చెమట గ్రంథుల
మాట అలా వుంచి ఇక చమురు గ్రంథుల విశయానికి వద్దాం. ఈ చమురు గ్రంథుల ప్రయోజం ఏంటంటే
మరి ఠక్కున చెప్పడం కష్టమే. నాలో ఈ గ్రంథులు కొన్ని లక్షలు ఉంటాయి. నా రోమకూపాలకి
(hair follicles) కి అతుక్కుని వుంటాయి. అవి
నా కేశాలని, చుట్టూ ఉండే చర్మాన్ని కందెన చేస్తాయి. మీ సంగతంటే వేరు గాని మీ పూర్వీకులు
ఉన్నారే… అంటే బాగా పూర్వీకులు అన్నమాట… వాళ్లకి మరి ఒంటి నిండా బొచ్చు ఉండేది కనుక
ఆ బొచ్చుకి తడి అంటకుండా ఉండేదుకు గాను, ఆ బొచ్చులో వెచ్చదనాన్ని నిలువ ఉంచుకునేందుకు
గాను ఈ చమురు సంస్కారాలు అవసరమై వుండేవేమో.
అప్పుడు పనికొచ్చినవే ఇప్పుడు తలనొప్పిగా దాపురిస్తున్నాయి. రోమకూపాలు పూడుకుపోతాయి.
వాటిలో చెత్త చేరుతుంది. దాని మూలంగా మొటిమలు ముఖాన ప్రత్యక్షమవుతాయి.
ఇక ఈ కేశాల తయారీ
ఎలా జరుగుతుందో చెప్తాను. నా మీద చదరపు సెంటీమీటరుకి సుమారు పది రోమకూపాలు ఉంటాయి. ప్రతీ కూపానికి దాని వేళ్ల వద్ద ఓ దుంప
లాంటి నిర్మాణం వుంటుంది. అక్కడి నుండి ఉపరితలం వరకు ఓ నాళం లాంటి నిర్మాణం వుంటుంది.
రోమకూపం లోతుల్లో కణాలు వేగంగా పెరుగుతూ వుంటాయి. అలా పుట్టిన కొత్త కణాలు నాళం లోంచి
పైకి తోసుకొస్తూ ఓ దారం లా ఏర్పడతాయి. ఆ దారమే వెంట్రుక!
నాలో కొట్ల కొద్ది
మెలనోసైట్ లు అనే రకం కణాలు కూడా వుంటాయి. ఇవి మెలనిన్ (melanin) అనే రంగున్న పదార్థాన్ని
ఉత్పత్తి చేస్తాయి. జుట్టు రంగు గాని, చర్మం
రంగు గాని ఈ మెలనిన్ వల్లనే వస్తుంది. మెలనిన్ లేని వారిలో చర్మం తెల్లగా వుంటుంది.
దాన్నే బొల్లి అంటాం. మెలనిన్ శరీరానికి ఒక విధమైన రక్షణ నిస్తుంది. దీని వల్లనే ఎండలో
వుండే హానికరమైన అల్ట్రా వయిలెట్ కిరణాల నుండి శరీరానికి రక్షణ దొరుకుతుంది. మీరు గాని
ఎండలో మరీ ఎక్కువగా తిరిగినట్టయితే మీ ఎపీడెర్మిస్ యొక్క లోపలి పొరల నుండీ మెలనిన్
రేణువులు నెమ్మదిగా పైకి తన్నుకొస్తూ ఉపరితలాన్ని చేరుకుంటాయి. అందువల్ల చర్మం కాస్త
నల్లబడుతుంది.
నాలోని నాడీ
జాలాలు కూడా సామాన్యమైనవి కావు. ఉదాహరణకి మీ వేళ్ల కొసల్లో చదరపు సెంటీమీటరుకి కొన్ని
వేల నాడీ తీగల కొసలు ఉంటాయి. మీ చర్మానికి కలిగే సంవేదనలని ఈ నాడీ తీగలే మీ మెదడు దాకా
మోసుకుపోతాయి. మీ బొటన వేలు ఏ రాయికో తగిలి చర్మం చెక్కుకుపోయినా, మీరు ఏ కారణం చేతనైనా
పోయి పోయి చెయ్యి పొయ్యిలో పెట్టినా, గడ్డం
గీసుకునే సమయంలో రక్తతర్పణం జరిగినా – ఈ నాడీ తీగలు ‘కొంపలు అంటుకున్నాయొహో’ అంటూ ప్రమాద
వార్తని మెదడుకి చేరవేస్తాయి.
ఆలాగే మీకు చలేసినప్పుడు
చల్లదనాన్ని పసిగట్టే ప్రత్యేక నాడీ తీగలు ఆ సంగతిని మీ మెదడుకి తెలుపుతాయి. అప్పుడు
మీరా చలికి ‘ఉహుహూ’ అని వణుకుతారన్నమాట. అప్పుడు మీ రోమకూపాల్లో వుండే చిన్నారి కండరాలు
పన్లోకి దిగి మీ చర్మం మీద వుండే వెంట్రుకలని ఓడ సరంగు తెరచాప పైకెత్తినట్టు ఎత్తుతాయన్నమాట.
అప్పుడు మీ వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయన్నమాట! అయినా ఈ వెంట్రుకలు నిక్కబొడుచుకోడాలి
అవీ ఏదో వింటానికి బావుంటుందేమో గాని (అదీ సందేహమే!) దాని వల్ల అసలు ప్రయోజనం ఉన్నట్టు
కనపడలేదు అంటారేమో! నిజమే ఈ ప్రత్యేక కేశ సౌకర్యాలన్నీ మీ టామీకి గాని మీకు పనికిరావని
సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
Image: http://www.wilton.com/idea/Hair-Raising-Experience
(ఇంకా వుంది)
0 comments