అధ్యాయం 40
పాతాళం దాకా
సొరంగ మార్గ నిర్మాణం
ఈ విచిత్ర యాత్రలో
ఆరంభం నుండి ఎన్నో అద్భుతాలు చూస్తూ రావడంతో ఇక నాలో ఆశ్చర్యపడే శక్తి పూర్తిగా నశించిపోయింది.
కాని నేను నిలుచున్న చోట రాతి మీద మూడు వందల ఏళ్ల క్రితం చెక్కబడ్డ అక్షరాలు చూసి దిగ్ర్భాంతి
చెందాను. ఆ ప్రాచీన ప్రఖ్యాత పరుసవేది పేరు ఇలా శిలాక్షరాలలో చూడడమే కాదు, ఆ అక్షరాలని
చెక్కిన ఉలి కూడా అక్కడే వుంది. ఎంత నమ్మశక్యం కాకుండా కనిపించినా ఆ ప్రాచీన యాత్రికుడు
ఈ ప్రాంతాలన్నీ సంచరించి వుంటాడని అనుకోవడంలో ఇక సందేహం లేదు.
నేనిలా నా ఆలోచనల్లో
మునిగిపోయి వుంటే ఇక్కడ మావయ్య ఏదో పారవశ్యంలో ఊగిపోతూ ఆర్నె సాక్నుస్సేం ని పొగుడుతూ
స్తుతి అందుకున్నాడు.
“ఓ మహా మేధావీ!
మానవ మాత్రులు నీ తరువాత భూమి పొరలలోంచి చొచ్చుకుపోయేందుకు గాను ఎన్నో చక్కని చిహ్నాలు
విడిచి వెళ్లావు. నీవు విడిచిన ఆనవాళ్లు మూడు శతాబ్దాల తరువాత కూడా ఈ చీకటి దారుల వెంట
మాకు దారు చూపిస్తున్నాయి. నీవు చూసిన అద్భుతాలని నీలోనే ఉంచుకోకుండా మాతో పంచుకున్నావు.
నీ చిహ్నాలని, నీ అడుగుజాడలని అనుసరిస్తూ భూమి కేంద్రం దాకా చొచ్చుకుపోడానికి వీలయ్యింది.
మార్గాంతంలో ఇక్కడ నీ స్వహస్తాలతో చెక్కిన నీ పేరులోని ప్రథమాక్షరాలు మాకు దర్శనమిచ్చాయి.
నేను కూడా నా పేరుని ఈ పాషాణపు పుట మీద చెక్కుతాను. నువ్వు కనుక్కున్న ఈ అమోఘమైన భూశిరానికి
నీ పేరే పెడతాను. దీన్ని నేటి నుండి ‘కేప్ సాక్నుస్సేం’ అని పిలుస్తాను.”
మావయ్య పలికిన
ఆ స్తుతి వాక్యాలు విన్నాక నాకు కూడా చెప్పలేని ఉత్సాహం కలిగింది. ఆ క్షణం అలసట మర్చిపోయాను.
మా యాత్రలో పొంచి వున్న ప్రమాదాల సంగతి మరచిపోయాను. తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలనే చింత
మరచిపోయాను. మరొక మనిషి సాధించిన దాన్ని మనం కూడా సాధించగలం అనిపించింది.
“పద మావయ్యా.
ఇంకా ముందుకి వెళ్దాం,” మావయ్యని తొందర పెట్టాను.
మా ఎదుట అంతులేకుండా
విస్తరించి వున్న చీకటి సొరంగంలోకి దూడుకుగా దూసుకుపోబోతూ అన్నాను. స్వతహాగా దూకుడు
ఎక్కువైన మావయ్య ఈ సారి మాత్రం నెమ్మది, నెమ్మది అంటూ శాంతి వాక్యాలు పలికాడు.
“ముందు వెనక్కు
వెళ్లి హన్స్ ని చేరుకుందాం,” ఆదేశం ఇచ్చాడు
మావయ్య. “మన పడవని ఇక్కడి దాకా తెమ్మందాం.”
ఇష్టం లేకపోయినా
కాళ్లీడ్చుకుంటూ మావయ్య వెంట బయల్దేరాను.
“ఒకటి అడగనా
మావయ్యా? ఇంతవరకు మనకి పరిస్థితులు బాగా అనుకూలించాయి కదూ?” మావయ్యని అడిగాను.
“అవునంటావా ఏక్సెల్?”
“సందేహమే లేదు.
ఆ తుఫాను కూడా … అది నిండా నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి… పోయి పోయి మనని సరైన దారిలోనే
పడేసింది. తుఫానులో చిక్కుకోకపోతే ఇంకా చాలా
ముందుకి వెళ్ళిపోయుండేవాళ్లం. లీడెన్ బ్రాక్ సముద్రానికి దక్షిణ తీరానికి చేరి
వుంటే మన గతి ఏమై వుండేది? సాక్నుస్సేం పేరు కనిపించి వుండేది కాదు. ఇటు సముద్రం, అటు
రాళ్లు – మధ్యన బందీలుగా మిగిలిపోయేవాళ్లం.”
“నిజమే ఏక్సెల్.
దక్షిణానికి పోతున్నాం అనుకున్నాం గాని ఎలాగో మరి ఉత్తరానికి వచ్చి ఈ కేప్ సాక్నుస్సేం
ని చేరుకున్నాం. నిజమే. నాకిది ఓ అద్భుతంలా తోస్తోంది. దీన్ని ఎలా వివరించాలో అర్థం
కావడం లేదు.”
“కారణం ఏదైతేనేం
మావయ్యా? జరిగిందేదో జరిగింది. దాన్ని ఎలా
వాడుకోవాలో ఆలోచించాలి.”
“నిజమే కాని…”
“నా మనసులో ఒకే
ప్రశ్న దొలిచేస్తోంది. మనం ఇలా ఉత్తరంగా ముందుకి సాగిపోతే స్వీడెన్ వంటి ఉత్తర యూరప్
కి చెందిన దేశాల అడుగున ముందుకు సాగుతూ రష్యా, సైబీరియా మొదలైన ప్రాంతాల కిందుగా పోతామా,
లేక ఆఫ్రికా ఎడారుల అడుగున చొచ్చుకుపోతామా, లేక అట్లాంటిక్ సముద్రపు కెరటాల అడుగున
ముందుకి సాగిపోతామా… అదే తెలుసుకోవాలని వుంది.”
(ఇంకా వుంది)
0 comments