http://www.andhrabhoomi.net/intelligent/ship-builder-093
బ్రిటిష్ పరిపానలలో ఉన్న పందొమ్మిదవ శతాబ్దపు భారత దేశంలో జీవించిన ఓ గొప్ప మెరైన్ ఇంజినీరు ఆర్దశీర్ కుర్సట్జీ (1808-1877). ఇతడు ఫార్సీ జాతికి చెందినవాడు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని చూపించుకోగలగడానికి కారణం వారి సాంకేతిక నైపుణ్యం. ఆవిరి యంత్రం మొదలైన ఆవిష్కరణల వల్ల వచ్చిన పారిశ్రామిక విప్లవం బ్రిటిష్ వారి ప్రాబల్యానికి హేతువయ్యింది. ఆ సాంకేతిక బలంతోనే మన దేశం మీద అంత కాలం రాజ్యం చెయ్యగలిగారేమో.
అల్లంత దూరంలో ఉన్న బ్రిటన్ దీవి నుండి భారతాన్ని పాలించడానికి, సాంకేతిక సత్తాని ఉపయోగించి ఈ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆవిరి యంత్రాల మీద పని చేసే ఓడలు ఆ ప్రయోజనం కోసం బాగా పనికొచ్చాయి. ఇవి కాకుండా ఇండియా అంతటా రైలు మార్గాలు వేశారు. టెలిఫోన్ లైన్లు అమర్చారు. ఇండియాలో తమ కార్యాలయాలలో పని చెయ్యడానికి భారతీయులకి తగు శిక్షణ నిచ్చారు. ఆ విధంగా ఆధునిక సాంకేతిక విద్య ఇండియాలోకి ప్రవేశించింది. ఎంతో మంది భారతీయులు సాంకేతిక విద్యలో శిక్షణ పొందారు. పాశ్చాత్య రాజ్యాల ప్రాబల్యానికి వేళ్లు ఎక్కడ ఉన్నాయో అర్థం చేసుకున్నారు.
అలా బ్రిటిష్ పాలనలో పాశ్చాత్య సంకేతిక విద్యలో ప్రవేశం పొందిన వారిలో కుర్సట్జీ వంశం కూడా ఉంది. ఆర్దశీర్ కుర్సట్జీకి పూర్వీకుడైన లోజీ నుసర్వాన్జీ వాడియా సూరత్ రేవులో వడ్రంగిగా పని చేసేవాడు. బ్రిటిష్ వారు బొంబాయిలో రేవు నిర్మించదలచుకున్నప్పుడు ఆ రేవు నిర్మాణంలో లోజీ నుసర్వాన్జీ సేవలు వాడుకున్నారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు నౌకా నిర్మాణంలో ఓక్ చెట్టు యొక్క కలపని వాడేవారు. కాని బ్రిటిష్ నౌకాదళ విస్తరణ వల్ల అన్ని ఓడలని నిర్మించడానికి ఓక్ చెట్లు సరిపోలేదు. కనుక స్థానికంగా దొరికే మలబార్ టేకు కలపని వాడడం మొదలెట్టారు. ఇది బలమైన కలప. సులభంగా కుళ్ళదు. ఈ కొత్త నౌకా నిర్మాణ పధ్ధతితో బొంబాయి గొప్ప రేవుగా రూపొందింది. ఆ విధంగా కుర్సట్జీ కుటుంబంలో నౌకా నిర్మాణం వంశానుగతంగా వస్తున్న విషయం.
అయితే కుర్సట్జీ మొదట శిక్షణ పొందిన రంగం నౌకా నిర్మాణం కాదు, ఆవిరి యంత్రాల నిర్మాణం. చిన్న వయసులోనే 1-హెచ్.పి. యంత్రం నిర్మించి తన సత్తా నిరూపించుకున్నాడు. ఇండియాలో నిర్మించబడ్డ మొట్టమొదటి ఆవిరి యంత్రం అదేనేమో. దాంతో ఓ నీటి పంపు తయారుచేసి ప్రదర్శించాడు. తరువాత 1833 లో ఇంగ్లండ్ నుండి 10 –హెచ్.పి. ఇంజిను తెప్పించుకుని దాన్ని ‘ఇండస్’ అనే పేరుగల ఓడలో అమర్చాడు. 1834 లో గ్యాస్ తో విద్యుత్ దీపాలు ఎలా అమర్చాలో చేసి చూపించాడు. మజగాన్ లో తన బంగళాలోను, తోటలోను గ్యాస్ దీపాలు అమర్చుకున్నాడు.
అప్పుడే బొంబాయిలో కొత్తగా వచ్చిన ఎల్ఫిన్స్టోన్ సంస్థలో ‘మెకానికల్, కెమికల్ ఇంజినీరింగ్’ రంగాల్లో శిక్షణ పొందాడు. నౌకలలో వాడే అధునాతన ఆవిరి యంత్రాల గురించి ఇంకా లోతుగా తెలుసుకోడానికి ఓ ఏడాది పాటు ఇంగ్లండ్ లో గడిపాడు.
కుర్సట్జీ పార్సీ ఆచారాలని తుచ తప్పకుండా పాటించేవాడు. అందుకే తనతో పాటు కొందరు పార్సీ సేవకులని ఇంగ్లండ్ కి తీసుకువెళ్లాడు. వాళ్లు చేసిన వంటే తినేవాడు. కుర్సట్జీకి ఎందుచేతనో లండన్ అంతగా నచ్చలేదు. లండన్ లోని టంకశాల కన్నా బొంబాయి లోని టంకశాలే నయం అనిపించింది. లండన్ లోని మురికి వీధులు చూసి, బొంబాయిలోని శుభ్రమైన వీధులతో పోల్చుకుని, అసహ్యించుకునేవాడు. మన దేశంలో ప్రస్తుత వాస్తవాలు అప్పటి వాస్తవానికి విరుద్ధంగా ఉండడం చింతించదగ్గ విషయం.
ఇంగ్లండ్ లో ఉండగా కుర్సట్జీ కి 1841 లో అక్కడి ప్రఖ్యాత రాయల్ సొసయిటీ లో సభ్యత్వం దొరికింది. అంత ప్రతిష్ఠాత్మకమైన సదస్సులో సభ్యత్వం పొందిన ప్రథమ భారతీయుడు ఈయనే. ఆ తరువాత 75 ఏళ్ల తరువాత శ్రీనివాస రామానుజన్ కి మళ్లీ అదే గౌరవం లభించింది. అదే సంవత్సరం అతడు గొప్ప హోదాలో ఇండియాకు తిరిగి వచ్చాడు. ఈ కొత్త ఉద్యోగంలో ఎంతో మంది బ్రిటిష్ వారు కూడా కుర్సట్జీ కింద పనిచెయ్యాల్సి వచ్చింది. ఇది నచ్చని బాంబే టైమ్స్ పత్రిక ఈ విధంగా జాత్యహంకారం చూపించుకుంది – “ఎంత సమర్థుడైనా, ఎంత చదువుకున్నా, ఒక స్థానికుడు బాంబే స్టీమ్ ఫాక్టరీ లాంటి గొప్ప పరిశ్రమకి నేతృత్వం వహించడం” ఎంత వరకు సమంజసం అంటూ సందేహం వ్యక్తం చేసింది.
1851 లో కుర్సట్జీ తన పూర్వీకుల గౌరవార్థం ‘లోజీ ఫామిలీ’ అనే పేరుగల ఓ స్టీమరును విడుదల చేశాడు. ఆ స్టీమరులో వాడిన విడిభాగాలన్నీ తన సొంత ఫౌండ్రీలో ఉత్పత్తి చెయ్యబడ్డాయి. బొంబాయిలో మొట్టమొదటిసారిగా కుట్టుమెషిను, ఫోటోగ్రఫీ, ఎలక్ట్రో ప్లేటింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాల ప్రవేశానికి కూడా ఇతడే కారణం.
1861 లో ఇండస్ ఫ్లోటిలా కంపెనీ లో సూపర్ ఇంటెండింగ్ ఇంజినీరుగా పదవీ స్వీకారం చేశాడు. తదనంతరం సింద్ ప్రాంతంలోని కోట్రీ అనే ఊళ్లో ఈ కంపెనీకి శాఖలు కూడా తెరిచాడు. తరువాత 1863 ఇంగ్లండ్ కి వెళ్లి రిచ్మండ్ అనే ఊళ్లో స్థిరపడ్డాడు. జీవితాంతం అక్కడే ఉండి, 16, నవంబర్ 1877 లో కన్నుమూశాడు.
(అరవింద్ గుప్తా రాసిన ‘బ్రైట్ స్పార్క్స్’ అనే పుస్తకం నుండి)
0 comments