4. నాకము – నరకము
”నాకు తొమ్మిది
లోకాలు గుర్తున్నాయి.” – ఇస్లండిక్ ఎడ్డా, స్నోరీ స్టరలుసన్, 1200
“నేనే మృత్యువునై
లోకాలని నాశనం చేస్తాను.” – భగవద్గీత.
“స్వర్గనరకాల ద్వారాలు
పక్కపక్కనే ఉంటాయి, ఒక్కలాగే ఉంటాయి.” – నికోస్ కజాంజాకిస్, ద లాస్ట్ టెంప్టేషన్ ఓ
క్రైస్ట్.
భూమి చాలా
సుందరమైన, సుశాంతమైన ప్రదేశం. పరిస్థితులు మారుతాయి గాని నెమ్మదిగా మారుతాయి. కాస్తంత తుఫానుకి
మించి పెద్దగా ప్రకృతి ఉపద్రవాలే అనుభవించకుండా నిండు నూరేళ్ళ జీవితం గడిపేయొచ్చు. కాబట్టి మనం నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా మారిపోతాం. కాని ప్రకృతి
చరిత్ర గమనిస్తే దాని అసలు స్వరూపం కనిపిస్తుంది. విశాల ప్రపంచాలు విధ్వంసం అయిన సన్నివేశాలు ఉన్నాయి. ఆలోచితంగానో, అనాలోచితంగానో
కోరి విపత్తులు నెత్తికి తెచ్చుకున్న విచిత్రమైన సాంకేతిక ఘనత మన మానవజాతిది. ఇతర గ్రహాల మీద, గతపు కాలిగుర్తులు పదిలంగా నిలిచిన చోట్ల, ప్రకృతి వైపరీత్యాలకి
చెందిన ఆధారాలు పుష్కలంగా ఉన్నాయి. తగినంత బారైన కాలస్థాయిలో
గమనించాలంతే. నూరేళ్ళలో అనూహ్యం అనుకున్న సంఘటన కోటి సంవత్సరాలలో అనివార్యం కావచ్చు. భూమి మీద
కూడా మనం జీవిస్తున్న శతాబ్దంలోనే ఎన్నో విడ్డూరమైన సంఘటనలు జరిగాయి.
1908 లో జూన్ 30 తొలిఘడియలలో కేంద్ర
సైబిరియా మీదుగా ఆకాశంలో ఓ పెద్ద అగ్నిగోళం
దూసుకొస్తూ కనిపించింది. అది నేలని తాకిన చోట ఓ బ్రహ్మాండమైన విస్ఫోటం
సంభవించింది. 2000 చదరపకి కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని అది నేలమట్టం చేసింది. అది నేలని
ఢీకొన్న చోట చుట్టుపక్కల చెట్లన్నీ బూడిద అయ్యాయి. ఆ దెబ్బకి
వాతావరణంలో పుట్టిన ఘాత తరంగం (shock wave) భూమి చుట్టూ రెండు సార్లు ప్రదక్షిణ చేసింది. అది జరిగిన
రెండు రోజుల పాటు వాతావరణం అంతా సన్నని ధూళి ఎలా వ్యాపించింది అంటే, 10,000 కిలోమీటర్ల దూరంలో లండన్ లో రాత్రి పూట ఆ ధూళి వల్ల
ప్రతిబింబించబడ్ద కాంతిలో వార్తాపత్రికలు చదువుకోవచ్చు.
అప్పటికి రష్యాని
పాలిస్తున్న జార్ (Czar) ల ప్రభుత్వం అలాంటి
అల్పమైన సంఘటన గురించి పట్టించుకోనక్కర్లేదని భావించింది. ఎందుకంటే అది జరిగింది సైబీరియాలో. తుంగస్ జాతి వారు జీవించే వెనుకబడ్డ ప్రాంతంలో. రష్యన్ విప్లవం
జరిగిన పదేళ్ల తరువాత గాని ఆ ఉపద్రవం జరిగిన
ప్రాంతానికి వెళ్లి, అక్కడి సాక్షులని
విచారించి, అక్కడి నేలని
పరీక్షించడానికి ఒక పరిశోధనా బృందానికి సాధ్యపడలేదు. వారు చేసిన విచారణ నుండి దొరికిన సమాచారం ఇలా వుంది –
“ఆ రోజు తెల్లవారు
జామున అందరూ తమ గుడారాలలో నిద్రపోతున్న సమయంలో ఓ పెద్ద పేలుడు
జరిగింది. దాంతో ఆ
గుడారాలు, అందులో ఉన్న
వారు కూడా గాల్లోకి విసిరేయబడ్డారు. వాళ్లు తిరిగి కింద పడ్డాక లోపల వున్న కుటుంబీకులకి చిన్న చిన్న గాయాలు తగిలాయి. కాని అక్యులినాకి, ఇవాన్ కి మాత్రం స్పృహ పోయింది. వాళ్లు తిరిగి
మేలుకునే సరికి పెద్ద పెద్ద చప్పుళ్లు వినిపించాయి. చుట్టూ అడవి తగలబడి పోతూ కనిపించింది. అప్పటికే చాలా విధ్వంసం జరిగింది.”
వనొవారా విపణీకేంద్రం
వద్ద ఓ ఇంటి ముందు
వరండాలో కూర్చుని వున్నాను. అది ఉదయాన
టిఫిన్ చేసే సమయం. నేను ఉత్తర
దిశగా చూస్తున్నాను. ఓ పీపాని బద్దలు
కొడదామని అప్పుడే ఓ గొడ్డలి పైకెత్తాను. అంతలో… ఉన్నట్లుండి ఆకాశం
రెండుగా చీలింది. అడవిపైన, ఆకాశంలో
ఉత్తర భాగం అంతా నిప్పులతో నిండిపోయింది. నా అంగీ నిప్పు అంటుకున్నంతగా చుట్టూ తీవ్రమైన వేడి అనుభూతి చెందాను… చొక్కా విప్పి
విసిరేయాలనుకున్నాను. కాని అప్పుడే ఆకాశంలో ఓ బ్రహ్మాండమైన విస్ఫోటం
వినిపించింది. ఏదో పెద్ద వస్తువు కూలిన చప్పుడు వినిపించింది. నేను ఉన్న చోట నుండి మూడు ‘’సజీన్ల’’ దూరంలో ఆ కూలుడు సంభవించింది. నాను స్పృహ కోల్పాయాను. నా భార్య ఆదుర్దాయా బయటికి పరుగెత్తుకు వచ్చి నన్ను తిరిగి పాకలోకి ఈడ్చింది. ఆ పేలుడు
తరువాత ఆకాశంలోంచి రాళ్లు పడుతున్నట్టో, తుపాకులు పేలుతున్నట్టో చప్పుడు వినిపించింది. భూమి కంపించింది. రాళ్లు పడతాయేమోనన్న భయంతో చేతులతో ముఖం కప్పుకున్నాను. అంతలో ఆకాశం మళ్లీ విప్పారింది. ఫిరంగి నోట్లోంచి తన్నుకొస్తున్నట్టు వేడి గాలి ఉత్తర దిశ నుండి మా గుడిసెల మీదుగా వీచింది. దారి పొడవునా
అది మిగిల్చిన ముద్ర మాత్రం చిరకాలం మిగిలింది…
టిఫిన్ చేద్దామని
నాగలి పక్కనే చతికిలబడ్డాను. అంతలో తుపాకి చప్పుళ్ల లాంటి పెద్ద పెద్ద చప్పుళ్ళు వినిపించాయి. నా గుర్రం ముంగాళ్ల మీద ముందుకి పడింది. అడవికి ఉత్తర
దిక్కున ఓ పెద్ద మంట
ఎగసింది… అంతలో ఫిర్
చెట్ల అడవంతా గాలివాటుకు వంగిపోవడం చూశాను. ఏదో తుఫాను
వస్తోంది అనుకున్నాను. గాలికి నాగలి ఎగిరిపోతుందేమోనని దాన్ని గట్టిగా పట్టుకున్నాను. గాలి ఎంత బలంగా ఉందంటే బోలెడంత మట్టిని పెల్లగించుకుపోయింది. అప్పుడా తుఫాను అంగారా నదిలోని నీటిని ఎగదంతే ఆ నీరు గాల్లోకి
లేచి ఓ పెద్ద గోడలా
ఏర్పడింది. నా పొలం
కొండవాలు మీద ఉంది కనుక ఇదంతా దూరం నుండి స్పష్టంగా చూడగలిగాను.
ఆ చప్పుడుకి
గుర్రాలు ఎంతగా బెదిరిపోయాయంటే నాగళ్లని ఈడ్చుకుంటూ తలా దిక్కుకీ ఇష్టం వచ్చినట్టు పరుగెత్తాయి. ఇక మిగిలినవి అక్కడే కుప్పకూలిపోయాయి.
(ఇంకా వుంది)
ఆ తరువాత ఏం జరిగిందొ ఉత్కంఠగా ఉంది.చదువుతోంటే కళ్లకు కట్టినట్లుగా వుంది,అనువాదంలా కాక మూల రచనలాగా వుంది.శ్రీనివాసచక్రవర్తి గారికి అభినందనలు.
Thank you Sri garu!