ఈ విషయాలన్నీ పొందుపరుస్తూ లెవోషియే 1789 లో ఓ పుస్తకం ప్రచురించాడు. తన కొత్త సిద్ధాంతాలని, పరిభాషని ఆధారంగా చేసుకుని అందులో రసయనిక విజ్ఞానం అంతటికి ఓ సమగ్రరూపాన్ని ఇచ్చాడు. ఆధునిక రసాయనిక విజ్ఞానంలో అది మొట్టమొదటి గ్రంథం అని చెప్పుకోవచ్చు.
ఆ పుస్తకంలో అంతవరకు తెలిసిన రసాయనిక మూలకాల పట్టిక ఇచ్చాడు లెవోషియే. బాయిల్ చాటిన నిర్వచనం ప్రకారం (“మరింత సరళమైన అంశాలుగా అవిభాజనీయమైన పదార్థాలు మూలకాలు”) తాను ఏవైతే మూలకాలు అని నమ్మాడో వాటన్నిటినీ ఆ పట్టికలో పొందుపరిచాడు. అలా తాను ఇచ్చిన ముప్పై మూడు ‘మూలకాల’ జాబితాలో రెండే పూర్తిగా తప్పుడువి కావడం గొప్ప విశేషం. ఆ రెండు ‘మూలకాల’లో ఒకటి ‘కాంతి’ రెండవది ‘కాలరిక్’ (అంటే ఉష్ణం). లెవీషియే తదనంతరం కొన్ని దశాబ్దాలలో ఈ రెండూ మూలకాలు కావని, అవసలు పదార్థాలే కావని, కేవలం శక్తి స్వరూపాలని అర్థమయ్యింది.
ఇక మిగతా ముప్పై ఒకటి పదార్థాలలో కొన్ని ఆధునిక ప్రమాణాల బట్టి నిజంగా మూలకాలే. వీటిలో ప్రాచీనులకి తెలిసిన బంగారం రాగి మొదలైన మూలకాలు ఉన్నాయి. అవి గాక ఆక్సిజన్, మాలిబ్డినమ్ మొదలైన లెవోషియే తన పుస్తకాన్ని ప్రచురించిన దానికి కొన్నేళ్ళ క్రితమే కనుక్కోబడ్డాయి. వాటిలో కొన్ని పదార్థాలు (ఉదాహరణకి లైమ్, మెగ్నీశియా) మూలాకాలు కావని తదనంతరం తేలింది. ఎందుకంటే లెవోషియే కాలం తరువాత ఆ పదార్థాలని మరింత మౌలికమైన అంశాలుగా ఎలా విడగొట్టాలో తెలుసుకున్నారు. కాని ఆ పదార్థాల విషయంలో కూడా విడగొట్టగా వచ్చిన పదార్థాలలో అంతవరకు తెలీని మూలకాలు ఉన్నాయి.
లెవోషియే ప్రతిపాదించిన కొత్త భావాలకి కొంత ప్రతికూలత లేకపోలేదు. (అయితే ఆ భావాలు ఆధునిక కాలం వరకు స్థిరంగా నిలవడం గమనార్హం.) వారిలో ప్రీస్లీ లాంటి పట్టువదలని ఫ్లాగిస్టాన్ వాదులూ ఉన్నారు. ఈ కొత్త రసాయనాన్ని మనస్పూర్తిగా సమ్మతించిన వారూ ఉన్నారు. అలా సమ్మతించిన వారిలో జర్మనీకి చెందిన మార్టిన్ హైన్రిక్ క్లాప్రాత్ (1743-1817) అనే రసాయనికుడు ఉన్నాడు. లెవోషియే భావాలని ఇతడు సమర్ధించడంలో కొంత ప్రాముఖ్యత ఉంది. ఫ్లాగిస్టాన్ వాది అయిన స్టాల్ జర్మన్ కావడంతో కేవలం జాతీయతాభావంతో ఎంతో మంది జర్మన్ రసాయనికులు స్టాల్ ని సమర్ధించేవారు. కాని క్లాప్రాత్ లెవోషియేని సమర్ధించడం జర్మన్ రసాయనికుల గాలి కొంచెం లెవోషియే మీదకి కూడా మళ్లింది. (తదనంతరం కొత్త మూలకాలు కనుక్కొన్నవాడిగా క్లాప్రాత్ పేరు గడించాడు. 1789 లో అతడు యురేనియమ్, జిర్కోనియమ్ మూలకాలు కనుక్కున్నాడు.)
లెవోషియే గ్రంథం ప్రచురించబడ్డ సంవత్సరమే ఫ్రెంచ్ తిరుగుబాటు మొదలయ్యింది. శాంతియుతంగా మొదలైనా త్వరలోనే విప్లవం భీకరరూపం దాల్చింది. దురదృష్టవశాత్తు లెవోషియేకి పన్నులు వసూలు చేసే కార్యాలయంతో సంబంధం ఉండేది. రాచరికపు దౌర్జన్యకాండలో ఈ కార్యాలయాన్ని ఓ ముఖ్య భాగంగా విప్లవకారులు పరిగణించేవారు. కనుక ఆ కార్యాలయానికి చెందిన అధికారులని దొరికిన వారిని దొరికినట్టు భయంకరమైన గిలటిన్ కి బలిచేసి తలలు నరికారు. అలా హత్య గురైన వారిలో పాపం లెవోషియే కూడా ఉన్నాడు.
1794 లో ఆ విధంగా రసాయనికులలో శ్రేష్ఠతముడైన లెవోషియే అకారణంగా, అకాలికంగా అంతమయ్యాడు. “ఆ తలని వేరు చెయ్యడానికి ఒక్క క్షణం కూడా పట్టకపోవచ్చు, కాని అలాంటి మరో తలని సృష్టించడానికి ఓ శతాబ్దం కూడా సరిపోదు,” అన్నాడు ప్రఖ్యాత ఫ్రెంచ్ గణితవేత్త లగ్రాంజ్ ఆ సందర్భంలో సంతాపం వ్యక్తం చేస్తూ. ఆధునిక రసాయనానికి పితామహుడిగా లెవోషియే చిరస్మరణీయుడిగా మిలిగిపోయాడు.
(అసిమోవ్ రాసిన ‘రసాయన శాస్త్ర చరిత్రలో’ ‘వాయువులు’ అనే నాలుగవ అధ్యాయం సమాప్తం)
0 comments