శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

పంచమంలో పడతి (బృహస్పతి పంచమం – 9)

Posted by శ్రీనివాస చక్రవర్తి Friday, April 30, 2010 1 comments

ఈ రెండవ వ్యోమనౌక కొన్ని కిమీల దూరంలో దిగింది. దూరం నుండి చూస్తే అచ్చం మా నౌక లాగానే ఉంది. వీలైనంత వేగంగా అడుగులేసి, మా నౌక ఎయిర్లాక్ లోంచి మా నౌక లోకి ప్రవేశించాం. అక్కడ మా ప్రొఫెసర్ అప్పటికే ఎవరో ముగ్గురు కొత్తవాళ్లతో మాట్లాడుతున్నాడు. ఈ లోకం కాని లోకంలో వీళ్లెక్కడి నుండి దాపురించారు? అని తిట్టుకోబోతూ ఆగాను. వాళ్లలో ఒక పిల్ల కూడా ఉందని, ఆమె సామాన్యమైన ఆడపిల్ల కాదని, ఈ నిస్సార జగత్తుకి వన్నె తెచ్చే కన్నె అని ఇట్టే అర్థం చేసుకున్నాను.

ప్రొఫెసర్ ఆ అనుకోని అతిథులని మాకు పరిచయం చేశాడు.

“ఈయన పేరు అభినవ వర్మ. సైన్సు రచయిత. మీరంతా ఈయన గురించి వినే ఉంటారు. ఇక వీళ్లద్దరూ...” అని ఆగి, అభినవ వర్మతోనే “ఇంతకీ వీళ్ల పేళ్లు ఏమన్నారూ?” అన్నాడు.

“ఇతను మా పైలట్ కెప్టెన్ నిత్యానంద్. ఈమె నా సెక్రటరీ ... “

పేరు చెప్పబోతూ ఒక్క క్షణం ఆగాడు. ఆ ఒక్క క్షణంలో ఎన్ని జరిగాయనుకున్నరు? ఉద్విగ్నతకి తట్టుకోలేక నా గుండె వేగం పెరిగింది, ఒంట్లో అడ్రెనలిన్ పరవళ్లు తొక్కింది, ముఖాన ముచ్చెమటలు పోశాయి. గుండెలో X-నాగరికతకి చెందిన కొండంతవి కోటి వాయిద్యాలేవో ఒక్క సారి మీటినట్టయ్యింది. నాలో అంత వేగంగా వస్తున్న పరిణామాలని ఇట్టే పట్టేసిన శేషు నా కేసి కొరకొర చూశాడు. ఆ చూపులో “నువ్వేం ఆలోచిస్తున్నావో అర్థమయ్యింది రా! (ఎందుకంటే నేను కూడా సరిగ్గా అలాగే ఆలోచిస్తున్నా కనక!) అసలు నువ్వు నా స్నేహితుడివని చెప్పుకోడానికే సిగ్గేస్తోంది,” అన్న భావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

“...అమేయ.” ఇద్దర్నీ పరిచయం చేశాడు అభినవ్ వర్మ.

అభినవ్ వర్మ చూడబోతే చాలా సరదా మనిషిలా కనిపించాడు. కాని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆ కలుపుగోరుతనం అంతా తెచ్చిపెట్టుకున్నదేమో ననిపిస్తుంది. ఆ మాత్రం కలుపుగోరుతనం లేకపోతే రచయితల, కళాకారుల ప్రపంచంలో
బతకడం కష్టం కాబోలు.

“ఉన్నట్లుండి మమ్మల్ని ఇక్కడ చూసి అదిరిపోయారు కదూ?” నా వీపు మీద ఉత్సాహంగా చరుస్తూ అన్నాడు అభినవ్ వర్మ. స్పేస్ సూట్ ఇంకా తియ్యలేదు కనుక తమాయించుకున్నాను. “అయినా నాకు మాత్రం ఏం తెలుసు ఈ మారుమూల ఉపగ్రహంలో, ఇదే సమయంలో ఇంత మంది ఊడిపడతారని?”

“ఇంతకీ మీరు ఏం పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా?” ప్రొఫెసర్ అసిస్టెంటు తిరుమల రావ్ ఉండలేక అడిగేశాడు.

“అదే ఇంత సేపు మీ ప్రొఫెసర్ గారికి వివరిస్తున్నా” అంటూ తన సెక్రటరీ కేసి తిరిగి, “అమేయా! ఆ పైలు ఓ సారి ఇలా ఇవ్వమ్మా.”

అందులో అద్భుతంగా వేయబడ్డ, ఖగోళానికి చెందిన తైల వర్ణ చిత్రాలు ఉన్నాయి. గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, ఉల్కాబిలాలు వగైరాలు.

“ఇలాంటి చిత్రాలు మీరు చాలానే చూసి ఉంటారు. కాని వీటికి ఓ ప్రత్యేకత ఉంది. వందేళ్ల నాటి చిత్రాలివి. పృథ్వీ సింగ్ అనే చిత్రకారుడు వేసినవివి. 1944 లో ’లైఫ్’ పత్రికలో ఇవి అచ్చయ్యాయి. అంటే రాకెట్ యుగం ఇంకా ఆరంభం కాక ముందు అన్నమాట. మరి ఆ కళాకారుడు ఇవన్నీ ఎలా ఊహించాడు? ఆ చిత్రాలలో కనిపించే దృశ్యాలకి సంబంధించిన వాస్తవ లోకాలు మన సౌరమండలంలో ఎక్కడైనా ఉన్నాయేమో చూసి రమ్మని ఆ పత్రిక యాజమాన్యం నన్ను పంపింది. లైఫ్ పత్రిక త్వరలోనే శతవార్షికోత్సవం జరుపుకోనుంది. ఆ సంచికలో నేను కనుక్కోబోయే లోకాల ఫోటోలు ప్రచురించాలని యాజమాన్యం ఆలోచన. చాలా గొప్ప ఆలొచన కదూ?”

(సశేషం...)

అతిథులొచ్చారు - (బృహస్పతి పంచమం – 8)

Posted by శ్రీనివాస చక్రవర్తి Thursday, April 29, 2010 1 comments

పంచమంలో పర్యటిస్తున్న కొద్ది దాన్ని సృష్టించిన జాతి మీద మా గౌరవం పెరగ సాగింది. ఐదు మిలియన్ సంవత్సరాల పాటు నిక్షేపంలా ఉన్న వాళ్ల సంస్కృతికి చెందిన జ్ఞాపికలని మేం మొట్టమొదటి సారిగా స్పృశిస్తున్నాం. వాళ్లు మరో తారామండలం నుండి వచ్చిన వాళ్లే కావచ్చు. కొండంత కాయం వున్న మహాకాయులే కావచ్చు. కాని వారికి మన మానవజాతికి మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. వాళ్లని కలుసుకునే మహాభాగ్యం, విశ్వవ్యవధుల ప్రమాణాలతో పోల్చితే, తృటిలో తప్పిపోవడం బాధకలిగిస్తుంది.

కాని మామూలుగా పురావస్తు పరిశోధకులు ఎదుర్కునే ఇబ్బందులు మాకు ఎదురు కాకపోవడం ఒక విధంగా మా అదృష్టమే అని చెప్పాలి. ఇంతకాలం అక్కడి శుద్ధ శూన్యంలో ఆ వస్తువులన్నీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. నౌక యొక్క ఉపరిభాగాలలో ఉన్న వస్తువులన్నీ ఆ జాతివాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండేవో అచ్చం అలాగే ఉన్నట్టు ఉన్నాయి. బహుశ వారి స్వగ్రహానికి, స్వగృహానికి గుర్తుగా ఈ వస్తువులన్నీ ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, పదిలంగా భద్రపరచుకున్నారేమో. అందుకే అక్కడ ఫోటోలు తీస్తున్నప్పుడు కూడా ఒక పక్క ఏదో అపరాధ భావం మనసులో పీకుతూ ఉండేది. అంతేకాక మా దుడుకు పనులని చూసి ఒళ్లు మండి ఏ లోకోత్తర జీవులో భళ్లున ఆ లోహపు గోడలలోంచి ఊడి పడి మాకు తగిన శాస్తి చేస్తారేమో నని ఒకపక్క భయంగా కూడా ఉండేది.

నాలుగో రోజు మా పంట పండింది. నౌక యొక్క దక్షిణ గోళార్థంలో గాలిస్తున్న కాప్టెన్ వర్ధమాన్, గౌరంగ్ లు ఓ ’కళావస్తు ప్రదర్శనశాల’ ని కనుక్కున్నారు. దాని అసలు పేరేంటో తెలీదు గాని మాకు మాత్రం అది అలాగే అనిపించింది. ఇతర భవనాల లాగానే ఇది కూడా చాలా పెద్దది. లోహంతో చేసినదే అయినా మిగతా భవనాలలాగా కఠినంగా, కర్కశంగా లేదు. ఇదేమైనా ఆలయమా? బార్హస్పతేయులకి ఒక మతం లాంటిది ఉంటే ఎలా ఉంటుందో? అది కళానిలయమో, ఆలయమో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అందుకే ’కళాలయం’ అన్న పేరే దానికి సార్థకం చేసేశాం!

అలా ఆ భవనాన్ని కలయదిరుగుతూ ఉంటే ఒక చోట ఒక చిన్న వృత్తాకారపు గది కనిపించింది. ఆ గది వద్ద ఆరు వేరు వేరు సొరంగ మార్గాలు కలుస్తున్నట్టుగా ఉంది. గోడల మీద ఏదో లిపి లోతుగా చెక్కబడి ఉంది. నా టార్చిలైటు కాంతిని గోడల మీద ప్రసరిస్తూ అక్షరాలని అనుసరిస్తూ ముందుకి సాగాను. అప్పుడు కనిపించిందది. ఓ నిలువెత్తు శిల్పం. మొట్టమొదటి సారిగా ఓ గొప్ప కళాఖండాన్ని చూసినప్పుడు ఆ దృశ్యం మనసు మీద వేసిన ముద్రని జ్ఞాపకం తెచ్చుకోవడం కష్టం. అదొక అపురూపమైన అనుభవం. బార్హస్పతేయులు ఎలా ఉంటారో మొట్టమొదటి సారిగా ఆ శిల్పాన్ని చూశాకే తెలిసింది. సరీసృపంలా పొడవైన, నాజూకైన శరీరం. దాని లోతైన కళ్లు నా అంతర్యాన్ని తడుముతున్నట్టు ఉన్నాయి. దాని ముఖంలో గాని, శరీరంలో గాని ఎక్కడా మానవాకృతి కనిపించడం లేదు. దాని నాలుగు చేతుల్లో రెండు చేతులు దాని చాతీ మీద ఒకదాన్నొకటి పెనవేసుకుని ఉన్నాయి. మిగతా రెండు చేతుల్లో ఏవో సాధనాలు – ఆయుధాలేమో – ఉన్నాయి. నేను చూస్తున్నది ఏదో అపరిచిత జీవి శిల్పమే కావచ్చు, కాని దాని ముఖకవళికలలో తొంగి చూస్తున్న భావావేశం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో ప్రజ్ఞ ఉంది, గొప్ప బలంతో, అధికారంతో వచ్చే గాంభీర్యం, రాజసం ఉంది. కాని ఎందుచేతనో విచారం కూడా స్పురించింది. అంత శ్రమ పడి, అంత సృష్టి చేశాక అదంతా వృధాగా వదిలేయాల్సి వస్తుందని విచారమేమో! అందుకేనేమో, మా ప్రొఫెసర్ ఒక సారి వీళ్ల గురించి “మానవత్వం గల మానవేతరులు” అని వర్ణించారు.

ఆ భవనంలో మొత్తం పది నుండి ఇరవై మిలియన్ల కళా వస్తువులు ప్రదర్శించబడ్డాయి. కాని బార్హస్పతేయుల రూపాన్ని తెలిపే శిల్పం అక్కడ ఒక్కటే ఉండడం ఆశ్చర్యం కలిగించింది. వాళ్ల వ్యక్తిగత రూపాలని శిల్పాలుగా ప్రదర్శించుకోవడం గురించి వాళ్లలో ఏదైనా నీషేధం ఉందా? అంత అధునాతన జాతిలో కూడా అలాంటి నిషేధాలు, నమ్మకాలు ఉంటాయా? ఏమో? ఆ గోడల మీద లిపిని అర్థం చేసుకోగలిగితే రహస్యం విడుతుందేమో....
నా మనసు నిండా కోటి ఆలోచనలు హోరు పెడుతున్నాయి.


కొద్ది నిముషాల తరువాత మా మిత్రులతో కలిసి నౌక వద్దకి బయలుదేరాను. ఆ శిల్పం గురించి మా ప్రొఫెసర్ కి పూస గుచ్చినట్టు చెప్పాలి. ’ద్వారం’ లోంచి అందరం బయటపడ్డాం. లోపల ఇందాక చూసిన కళావస్తుప్రదర్శన శాల మాత్రమే కాదు అసలు ఈ లోకమే ఓ కళాఖండం అనిపించేలా ఉంది బయట దృశ్యం. రగిలే జూపిటర్ ముఖం విరజిమ్మే బంగరు తేజం విశాలంగా విస్తరించిన లోహపు మైదానం మీద లాస్యం చేస్తోంది. అంతులేని రోదసిలో మౌనంగా మెరుస్తున్న తారకల కింద, తడిలేని పసిడి వానలో తడుస్తూ, ఆ ప్రశాంత రజనీ దృశ్యాన్ని కాసేపు ఆస్వాదించాం.
అంతలో ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ శేషు గొంతు రేడియోలో వినిపించింది.

“ఏయ్! అదేంటి ప్రొఫెసర్ నౌక స్థానాన్ని మార్చేశాడా?”

“నౌక స్థానాన్ని మార్చడం ఏవిటి? నాన్సెన్స్. అది ఎక్కడ ఉండేదో అక్కడే ఉంది,” కాస్త విసుగ్గా అన్నాను.

తల తిప్పి చూస్తే శేషు అలా పొరబడడానికి కారణం ఏంటో అర్థమయ్యింది. అల్లంత దూరంలో మరో నౌక కనిపించింది.

మాకు అతిథులొచ్చారు.

(సశేషం)


ఆ లోకమే ఒక నౌక (బృహస్పతి పంచమం – 7)

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, April 28, 2010 1 comments

అరవడం అయితే అరిచేశా గాని మరీ అంత దద్దమ్మలా ఎలా మాట్లాడానా అని సిగ్గేసింది. తక్కిన వాళ్ల స్పందన ఎలా ఉందోనని ఓ సారి అటు ఇటు చూశాను. ఒక్క నిముషం అంతా నిశ్శబ్దం. అప్పుడిక గొడవ మొదలయ్యింది. అవునని కాదని అంతా వాదనలోకి దిగారు. ఈ వాదనని మొగ్గలోనే తెంపేస్తూ ప్రొఫెసర్ ఇలా అన్నాడు:

“కిరీటి చెప్పింది నిజం. X-నాగరికతని మన సౌరమండలానికి తెచ్చిన వ్యోమనౌక ఇదే.”

అది విని రాకేష్ అనుకుంటా, కెవ్వున అరిచినంత పని చేశాడు.

“ఏంటి మీరనేది! ముప్పై కిలోమీటర్ల వ్యాసం గల నౌకా?”

“ఆశ్చర్యం ఏవుంది రాకేష్. ఇంజినీరువి. ఓసారి నువ్వే ఆలోచించు,” తొణకకుండా తర్కం చెప్పుకొచ్చాడు ప్రొఫెసర్.

“ఉదాహరణకి ఓ నాగరికత బృహత్తరమైన తారాంతర రోదసిని దాటి ఇతర నాగరికతల కోసం అన్వేషిస్తూ పోవలని అనుకుంది అనుకుందాం. ఇంతకు మించి దానికి వేరే దారేముంటుంది? ఒక చిన్న సైజు గ్రహం లాంటి నౌకని నిర్మించుకుంటుంది. అలాంటి నౌకని నిర్మించడానికి కొన్ని శతాబ్దాలు పట్టొచ్చుగాక. కాని ఆ నౌక స్వయంసంపూర్ణంగా ఉండాలి. అందులో జీవులు తరాల తరబడి ఏ బాహ్యమైన ఆసరా లేకుండా జీవిక సాగించగలగాలి. అలాంటి లక్షణాలు గల నౌక ఈ మాత్రం పరిమాణంలో ఉండాలి. మన సూర్యుణ్ణి సమీపించక ముందు మరెన్ని సూర్యుల వద్ద మజిలీలు చేశారో ఏమో? ఒక తారామండలం లోకి ప్రవేశించాక ఇరుగుపొరుగు గ్రహాలని సందర్శించడానికి కాస్త చిన్న నౌకలు కూడా నిర్మించుకుని ఉంటారు. అలా స్థానికంగా పర్యటిస్తున్న సమయంలో మాతృనౌకని ఎక్కడో ఒక దగ్గర స్థిరంగా ఉంచాలి. కనుక ఇక్కడ దాన్ని నిలిపారు. మన సౌరమండలంలో ఇదే అతి పెద్ద గ్రహం అని గమనించారు. ఇక్కడ ఈ గ్రహం చుట్టూ స్థిర కక్ష్యలో భద్రంగా తిరుగుతూ ఉంటుంది. అదే సూర్యుడి చుట్టూ స్థిర కక్ష్యలో నిలిపితే ఇతర గ్రహాల గురుత్వ ప్రభావం వల్ల ఆ కక్ష్య చెదరిపోయే ప్రమాదం ఉంది.”

“నిజం చెప్పండి ప్రొఫెసర్,” ఇంతలో ఎవరో అడిగారు. “మనం బయలుదేరక ముందే ఇదంతా మీరు ఊహించారా?”

“ఊహించలేదు గాని ఆశించాను. ఆధారాలన్ని ఈ దిశగానే సూచిస్తున్నాయి. ఈ పంచమం విషయంలో ఎప్పుడూ ఏదో విడ్డూరంగానే తోచేది. ఈ ఒక్క చిన్న ఉపగ్రహం మాత్రం జూపిటర్ కి అంత చేరువగా ఉండడం ఏంటి, ఇతర ఉపగ్రహాలన్నీ ఇందుకి డెబ్బై రెట్లు పైగా దూరంలో ఉండడం ఏంటి?” అంటూ ఉపన్యాసాన్ని కాస్త ఆపి, “సరే సరే ఇలా చర్చించుకుంటూ కూర్చుంటే అంతే. బోలెడు పనుంది. పదండి, పదండి” అంటూ తొందర చేశాడు.

“ప్రొఫెసర్ తలచుకుంటే పనికేం తక్కువ?” మనసులోనే అనుకున్నాను. “ఒక దేశం జనాభాకి ఓ అర్థశతాబ్ద కాలం పట్టేటంత హోం వర్కు ఇవ్వగలడు జాగ్రత్త!”

కాని ఆలోచించి చూస్తే నిజంగానే చాలా పనుంది. చరిత్రలోనే ఇది అత్యంత సంచలనాత్మకమైన, అమూల్యమైన పురావస్తు పరిశోధనా రహస్యం. ఓ మహత్తర విజ్ఞాన లోకపు ద్వారాల వద్ద ఏడు మందిమి – కేవలం ఏడు మందిమి – నిలిచి ఉన్నాం. మా కున్న కాస్త వనరులతో, వ్యవధితో ఈ లోకాన్ని, ఈ కృత్రిమ లోకాన్ని పై పైన తడిమి, చూచాయగా తెలుసుకోవడం తప్ప మేం చెయ్యగలిగిందేమీ లేదు. మా వెనుక దళాలు దళాలుగా పరిశోధకులు, పర్యాటకులు వచ్చి దశాబ్దాల పాటు దీన్ని శోధిస్తే గాని తరగని జ్ఞాన నిధులున్నాయి ఇందులో.

మేం మొట్టమొదట చెయ్యాల్సింది, నౌక నుండి వచ్చే విద్యుత్తు మీద పనిచేసే ఓ పవర్ లైటుని, ఓ తీగకి వేలాడదీసి నెమ్మదిగా కిందకి దింపాలి. ఆ దీపం చిందించే వెలుతురులో మెల్లగా ఉపగ్రహం (దీన్ని ఎందుకో వ్యోమనౌక అనబుద్ధి కావడం లేదు) లోతుల్లోకి చొచ్చుకుపోవాలి. అలాగే ఓ కిమీ పొడవున్న తీగకి ఓ లైటుని కట్టి కిందకి వదిలేం. గురుత్వం తక్కువ కనుక అది కిందపడి పగిలిపోతుందన్న భయం లేదు.

ఇది మా తొలి ప్రయత్నమే కనుక పై మూడు కవచాలని దాటి ఆట్టే దూరం పొలేక పోయాం గాని, మా తరువాత వచ్చిన వైజ్ఞానిక పరిశోధనా బృందాలు ఇంకా లోపలికి చొచ్చుకుపోయి ఆ నాగరికతకి చెందిన అద్భుతాలెన్నో కనుక్కున్నాయి.
మేం చూసిన పై పై భాగాలు ఆ జీవుల నివాసాలు కాబోలు. అసలు వాటిని క్షుణ్ణంగా పరిశీలించడానికి ఓ జీవితకాలం పడుతుంది. పైన కవచాలలో అక్కడక్కడ ఉన్న గాజు గవాక్షాల లోంచి లోనికి ప్రవేశించే సూర్యకాంతే ఆ లోకపు లోతుల్లో కాంతులు కురిపించేదేమో. దట్టమైన మూడు కవచాల రక్షణలో ఉన్న ఆ అంతరంగంలో ఒకప్పుడు అనువైన వాతావరణం ఉండేదేమో. ఆ విధంగా ఆ బార్హస్పతేయులు (మరి బృహస్పతి చెంత నివాసం ఏర్పరుచుకున్న ఈ జీవులని ఇంత కన్నా ఎలా పిలవాలో అర్థం కాలేదు) వాళ్లు వచ్చిన తారా వ్యవస్థ సమీపంలో ఉండే పర్యావరణానికి సన్నిహితమైన పర్యావరణాన్ని ఇక్కడ కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నారేమో. వాళ్లకీ వానలు, వసంతాలు, సంజెకాంతులు, సరోవరాలు ఉండేవేమో. మరి ఎక్కణ్ణుంచి తెచ్చుకొచ్చారో గాని అక్కడ ఓ చిన్న పాటి సముద్రం కూడా ఉంది. మూడు కిమీల వెడల్పు ఉన్న ఆ చిట్టి కడలి మంచై ఘనీభవించింది. దాన్ని విద్యుద్విశ్లేషించి, ఉపరితలం మీదనున్న ’ద్వారాల’ని మూసేసి, పంచమం మీద మానవ నివాస యోగ్యమైన పర్యావరణాన్ని కల్పించాలని ఏవో పథకాలు కూడా జరుగుతున్నాయి.

(సశేషం...)


పంచమం నిజస్వరూపం – (బౄహస్పతి పంచమం 6)

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, April 27, 2010 0 comments


డోమ్ చుట్టూ కొంత దూరం వరకు ప్రదక్షిణ చేశాక ఒక చోట ద్వారం లాంటిది కనిపించింది. చాలా చిన్న ద్వారమది. వెడల్పు రెండు మీటర్లే. అది వృత్తాకారంలో ఉండడం వల్ల అది ద్వారం అని గుర్తించడానికి సమయం పట్టింది.

“జాగ్రత్త! అది ద్వారం కాదు” గౌరంగ్ స్వరం రేడియోలో వినిపించింది. “అదేదో ఉల్క చేసిన ఘనకార్యం.”

“అసంభవం!” ప్రొఫెసర్ అరిచినంత పని చేశాడు. “దాని ఆకృతి మరీ తీరుగా ఎవరో గీసినట్టు ఉంది.”
గౌరంగ్ ఒప్పుకోలేదు.


“ఉల్కాపాతాలు జరిగినప్పుడు ఎప్పుడూ వృత్తాకారపు గోతులే పడతాయి. దాని అంచులు చూడండి. ఏదో విస్ఫోటం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆ దెబ్బకి ఉల్క పూర్తిగా ఆవిరైపోయి ఉంటుంది. దాని అవశేషాలు కూడా దొరక్కపోవచ్చు.”

“అయినా ఇలాంటివి మామూలే,” కాప్టెన్ వర్ధమాన్ కూడా సమర్ధిస్తూ వచ్చాడు. “అవునూ, ఇది ఇక్కడ ఎంత కాలంగా ఉందన్నారూ? ఐదుమిలియన్ సంవత్సరాలా? ఇలాంటివి దీని ముఖం నిండా కనిపించకపోతే ఆశ్చర్యపడాలి.”

“సరే ఏదో ఒకటి.” ప్రొఫెసర్ కి ఈ వాదన ఎక్కువగా పొడిగించడం ఇష్టం లేకపోయింది. “నేను మాత్రం ముందు లోపలికి వెళ్తున్నా.”

“సరే అయితే...” ఇలాంటి వ్యవహారాల్లో కెప్టెన్ వర్ధమాన్ మాటే వేదం. “మీకు ఇరవై మీటర్ల పొడవున్న తాడు ఇస్తాను. మేం ఇక్కడే ఈ గొయ్యి అంచు వద్ద కూర్చుంటాం. లేకపోతే మనిద్దరి మధ్య రేడియో సంభాషణలు సాధ్యం కావు.”
ప్రొఫెసర్ విశ్వనాథం పంచమం లోతుల్లోకి ప్రవేశించాడు. ఆయన నుండి వచ్చే సంకేతాలు కెప్టెన్ వర్ధమాన్ కే అందుతుంటాయి కనుక అందరం అతడి చుట్టూ మూగాం.,

కాని ప్రొఫెసర్ పురోగమనం ఎంతో దూరం సాగలేదు. పైన కనిపించే లోహపు కవచం అడుగున మరో కవచం ఉంది.
ఈ రెండు కవచాల నడుమ ప్రొఫెసర్ పట్టేటంత స్థలం మాత్రం ఉంది. ఇంకా అడుగున టార్చి లైటు కాంతిలో కనిపించినంత మేరకు చూస్తే లోహపు ఊచల బాటలే కనిపిస్తున్నాయి. అడుగున ఉన్నది ఓ లోహపు కమ్మీల కారడవి.

మరి కాస్త లోపలికి వెళ్లడానికి మేం మరో ఇరవై నాలుగు గంటలు కుస్తీ పట్టాల్సి వచ్చింది. మందుగుండు పెడితే విషయం చిటికెలో తేలిపోవును. అన్నీ ఆలోచించే ప్రొఫెసర్ కి మందుగుండు మొసుకురావాలన్న ఆలోచన ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. అదే అడిగా. నాకేసి మళ్లీ జాలిగా చూశాడు.

“మనందరి ఉమ్మడి దహనానికి కావలసినంత మందుపాతర తెచ్చాను. కాని మనం శోధిస్తున్న వస్తువులు చాలా విలువైనవి. అది నీకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఎక్కడా విధ్వంసం జరగకుండా జాగ్రత్తపడుతున్నాను.”
ఆయన ఓర్పుని చూసి మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆయన తాపత్రయం ఏంటో ఇప్పుడు అర్థమయ్యింది. ఈ సుముహూర్తం కోసం ఆయన ఇరవై ఏళ్లు ఎదురుచూశాడు. మరి కొద్ది రోజులు ఓపిక పడితే పోయిందేం లేదు.

అలా ఆ కవచాలని భేదించడానికి అంతా కుస్తీ పడుతుంటే చివరికి ఆ రహస్యాన్ని కనుక్కున్నది ఎవరనుకున్నారు? చెప్తే నమ్మరు. మా శేషుగాడు! ఉపగ్రహం యొక్క ఉత్త్తర ధృవం వద్ద తనకో పెద్ద ఉల్కాబిలం కనిపించింది. దీని వ్యాసం ఓ వంద మీటర్లు ఉంటుందేమో. అక్కడ రెండు కవచాల్లోనూ పెద్ద రంధ్రం పడింది.

కాని రెండో కవచంలో పడ్డ రంధ్రం లోంచి లోనికి ప్రవేశించి చూస్తే అక్కడ మరో చిన్న కవచం కనిపించింది. కాని మా అదృష్టం బావుండి ఆ మూడవ కవచంలో కాస్త చిన్న రంధ్రం ఉండడం కనిపించింది. మరీ పెద్దదేం కాదుగాని ఓ స్పేస్ సూట్ పట్టేటంత పెద్దది. ఒక్కొక్కరం ఆ రంధ్రం లోంచి దూరి లోనికి ప్రవేశించాం.

ఉత్సాహంగా లోనికి దూరామన్న మాటే గాని మా అవస్థని ఏమని వర్ణించను? ఆ సమయంలో మేము సరైన పేరు కూడా లేని అనామక లోకపు లోహపు చూరు పట్టుకుని వేలాడే గబ్బిలాలం! దివికి భువికి మధ్య దిక్కులేకుండా వేలాడే విగతాత్మలం! మా టార్చిలైట్ కాంతులు ఆ లోహపు చూరు మీద నాట్యం చేస్తున్నాయి. కాని ఆ కాంతిని

“కిందికి” ప్రసరిస్తే నేల ఎంత దూరంలో ఉందో కూడా అర్థం కాకుండా ఉంది.

ఆట్టే గురుత్వం లేని ఈ చిన్నారి లోకంలో అందరం మా చూరు ఆసరా వొదిలేసి నెమ్మదిగా కిందికి కొట్టుకుపోయాం. కొంత దూరం పోయాక పైన రంధ్రానికి కట్టబడ్డ తాడే మమ్మల్ని ఆపింది. పైకి చూస్తే కవచపు నోటి వద్ద కాస్తంత కాంతి కనిపించింది. ఆ సమయంలో ఆ కాంతులే మా జీవన ఆశాకిరణాలు.

నా నడుముకి కట్టబడ్డ తాడుకి లోలకంలా కాసేపు నెమ్మదిగా వేలాడుతూ ఊగాను. కలో నిజమో తెలీని ఏదో సదసత్ లోకంలో తేలిపోతున్నట్టు ఉంది. నాకు కాస్త పైగా వేలాడుతున్న నా మిత్రుల టార్చిలైట్ కాంతులు మిణుగురుపురుగుల్లా మినుకుమినుకు మంటున్నాయ్. ఆ విచిత్ర దృశ్యాన్ని మైమరచి తిలకిస్తున్న నా తలలో ఉన్నట్టుండి ఏదో మెరుపులా మెరిసి గట్టిగా గావుకేక పెట్టాను:

“ప్రొఫెసర్! ఇదసలు ఉపగ్రహమే కాదు! ఇదో పేద్ద వ్యోమనౌక!”

(సశేషం...)


లోహపు లోకం – (బృహస్పతి పంచమం – 5)

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, April 25, 2010 0 comments


“అంత చిన్న వస్తువుకి ఉండే ప్రకాశం కన్నా దీని ప్రకాశం కొంచెం ఎక్కువగా ఉంది. అది చూస్తే ఇదసలు నిజంగా ఉపగ్రహమేనా అన్న సందేహం కూడా కలుగుతుంది. అసలు దీని కాంతిని ప్రతిబింబించే గుణం ... దాన్నేమంటారూ...” పదం గుర్తు రాక అర్థోక్తిలో ఆపాడు ప్రొఫెసర్.“ఆల్బేడో.” గౌరంగ్ అందించాడు.


“థాంక్యూ గౌరంగ్. దీనికి అంత ఎక్కువ ఆల్బేడో ఉండడం చూస్తే దాని ఉపరితలం మీద ఏదైనా లోహపు పూత ఉందేమో అనిపిస్తుంది.”


“అర్థమయ్యిందోచ్!” ఉత్సాహంగా అరిచాను. “X-నాగరికతకి చెందిన వాళ్లు పంచమం చుట్టూ ఓ పెద్ద లోహపు కవచం నిర్మించి ఉంటారు. మెర్క్యురీ మీద వాళ్ళు నిర్మించిన ’డోమ్’ ల వంటిదే ఇదీను. అయితే ఇంకా చాలా పెద్దది.” గడగడా చెప్పేశాను. ఆ ఆలోచనకి నాకే కొంచెం గర్వం వేసింది.


ప్రొఫెసర్ కి నేనంటే కొంచెం జాలి వేసింది.
“నీకు ఇంకా అర్థం కాలేదన్నమాట!” జాలిగా అన్నాడు.


నేనన్న దాంట్లో తప్పేంటో నాకు అర్థం కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా అలాగే ఆలోచిస్తారేమో....

మరో మూడు గంటల తరువాత ఉపగ్రహం మీద వాలాం. అది రాతి నేల కాదు. ఓ విశాలమైన లోహపు మైదానం. ఆ విచిత్ర పరిసరంలో మా స్థితి చాలా అల్పంగా అనిపించింది. ఓ పెట్రోల్ డ్రమ్ము మీద నడిచే చీమ స్థితి! ఇక ఒక పక్క ఆకాశమంతా ఎడం లేకుండా నింపేస్తూ రగిలిపోతున్న బృహస్పతి. ఎప్పుడూ ’నాకే అంతా తెలుసు’ అన్నట్టు ఉండే ఓ చిద్విలాసపు వెధవ నవ్వు ముఖం మీదేసుకుని తిరిగే మా ప్రొఫెసర్ కూడా ఆ సన్నివేశంలో కాస్త చలించినట్టు కనిపించాడు.


మైదానం అన్నానేగాని అది ఏ రూపురేఖలూ లేని సమతలం కాదు. ఇందాక పైనుంచి చూసినప్పుడు కనిపించిన గజిబిజి గీతలు, విశాలమైన లోహపు ఫలకాల అంచులు.

మేం ఉన్న చోటికి ఓ పావు కి.మీ. దూరంలో ఓ చిన్న గుట్ట లాంటిది ఉంది. ఉపగ్రహం మీద వాలే ముందు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి, సర్వే చేసినప్పుడు కనిపించిందది. ఉపగ్రహం ఉపరితలం మీద అలాంటి గుట్టలు మొత్తం ఆరు ఉన్నాయి. ఉపగ్రహమధ్య రేఖ చుట్టూ సమ దూరాలలో నాలుగు, ధృవాల వద్ద చెరొకటి అమర్చబడి ఉన్నాయి. లోహపు కవచానికి అడుగున ఉన్న లోకానికి ఈ ’గుట్టలు’ ముఖద్వారాలు అయ్యుంటాయి.

బాగా తక్కువ గురుత్వం గల శూన్య లోకం మీద స్పేస్ సూట్లు వేసుకుని సంచరిస్తుంటే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది అంటుంటారు గాని అది పూర్తిగా నిజం కాదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి, ఒళ్లు దగ్గర పెట్టుకుని అడుగేయాలి. కాని ఈ సందర్భంలో ఎందుకో, ఎయిర్ లాక్ లోంచి బయటికి అడుగుపెట్టిన క్షణం నా మనసంతా ఎంత ఉద్విగ్నతతో నిండిపోయిందంటే ఈ చిన్న చిన్న కష్టాలు అసలు గుర్తే రాలేదు.


పంచమం మీద గురుత్వం ఎంత తక్కువగా ఉందంటే, దాని మీద నడవడం అనేది అయ్యేపనిలా లేదు. పర్వతారోహణం చేసే వాళ్లలాగా అందరం ఒకరికొకరు తాళ్లతో కట్టుకుని ఓ గొలుసుకట్టుగా ఏర్పడ్డాం. చిన్న రియాక్షన్ పిస్టోళ్లు వాడుకుంటూ, న్యూటన్ మూడవ నియమం పుణ్యమా అని అటు ఇటు కదలగలిగాం.


కొద్ది నిముషాల్లో మా లక్ష్యం చేరుకున్నాం. పొట్టిగా వెడల్పుగా ఉన్న డోమ్ అది. దాని చుట్టుకొలత కనీసం ఓ కి.మీ. ఉంటుంది. ఏకంగా అంతరిక్ష నౌకలు లోనికి ప్రవేశించేందుకు వీలుగా అదొక పెద్ద ఎర్లాక్ ఏమో నన్న ఆలోచన వచ్చి వొంట్లో కాస్త వొణుకు పుట్టింది. అయినా ఇదంతా ఎన్ని వేల ఏళ్ల నాటిదో. ఇప్పుడంతా పాడైపోయి ఉంటుంది.
మరిప్పుడెలా? లోపల చరిత్రలోకెల్లా అత్యంత విలువైన పురావస్తు నిధులు లోపల ఊరిస్తూ ఉంటే, ఇంత దూరం వచ్చి, ఇలా తలుపుకి తాళం లేకపోవడం వల్ల, ద్వారం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు.


(Image credits: http://bp3.blogger.com/_s_30zQFJp4g/R4Wm_nlOzsI/AAAAAAAACdM/F8EQeVciJI4/s1600-h/Planet+of+Blood+spaceship.jpg)
(సశేషం...)


అదసలు ఉపగ్రహమేనా? (బృహస్పతి పంచమం – 4)

Posted by శ్రీనివాస చక్రవర్తి Saturday, April 24, 2010 1 comments


ప్రొఫెసర్ కథ విని మా శేషులో గాని, నాలో గాని ఆయన ఊహించిన స్పందన కలగలేదు. ఈ పంచమం మీద X-నాగరికత కి చెందిన జీవులు ఏవో జ్ఞాపికలు పొరపాట్న పారేసుకుని ఉండొచ్చుగాక. అంత మాత్రం చేత భూమి నుండి ఇలా ఎగేసుకు రావాల్సిన అవసరం నాకైతే కనిపించలేదు.

ఓ వారం తరువాత బృహస్పతి ఉపగ్రహాల్లో కెల్లా అతి పెద్దదైన గానిమీడ్ మీద వాలాం. గురుడి ఉపగ్రహాలు అన్నిట్లో శాశ్వత మానవ స్థావరం ఉన్నది ఒక్క గానిమీడ్ మీదే. అక్కడ ఓ యాభై మంది సిబ్బందితో ఓ వేధశాల, ఓ భౌగోళిక పరిశోధనా కేంద్రం ఉన్నాయి. మనుషుల కోసం ముఖం వాచినట్టున్నారు పాపం. మమ్మల్ని చూసి తెగ పొంగిపోయారు. కాని ప్రొఫెసర్ రీఫ్యూయెల్ చేసుకుని త్వరగా బయల్దేరాలన్న తొందర మీద ఉన్నాడు. పంచమాన్ని చూడడానికి ఇలా ఒక ప్రత్యేకంగా భూమి ఓ మిషన్ రావడం అక్కడి సిబ్బందికి ఆశ్చర్యంగా ఉంది. కాని వాళ్ల ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పకుండా ప్రొఫెసర్ దాటేస్తూ వచ్చాడు. మేం నోరు మెదప బోతే మాకేసి కొరకొర చూశాడు.

గానిమీడ్ నుండి పంచమాన్ని చేరుకోడానికి సరిగ్గా ఒకటిన్నర రోజు పట్టింది. జూపిటర్ కి దగ్గర పడుతుంటే ఆ గ్రహం ఇంకా ఇంకా పెద్దదై ఆకాశమంతా నిండిపోతున్నట్టు కనిపించి అబ్బురపాటుతో పాటు కాస్తంత భయం కూడా వేసింది. గ్రహాలలో కెల్లా అతిపెద్ద గ్రహం. మరి దాని సమీపంలో గురుత్వం విపరీతంగా ఉంటుందని వేరే చెప్పన్నక్కర్లేదు. పంచమం మీద వాలే ప్రయత్నంలో ఏదైనా తేడా వస్తే అంతే ... ఆ బృహస్పతి బృహత్తులో ఓ ధూళి కణంలా మాయం కావాల్సిందే.

ఒక పక్క భయం వేసినా బృహస్పతి అందాన్ని, గాంభీర్యాన్ని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రహోపరితలం మీద నిరంతరం సంక్షోభంగా చెలరేగే పెను తుఫానులని చూస్తూ చూస్తూ మనసు ఉప్పొంగి వాటి మీద ఆ సమయంలో బోలెడు కవిత్వం కూడా రాశాను. (అయితే కొందరు శ్రేయోభిలాషుల సలహా మీద కథలోంచి ఆ కవితని తొలగిస్తున్నాను. పాఠకులకి నిరాశ కలిగించినందుకు క్షమించాలి.)

మా గమ్యం దగ్గరపడుతోంది. పంచమాన్ని సమీపించి కక్ష్యలోకి ప్రవేశించాం. ఉపగ్రహం ఎలా ఉంటుందో స్పష్టంగా చూడడానికి అందరం కంట్రోల్ రూమ్ లోకి దూరాం. కాప్టెన్ వర్ధమాన్ ఎప్పట్లాగే నిబ్బరంగా తన పనిచేసుకుంటున్నాడు. ఇంజినీరు రాకేష్ పట్నాయక్ మీసం దువ్వుకుంటూ ఫ్యూయెల్ గేజి కేసి ఆలోచనగా చూస్తున్నాడు. నావిగేటర్ గౌరంగ్ ఏవో చార్టులు ముందేసుకుని లెక్కలు వేస్తున్నాడు.

టెలీపెరిస్కోప్ ఐపీస్ మీద కన్ను ఆన్చి ప్రొఫెసర్ ఆత్రంగా చూశాడు. బయట ఏం కనిపించిందో ఏమో... ఆయన నోట్లోంచి చిన్న కేక వెలువడింది. ఒక్క క్షణం ఆగి ఏమీ చెప్పకుండా పక్కనే ఉన్న కాప్టెన్ వర్ధమాన్ కి సైగ చేశాడు. కాప్టెన్ వచ్చి, ఐపీస్ లోంచి చూసి తను కూడా అలాగే స్పందించాడు. కాప్టెన్ ఈ సారి ఇంజినీర్ రాకేష్ ని చూడమన్నాడు. మళ్లీ అదే స్పందన. తరువాత గౌరంగ్ కూడా చూసి అదే విధంగా స్పందించాడు. నాకైతే ఈ వ్యవహారం చూస్తే కంపరం ఎత్తుతోంది. అందరూ అలా వరుసగా నోళ్లు వెళ్లబెట్టకపోతే, నోరు విప్పి విషయం ఏంటో చెప్పొచ్చుగా?

ఇక ఆఖర్న శేషు, నేను కూడా వెళ్లి చూశాం. ఏ అంతరిక్ష బ్రహ్మరాక్షసో కనిపిస్తుందని భయపడ్డా గాని నేను ఊహించింతంగా ఏమీ కనిపించలేదు. నల్లని ఆకాశంలో అల్లంత దూరంలో పంచమం యొక్క అర్థచంద్రికా రూపం కనిపించింది. దాని చీకటి పార్శ్వం మీద మాత్రం బృహస్పతి ముఖం నుండి వెలువడుతున్న బంగరు కాంతులు పడి చిత్రంగా మెరుస్తోంది. ఇంతకు మించి నాకేమీ కనిపించలేదు.

కాని మరి కాసేపు శ్రద్ధగా చూశాను. అప్పుడు కనిపించాయవి. చీకటి పార్శ్వం మీద పొడవాటి గజిబిజి కాంతిరేఖలు పరుగెడుతున్నాయి. అవేవో లోయలకి, అగాధాలకి చెందిన ప్రకృతి సిద్ధ రేఖల్లాగా లేవు. ఎందుకంటే వాటిలో ఓ తీరైన విన్యాసం ఉంది. భూగోళపు నమూనా మీద అడ్డుగాను, నిలువుగాను పరుగెత్తే అక్షాంశ, రేఖాంశ రేఖలని తలపిస్తున్నాయి. ఆ దృశ్యం చూసి ఉత్సాహం పట్టలేక (ప్రొఫెసర్ సన్నిధిలో ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా) ఈల వేశాను. ఆ ఈల విన్న శేషు నన్ను అవతలికి తోసి తన పెదవిని పంటి కింద నొక్కి, కంటిని ఐపీస్ మీద నొక్కాడు.

ఏ దేవతో పూనిన వాడిలా మా ప్రొఫెసర్ ముఖమంతా పూర్తిగా మారిపోయింది. అర్థనిమీలిత నేత్రాలతో, ఓ విచిత్రమైన చిరునవ్వుతో వెళ్లి ఓ చోట చిద్విలాసంగా బోధి వృక్షం కింద బుద్ధుడిలా కూర్చున్నాడు. ఇందాక కనిపించిన దృశ్యానికి వివరణ మొదలెట్టాడు.

“మీకు ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు గాని నాకేమీ అంత ఆశ్చర్యం కలిగించలేదు. మెర్క్యురీ మీద దొరికిన ఆధారాలు కాకుండా మరి కొన్ని ఆనవాళ్లు కూడా ఉన్నాయి. గానిమీడ్ మీద ఉన్న వేధశాలలో నాకో మిత్రుడు ఉన్నాడు. ఈ మధ్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనుక్కున్నాడు. ఖగోళ శాస్త్రంలో ఏ మాత్రం ప్రవేశం ఉన్నవాడికైనా ఈ వేధశాల ఇంత కాలం పక్కనే ఉన్న బృహస్పతి ఉపగ్రహాల గురించి పట్టించుకోకుండా, గెలాక్సీకి బయట ఉన్న పేరూ ఊరూ లేని నెబ్యులాలని పట్టుకుని దేవుళ్లాడడం కొంచెం విడ్డూరంగా అనిపించొచ్చు. ఇక ఈ పంచమం విషయానికొస్తే దాని వ్యాసాన్ని కొలవడం, ఏవో కొన్ని ఫోటోలు తియ్యడం మించి ఈ వేధశాల పెద్దగా ఏమీ చేసినట్టు లేదు. పైగా ఆ ఫోటోలు కూడా అంత గొప్పవేం కావు. అందులో మనం ఇందాక చూసిన గజిబిజి రేఖలు కనిపించవు.

“కనుక వేధశాలలో పనిచేసే నా మిత్రుడు వరవరరావుని తమ 100-cm పరావర్తన దూరదర్శినిలో చూసి వివరాలు చెప్పమన్నాను. అప్పుడు తనకి కూడా ఈ గజిబిజి రేఖలు కనిపించాయి. పంచమం వ్యాసం కేవలం ముప్పై కిమీలే గాని అంత చిన్న వస్తువుకి ఉండే ప్రకాశం కన్నా దీని ప్రకాశం కొంచెం ఎక్కువగా ఉంది. అది చూస్తే ఇదసలు నిజంగా ఉపగ్రహమేనా అన్న సందేహం కూడా కలుగుతుంది.”

(సశేషం...)

బృహస్పతి పంచమం - 3

Posted by శ్రీనివాస చక్రవర్తి Friday, April 23, 2010 1 comments

ఈ X-నాగరికత గురించి మా ప్రొఫెసర్ కి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వీళ్లు అంతరిక్ష యానంలో ఆరితేరిన వాళ్లు. ఎందుకంటే మెర్క్యురీ మీద కూడా వీళ్ళ ఆనవాళ్లు దొరికాయి. జల్లెడ తీగల్లాంటి తీరైన వీధులున్న, X-నాగరికత కి చెందిన, నగరాల శిధిలాలు మెర్క్యురీ నేలలో దొరికాయి. ప్రొఫసర్ ఉద్దేశంలో ఆ జాతి వారు చిన్న గ్రహాలన్నిటినీ ఆక్రమించుకోవాలని చూశారు. భూమి, వీనస్ గ్రహాల మీద గురుత్వం మరీ ఎక్కువ కావడంతో ఈ రెండు గ్రహాల జోలికీ పోలేదట. కాని మరి మన చందమామ మీద వాళ్ల ఆచూకీ లేకపోవడం ప్రొఫెసర్ విశ్వనాథాన్ని కొంచెం నిరాశపరిచింది. ఏదో ఒక నాడు తప్పకుండా చందమామ మీద కూడా ఆ జాతికి చెందిన ఆనవాళ్లు దొరుకుతాయని ఆయనకి గట్టి నమ్మకం.

X-నాగరికత ఆవిర్భావాన్ని గురించి సాంప్రదాయక సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటాయి మా ప్రొఫెసర్ భావాలు. సాంప్రదాయక సిద్ధాంతం ప్రకారం ఈ X-నాగరికత మన సౌరమండలంలో ఏదో చిన్న గ్రహం మీదనో, ఉపగ్రహాల మీదనో ఆవిర్భవించి, ఒక దశలో మార్షియన్ జాతిని సంపర్కించి, మార్షియన్ జీవన స్రవంతితో కలిసిపోయి, ఆ జాతితోనే అంతరించిపోయింది. కాని ప్రొఫెసర్ గారి ఆలోచన వేరు. X-నాగరికత సౌరమండలానికి బయట ఎక్కడో ఆవిర్భవించి ఒక దశలో మన సౌరమండలం లోకి ప్రవేశించిందట. కాని ఆయన భావాలతో ఏకీభవించే వారు కోటికి ఒక్కరు కూడా ఉండరు. అందుకు ఆయన విచారపడకపోగా అదేదో గర్వకారణంగా బడాయిపోతుంటారు.

ప్రొఫెసర్ విశ్వనాథం తన పథకాలని వివరిస్తుంటే నేను మా కాబిన్ కిటీకీ లోంచి కనిపిస్తున్న జూపిటర్ ని చూస్తున్నాను. అది మన సౌరమండలంలోనే ఓ అత్యద్భుతమైన, గంభీరమైన దృశ్యం. కుంకుమ, విభూతి కలిపి నామాలు పెట్టినట్టు దేవగురువు ముఖం దివ్యంగా వెలిగిపోతోంది. గ్రహమధ్య రేఖ మీదుగా విస్తరించిన మేఘమాల నెరిసిన మీసకట్టులా మెరిసిపోతోంది.

బృహస్పతికి అల్లంత దూరంలో మూడు చిన్న ఉపగ్రహాలు తారకలలా మెరుస్తున్నాయి. వీటిలో మేం మొదట దిగాల్సిన గానిమీడ్ ఏదో నాకు అర్థం కాలేదు.

“ఏం కిరీటీ! ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నావు?” ప్రొఫెసర్ స్వరానికి ఉలిక్కి పడి ఆయన కేసి చూశాను.
“ఇంతకీ ఈ యాత్ర ఎందుకు చేస్తున్నామో చెప్పాను కాదు. గత ఏడాది నేను మెర్క్యురీ మీద ఎన్నో శిధిలాలని బాగా క్షుణ్ణంగా తనిఖీచేసిన మాట మీకు తెలుసు. ఆ విషయం మీద నేను టి.ఐ.ఎఫ్.ఆర్. లో ప్రెసెంట్ చేసిన పేపర్ మీరు కూడా చదివే ఉంటారు.” చిన్న వ్యంగ్యమైన చిరునవ్వు నవ్వి, “ఆ రోజు సభలో మీరు ఉన్నారనే అనుకుంటాను. వెనక సీట్లలో మహా కోలాహలంగా ఉండడం నాకు బాగా గుర్తు.”

ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయాడు.


“కాని ఆ సందర్భంలో నేను చెప్పని రహస్యం ఒకటుంది. X-నాగరికత మూలాల గురించి ఓ ముఖ్యమైన ఆనవాలు దొరికింది. అప్పుడు ఆ విషయం గురించి నోరు మెదప దలచుకోలేదు. ఆ సందర్భంలో డా కులకర్ణి కి ఎప్పట్లాగే అతితెలివి ప్రదర్శించే అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాను. ఈ అన్వేషణలో నేనే ముందుండాలి. ఈ పోటీ నేనే గెలవాలి.”

“మెర్క్యురీ లో తవ్వకాలలో దొరికిన శిధిలాలలో ఒక చోట మొత్తం సౌరమండలానికి నమూనా లంటి శిల్పం దొరికింది. ఖగోళాన్ని చిత్రీకరించే కళాఖండాలు మార్షియన్ నాగరికత, X-నాగరికతలకి చెందిన పురావస్తు ఆవిష్కరణల్లో దొరకడం పరిపాటే. మార్స్, మెర్క్యురీ గ్రహాలకి చెందిన ఎన్నో చిత్రాలు కూడా అక్కడ దొరికాయి. కాని చిత్రం ఏంటంటే ఆ చిత్రాల్లో జూపిటర్ యొక్క ఐదవ ఉపగ్రహమైన ఈ ’పంచమం’ కి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ ఉపగ్రహం మీద మనకి ఇంతవరకు తెలీని ఏదో గొప్ప రహస్యం దాగి వుందని అప్పట్నుంచి నా మనసులో బలంగా పడిపోయింది.”

(సశేషం)

X-నాగరికత (బృహస్పతి పంచకం -2)

Posted by శ్రీనివాస చక్రవర్తి Thursday, April 22, 2010 1 comments

“భూమిని విడిచి బయలుదేరిన దగ్గర్నుండి మీతో పెద్దగా మాట్లాడడానికే వీలుపడలేదు.” గొంతు సవరించుకుంటూ అన్నాడు ప్రొఫెసర్. “ఈ యాత్రకి లక్ష్యం ఏంటో మీకు వివరంగా చెప్పాలి.”


ఎదురు ప్రశ్నలు వేసి చిత్రహింస పెట్టకుండా ఇలా మా ప్రొఫెసర్ సూటిగా విషయం చెప్పేస్తున్నాడేంటని మేము ఆశ్చర్యపడేటంతలో, ఆయనే మళ్లీ అన్నాడు:
“పోనీ నేను చెప్పే బదులు మీరే ఊహించగలరా మన యాత్రకి లక్ష్యం ఏంటో?”


“మీ మనసులో ఏవుందో మాకెలా తెలుస్తుంది .. కానీ” కాస్త సగౌరవంగా సణిగాడు శేషు. “బహుశ జూపిటర్ ఉపగ్రహాల మీద ఏవైనా కొత్త సంగతులు తెలుసుకోవచ్చేమో నన్న...”


“భేష్ శేషూ!” ప్రొఫెసర్ సంతోషం పట్టలేక ఎప్పట్లా శేషు వీపుని ఓసారి మోగించాలనుకున్నాడు గాని, ఈ శూన్య గురుత్వ లోకంలో ఆ చర్యకి పర్యవసానం ఏంటో తెలిసి తమాయించుకున్నాడు. “భలే చెప్పావ్. మనకి తెలిసి బృహస్పతికి పదిహేను ఉపగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటి ఉపరితల విస్తీర్ణత కలిపితే భూమి ఉపరితలంలో సగం ఉంటుందేమో. మనకేమో పట్టున రెండు వారాలు కూడా లేవు. అంత తక్కువ సమయంలో అంత ప్రాంతం ఎలా గాలించడం?” మళ్లీ ప్రశ్న కసిగా విసిరాడు ప్రొఫెసర్.


శేషు ఓసారి ఇబ్బందిగా కదిలి, కొంచెం ధైర్యం తెచ్చుకుని అన్నాడు,

“నాకు ఖగోళశాస్త్రం పెద్దగా తెలీదుగాని. అదుగో ఆ నాలుగు పెద్ద ఉపగ్రహాలు ఉన్నాయిగా. నేనైతే వాటితో మొదలుపెడతాను.”

“కాని మరి నీకు తెలుసోలేదో. నువు చెప్పే ఆ నాలుగు ఉపగ్రహాలు – అయో, యూరోపా, గానిమీడ్, కల్లిస్టో లు. ఒక్కొక్కదాని విస్తీర్ణత ఆఫ్రికా ఖండం అంత ఉంటుంది. ఏ వరుసలో వాటిని గాలిస్తే బావుంటుందంటావ్?”
నాకీ ఈ జ్ఞాన హింస బొత్తిగా నచ్చలేదు.

“బృహస్పతికి అతి దగ్గరి ఉపగ్రహంతో మొదలెట్టి క్రమంగా దూరంగా జరుగుతూ పోతే...?”

“ప్చ్” బాధగా అన్నాడు ప్రొఫెసర్. కాని జాగ్రత్తగా వింటే ఆ బాధ వెనుక వ్యంగ్యం ధ్వనిస్తుంది. “నువ్వు పట్టేస్తావు అనుకున్నా శేషూ. నువ్వు చెప్పింది తప్పు. నీ ఆలోచనా విధానం తప్పు. మనం అసలు పెద్ద ఉపగ్రహాల వద్దకే పోవడం లేదు. భూమి నుండి ఇప్పటికే వాటిని క్షుణ్ణంగా సర్వే చేశారు. ఎన్నో మిషన్లు కూడా ఇప్పటికే వాటిని పరిశీలించాయి. మనం వెళ్లేది ఇంతవరకు ఇవరూ వెళ్ళని చోటికి.”

“కొంపదీసి జూపిటర్ కి కాదు కద.” భయంగా అన్నాన్నేను. అక్కడి నిరవధిక ప్రళయభీకర వాయుదుమారాలలో ఊపిరాడక చచ్చిపోతున్న దృశ్యాన్ని ఊహించుకుంటూ.

“లేదు. కాని ఇంచుమించు అంతవరకు వెళ్తున్నాం. గురుడికి అంత దగ్గరిగా ఇంత వరకు ఎవరూ పోలేదు.”
ఈ సారి సాలోచనగా అన్నాడు.

“మీకు తెలుసోలేదో గాని... విచిత్రం ఏంటంటే జూపిటర్ ఉపగ్రహాల మధ్య ప్రయాణించడం ఎంత కష్టమో, గ్రహాల మధ్య ప్రయాణించడం కూడా అంతే కష్టం. దానికి కారణాలు రెండు. జూపిటర్ కి ఉండే బ్రహ్మాండమైన గురుత్వం. అతి వేగంగా కదిలే దాని ఉపగ్రహాలు. జూపిటర్ కి అత్యంత సన్నిహితంగా ఉండే ఉపగ్రహం ఇంచుమించు భూమి అంత వేగంగా కదులుతోంది. కనుక గానిమీడ్ నుండి అక్కడికి ప్రయాణించడానికి ఎంత ఇంధనం అవుతుందో, భూమి నుండి వీనస్ కి ప్రయాణించడానికి కూడా అంతే ఇంధనం అవుతుంది. ఇదే మనం చేయబోతున్న యాత్ర. ఇంతవరకు ఈ యాత్ర చెయ్యాలని ఎవరికీ అనిపించలేదు. ఈ బృహస్పతి పంచమం చాలా చిన్న ఉపగ్రహం. దీని వ్యాసం కేవలం ముప్పై కి.మీ.లే. జూపిటర్ కి కొంచెం దూరంలో ఉండే చిన్న ఉపగ్రహాలని కూడా ఇంతవరకు ఎవరూ సందర్శించలేదు. సందర్శించడం డబ్బు దండుగ అనుకున్నారు.”

“మరి మనం ఇప్పుడు ఇంత ఇదిగా ఎందుకు బయలుదేరినట్టు?” కొంచెం అసహనంగా అడిగాను, ’ఇది’ అన్న మాటను కాస్త నొక్కి పలుకుతూ. ఏదో ప్రొఫెసరు ఉత్సాహపడుతున్నాడని గాని నాకైతే ఇదంతా వట్టి పనికిమాలిన వ్యవహారంలా తోచుతోంది.

ఇక్కడ మా ప్రొఫెసర్ విశ్వనాథం గారి గురించి ఆయన సిద్ధాంతాల గురించి కొంచెం చెప్పాలి. నాకైతే ఆయన సిద్ధాంతాల మీద బొత్తిగా నమ్మకం లేదు గానీ ఆయనకి ఆయన రంగంలో మంచి పేరు ఉంది. కాని ఆయన భావాలు చాలా నవ్యంగా, విప్లవాత్మకంగా ఉంటాయి. అసలు నమ్మశక్యంగా అనిపించవు.

ఆ మధ్యన అలాగే ఒక మార్స్ మిషన్లో ఆ గ్రహం మీద రెండు ప్రాచీన నాగరికతల శిధిలాలు బయటపడ్డాయి. రెండూ బాగా అధునాతనమైనవే. కాని ఐదు మిలియన్ సంవత్సరాల క్రితమే రెండూ అంతరించిపోయాయి. అందుకు కారణం ఏంటో ఇప్పటికీ తెలీదు. యుద్ధం వల్ల జరిగినట్టు కనిపించలేదు. ఎందుకంటే రెండు నాగరికతలు సామరస్యంగా జీవించినట్టే కనిపించింది. వాటిలో ఒక జాతి జీవులు కొంచెం పురుగుల్లా ఉంటారు. వీళ్లే ఆదిమ మార్షియన్లు. ఆ గ్రహం మీదే ఆవిర్భవించి, పరిణామం చెందినవారు. రెండవ జాతి పాముల్లాగా, సరీసృపాల్లాగా ఉంటారు. వీళ్లు బయటి నుండి వచ్చినట్టు కనిపిస్తుంది. వీళ్లు ఎవరో, ఎక్కణ్ణుంచి వచ్చారో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. అందుకే ఈ నాగరికతని “X-నాగరికత” అని పిలిస్తారు.

ఈ X-నాగరికత గురించి మా ప్రొఫెసర్ కి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి.
(సశేషం...)

బృహస్పతి పంచమం - కాల్పనిక వైజ్ఞానిక కథ

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, April 21, 2010 3 comments


కాల్పనిక వైజ్ఞానిక సాహితీలోక పితామహుడు అని చెప్పుకోదగ్గ ఆర్థర్ సి. క్లార్క్ రాసిన ఓ కథకి అనువాదం ఇది. ఈ కథ పేరు Jupiter Five. జూపిటర్ ఉపగ్రహాల్లో అంతవరకు పెద్దగా ఎవరూ పట్టించుకోని, ఐదవ ఉపగ్రహం పేరు అది. ఆ ఉపగ్రహంలో మానవేతర సంస్కృతికి చెందిన అవశేషాలు, రహస్యాలు ఏవో ఉన్నాయన్న నమ్మకంతో, అదేదో తేల్చుకుందామని ఒక ప్రొఫెసర్ తన బృందాన్ని తీసుకుని బయలుదేరుతాడు. తీరా అక్కడికి చేరాక వాళ్లకి పోటీగా మరో ముఠా తయారవుతుంది. అప్పుడేం జరుగుతుందో ... కథ చదివితే తెలుస్తుంది. (కథ సహజంగా ఉండడానికి పాత్రల పేర్లు (చివరికి నౌకల పేర్లు కూడా) మార్చడం జరిగింది.)బృహస్పతి పంచమం

ఆయనే ప్రొఫెసర్ విశ్వనాథం... మనిషి పొట్టివాడే గాని (ఎంత పొట్టివాడంటే ఆయన కోసం ప్రత్యేకంగా కొలతలు ఇచ్చి స్పేస్ సూట్ తయారుచెయ్యించాల్సి వచ్చింది) బుద్ధి మహా పదును. ఎవరికీ రాని ఏవో విచిత్రమైన ఆలోచనలు ఆయనకే వస్తుంటాయి. ఎప్పుడూ ఏదో చెయ్యాలని, ఏవో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటాడు. ఒకసారి ఆయనకి ఏదైనా బుద్ధి పుడితే దాన్ని సాధించిన దాకా నిద్రపోడు. నిద్రపోడు గాని కలలు మాత్రం తెగ కంటాడు.

ఆయనదో విచిత్రమైన కల. ఓ కూతుర్ని పెంచినట్టు ఇరవై ఏళ్ల పాటు దాన్ని మురిపెంగా పెంచి పెద్దచేశాడు. ఆ కలని ఇప్పుడు సాకారం చేసుకునే సమయం వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ని సఫలం చేసుకోడానికి పెద్ద పెద్ద వైజ్ఞానిక సదస్సులని ఒప్పించి పెద్ద మొత్తంలో ’కట్నం’ డబ్బు తెచ్చుకున్నాడు. అంతే కాదు. పుష్పక విమానం లాంటి చక్కని అంతరిక్ష నౌకని కూడా ఎలాగో పట్టాడు. (దానికి రాజహంస’ అని ఓ పేరు కూడాను.) అయినా... ఇంత వివరం మాలిన వ్యవహారం కోసం ఇన్ని విరాళాలు ఏ వెర్రిబాగులోడు ఇచ్చాడో నాకైతే ససేమిరా అర్థం కాలేదు.

మొత్తం ఆరు మంది సిబ్బందితో ’రాజహంస’ పృథ్వీ వాతావరణాన్ని విడిచి అంతరిక్షంలోకి ప్రవేశించింది. సిబ్బందిలో అందరి కన్నా ముఖ్యుడు ప్రొఫెసర్ విశ్వనాథంగారే. ఆయనకసలే కాస్త మతిమరుపు. కనుక ఆయన విషయాలన్నీ చూసుకునే ఆయన అసిస్టెంట్ తిరుమల రావు కూడా మాతో వచ్చాడు. వీళ్లు కాక ప్రతీ నౌకలోను తప్పనిసరిగా ఉండాల్సిన ముగ్గురూ - బండి చలాయించడానికి ఓ పైలెట్, దారి చూపించడానికి ఓ నావిగేటర్, బండి దార్లో పేచీ పెడితే చూసుకోవడానికి ఓ ఇంజినీరు – ఉన్నారు. ఇక ఆఖర్లో మిగిలింది మా శేషాద్రి శర్మ, నేను. మేమిద్దరం ప్రొఫెసర్ వద్ద రీసెర్చి చేస్తున్నాం అన్నమాట.

శేషుకి, నాకు అంతరిక్షం లోకి రావడం ఇదే మొదటి సారి. ఇద్దరికీ ఈ యాత్ర భలే థ్రిల్లింగ్ గా ఉంది. అందుకే మేం తిరిగి భూమికి వెళ్లేసరికి మా క్లాసులు మొదలవుతాయన్న బెంగ కూడా లేదు. పనికిమాలిన క్లాసులు. ఎప్పుడూ ఉండేవేగా! అయితే అక్కడ మాకు పాఠం చెప్పిన ప్రొఫెసర్ కూడా అలాగే అనుకున్నాడో ఏమో. కాస్త సిఫారసు ఇయ్యవయ్యా పెద్దమనిషీ అంటే తిడుతున్నాడో, పొగుడుతున్నాడో అర్థం కాకుండా ఏదో సోది రాశాడు. ఎవరికీ అర్థం కాని సోది రాయడంలో ఆయన ఎలా దిట్టో, ఎవరికీ అర్థం కాని సోది చదవడంలో మేం దిట్ట. మార్షియన్ రహస్య లిపి చదవడంలో మంచి పాండిత్యం గల వాళ్ల సంఖ్య చేతివేళ్ల మీద లెక్కెట్టొచ్చు. వారిలో చిటికెన వేలు మా శేషు, చూపుడు వేలు నేను. అందుకే రాజహంసలో సీట్లు కొట్టేశాం.

కాని మేం వెళ్తున్నది మార్స్ కి కాదని, జూపిటర్ కి అని ముందు మాకు మాత్రం ఏం తెలుసు? మా అంతకి మేము కుక్కపాట్లు పడి తెలుసుకోవడమే గాని మా ప్రొఫెసరు మాకు విపులంగా విషయం చెప్పిందెప్పుడు? కాని ప్రొఫెసరు సిద్ధాంతాల గురించి మాకు బాగా తెలుసు కనుక, జూపిటర్ మీద పని ఏవై ఉంటుందో ఇద్దరం ఊహాగానాలు చెయ్యడం మొదలెట్టాం. భూమిని వొదిలి పది రోజు లయ్యిందేమో. మా ఊహలు నిజమేనని మెల్లగా అర్థం కాసాగింది.

అప్పుడప్పుడు మా ప్రొఫెసర్ కి మా ఇద్దరికి జ్ఞానభిక్ష పెట్టాలని బుద్ధి పుడుతుంది. అలాంటప్పుడు ఎంత దూరంలో ఉన్నా కను సన్న చేసి పిలుస్తాడు. ఆ పిలుపు మాకు బాగా తెలుసు. ఇప్పుడలాగే పిలిచాడు. ఇద్దరం వెళ్లాం... అంటే వెళ్లడానికి ప్రయత్నించాం. ప్రొఫెసర్ పిలవగానే పరుగుపరుగున వెళ్లడం మాకు కొత్త కాదు గాని, బొత్తిగా గురుత్వం లేని శూన్య లోకంలో పరుగులు పెట్టడంలో మాకంత అనుభవం లేదు. ఒక పక్క మా శేషుగాడు ర్యాకెట్ బాల్ లా నౌక గోడల మధ్య తుళ్లుతున్నా, నాకు నేల మీద కాళ్లు ఆనడమే గగనమై పోతున్నా, మా ప్రొఫెసర్ మాత్రం నిండు కుండలా తొణకకుండా ఉన్నాడు. జీవితంలో ’సెటిల్’ కావడానికి అవస్థ పడుతున్న మా ఇద్దరి కేసి ఓ సారి విచారంగా చూశాడు. భూమి మీద కూడా అలా మా కేసి ఎన్నో సార్లు చూశాడు. ఆ చూపులో కోటి ప్రశ్నలు. “వీళ్లసలు ఎలా పుట్టారు?” “ఎందుకు పుట్టారు?” “నాకే ఎందుకిలా తగులుకున్నారు?” “వీళ్ల నుండి నాకు విముక్తి ఎప్పుడు?” ఏంటో ఆయన ప్రశ్నలు మాకెప్పుడూ అర్థం కావు.

“భూమిని విడిచి బయలుదేరిన దగ్గర్నుండి మీతో పెద్దగా మాట్లాడడానికే వీలుపడలేదు.” గొంతు సవరించుకుంటూ అన్నాడు ప్రొఫెసర్. “ఈ యాత్రకి లక్ష్యం ఏంటో మీకు వివరంగా చెప్పాలి.”


(సశేషం...)
సౌరమండలం ఆవిర్భావం – వైత్సాకర్ సిద్ధాంతం

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, April 18, 2010 0 comments


కనుక ఖగోళశాస్త్రవేత్తలు ఉపద్రవాలని పక్కన పెట్టి మళ్లీ పరిణామాత్మక సిద్ధాంతాల వైపు మొగ్గు చూపారు. లాప్లాస్ ప్రతిపాదించిన నీహారికా సిద్ధాంతాన్ని మరొక్కసారి పరిశీలించసాగారు.


అయితే అప్పటికే విశ్వం గురించిన వాళ్ల అవగాహన గణనీయంగా విస్తరించింది. గెలాక్సీల ఆవిర్భవాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మన సౌరమండలం యొక్క ఆవిర్భవానికి అవసరమైన వాయు రాశుల కన్నా బృహత్తరమైన వాయు రాశుల గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. అంత విస్తారమైన వాయురాశులు ఉన్నప్పుడు, ఆ వాయుప్రవాహంలో సంక్షోభం (turbulence) పుట్టి, అందులో చిన్న చిన్న సుడిగుండాలు ఏర్పడి, ఆ సుడిగుండాలే వివిధ ప్రత్యేక, సంఘనిత రాశులుగా ఏర్పడతాయని అర్థమయ్యింది.

1944 లో జర్మన్ ఖగోళశాస్త్రవేత్త కార్ల్ ఫాన్ వైత్సాకర్ ఈ భావనని చాలా లోతుగా శోధించాడు. అలాంటి బృహత్తరమైన ఖగోళవాయు రాశులలోని అతి పెద్ద రాశులలో గెలాక్సీలు రూపొందడానికి కావలసినంత పదార్థం ఉంటుందని అతడి విశ్లేషణలో తేలింది. అలాంటి సుడిగుండం ఒకటి సంక్షోభంగా సంకోచిస్తున్నప్పుడు, అందులో మరిన్ని చిన్న సుడిగుండాలు ఏర్పడతాయి. అలాంటి చిన్న సుడిగుండాలలో సౌరమండలాల రూపకల్పనకి కావలసినంత పదార్థం ఉండొచ్చు. అలా సౌరమండలాలని ఏర్పరచిన చిన్న సుడిగుండాల అంచులలో ఉండే మరింత చిన్న సుడిగుండాలలోంచి గ్రహాలు ఏర్పడవచ్చు. దగ్గర దగ్గరగా ఉన్న సుడిగుండాలు ఒకదాన్నొకటి తాకుతూ, మరలో చక్రాలలా ఒక దాన్నొకటి రాసుకుంటూ పరిభ్రమించవచ్చు. అలాంటి ప్రదేశంలో రేణువులు ఒకదాన్నొకటి ఢీకొంటూ ఒక సంఘటిత రాశిగా ఏర్పడవచ్చు. అక్కణ్ణుంచే గ్రహాలు, గ్రహశకలాలు పుడతాయి.

వైత్సాకర్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం సమంజసంగానే ఉన్నా, లాప్లాస్ సిద్ధాంతం ఏ సమస్యనైతే ఎదుర్కుందో, ఇది కూడా అదే సమస్యని ఎదుర్కుంది. గ్రహాల కోణీయ ద్రవ్యవేగానికి సంబంధించిన సమస్యని ఇది కూడా తీర్చలేకపోయింది. అప్పుడు స్వీడెన్ కి చెందిన హానెస్ ఆల్ఫెన్ అనే ఖగోళశాస్త్రవేత్త సూర్యుడి యొక్క అయస్కాంత శక్తిని పరిగణన లోకి తీసుకుంటూ ఓ కొత్త సిద్ధాంతాన్ని రూపొందించాడు. యవ్వన దశలో ఉన్న సూర్యుడు గిర్రున పరిభ్రమిస్తున్నప్పుడు దాని అయస్కాంత క్షేత్రం దాని కదలికకి కళ్లెం వేసింది. ఆ విధంగా సూర్యుడు నెమ్మదించి, తన కోణీయ ద్రవ్యవేగాన్ని గ్రహాలకి ఆపాదించాడు. ఈ అయస్కాంత క్షేత్రం యొక్క ప్రభావాన్ని ప్రవేశపెడుతూ ఖగోళశాస్త్రవేత్త ఫ్రెడ్ హొయల్ పైన చెప్పుకున్న వైజ్క్రాకర్ చెప్పిన సిద్ధాంతాన్ని మరింత విస్తరింపజేశాడు. ఆ విధంగా గురుత్వ, అయస్కాంత బలాలని కలగలిపి రూపొందించబడ్డ ఈ సిద్ధాంతం అప్పట్లో సౌరమండలం యొక్క ఆవిర్భవానికి సంబంధించిన అత్యంత శ్రేష్టమైన సిద్ధాంతంగా పేరుపొందింది.

సమాప్తం

సౌరమండలం ఆవిర్భావం - ఉపద్రవాత్మక సిద్ధాంతాలు

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, April 14, 2010 0 comments1905 లో థామస్ క్రౌడర్ చాంబర్లేన్ మరియు ఫారెస్ట్ రే మౌల్టన్ అనే ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు. మన సూర్యుడితో మరో తార ఇంచుమించు ఢీ కొన్న పరిస్థితి ఏర్పడ్డప్పుడు, గ్రహాలు ఉద్భవించాయని వారి సిద్ధాంతం. ఆ సమాగామం వల్ల రెండు తారల నుండి ద్రవ్యరాశి బయటికి లాగబడింది. తదనంతరం మన సూర్యుడి చుట్టూ మిగిలిన ధూళిసందోహాలు సంఘనితమై అల్పగ్రహాలుగా (planetesimals) గా ఏర్పడి, తరువాత అవి గ్రహాలుగా ఏర్పడ్డాయి. దీన్నే ’అల్పగ్రహ ప్రతిపాదన’ (planetesimal hypothesis) అంటారు. ఇక కోణీయ ద్రవ్యవేగం సమస్యకి వస్తే, జేమ్స్ హాప్వుడ్ జీన్స్, మరియు హరోల్డ్ జెఫ్రీస్ అనే ఇద్దరు బ్రిటిష్ శాస్త్రవేత్తలు 1918 లో తరంగ ప్రతిపాదన (tidal hypothesis) ని ప్రకటించారు. మన సూర్యుడి దరిదాపుల నుండి సాగిపోతున్న ఆ తార యొక్క గురుత్వాకర్షణ వల్ల, సూర్యుడి నుండి బయటకు లాగబడ్డ ద్రవ్యరాశిని కొంత పక్కకి నెట్టడం వల్ల వాటికి కోణీయద్రవ్యవేగం అబ్బిందని ఈ సిద్ధాంతం చెప్తుంది.


ఈ ఉపద్రవాత్మక సిద్ధాంతం నిజమే అయితే గ్రహవ్యవస్థలు చాలా అరుదుగా మాత్రమే కనిపించాలి. తారల మధ్య దూరాలు ఎంత ఎక్కువ అంటే వాటి మధ్య అభిఘాతాలు (collisions) చాలా అరుదుగా మాత్రమే జరగాలి. సూపర్నోవాలు ఎంత సామాన్యంగా ఉంటాయో, అందులో 1/10,000 వంతు సామాన్యంగా ఇలా తారల మధ్య అభిఘాతాలు జరుగుతాయి. ఒక గెలాక్సీ జీవితకాలం మొత్తంలో అలాంటి అభిఘాతాలు పది కన్నా ఎక్కువ జరిగే అవకాశం లేదని అంచనా.

ఆ విధంగా ఉపద్రవాల సహాయంతో గ్రహాల ఆవిర్భవాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ తప్పని మరింత లోతైన గణితపరమైన శోధనలో తేలింది. సూర్యుడు పక్క నుండి ఓ తార పోవడం అంటూ జరిగితే ఆ పరిణామానికి ఫలితంగా గ్రహాలు సూర్యుడు నుండి ప్రస్తుత దూరాల కన్నా వెయ్యి రెట్లు దూరంలో ఉండాలని నిరూపించాడు రసెల్ అనే శాస్త్రవేత్త. పోనీ తారలు పక్క పక్క నుండి దాటిపోవడం కాకుండా, రకరకాలుగా ఢీకొనడమే జరిగి ఉంటుంది అనుకున్నా ఆశించిన ఫలితాలు రాలేదు. 1930 లలో లిటిల్టన్ అనే శాస్త్రవేత్త రెండు తారలకి బదులుగా, మూడు తారలు ఢీకొని ఉంటాయని సూచించాడు. తదనంతరం ఖగోళశాస్త్రవేత్త ఫ్రెడ్ హొయల్ సూర్యుడికి తోడుగా మరో సహతార ఉండి ఉంటుందని, అది ఒక దశలో సూపర్నోవాగా మారిపోతూ బహుమానంగా మన సూర్యుడికి ఈ గ్రహాలని విడిచిపెట్టి పోయిందని సూచించాడు.

అయితే 1939 లో అమెరికన్ ఖగోళశస్త్రవేత్త లైమన్ స్పిట్జర్ మరో ముఖ్యమైన విషయాన్ని నిరూపించాడు. సూర్యుడి నుండి వెలువడ్డ ఏ పదార్థమైనా ఎంత వేడిగా ఉంటుందంటే అది విరళమైన వాయువుగానే మిగిలిపోతుందని, ఘనీభవించి గ్రహశకలాలుగా మారదని నిరూపించాడు. కాని తదనంతరం 1965 లో బ్రిటిష్ ఖగోళశాస్త్రవేత్త ఎమ్.ఎమ్. వూల్ఫ్ సన్ ఈ నిర్బంధాన్ని తొలగిస్తూ మరో చక్కని సూచన చేశాడు. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఏర్పడడానికి వాడబడ్డ పదార్థం, చెల్లాచెదురై, చల్లగా ఉన్న ఓ తార నుండి వచ్చి ఉంటుందని, కనుక అది అధిక ఉష్ణోగ్రతల వద్ద పుట్టిన పదార్థం కానక్కర్లేదని అతడు సూచించాడు. ఏదేమైనా ఉపద్రవం మీద ఆధారపడ్డ సిద్ధాంతాలన్నిటికి చివరికి చుక్కెదురే అయ్యింది.

కనుక ఖగోళశాస్త్రవేత్తలు ఉపద్రవాలని పక్కన పెట్టి మళ్లీ పరిణామాత్మక సిద్ధాంతాల వైపు మొగ్గు చూపారు. లాప్లాస్ ప్రతిపాదించిన నీహారికా సిద్ధాంతాన్ని మరొక్కసారి పరిశీలించసాగారు.

(సశేషం…)
image credits:

సౌరమండల ఆవిర్భావం – నీహారికా సిద్ధాంతం

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, April 13, 2010 0 comments


సౌరమండలం యొక్క ఆవిర్భావాన్ని గురించిన సిద్ధాంతాల తీరు ఆ విధంగా ఉండేది. కాని ఈ సిద్ధాంతాలతో ఎన్నో చిక్కు సమస్యలు తలెత్తాయి. ఉదాహరణకి అత్యంత బలహీనమైన గురుత్వాకర్షణ యొక్క ప్రభావం వల్ల అంత విరళమైన వాయు రాశి సంఘనితం కావడం ఎలా సాధ్యమో అర్థం కాలేదు. తదనంతర కాలంలో ఈ సంఘననానికి కారణమైన మరో ప్రక్రియని కూడా శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అదే కాంతి చేసే ఒత్తిడి. అంతరిక్షంలో ఉండే రేణువుల మీద అన్ని దిశల నుండి కిరణాలు పడుతుంటాయి. ఇప్పుడు రెండు రేణువులు ఒక దాని నీడ మరో దాని మీద పడేటంతగా సన్నిహితం అయ్యాయి అనుకుందాం. ఇప్పుడు ఆ రేణువులకి "బయటి" వైపున కాంతి ఒత్తిడి, "లోపలి" వైపున కాంతి ఒత్తిడి కన్నా ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత అవి ఇంకా దగ్గరగా వస్తాయి. అలా దగ్గరవుతున్న కొలది వాటి మధ్య గురుత్వాకర్షణ పెరిగి వాటి సమాగమనం మరింత వేగవంతం అవుతుంది.

సూర్యుడు ఆ విధంగా రూపొందితే, మరి గ్రహాల మాటేమిటి? అవి ఎలా పుట్టాయి? 1755 లో ఇమాన్యుయెల్ కాంట్ , మరియు 1796 లో పియర్ సిమొన్ ద లాప్లాస్ లు ఈ ప్రశ్నకి సమాధానాల కోసం తొలి ప్రయత్నాలు చేశారు. ఇద్దరిలో లాప్లాస్ వర్ణన మరింత వివరంగా ఉంది.

లాప్లాస్ వర్ణన ప్రకారం ఆరంభ దశలోనే విశాల ధూళి మేఘం పరిభ్రమిస్తూ ఉంటుంది. అది కుంచించుకుంటున్న కొలది దాని పరిభ్రమణ వేగం హెచ్చవుతూ ఉంటుంది. దానికి సారూప్యంగా స్కేటింగ్ చేస్తున్న వ్యక్తిని తీసుకుందాం. ఒక వ్యక్తి స్కేటింగ్ చేస్తూ చేతులు చాచి తన చుట్టూ తాను గిర్రున తిరుగుతున్నాడు అనుకుందాం. ఇప్పుడు మెల్లగా చేతులు దగ్గరికి తీసుకుని ఛాతీకి ఆనించుకుంటే, అతడి ఆత్మభ్రమణ వేగం పెరుగుతుంది. దానికి కారణం కోణీయ ద్రవ్య వేగం యొక్క నిత్యత్వమే (conservation of angular momentum). కోణియ ద్రవ్యవేగం వస్తువు యొక్క ద్రవ్యరాశి మీద, దాని వేగం మీద, భ్రమణాక్షం నుండి దాని దూరం మీద ఆధారపడుతుంది. భ్రమణాక్షం నుండి దూరం తగ్గినప్పుడు, ఆ తగ్గుదలని పరిపూరించడానికి (compensate) వేగం పెరుగుతుంది. ఆ విధంగా తన అక్షం మీద ధూళి మేఘం వేగంగా పరిభ్రమిస్తున్నప్పుడు, దాని భూమధ్య రేఖ నుండి పదార్థం విసరివేయబడసాగంది, పదార్థం నష్టం కావడం వల్ల కొంత కోణీయద్రవ్యవేగం తగ్గింది. అందువల్ల ఆ ధూళిమేఘం మరి కొంచెం నెమ్మదించింది. దాని గురుత్వాకర్షణకి లోనై మరింత కుంచించుకుంది, దాంతో మళ్లీ వేగం పెరిగి మళ్లీ కొంత ద్రవ్యరాశిని బయటికి విసిరేసింది.ఆ విధంగా కుంచించుకుంటున్న సూర్యుడి చుట్టూ వలయాలుగా ద్రవ్యరాశి విస్తరంచింది. ఆ వలయాలు ఇంకా ఇంకా కుంచించుకుని గ్రహాలుగా మారాయి. ఆ గ్రహాల నుంచి కూడా అదే విధంగా పదార్థం వెలువడి వలయాలుగా మారి, దాని నుండి ఉపగ్రహాలు ఏర్పడ్డాయి. ఇదీ లాప్లాస్ సిద్ధాంతం.

లాప్లాస్ ప్రతిపాదించిన ఈ ’నీహారికా సిద్ధాంతం’ (nebular hypothesis) సౌరమండలం యొక్క ప్రధాన రూపురేఖలని బాగానే వివరిస్తున్నట్టు అనిపించింది. కొన్ని చిన్నచిన్న విషయాలని కూడా ఆ సిద్ధాంతం వివరించగలిగింది.

ఉదాహరణకి సాటర్న్ చుట్టూ ఉండే ధూళి వలయాలు ఆ విధంగా ఏర్పడినవే కావచ్చు. వాటిలోని ద్రవ్యరాశి మొత్తాన్ని కలుపుకుంటే పెద్ద ఉపగ్రహమే ఏర్పడుతుంది. అలాగే మార్స్, జూపిటర్ కక్ష్యల మధ్య స్థిరకక్ష్యలో సూర్యుడి చుట్టు తిరిగే గ్రహశకల వలయం (asteroid belt) ఒకటి ఉంది. అందులోని పదార్థం కూడా గ్రహంగా ఏర్పడకుండా మిగిలిపోయిన పదార్థం యొక్క అవశేషమే కావచ్చు. ఇక వీటికి తోడు సూర్యుడి శక్తికి మూలం నెమ్మదిగా సాగే దాని సంకోచమే ననే హెల్మ్ హోల్జ్, కెల్విన్ మొదలైన వారి భావనలు కూడా ఈ రకమైన చింతనకి వత్తాసు పలుకుతున్నట్టు ఉన్నాయి.


పందొమ్మిదవ శతాబ్దంలో అధికభాగం ఈ నీహారికా సిద్ధాంతమే చలామణి అయ్యింది. కాని శతాబ్దం ముగిసే లోపే ఆ సిద్ధాంతంలో దోషాలు కనిపించసాగాయి. 1850 లో జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ అనే భౌతిక శాస్త్రవేత్త సాటర్న్ చుట్టూ ఉండే వలయాలని గణితపరంగా విశ్లేషిస్తూ ఓ కొత్త విషయాన్ని కనుక్కున్నాడు. ఒక వస్తువు నుండి విసిరివేయబడ్డ వాయుపదార్థం ఎప్పుడూ చిన్న చిన్న రేణువుల్లా మాత్రమే ఘనీభవించగలదని నిరూపించాడు. సాటర్న్ చుట్టూ ఏర్పడ్డ వలయాలు అలంటివే నన్నాడు. అవన్నీ కలిసి ఓ సంఖనిత రాశిగా, ఓ కఠినమైన పెద్ద వస్తువుగా ఎన్నటికీ మారలేవని, అలా మారక ముందు ఆ పదార్థాన్ని విక్షేపించిన వస్తువు యొక్క గురుత్వాకర్షణ కొత్తగా ఏర్పడుతున్న వస్తువుని ఛిన్నాభిన్నం చేస్తుందని సిద్ధాంతీకరించాడు.

ఈ పరిణామాలలో కోణీయ ద్రవ్యవేగానికి (angular momentum) కూడా ఓ ముఖ్యపాత్ర ఉంది. ద్రవ్య రాశి దృష్ట్యా చూస్తే సౌరమండలంలో ఒక 0.1% మాత్రమే ఉండే గ్రహాల కోణీయద్రవ్యవేగం మాత్రం సౌరమండలం యొక్క మొత్తం కోణీయద్రవ్యవేగంలో 98% కలిగి ఉంటాయట! సౌరమండలంలో మొత్తం కోణీయద్రవ్యవేగంలో జూపిటర్ కోణీయద్రవ్యవేగమే 60% ఉంటుంది. సౌరమండలానికి మూలమైన ఆదిమ నీహారిక యొక్క కోణీయద్రవ్యవేగంలో చాలా చిన్న భాగం మాత్రమే సూర్యుడిలో మిగిలి ఉంది. ఆ నీహారిక యొక్క కోణీయద్రవ్యవేగంలో ఇంచుమించు అంతా ఆ విధంగా దాని నుండి వెలువడ్డ వలయాలలోకి ఎలా ప్రవేశించింది? ఇది ఇలా ఉండగా జూపిటర్, సాటర్న్ గ్రహాల విషయంలో ఈ సమస్య మరింత విడ్డూరంగా కనిపించింది. చుట్టూ బోలెడు ఉపగ్రహాలు తిరుగుతూ, చిన్న తరహా సౌరమండలాలలా విలసిల్లే ఈ రెండు గ్రహాలూ, సౌరమండలం లాగానే రూపొందాయి అనుకుంటే, మరి ఈ గ్రహాల విషయంలో, అధిక శాతం కోణీయద్రవ్యవేగం గ్రహంలోనే ఉంటూ, ఉపగ్రహాలలో చాలా తక్కువ భాగమే ఉండడం కనిపిస్తుంది. ఈ విచిత్రానికి కారణం ఎవరికీ అర్థం కాలేదు.

1900 కల్లా ఈ నీహారికా సిద్ధాంతం ఇంచుమించు పూర్తిగా మట్టిగలిసి పోయినట్టే. క్రమ పరివర్తన చేత సౌరమండలం ఏర్పడి ఉంటుందన్న ఆలోచనకి తిలోదకాలు వొదిలేశారు. దాని స్థానంలో మునుపటి ఉపద్రవాత్మక సిద్ధాంతానికి (catastrophic theory) ఊపిరిపోసే ప్రయత్నం మొదలయ్యింది.

(సశేషం…)

సౌరమండలం యొక్క ఆవిర్భావం

Posted by శ్రీనివాస చక్రవర్తి Friday, April 9, 2010 0 commentsసౌరమండలం ఆవిర్భావాన్ని గురించిన మొట్టమొదటి ఊహాగానాల గురించి ఈ వ్యాసం. ఈ విషయం గురించి రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య సంఘర్షణని వర్ణిస్తుంది ఈ వ్యాసం. సౌరమండలం, అందులోని వివిధ అంశాలు ఉపద్రవాత్మకంగా పుట్టుకొచ్చాయని ఒక సిద్ధాంతం, కాదు క్రమమైన పరిణామానికి ఫలితంగా పుట్టాయని మరొక సిద్ధాంతం అంటుంది. భౌతిక శాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్ది, సౌరమండలం గురించి మరింత సమాచారం పోగవుతున్న కొద్ది ఈ సిద్ధాంతాలలో స్పష్టత వచ్చిన తీరు ఇక్కడ వర్ణించబడుతుంది.

ఐసాక్ అసిమోవ్ రాసిన “Guide to Science” లో,’భూమి’ అనే అధ్యాయం, ఈ వ్యాసానికి మూలం.సౌరమండలం యొక్క ఆవిర్భావం

విశాల విశ్వానికి ఎల్లలు లేకపోవచ్చు గాక. దాని బృహత్తు ముందు భూమి అత్యల్పంగా కనిపించొచ్చు గాక. కాని ఈ భూమే మనిషికి ఇల్లు. ఇదే మన ఇల్లు. మానవుడు అధునాతన వ్యోమనౌకలలో ఇరుగు పొరుగు గ్రహాలన్నీ ఎంత కలయదిరిగినా చిట్టచివరికి ఈ ఇంటికి తిరిగి రావాలసిందే.

న్యూటన్ కాలం నుండే విశ్వారంభానికి సంబంధించిన సమస్య గురించి, భూమి పుట్టుకకి సంబంధించిన సమస్య గురించి వేరువేరుగా ఆలోచించడం మొదలెట్టారు. అప్పటికే సౌరమండలానికి సంబంధించిన పరిశీలనల దృష్ట్యా సౌరమండలం యొక్క విన్యాసం గురించి, గ్రహ చలనాల గురించి కొన్ని సామాన్య విషయాలు బయటపడ్డాయి.

1. ముఖ్య గ్రహాలన్నీ సూర్యుడి సూర్యమధ్యరేఖ (sun's equator) ఉన్న తలంలోనే సూర్యుడి చుట్టూ వృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి. అంటే సూర్యుడు, గ్రహాలు అన్నీ ఇంచుమించు ఓ సమతలం మీద ఇమిడిపోతాయి అన్నమాట.
2. ముఖ్య గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ ఒకే దిశలో తిరుగుతుంటాయి. సౌరమండలం పై నుండి అంటే ధృవనక్షత్రం ఉన్న వైపు నుండి సౌరమండలం కేసి చూస్తే గ్రహాలన్నీ అపసవ్య దిశలో తిరుగుతూ కనిపిస్తాయి.
3. ప్రతీ ముఖ్య గ్రహం (కొన్ని మినహాయింపులని పక్కన పెడితే) సూర్యుడి చుట్టూ అపసవ్య దిశలో తిరిగినట్టే దాని అక్షం మీద అది (ఆత్మభ్రమణం) అపసవ్యదిశలో తిరుగుతుంటుంది. సూర్యుడి ఆత్మభ్రమణం కూడా అపసవ్య దిశలోనే జరుగుతుంది.
4. సూర్యుడి నుండి గ్రహాల దూరం క్రమంగా పెరుగుతుంది. గ్రహ కక్ష్యలు ఇంచుమించు వృత్తాకారంలోనే ఉంటాయి.
5. ఉపగ్రహాలన్నీ (కొన్ని మినహాయింపులని పక్కన పెడితే) వాటి సంబంధిత గ్రహాల చుట్టూ ఇంచుమించు వృత్తాకార కక్ష్యలలో ఆయా గ్రహాల గ్రహమధ్య రేఖ ఉన్న తలంలో, అపసవ్య దిశలో తిరుగుతుంటాయి.

గ్రహాల, ఉపగ్రహాల చలనాలలో కనిపించే ఇంత క్రమబద్ధతని గమనిస్తే మొత్తం సౌరమండలం ఓ ఏకైక మూలం నుండి ఉద్భవించి ఉండొచ్చు ననిపిస్తుంది. ఇంతకీ ఏంటా మూలం? సౌరమండలాన్ని పుట్టించిన ఆ ప్రక్రియ ఎటువంటిది? సౌరమండలం యొక్క ఆవిర్భావాన్ని వర్ణించే సిద్ధాంతాలు రెండు రకాలు. 1) ఉపద్రవాత్మక సిద్ధాంతం, 2) పరిణామాత్మక సిద్ధాంతం. వీటిలో మొదటిదైన ఉపద్రవాత్మక సిద్ధాంతం ప్రకారం సూర్యుడు తటాలున ఏమీ లేని శూన్యంలో ఒక్కసారిగా ప్రత్యక్షం అయ్యాడు; అదే విధంగా మరో విస్ఫోటాత్మక ప్రక్రియ లోంచి గ్రహాలు ఉద్భవించాయి. ఇక రెండవదైన పరిణామాత్మక సిద్ధాంతం ప్రకారం మొత్తం సౌరమండలం అంతా ఓ క్రమపద్ధతిలో కొన్ని మూలాంశాల నుండి ఆవిర్భవించింది.

పద్దెనిమిదవ శతాబ్దంలో కూడా ప్రళయానికి సంబంధించిన బైబిల్ కథల ప్రభావం శాస్త్రవేత్తల మనసుల మీద బలంగా ఉండేది. అందుకే కాబోలు భూమి చరిత్ర అంతా పెద్ద పెద్ద ఉపద్రవాలతో కూడుకుని ఉన్నట్టుగా ఊహించుకునేవారు. మరి చరిత్ర పొడవునా ఎన్నో ఉపద్రవాలు ఉన్నప్పుడు, చరిత్ర ఆరంభంలో ఓ మహా ఉపద్రవం జరిగినట్టు ఊహించుకోవడంలో ఆశ్చర్యం లేదు. అలాంటి ఊహాగానాలలో ఒకటి ఫ్రాన్స్ కి చెందిన ప్రకృతి శాస్త్రవేత్త జార్జ్ లూయీ లెక్రెక్ ద బఫాన్ ప్రతిపాదించిన సిద్ధాంతం. సూర్యుడితో ఓ పెద్ద తోకచుక్క ఢీకొన్నప్పుడు సౌరమండలం పుట్టిందని ఇతడు ప్రతిపాదించాడు. అయితే సూర్యుడితో పోల్చితే తోకచుక్కలు అత్యల్పమైన మట్టిగడ్డలని తదనంతరం తెలిసొచ్చాక సిద్ధాంతం మూలనపడింది.

ఇక పందొమ్మిదవ శతాబ్దంలో ఉపద్రవాలకి బదులు, నెమ్మదిగా పని చేసే దీర్ఘకాలిక ప్రకృతి చర్యలలో సమాధానాలు వెతకడం మొదలెట్టారు శాస్త్రవేత్తలు. ఈ కోవకి చెందిన సిద్ధాంతాలలో ఒకటి హటన్ ప్రతిపాదించిన సమనిర్మాణ సిద్ధాంతం (Hutton’s uniformitarian principle). (దీని విషయానికి మళ్లీ వద్దాం). కనుక శాస్త్రవేత్తలు వైజ్ఞానిక స్ఫూర్తి కోసం బైబిల్ ని ఆశ్రయించడం మానేసి న్యూటన్ సిద్ధాంతాలని, ప్రకృతి సహజ చర్యలని ఆశ్రయించడం ఆరంభించారు. ఓ పలుచని వాయు, ధూళి రాశి దాని అంతరంగ గురుత్వాకర్షణ ప్రభావం వల్ల క్రమంగా సంఘనితమై సౌరమండలం రూపొంది ఉంటుందని న్యూటనే సూచించాడు. ద్రవ్యరాశిలోని రేణువులు దగ్గర పడుతున్న కొద్దీ గురుత్వాకర్షణ పెరిగి, ద్రవ్యరాశి మరింత వేగంగా దగ్గర పడుతూ ఉంటుంది. చివరికి మొత్తం ద్రవ్యరాశి మన సూర్యుడి లాంటి సాంద్రమైన వస్తువుగా మారిపోతుంది. ఆ సంఘనన శక్తే కాంతి శక్తిగా మారి సూర్యుణ్ణి ప్రజ్వలింపజేస్తుంది.

చీమలు పరిష్కరించిన ఇంజినీరింగ్ సమస్యలు

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, April 4, 2010 3 comments


దారంతా ఫీరొమోన్ చల్లడం వల్ల ఒక చీమ కనుక్కున్న దారి ఇతర చీమలకి తెలిసిపోతుందని కిందటి పోస్ట్ లో చూశాం. ఈ చిన్న పద్ధతి సహాయంతో ఆహార వనరులకి అతిదగ్గరి దారులని చీమలు ఎలా కనుక్కుంటాయో చూద్దాం.

A అనే బిందువు వద్ద రెండు చీమలు ఉన్నాయని అనుకుందాం. B అనే బిందువు వద్ద కొంత ఆహారం ఉంది. A, B లని కలుపుతూ ఒక దగ్గరి దారి, S, మరో చుట్టు దారి L ఉన్నాయని అనుకుందాం. S ని అనుసరించి ఒక చీమ A నుండి B కి వెళ్లి తిరిగి వచ్చే దారిలో ఫిరొమోన్ చల్లుకుంటూ వచ్చింది. రెండవ చీమ చుట్టుదారి అయిన L వెంట A నుండి B కి వెళ్లి తిరిగి వచ్చే దారిలో ఫిరొమోన్ చల్లుకుంటూ వచ్చింది. ఈ ఫిరొమోన్ తో మరో విషయం ఏంటంటే ఒకసారి చల్లబడ్డ ఫిరొమోన్ క్రమంగా ఆవిరవుతూ ఉంటుంది.

మొదటి చీమ నడిచిన దారి S చిన్నది కనుక ఆ దారి మీద ఒక యూనిట్ దూరంలో చల్లబడే ఫిరొమోన్ L మీద కన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది. కనుక రెండు చీమలూ తిరిగి A ని చేరుకున్నాక చూస్తే S మీద L మీద కన్నా కాస్త ఎక్కువ ఫిరొమోన్ మిగిలి ఉంటుంది. ఇప్పుడు మరో మూడో చీమ A దగ్గర్నుండి బయలుదేరుతూ, S వెంట వెళ్లాలా, L వెంట వెళ్లాలా అని మీమాంసలో పడ్డప్పుడు, ఎటుపక్క నుండి ఘాటైన ఫిరొమోన్ గంథం వస్తోందో చూసుకుంటుంది. S లో ఎక్కువ ఫిరొమోన్ ఉంది కనుక S ని ఎంచుకుంటుంది. మూడవ చీమ నడిచి వచ్చాక S మీద ఫిరొమోన్ సాంద్రత మరింత పెరుగుతుంది. ఇలా కొంతకాలం పోయాక L మీద అసలు ఫిరొమోన్ వాసనే మిగలదు. S మీద బాగా ఎక్కువ అవుతుంది. రెండు దారులలో దగ్గరి దారి ఏదో అప్పట్నుంచి ’వాసన చూసి’ పట్టేయొచ్చు. ఈ ప్రక్రియ వల్ల తొలిదశల్లో రెండు దారులలో ఉండే ఫిరొమోన్ సాంద్రతలో ఉండే సూక్ష్మమైన భేదం పోగా పోగా మరింత వృద్ధి చెందుతుంది. ఇలాంటి పరిణామాన్నే positive feedback అంటారు. చీమలలో ఇలా దగ్గరి దారులు కనుక్కునే సామర్థ్యాన్ని డెనోబోర్గ్ తదితరులు (Deneubourg et al 1990) గమనించారు.

చీమల యొక్క ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని చూసి స్ఫూర్తి చెందిన ఇంజినీర్లు ఈ పద్ధతిని గ్రాఫ్ థియరీ కి చెందిన కొన్ని కఠినమైన సమస్యల మీద ప్రయోగించారు. అలాంటి సమస్యల్లో ’ప్రయాణించే సేల్స్ మాన్ సమస్య’ (Traveling salesman problem) ఒకటి. ఈ సమస్యలో ఒక సేల్స్ మన్ కొన్ని (N) ఊళ్లు చుట్టి రావాలి. ఊళ్ల మధ్య దూరాలన్నీ సేల్స్ మన్ కి తెలుస్. అయితే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఒకసారి సందర్శించిన ఊరిని మళ్లీ సందర్శించకూడదు. ఏ ఒక్క ఊరిని వదల కూడదు. ప్రయాణించిన దారి పొడవు సాధ్యమైన అన్ని దారుల కన్నా చిన్నది కావాలి. సాధ్యమైన ప్రతీ దారిని పరిగణించి, వాటిలో అన్నిటికన్నా చిన్న దారిని ఎంచుకోవాలంటే ఈ సమస్య చాలా కఠినం అవుతుంది. ఎందుకంటే N ఊళ్లు ఉన్నప్పుడు, ఒక ఊళ్లో బయలుదేరి చివరికి అదే ఊరికి తిరిగి రావడానికి మొత్తం (N-1)! మార్గాలు ఉన్నాయి. N పెద్దది అవుతున్న కొలది ఈ సంఖ్య చాలా వేగంగా పెరిగిపోతుంది. కంప్యూటర్ సైన్స్ లో అత్యంత కఠినమైన సమస్యల్లో ఈ సమస్య ఒకటి. ఈ సమస్యకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది ఒక ప్రత్యేక సమస్య కాదు. ఒక ప్రత్యేక జాతికి చెందిన సమస్యలకి ఇది ప్రతినిధి. కనుక ఈ సమస్యని వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం ఎలాగో తెలిస్తే, ఆ పరిష్కారం ఆ జాతికి చెందిన సమస్యలన్నిటికీ వర్తిస్తుంది.

ఈ సమస్యని ’చీమలపద్ధతి’లో చేసే విధానాలు ఇలా ఉంటాయి. (ఇవన్నీ కంప్యూటర్ సిములేషన్ ద్వారా చేసేవే నని, ఈ ప్రయోగాలు నిజం చీమల్తో చెయ్యరని గుర్తుంచుకోవాలి!) ఇందులో కొన్ని ’చీమల’ని ఆ ఊళ్లన్నీ చుట్టి రమ్మని విడిచిపెడతారు. ప్రతీ చీమ కొన్ని నిబంధనలని అనుసరిస్తూ ఆ ఊళ్లన్నీ చుట్టి వస్తుంది. ఆ చుట్టే దారిలో కొన్ని సూత్రాలని అనుసరిస్తూ ఆయా దారుల వెంట ఫిరొమోన్ చల్లుకుంటూ వస్తుంది. తరువాత వచ్చే చీమ చేసే యాత్రని ఈ ఫిరొమోన్ ప్రభావితం చేస్తుంది. చీమలు అనుసరించే నియమాలు ఇవి:

1 . ఒక ఊరిని ఒకసారే సందర్శించాలి.
2. దగ్గరిగా ఉన్న ఊళ్ల కన్నా దూరంగా ఉన్న ఊళ్లని సందర్శించే సంభావ్యత (probability) తక్కువగా ఉంటుంది.
3. రెండు ఊళ్ల మధ్య ఫిరొమోన్ సాంద్రత ఎంత ఎక్కువ ఉంటే, చీమ ఆ దారిని ఎంచుకునే సంభావ్యత అంత ఎక్కువ అవుతుంది.
4. చీమ తాను చుట్టి వచ్చిన దారులలో ఫిరొమోన్ చల్లుకుంటూ వస్తుంది.
5. చీమ ఒక చుట్టు చుట్టి వచ్చిన ప్రతీ సారి దారుల మీద ఉన్న ఫిరొమోన్ కొద్దిగా ఆవిరి అవుతుంది.

పై నియమాలని అనుసరించి చీమలు ఊళ్ల న్నీ చుట్టు చుట్టి వస్తుంటే కొన్ని పర్యాయాల తరువాత బాగా తక్కువ పొడవు ఉన్న మార్గంలో బాగా ఎక్కువ ఫిరొమోన్ మిగులుతుంది.
ఈ ant algorithms కి కంప్యూటర్ నెట్వర్క్స్ లో, ట్రాఫిక్ నియంత్రణలో ఇలా ఎన్నో వాస్తవ ప్రపంచ సమస్యలలో ప్రయోగించి చక్కని ఫలితాలు సాధించారు. మరిన్ని వివరాల కోసం ఈ కింది వనరులని సంప్రదించగలరు.

References:
http://en.wikipedia.org/wiki/Ant_colony_optimization#cite_note-S._Goss-2
M. Dorigo, Optimization, Learning and Natural Algorithms, PhD thesis, Politecnico di Milano, Italie, 1992.
J.-L. Deneubourg, S. Aron, S. Goss et J.-M. Pasteels, The self-organizing exploratory pattern of the Argentine ant, Journal of Insect Behavior, volume 3, page 159, 1990

చీమ తలకాయలో ఎన్ని తెలివితేటలో!

Posted by శ్రీనివాస చక్రవర్తి Friday, April 2, 2010 3 comments


పొద్దున్నే కాఫీ కలుపుదామని వంటగదిలోకి అడుగుపెట్టిన అర్చనకి రాత్రికి రాత్రి మీద వంటింటి గోడల మీద ప్రత్యక్షమైన ఈ కొత్త గీతలు ఎక్కణ్ణుంచి వచ్చాయో అర్థం కాలేదు. చంటాడికి గోడ మీద పెన్సిల్ తో విసుర్లు విసిరే అలవాటు ఉంది గాని వాడి రేంజి రెండు అడుగుల ఎత్తుని మించి పోదు. కాని ఈ గీతలు చూరు నుండి నేల దాకా విస్తరించి ఉన్నాయి. కాస్త దగ్గరికెళ్లి చూసింది. గీతలు నిశ్చలంగా లేవు. సంచలనంగా కదులుతున్నాయి, సజీవంగా మసలుతున్నాయి. అయ్యబాబోయ్! చీమలు! రాత్రికి రాత్రి చెంగిజ్ ఖాన్ సేనల దండులలా వంటగది మీదకి దండెత్తి వచ్చాయి. అయినా ఇన్ని చీమలు ఎక్కణ్నుంచి వచ్చాయి? వీటికి వేరే పని లేదా? (అని ముందు అనుకుని, ఆ మాటకి అర్థం లేదనిఅ ర్థం చేసుకున్) వీటికి పని తెప్ప మరోటి తెలీదా? రాత్రి పూట కూడా రెస్టు తీసుకొవా?...

అర్చన తిట్టుకుంటే ఆందుకు ఒక కారణం ఉందేమో గాని చీమల నుండి మనం నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది.

ఒక చిన్న మిఠాయి తునకని ఓ అరడజను చీమలు జాగ్రత్తగా మోసుకుపోవడం చూస్తే ఓ పెద్ద మంచాన్నో, బీరువానో మోసుకుపోతున్న ఓ నలుగురు ఆసాములే గుర్తొస్తారు. ఓ పెద్ద వస్తువుని ఇరుకు దారుల వెంట నలుగురు మనుషులు మోసుకువెళ్లడానికి ఎంత అవస్తపడతారో మనం చూస్తుంటాం. “అటు కాదు ఇటు” అనడాలు, “అటు పక్క మరి కాస్త ఎత్తు” అనడాలు, “అలా చూస్తూ కూర్చోపోతే కాస్త ఓ చెయ్యి పట్టరాదూ” అని అరవడాలు, ధారాపాతంగా చెమట్లు కారడాలు, చర్మం చెక్కుకుపోవడాలు – ఇలా నానా రాద్ధాంతమూ జరుగుతుంది. మరి ఏ హడావుడీ లేకుండా అంత చిన్న ప్రాణులు అంత పని ఎలా చెయ్యగలుగుతాయి. ఇక “చలిచీమల చేతచిక్కి” అన్న నానుడి ఉండనే ఉంది.

సగటు చీమ బరువు ఒకటి, రెండు మిల్లీగ్రాములు ఉంటుంది. కాని కొన్ని చీమలు వాటి కన్నా 10-50 రెట్లు ఎక్కువ బరువు ఉన్న వస్తువులని పైకెత్తగలవు. ఇక అలాంటి చీమలు ఒక సమూహంగా “బలవంతమైన సర్పాన్ని” కూడా లొంగదీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఒక్క చీమ కన్నా ఒక చీమల సమూహానికి ఎక్కువ బలం ఉండడమే కాదు, ఎక్కువ తెలివితేటలు కూడా అబ్బుతాయి. చీమలన్నీ కలిసికట్టుగా, వాటిలో అవి చిత్రివిచిత్ర రీతుల్లో సంభాషించుకుంటూ ఎంత తెలివిగా మసలుకుంటాయంటే, ఆ చీమలసమూహానికే ప్రత్యేకమైన తెలివితేటలు ఉన్నాయా? ఆ సమూహమే ఓ ప్రత్యేక ప్రాణిలాగా ప్రవర్తిస్తోందా? అందులో ఆ చీమలన్నీ దేహంలో కణాలలాగా ఇమిడి ఉన్నాయా? అనిపిస్తుంది.

చిన్న చిన్న జీవాలు కలిసికట్టుగా వర్తిస్తూ ఏకైక జీవిలో లేని ప్రత్యేక ప్రజ్ఞని, తెలివితేటలని ప్రదర్శించడాన్ని సామూహిక ప్రజ్ఞ (swarm intelligence) అంటారు. చీమలు, చెదపురుగులు, తేనెటీగలు ఇలా ఎన్నో కీటక జాతులు ఇలాంటి సామూహిక ప్రజ్ఞని ప్రదర్శిస్తాయి. చీమలు సామూహికంగా ప్రవర్తిస్తూ ఆహార వనరుల ఆచూకీ కనుక్కునే తీరు, చెద పురుగులు విశాలమైన, సహజ ఎయిర్ కండిషనింగ్ గల నివాసాలు నిర్మించుకునే తీరు, తేనెటీగలు తుట్టని నిర్మించుకునే తీరు – మొదలైన వాటి మీద ఎంతో పరిశోధన జరిగింది.

చీమల ఆహారాన్వేషణ

చీమలు సామూహికంగా ఆహారం కోసం గాలించే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆహారం ఎక్కడ ఉందో తెలీని తొలి దశల్లో చీమలు తలో దిశలో యదేచ్ఛగా గాలింపు మొదలెడతాయి. వాటిలో ఓ చీమ అదృష్టం బావుండి ఆహారాన్ని కనుక్కుంది అనుకుందాం. అది తిరిగి దాని ఇంటికి తిరిగు ప్రయాణం అవుతుంది. దారిలో ఫీరొమోన్ (pheromone) అనే పదార్థాన్ని దారంతా చల్లుకుంటూ తిరిగొస్తుంది. ఈ ఫీరొమోన్ వాసన ఇతర చీమలకి ఇట్టే తెలిసిపోతుంది. ఇతర చీమలు ఆ వాసన వచ్చిన దిశలో నడిచి ఫీరొమోన్ బాటలని అనుసరించి ఆహారాన్ని చేరుతాయి. ఆహారాన్ని సేకరించి తిరిగి ఇంటికి వెళ్లే దారిలో అవి కూడా ఫీరొమోన్ బాటలు వేసుకుంటూ పోతాయి. ఈ అత్యంత సరళమైన పద్ధతుల సహాయంతో చీమలు ఆహారం యొక్క ఆచూకీ తెలుసుకోవడమే కాదు, తమ ఇంటి నుండి ఆహార వనరుల స్థలాలకి కనిష్ఠ మార్గాలు (shortest paths) కూడా కనుక్కోగలుగుతాయి.

చీమల సమూహాలు చేసే ఈ మహత్యాన్ని చూసి స్ఫూర్తి పొందిన మార్కో డోరిగో (Marco Dorigo) అనే ఓ కంప్యూటర్ పరిశోధకుడు ఆ పద్ధతులని గ్రాఫ్ థియరీ (graph theory) అనే గణిత విభాగంలో ప్రయోగ్ంచ్ ఎన్నో కఠినమైన సమస్యలపై విజయం సాధించగలిగాడు. అతడు రూపొందించిన ఈ పద్ధతులకి ’చీమ విధానాలు’ (ant algorithms) అని పేరు.

వాటి గురించి వచ్చే పోస్ట్ లో…

(సశేషం…)


postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Total Pageviews

There was an error in this gadget
There was an error in this gadget

విజ్ఞానులు

GuestBooker 2.5

Recent Posts

Popular Posts

Follow by Email