శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

అధ్యాయం 40
పాతాళం దాకా సొరంగ మార్గ నిర్మాణం

ఈ విచిత్ర యాత్రలో ఆరంభం నుండి ఎన్నో అద్భుతాలు చూస్తూ రావడంతో ఇక నాలో ఆశ్చర్యపడే శక్తి పూర్తిగా నశించిపోయింది. కాని నేను నిలుచున్న చోట రాతి మీద మూడు వందల ఏళ్ల క్రితం చెక్కబడ్డ అక్షరాలు చూసి దిగ్ర్భాంతి చెందాను. ఆ ప్రాచీన ప్రఖ్యాత పరుసవేది పేరు ఇలా శిలాక్షరాలలో చూడడమే కాదు, ఆ అక్షరాలని చెక్కిన ఉలి కూడా అక్కడే వుంది. ఎంత నమ్మశక్యం కాకుండా కనిపించినా ఆ ప్రాచీన యాత్రికుడు ఈ ప్రాంతాలన్నీ సంచరించి వుంటాడని అనుకోవడంలో ఇక సందేహం లేదు.

నేనిలా నా ఆలోచనల్లో మునిగిపోయి వుంటే ఇక్కడ మావయ్య ఏదో పారవశ్యంలో ఊగిపోతూ ఆర్నె సాక్నుస్సేం ని పొగుడుతూ స్తుతి అందుకున్నాడు.
“ఓ మహా మేధావీ! మానవ మాత్రులు నీ తరువాత భూమి పొరలలోంచి చొచ్చుకుపోయేందుకు గాను ఎన్నో చక్కని చిహ్నాలు విడిచి వెళ్లావు. నీవు విడిచిన ఆనవాళ్లు మూడు శతాబ్దాల తరువాత కూడా ఈ చీకటి దారుల వెంట మాకు దారు చూపిస్తున్నాయి. నీవు చూసిన అద్భుతాలని నీలోనే ఉంచుకోకుండా మాతో పంచుకున్నావు. నీ చిహ్నాలని, నీ అడుగుజాడలని అనుసరిస్తూ భూమి కేంద్రం దాకా చొచ్చుకుపోడానికి వీలయ్యింది. మార్గాంతంలో ఇక్కడ నీ స్వహస్తాలతో చెక్కిన నీ పేరులోని ప్రథమాక్షరాలు మాకు దర్శనమిచ్చాయి. నేను కూడా నా పేరుని ఈ పాషాణపు పుట మీద చెక్కుతాను. నువ్వు కనుక్కున్న ఈ అమోఘమైన భూశిరానికి నీ పేరే పెడతాను. దీన్ని నేటి నుండి ‘కేప్ సాక్నుస్సేం’ అని పిలుస్తాను.”

మావయ్య పలికిన ఆ స్తుతి వాక్యాలు విన్నాక నాకు కూడా చెప్పలేని ఉత్సాహం కలిగింది. ఆ క్షణం అలసట మర్చిపోయాను. మా యాత్రలో పొంచి వున్న ప్రమాదాల సంగతి మరచిపోయాను. తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలనే చింత మరచిపోయాను. మరొక మనిషి సాధించిన దాన్ని మనం కూడా సాధించగలం అనిపించింది.
“పద మావయ్యా. ఇంకా ముందుకి వెళ్దాం,” మావయ్యని తొందర పెట్టాను.

మా ఎదుట అంతులేకుండా విస్తరించి వున్న చీకటి సొరంగంలోకి దూడుకుగా దూసుకుపోబోతూ అన్నాను. స్వతహాగా దూకుడు ఎక్కువైన మావయ్య ఈ సారి మాత్రం నెమ్మది, నెమ్మది అంటూ శాంతి వాక్యాలు పలికాడు.

“ముందు వెనక్కు వెళ్లి హన్స్ ని చేరుకుందాం,”  ఆదేశం ఇచ్చాడు మావయ్య. “మన పడవని ఇక్కడి దాకా తెమ్మందాం.”
ఇష్టం లేకపోయినా కాళ్లీడ్చుకుంటూ మావయ్య వెంట బయల్దేరాను.
“ఒకటి అడగనా మావయ్యా? ఇంతవరకు మనకి పరిస్థితులు బాగా అనుకూలించాయి కదూ?” మావయ్యని అడిగాను.
“అవునంటావా ఏక్సెల్?”
“సందేహమే లేదు. ఆ తుఫాను కూడా … అది నిండా నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి… పోయి పోయి మనని సరైన దారిలోనే పడేసింది. తుఫానులో చిక్కుకోకపోతే ఇంకా చాలా  ముందుకి వెళ్ళిపోయుండేవాళ్లం. లీడెన్ బ్రాక్ సముద్రానికి దక్షిణ తీరానికి చేరి వుంటే మన గతి ఏమై వుండేది? సాక్నుస్సేం పేరు కనిపించి వుండేది కాదు. ఇటు సముద్రం, అటు రాళ్లు – మధ్యన బందీలుగా మిగిలిపోయేవాళ్లం.”
“నిజమే ఏక్సెల్. దక్షిణానికి పోతున్నాం అనుకున్నాం గాని ఎలాగో మరి ఉత్తరానికి వచ్చి ఈ కేప్ సాక్నుస్సేం ని చేరుకున్నాం. నిజమే. నాకిది ఓ అద్భుతంలా తోస్తోంది. దీన్ని ఎలా వివరించాలో అర్థం కావడం లేదు.”
“కారణం ఏదైతేనేం మావయ్యా?  జరిగిందేదో జరిగింది. దాన్ని ఎలా వాడుకోవాలో ఆలోచించాలి.”
“నిజమే కాని…”

“నా మనసులో ఒకే ప్రశ్న దొలిచేస్తోంది. మనం ఇలా ఉత్తరంగా ముందుకి సాగిపోతే స్వీడెన్ వంటి ఉత్తర యూరప్ కి చెందిన దేశాల అడుగున ముందుకు సాగుతూ రష్యా, సైబీరియా మొదలైన ప్రాంతాల కిందుగా పోతామా, లేక ఆఫ్రికా ఎడారుల అడుగున చొచ్చుకుపోతామా, లేక అట్లాంటిక్ సముద్రపు కెరటాల అడుగున ముందుకి సాగిపోతామా… అదే తెలుసుకోవాలని వుంది.”
(ఇంకా వుంది)


లెక్కలతో వచ్చిన చిక్కులు

Posted by V Srinivasa Chakravarthy Friday, March 28, 2014 0 comments

అధ్యాయం 2. 

లెక్కలతో వచ్చిన చిక్కులు


“పిల్లలు అంకగణితాన్ని సాంప్రదాయక పద్ధతులతో కన్నా దొడ్డిదోవన అయితే బాగా నేర్చుకుంటారని నాకో నమ్మకం.”

నా మేనగోడలికి నాలుగేళ్ల వయసులో తన అక్కలు, అన్నలు కలిసి అంకెలు నేర్పించారు. “ఒకటి, రెండు, మూడు…”అంటూ బిగ్గరగా బయటికి అనమని నేర్పించారు. వాళ్లు నేర్పించినట్టే “ఒకటి, రెండు, మూడు…” అని అరుస్తూ వుండేది. అలాగే అరుస్తూ ఓసారి “ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఎనిమిది…” అనేసింది పొరపాట్న. అప్పటికే అంకెల్లో పండిపోయిన తన సోదర సోదరీ మణులు అంతా “ఛీ! ఛీ! అదేంటే? ఆరు తరువాత ఎనిమిది కాదు, ఏడు!” అంటూ చీవాట్లు పెట్టారు.

ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటే అనిపిస్తుంది. పిల్లలకి అంకెలు ఇలా నేర్పిస్తే అంకెల గురించి వాళ్లకి ఓ చిత్రమైన ఊహ ఏర్పడుతుంది. పిల్లలకి అంకెలు అనేవి ఓ వరుసక్రమంలో వచ్చే, అర్థం లేని పేర్లు గల వింత జంతువుల్లా అనిపిస్తాయేమో. అలా వచ్చి వాళ్ల నెత్తిన కూర్చున్న ఈ అంకెల జింకలు గుంపులు గుంపులుగా కలుస్తూ, మళ్ళీ విడిపోతూ మనో వన సీమల్లో కల్లోలం  సృష్టిస్తాయి. అంకెలు చేసే ఈ రాసలీలలనే పెద్దాళ్ళు “రెండు రెళ్లు నాలుగు, రెండు మూళ్ల ఆరు,” వంటి జిగిబిగి కవితలతో వర్ణిస్తుంటారు. అంకెలని ఆ విధంగా అర్థం చేసుకునే (లేదా అర్థం చేసుకోలేని) పిల్లలకి  అంకెలతో పెద్ద చిక్కే వచ్చి పడుతుంది. నా మేనగోడలి విషయంలో కూడా సరిగ్గా నేను ఊహించినట్టే జరిగింది. కొన్నేళ్ల తరువాత ఓ సారి, అంకగణితంలో చిన్నప్పుడు పెద్ద పెద్ద సున్నాలు చుట్టిన పెద్ద మనుషుల్ని కొంతమందిని పట్టుకుని అడిగాను. కొంచెం సిగ్గుపడి నవ్వేసి అవునని ఒప్పుకున్నారు. సరిగ్గా ఆ కారణం చేతనే అంకెల విషయం ఎప్పుడూ వాళ్లకి కొంచెం ఇబ్బందిగానే వుండేది అన్నారు.

అందుకే నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. పిల్లలకి వాస్తవ వస్తువుల ఆలంబన లేకుండా కేవలం అమూర్త భావనలుగా అంకెలు నేర్పడం తప్పని. పిల్లలకి “ఒకటి, రెండు, మూడు…” అని బట్టీ పట్టించడం ఒకటో క్లాసు టీచర్లకి చాతకాదని కాదు. అయితే అలా వేదంలా అంకెల పేర్లు వల్లె వేయడం, అంకెలంటే ఏంటో అర్థం చేసుకోవడం – ఈ రెండూ ఒకటి కాదు.

పిల్లలకి అంకెలని నామవాచకాలుగా నేర్పించకూడదు. విశేషణాలుగా నేర్పించాలి. అంటే “ఒకటి, రెండు…” అనేవి మరో దానితో సంబంధం లేని ప్రత్యేక పదాలుగా కాక, ఒక వస్తు సముదాయం యొక్క ఒక ప్రత్యేక లక్షణాన్ని సూచించే పదాలుగా నేర్పించాలి. ఉదాహరణకి “ఒక ఇల్లు, రెండు జడలు, మూడు ముక్కలు…” అంకెలతో ఇలాంటి సావాసానికి అలవాటు పడ్డ చాలా కాలం తరువాతే పిల్లలకి మూడు వస్తువుల సముదాయాలు అన్నిటికి మూడు అనేది ఓ సామాన్య లక్షణం అన్న అమూర్త భావన మెల్లగా మనసులోకి ఇంకుతుంది.

అలాగే అంకెలని వరుస క్రమంలో నేర్పించడం కూడా అంత మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఉదాహరణకి పిల్లలకి మూడు వస్తువుల సముదాయాన్ని చూపించి, వెంటనే ఏడు వస్తువుల సముదాయాన్ని చూపించాలి. ఎందుకంటే ప్రకృతిలో అంకెలు వరుసక్రమంలో కనిపించవు. పిల్లలు కూడా ఈ సత్యాన్ని గుర్తించి అర్థం చేసుకోవాలి.

ప్రథమ దశలో కొంత కాలం అంకెల్ని దృశ్య రూపంలో వస్తువుల విన్యాసాలుగా పిల్లలు అలవాటు పడితే బావుంటుంది. ముఖ్యంగా చిన్న అంకెల (పది కన్నా చిన్నవి) విషయంలో అది సాధ్యం అవుతుంది. ఉదాహరణకి మూడు అంకెని మూడు చుక్కల విన్యాసంగా ప్రదర్శించవచ్చు. ఆ మూడు చుక్కలు ఒకే వరుసలోగాని, త్రికోణపు కొసలుగా గాని ఉండొచ్చు. అలాగే నాలుగుని ఒకే వరుసలో వున్న నాలుగు చుక్కలుగానో, చదరపు కొసలుగానో ప్రదర్శించవచ్చు. అలాగే ఐదుని పంచభుజి లాగానో, ఒక చదరానికి పైన ఒక చుక్క లాగానో (ఇది చూడడానికి ఓ ఇల్లులా ఉంటుంది), లేదా ఒక చదరానికి మధ్య మరో చుక్క లాగానో ప్రదర్శించవచ్చు. కావాలంటే ఇలా చుక్కల్తో అంకెల బొమ్మల్ని చిన్న చిన్న పేక ముక్కల మీద ముద్రించి పిల్లల కిస్తే వాటితో రకరకాలుగా ఆడుకుంటారు. చుక్కల బొమ్మని అంకెతో జత చెయ్యడం మొదలైన ఆటలు ఆడుకోవచ్చు. అలాగని పిల్లలని బలవంతం చేసి ఇలాంటి ఆటలని నేర్పించాలని నేను సూచించడం లేదు. అంతకన్నా పొరబాటు మరొకటి లేదు. వరస పెట్టి అంకెలని వల్లె వెయ్యడమే కాకుండా మరెన్నో విధాలుగా కూడా పిల్లలకి అంకెలతో సాన్నిహిత్యం కలిగితే బావుంటుందని మాత్రమే నేను అంటున్నాను.

(ఇంకా వుంది)

కాంతి సంవత్సరాలు - తారల దూరాలు

Posted by V Srinivasa Chakravarthy Friday, March 21, 2014 0 comments

ఇప్పుడిక తారల దూరాలని పరిశీలిద్దాం.

మనకి అతిదగ్గర తార పెద్దగా ప్రకాశం లేని ఓ మినుకుమినుకు తార. దాని పేరు ప్రాక్సిమా సెంటారీ (Proxima Centauri). అది మన నుండి 4.27 కాంతిసంవత్సరాల దూరంలో వుంది. అంటే సుమారు 25  ట్రిలియన్ల మైళ్ల దూరం అన్నమాట. అంతకన్నా దగ్గర్లో మరో తార లేదు. అంటే ప్రాక్సిమా సెంటారీ నుండి బయల్దేరిన కాంతి మనను చేరుకోడానికి 4.27 ఏళ్లు (= 4  ఏళ్ల  99  రోజులు)  పడుతుంది. భూమి నుండి చంద్రుడి దాకా 1.25  సెకన్లలో వెళ్లే కాంతి ప్రాక్సిమా సెంటారీని చేరడానికి నాలుగేళ్లకి పైగా తీసుకుంటుంది.

ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన తార అయిన సిరియస్ (Sirius) మన నుండి 8.64  కాంతిసంవత్సరాల దూరంలో వుంది. ప్రాక్సిమా సెంటారీ కన్నా రెండు రెట్లు అన్నమాట.

ఓరియాన్ రాశిలో వున్న రైజెల్ (Rigel) అనే తార మన నుండీ 815  కాంతి సంవత్సరాల దూరంలో వుంది. సిరియస్ వున్న దూరం కన్నా ఇది 95  రెట్ల దూరంలో వుంది. ఈ సారి ఎప్పుడైనా మీరు రైజెల్ తారని చూస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆ కాంతి ఆ తార వద్ద నుండి బయల్దేరినప్పటికి భూమి మీద కాకతీయులు పరిపాలిస్తూ ఉండేవారు!

అంత దూరంలో వున్న రైజెల్ తార కూడా విశాల విశ్వంలో మన పరిసర ప్రాంతంలోనే వుందని చెప్పాలి.

సూర్యుడు, ఇంకా మనకి ఆకాశంలో కనిపించే ఎన్నో తారలు ఓ ప్రత్యేకమైన తారా సందోహానికి చెందుతాయి. అందులో సుమారు రెండొందల బిలియన్ల తారలు ఉన్నాయి. దాని పేరు పాలపుంత (Milky Way). అది ఓ ‘ఇడ్లీ’ ఆకారంలో వుంటుంది! ఇలాంటి విశాలమైన తారా సందోహాలని గెలాక్సీలు అంటారు.

మనం వుండే ఈ పాలపుంత గెలాక్సీ కి మనం కేంద్రం వద్ద  లేము. అసలు కేంద్రానికి దరిదాపుల్లో కూడా లేము. మనం ఆకాశంలో చూసే ఎన్నో తారలు గెలాక్సీ కేంద్రం నుండి 25,000 కాంతి సంవత్సరాల దూరంలో వున్నాయి. గెలాక్సీ కేంద్రం నుండి వచ్చే కాంతి మనకి ఇక్కడికి పెద్దగా కనిపించదు. ఎందుకంటే గెలాక్సీ కేంద్రానికి మనకి మధ్య విస్తారమైన నల్లని ధూళి మేఘాలు అడ్డుతెరలా వున్నాయి. అయితే ఆ తెరని కూడా రేడియో తరంగాలు భేదించగలవు. ఆ విధంగా మనకి గెలాక్సీ కేంద్రం గురించి తెలుస్తుంది.

గెలాక్సీ కేంద్రం నుండి వచ్చిన రేడియో తరంగాలు మరి 25,000  ఏళ్ల క్రితం అక్కణ్ణుంచి బయల్దేరాయి అన్నమాట. అప్పటికి ఇంకా భూమి మీద మానవులు నాగరికులు కాలేదు.

మొత్తం పాలపుంత గెలాక్సీ ని ఒక కొస నుండి అవతలి కొస వరకు పరిగణిస్తే లక్ష కాంతిసంవత్సరాల వెడల్పు ఉంటుంది. అంటే కాంతికి మన గెలాక్సీ ని ఒక కొస నుండి అవతలి కొస వరకు దాటడానికి లక్ష సంవత్సరాలు పడుతుంది.




విశ్వంలో వున్నది కేవలం మన గెలాక్సీ మాత్రమే కాదు. ఇలాంటీ గెలాక్సీలు కొన్ని బిలియన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని మన కన్నా చిన్నవైతే మరి కొన్ని మన కన్నా చాలా పెద్దవి.


చెమట గ్రంథుల మాట అలా వుంచి ఇక చమురు గ్రంథుల విశయానికి వద్దాం. ఈ చమురు గ్రంథుల ప్రయోజం ఏంటంటే మరి ఠక్కున చెప్పడం కష్టమే. నాలో ఈ గ్రంథులు కొన్ని లక్షలు ఉంటాయి. నా రోమకూపాలకి (hair follicles)  కి అతుక్కుని వుంటాయి. అవి నా కేశాలని, చుట్టూ ఉండే చర్మాన్ని కందెన చేస్తాయి. మీ సంగతంటే వేరు గాని మీ పూర్వీకులు ఉన్నారే… అంటే బాగా పూర్వీకులు అన్నమాట… వాళ్లకి మరి ఒంటి నిండా బొచ్చు ఉండేది కనుక ఆ బొచ్చుకి తడి అంటకుండా ఉండేదుకు గాను, ఆ బొచ్చులో వెచ్చదనాన్ని నిలువ ఉంచుకునేందుకు గాను  ఈ చమురు సంస్కారాలు అవసరమై వుండేవేమో. అప్పుడు పనికొచ్చినవే ఇప్పుడు తలనొప్పిగా దాపురిస్తున్నాయి. రోమకూపాలు పూడుకుపోతాయి. వాటిలో చెత్త చేరుతుంది. దాని మూలంగా మొటిమలు ముఖాన ప్రత్యక్షమవుతాయి.

ఇక ఈ కేశాల తయారీ ఎలా జరుగుతుందో చెప్తాను. నా మీద చదరపు సెంటీమీటరుకి సుమారు పది రోమకూపాలు  ఉంటాయి. ప్రతీ కూపానికి దాని వేళ్ల వద్ద ఓ దుంప లాంటి నిర్మాణం వుంటుంది. అక్కడి నుండి ఉపరితలం వరకు ఓ నాళం లాంటి నిర్మాణం వుంటుంది. రోమకూపం లోతుల్లో కణాలు వేగంగా పెరుగుతూ వుంటాయి. అలా పుట్టిన కొత్త కణాలు నాళం లోంచి పైకి తోసుకొస్తూ ఓ దారం లా ఏర్పడతాయి. ఆ దారమే వెంట్రుక!

నాలో కొట్ల కొద్ది మెలనోసైట్ లు అనే రకం కణాలు కూడా వుంటాయి. ఇవి మెలనిన్ (melanin) అనే రంగున్న పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి.  జుట్టు రంగు గాని, చర్మం రంగు గాని ఈ మెలనిన్ వల్లనే వస్తుంది. మెలనిన్ లేని వారిలో చర్మం తెల్లగా వుంటుంది. దాన్నే బొల్లి అంటాం. మెలనిన్ శరీరానికి ఒక విధమైన రక్షణ నిస్తుంది. దీని వల్లనే ఎండలో వుండే హానికరమైన అల్ట్రా వయిలెట్ కిరణాల నుండి శరీరానికి రక్షణ దొరుకుతుంది. మీరు గాని ఎండలో మరీ ఎక్కువగా తిరిగినట్టయితే మీ ఎపీడెర్మిస్ యొక్క లోపలి పొరల నుండీ మెలనిన్ రేణువులు నెమ్మదిగా పైకి తన్నుకొస్తూ ఉపరితలాన్ని చేరుకుంటాయి. అందువల్ల చర్మం కాస్త నల్లబడుతుంది.

నాలోని నాడీ జాలాలు కూడా సామాన్యమైనవి కావు. ఉదాహరణకి మీ వేళ్ల కొసల్లో చదరపు సెంటీమీటరుకి కొన్ని వేల నాడీ తీగల కొసలు ఉంటాయి. మీ చర్మానికి కలిగే సంవేదనలని ఈ నాడీ తీగలే మీ మెదడు దాకా మోసుకుపోతాయి. మీ బొటన వేలు ఏ రాయికో తగిలి చర్మం చెక్కుకుపోయినా, మీరు ఏ కారణం చేతనైనా పోయి పోయి చెయ్యి  పొయ్యిలో పెట్టినా, గడ్డం గీసుకునే సమయంలో రక్తతర్పణం జరిగినా – ఈ నాడీ తీగలు ‘కొంపలు అంటుకున్నాయొహో’ అంటూ ప్రమాద వార్తని మెదడుకి చేరవేస్తాయి.

ఆలాగే మీకు చలేసినప్పుడు చల్లదనాన్ని పసిగట్టే ప్రత్యేక నాడీ తీగలు ఆ సంగతిని మీ మెదడుకి తెలుపుతాయి. అప్పుడు మీరా చలికి ‘ఉహుహూ’ అని వణుకుతారన్నమాట. అప్పుడు మీ రోమకూపాల్లో వుండే చిన్నారి కండరాలు పన్లోకి దిగి మీ చర్మం మీద వుండే వెంట్రుకలని ఓడ సరంగు తెరచాప పైకెత్తినట్టు ఎత్తుతాయన్నమాట. అప్పుడు మీ వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయన్నమాట! అయినా ఈ వెంట్రుకలు నిక్కబొడుచుకోడాలి అవీ ఏదో వింటానికి బావుంటుందేమో గాని (అదీ సందేహమే!) దాని వల్ల అసలు ప్రయోజనం ఉన్నట్టు కనపడలేదు అంటారేమో! నిజమే ఈ ప్రత్యేక కేశ సౌకర్యాలన్నీ మీ టామీకి గాని మీకు పనికిరావని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

 Image: http://www.wilton.com/idea/Hair-Raising-Experience

(ఇంకా వుంది)








బ్రిటిష్ న్యూరాలజిస్టు హూగ్లింగ్స్ జాక్సన్  మూర్చ వ్యాధికి (epilepsy) చెందిన ఒక ప్రత్యేక లక్షణాన్ని అధ్యయనం చేసేవాడు. మూర్ఛ వ్యాధి వున్న రోగుల్లో కొన్ని సమయాలలో ఉన్నట్లుండి శరీరం వశం తప్పి, ఒంటి మీద స్పృహ కోల్పోయి, గిగిలా తన్నుకుంటూ కింద పడిపోవడం జరుగుతుంది. అలాంటి పరిణామం కలగడానికి కారణం మెదడులోని నాడీ విద్యుత్ చర్య అడ్డు అదుపు లేకుండా వ్యాపించడమే. ఓ కార్చిచ్చులా ఇలాంటి నాడీ విద్యుత్ చర్య ఒక ప్రత్యేక స్థానం నుండి మొదలై మెదడులో ఇరురుగు పొరుగు ప్రాంతాలకి వ్యాపిస్తుంది. అయితే జాక్సన్ కాలంలో మూర్ఛ వచ్చినప్పుడు మెదడులో ఏం జరుగుతోంది అన్న విషయం మీద పెద్దగా అవగాహన ఉండేది కాదు. బయటికి కనిపించే తంతు మాత్రమే తెలిసేది. మూర్ఛ వచ్చినప్పుడు శరీరంలో కనిపించే కంపన కూడా ఒక ప్రత్యేక తరహాలో వ్యాపిస్తుంది. ముందుగా కంపన చేతిలో మొదలవుతుంది. నెమ్మదిగా మణికట్టుకి, తరువాత మోచేతికి, అక్కణ్ణుంచి భుజానికి వ్యాపించి, క్రమంగా శరీరం మొత్తాన్ని వశం చేసుకుంటుంది. ఒళ్ళంతా గిలగిల కొట్టుకోవడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మనిషి తూలి కింద పడడం జరుగుతుంది. ఇలాంటి కంపనలని (seizures)  focal motor seizures  అంటారు.



Focal motor seizures  ని అధ్యయనం చెయ్యడం మొదలెట్టిన జాక్సన్ కంపన జరుగుతున్నప్పుడు మెదడులో ఏం జరుగుతోందో ఒక ఊహ కలగసాగింది. శరీరంలో వివిధ అంగాల లోని కదలికలని మెదడులో వివిధ ప్రాంతాలు శాసిస్తాయని ముందుగా ఊహించాడు. అంతే కాక పక్క పక్కగా వున్న అంగాలని అదిలించే మెదడు ప్రాంతాలు కూడా పక్క పక్కగా వుండి వుండాలని ఊహించాడు. ఉదాహరణకి చేతిని శాసించే ప్రాంతం పక్కనే ముంజేతిని శాసించే ప్రాంతం ఉండాలి. దాని అవతల భుజాన్ని శాసించే ప్రాంతం… మెదడులో వివిధ ప్రాంతాల అమరిక అలా వున్నప్పుడు, ఏ కారణం చేతనో చేతిని శాసించే ప్రాంతంలో అసాధారణ రీతిలో నాడీ విద్యుత్  చర్య మొదలయ్యింది అనుకుందాం. ఆ చర్య ఓ కార్చిచ్చులా పక్కనే వున్న ముంజేతిని శాసించే ప్రాంతానికి వ్యాపిస్తుంది. ఆ తరువాత భుజాన్ని శాసించే ప్రాంతానికి వ్యాపిస్తుంది. అలా వ్యాపించి వ్యాపించి మొత్తం శరీరాన్ని శాసించే ప్రాంతాలన్నిటీ ఆక్రమిస్తుంది. అప్పుడు శరీరం అంతా కంపనకి లోనవుతుంది.

జాక్సన్ ఊహించిన వర్ణన నిజమే అయితే మెదడులో ఫలానా చోట మొత్తం శరీరాన్ని శాసించే ఓ ‘మ్యాపు’ లాంటిది వుండాలన్నమాట. ఓ కంప్యూటర్ కీ బోర్డ్ లో ఒక్కొక్క బటన్ ని నొక్కితే తదనుగుణమైన అక్షరం స్క్రీన్ మీద కనిపించినట్టు, మెదడులో వున్న ఈ మ్యాపుని ప్రత్యేక స్థానాల్లో ప్రేరిస్తే  ఆ స్థానానికి అనుగుణమైన అంగంలో చలనం ఏర్పడుతుంది. మరి నిజంగానే మెదడులో అలాంటి మ్యాపులు వున్నాయా?

ఈ ప్రశ్నకి మొట్టమొదటి సమాధానాలు మనకి కెనడాకి చెందిన విల్డర్ పెన్ ఫీల్డ్ అనే న్యూరో సర్జన్ అధ్యయనాల నుండి బయట పడ్డాయి. 1950  లలో పెన్ ఫీల్డ్ ఎపిలెప్సీ వ్యాధిని నయం చేసే పద్ధతుల కోసం అన్వేషిస్తున్నాడు. వృత్తి రీత్యా సర్జన్ కనుక సర్జరీతో ఆ వ్యాధిని నయం చేసే మార్గాల కోసం వెతకసాగాడు. ఎపిలెప్సీలో సీజర్ మొదలైనప్పుడు మెదడులో ఒక ప్రత్యేక స్థానం నుండి అసాధారణమైన నాడీ విద్యుత్ చర్య మొదలవుతుంది అని పైన చెప్పుకుందాం. ఆ స్థానాన్నే నాభి (focus)  అంటారు. ఆ నాభి ఎక్కడుందో పట్టుకుని, సర్జరీ ద్వారా ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తే, లేదా తొలగిస్తే వ్యాధి లక్షణాలు అరికట్ట వచ్చని పెన్ ఫీల్డ్ ఆలోచన.

ఎపిలెప్టిక్ రోగి సీజర్   గురి అయ్యే క్షణం వరకు ఎదురు చూడకుండా ముందే, కపాలంలో సర్జరీ ద్వారా  రంధ్రం చేసి, మెదడులో సంబంధిత ప్రాతాలని బట్టబయలు చేసి, వివిధ స్థానాలకి విద్యుత్ ప్రేరణ ఇస్తే ఏం జరుగుతుందో పరిశీలించాడు పెన్ ఫీల్డ్. ఎపిలెప్టిక్ నాభి వద్ద ముందే పరిస్థితి విషమంగా వుండడం వల్ల, ఆ స్థానంలో విద్యుత్ ప్రేరణ ఇవ్వగానే, ఊహించినట్టుగానే రోగిలో సీజర్ మొదలయ్యింది. ఆ స్థానానికి పరిసర ప్రాంతాలని సర్జరీ ద్వార తొలగించినప్పుడు ఎన్నో సందర్భాలలో వ్యాధి లక్షణాలు మెరుగుపడ్డాయి.

ఎపిలెప్సీ చికిత్స లక్ష్యంగా గల పెన్ ఫీల్డ్ అధ్యయనాల వల్ల, వాధికి ఒక చికిత్సామార్గం కనిపించడమే కాక, అనుకోకుండా మరో అధ్బుతమైన విషయం కూడా బయటపడింది.

(ఇంకా వుంది)







పుస్తక ప్రపంచంలో పౌరసత్వం

Posted by V Srinivasa Chakravarthy Tuesday, March 11, 2014 0 comments


హెలెన్ అని ఓ పది నెలల పాప మా ఆఫీస్ గుమ్మంలో ‘Land of Oz’  అని ఓ పిల్లల నవల పట్టుకు కూర్చుంది. దాంతో హాయిగా ఆడుకుంటోంది. ఆమెకి అది కేవలం ఓ మెరిసే దీర్ఘ చతురస్రాకారపు వస్తువు. దాన్ని చేతిలో పట్టుకుని గిలకలా ఆడించాలని చూస్తోంది. కాని పైన మెరిసే కాగితం నునుపుగా ఉండడంతో పుస్తకం పట్టు జారిపోతోంది. మధ్య మధ్యలో దబ్బు మని కిందపడిపోతోంది. కొన్ని సార్లు వట్టి కవరు పేజీతో పట్టుకుని పైకెత్తుతుంది. కాని ఆ పుస్తకంలో ఇంకా ఎన్నో సన్నని పేజీలు వున్నాయని వాటిని చూడొచ్చని, తిప్పొచ్చని, నలపొచ్చని, చింపొచ్చని అలా ఇంకా ఎన్నో సరదా విన్యాసాలు చెయ్యొచ్చని ఆ పాపకి ఇంకా తెలీలేదు పాపం!

నిన్నే ఆ పాప వాళ్ల అక్క ‘అన్నా’ (మూడేళ్లది) వచ్చింది. ఓ పెద్ద కుర్చీలో కూర్చుని ‘A.J. Wentworth B.A.’ అన్న పుస్తకం పట్టుకుని వాళ్లమ్మ మేరీకి ‘చదివి’ వినిపిస్తోంది అన్నా. నిజంగా పెద్దవాళ్లు చదువుతున్నట్టే చదువుతోంది. అయితే ఆమె అనే మాటలకి చేత్తో పట్టుకున్న పుస్తకానికి ఏ సంబంధమూ లేదు. ఎవరో అదృశ్య స్నేహితుల విచిత్ర గాధలేవో చెబుతోంది. అల్లంత దూరంలో నన్ను చూసి, “మా అమ్మకి చదివి వినిపిస్తున్నాను. అచ్చంగా పదాలన్నీ నేనే చదువుతున్నాను,” అనేసి మళ్లీ చదువులో మునిగిపోయింది. “అవునవును, వింటున్నా!” అని కాసేపు కథ విని మళ్లీ నా పన్లో పడిపోయాను. ఆ తరువాత వాళ్లమ్మ మేరీ చెప్పింది. అన్నా చదువుతూ, చదువుతూ మధ్యలో చదవడం ఆపి పేజీ తిప్పి మళ్లీ కొనసాగిస్తుందట!

నిన్న హెలెన్ చదువు, ఇవాళ హన్నా చదువు – ఈ రెండు చూస్తుంటే పిల్లలకి పుస్తకాలతో పరిచయం ఏర్పడడానికి రెండు పూర్తిగా భిన్నమైన మార్గాలు ఉన్నాయని పించింది. మొదటి పద్ధతిలో వరుసగా ముందు అక్షరాలు, తరువాత చిన్న చిన్న పదాలు, తరువాత కొన్నే పదాలతో కూర్చిన వాక్యాలు,   తరువాత చిన్న పుస్తకాలు, తరువాత పెద్ద పుస్తకాలు, ఇలా పరిచయం చేస్తూ పోతే చివరికి ఏ పుస్తకం అయినా చదివే సామర్థ్యం వచ్చే అవకాశం వుంది. కాని ఈ పద్ధతిలో వచ్చిన చిక్కేంటంటే ఇలా ఒక్క పుస్తకం పూర్తయ్యేసరికి గగనం అయిపోతుంది. ఈ పద్ధతిలో పుస్తక ప్రపంచం లోకి ప్రవేశించడం అంటే వరుసగా ఎన్నో అవరోధాలని దాటుకుంటూ పోవడం అన్నమాట. ఒక అవరోధం దాటగానే మరో అవరోధం సిద్ధంగా వుంటుంది. ఒక తలుపు తెరవగానే మరో ముసిన తలుపు ఆహ్వానిస్తుంది.

రెండో పద్ధతి అన్నాకి పుస్తకాలతో పరిచయం అయిన పద్ధతి. ఈ పుస్తకం నాది అని ఓ పుస్తకాన్ని తీసుకుని మనసుకి హత్తుకున్న నాడు అన్నాకి పుస్తక ప్రపంచంలోకి పరిచయం దొరికింది. ఆ ప్రపంచంలో పౌరసత్వం లభించింది. చిన్న చిన్న అక్షరాల నుండో, పదాల నుండో ప్రారంభించక  “పెద్ద వాళ్ల దగ్గర పుస్తకాలు వుంటాయి, అలాగే తన వద్ద కూడా పుస్తకాలు ఉంటాయి, ఉండగలవు” అన్న భావనతో పరిచయం మొదలయ్యింది. ఆ విశాలమైన భావనలో మెల్లగా చిన్న చిన్న భావాలు ఇముడుతూ వచ్చాయి. పుస్తకాల్లో కథలు దాక్కుని వుంటాయని, వాటిలో మళ్ళీ పదాలు వుంటాయని, ఆ పదాల పని పడితే కథల్లోని రహస్యం తెలిసిపోతుందని, ఈ కథలని ఇతరులకి చెప్పొచ్చని – ఇలా ఎన్నో విషయాలు ఆ ప్రాథమిక భావన ద్వార వరుసగా ఆమె మనసులోకి ప్రవేశించాయి.

సాంప్రదాయక పద్ధతిలో నేర్చుకున్న పాపకి తక్కిన విషయాలన్నీ – పదాలు, వాక్య నిర్మాణం – మొదలైనవి తెలియొచ్చు. అన్నా చివరి నుండి మొదలెట్టింది. ‘ఇది నాది’ అన్న భావన ఆమె మొదటి మెట్టు. మరి విద్య అనే సుదీర్ఘ ప్రయాసకి అంతరార్థం, విజ్ఞాన సర్వస్వాన్నీ హృదయానికి హత్తుకుని “ఇది నాదీ” అని ధీమాగా అనగలగడమా?





హైగెన్స్ ప్రతిపాదించిన తరంగ సిద్ధాంతాన్ని ఉపయోగించి కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనాలని ఎలా వివరించవచ్చో కిందటి సారి చూశాం.

అయితే హైగెన్స్ వర్ణించినట్టు కాంతి తరంగాల రూపంలో వ్యాపిస్తుంది అంటే ఊహించుకోవడం కష్టం. ఒక నీటి తరంగాన్ని ఊహించుకోవడం సులభం. ఒక బకెట్ లో నిశ్చలమైన నీటిలో  పదే పదే వేలు ముంచి అలజడి కలుగజేస్తే నీటి తరంగం పుడుతుంది. ఆ తరంగం వేలు ముంచిన చోటి నుండి వలయాలుగా వ్యాపిస్తుంది. అలా వ్యపించే తరంగం యొక్క కంపన వేగం సెకనుకి కొన్ని సార్లు మాత్రమే వుంటుంది. అలాగే దాని తరంగ దైర్ఘ్యం కూడా కొన్ని సెంటీమీటర్ల స్థాయిలో ఉంటుంది. కనుక ఆ తరంగంలో వచ్చే మార్పులని కంటితో చూసి పసిగట్టవచ్చు.
కాని కాంతి తరంగం యొక్క కంపన వేగం సెకనుకి 10^12 – 10^15 Hz  స్థాయిలో వుంటుంది. దాని తరంగ దైర్ఘ్యం కూడా మైక్రాన్లలో వుంటుంది. కనుక మామూలుగా చూసినప్పుడు కాంతి ఒక తరంగం అనిపించదు.
అయినా కేవలం కాంతిని ఒక తరంగంగా ఊహించుకోవడానికి, ఆ తరంగం యొక్క పరావర్తనం, వక్రీభవన దృగ్విషయాలని అర్థం చేసుకోవడానికి నీటి తరంగాన్ని ఒక ఉపమానంగా, ఒక నమూనాగా వాడుకోవచ్చు.

అలా నీటీ తరంగాన్ని పోలికగా వాడుతూ కాంతి యొక్క లక్షణాలని ప్రదర్శించడం కోసం ఏర్పాటు చెయ్యబడ్డ ప్రయోగ సామగ్రినే ‘రిపిల్ టాంక్’ అంటారు.

ఇందుకో లోతు తక్కువగా వున్న గాజుతో చేసిన ఓ నీటి తొట్టెను తీసుకుంటారు (చిత్రం). తొట్టెకి ఒక కొసన స్కేలు లాంటి పొడవాటి చెక్క బద్దని నీటికి తగిలీ తగలనట్టుగా  వేలాడదీస్తారు. ఆ చెక్క బద్ద మీద ఓ మోటారు తగిలించి వుంటుంది. మోటారు తిరుగుతున్నప్పుడు చెక్కబద్ద కంపిస్తుంది. ఆ కంపన వల్ల కింద నీటిలో అలజడి పుడుతుంది. ఆ అలజడి తరంగాల రూపంలో తొట్టెలో వున్న నీటిలో వ్యాపిస్తుంది. అలజడి సృష్టిస్తున్న చెక్కబద్ద ఒక సరళ రేఖలా వుంది కనుక, దాని వల్ల పుట్టే తరంగాలి తలీయ తరంగాలు (plane waves) అవుతాయి.


అలా కాకుండా ఓ ముల్లుని నీట్లో ముంచుతూ అలజడి సృష్టిస్తే పుట్టే తరంగాలు బిందువు లాంటి ఆ ముల్లు చుట్టూ వలయాలుగా వ్యాపిస్తాయి. అలా పుట్టేవి గోళాకార తరంగాలు (spherical waves) అవుతాయి.
Ripple tank demo

తొట్టెకి పై నుండి కాంతి ప్రసరిస్తారు. తొట్టె అడుగు భాగం కూడా గాజుతోనే చేయబడి వుండడం వల్ల పై నుండి వచ్చే కాంతి నీట్లోంచి ప్రసరించి తొట్టె కిందకి పోతుంది. నీటి తరంగాల లోంచి కాంతి పోవడం వల్ల ఆ తరంగాల ఆకారం కింద నేల మీద పడే చిత్రంలో చూడవచ్చు. తరంగాల చిత్రం కింద నేల మీద కాకుండా ఎదుట ఓ పెద్ద తెర మీద పడేలాగ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

పరావర్తనం (reflection)
పైన చూపించిన ప్రయోగ ఏర్పాటులో పుట్టిన తలీయ తరంగాలకి అవరోధంగా, తరంగాలకి వాలుగా ఓ లోహపు బద్ద ఉంచితే, తరంగాలు ఆ బద్దతి డీకొని మరో కోణం నుండి బద్ద నుండి దూరం కావడం కనిపిస్తుంది. ఆపాత కోణం పరావర్తనం కోణంతో సమానం కావడం కనిపిస్తుంది.


(Image: Wiki)
ఈ దృగ్విషయాన్ని ఈ కింది వీడియో లో చూడవచ్చు.
Reflection and refraction


వక్రీభవనం (refraction)
వక్రీభవనాన్ని ప్రదర్శించడానికి రెండు మాధ్యమాలు కావాలి. రెండు మాధ్యమాలలో తరంగ వేగం వేరుగా వుండాలి. నీటి తరంగాల విషయంలో నీటి లోతుకి, తరంగా వేగానికి సంబంధం వుంది. లోతు ఎక్కువైతే తరంగాల వేగం ఎక్కువ అవుతుంది. పై ప్రయోగ ఏర్పాటులో లోతు తగ్గించడానికి ఓ అద్దపు ఫలకాన్ని నీట్లో ముంచుతారు. ఆ ఫలకం వున్న చోట మాత్రం తరంగ వేగం తక్కువ అవుతుంది. ఇప్పుడు చెక్క బద్ద వున్న చోటి నుండి పుట్టుకొచ్చే తలీయ తరంగాలు మునిగిన అద్దం యొక్క ఒక అంచుని చేరగానే కాస్త పక్కకి వంగుతాయి. అద్దం యొక్క అంచుని తాకినప్పుడు ఆపాత తరంగాల యొక్క కోణానికి, అంచుని తాకి అవతలికి ప్రసరించిన వక్రీభవన తరంగాల కోణానికి మధ్య సంబంధానికి స్నెల్ నియమంతో సరిపోతుందని సులభంగా గుర్తించొచ్చు.



(Image: Wiki)
 మరిన్ని వివరాలు ఈ క్రింది వీడియోలో -
Reflection and refraction


రిపిల్ టాంక్ బట్టి మనకి అర్థమయ్యే ఓ ముఖ్యమైన సత్యం వుంది. స్నెల్ నియమాలు కేవలం కాంతికి మాత్రమే పరిమితమైన సత్యాలు కావు. అవి తరంగాల యొక్క సామాన్య లక్షణాలని అర్థమవుతోంది. అందుకే నీటి తరంగాల విషయంలో కూడా స్నెల్ నియమాలు పని చెయ్యడం చూడగలిగాం.

మన సచేతనమైన అనుభూతులకి ఏ రకమైన అచేతనమైన వన్నెలని ఆపాదిస్తాం అనేది వ్యక్తి నుండి వ్యక్తి మారుతూ వుంటుంది. ఒక సామాన్య, అమూర్త భావన మనకి తారసపడినప్పుడు దానికి మన వ్యక్తిగత మనస్సు ఒక నేపథ్యాన్ని, సందర్భాన్ని అందిస్తుంది. కనుక మన ప్రత్యేక, వ్యకిగత ధోరణిలో దాన్ని మనం అర్థం చేసుకుంటాం, వినియోగించుకుంటాం. “దేశం”, “డబ్బు,” “సమాజం”, “ఆరోగ్యం” మొదలైన సామాన్య పదాలని విన్నప్పుడు ఆ పదాలు నాకెలా అర్థం అవుతాయో, అవతలి వారికి కూడా ఇంచుమించు అలాగే అర్థం అవుతాయని నేను అనుకుంటాను. ఇక్కడ “ఇంచుమించు” అన్న పదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకే సాంస్కృతిక నేపథ్యం గల వారిని ఇద్దరిని తీసుకుంటే వారికి కూడా ఒకే పదం రెండు రకాలుగా అర్థం కావచ్చు. ఇక బాగా వైవిధ్యంతో కూడా సామాజిక, రాజకీయ, మత, మానసిక అనుభవరాశి గల వ్యక్తుల విషయంలో అయితే ఆ రకమైన అర్థభేదం చాలా తీవ్రంగా ఉంటుంది.
('Time is a river without banks' by March Chagall. అచేతనలో ఉండే అంశాల గందరగోళ పరిస్థితిని తలపిస్తుంది ఈ చిత్రం.)

భావనకి, పదానికి మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోతే ఇలా వ్యక్తికి వ్యక్తికి మధ్య అవగాహనలో పెద్దగా తేడా వుండదు. కాని భావనని బోధపరచడానికి కచ్చితమైన నిర్వచనం, విపులమైన వివరణ అవసరమైన పక్షంలో అవగాహన భేదం విపరీతంగా ఉంటుంది. ఆ భేదం మానసికమైన, బుద్ధిగతమైన అవగాహనలోనే కాదు, అంతకన్నా ముఖ్యంగా పదానికి సంబంధించిన హార్దిక అనుభూతిలో తేడా వుంటుంది. ఆ తేడాలు ఎక్కువగా అచేతనంగా, ఉపచేతనంగా వుంటాయి కనుక బయటికి వ్యక్తం కావు.

అవగాహనలో అలాంటి భేదాలకి పెద్దగా ప్రాముఖ్యత లేదని, దైనిక అవసరాలకి వాటికి సంబంధం లేదని కొందరు అనుకోవచ్చు. కాని వాస్తవంలో ఎంత కచ్చితమైన సచేతన అంశాల విషయంలో అయిన వాటి చుట్టూ అనిశ్చితమైన అచేతన ఛాయ అలముకుని వుంటుంది.  ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, దానికి మనం స్పందిస్తున్నప్పుడు మనలో ఓ ఆంతరిక, ఆత్మగత సంఘటన జరుగుతోంది. కనుక ఆ సంఘటనలో నిగూఢంగా, మర్మంగా ఉండే అంశం తప్పకుండా వుంటుంది. అంకెల లాంటి సర్వసామాన్యమైన భావనని తీసుకున్నా కూడా అవి కేవలం లెక్కించడానికి పనికొచ్చే సాధనలే అనుకుంటే పొరబాటు. అంకెలలో అధ్యాత్మికమైన అంతరార్థం వుంటుంది.  పైథాగరస్ వంటి వారి ప్రకారం అంకెలు దివ్యమైనవి కూడా! కాని మనం దైనందిన జీవితంలో అంకెలని వాడేటప్పుడు ఇవన్నీ మన అనుభవంలోకి రావు.

కనుక మన సచేతన మానసంలో ఉండే ప్రతీ భావనకి, అచేతనమైన, ఆత్మగతమైన అనుబంధిత అంశాలేవో వుంటాయి. తీవ్రతలోను, ప్రగాఢతలోను ఆ అనుబంధిత అంశాల్లో ఎంతో వైవిధ్యం వుంటుంది. ఆ భావన మన పూర్ణ వ్యక్తికి, జీవితానికి ఎంతో ముఖ్యం అయినట్లయితే, మన అచేతనలో ఆ భావన యొక్క అనుభంధిత మరింత బలవత్తరంగా వుంటుంది. ఆ భావానికి సంబంధించిన ఇతర భావాలు, భావజాలాలు మన అచేతనలో ముందే వున్న పక్షంలో కూడా ఆ భావనకి సంబంధించిన అచేతన అంశం బలవత్తరం అవుతుంది.  ఆ కారణం చేత ఆ భావన యొక్క “సామాన్య” అంశం పలచన అవుతుంది. ఆ భావన మన అచేతన లోకి ఇంకా ఇంకా లోతుగా చొచ్చుకు పోతున్న కొద్ది దాని లక్షణం గణనీయంగా మారిపోతుంది.

(ఇంకా వుంది)









జరిగిన దాని గురించి తలచుకుంటూ ఉంటే నా మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది నిజం? దేన్ని నమ్మాలి? నా కళ్ళు చెప్పిన సాక్ష్యం తప్పనుకోవాలా? ఈ భూగర్భ కూపంలో మనషి జీవించడం అనేది సాధ్యమేనా? ఈ పాతాళ కుహరాలలో మానవ జాతులు ఎలా జీవించగలవు? ఈ వైపరీత్యాన్ని ఎలా నమ్మడం?

బహుశ అది మానవాకారాన్ని పోలిన ఏ వానరమో కావచ్చు. వెనకటి భౌగోళిక యుగాలకి చెందిన ప్రోటోపితికా, మెసోపితికా, లేకపోతే శ్రీ లార్టెట్  గారు సన్సావ్ లో ఆ ఎముకల గుహలో కనుక్కున్న ఏ మధ్యయుగపు వానరమో కావచ్చు. కాని ఈ జీవం పరిమాణంలో ఆధునిక పురాజీవశాస్త్రానికి తెలిసిన జీవాలన్నిటినీ మించిపోయింది.

ఏదేమైనా ఆ కాంతులు చిందే కారడవిని దాటి చాలా దూరం వచ్చేశాం. అయినా పరిగెడుతూనే వున్నాం. ఏ క్షణాన ఆ మహాకాయుడు వెనక నుండీ వచ్చి మా మీద పడతాడోనన్న భయంతో పరిగెడుతున్నాం. అలా ముందుకి సాగిపోతూ అనుకోకుండా మళ్లీ లీడెన్ బ్రాక్ సముద్ర తీరానికి వచ్చాం.

ఈ సారి మేం వచ్చిన తీర భాగం ఇంతకు ముందు మేం చూసింది కాదని స్పష్టంగా చెప్పగలను. ఇంతకు ముందు మేం వచ్చిన తీరంలో కొన్ని రాళ్ల సమూహాలు గ్రౌబెన్ రేవుని తలపించేవి. అనుకోకుండానే లీడెన్ బ్రాక్ సముద్రానికి ఉత్తర ప్రాంతానికి చేరుకున్నాం. ఎక్కడ చూసిన రాళ్ల సందుల్లోంచి జలధారలు స్రవిస్తున్నాయి. కాని కాస్త ముందుకు వెళ్తే చిన్న చిన్న గుట్టలు కనిపిస్తున్నాయి. మునుపు చూడని ఓ సెలయేరు. దాంతో మళ్ళీ సందేహంలో పడ్డాను.

నా సందేహం మావయ్యకి వెలిబుచ్చాను. ఆయనకి కూడా కచ్చితంగా తెలియడం లేదు.

“మనం మొదటి మాత్రం రాలేదని అనిపిస్తోంది,” అన్నాను.  “తుఫాను మనల్ని మరింత ముందుకి తీసుకుపోయింది. కాని ఈ తీరాన్ని అనుసరిస్తే మళ్లీ గ్రౌబెన్ రేవుని చేరుకోగలం.”
“అదే నిజమైతే ఈ యాత్రలో ఇంకా ముందుకి సాగడం వల్ల ప్రయోజనం లేదు. కాని నువ్వు పొరబడ్డావేమో?” మావయ్య ప్రశ్నించాడు.
“కచ్చితంగా చెప్పడం కష్టం మావయ్యా. ఈ రాళ్లు మాత్రం ముందు చూసిన రాళ్ల లాగానే వున్నాయి. ఇంతకు ముందు హన్స్ మన తెప్పని నిర్మించింది ఈ గుట్టే అనుకుంటా. ఆ గుట్ట ఇది కాకపోయినా అది ఇక్కడే ఎక్కడో వుండాలని అనిపిస్తోంది.”
“కాని ఇక్కడికి ఇంతకు ముందు వచ్చి వుంటే మన కాలి గుర్తులు కనిపించాలిగా. కాని ఎక్కడా కనిపించడం లేదే?”
“నాక్కనిపించిందోచ్!” ఉత్సాహం పట్టలేక అరిచాను. కింద పడి వున్న ఓ తుప్పు  పట్టిన కత్తిని పైకి తీసి మావయ్యకి చూపించాను.
“అది నీదా?” మావయ్య అడిగాడు.
“కాదు. నీ దనుకున్నానే!”
“లేదు, లేదు. నా వద్ద ఇలాంటి కత్తి ఎప్పుడూ లేదు.”
“అదేంటి? చిత్రంగా వుందే.”
“ఏం లేదు ఏక్సెల్. ఐస్లాండ్ వాసులు ఇలాంటి కత్తులు వాడతారు. ఇది హన్స్ దే అయ్యుంటుంది.”
నేను లేదన్నట్టు తల అడ్డుగా ఊపాను.
“ఇది ఎవడో ఆదిమానవుడి ఆయుధం అయితే? ఇందాక మనం చూసిన పశువుల కాపరికి చెందిందే అయితే? ఇది మాత్రం నిశ్చయంగా రాతి యుగానికి చెందింది కాదు. ఇనుప యుగానికి కూడా కాదు. ఎందుకంటే ఇది స్టీలు కత్తి.”

నా మాటలని మావయ్య మధ్యలోనే ఆపేశాడు.
“ఆగు ఏక్సెల్. కాస్త ఆలోచించు. ఈ కత్తి పదహారవ శతాబ్దానికి చెందింది. దీన్ని పోనియార్డ్ అంటారు. ఇది స్పెయిన్ కి చెందింది. అది నీదీ కాదు, నాదీ కాదు, ఈ వేటగాడిదీ కాదు. దానికి పట్టిన తుప్పు ఎంత దట్టంగా వుందో చూశావా? అంత దట్టంగా తుప్పు పట్టడానికి రోజులు, నెలలు కాదు. శతాబ్దాలు పడుతుంది.”
ప్రొఫెసరు గారి మనసులో ఊహకి పగ్గాలు పటపట మని తెగిపోవడం వినిపిస్తోంది.
“ఏక్సెల్ మనం ఓ అద్భుతమైన ఆవిష్కరణ యొక్క ముఖ ద్వారాల వద్ద నిలిచి వున్నాం. ఒకటి నుండీ మూడు శతాబ్దాల కాలం ఆ కత్తి ఇక్కడే పడి వుంది.”
“కాని అది ఒంటరిగా రాలేదు. అది దానికదే ఇలా కొంకర్లు పోలేదు. మనకన్నా ముందే ఎవరో ఇక్కడికి వచ్చినట్టున్నారు.”
“అవును. ఎవరో మనిషే వచ్చాడు.”
“ఎవరా మనిషి?”
“ఆ మనిషి ఎవరో తన పేరుని ఆ కత్తి మీద చెక్కి వుంటాడు. భూమి కేంద్రానికి ప్రయాణించే బృహత్ యత్నం చేసి ఆ యాత్రకి చిహ్నంగా ఏదో గుర్తు వదిలి వుంటాడు. ఈ ప్రాంతం అంతా గాలిద్దాం పద ఏక్సెల్. ఏవైనా రహస్యాలు బయటపడతాయి.”
ఆ పరిసరాలన్నీ శ్రద్ధగా గాలించాం. మా ఎదుట ఓ పెద్ద కోట గోడలా విస్తరించి వున్న ఆ రాతి గుట్టని శ్రద్ధగా పరిశీలించాం.
అలా ముందుకు సాగిపోతుంటే ఒక చోట గుట్టకి సముద్రానికి మధ్య దారి మరింత ఇరుకు అయ్యింది. అక్కడ సముద్రపు కెరటాలు ఆ రాతి ప్రాకారపు పాదాలని తాకుతున్నాయి. అక్కడ బయటికి వికృతంగా పొడుచుకొస్తున్న రెండు శిలల మధ్య ఓ సొరంగ మార్గం కనిపించింది.
అక్కడ ఓ కరకు బండ మీద రెండు చిత్రమైన అక్షరాలు చిత్రించబడి కనిపించాయి. కాలప్రభావం చేత కాస్త అలుక్కుపోయినట్టు వున్నాయి. ఎవరో పాతకాలపు బాటసారి పేరులోని మొదటి అక్షరాలవి. అవి రూనిక్ లిపిలో రాసి వున్నాయి.
“ఏ. ఎస్.” అరిచాడు మావయ్య. “ఆర్నే సాక్నుస్సేం. ఆర్నే సాక్నుస్సేం…”
(ముప్పై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం)














postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts