1905 లో థామస్ క్రౌడర్ చాంబర్లేన్ మరియు ఫారెస్ట్ రే మౌల్టన్ అనే ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు. మన సూర్యుడితో మరో తార ఇంచుమించు ఢీ కొన్న పరిస్థితి ఏర్పడ్డప్పుడు, గ్రహాలు ఉద్భవించాయని వారి సిద్ధాంతం. ఆ సమాగామం వల్ల రెండు తారల నుండి ద్రవ్యరాశి బయటికి లాగబడింది. తదనంతరం మన సూర్యుడి చుట్టూ మిగిలిన ధూళిసందోహాలు సంఘనితమై అల్పగ్రహాలుగా (planetesimals) గా ఏర్పడి, తరువాత అవి గ్రహాలుగా ఏర్పడ్డాయి. దీన్నే ’అల్పగ్రహ ప్రతిపాదన’ (planetesimal hypothesis) అంటారు. ఇక కోణీయ ద్రవ్యవేగం సమస్యకి వస్తే, జేమ్స్ హాప్వుడ్ జీన్స్, మరియు హరోల్డ్ జెఫ్రీస్ అనే ఇద్దరు బ్రిటిష్ శాస్త్రవేత్తలు 1918 లో తరంగ ప్రతిపాదన (tidal hypothesis) ని ప్రకటించారు. మన సూర్యుడి దరిదాపుల నుండి సాగిపోతున్న ఆ తార యొక్క గురుత్వాకర్షణ వల్ల, సూర్యుడి నుండి బయటకు లాగబడ్డ ద్రవ్యరాశిని కొంత పక్కకి నెట్టడం వల్ల వాటికి కోణీయద్రవ్యవేగం అబ్బిందని ఈ సిద్ధాంతం చెప్తుంది.
ఈ ఉపద్రవాత్మక సిద్ధాంతం నిజమే అయితే గ్రహవ్యవస్థలు చాలా అరుదుగా మాత్రమే కనిపించాలి. తారల మధ్య దూరాలు ఎంత ఎక్కువ అంటే వాటి మధ్య అభిఘాతాలు (collisions) చాలా అరుదుగా మాత్రమే జరగాలి. సూపర్నోవాలు ఎంత సామాన్యంగా ఉంటాయో, అందులో 1/10,000 వంతు సామాన్యంగా ఇలా తారల మధ్య అభిఘాతాలు జరుగుతాయి. ఒక గెలాక్సీ జీవితకాలం మొత్తంలో అలాంటి అభిఘాతాలు పది కన్నా ఎక్కువ జరిగే అవకాశం లేదని అంచనా.
ఆ విధంగా ఉపద్రవాల సహాయంతో గ్రహాల ఆవిర్భవాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నాలన్నీ తప్పని మరింత లోతైన గణితపరమైన శోధనలో తేలింది. సూర్యుడు పక్క నుండి ఓ తార పోవడం అంటూ జరిగితే ఆ పరిణామానికి ఫలితంగా గ్రహాలు సూర్యుడు నుండి ప్రస్తుత దూరాల కన్నా వెయ్యి రెట్లు దూరంలో ఉండాలని నిరూపించాడు రసెల్ అనే శాస్త్రవేత్త. పోనీ తారలు పక్క పక్క నుండి దాటిపోవడం కాకుండా, రకరకాలుగా ఢీకొనడమే జరిగి ఉంటుంది అనుకున్నా ఆశించిన ఫలితాలు రాలేదు. 1930 లలో లిటిల్టన్ అనే శాస్త్రవేత్త రెండు తారలకి బదులుగా, మూడు తారలు ఢీకొని ఉంటాయని సూచించాడు. తదనంతరం ఖగోళశాస్త్రవేత్త ఫ్రెడ్ హొయల్ సూర్యుడికి తోడుగా మరో సహతార ఉండి ఉంటుందని, అది ఒక దశలో సూపర్నోవాగా మారిపోతూ బహుమానంగా మన సూర్యుడికి ఈ గ్రహాలని విడిచిపెట్టి పోయిందని సూచించాడు.
అయితే 1939 లో అమెరికన్ ఖగోళశస్త్రవేత్త లైమన్ స్పిట్జర్ మరో ముఖ్యమైన విషయాన్ని నిరూపించాడు. సూర్యుడి నుండి వెలువడ్డ ఏ పదార్థమైనా ఎంత వేడిగా ఉంటుందంటే అది విరళమైన వాయువుగానే మిగిలిపోతుందని, ఘనీభవించి గ్రహశకలాలుగా మారదని నిరూపించాడు. కాని తదనంతరం 1965 లో బ్రిటిష్ ఖగోళశాస్త్రవేత్త ఎమ్.ఎమ్. వూల్ఫ్ సన్ ఈ నిర్బంధాన్ని తొలగిస్తూ మరో చక్కని సూచన చేశాడు. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఏర్పడడానికి వాడబడ్డ పదార్థం, చెల్లాచెదురై, చల్లగా ఉన్న ఓ తార నుండి వచ్చి ఉంటుందని, కనుక అది అధిక ఉష్ణోగ్రతల వద్ద పుట్టిన పదార్థం కానక్కర్లేదని అతడు సూచించాడు. ఏదేమైనా ఉపద్రవం మీద ఆధారపడ్డ సిద్ధాంతాలన్నిటికి చివరికి చుక్కెదురే అయ్యింది.
కనుక ఖగోళశాస్త్రవేత్తలు ఉపద్రవాలని పక్కన పెట్టి మళ్లీ పరిణామాత్మక సిద్ధాంతాల వైపు మొగ్గు చూపారు. లాప్లాస్ ప్రతిపాదించిన నీహారికా సిద్ధాంతాన్ని మరొక్కసారి పరిశీలించసాగారు.
(సశేషం…)
image credits:
0 comments