మన సచేతనమైన అనుభూతులకి ఏ రకమైన
అచేతనమైన వన్నెలని ఆపాదిస్తాం అనేది వ్యక్తి నుండి వ్యక్తి మారుతూ వుంటుంది. ఒక సామాన్య,
అమూర్త భావన మనకి తారసపడినప్పుడు దానికి మన వ్యక్తిగత మనస్సు ఒక నేపథ్యాన్ని, సందర్భాన్ని
అందిస్తుంది. కనుక మన ప్రత్యేక, వ్యకిగత ధోరణిలో దాన్ని మనం అర్థం చేసుకుంటాం, వినియోగించుకుంటాం.
“దేశం”, “డబ్బు,” “సమాజం”, “ఆరోగ్యం” మొదలైన సామాన్య పదాలని విన్నప్పుడు ఆ పదాలు నాకెలా
అర్థం అవుతాయో, అవతలి వారికి కూడా ఇంచుమించు అలాగే అర్థం అవుతాయని నేను అనుకుంటాను.
ఇక్కడ “ఇంచుమించు” అన్న పదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకే సాంస్కృతిక నేపథ్యం గల వారిని
ఇద్దరిని తీసుకుంటే వారికి కూడా ఒకే పదం రెండు రకాలుగా అర్థం కావచ్చు. ఇక బాగా వైవిధ్యంతో
కూడా సామాజిక, రాజకీయ, మత, మానసిక అనుభవరాశి గల వ్యక్తుల విషయంలో అయితే ఆ రకమైన అర్థభేదం
చాలా తీవ్రంగా ఉంటుంది.
('Time is a river without banks' by March Chagall. అచేతనలో ఉండే అంశాల గందరగోళ పరిస్థితిని తలపిస్తుంది ఈ చిత్రం.)
భావనకి, పదానికి మధ్య పెద్దగా
వ్యత్యాసం లేకపోతే ఇలా వ్యక్తికి వ్యక్తికి మధ్య అవగాహనలో పెద్దగా తేడా వుండదు. కాని
భావనని బోధపరచడానికి కచ్చితమైన నిర్వచనం, విపులమైన వివరణ అవసరమైన పక్షంలో అవగాహన భేదం
విపరీతంగా ఉంటుంది. ఆ భేదం మానసికమైన, బుద్ధిగతమైన అవగాహనలోనే కాదు, అంతకన్నా ముఖ్యంగా
పదానికి సంబంధించిన హార్దిక అనుభూతిలో తేడా వుంటుంది. ఆ తేడాలు ఎక్కువగా అచేతనంగా,
ఉపచేతనంగా వుంటాయి కనుక బయటికి వ్యక్తం కావు.
అవగాహనలో అలాంటి భేదాలకి పెద్దగా
ప్రాముఖ్యత లేదని, దైనిక అవసరాలకి వాటికి సంబంధం లేదని కొందరు అనుకోవచ్చు. కాని వాస్తవంలో
ఎంత కచ్చితమైన సచేతన అంశాల విషయంలో అయిన వాటి చుట్టూ అనిశ్చితమైన అచేతన ఛాయ అలముకుని
వుంటుంది. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు,
దానికి మనం స్పందిస్తున్నప్పుడు మనలో ఓ ఆంతరిక, ఆత్మగత సంఘటన జరుగుతోంది. కనుక ఆ సంఘటనలో
నిగూఢంగా, మర్మంగా ఉండే అంశం తప్పకుండా వుంటుంది. అంకెల లాంటి సర్వసామాన్యమైన భావనని
తీసుకున్నా కూడా అవి కేవలం లెక్కించడానికి పనికొచ్చే సాధనలే అనుకుంటే పొరబాటు. అంకెలలో
అధ్యాత్మికమైన అంతరార్థం వుంటుంది. పైథాగరస్
వంటి వారి ప్రకారం అంకెలు దివ్యమైనవి కూడా! కాని మనం దైనందిన జీవితంలో అంకెలని వాడేటప్పుడు
ఇవన్నీ మన అనుభవంలోకి రావు.
కనుక మన సచేతన మానసంలో ఉండే
ప్రతీ భావనకి, అచేతనమైన, ఆత్మగతమైన అనుబంధిత అంశాలేవో వుంటాయి. తీవ్రతలోను, ప్రగాఢతలోను
ఆ అనుబంధిత అంశాల్లో ఎంతో వైవిధ్యం వుంటుంది. ఆ భావన మన పూర్ణ వ్యక్తికి, జీవితానికి
ఎంతో ముఖ్యం అయినట్లయితే, మన అచేతనలో ఆ భావన యొక్క అనుభంధిత మరింత బలవత్తరంగా వుంటుంది.
ఆ భావానికి సంబంధించిన ఇతర భావాలు, భావజాలాలు మన అచేతనలో ముందే వున్న పక్షంలో కూడా
ఆ భావనకి సంబంధించిన అచేతన అంశం బలవత్తరం అవుతుంది. ఆ కారణం చేత ఆ భావన యొక్క “సామాన్య” అంశం పలచన అవుతుంది.
ఆ భావన మన అచేతన లోకి ఇంకా ఇంకా లోతుగా చొచ్చుకు పోతున్న కొద్ది దాని లక్షణం గణనీయంగా
మారిపోతుంది.
(ఇంకా వుంది)
0 comments