావని, కేవలం శక్తి స్వరూపాలని అర్థమయ్యింది.


ఇక మిగతా ముప్పై ఒకటి పదార్థాలలో కొన్ని ఆధునిక ప్రమాణాల బట్టి నిజంగా మూలకాలే. వీటిలో ప్రాచీనులకి తెలిసిన బంగారం రాగి మొదలైన మూలకాలు ఉన్నాయి. అవి గాక ఆక్సిజన్, మాలిబ్డినమ్ మొదలైన లెవోషియే తన పుస్తకాన్ని ప్రచురించిన దానికి కొన్నేళ్ళ క్రితమే కనుక్కోబడ్డాయి. వాటిలో కొన్ని పదార్థాలు (ఉదాహరణకి లైమ్, మెగ్నీశియా) మూలాకాలు కావని తదనంతరం తేలింది. ఎందుకంటే లెవోషియే కాలం తరువాత ఆ పదార్థాలని మరింత మౌలికమైన అంశాలుగా ఎలా విడగొట్టాలో తెలుసుకున్నారు. కాని ఆ పదార్థాల విషయంలో కూడా విడగొట్టగా వచ్చిన పదార్థాలలో అంతవరకు తెలీని మూలకాలు ఉన్నాయి.

లెవోషియే ప్రతిపాదించిన కొత్త భావాలకి కొంత ప్రతికూలత లేకపోలేదు. (అయితే ఆ భావాలు ఆధునిక కాలం వరకు స్థిరంగా నిలవడం గమనార్హం.) వారిలో ప్రీస్లీ లాంటి పట్టువదలని ఫ్లాగిస్టాన్ వాదులూ ఉన్నారు. ఈ కొత్త రసాయనాన్ని మనస్పూర్తిగా సమ్మతించిన వారూ ఉన్నారు. అలా సమ్మతించిన వారిలో జర్మనీకి చెందిన మార్టిన్ హైన్రిక్ క్లాప్రాత్ (1743-1817) అనే రసాయనికుడు ఉన్నాడు. లెవోషియే భావాలని ఇతడు సమర్ధించడంలో కొంత ప్రాముఖ్యత ఉంది. ఫ్లాగిస్టాన్ వాది అయిన స్టాల్ జర్మన్ కావడంతో కేవలం జాతీయతాభావంతో ఎంతో మంది జర్మన్ రసాయనికులు స్టాల్ ని సమర్ధించేవారు. కాని క్లాప్రాత్ లెవోషియేని సమర్ధించడం జర్మన్ రసాయనికుల గాలి కొంచెం లెవోషియే మీదకి కూడా మళ్లింది. (తదనంతరం కొత్త మూలకాలు కనుక్కొన్నవాడిగా క్లాప్రాత్ పేరు గడించాడు. 1789 లో అతడు యురేనియమ్, జిర్కోనియమ్ మూలకాలు కనుక్కున్నాడు.)

లెవోషియే గ్రంథం ప్రచురించబడ్డ సంవత్సరమే ఫ్రెంచ్ తిరుగుబాటు మొదలయ్యింది. శాంతియుతంగా మొదలైనా త్వరలోనే విప్లవం భీకరరూపం దాల్చింది. దురదృష్టవశాత్తు లెవోషియేకి పన్నులు వసూలు చేసే కార్యాలయంతో సంబంధం ఉండేది. రాచరికపు దౌర్జన్యకాండలో ఈ కార్యాలయాన్ని ఓ ముఖ్య భాగంగా విప్లవకారులు పరిగణించేవారు. కనుక ఆ కార్యాలయానికి చెందిన అధికారులని దొరికిన వారిని దొరికినట్టు భయంకరమైన గిలటిన్ కి బలిచేసి తలలు నరికారు. అలా హత్య గురైన వారిలో పాపం లెవోషియే కూడా ఉన్నాడు.

1794 లో ఆ విధంగా రసాయనికులలో శ్రేష్ఠతముడైన లెవోషియే అకారణంగా, అకాలికంగా అంతమయ్యాడు. “ఆ తలని వేరు చెయ్యడానికి ఒక్క క్షణం కూడా పట్టకపోవచ్చు, కాని అలాంటి మరో తలని సృష్టించడానికి ఓ శతాబ్దం కూడా సరిపోదు,” అన్నాడు ప్రఖ్యాత ఫ్రెంచ్ గణితవేత్త లగ్రాంజ్ ఆ సందర్భంలో సంతాపం వ్యక్తం చేస్తూ. ఆధునిక రసాయనానికి పితామహుడిగా లెవోషియే చిరస్మరణీయుడిగా మిలిగిపోయాడు.


(అసిమోవ్ రాసిన ‘రసాయన శాస్త్ర చరిత్రలో’ ‘వాయువులు’ అనే నాలుగవ అధ్యాయం సమాప్తం)


http://www.andhrabhoomi.net/intelligent/balli-979

“దొంగలు, స్పైడర్ మాన్, బల్లులు – ఈ ముగ్గురిలోను సామన్య లక్షణం ఏంటో చెప్పు చూద్దాం,” తన ఎదురుగా ఉన్న చాంతాడంత క్యూని లెక్కచెయ్యకుండా పక్కనే ఉన్న మస్తాన్ రావు మీదకి అలవోకగా ఓ పజిల్ విసిరాడు కాషియర్ సుబ్బారావు. తలెత్తకుండా పని చేసుకుంటున్న మస్తాన్ రావుని ఓ సారి రుసురుసా చూసి, “గోడలెక్కడం!” అని సమాధానం చెప్పి తనే నవ్వేసుకున్నాడు. గోడలెక్కే సామర్థ్యం మనకి ఓ పెద్ద వైజ్ఞానిక విశేషంలా కనిపించదు. ముఖ్యంగా గోడలెక్కే దొంగలంటే ఒళ్ళుమండుతుందే గాని శాస్త్రీయ కుతూహలం కలగదు. స్పైడర్ మాన్ కల్పిత వ్యక్తి కనుక తనని శాస్త్ర దృష్టితో చూడడం కష్టం. ఇక మూడవదైన బల్లి రోజూ కనిపించే సర్వసామాన్య జీవం కనుక దాని మీద శాస్త్రీయ ఆసక్తి కలుగడం కొంచెం కష్టమే.

కాని ఇటీవలి కాలంలో బల్లి జాతిలో ‘గెకో’ అనే ఒక జీవం మీదకి శాస్త్రవేత్తల మనసు పోయింది. వీటి ప్రత్యేకత గోడలెక్కడం. నిటారుగా ఉండే గోడలేకాక, చూరు మీద కూడా సునాయాసంగా వేలాడతాయి. మొత్తం పాదం ఉపయోగించకుండా, ఒక్క బొటనవేలి మీద మొత్తం శరీరాన్ని అంతటినీ మోస్తూ వేలాడగలవు ఈ జీవాలు. అదెలా సాధ్యం?

ఈ ప్రశ్న మీద కాలిఫోర్నియాలో బెర్కిలీ విశ్వవిద్యాలయానికి చెందిన బాబ్ ఫుల్, మరియి రాన్ ఫియరింగ్, అలాగే స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన టామ్ కెన్నీ మొదలైన శాస్త్రవేత్తలు ఎంతో పరిశోధన చేశారు. వీరి పరిశోధనలో తేలిన కొన్ని ముఖ్య అంశాలు ఇవి. గెకో పాదానికి అడుగున చిన్న పొలుసుల్లాంటివి ఉంటాయి. ఇందులో అతి సన్నని దారాల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ‘సెటే’ అంటారు. ఒక చదరపు మిల్లీమీటరు విస్తీర్ణతలో 14,000 సెటేలు ఇముడుతాయి. ఒక్క సెటే మందం 5 మైక్రాన్లు (1 మైక్రాన్ అంటే మిల్లీమీటర్ లో వెయ్యో వంతు) ఉంటుంది. అంటే మనిషి వెంట్రుక మందంలో సుమారు పదో వంతు అన్నమాట. ఈ సెటేలలో ఒక్కొక్కటీ కొన్ని వందల సూక్ష్మమైన కొసలుగా విడిపోతుంది. ఈ కొసల వ్యాసం 200 నానోమీటర్లు ఉంటుంది (1 నానోమీటర్ అంటే 1 మైక్రాన్ లో వెయ్యోవంతు). అంటే ఇవి మనకి కనిపించే కాంతి యొక్క తరంగదైర్ఘ్యం (వేవ్ లెంగ్త్) కన్నా సన్ననివి అన్నమాట.

వెల్క్రో దారాల మధ్య ఉండే బలమైన ఆకర్షణ శక్తి లాంటిదే గెకో పాదాలలోని ఈ అతిసూక్ష్మమైన దారాల వల్ల ఆ పాదాలకి అసమానమైన అంటుకునే శక్తి అలవడుతోంది. ‘మైక్రో స్కొపిక్ ఫోర్స్ సెన్సార్’ అనే పరికరంతో స్టాన్ ఫర్డ్ కి చెందిన టామ్ కెన్నీ ఈ సెటేల అంటుకునే శక్తిని కొలిచాడు. ఒక్క సెటే 20 మిల్లీగ్రాముల (అంటే ఓ చీమ బరువు) బరువుని మొయ్యగలదని తెలిసింది. అలాంటి ఓ మిలియన్ సెటేలు ఇరవై కేజీలు అంటే ఓ చిన్న పిల్లవాణ్ణి మొయ్యగలవు. గెకో యొక్క నాలుగు పాదాలలో ఉండే రెండు మిలియన్ సెటేలు కలిస్తే 40 కేజీల పైగా బరువుని మొయ్యగలవు. అంటే గెకో శరీరం బరువు సుమారు 100 గ్రాములు ఉంటే, దాని పాదాలలోని జిగురు దాని శరీరానికి 400 రెట్లు బరువు మొయ్యగలదన్న మాట.

గెకో పాదాలకి ఇంత బలమైన అంటుకునే లక్షణం ఎలా అబ్బింది? దానికి ఆధారమైన భౌతిక సూత్రాలు ఏమిటి? దీని మీద పరిశోధించిన బెర్కిలీ బృందం, అణువుల మధ్య ఉండే ‘వాన్ డెర్ వాల్’ బలాలు అనే రకం బలాలు గెకో పాదాల జిగురులోని రహస్యం అని కనుక్కున్నారు. ఈ వాన్ డెర్ వాల్ బలాలు చాలా బలమైనవే కాని అవి అణువుల మధ్య దూరాలు అతి తక్కువగా ఉన్నప్పుడే ప్రభావం చూపిస్తాయి. గెకో పాదాలలోని అతి సన్నని సెటేల వల్ల, పాదానికి బాహ్యవస్తువు యొక్క ఉపరితలానికి మధ్య దూరం అతితక్కువ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఒక్క వేలి మీద గెకోలు తమ బరువంతా మోపుతూ గోడలకి వేలాడగలుగుతాయి.

గెకో పాదాలలోని అంటుకునే రహస్యం తెలిసినా మరో ముఖ్యమైన ప్రశ్న ఉండిపోయింది. పాదం అంటుకోవడం బాగానే ఉంది గాని, అది గోడ నుండి వేరుపడడం ఎలా? ఎప్పుడూ అంటుకుని ఉంటే గోడ మీద వేగంగా పరుగెత్తేదెలా? దీనికి సమాధానంగా గెకోపాదంలోని సెటేలకి బాహ్య ఉపరితలానికి మధ్య ఆకర్షణ బలం ఆ రెండిటి మధ్య కోణం మీద ఆధారపడుతుంది అంటారు నిపుణులు. పాదాన్ని నిలువుగా పైకెత్తడం కష్టం గాని, ఒక పక్క నుండి నెమ్మదిగా పైకెత్తడం (అట్లకాడతో పెనం నుండి దోసెని వేరు చేసినట్టు!) సాధ్యమే. అంటే పాదం మోపినప్పుడు నిలువుగా వేస్తూ, పైకెత్తే టప్పుడు ఒక పక్కనుండి పైకెత్తుతూ గెకో చాలా ఒడుపుగా అడుగులు వేస్తోంది అన్నమాట.

ఒక మామూలు బల్లి గురించి ఇంత హడావుడి ఏంటని కొందరు చిరాకు పడొచ్చు. కాని ఈ పరిశోధన వల్ల ఇంజినీరింగ్ రంగంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించారు శాస్త్రవేత్తలు. గెకో పాదాల నిర్మాణాన్ని కృత్రిమంగా అనుకరిస్తూ బలంగా అంటుకునే టేప్ ని తయరుచెయ్యొచ్చు. అలాంటి టేప్ ఉన్న బూట్లు తొడుక్కుని ఆస్ట్రోనాట్ లు స్పేస్ షిప్ చుట్టూ, శూన్యంలో పడి కొట్టుకుపోతామన్న భయం లేకుండా, తనిఖీ చెయ్యొచ్చు. అమెరికాలో బాస్టన్ కి చెందిన ఐ.ఎస్. రోబోస్ అనే కంపెనీ గెకోలని అనుకరిస్తూ గోడలని ఎగబాకగల రోబోలని తయారుచేస్తోంది. వీటిని గెకోబాట్స్ అంటారు. గోడలెక్కగల ఈ రోబోలు అగ్నిమాపక దళాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఏక్రాన్ కి చెందిన భారతీయ శాస్త్రవేత్త ప్రొ. అజయన్ బృందం గెకో పాదాలని తలదన్నేలాంటి జిగురు పదార్థాన్ని నానోటెక్నాలజీతో తయారుచేశారు.

http://en.wikipedia.org/wiki/Gecko
http://geckolab.lclark.edu/dept/geckostory.html
http://www.scientificamerican.com/article.cfm?id=how-geckos-get-a-griphttp://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-487

స్పెయిన్, రాజు రాణుల మద్దతుతో కొలంబస్ రెండవ యాత్ర మొదలయ్యింది. ఈ సారి యాత్ర లక్ష్యం బంగారం. ఈ సారి వచ్చేటప్పుడు “కొత్త లోకం” నుండి మణుగుల కొద్ది బంగారం తెచ్చిస్తానని కొలంబస్ వాగ్దానం చేశాడు. తనతో వచ్చిన వెయ్యిన్నర సిబ్బంది ఆ ఆశతోనే ఈ దారుణ యాత్ర మీద బయలుదేరారు.

క్రిందటి యాత్రలో తాము సందర్శించిన దీవులన్నిటినీ సందర్శిస్తూ వాటిలో పెద్దదైన హైటీ (దాన్ని కొలంబస్ హిస్పానియోలా అని పిలిచేవాడు) కి వెళ్లాడు. ఈ దీవిలోనే లోగడ ‘ల నావిడాడ్’ అనే కోటని నిర్మించి అక్కడ నలభై మంది సిబ్బందిని నియమించాడు. ఈ సారి తను వచ్చేసరికి ‘ల నావిడాడ్’ సిబ్బంది బోలెడంత బంగారాన్ని సేకరించి ఉంటారన్న గంపెడంత ఆశతో ఉన్నాడు కొలంబస్.


కాని తీరా ఆ కోటకి వెళ్లి చూస్తే అక్కడ ఒక్కడూ మిగలలేదు. అందరూ హతమయ్యారు. అక్కడే ఉన్న ఒక (రెడ్) “ఇండియన్” ని ఏం జరిగిందని అడిగాడు. అక్కడ మిగిలిన సిబ్బంది స్థానికులతో కిరాతకంగా ప్రవర్తించి కలహాలకి దిగి ప్రాణాలు కోల్పోయారు. తన పనికి ఇలాంటి అథములని ఎంచుకుని పొరపాటు చేశానని బాధపడ్డాడు కొలంబస్. కాని పంతంగా ఈ సారి కోటకి బదులు ఓ ఊరే నిర్మించడానికి నిశ్చయించాడు. దరిదాపుల్లోనే స్పెయిన్ రాణి ‘ఇసబెల్లా’ పేరుతో ఓ నగరాన్ని నిర్మించాడు. ఎన్నో భవనాలు, తోటలు, ప్రార్థనాలయం ఇలా ఎన్నో హంగులతో ఓ చక్కని ఊరు వెలసింది.

ఉండడానికి ఇంత చోటు దొరికాక మళ్లీ ‘బంగారం వేట’ మొదలయ్యింది. బంగారం కోసం వాళ్లు వెదకని చోటు లేదు. సెలయేళ్లు గాలించారు. నేలలో గోతులు తవ్వారు. బంగారం ఎక్కడ దొరుకుతుందో చెప్పమని స్థానిక “ఇండియన్ల”ని వేధించేవారు. వారి యాతన స్థానికులు భరించలేకపోవారు. తెల్లవారిన దగ్గర్నుండి ఈ తెల్లవారికి బంగారం, బంగారం అనే దేవుళ్లాట తప్ప వేరే ధ్యాసే లేదా అని అసహ్యించుకునేవారు.

1494 లో కొలంబస్ తను మొదట తెచ్చిన పదిహేడు ఓడల్లో పన్నెండు ఓడలు తిరిగి స్పెయిన్ కి పంపేశాడు. అయితే తను మొదట వాగ్దానం చేసినట్టు అందులో మణుగుల బంగారం పంపలేదు. మరిన్ని ఉత్త వాగ్దానాలు చేస్తూ ఉత్తరాలు పంపాడు. నావికులలో తనని వ్యతిరేకించి ఇబ్బంది పెట్టిన కలహాల కోరు నావికులని కట్టగట్టి వెనక్కి పంపేశాడు. వారితో పాటూ కొందరు స్థానిక “ఇండియన్ల”ని బంధించి దాసులుగా అమ్ముకునేందుకు గాను స్పెయిన్ కి పంపాడు. ఇలాంటి కిరాతక చర్యల కారణంగా కొలంబస్ పట్ల నావికులలో వ్యతిరేకత క్రమంగా పెరగసాగింది. వాగ్దానాలు పెరుగుతున్నాయి గాని బంగారం సూచనలు కనిపించకపోవడంతో స్పెయిన్ లో కూడా కొలంబస్ పట్ల అవిశ్వాసం పెరగసాగింది.

కలహాల కోరు నావికుల సంఖ్య తగ్గాక కొలంబస్ నిశ్చింతగా “కొత్త లోకపు” దీవుల పర్యటన కొనసాగించాడు. అయితే ఆ పర్యటనలలో ఒక దశలో కొలంబస్ కి బాగా సుస్తీ చేసింది. నౌకాదళం ‘ఇసబెల్లా’ నగరానికి తిరుగు ముఖం పట్టింది. ఆరోగ్యం బాగా క్షీణించి ఐదు నెలల పాటూ మంచం పట్టాడు కొలంబస్. ఇదే అదను అనుకుని నావికులలో కొందరు కొలంబస్ వ్యతిరేకులు స్పెయిన్ కి పారిపోయి అక్కడ రాజు, రాణులకి కొలంబస్ గురించి నానా రకాలుగా కథలు అల్లి చెడ్డగా చెప్పారు. కొలంబస్ మన వాడు కాడని, ఇటాలియన్ అని, పగవాడని, ద్వేషం నూరిపోశారు. బంగారం పంపేది ఉత్తుత్తి మాట అని, అక్కడ బంగారమే లేదని, అసలది ఇండీయానే కాదని చెప్పారు.

ఇలా ఉండగా అక్కడ “కొత్త లోకం” లో కొలంబస్ ఆరోగ్యం నెమ్మదిగా మెరుగు పడింది. నావికులలో కొందరు నమ్మకద్రోహులు చేసినదేంటో తెలుసుకున్నాడు. ఇక ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించాడు. రాజు, రాణుల మనసు మారిపోతే ఇక భవిష్యత్తులో తన యాత్రలకి వాళ్లు సహాయం చెయ్యరేమో నని భయపడ్డాడు. కనుక వెంటనే వెళ్లి స్వయంగా రాజు, రాణులని కలిసి జరిగిందేంటో విన్నవించుకోవాలి.

కనుక 10 మార్చి 1496 నాడు మిగిలిన నౌకలతో, నావికులతో స్పెయిన్ ముఖం పట్టాడు కొలంబస్.

మొదటి యాత్ర తరువాత స్పెయిన్ కి తిరిగి వచ్చినప్పటి పరిస్థితులకి, ఈ సారి పరిస్థితులకి ఎంతో తేడా ఉంది. మొదటి సారి విజయుడై తిరిగొచ్చిన కొలంబస్ కి స్పెయిన్ దేశం అంతా ఘన నివాళులు అర్పించింది. ఈ సారి తాను మనుషులని అమ్ముకునే కిరాతకుడు, దేశాన్ని నమ్మించి మోసం చేసిన ద్రోహి. తీరం మీద దిగగానే తనకి ఎలాంటి సత్కారం దొరుకుతుందో తెలీదు. తన మనసంతా ఆందోళనగా ఉంది.

కాని తీరా తీరం చేరాక పరిస్థితి తను అనుకున్నంత దారుణంగా ఏమీ లేదని తెలుసుకుని కొలంబస్ మనసు తేలిక పడింది. రాజు, రాణి తన కోసం కబురు పెట్టారు. కొలంబస్ వెళ్లి వారి దర్శనం చేసుకున్నాడు. రాచదంపతులు కొలంబస్ ని తగు రీతిలో ఆహ్వానించి, ఆదరించారు. ఎన్నో మంచి మాటలాడి తను సాధించిన విజయాలకి మెచ్చుకున్నారు. తను కనుక్కున్న హైటీ దీవిలో ఓ విశాల భూభాగాన్ని తననే బహుమతిగా తీసుకొమ్మని వరం ఇచ్చారు. ఇదే అదను అనుకుని కొలంబస్ మరో సారి యాత్రకి మద్దతు కావాలని అర్థించాడు. కొలంబస్ విన్నపాన్ని త్రోసిపుచ్చకపోయినా అందుకు కొంత గడువు కావాలని కోరారు రాచదంపతులు.

కొలంబస్ యాత్రని వాయిదా వెయ్యడానికి కారణం వారిలో ఈ యాత్రల పట్ల క్రమంగా పెరుగుతున్న అపనమ్మకమే. కొలంబస్ ఏవో కొత్త భూములు కనుక్కుని ఉండొచ్చు గాని, అవసలు ఇండియా చైనాలు కావని వారిలో సందేహం మొదలయ్యింది. కాని మనసులో సందేహం ఉన్నా కొలంబస్ తో తెగతెంపులు చేసుకోవడం ఇష్టం లేక మర్యాదగా మాట్లాడి పంపేశారు. కాని ఆ సందేహం వల్ల కొలంబస్ మూడవ యాత్ర సంధిగ్ధంలో పడింది.

(ఇంకా వుంది)

http://www.andhrabhoomi.net/intelligent/srinivasa-207ఎప్పుడూ ఒకే సమస్యని పట్టుకుని వేలాడకుండా, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ, తనకి పరిచయం లేని వైజ్ఞానిక రంగాల్లో చొచ్చుకుపోతూ, పరిశోధనలు చెయ్యడం అంటే మేటి అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత, రిచర్డ్ ఫెయిన్మన్ కి సరదా. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పని చేసే రోజుల్లో ఒక సారి, తను ఎప్పుడూ పని చేసే సైద్ధాంతిక భౌతిక శాస్త్రాన్ని వదిలిపెట్టి సరదాగా జీవశాస్త్రంలో వేలు పెట్టి చూడాలని నిశ్చయించుకున్నాడు.

భౌతిక శాస్త్రంలో అయితే తను గొప్ప పండితుడు, గురువు కావచ్చు, కాని జీవశాస్త్రంలో తను శిష్యుడే కనుక ఒక విద్యార్థి లాగా ఇతర విద్యార్థులతో పాటు క్లాసులకి వెళ్లి పాఠాలు విని నేర్చుకోవాలని అనుకున్నాడు. కణ జీవశాస్త్రం (సెల్ బయాలజీ) లో ఓ కోర్సులో కూర్చోవాలనుకున్నాడు. ఆ కోర్సుకి ఆచార్యుడి పేరు న్యూటన్ హార్వే. ఇతగాడు కాంతిని వెలువరించే బాక్టీరియాల గురించి చాలా పరిశోధనలు చేసి పేరు తెచ్చుకున్నాడు. ఫెయిన్మన్ తన క్లాసులో కూర్చోడానికి హార్వే ఒప్పుకున్నాడు.

పాపం కొత్తవాడు కదా అని తోటి విద్యార్థులు ఎంతో ఆదరంగా ఉండేవారు. ఒక సారి ఓ విద్యార్థి మైక్రోస్కోప్ లో కణాలు ఎలా కనిపిస్తాయో ఫెయిన్మన్ కి చూపించాడు. అవి వృక్షకణాలు. ఫెయిన్మన్ కి అందులో చిన్న చిన్న ఆకుపచ్చ ‘చుక్కలు’ కనిపించాయి. వాటిని ‘క్లోరోప్లాస్ట్’ లు అంటారని తెలుసుకున్నాడు. అయితే ఆ ‘చుక్కలు’ అటు ఇటు సంచలనంగా కదలడం అతడికి విశేషంగా కనిపించింది. అది చూడగానే అతడిలోని భౌతిక శాస్త్రవేత్త మనసులో ఓ ప్రశ్న మెదిలింది. క్లోరోప్లాస్ట్ లు ఎందుకు కదులుతున్నాయి? వాటిని కదిలించే బలాలు ఏంటి? అదే అడిగాడు తన తోటి విద్యార్థులని. అంతా తెల్లమొహం వేశారు. వాటి పేర్లు తెలుసేగాని అవి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో ఎవరికీ తెలీదు. అసలు అలా ప్రశ్నించొచ్చని కూడా వారికి ఎప్పుడూ తట్టలేదు. ఈ అనుభవం బట్టి ఫెయిన్మన్ కి భౌతిక శాస్త్రానికి, జీవశాస్త్రానికి మధ్య ఉండే ఓ ముఖ్యమైన తేడా అర్థమయ్యింది. భౌతిక శాస్త్రంలో కాస్త ఆసక్తి కరమైన ప్రశ్న వెయ్యాలంటే కొంత లోతుకి వెళ్లాలి. జీవశాస్త్రంలో ఎవరికీ సమాధానం తెలీని ప్రశ్నలు వెయ్యడం పెద్ద కష్టం కాదు.

ఆ తరువాత ఫెయిన్మన్ కి ఓ పేపరు చదివి క్లాసు ముందు ప్రెజెంట్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లిలోని కొన్ని ప్రత్యేక కండరాలని దాని నాడీమండలం ఎలా నియంత్రిస్తుంది అన్నది ఆ పేపరులోని విషయం. గాస్ట్రోక్నిమియస్ కండరం మొదలైన కండరాల పేర్లు ఉచ్ఛరించడానికే ఫెయిన్మన్ కి నోరు తిరగలేదు. పైగా పిల్లిలో అవసలు ఎక్కడ ఉంటాయో కూడా తెలీదు. మరిన్ని వివరాలు సేకరించడానికి లైబ్రరీకి వెళ్లాడు. అలాంటి సమాచారం ఎలాంటి పుస్తకాలలో ఉంటుందో కూడా తనకి తెలీదు. నేరుగా జీవశాస్త్ర విభాగానికి చెందిన లైబ్రేరియన్ ని కలుసుకుని “పిల్లికి సంబంధించిన మ్యాపులు ఉన్నాయా?” అని అడిగాడు. ఆవిడకి నవ్వు ఆగలేదు. పిల్లికి “మ్యాపులు” ఉండవని వివరించి, పిల్లి జీవనిర్మాణానికి (అనాటమీకి) సంబంధించిన సమాచారం అందించింది లైబ్రేరియన్.

మర్నాడు క్లాసుకి వెళ్లి తన సెమినార్ ఇవ్వడం మొదలెట్టాడు ఫెయిన్మన్. ముందుగా బోర్డు మీద పిల్లి బొమ్మ గీసి, అందులో వివిధ కండరాలని సూచించడం మొదలెట్టాడు. “ఇవన్నీ మాకు తెలిసినవే” అంటూ క్లాసంతా గగ్గోలు పెట్టింది. “అవును మరి. అందుకే మీరు నాలుగేళ్లు కష్టపడి చదువుకున్న విషయాలని ఇంత తక్కువ సమయంలో నేను నేర్చుకున్నాను,” అంటూ చురక వేశాడు ఫెయిన్మన్.

జీవశాస్త్రంలో కనిపించిన విషయాలకి పేర్లు పెట్టుకుని, ఆ పేర్లన్నీ శ్రమపడి బట్టీ పట్టుకునే పద్ధతి ఫెయిన్మన్ కి కాలయాపనలా అనిపించింది. అంత కన్నా జీవ వ్యవస్థల తత్వం గురించి ప్రశ్నించి, దాన్ని శోధించడం మరింత ఆసక్తికరమైన వ్యాపకంగా తోచింది.


మరో సందర్భంలో ఫెయిన్మన్ రైబోజోమ్ లకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సమస్య మీద హిల్డెగార్డ్ లామ్ఫార్మ్ అనే శాస్త్రవేత్తతో పని చేశాడు. ఈ రైబోజోమ్ లు అనే వేదిక మీద, ఎమ్. ఆర్. ఎన్. ఏ. అనే అణువుల లోని ‘కోడ్’ ఆధారంగా, కణంలో ప్రోటీన్ అణువుల నిర్మాణం జరుగుతుంది. అయితే సామాన్యంగా ఒకే జీవకణంలో ఉండే రైబోజోమ్ లు, ఆర్. ఎన్. ఏ. ల నుండి ఆ జీవకణానికి సంబంధించిన ప్రోటీన్ లు తయారవుతాయి. అలా కాకుండా రెండు విభిన్న జీవజాతుల నుండి ఈ రెండిటినీ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఉదాహరణకి బాక్టీరియాల నుండి రైబోజోమ్ లని, బఠాణీల నుండి ఎమ్. ఆర్. ఎన్. ఏ. ని తీసుకుని కలిపితే ఆ వచ్చే ప్రోటీన్లు బఠాణీ ప్రోటీన్లా, బాక్టీరియా ప్రోటీన్లా?


ఈ ప్రయోగానికి ఎక్కువ మోతాదులో రైబోజోమ్ పదార్థం కావలసి వచ్చింది. అంతకు ముందే మరేదో ప్రయోగం కోసం ఫెయిన్మన్ ఈ.కోలై బాక్టీరియా నుండి పెద్ద మొత్తంలో రైబోజోమ్ లని వెలికి తీసి వున్నాడు. ఊరికే ఉన్నాయి కదా అని ఆ రైబోజోమ్లని ఈ కొత్త ప్రయోగంలో వాడి ప్రయోగం చేసి చూశాడు. కాని చిన్న పొరపాటు వల్ల ప్రయోగం బెడిసికొట్టింది. తను వాడిన రైబోజోమ్ లు నెల రోజులుగా ఫ్రిడ్జిలో ఉన్నాయి. కనుక అవి మరేదో జీవపదార్థంతో కలుషితం అయ్యాయి. ప్రయోగం సరిగ్గా జరిగి వుంటే ఎంతో గొప్ప జీవ వైజ్ఞానిక సత్యం బయట పడి వుండేది. జీవలోకంలో ప్రోటీన్ల నిర్మాణానికి పనికొచ్చే ఈ రైబోజోమ్లనే యంత్రాంగం ఎక్కడైనా ఒక్కలాగే ఉంటుంది అని తెలిసేది. కాని ఫెయిన్మన్ చేసిన పొరపాటు వల్ల ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వలేదు.

ఈ అనుభవం వల్ల ఫెయిన్మన్ జీవశాస్త్రాన్ని ఓ కొత్త కోణం నుండి చూడగలిగాడు. జీవశాస్త్రంలో ప్రగతి సాధించాలంటే కేవలం సిద్ధాంతాన్ని లోతుగా అర్థం చేసుకుంటే సరిపోదు. జీవశాస్త్రానికి ఊపిరి ప్రయోగం. ఆ ప్రయోగాలు చెయ్యడానికి అపారమైన సహనం, శ్రద్ధ అవసరం. చిన్న పొరబాటు జరిగినా ప్రయోగం మొత్తం అపభ్రంశం అవుతుంది.


ఆ విధంగా జీవశాస్త్రంలో ఎన్నో విషయాలు నేర్చుకుని, ఎన్నో అనుభవాలు సేకరిస్తాడు ఫెయిన్మన్. ఒక రంగంలో నోబెల్ బహుమతి గ్రహించేటంత స్థాయికి వెళ్లిన ఆ శాస్త్రవేత్త తనకి పరిచయం లేని రంగంలోకి ప్రవేశించి, ఒక విద్యార్థి స్థాయికి దిగి, వినమ్రంగా తప్పులు సరిదిద్దుకుంటూ, ఆ రంగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి, శాస్త్రవేత్తకి ఉండాల్సిన నిగర్వానికి, అంతులేని వైజ్ఞానిక కుతూహలానికి ప్రతీకగా నిలిచాడు.

(రిచర్డ్ ఫెయిన్మన్ రాసిన ‘ష్యూర్లీ యూ మస్ట్ బి జోకింగ్ మిస్టర్ ఫెయిన్మన్’ అన్న పుస్తకం నుండి)


postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email