http://www.andhrabhoomi.net/intelligent/parimaman-992
విశ్వం ఎప్పుడు, ఎలా, ఎక్కణ్ణుంచి పుట్టింది? భూమి ఎలా ఆవిర్భవించింది? భూమి మీద జీవజాతులు ఎలా పుట్టాయి? మానవుడు ఎలా అవతరించాడు?... ఆలోచన పుట్టిన నాటి నుండి మనిషి మనసులో ఇలాంటి ప్రశ్నలు మెదుల్తూనే ఉన్నాయి. ఖగోళం, అందులోని వస్తువుల పుట్టుపూర్వోత్తరాల మాట ఎలా ఉన్నా, మనిషి పుట్టుకకి గురించిన ప్రశ్నలు వాటి సమాధానాలు ప్రతీ మనిషికి మరింత అర్థవంతమైనవిగా, ముఖ్యమైనవిగా అగుపిస్తాయి. ఈ విషయంలో సామాన్య జ్ఞానం కొంతవరకు సమాధానం చెప్తుంది. నేను నా తల్లిదండ్రుల నుంచి వచ్చాను. వాళ్లు వారి తల్లిదండ్రుల నుంచి… అయితే ఈ పరంపర గతంలో ఎంత దూరం పోతుంది? మనిషి నుండి మనిషి వచ్చేట్టయితే మొదటి మానవుడు అనేవాడు ఉండాలిగా? వాడు మరి ఎక్కణ్ణుంచి వచ్చాడన్న ఇబ్బందికరమైన ప్రశ్న ఎదురుపడక మానదు.
ఈ ఇబ్బందికరమైన ప్రశ్నలకి సమాధానంగా ప్రపంచంలో వివిధ ప్రాంతాల ప్రాచీన సాంప్రదాయాలు ఎన్నో రకాలుగా సమాధానాలు, వివరణలు చెప్తూ వచ్చాయి. వివరాలలో వైవిధ్యం ఉన్నా మనిషి పుట్టుక గురించి ప్రాచీన సాంప్రదాయాలు చెప్పేదాంట్లో సారాంశం ఇది – దేవుడు మనిషిని సృష్టించాడు. దేవుడు అన్న పదాన్ని వాడకపోయినా ఏదో శక్తి, ఏదో అదృశ్యమైన ప్రజ్ఞ మనిషిని సృష్టించింది. ఓ కుండని కుమ్మరి మట్టితో తీర్చిదిద్దినట్టు, ఆ శక్తి, లేక ప్రజ్ఞ మనిషిని తయారుచేసింది. ఈ వాదాన్ని ‘సృష్టి వాదం’ (creationism) అంటారు.
ఒకటిన్నర శతబ్దాల క్రితం ఇందుకు దీటుగా మరో వాదన ఉత్పన్నమయ్యింది. కేవలం తర్కం, వాదం మొదలైన వాటి మీద ఆధారపడకుండా, బాహ్య ప్రపంచంలోని సాక్ష్యధారాల పునాది మీద నిలిచిన వాదం ఈ కొత్త వాదం. ఆ వాదానికి మూలపురుషులు ఎంతో మంది ఉన్నా, వారిలో ముఖ్యుడు పందొమ్మిదవ శతాబ్దపు ఇంగ్లండ్ కి చెందిన చార్లెస్ డార్విన్. సరళ జీవాల నుండి, మరింత సంక్లిష్టమైన జీవాలు దీర్ఘకాలం పట్టే క్రమపరివర్తన చేత ఆవిర్భవిస్తాయని ఈ కొత్త వాదం చెప్తుంది. (అందులో భాగంగా నరుడు వానర జాతి నుండి ఒక శాఖగా పరిణామం చెందాడని అనుకోవాల్సి వస్తుంది.) ఆ క్రమ పరివర్తననే పరిణామం (evolution) అంటారు కనుక ఈ కొత్త వాదాన్ని పరిణామ వాదం (evolutionism) అంటారు.
గుడ్డు వెళ్ళి పిట్టని వెక్కిరించినట్టు మొదట్నుంచి కూడా ఈ కొత్త ‘పరిణామ వాదానికి’ పాత ‘సృష్టి వాదానికి’ మధ్య స్పర్థ చెలరేగింది. మనకి నచ్చిందా నచ్చలేదా అన్న ప్రాతిపదిక మీద కాకుండా, బాహ్య సాక్ష్యాధారాలు ఏం చెప్తున్నాయి అన్న అంశం మీదే ఆధరపడే ఆధునిక విజ్ఞానం పరిణామ సిద్ధాంతాన్నే సమర్ధిస్తుంది. కాని జనసామాన్యంలో, ముఖ్యంగా పాశ్చాత్య మత భావాల ప్రభావం అంతో ఇంతో ఉన్న వారిలో సృష్టి వాదం యొక్క ప్రభావం బలంగా ఉంది. (2009 లో యూ.కే. లో జరిగిన సర్వేలో జనంలో సగానికి సగం మంది సృష్టి వాదాన్ని నమ్ముతున్నారని తేలింది.)
పరిణామ వాదం సామాన్య ప్రజానీకానికి నచ్చకపోవడానికి కొన్ని మౌలిక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నిమ్నజాతి జీవాలైన చెందిన వానరాల నుండి నరుడు పుట్టాడన్న సూచన. ఇది మనిషిగా మన అహంకారాన్ని దెబ్బతీసే భావన. పోనీ దీన్ని పక్కన పెట్టినా, మరో తార్కికమైన, సమంజసమైన కారణం కూడా ఉంది. సృష్టికర్త లేని సృష్టి ఊహించరాని విషయంగా కనిపిస్తుంది. కుండైనా, కారైనా ఎవరో ఒకరు చెయ్యకపోతే ఎలా వస్తుంది? గాల్లోంచి ఊడిపడదుగా? ఇలాంటి కారణాల వల్ల సృష్టి వాదానికి, పరిణామ వాదానికి మధ్య ఓ శతాబ్దానికి పైగా ఘర్షణ చెలరేగుతూ వస్తోంది.
ఆ ఘర్షణ పాశ్చాత్య సమాజాలలో మరింత తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది. పైన చెప్పుకున్న సామాన్య కారణాలు కాకుండా, ఈ ఘర్షణ పాశ్చాత్యంలో మరింత తీవ్రతరం కావడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వేళ్లు పాశ్చాత్య మత సాంప్రదాయాలలో ఉన్నాయి. ఉదాహరణకి పాశ్చాత్య సాంప్రదాయానికి చెందిన ‘బుక్ ఆఫ్ జెనిసిస్’ లో దేవుడు ఆరు రోజులలో సృష్టి కార్యాన్ని పూర్తిచేశాడని పేర్కొనబడింది. మొదటి రోజు ఏమీ లేని చీకట్లో దేవుడి ఆన మీద కాంతి పెల్లుబికింది. రెండవ దినం నుండి నాల్గవ దినానికి మధ్య ఆకాశం, నేల, నీరు, సూర్య చంద్రులు మొదలైన జీవరహిత వస్తువులు సృజించబడ్డాయి. ఐదవ నాడు పక్షులు, జలచరాలు సృష్టించబడ్డాయి. ఆరవ రోజు సరీసృపాలు, నేల జంతువులు, చివరిగా మానవుడు, సృష్టించబడ్డారు. అలా ఆరు దినాలుగా సాగిన సృష్టి కార్యం తరువాత ఏడవ నాడు దేవుడు విశ్రాంతి తీసుకుట్టుగా చెప్తారు.
ఈ సృష్టి కార్యం అంతా ఆరువేల ఏళ్ల క్రితం జరిగిందని కూడా చెప్పబడింది. జీవరాశుల చరిత్ర అంత క్లుప్తమైనది అనుకుంటే ఇక అందులో పరిణామం జరగడానికి తగినంత వ్యవధి లేదు. సృష్టించబడ్డ నాటి నుండి వివిధ జీవజాతులు, ఇతర జాతులతో సంకరం జరగకుండా, (సింహాల నుండి సింహాలు, దున్నల నుండి దున్నలు ఇలా) తమ తమ జాతులని వృద్ధి గావిస్తూ వస్తున్నాయి. కనుక ఒక జాతి నుండి మరో జాతి ఎలా వస్తుంది అన్న ప్రశ్నకి అర్థం ఉండదు.
కాని భూమి పుట్టి ఆరు వేల ఏళ్లేనా అయ్యింది? భూమి మీద జరిగిన విస్తృత భౌగోళిక పరిణామాలన్నీ కేవలం ఆరు వేల ఏళ్లలో జరిగిపోయాయా? ఏకకణ జీవుల నుండి, ఆధునిక మానవుడి వరకు జరిగిన చరిత్రని అంత తక్కువ కాలంలో కుదించడానికి వీలవుతుందా? ఈ విషయంలో ఆధునిక వైజ్ఞానిక వివరణలని కాసేపు పక్కన బెట్టి, ప్రాచీన భారత సాంప్రదాయాలు ఎమంటున్నాయో చూద్దాం.
(ఇంక వుంది)
బాగుంది, కాని ఈ మధ్యనే ఒక video చూసాను Internet లో. దాని ప్రకారం Protein ఆకృతులు (Structures) పరిణామం చెందడానికి భూమి మీద జీవావిర్భావానికి మనం చెప్పుకుంటున్న 4 billion సంవత్సరాలు సరిపోదు. ఆ సమయం లో కేవలం యాదృచ్చికంగా proteins పరిణామం చెందడం, అది కూడా జీవరహిత పదార్ధం నించి, ఇంచుమించు అసంభవం (Statistical సంభావ్యతలని బట్టి). Proteins అనేవి చాల క్లిష్ట పదార్ధాలు. వాటిల్లో ఉండే Amino Acids వగైరాలు ఉండటం వల్లనే, జీవక్రియలు సరిగ్గా జరుగుతాయి. ఇవి అన్ని జీవులలోను, ఇంచుమించు పరిణామం మొదటినించి ఉన్నాయి. ఏతా-వాతా, Biology సైంటిస్టులు, భూమి మీద జీవం ఇంకో గ్రహం (ex.. అంగారకుడు) నించి వచ్చిందేమో అని కూడా ఊహిస్తున్నారు, దీని వల్ల. నా పాయింట్ ఏమిటీ అంటే, భూమి మీద మాత్రమే పరిశోధించి జీవావిర్భావాన్ని గురించి పూర్తిగా చెప్పలేము.
Link: http://www.youtube.com/watch?NR=1&v=rEoWsfforUk. ఈ వీడియో లో ఒక World famous సైంటిస్ట్, భూమి మీద మాత్రమే జీవం ఆవిర్భవించడాన్ని, చాల చాల చాలా తక్కువ సంభావ్యత ఉన్న ఒక కాకతాళీయంగా పేర్కొనడం జరిగింది. ఆయన చెప్తున్నదాన్ని బట్టి, భూమి మీద జీవం ఇతర గ్రహాలూ, నక్షత్ర మండలాల నించి వచ్చింది అనటానికి ఎక్కువ ఛాన్స్ ఉందనుకోవచ్చు.
నేను అభిమానించే శాస్త్రవేత్తలలో డార్విన్ ఒకరు, మీరు అతని గురించి రాస్తున్నందుకు కృతఙతలు. డార్విన్ పై "Creation" అనే సినిమా కూడా వచ్చింది, అతను తన పుస్తకం ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్ ముద్రణ కోసం ఎన్ని తిప్పలు పడ్డాడో ఉంటుంది.
క్రియేషన్ సినిమా నేను కూడా సగం చూశాను. ఇప్పుడు గుర్తొచ్చింది. పూర్తి చెయ్యాలి ;-)