దీర్ఘకాలం పట్టే పరిణామ ప్రక్రియ చేత జీవకోటి వికాసం చెందుతోంది అనే సిద్ధాంతం నిజం కావాలంటే అందుకు రెండు కనీస అవసరలు తీరాలి. మొదటిది, భూమి వయసు సుదీర్ఘం కావాలి. రెండవది జీవలోకానికి కూడా సుదీర్ఘమైన గతం ఉండాలి. (ఈ రెండూ కూడా ఒక దాని మీద ఒకటి ఆధారపడే విషయాలు అన్నది గమనించాలి.)
పాశ్చాత్య ప్రాచీన సాంప్రదాయంలో సృష్టి ఆరువేల ఏళ్ల క్రితం జరిగిందని అనుకునేవారని కిందటి సారి చెప్పుకున్నాం. ఐర్లండ్ కి చెందిన జేమ్స్ ఉషర్ అనే అర్క్ బిషప్ బైబిల్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ నిర్ణయానికి వచ్చాడు. మరి ఆరు వేల ఏళ్లలో ఇన్ని ఖండాలు, సముద్రాలు, నదులు, పర్వతాలు మొదలైన విలక్షణమైన భౌగోళిక సంపదతో కళకళలాడే పృథ్వి ఎలా రూపొందింది అన్న ప్రశ్నకి మరో కథనం సమాధానంగా ఇవ్వబడింది. గతంలో ఓ పెద్ద ప్రళయం వచ్చి భూమి అంతా జలమయం అయిపోయిందట. ఆ ప్రళయం తరువాత భూమి ఉపరితలం యొక్క రూపురేఖలు గణనీయంగా మారిపోయాయట. మహోగ్ర జలాల వల్ల అతి తక్కువ కాలంలో భూమి యొక్క రూపురేఖలు ఎంత గణనీయంగా మారిపోతాయో ఇటీవలి కాలంలో సునామీల ప్రభావంలో గమనించాం. కనుక భూమి మీద మార్పు అంటూ వస్తే అది వరదలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు మొదలైన ఉపద్రవాత్మక ఘటనల వల్లనే జరిగిందని ఒకప్పుడు జనం భావించేవారు. అలాంటి వాదాన్ని ‘ఉపద్రవాత్మక వాదం’ (catastrophism) అంటారు. కాని ఉపద్రవాల సహాయంతో భూమి మీద విశేషాలన్నీ అర్థం చేసుకునే పద్ధతి సబబుగా లేదని గుర్తించినవాడు ఒకడున్నాడు.
అతగాడు ఇంగ్లండ్ కి చెందిన జేమ్స్ హటన్ (1726–1797). హటన్ పుస్తకాలు చెప్పిన కథలన్నీ పక్కన పెట్టి స్వయంగా తన చుట్టూ కనిపించే భౌగోళిక విశేషాలని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యడం మొదలెట్టాడు. ఉపద్రవాలు మాత్రమే కాక, అతినెమ్మదిగా సాగుతూ, కనీకనిపించని ప్రక్రియలెన్నో భూమిని అత్యంత శక్తివంతంగా మలచుతున్నాయని అతడు గుర్తించాడు. హొయలు పోతూ పారే నది నెమ్మదిగా వేల ఏళ్లుగా తన తీరాన్ని తీర్చిదిద్దుతుంది. శతాబ్దాల ఒత్తిడి చేత మంచు కూడా దాని కింద ఉన్న శిలని తరుగదీస్తుంది. కనుక దీర్ఘకాలం పని చేసే ప్రక్రియల చేత భూమి రూపొందించబడుతోందని హటన్ గుర్తించాడు. సముద్ర గర్భంలో ఉండే అగ్నిపర్వతాల లోంచి పైకి తన్నుకొచ్చే పదార్థం వల్ల నెమ్మదిగా ద్వీపాలు ఏర్పడతాయి. నీటి మధ్యలో నేల తన్నుకొస్తుంది. అలాగే తీరం మీద ఉండే మట్టి కెరటాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఆ విధంగా తీరం క్రమంగా ఒరుసుకుపోయి క్షయం అయిపోతుంది. నీరు నేలని క్రమంగా ఆక్రమిస్తుంది. ఆ విధంగా ఒకప్పుడు నీరు ఉన్న చోట నేల, ఒకప్పుడు నేల ఉన్న చోట నీరు మారి మారి చక్రికంగా వస్తాయని హటన్ ప్రతిపాదించాడు. భూమి మీద విశేషమైన మార్పులలో అధికశాతం క్రమ పరివర్తన వల్ల జరిగినవే నన్న సిద్ధాంతాన్ని ‘క్రమ పరివర్తనా వాదం’ (uniformitarianism) అంటారు.
ఎందుచేతనో హటన్ భావాలకి ఆ కాలంలో తగినంత గుర్తింపు రాలేదు. హటన్ తరువాత పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన చార్లెస్ లయల్ (1797 - 1875), ఆ శతాబ్దంలో మరింతగా అభివృద్ధి చెందిన భౌతిక శాస్త్రాన్ని వాడుకుని హటన్ ప్రతిపాదించిన ‘క్రమపరివర్తనా వాదాన్ని’ మరింత బలపరిచాడు. ‘భౌగోళికశాస్త్ర మూల సూత్రాలు’ (Principles of Geology) అన్న పుస్తకంలో తన భావాలని ప్రచురించాడు. హటన్, లయల్ బోధించిన భావాలు ఆధునిక భౌగోళిక శాస్త్రానికి (geology) మూల స్తంభాలు అయ్యాయి.
ఈ క్రమపరివర్తనా వాదం నిజం అని ఒప్పుకుంటే భూమి వయసు ఆరు వేల ఏళ్ల కన్నా చాలా చాలా ఎక్కువని ఒప్పుకోవాల్సి వస్తుంది. భూమి వయసు నిజంగా అంచనా వెయ్యాలంటే, ముందు సౌరమండలం యొక్క వయస్సుని తెలుసుకోవాల్సి ఉంది. భూమిని మలచే భౌతిక శక్తుల గురించిన అవగాహన పెరుగుతుంటే, భూమి వయసు కూడా ఎంత ఎక్కువో క్రమంగా అర్థం కాసాగింది. భూమి వయసు వేలు, లక్షలు కాక, కొన్ని వందల కోట్ల సంవత్సరాలలో ఉంటుందన్న అవగాహన క్రమంగా ఏర్పడసాగింది. అయితే ఆ అవగాహన కుదురుకోవడానికి ఇరవయ్యయ శతాబ్దం వరకు ఎదురుచూడాల్సి వచ్చింది.
భూమి వయసు సమస్య లాగానే, సృష్టి వాదులని ఇబ్బంది పెట్టిన మరో వాస్తవం కూడా ఉంది. అది శిలాజాలు చెప్పే సాక్షం. ఈ శిలాజాలు ఎప్పుడో సుదూర గతంలో భూగర్భంలో పూడుకుపోయిన జంతువులు భూగర్భశిలలో మిగిల్చిన ఆనవాళ్లు అని ప్రస్తుతం మనకి తెలుసు. కాని కొన్ని శతాబ్దాల క్రితం, పాశ్చాత్యంలో సాంప్రదాయ వాదులు ఈ శిలాజాలని కొత్తరకంగా అన్వయించేవారు. దేవుడే అలంకార యుక్తంగా ఉంటాయని సరదాగా రాళ్లని అలా జంతురూపంలో మలచాడని చెప్పుకునేవారు. కాని ఈ కథ పొసగదని తొందరలోనే తెలిసిపోయింది.
శిలాజాలు నిజంగా గతానికి చెందిన జీవరాశుల ఆనవాళ్లని అర్థం కాసాగింది. పదిహేడవ శతాబ్దానికి చెందిన జాన్ రే అనే శాస్త్రవేత్త శిలాజాల గురించి రాస్తూ ఓ కొత్త సమస్యని ఎత్తి చూపాడు. శిలాజాల ఆనవాళ్ల బట్టి ప్రస్తుతం లేని కొన్ని జీవజాతులు గతంలో ఉండేవని తెలుస్తోంది అన్నాడు. దేవుడి సృష్టి మచ్చలేనిది అయితే మరి ఆ జీవజాతులు ఏవైనట్టు అని అడిగాడు. సృష్టి వాదం ప్రకారం దేవుడు జీవకోటిని పరిపూర్ణంగా, లోపం లేకుండా సృష్టించాడు. ఒకసారి సృష్టించబడ్డాక వాటిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో సృష్టి వాదులు ఇరుకున పడ్డారు. అందులోంచి బయట పడడానికి ఓ కొత్త కథనం మొదలయ్యింది.
మొదటి సారి సృష్టి చేశాక ఒక దశలో దేవుడు ప్రళయం సృష్టించాడు. ఆ ప్రళయంలో జీవకోటి అంతా నాశనం అయ్యింది. కొద్ది పాటి జంతువులు మాత్రం నోవా సూచించిన ఓడనెక్కి బతికి బట్టకట్టాయి. ఆ సమయంలో నాశనమైన జంతువులే ఇప్పుడు శిలాజాలలో కనిపిస్తున్నాయి. బాగానే వుంది. కాని అంత పరిపూర్ణమైన సృష్టిని చేశాక దాన్ని దేవుడు చేతులారా ఎందుకు నాశనం చేసుకున్నట్టు? భూమి మీద పాపం పండిపోయింది కనుక మనుషులని శిక్షించడానికి అలా చేశాడని అందుకు సమాధానం వచ్చింది.
ఈ ప్రళయగాధ కొంత కాలం నడిచింది. అప్పుడు మరో చిక్కు వచ్చి పడింది. భూమి పొరల్లో శిలాజాలన్నీ ఒకే లోతులో లేవు. ఎన్నో పొరలలో విస్తరించి వున్నాయి. అన్నీ ఒక్కసారే నాశనమై ఉంటే అన్నీ ఇంచుమించు ఒకే లోతులో దొరికాలిగా?
ఈ సారి సాంప్రదాయవాదులు పీకల్దాకా దిగబడిపోయారు. నమ్ముకున్న దేవుణ్ణి ఎలాగైనా రక్షించుకోవాలి. కనుక ఓ కొత్త కథనం మొదలుపెట్టారు.
(ఇంకా వుంది)
డార్విన్ సిద్ధాంతాన్ని శాస్త్రజ్ఞులంతా అంగీకరించిందే. ఐతే భూమి ఏర్పడ్డాక కొన్ని ప్రళయాలు సంభవించిఉంటాయి.5వేల ఏళ్ళ క్రితం ఒకజలప్రళయం వచ్చివుంటుంది.దీనిగురించే బైబిల్లోను, సుమేరియా గాథల్లోను,మనపురా ణాలలోను కథలుగా వ్రాసిఉంటారు.ప్రాచీన గ్రీకులు కూడా అట్లంటిస్ అనే పెద్ద ద్వీపం ములిగిపోయిందని నమ్మేవారు.వీటిని శాస్త్రీయంగా పరిశోధించాలి .మన పురాణాల ప్రకారం మాత్రం ఈ విశ్వ సృష్టి కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందని ఉంది.
కమనీయం@
సృష్టి అంటే ఏంటి? ప్రళయం అంటే ఏంటి?